డి. హెచ్. లారెన్స్ “ది వర్జిన్ అండ్ ద జిప్సీ”

“ది వర్జిన్ అండ్ ది జిప్సీ” డి. హెచ్ లారెన్స్ రాసిన ఇంగ్లీషు నవల. దీనిని అదే పేరుతో తెలుగులోకి అనువాదం చేసారు కె.వి.వి.ఎస్ మూర్తి గారు. తన జీవిత కాలంలో సాహిత్య ప్రపంచ ద్వేషాన్ని అనుభవించి చివరి దాకా ఒంటరిగా జీవించిన రచయిత లారెన్స్. ఆయన తన నవలలో ప్రదర్శించిన స్వేచ్చావాదాన్ని అసహ్యించుకున్ని పూర్తిగా లారెన్స్ ని ఒంటరి చేసి భాదించింది సాహిత్య సమాజం. అయిన తన ఆలోచనలను సాహిత్యం ద్వారా బైటపెట్టడానికి ఎప్పుడూ లారెన్స్ భయపడలేదు. ఇతరుల మెప్పు కోసం సాహిత్య సృజన చేయలేదు. లారెన్స్ మరణించిన తరువాతే అతని పుస్తకాలకు ఆదరణ లభించింది. సెక్స్, ప్రేమ, సమాజంలోని హిపోక్రెసి, మనిషి కోరికలు, మానసిక సంబంధాల గురించి ఎటువంటి సెన్సార్ లేకుండా రాసిన రచయిత లారెన్స్. తెలుగువారికి వీరి గురించి తెలియాలంటే వీరిని ఇంగ్లీషు గుడిపాటి వెంకటచలం అని చెప్పవచ్చు. మానవ సంబంధాలలోని డిప్లమసీని, మర్యాద ముసుగులోని మోసాన్ని, అహంకారాన్ని బైటపెట్టే రచనలు వీరివి. ప్రేమ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని, స్త్రీ పురుష సంబంధాలలో నైతికత పేరుతో జరుగుతున్న మోసాన్ని వీరు ప్రస్తావించిన తీరు చాలా మందికి రుచించదు. అందుకే వీరి రచనలు పోర్న్ అని మర్యాదస్తులు నిషేదించారు. కథలు, నవలలు, నవలికలు, వ్యాసాలు, కవితలు రాయడమే కాకుండా చిత్రకారుడిగా కూడా వీరు ప్రశంసలు అందుకున్నారు. జీవించినంత కాలం నిషేధింపబడి ఒంటరిగానే గడిపారు. విస్తృతంగా రాసారు. వీరి మరణం తరువాత వీరిని చదివేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

“ది వర్జిన్ అండ్ ద జిప్సి” ఒక నవలిక. అప్పుడే యుక్తవయసుకు వస్తున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథ ఇది. ఈ వయసులో సాధారణంగా మనుష్యులలో జీవితం, పట్ల మానవ సంబంధాల పట్ల ఒక కుతూహాలం ఉంటుంది. సమాజం ఇంకా పూర్తిగా వీరి ఆలోచనలను ప్రభావితం చేయదు. తమ మనసు చెప్పే విషయాల పట్ల ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు ఈ వయసు వ్యక్తులు. సమాజం వీరి ఆలోచనలను, కోరికలను పూర్తిగా అప్పటికి కండిషనింగ్ చేయలేదు. అటువంటి తాజా మనసులతో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రపంచాన్ని చూస్తూ ప్రేమను అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది. యవెట్, లూసిల్లి ఇద్దరు మత బోధకుడయిన తండ్రి వద్ద జీవిస్తూ ఉంటారు. స్కూలు చదువు ముగిసి తండ్రి వద్దకు వచ్చిన వీరికి ఆ ఇంట్లోని వాతావరణం చాలా కృతిమంగా, పేలవంగా అనిపిస్తుంది. వీరి తల్లి వీరి చిన్నతనంలోనే తనకు నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇంట్లో ఆ తల్లి ప్రస్తావన సాధారణంగా ఎవరూ తీసుకురారు. కాని పిల్లలు ఏ కాస్త దురుస్తుగా మాట్లాడినా, స్వేచ్చ కోసం ప్రయత్నించినా వ్యంగ్యంగా తల్లి పేరు చెప్పి వీరిని నాయనమ్మ, వివాహం కాని అత్త విమర్శిస్తూ, అవమానిస్తూ ఉంటారు. వారే ఇంటి యజమాని ముందు తాము అన్న మాటలకు మరో అర్ధాన్ని ఇస్తూ అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లో ఈ మర్యాదస్తులమని చెప్పుకునే ఆడవారి ఈ వింత ప్రవర్తన పిల్లలిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఆ ఊరిలోకి సంచారం చేస్తూ ఒక జిప్సీల సమూహం వస్తుంది. అ జిప్సీలలో ఒకతను యవెట్ ని ఆకర్షిస్తాడు. అతను వివాహితుడు. పిల్లలు కలవాడు. అతని భార్య చేయి చూసి భవిష్యత్తు చెబుతూ డబ్బు సంపాదిస్తుంది. ఆ జిప్సీలోని నిజాయితీ, కళ్ళలోని వెలుగు యవెట్ ని ఆకర్షిస్తాయి. తాను చూసే నాగరిక సమాజంలోని యువకులందరూ నటిస్తూ, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు జీవిస్తూ ఉన్నారని ఆమెకి అనిపిస్తుంది. యవెట్ ఇంకా సమాజపు కట్టుబాట్లతో కలుషితం కాలేదు కాబట్టి, తాను అనుభవిస్తున్న ఈ ఆకర్షణను దాచుకోవాలనుకోదు. అ ఊరిలో ఒక ధనవంతురాలు ఒక యువకునితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆమె భర్తనుండి విడాకులు పొందే ప్రయత్నంలో ఉంది. విడాకులు పొందకుండానే ఈ యువకుని ప్రేమలో పడి అతనితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ధనవంతురాలు కాబట్టి ఆమె సమాజ ఆమోదం కోసం వెంపర్లాడదు. ఆ జంటతో మరాద్యస్తులమని చెప్పుకునేవారెవ్వరూ కలవరు. కాని యవెట్ వారిద్దరిని చూసి ముచ్చటపడుతుంది. తాను ఏ జంటలో అప్పటి దాకా చూడని నిజాయితీ అయిన ప్రేమ, ఆకర్షణ వీరిద్దరి మధ్య కనిపించడంతో వారితో స్నేహం చేస్తుంది. వారిని కలవడానికి వారి ఇంటికి వెళుతుంది. కాని ఆమె తండ్రికి ఈ విషయం తెలిసి ఇది మర్యాదస్తులు చేయవలసిన పని కాదని యవెట్ ను మందలిస్తాడు. ఆ సందర్భంలో కూడా ఆమె తల్లి ప్రస్తావన రావడంతో అక్క చెళ్ళెల్లిద్దరూ అవమానానికి గురి అవుతుతారు. తన మనసులోని ఇష్టాలను, ఆకర్షణలను నిజాయితీగా బైటపెట్టడం వలన యవెట్ అందరి నిరాదరణకు గురి అవుతుంది. ఆమెను అర్దం చేసుకునే వ్యక్తులు ఎవరూ ఉండరు.

యవెట్ సోదరి లూసెల్ ఈ గందరగోళం నుండి తప్పించుకోవడానికి ఊరికి దూరంగా ఒక ఉద్యోగాన్ని వెతుక్కుని తనకంటూ ఒక రొటీన్ ను ఏర్పరుచుకుంటుంది. ఇంట్లోని వ్యక్తులు ఆమెకు చిరాకుని తెప్పిస్తుంటే వారిని ఒదిలించుకోవడానికి పనిని సాధనంగా మార్చుకుంటుండి.

యవెట్ కు ఒక స్నేహితుడు ఆమెను తాను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అతనిలోని ఆ అసహజ నాగరికత, గర్వం, మనుష్యుల పట్ల హేళన భావం, తాను ఉన్నతుడిననే అహం ఇవన్నీ యవెట్ కు చిరాకు కలగజేస్తాయి. కాని ఆ యువకుడు మాత్రం యవెట్ ను ప్రేమించి తాను ఆమెకు మహోపకారం చేస్తున్నానన్నట్లుగా మాట్లాడతాడు. అతని ప్రేమను యవెట్ తిరస్కరించినప్పుడు అతను ఆశ్చర్యానికి గురవుతాడు. ఆమెని వింతగా చూస్తాడు. తన లాంటి ఉత్తముడిని ఆమె ఉన్న పరిస్తితులలో తిరస్కరించడం మతి లేని చర్య అని భావిస్తాడు. అతని అహంకారాన్ని యవెట్ అసహ్యించుకుంటుంది. వీరందరినీ వదిలిపెట్టి ఆ జిప్సిలుండే స్థానానికి తాను అభిమానించే జిప్సీ కోసం ఆమె వెళుతుంది. అతను చేతితో చేసే వస్తువులు, అతనిలోని గాంభీర్యం, తనను చదవగలిగిన అతని కళ్ళూ, మనుష్యుల ఆలోచనలకు విలువ ఇచ్చే అతని ప్రవర్తన ఇవన్నీ ఆమెకు అతని పట్ల గౌరవాన్ని కలుగజేస్త్గాయి.

అక్కడే మొదటి సారి వివాహం కాకుండా సహజీవనం చేస్తున్న ధనవంతురాలిని యవెట్ కలుసుకుంటుంది. సమాజంలోని వివాహ వ్యవస్థ, మానవ సంబంధాలలోని లోటుని అర్ధం చేసుకుని ఎవరినీ లెక్క చేయక విడాకులు రాకముందే తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె కూడా యవెట్ ఆ జిప్సీ వ్యక్తిని ఇష్టపడడాన్ని పిచ్చిపనిగా కొట్టిపడేస్తుంది. ఆ జిప్సీ వ్యక్తి తన ప్రేమికుడితో పాటు దేశం కోసం సైన్యంలో పని చేసాడని, ఒకానొక సందర్భంలో తన ప్రాణాలకు తెగించి తన ప్రియుడిని యుద్దంలో కాపాడాడని తెలుసుకున్నా కూడా అతనిలోని గొప్పతనాన్ని ఆమె అంగీకరించదు. అతనిలాంటి అనాగరికుడి పట్ల ఆకర్షణను పెంచుకోవడం, యవెట్ తెలియనితనం అనే భావిస్తుంది. తన ప్రియుడిగా డబ్బు, అందం, నాగరికత ఉన్న వ్యక్తికి తానిచ్చే గౌరవం ఒక మనిషిగా ఇన్ని గొప్ప విలువలను ప్రదర్శించే జిప్సీకి ఆమె ఇవ్వలేదు. ఆమె ప్రేమ కూడా నాగరికత ముసుగు నుండి బైటకు రానిదని అప్పుడే యవెట్ గ్రహిస్తుంది.

ఏ స్థాయి వ్యక్తులు కూడా తన మనసులో రేగుతున్న తుఫానును అర్ధం చేసుకోలేకపోవడం యవెట్ ను భాధిస్తుంది. మర్యాదస్తులమని చెప్పుకునే తన ఇంటి స్త్రీలు, ప్రియునితో జీవితాన్ని గడుపుతూ సమాజం నుండి నిషేధించబపడిన ఆ ధనవంతురాలు, తన వయసువారైన స్నేహితులు, ప్రతి ఒక్కరూ కూడా తమకే అర్ధం కాని నియమాలకు కట్టుబడిపోవడం, ఆ నియమాలలోని వ్యాపారాత్మకతను, స్వార్ధాన్ని సమర్ధించుకుంటూ జీవించడం యవెట్ ను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ సమయంలో అనుకోకుండా తుఫాను తో గ్రామంలోకి సముద్రపు నీరు కొట్టూకువస్తుంది. ఆ సమయంలో యవెట్ ను జిస్పీ వ్యక్తి కాపాడుతాడు. ఆమెను తీసుకుని సురక్షితమైన ఆమె ఇంటి పై భాగానికి చేరుస్తాడు. చుట్టూ తుఫాను, కూలిపోతున్న ఇళ్ళు, ప్రాణాలు పోగొట్టుకుంటున్న వ్యక్తులు. వీరందరి నడుమ సురక్షితంగా యవెట్ ను ఉంచడానికి అతను చేసే సాహసం, ఆమెను ఆత్మీయంగా రక్షించుకునే విధానం ఆమెలో అంతటి విపత్కర పరిస్థితిలో కూడా ఒక భద్రతను అనుభవించేలా చేస్తుంది. అంతటి విపత్తులో కూడా అతని సమక్షంలో ఆమె అంతులేని స్నేహాన్ని తోడుని ఆస్వాదిస్తుంది. అతని చేతిలో నిర్భయంగా నిదురపోతుంది. పోలీసు వాళ్ళు అతి కష్టం మీద ఆమె ఉన్న పై భాగాన్ని చేరుకున్నప్పుడు ప్రపంచాన్ని మరిచి నిశ్చింతగా నిదురపోతున్న ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. క్రింది భాగంలో ఆమె నాన్నమ్మ మరణిస్తుంది. ఇళ్ళంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కాని నిశ్చింతగా ప్రపంచంలోని అన్ని తుఫానులకు దూరంగా ప్రశాంతంగా ఆ రాత్రిని గడిపి అమాయకమైన పసి పిల్లలాగా ఆమె సురక్షితంగా తండ్రిని చేరుకుంటుంది. ఆ జిప్సీ వ్యక్తి ఆమె నిదురలో ఉండగా వెళ్లిపోతాడు. అతను ఆమెను రక్షించాడని అందరికి తెలిసినా అతనికి పెద్ద విలువను ఎవరూ ఇవ్వరు. కొన్ని రోజులకు తాము ఆ ప్రాంతాల నుండి వెళ్ళిపోతున్నామని, ఆమెను త్వరలో కలుస్తానని, సంతోషంగా ఉండమని చెబుతూ అ జిప్సీ రాసిన ఉత్తరం ఆమెకు చేరుతుంది. ఆ ఉత్తరం ద్వారా అతని పేరు జో బోస్వెల్ అని ఆమెకు తెలుస్తుంది. అప్పటి దాకా అతను ఆమె కోరుకుంటున్న భద్రత పంచే వ్యక్తిగా మాత్రమే ఆమెకు తెలుసు అతనికి సమాజంలో ఒక పేరు ఉందన్న కనీస ఆలోచన ఆమెకు రాదు. ఆమెకు అతనిపై ఉన్న అభిమానం ఈ పేరు, ధనం, పరపతి వీటిని కనీసం గుర్తుకు రానీయదు.

సమాజం నిర్ణయించే బంధాలలో స్త్రీ పురుషుని నుండి అందుకునే ప్రేమ, అవసరాల చుట్టూనే కేంద్రీకరించబడి ఉంటుంది. ఈ అవసరాల కోణం నుండే స్త్రీ పురుష బంధాలు నిర్ణయించబడి ఉంటాయి. కాని సహజంగా మనుషులను తమ సహచరులను ఎన్నుకోమంటే, వారు చాలా సందర్భాలలో ఇతరుల నుండి కోరుకునే లక్షణాలలో, సమాజానికి అర్ధం కాని చాలా కోణాలుంటాయి. యవెట్ చుట్టూ అందమైన యువకులుంటారు. పెద్ద చదువులు చదివిన వారే వారంతా. కాని వారంతా అసహజంగా తమ సహజాతాలను కప్పిపుచ్చుకుంటూ బ్రతుకుతూ కనిపిస్తారు. ఇంకా సమాజపు విలువలు, కట్టుబాట్లు అలవాట్లు అర్ధం చేసుకునే స్థితిలో లేని యవెట్ చాలా సహజంగా తన మనసును

ఆకర్షించిన వ్యక్తి వైపే మొగ్గు చూపిస్తుంది. అతను వివాహితుడని కూడా ఆమెకు తెలుసు. కాని అతనిలోని సహజమైన ప్రేమించే గుణం ఆమెను ఆకర్షిస్తుంది. అతను ఓ దేశభక్తుడని, వీరుడని, న్యాయపరమైన జీవితాన్ని జీవించే వ్యక్తి అని, ప్రాణాలకు తెగించి మరొకరి ప్రాణాలు కాపాడే నైజం ఉన్న వ్యక్తి అని తెలిసినా అతను ఒక పేద జిప్సీ అన్న భావంతోనే అందరూ అతన్ని చూస్తారు. అతనికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వరు. ఎందుకూ, ఎవరికీ పనికి రాని ఈ నటించే నాగరికులకిచ్చే గౌరవం సమాజం ఈ జిప్సీకి ఇవ్వదు. సమాజం కళ్ళ నుండి కాకుండా తన మనసుని నమ్మి అతన్ని చూసి అభిమానిస్తుంది యవెట్. చివరకు అతని మంచితనం బైటపడుతుంది. యవెట్ ని అతనే కాపాడుతాడు.

అంతటి విపత్తులో కూడా అతని వద్ద ఎంతో సురక్షితంగా ఉంటుంది యవెట్. అతనిపై ఆమెకున్న నమ్మకం తప్పు కాదని ఈ సంఘటన నిరూపిస్తుంది. అతని బదులుగా మరెవ్వరయినా ఆమెతో ఆ రాత్రి ఆ ఇంట ఉంటే ఆమె అంతే సురక్షితంగా, ఏ భయం లేకుండా నిదురించగలిగేది కాదు. ఒక పురుషుని నుండి స్త్రీ కోరుకునే భద్రత ఇదే. దాన్ని సమాజం పెట్టిన నియమాలు, ఉద్దేశాలు, కొలమానల మధ్య స్త్రీ ఎప్పుడూ అందిపుచ్చుకోలేదు. యవెట్ తల్లి కూడా అందుకే ఎంతో ఉన్నతుడని అందరూ మెచ్చుకునే ఆ భర్తను వదిలి ఒక సామాన్యునితో వెళ్ళిపోతుంది. యవెట్ స్వేచ్చా ప్రియత్వం కూడా అందుకే సమాజానికి తలవగ్గి జీవించడానికి ఒప్పుకోదు. ఈ నవలలో యవెట్ జిప్సీ ల మధ్య శారీరిక ఆకర్షణకు రచయిత పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. వారిద్దరి మద్య ఆ రాత్రి శారీరికంగా ఏం జరిగింది అన్నది ఈ కథ చదువుతున్న వ్యక్తులకు కూడా అప్రస్తుతంగానె అనిపిస్తుంది. అంతటి తుఫాను రాత్రి ఒక మగవాని వద్ద నిశ్చింతగా ఏ భయం లేకుండా చివరకు తాను జీవించి ఉండగలనా లేదా, అన్న అనుమానం లేకుండా గడపగలిగిన యవెట్ లో ఇంకా సమాజం కలుషితం చేయని ఒక అమాయకమైన మనసు, అది నమ్మిన ఒక వ్యక్తి తోడు మాత్రమే ముఖ్యం అనిపిస్తాయి. ఇటువంటి క్షణాలు జీవితంలో చాలా మందికి దొరకకపోవచ్చు. కాని ప్రతి వ్యక్తి కోరిక కూడా ఇటువంటి సాహచర్యాన్ని కొన్ని క్షణాలన్నా అనుభవించాలనే. దీన్ని కట్టిపెట్టి అర్ధం లేని లెక్కలతో జీవితాన్ని నడిపించుకుంటూ అదే ప్రేమ అనుకుంటూ తమకే తెలియని అభద్రతా భావంతో తాము ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వ్యక్తులతో జీవిస్తూ కూడా ఒక అపనమ్మకంతో, తెలియని భయాలతో జీవించే నాగరికులను వెక్కిరిస్తూ యవెట్ ఆ జిప్సీలు కలిపి గడిపిన అ క్షణాలను రాసుకొస్తారు రచయిత.

ఈ నవలిక స్త్రీ పురుష సంబంధాల పట్ల ఎన్నో ఆలోచనలను రేకిత్తిస్తుంది. మనం ఆలోచించడానికి భయపడే సున్నితమైన నిజాలను ప్రస్తావిస్తుంది. అందుకే ఆధునిక సాహిత్యంలో ఇది ఎంతో చర్చించవల్సిన పుస్తకంగా అందరూ గుర్తించారు. దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనే చాలా గొప్పది. రచయిత ఈ నవలలో పాత్రల పేర్లను ఆంగ్లంలోనే ఉంచడం కనిపిస్తుంది. ఎక్కడా ఇది తెలుగీకరించాలనే ప్రయత్నం కనిపించదు. ఒక ఇంగ్లీషు నవలగానే దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు మూర్తి గారు. వీరి ఈ ప్రయత్నాన్ని అభినందించవలసిందే, ప్రపంచం ఒకప్పుడు నిషేధించిన ఈ వ్యక్తుల ఆలోచనలలోని ప్రశ్నలపై ఇప్పటికన్నా సరైన రీతిలో అధ్యయనం జరపవలసిన అవసరం ఉంది. అందుకే డి. హెచ్ లారెన్స్ లాంటి రచయితలను ప్రపంచం చదవాలి. సాహిత్యంలో ఇంత సూటిగా సమాజాన్ని ప్రశ్నించిన వ్యక్తులు చాలా తక్కువ. డి. హెచ్ లారెన్స్ ఖచ్చితంగా ఆ కోవలోకి వచ్చే వ్యక్తి. అందుకే వారి ఈ పుస్తకాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన అనువాదకులు కె.వి.వి.ఎస్. మూర్తి గారికి అభినందనలు.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

3 thoughts on “డి. హెచ్. లారెన్స్ “ది వర్జిన్ అండ్ ద జిప్సీ”

  1. స్త్రీ పురుష సంబంధాల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సమసమాజం స్థాపనకు ఈ చర్చ కూడా దోహదపడుతుంది.

  2. పుస్తక పరిచయం చాలా బాగుంది మేడం

Leave a Reply