జ్ఞాపకాల కంటిపాపలు

యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడు
ఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదా
ఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకు
పోరాట దైనందిన చర్యలో
ఆహారం కోసం క్యూ కట్టడమూ ఉంటుంది
దాహమడిగిన విలేఖర్లకు
ఆహారమందించే ఆతిథ్యమూ ఉంటుంది

యుద్ధ దినాలను ప్రేమరాత్రులుగా
మలుచుకునే భావోద్వేగమూ ఉంటుంది
ఏడు నెలల ఆక్రమణ దాడిలో
మోడు కూడ చిగురించే రహస్యం తెలుసుకుంటుంది

ఏడు నెలల గర్భంతో
ఏరియల్ దాడిలో మరణించిన
తల్లి పేగు తెగి
ఒక నవజాత శిశువు కళ్లు తెరుస్తుంది

ఒక అమరత్వం మనకిచ్చిన కంటిపాప
ప్రేమ పంచిన ఐదు రోజులే
ఒక విహ్వల బంధమై
జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

(రఫా లోని ఒక ఇంటిలో సబ్రీన్ అల్-సకానీ ఇజ్రాయిల్ ఏరియల్ దాడిలో మరణించింది. ఆమె తల్లిదండ్రులూ, నాలుగు సంవత్సరాల చెల్లెలూ చనిపోయారు. అప్పటికామె ముప్పై వారాల గర్భిణి. ఆసుపత్రిలో డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి నవజాత శిశువును ఇంక్యుబేటర్ లో పెట్టారు. ఐదు రోజులు బతికిన శిశువు గురించి సబ్రీన్ చిన్నాయన “మేము పాపతో ఐదు రోజులు పిచ్చి ప్రేమతో పెనవేసుకుని పోయాము” అన్నాడు.)

2 thoughts on “జ్ఞాపకాల కంటిపాపలు

  1. తల్లి పేగు తెగి నవజాత శిశువు కళ్ళు తెరుస్తుంది

Leave a Reply