పోటెత్తే నల్ల సంద్రం – టోనీ మారిసన్ (2)

(రెండో భాగం…)

సాంగ్ ఆఫ్ సాలమన్నవల (Song of Solomon)

ఈ నవలలో నల్లజాతి పురుషులు జాత్యహంకారానికి ఎదురొడ్డి చేసిన అస్తిత్వ పోరాటాలను పురుషుల కోణం నుంచి 1977 లో రాసింది. ఈ నవలకు నేషనల్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తమ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నవలగా రెడ్క్లిఫ్ పబ్లిషింగ్ కోర్స్ సంస్థ గుర్తించింది. 44వ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా “సాంగ్ ఆఫ్ సాలమన్” నవల తనకు హుందాగా ఎలా నడుచుకోవాలో నేర్పించింది అంటారు. 2012లో “ది ప్రెసిడెంట్స్ మెడల్ అఫ్ ఆనర్” అవార్డును ఇదే నవలకు ఒబామా స్వయంగా టోనీ కి ఇచ్చారు.

సులా”- నవల

ఈ నవలంతా ఇద్దరు నల్ల జాతి అక్క చెల్లెళ్లు అయిన నెల్, సులాల మధ్య బాల్యం నుంచీ నడి వయసు దాకా కొనసాగిన ప్రేమ అనురాగాలను, మాతృత్వం, ప్రేమ, స్నేహ సంబంధాల లోనించి విశ్లేషిస్తుంది. నవల నేపథ్యం అంతా బ్లాక్ టౌన్ లోని ఒహాయోలో జరుగుతుంది. స్త్రీల జీవితాలను శాసించే పురుషస్వామ్యాన్ని ఈ నవలలో ప్రధానంగా ప్రశ్నిస్తుంది రచయిత్రి. ఈ నవలలో స్త్రీలను నాయకురాళ్లు, దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మలు, అలాగే ఆస్తి, సంపదకు వారసురాళ్లు లాంటి చాల బలమైన పాత్రలలో చూస్తాము. స్త్రీలు కుటుంబంలో అయినా, బయటి సమాజంలో అయినా అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఐకమైత్యంగా ఉంటూ పురుషస్వామ్యాన్ని అది తమ స్త్రీల మీద చేసే ఆధిపత్యాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని లేకపోతే బయటి శక్తులు సాంస్కృతిక, జాతి వివక్షా రూపాల్లో తమను అణిచివేయడానికి ఎప్పుడూ సిద్ధం గా ఉంటాయని చెప్తుంది టోనీ. టోనీ మారిసన్ కు బాగా గుర్తింపు తెచ్చిన ఇతర నవలలు పారడైజ్, హోమ్, లవ్, టార్ బేబీ, గాడ్ హెల్ప్ ది చైల్డ్.

రెసిటాటిఫ్”- టోనీ మారిసన్ కి బాగా పేరు తెచ్చిన ప్రముఖ కథ

1983లో బిలవెడ్ నవలకు ముందు రాసిన మొదటి కథ ఇది. రెండవ కథగా ‘స్వీట్‌నెస్’ ను చెబుతారు కానీ, నిజానికి అది స్వతంత్రమైన కథ కాదు. టోనీ రాసిన ‘గాడ్ హెల్ప్ ది చైల్డ్’ నవల లోని మూడు విడి అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా టోనీ రాసిన ఏకైక తొలి కథగా ‘రెసిటాటిఫ్’ ను చెప్పవచ్చు.

ఈ పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది సంగీతానికి, వచన ప్రక్రియకు మధ్యగా సాగే కథన ప్రక్రియను రేసీటాటిఫ్ అంటారు. నలుపు తెలుపుల మధ్య తేడాని అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చారిత్రాత్మక విశేషాలతో ఈ కథలో వర్ణిస్తుంది రచయిత్రి. కథ మొత్తం ట్వైల, రొబర్టా అనే ఇద్దరు ఎనిమిదేళ్ల స్కూల్ విద్యార్థినుల మధ్య ఒక షెల్టర్ హోమ్ నేపథ్యంలో జరుగుతుంది. ఆ సంవత్సరం న్యూబెర్గ్ ప్రాంతంలో జాతి విద్వేషాలు జరుగుతాయి. నల్ల జాతి పిల్లలని, తెల్ల జాతి పిల్లలని కలిపి ఒకే స్కూల్ బస్సులో స్కూలుకు పంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెల రేగుతాయి. ఆ ఆందోళనలో ఇద్దరూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ద్వేషంతో పాల్గొంటారు. నల్ల జాతి మహిళ అయిన మాగీ ని ఇద్దరూ ఎవరికి వాళ్ళు ఎదుటివారు కాలితో తన్నారని, పడిపోయిన మాగీని పైకి లేపలేదని అనుకుని విడిపోతారు. చాలా ఏళ్ళ తరువాత కలుసుకొని, గుర్తుపట్టుకొని తమ భర్తల హోదాల గురించి మాట్లాడుకుంటారు. అలాగే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి, తాము మ్యాగీని తన్నలేదని చెప్పుకుంటారు. కానీ రొబర్టా మాత్రం తను తన్నాలని అనుకున్నానని, అది తన్నిన దానితో సమానం అని ఏడుస్తుంది. రొబర్టా ఏడుస్తూనే “ఓహ్హ్ షిట్ ట్వైలా, అప్పుడు మ్యాగీ కి ఏమైంది” అని అత్యంత బాధా, పశ్చాత్తాపాలతో ప్రశ్నిస్తుంది. అప్పుడు ఇద్దరూ కిందపడిపోయి లేవలేక పోయిన అంగ వికలురాలు అయిన మాగీకి చేయందించి లేపి సాయం చేసే స్థితిలో ఉండి కూడా చేయరని ఇద్దరికీ స్ఫురిస్తుంది. అయినా పదే, పదే ఇద్దరం అప్పుడు చాలా చిన్న పిల్లలం కదా ఏదో తెలీక అయిపోయింది అట్లా అని అనుకుంటారు. బాల్యంలో షెల్టర్ హోమ్ కి తమను చూడ్డానికి వచ్చే ఒకరి అమ్మల గురించి ఒకరు చెప్పుకుంటారు.

కథ లో ఎక్కడా టోనీ ఎవరు నల్లజాతి అమ్మాయో చెప్పదు. పాఠకులు టోనీ అందించిన వాళ్ళ హావభావాలూ, భాష, దుస్తులు, అభిరుచులు, భర్తల ఉద్యోగాలు, హోదాలు, రంగులు, జుట్టురకాలు లాంటి వాటిని పట్టుకొని తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా వ్యక్తుల జాతులకు సంబంధించి సమాజం, సంస్కృతి మనలో ఒక మూస పద్ధతిలో నాటిన ఆలోచనలు. కథలో ఒకసారి ట్వైల, మరోసారి రొబర్టా నల్లజాతి స్త్రీలుగా అనుకుంటాం అంతటి మాయజాలాన్ని రచయిత్రి ఉపయోగిస్తుంది. పాఠకులనే విమర్శిస్తుంది లేదా పాఠకులు అలా సమాజంలోని జాతుల పట్ల వివక్షతో లేదా అలవాటైన ధోరణితో ఆలోచించినందుకు, అనుకున్నందుకు పశ్చాత్తాపం చెందేలా చేస్తుంది. సరిగ్గా కథా ప్రయోజనం లేదా రచయిత్రి ఉదేశ్యం ఇక్కడ నెరవేరుతుంది. ఇప్పుడు ఈ కథ చదువుతున్నప్పటి ఈ వర్తమాన కాలంలో అక్కడక్కడ జార్జి ప్లాయిడ్ హత్య లాంటి జాత్యాహంకార సంఘటనలు జరుగుతున్నప్పటికీ శతాబ్దాల కిందట ఉన్న భయంకరమైన జాతి విద్వేషాలు ఇప్పుడు లేవు. అయినా కానీ కథ చదువుతున్నంత మేరా పాఠకుడు ఎవరు నల్ల జాతి అమ్మాయో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. పాఠకుడిలో ఉన్న దొంగని లేదా బహుముఖీన తత్వాన్ని పాఠకుడికే పట్టిస్తుంది రచయిత్రి. ఆ సంగతి అర్థమై పాఠకుడు ఉలిక్కి పడతాడు. విభ్రమకు లోనవుతాడు. అంతిమంగా ఆ మూసల్లో ఒదిగిపోయి సిగ్గు పడతాడు, తాను మారాల్సిన అవసరాన్ని గ్రహిస్తాడు.

కథలో అంగవైకల్యం ఉన్న మనుషుల పట్ల కూడా జాతి, మతాలకు, జెండర్ కు అతీతంగా ఉండే చిన్న చూపుని విమర్శిస్తుంది టోనీ. 30 ఏళ్ల తర్వాత అనుభవాల్లోంచి మంచి పరిణితి చెందిన వ్యక్తులుగా కలుసుకొని బాల్య చేష్టలని తలుచుకొని పశ్చాత్తాపం చెందుతారు స్నేహితురాళ్లు ఇద్దరూ. కథంతా చదివాక ఆత్మ విమర్శలో పడిపోయిన పాఠకులు చివరికి మాగీకి ఏమైందో అన్న దిగులులో మునిగిపోతారు. కథ రాసిన సామాజిక చారిత్రిక సందర్భాన్ని, సంఘటనలను, మార్పులను చరిత్ర పరిణామ దశలుగా, కథలో అంతర్భాగంగా చెబుతుంది రచయిత్రి. ఈ ఒక్క కథలో నే 30 సంవత్సరాల నల్ల జాతి ప్రజల పోరాటాల చరిత్రని ఆవిష్కరిస్తుంది. 1954 లో స్కూళ్లలో ఉండే వివక్షను రద్దు చేస్తూ అమెరికాలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుంది. నల్ల జాతీయులు, తెల్ల జాతీయుల ఉద్యమాలు, మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ఉద్యమము, నల్ల తెల్ల జాతి స్కూల్ పిల్లలకు ఒకే బస్ నడపాలన్న తీర్పుని వ్యతిరేకిస్తూ తెల్లజాతీయులు చేసిన నిరసనలు, నల్ల జాతీయుల మీద జరిగిన దాడులు ఇవన్నీ కూడా ఒక్క కథలో వస్తాయి. తన సమకాలీన చారిత్రిక సందర్భాలని రచయిత్రి ఏంతో శ్రద్ధగా సాహిత్యంలో రికార్డు చేసే ప్రయత్నం చేసింది. అంతే కాదు సాహిత్యంలో మూస ధోరణిలో వాడే భాషని విసర్జించాలని చెబుతుంది. టోనీ అందుకే ఈ కథలో తను క్లాస్ కోడ్స్ వాడానని, జాతిని తెలిపే రేసియల్ కోడ్స్ వాడలేదని అంటుంది. బీద వర్గం, ధనిక వర్గ ప్రజలు మాత్రమే ఉంటారని, ఈ ఆర్ధిక పునాదిమీద మాత్రమే మనుషుల మొత్తం జీవితం, ఆశలు, అణిచివేతలు ఉంటాయని జాతి తర్వాతే వస్తుందని అంటుంది. అంటే కొత్త ప్రత్యామ్నాయ భాషని వాడడం వలన ఈ తెల్ల జాతి ప్రజలు తమ నల్ల జాతి ప్రజల పైన, రచయితల పైన రుధ్దిన భాషని తిరస్కరించవచ్చు అని టోనీ అభిప్రాయపడుతుంది. రెసిటాటిఫ్ కథ ఒక రాజకీయ కథ గా మారి పాఠకులలో అనేక ప్రశ్నలే కాదు ఆలోచనలు, మరీ ముఖ్యంగా, సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉన్నదనుకుంటే దాన్ని నెరవేర్చే దిశగా ఈ కథ పాఠకుడిలో ఒక పాజిటివ్ మార్పుని తీసుకొని వస్తుంది. వర్గ/వర్ణ వివక్ష ఉన్న సమాజాల్లోని క్రూరత్వాన్ని నగ్నంగా చూపించి ఆ అసమానత్వానికి కారణమైన మనుషుల నీచమైన ఆలోచనలకు సిగ్గు పడేలా చేస్తుంది.

తరువాత చెప్తాను”- కథ

 ఈ కథలో ఒక విందు జరుగుతూ ఉంటుంది ఆ విందులో నల్లజాతి, తెల్లజాతి వాళ్ళు ఇద్దరూ ఉంటారు. అందులో ఒక నల్ల జాతి స్త్రీ ఆందోళనగా, భయంగా, చెమటలు పడుతూ ఉండడాన్ని చూసి అక్కడే ఉన్న మరో స్త్రీ పలు మార్లు ఏమైంది అని అడిగినప్పుడల్లా ఖంగారుగా అటూ, ఇటూ చూస్తూ “తరువాత చెబుతాను” అని అంటూనే ఉంటుంది కానీ చెప్పదు. ఆ తరువాత కొంత సేపటికి కుప్ప కూలిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరో తెల్ల జాతి మనిషి ఆ నల్ల జాతి స్త్రీ తిరస్కరించింది అని సైలెన్సర్ గన్ తో కాల్చి వెళ్ళిపోతాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది కానీ ఎందుకో తిరస్కరిస్తుంది. అతను పట్టుబడితే శిక్ష పడుతుంది అని అక్కడినుంచి అతను వెళ్లిపోయాకే ఏమైందో చెబుతుంది. తను ప్రేమించిన మనిషే కాల్చినా గానీ అతనికి శిక్ష పడకూడదు, అతని జీవితం నాశనం కాకూడదు అని ఆమె నోరు విప్పదు. ఇలా ఉండడం స్త్రీకి ఒక్కదానికే సాధ్యం. తాను ప్రేమించిన దాన్ని కాపాడుకోవాలని స్త్రీలు మాత్రమే మరణించే సమయంలో కూడా కోరుకుంటారు, ప్రయత్నిస్తారు అని టోనీ ఈ కథలో ఆ నల్లజాతి స్త్రీ మనస్తత్వాన్ని విశ్లేషిస్తుంది.

స్వీట్‌నెస్ – ‘గాడ్ హెల్ప్ ది చైల్డ్ నవలలో ఒక స్వతంత్ర భాగం

జాతి వివక్ష మరో అమానవీయ లక్షణం పరాయీకరణ. అది ఎలా తమ స్వంత సంతానం, బంధువుల నుంచి వేరు చేస్తుందో అత్యంత దిగ్భ్రమ కలిగే రీతిలో ఈ స్వీట్‌నెస్ అనే కథనంలో చూస్తాము. కాటుక నలుపుతో పుట్టిన కూతురు లూలా ఆన్ ని చూసి భర్త లూయీ ‘ఏమిటిది’? అని ప్రశ్నించాక వాళ్లిద్దరూ విడిపోతారు. తను తెల్లగా ఉన్నా కూతురు అంత తారు రంగుతో ఎలా పుట్టిందో అర్థం కాదు ఆ తల్లికి. అంత నలుపు రంగుతో పుట్టిన బిడ్డ రేపు తెల్లజాతి సమాజంలో ఎంతటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతుంది. మొదలైతే అంతటి నలుపు రంగు తో పుట్టిన పాపని అసహ్యించుకుంటుంది కూడా. మొఖం మీద బట్ట కప్పి చంపెయ్యాలి అనుకుంటుంది కానీ చెయ్యలేక పోతుంది. అనాథాశ్రమంలో వేద్దామని చర్చి ముందు వదిలేద్దామా అనుకుంటుంది మనస్కరించదు. ఇక పెంచడం మొదలు పెడుతుంది. తన పాలు పట్టదు, సీసా పాలు పడుతుంది. బిడ్డ లూలా ఆన్ కు తనని అమ్మా అని పిలవద్దు అని చెప్తుంది. ఈ నల్లటి పిల్ల తన బిడ్డ అని తెలిస్తే ఎవరూ పని ఇవ్వరు, ఇళ్ళు అద్దెకి ఇవ్వరు, గ్రోసరీస్ షాపులో కి రానివ్వరు, బస్సుల్లో ఎక్కనివ్వరు అందుకని అమ్మా అని కాకుండా స్వీటీ అని పిలవమంటుంది. బిడ్డతో చాలా కఠినంగా ఉంటుంది. బిడ్డ అలా పెరిగిపోతుంది, బయట జాతి వివక్ష ఇంట్లో కన్న తల్లి అర్థం కాని కాఠిన్యం, ప్రేమరాహిత్యాల మధ్య. తన నలుపు రంగుని అసహ్యించుకునే తల్లి, అదే నలుపు రంగు వల్ల తల్లిని అనుమానించి వదిలేసిన తండ్రి, దూరమైన బంధువులు, ఒక్క తన నలుపు రంగే తనతో, తన తల్లితో చేసిన దుర్మార్గాన్ని మెల్ల మెల్లగా, చేదు చేదుగా అర్థం చేసుకుంటూ, తానూ మొండిగా మారిపోతూ అలా పెరిగిపోతుంది చిన్నారి లూలా ఆన్. చదువుకొని ఉద్యోగం కూడా చేస్తుంది. తల్లికి దూరంగా వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల తరువాత తల్లి ఒక హాస్పిటల్లో చికిత్సకు చేరుతుంది. మంచి వైద్యం, భోజనం, సోలిటెర్ పేకాటకి మకిలి పట్టని కొత్త కార్డులు ఇవన్నీ ఆమెకు దూరాన ఉండి ఉద్యోగం చేస్తున్న బిడ్డ లూలా ఆన్ పంపిస్తుంటుంది. ఆమెకి తల్లి మీద కోపంగానో, బాధగానో ఉన్నా హృదయం నొప్పితో ముడుచుకుపోయి మంచులో గడ్డకట్టినా లోలోపలే దాచుకుంటుంది తప్ప ఏమీ అనదు. అందరి పిల్లల్లా కన్నతల్లిని అమ్మా అని నోరారా పిలవాలని ఉన్నా ఆ కోరికని దిగమింగి తియ్యగా ఉండే “స్వీటీ” అనే పెరుతోటే పిలుచుకుంటుంది. అమ్మా అని పిలిస్తే చెంపలు రెండూ వాచిపోతాయి మరి. అమ్మకి ఏం కష్టం వచ్చిందో, వస్తుందో పాపం.

లూలా ఆన్ కి పెళ్లి కూడా అవుతుంది, ఒక బిడ్డ కూడా. ఇప్పుడు లూలా ఆన్ ఆ తల్లికి కళ్ళు తిప్పుకోలేనంత అందంగా, తన నల్ల రంగుని తెల్లటిబట్టల్లో కప్పేసి చాలా చక్కగా కనిపిస్తుంది. తల్లి కథలో చాలాసార్లు రంగు మూలాన వచ్చే జాతి వివక్ష వల్ల తాను బిడ్డతో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని లేకపోతే తాను అలా ఉండేది కాదని ఒక రక మైన పశ్చాత్తాపంతో చెప్పుకుంటూ ఉంటుంది. తన క్రమశిక్షణతో పెంచడం వల్లే ఆమెకి మంచి భవిష్యత్తు వచ్చిందని చెప్పుకుంటుంది. కథంతా తల్లి వైపునుంచే నడుస్తుంది “నీకో విషయం చెప్పనా స్వీటీ., నేను తల్లి కాబోతున్నాను పట్టరానంత ఆనందంగా ఉంది నాకు స్వీటీ” అని తన బిడ్డ రాసిన ఉత్తరం చదివి “ఆనందం అంతా బిడ్డ కోసమా, తండ్రి కోసమా? అసలు అతను కూడా నల్లగానే ఉండి ఉంటాడా, అసలు ఇంకా ఆమెతోనే ఉన్నాడా? అయినా ఇప్పుడు ఎవరూ రంగు గురుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు. నల్లవాళ్ళు కూడా సినిమాల్లో, పేపర్లలో, టీవీల్లో, వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తున్నారు” అనుకుంటుంది. చిరునామా రాయని బిడ్డ ఉత్తరం ఆమెని బాధిస్తుంది. తన బిడ్డకి ఇంకా తనమీద కోపం పోలేదు అని నిర్ధారించుకుంటుంది.

కథ ముగింపు ఇలా ఉంటుంది “ఇప్పుడామె గర్భవతి కూడా, లూలా ఆన్! మంచి పని జరిగింది మాతృత్వం అంటే, కూనిరాగాలు తీయడం, షికార్లు తిరగడం, డైపర్లు మార్చడం, మాత్రమే అనుకుంటే, నువ్వు త్వరలోనే పెద్డ ఆశ్చర్యానికి లోనవబోతున్నావు. అంతా, ఇంతా కాదు ఊహించ లేనంత. నువ్వూ, నీ అనామకపు స్నేహితుడో, భర్తనో, ముఖ పరిచయస్తుడో, ఎవరైతేనేం బహుపరాక్ బిడ్డా! చివరగా ఒక మాట! నువ్వు తల్లివైన తరువాత, ఇప్పటివరకూ ప్రపంచం గురించి, అది ఎలా ఉంటుంది, ఎలా పని చేస్తుంది ఎలా మారుతుంది అనే విషయాలల్లో, నీకున్న అభిప్రాయాలన్నీ మారిపోతాయి. మాతృత్వం నీకు అన్నీ వాస్తవాలు అర్థం చేయిస్తుంది. దేముడు నీకు తోడుగా ఉండి నీకు అంతా మంచే జరిపిస్తాడు.” తల్లి అయినాక తన బిడ్డ తారు నలుపు వల్ల ఈ ప్రపంచం తనకు ఎంత దుర్మార్గంగా మారిపోయిందో, తన బిడ్డ తనకు ఎలా పరాయిది అయిపోయిందో, తన బిడ్డకు అమ్మతనాన్ని కనీసం నోరారా అమ్మా అని పిలిచే స్వేచ్ఛని కోల్పోయేలా చేసి, తన బిడ్డ తనని ఎలా అసహ్యించుకునేలా చేసిందో చెప్పకనే చెబుతుంది ఆ తల్లి సముద్రమంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని. ‘గాడ్ హెల్ప్ ది చైల్డ్’ నవలలో ఒక భాగం కథగా న్యూయార్క్ టైమర్ వేస్కుంది. కథ చదువుతున్నంత మేరా వర్ణ వివక్ష ఎలా ఆ తల్లి బిడ్డల మధ్య అగాధాన్ని సృష్టిస్తుందో ఆ నొప్పి స్పష్టముగా అనుభూతిలోకి వస్తుంది. ఇంతకీ తను తల్లి కాబోతున్న లూలా ఆన్, పుట్టబోయే బిడ్డ రంగు ఎలా ఉన్నా మనస్ఫూర్తిగా అయితే ప్రేమించ గలుగుతుంది. తల్లిలా మాత్రం చేయదు, తన బిడ్డతో కనీసం తనైనా అమ్మా అని పిలిపించుకుంటుంది.

టోనీ మారిసన్ సాహిత్యం పై సెన్సార్ షిప్

“ది బ్ల్యూఎస్ట్ ఐస్” (1970) నవలని అమెరికాలోని, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ బ్యాన్ చేసింది. ఈ పుస్తకాన్ని స్కూల్ సిలబస్ లో చేర్చినప్పుడు పిల్లల తల్లిదండ్రులు నిరసన వ్యక్తపరిచారు. దాన్లో పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఉందని ఇది స్కూల్ సిలబస్ లో ఎలా చేరుస్తారని తీవ్ర అభ్యంతరం లేవదీశారు. రక్త సంబంధీకుల మధ్య సెక్స్ సంబంధాలు అనే మనోలైంగిక సమస్య (ఇన్సెస్ట్), రేప్, పీడోఫీలియా (చిన్న పిల్లలతో సెక్స్ చేసే మనో లైంగిక సమస్య) లాంటి తీవ్రమైన అసహజమైన లైంగిక వికృతత్వాల గురించి నవలలో చర్చించినప్పటికీ ఆ నవల గొప్ప నవలగా గుర్తించబడి, ఎన్నో పురస్కారాలు పొందింది. అలాగే బిలవెడ్ (1987), సాంగ్ అఫ్ సాలమాన్ (1977), నవలలు కూడా స్కూల్ సిలబస్ లో, లైబ్రరీలలో ఉంచకూడదని అభ్యంతరాలు వచ్చాయి. ఈ బ్యాన్ అయిన సాహిత్యాన్ని మళ్ళీ లైబ్రరీల్లోకి తీసుకు రావడానికి చాల కృషి చేసింది “ది వాషింగ్టన్ పోస్ట్.” ప్రజల ఆలోచనా ధోరణిని, జీవితాల్ని ప్రగతిశీలకంగా మారుస్తున్న లేదా అంతటి ప్రభావం ఉన్న టోనీ రచనల్ని ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండాల్సిందే అని తన పత్రికలో రాసింది. ఒక దశలో సోషల్ మీడియాలో కూడా టోనీ సాహిత్యాన్ని బ్యాన్ చేస్తున్నారని తెలిసి తీవ్రమైన నిరసన వ్యక్తం అయ్యింది. “ఈ స్వచ్ఛతావాదులు నా రచనలపై చేసిన నిషేధం పెద్ద వాళ్ళని ప్రసన్నం చేస్కోడానికే తప్ప, చిన్నపిల్లలను చైతన్య పరుచుకోవడానికి, లేదా వారిని పెద్దవాళ్ళు చేసే దుర్మార్గాలను గురించి హెచ్చరించడానికి మాత్రం కాదు” అని టోనీ వ్యాఖ్యానిస్తుంది. టోనీ మారిసన్ పది సంవత్సరాల క్రింద “పెన్ అమెరికా” సంస్థతో కలిసి “బర్న్ దిస్ బుక్” అనే పుస్తకం మీద పని చేసింది. ప్రపంచాన్ని ప్రగతిశీలకంగా మార్చి వేసే లేదా నూతన సమాజాన్ని, మనుషుల్ని తయారు చేసే ప్రగతిశీల సాహిత్యాన్ని నిషేధించే అంశానికి సంబంధించిన వ్యాసాల పుస్తకం అది. ఈ పుస్తకంలో టోనీ మారిసన్ తన సాహిత్యం మీద తను ఎదుర్కొంటున్న సెన్సార్షిప్ ను గురించిన లోతైన ఆలోచనలను ఇలా పంచుకున్నది.

“రాయబడని నవలలు, గుస గుస గా మాత్రమే చదవబడే కవితలు, తప్పుడు మనుషులు వింటారేమో అనే భయంతో చదవలేక గొంతులోనే మింగబడే కవితా పాదాలు, చట్టవిరుద్ధమైపోయిన భాషలో రాయబడినవి పాతాళానికి నొక్కివేయబడినవి, మేధావులచే ప్రశ్నించబడినా కానీ వెలుగు చూడని సాహిత్యం, వేదికనెక్కని నాటక పాత్రలు, రద్దు చేసేసిన సినిమాలు, అణిచివేయబడే నిరసన గొంతులు ఎక్కడ చూసినా ఇవే, ఈ నిషేధాలే! వీటిని చూస్తుంటే ఒకలాంటి భయంతో కూడిన ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి. అసలు ఆ ఆలోచనలే ఒక పీడ కల అనిపిస్తుంది. మొత్తం ప్రపంచమంతా ఒక కనిపించని అదృశ్య సిరా తో రాయబడుతున్నదా అనిపిస్తుంది. చరిత్ర పొడుగుతా మా నల్ల జాతి ప్రజలకు కౄరాతి క్రూరమైన, లోతైన గాయాలు అయ్యాయి. ఆ గాయాలు, అవమానాలు ఎంత అమానుషమైనవీ అంటే, అవి డబ్బు కంటే, న్యాయం కంటే, హక్కుల కంటే, ఇతరులకుండే కొద్దిపాటి మంచి పేరు కంటే, ప్రతీకారం కంటే కూడా పూర్తిగా భిన్నమైనవి. ఆ గాఢతను, నొప్పిని, గాయాలను కేవలం రచయితలు మాత్రమే అర్థం చేసుకుని అనువదించగలరు, ప్రజల గుండెల్లోని విషాదాన్ని అర్థవంతంగా రాయగలరు ఊహాత్మక నైతికతని మరింత స్పష్టతతో పదునెక్కించ గలరు. అందుకే ఆ భయాలతోనే మా సాహిత్యం నిషేధానికి లోనవుతున్నది అయినా సరే రాస్తూనే ఉంటాము భావవ్యక్తీకరణ వ్యక్తీకరణ స్వేచ్ఛని ప్రకటిస్తూనే ఉంటాము”

ఆమె తనను తాను ‘బ్లాక్ రైటర్’ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంది, అలా చెప్పుకోవడం తన బాధ్యత అనుకుంటుంది. మిగతా వైట్ రైటర్స్, జర్నలిస్ట్స్ “మీరు మీ మీద అలా ముద్ర వేసుకోవడం ఎందుకని, మీరెప్పుడు మీ సాహిత్యంలో తెల్లజాతి ప్రజల గురించి రాస్తారు? అసలు రాస్తారా, లేదా?” అని విమర్శిస్తూ అడిగిన ప్రశ్నకు, “మీది ఎంత వివక్షతో కూడిన ప్రశ్ననో మీరు వూహించ గలరా? మీరు ఎప్పుడైనా ఏ తెల్ల జాతి రచయితనైనా మీరెప్పుడూ ఆఫ్రో-అమెరికన్ ప్రజల గురించి రాయరెందుకు అనో, లేదా ఎప్పుడు రాస్తారు అనో నన్ను ప్రశ్నించినంత స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రశ్నించగలరా? యెస్ నేను బ్లాక్ రైటర్ నే, నేను బ్లాక్ పీపుల్ గురించి మాత్రమే రాస్తాను అని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను. ఒక విషయం చెప్పండి, రష్యన్ రచయిత అయిన టాల్స్టాయ్ నాలాంటి నల్లజాతి స్త్రీ గురించి ఎలా రాయడో నేనూ అంతే, ఒహాయో లోని లోరైన్ పట్నంలో, నల్లరంగు వలన తీవ్రమైన వివక్షకు గురి అయ్యి, తెల్ల జాతి ప్రజల నీలి రంగు కళ్ళు ఉంటేనే సౌందర్యవతిగా గుర్తించ బడతానని ఆ నీలి రంగు కళ్ళ కోసం నిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తూ, తన వెంట పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించకుండా మానసిక రుగ్మత ఉన్న కన్న తండ్రి చేత, పక్కింటి తెల్లజాతి యువకుడి చేత లైంగిక అత్యాచారాలకు బలి అయిపోయి గర్భవతి అయిన అమాయకమైన పదునాలుగేళ్ల నల్ల జాతి అమ్మాయి గురించి టాల్స్టాయ్ రాయడు కదా? నా జాతి ప్రజల కష్టాల గురించి మాత్రమే నేను రాస్తాను. నేను కూడా నల్ల జాతి స్త్రీనే, ఎంతో వివక్షని అనుభవించిన దాన్నే. ఇలా నన్ను నేను నల్ల జాతి ప్రజల గురించి మాత్రమే రాస్తానని, తెల్ల జాతి ప్రజల గురించి రాయలేనని, నా పరిధి ఇది మాత్రమే అనీ చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను, దానికి నేను క్షమాపణ కూడా చెప్పను. అయితే నేను తెల్ల జాతి ప్రజల గురించి రాయలేదంటే కూడా ఒప్పుకోను. ఎందుకంటే, నా నవలల్లో తెల్ల జాతి పాత్రలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే, నా మెడ మీద కూర్చొని, ఆ పాత్రల్ని విశ్లేషించడానికి, వాస్తవాలని అంగీకరించడానికి ఒక్క తెల్ల జాతి విమర్శకుడు కూడా ముందుకు రాడు గాక రాడు” అని నిఖచ్చిగా అంటుంది. ‘’మీరు తెల్ల జాతి వారితో విడిగా, ఇంత విద్వేషం తో ఎలా ఉండగలరు? తెల్లవారితోనే మీ నల్లవారి జీవితాలు తరతరాలుగా ముడిపడి ఉన్నాయి. ప్రతీ నల్లజాతి మనిషిలో, ఒక తెల్ల జాతి మనిషి ఖచ్చితంగా ఉంది తీరతాడు. దాన్ని మీరు ఒప్పుకోవాలి” అని ఒక తెల్ల జాతి విమర్శకుడు అన్న మాటకి టోనీ అంతే ఖచ్చితంగా “నో! నాలో మాత్రం ఒక్క తెల్ల జాతి మనిషి లేదు, ఉండదు, అసలు ఏ నల్లజాతి మనిషి అయినా తన అంతరాంతరాల్లో వేరే జాతి మనిషిని ఎందుకు ప్రతిష్టించుకోవాలి? మీరు చెప్పండి అసలు ఎందుకుండాలి? నేను నల్లజాతి ఆఫ్రికన్ స్త్రీని, నాలో నల్లజాతి మనిషే ఉంటాడు. పైగా నేను వలసొచ్చిన బీద యూరోపియన్స్, మెక్సికన్స్, ఇటాలియన్స్, ఆఫ్రో-అమెరికెన్స్ నివసించే స్లమ్స్ లో పెరిగినదాన్ని. ధనవంతులైన తెల్ల వాళ్ళు నివసించే ఖరీదైన కాలనీల్లో పెరగలేదు నేను. నా లోపల తెల్లజాతి మనిషి ఉండే అవకాశమే లేదు” అని కొట్టి పడేస్తుంది.

తన జాతిని, కళల్ని, సంస్కృతిని, పాటల్ని ప్రేమిస్తూ తన జాతి మనుషుల సాన్నిహిత్యంలో ఆనందాన్ని పొందడం అంటే టోనీకి చాలా ప్రియమైన విషయం. తరువాత ఒకసారి ఒక జర్నలిస్ట్, ఒక నల్లజాతి యువకుడు ట్రెవాన్ మార్టిన్ కాల్చి చంపబడ్డాక, టోనీ మారిసన్ ని చేసిన ఇంటర్వ్యూలో ఈ జాత్యాహంకార హత్య గురించి ప్రశ్నించినప్పుడు బాధతో టోనీ మారిసన్ ఇలా అంటుంది “అసలు నాకు జీవితంలో రెండు విషయాలు చూడాలని ఉంది. ఒకటి- ఒక తెల్లజాతి పసిపిల్లవాడు వెనక నుంచి ఒక తెల్ల పోలీస్ చేత కాల్చి చంపబడాలి. ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకంటే నల్లజాతి పిల్లలే కాల్చి చంప బడతారు. ఇక రెండవది – ఇప్పటిదాకా జరిగిన చరిత్రలో ప్రపంచం మొత్తం మీద నల్ల జాతి స్త్రీలని రేప్ చేసిన తెల్లజాతి పురుషులకు శిక్ష పడడం కూడా నా కళ్లారా చూడాలి కనీసం ఒక్కరికి! కానీ ఈ రెండు కోరికలు తీరవు. ఇది వాస్తవం, అందరికీ తెలుసు.” అంటుంది. టోనీ కి ఎనభై ఏళ్ళు వచ్చిన సందర్భంలో ఆమె స్నేహితుడు, తోటి రచయితా, విమర్శకుడు అయిన హిల్టన్ ఆల్స్ ఇంటర్వ్యూ చేస్తాడు “నేనిప్పుడు ఎనభైల్లో ఉన్నాను. నాకు మూడే మూడు విషయాలు చాలా స్పష్టమైనవి ఈ ప్రపంచానికి చెప్పాల్సినవి ఉన్నాయి: ఒకటి- “no”, రెండు- “shut up”, మూడు- “get out” అంటూ నివ్వెరపోయి చూస్తున్న ఆ జర్నలిస్టుని చూసి చల్లగా అర్థం అయ్యిందా అన్నట్లు నవ్వుతుంది. దీని అర్థం ఏమిటంటే, టోనీ మారిసన్ తను ఇష్టపడని దాన్ని ఖచ్చితంగా తిరస్కరించే అధికారాన్ని, లేదా ఇష్ట మైనదాన్ని మాత్రమే చేసే, మాట్లాడే హక్కుని సాధించింది అని!

డ్రీమింగ్ ఎమ్మెట్”-నాటకం

ఇది టోనీ మారిసన్ రాసిన మొదటి నాటకం. ఈ నాటకాన్ని టోనీ ఆల్బనీ లోని న్యూ యార్క్ స్టేట్ యూనివర్సిటీ లో పని చేస్తున్నప్పుడు రాసింది. 1955 లో జరిగిన ఒక సంఘటన టోనీని కలిచివేసింది ఎమ్మెట్ టిల్ అనే నల్ల పిల్లవాడు ఒక తెల్లజాతి అమ్మాయిని చూసి ఈల వేశాడనే నెపంతో తుపాకీతో కాల్చి చంపేస్తారు తెల్లవాళ్ళు.

తన నవలల్లోని స్త్రీ పాత్రలపై టోనీ మారిసన్”.

ప్రసిద్ధ ఆఫ్రికన్-అమెరికన్ రచయిత్రి గ్లోరియా నేలర్ చేసిన ఒక ఇంటర్వ్యూలో టోనీ మారిసన్ ను ‘బిలవెడ్’ నవలలో బిడ్డలా మీద ప్రేమతో వారిని బానిసత్వం నుంచి విముక్తి చెందించాలని రెండేళ్ల పాపని గొంతు కోసి చంపేసిన సెతా పాత్రను, ‘తర్వాత చెప్తాను’ కథలో తనను సైలెన్సర్ గన్ తో కాల్చిన ప్రియుడు అక్కడినుంచి తప్పించుకు పారిపోయేదాక ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశబ్దంగా ఉంటూ, ఏమైంది అని అడిగిన వాళ్లకి ‘తర్వాత చెప్తాను’ అంటూ, అతను వెళ్ళిపోయాక నోరువిప్పి రక్తాలోడుతున్న తుపాకీ గాయాన్ని చూపించిన నల్ల జాతి స్త్రీ మనస్తత్వాన్ని గురించి చెప్పమంటే టోనీ ఇలా చెబుతుంది. “ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఈ రెండు సంఘటనలను నా మనసు దేనితో కలిపి చూసుకుంటుందో నేను వివరించలేను కానీ, ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా బోధ పడింది. తమకన్నా మించిన దాన్ని, దేన్నో ప్రాణాధికారంగా ప్రేమించారని నేను గ్రహించాను. అక్కడ ఆ స్త్రీలు తమ జీవిత సారాంశం మొత్తాన్ని తమ కన్నా బయట మరెక్కడో దాచుకున్నారు. తన బిడ్డలు అవమానానికి గురి కావడం ఆమె ఏ మాత్రమూ భరించలేని విషయం. తన బిడ్డని చంపుకున్న ఆ స్త్రీ తన పిల్లలని ఎంత ప్రేమించిందంటే, వాళ్ళు తన జీవితంలో ఎంత విలువైన వాళ్లుగా మారిపోయారంటే, ఆ నిర్మలత్వం, స్వచ్ఛతా మాసిపోవడాన్ని ఆమె భరించలేకపోయింది. తన బిడ్డలు బాధ పడడం ఆమెకి తట్టుకోలేని విషయంగా మారిపోయింది. అందుకని ఆమె వాళ్ళని చంపేయడానికే సిద్ధమైంది. అంటే దానర్థం ఏమిటో తెలుసా మీకు? ఈ రెండు సంఘటనల్లోనూ చాలా ఉదాత్తమైనదేదో నాకు కనిపించింది. అది స్త్రీలకు మాత్రమే సాధ్యం అయ్యే సంగతి. నాకేమనిపిస్తుందంటే, అది మనలోని అత్యంత విలువైన అంశం. అదే సమయంలో మనకి మనమే ద్రోహం చేసుకునేలాగా కూడా అదే చేస్తుంది అనిపిస్తుంది. ద్రోహం అంటే మన జీవితం మనకేమంత ముఖ్యం కాదనే భావన కలిగించడం. ఆ రెండు సంఘటనల గురించి నేను పదిహేను, ఇరవై ప్రశ్నల దాకా మనసులో దాచుకున్నాను. ‘ఒక స్త్రీని తనను తాను పక్కన పెట్టేసుకునేలా, తనని తాను విస్మరించుకునేలాగా చేసేది ఏమిటి’ అనేదానిపై గురించే ఆ ప్రశ్నలు అన్నీను. ఆ తర్వాత ఒక ఏడాది పాటు నేను స్రీలోని ఆ self ని, అంటే, yourself లో ని సెల్ఫ్ కాదు, రెండు పదాలను మధ్య ఒక స్థలంలో పెట్టి చూడడానికి ప్రయత్నం చేసాను. అప్పుడు ఆ సెల్ఫ్ అనేది నిజానికి ఒకటి కాదని, అదొక కవల అన్నట్లుగా, లేదా అదొక దాహంలాగా లేదా స్నేహితురాలిగా, నీపక్కనే కూర్చుని, నిన్నే పరికిస్తున్నట్లుగా అన్నమాట. ముఖ్యంగా ఆ తల్లి చేతుల్లో చనిపోయింది చూడూ ఆ రెండేళ్ల పసి పాప, ఆమెని నేను మళ్ళీ ఈ భూమ్మీదకు తీసుకు వచ్చాను.” అంటుంది టోనీ మారిసన్.

నిజంగా ఇది చదువుతున్నప్పుడు రోమాలు నిక్క బడుచుకున్నాయి. చనిపోయిన ఆ పాప మల్లా భూమ్మీదకు వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, విముక్తికి సంబంధించిన అనేక ఆలోచనలు నన్ను ఒక్కసారిగా ఒక బలమైన అఘాతంలాగా తాకాయి. స్త్రీలకు సంబంధించి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు సంబంధించిన అర్థాలు అసలు ఏమై ఉంటాయి అనే ఆలోచనలు నన్ను ముప్పిరిగొన్నాయి. 1980 ల్లో ఈ చర్చ సమాజంలో ఇంకా నడుస్తూనే ఉండేది. స్త్రీ పురుషులకు సమానంగా వృత్తి ఉద్యోగావకాశాలు, సమాన వేతనాలు, పాఠశాలలు, సమానంగా చూడబడడం, ఎటువంటి వివక్షా లేకుండా ఏదైనా ఎన్నుకోగల స్వేచ్ఛ, పెళ్లి చేసుకోవడం లేదా మానేయడం, పిల్లలను కనడం, వద్దు అనుకుంటే కనకపోవడం ఈ ఆలోచనలు అనివార్యంగా ఈ దేశానికి చెందిన నల్ల జాతి స్త్రీల మరోచరిత్ర దగ్గరికి పోయి ఆగిపోయాయి. ఎందుకంటే అదంతా ఒక భిన్నమైన బానిసల చరిత్ర. అక్కడ పెళ్లి నిషిద్ధం, ఒక రకంగా అసాధ్యం కూడా. కొన్ని సార్లు చట్ట విరుద్ధం కూడా. అటువంటి అనిశ్చితమైన పరిస్థితిలో పిల్లల్ని కనాలని కానీ ఆ పిల్లల మీద ఆ స్త్రీలకు కానీ, పెంచే అధికారం, తమ దగ్గరే ఆ పిల్లల్ని ఉంచుకునే హక్కు, వాళ్లకి ఒక తల్లిగా బతకడం కనీసం ఊహకు కూడా అందని విషయాలు. స్వేచ్ఛా-స్వాతంత్రాల్లాగా దుస్సాహసం. ఆ కాలపు బానిసత్వపు చట్టాలు అత్యంత ఘోరంగా ఉండేవి. ఎంత అంటే ఒక తల్లికి తన కన్న బిడ్డను కూడా తన బిడ్డ అని చెప్పుకోవడం కూడా నేరం అనేంతగా. టోనీ మారిసన్ ఆ బానిస తల్లుల బాధని తానుగా చేసుకుంది పిల్లని కనలేని, కన్నా కానీ తన బిడ్డ అని చెప్పుకోలేని, చంపుకునే ఆ బానిస తల్లులకు వాళ్ళ పిల్లలను తిరిగి ఇవ్వాలనుకున్నది. చనిపోయిన పిల్లలని బతికించి, వాళ్ళను తిరిగి తల్లులుగా చేద్దాం అనుకున్నది. ‘బిలవెడ్’ నవల లో అదే చేసింది. సెతాకి చంపిన బిడ్డని ఇరవై సంవత్సరాల తరువాత తిరిగి బతికించి ఇచ్చింది. మారిసన్ బిలవెడ్ నవల ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికి ఒక epic, ఒక మహా ఇతిహాసం. చనిపోయిన పిల్ల బతికి తల్లిని కలవడానికి రావడం, ఒక మాయనా, వాస్తవమా అని, లేక ఆఫ్రికన్ తెగల్లో బాగా నమ్మే పునర్జన్మల మీద నమ్మకమా పాఠకులు చదువుతున్నంత సేపూ విభ్రమ చెందుతారు. ప్రపంచంలో ఈ నవల చదివిన తల్లులందరు కంట తడిపెడతారు, చచ్చిపోయిన, మళ్ళీ పుట్టిన ఆ బిడ్డని హృదయానికి హత్తుకుంటారు. ఈ నవలని 600ల లక్షల మంది నల్ల జాతి ప్రజలకు ఎవరైతే, బానిసత్వ కాలాల్లో, బానిసలుగా అమ్ముడుపోయి రూట్స్ నవలలో కుంటా కింటే లాగా రోజుల తరబడి సంకెళ్లతో బంధించబడి ఓడల్లో ప్రవాస దేశాలకు తరలించబడ్డారో, అంతర్యుధాల్లో, ప్రపంచ యుధాల్లో అత్యంత కిరాతకంగా చంపబడ్డారో, ఆ ఆరుకోట్ల నల్ల బానిసలు ఈ నవలని అంకితం చేసింది. టోనీ ఈ నవలను వాళ్ళ అమరత్వాన్ని కన్నీళ్లతో తలుచుకుంది. అత్యంత విషాదం ఏంటంటే బానిసత్వం రద్దు అయిన తరువాత కూడా మరో వంద సంవత్సరాలు ఆ బానిసత్వం యధావిధిగా సాగడం, ఎంతోమంది స్త్రీల, పిల్లల జీవితాలు ధ్వంసమైపోవడం.

నలుపు రంగుకు ఇప్పుడు అర్థాలు మారుతున్నాయి, కొద్దిగా అంగీకరిస్తున్నారు, నలుపు రంగు అందమైందని అంటున్నారు కానీ అది అందవిహీనమని పరిగణించే రోజులెలా ఉండేవో తనకు బాగా తెలుసని, అది సృష్టించిన జాతి విధ్వంసాన్ని, అత్యంత పెద్దదైన మానవ సమూహపు హత్యాకాండని తను బాగా అర్థం చేసుకుందని అలాగే, మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా గానీ అణిచివేతకు గురి అయ్యే సమూహాలనుంచే బలమైన సాహిత్యాలు, ఉద్యమాలు పుడతాయని, వారు రాసిన అక్షరాలకు రక్తం, చెమట, కన్నీరు అంటి ఉంటాయని అంటుంది టోనీ.

నిజంగా అమెరికాలో బానిసత్వం పూర్తిగా పోయిందా, ఆ భావన ఇంకా ఉంది అనడానికి 2019 లో అమెరికాలో తన బూటుకాలి కింద జార్జి ప్లాయిడ్ గొంతుని కసితీరా నలిపి చంపిన తెల్ల పోలీసులే సాక్ష్యం. దాని కంటే ముందు అడపాదడపా కాల్పుల్లో చనిపోతూనే ఉన్న నల్ల జాతి యువకుల శవాలే సాక్ష్యం. అక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కుల, మత, జాతి, రంగు, రూపం, లింగ వివక్ష పేరుతో అణిచివేత హత్యాచారాలు జరుగుతాయో అక్కడక్కడ టోనీ మారిసన్ లాంటి రచయిత్రులు కావాలి. మన భారత దేశానికైతే కొన్ని వేల సంఖ్యలో టోనీ మారిసన్ లు కావాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇక్కడ ఫాసిజం పడగలు విప్పి రూపం మారిన బానిసత్వాన్ని అమలుపరుస్తున్నది. మానవత్వం ఉన్నంత మేర టోనీ మారిసన్ సాహిత్యం బతికి ఉంటుంది. ఎన్ని నిర్బంధాల మధ్య, నిషేధాల మధ్య కూడా తన నల్లజాతి ప్రజల గురించి ఎన్నడూ రాయడం ఆపని టోనీ మారిసన్, చివరిదాకా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడింది. టోనీ మారిసన్ రచయతలందరికీ ఆదర్శం కావాలి. నల్ల జాతి ప్రజల బాధను గుండెల్లో మోసి వాటికి ఎంతో బాధ్యతతో అక్షర రూపం ఇచ్చిన ఆ నల్ల కలువకు గౌరవ పూరిత మైన నివాళి. గత ఏడాది ఆగస్టు 5 2019న టోనీ మారిసన్ మరణించారు.

“The function of freedom is to free someone else.”– టోనీ మారిసన్

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply