జ్ఞానానంద కవి ఖండకావ్య వస్తుదృక్పథాలు

జ్ఞానానంద కవి 1945 నుండే ఖండకావ్యాలను ప్రచురిస్తున్నప్పటికీ లభించిన తొలి ఖండ కావ్యం మాత్రం 1955 లో వచ్చిన పాంచజన్యం. దానికి కొనసాగింపుగా 1998 వరకు ప్రచురించిన ఖండకావ్యాలు ఏడు(7) లభిస్తున్నాయి. అక్షరాక్షతలు(1973) కంటిపూడి వీరరాజు చౌదరికి అంకితం ఇయ్యబడింది. 23 పద్యాలలో కృతిపతి వంశాభివర్ణన ఉంది. ఖండికలు 17. అక్షరపూజ (1979)ను ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు రాజా మేకా రంగయ్యప్పరావు బహదూర్ వారికి అంకితం ఇస్తూ వ్రాసిన పద్యాలు 58. ఇందులో ఖండికలు 16. పిల్లనగ్రోవి ఐ ఎ ఎస్ అధికారి కె. చంద్రయ్యకు అంకితం చేయబడింది. అంకిత పద్యాలు 27. ఇందులో ఖండికలు 35. అమూల్యశ్రీకి అంకితం ఇయ్యబడిన ఖండకావ్యం రాజధాని (1987) అంకిత పద్యాలు 34. ఖండికలు 30. విశ్రాంత న్యాయ మూర్తి కొత్తపల్లి పున్నయ్యకు అంకితం ఇస్తూ ప్రచురించిన వంశధార(1989) ఖండకావ్యం లో కృతి పతి వర్ణన పద్యాలు వందమీద మూడు. ఇందులో 33 ఖండికలు ఉన్నాయి. 1993లో వచ్చిన ఖండ కావ్యం ఆహ్వానం కాకి మాధవరావుకు అంకితమిచ్చాడు జ్ఞానానంద కవి. అంకితపద్యాలు 46 కాగా కవిత్వ ఖండికలు 37. ఇక 1998 లో వచ్చిన ధర్మాగ్రహం లో 24 ఖండికలు ఉన్నాయి. తల్లి దండ్రులు సురగాలి పాపమ్మ ఎల్లయ్యలకు అంకితం ఇచ్చాడు. అంకిత పద్యాలు అంటూ విడిగా లేవు. 1945 డిసెంబర్ లో తల్లి కి అంజలిఘటిస్తున్న పద్య ఖండికతో కావ్యాన్ని ప్రారంభించాడు. ఇందులో 24ఖండికలు ఉన్నాయి. అన్ని కావ్యాలు కలిపి మొత్తం ఖండికలు 192. వస్తు దృక్ప థాలను బట్టి కవిత్వానికి విలువ.

1.

“దేశభక్తి, దేశ సమగ్రత, జాతీయభావన, వీరారాధన నా రచనకు మూలాధారాలు” అని వంశధార ఖండకావ్య సంపుటికి వ్రాసుకొన్న ఉపోద్ఘాతం లో చెప్పుకొన్నాడు కవి. ఈ ప్రాతిపదిక మీద దేశ స్వాతంత్య్ర దిన సందర్భాలలో, ఉగాది తదితర పర్వదినాల సందర్భంలో ఆయన వేరువేరు శీర్షికలతో వ్రాసిన ఖండికలను పరిశీలించవచ్చు.తెలుగువారి చరిత్ర సంస్కృతుల గురించి వ్రాసిన ఖండికలు కూడా ఇందులో భాగమే. దేశభక్తి, జాతీయభావన, వీరారాధన తరచు చరిత్ర సంస్కృతుల గురించిన వారసత్వ గర్వంతో ముడిపడి వ్యక్తమవుతూ ఉంటాయి. జ్ఞానానంద కవి పద్యాలు అందుకు మినహాయింపు కాదు. అయితే అదే సమయంలో దేశ సమగ్రతకు, జాతీయభావనకు అవరోధంగా ఉన్న వర్తమాన దేశీయ అవలక్షణాలను గురించి హెచ్చరించకుండా ఉండలేడాయన.

ఆయన గుర్తించిన అవలక్షణాలు-కులం,మతం,అవినీతి,లంచగొండితనం,పేదరికం,రాజకీయ వాదుల పార్టీ మార్పిళ్లు. భావనాత్మక ఆదర్శం జాతీయభావన అయితే ఇది కళ్ళముందరి కఠిన వాస్తవం. ఈ రెంటిమధ్య వైరుధ్యమే జ్ఞానానంద కవిత్వానికి అంతస్సూత్రం.
“పరులం బ్రోచెడి ధర్మ బుద్ధికిని యావల్లోక మానంద సా
గర డోలాళుల నూగిపోయినది నిక్కంబిద్ధి నీదేశ స
చ్చరితల్ జాటు పురాతన ప్రతిభ యీ స్వాతంత్య్ర వేళా పుర
స్సర భాగ్యమ్ముల దిద్దుకోవలయు విశ్వంబందు హిందూసుతా” (దీక్షాగానము, అక్షరాక్షతలు) అని భారతీయ సంస్కృతిలోని ప్రత్యేకతను ప్రపంచానికే ఆచరణీయ ఆదర్శంగా చేసి చూపుతూనే తిలక్ గాంధీ, నెహ్రు, నేతాజీ మొదలైన వాళ్ళు పాటుబడిన జాతీయోద్యమ రోజులను గౌరవంతో ప్రస్తావిస్తూనే ( స్వాతంత్య్ర రజతోత్సవ కవితా సందేశం) ‘ఇరువదైదేండ్ల స్వాతంత్య్ర చరితలోన నాల్గువేల యుగాల వర్ణాల వలల/ జిక్కుకొని గాయపడ్డ జీవన చరిత’ ‘మానవతకు గాయమ్ము కల్గించు నంటరాని తనంపు టంతరువు’ వంటి వర్తమాన దుర్దశల గురించి వాపోవటం జ్ఞానానంద కవి కవిత్వంలో వెలుగు నీడలవలె విస్తరించి కనబడుతుంది.

“ఊరికి దూరమంచు నిలుచున్న గృహస్థులు నూరిమధ్యలో
గారవమేర్పడన్ బ్రతక గల్గిననాడు స్వతంత్రదేశమం
దారయ సంస్కృతి ప్రభల కాయువు పట్టుగ దోచు గాని యా
దూరములింకా దూరమయి తొందర సేసిన జాతి పాడగున్” అని అస్పృశ్యత నశించిన నాడే అది స్వతంత్ర దేశం అవుతుందని, సంస్కృతికి అదే ఆటపట్టని అలా కాకపోతే అది జాతి నాశన కారకమని ఈ కవితలో స్పష్టంగానే చెప్పాడు. అలాగే స్వేచ్ఛాగీతము(అక్షరాక్షతలు) ఖండికలో గాంధీ వాక్సారప్రభావంతో స్వేచ్ఛావాయువు వీస్తున్న నేల అని, ఇందిరమ్మ పాలనలో దైన్య ప్రజల శ్రేయం ఉందని అంటూనే “మత వృష భేంద్రముల్ పనికి మాలిన వర్ణపు దున్నపోతులున్ / జతలుగ సాగి యీ భారతజాతిని నాశన”మొనర్చినది అని అంటాడు.

28 వ రిపబ్లిక్ డే ( అక్షరపూజ )ఉత్సవ సందర్భంలో శాంతి చందురుని వెన్నెలలీనుత హైందవ క్షితిన్ అని ఆప్యాయ పూర్వక ఆకాంక్షను వ్యక్తీకరిస్తూనే “మనుటకు వీలుగాని కసుమాలిన వట్టి దగా చరిత్రలే/ లినదినముల్ గతించెనె? కులీనులు దీనులపై వహించు పె/ త్తనము నశించి పోయెనె యథార్థము దేశమునందు సంచరిం/ చెనె ? దళిత ప్రజావళికి చెందెనె ?భాగ్యపు నైగనిగ్యముల్ ? అని వర్తమాన ప్రగతిని శంకిస్తాడు. ముప్ఫయిరెండవ స్వాతంత్య్ర వార్షిక నాడు స్వరాజ్యలక్ష్మి అనే ఖండిక వ్రాసాడు. రమ్య భారతి స్వరాజ్యలక్ష్మికి జయము పలుకుతూనే “దీనుల క్షుధార్తిం తీర్పగాలేని ఈ స్వాతంత్య్రమున కర్ధమేమిటి అని నిస్పృహకు లోనవుతాడు. వర్ణద్వేషములు ఇంకి పోలేదని, సమత పండలేదని బాధపడతాడు.

దేశమనగ (పిల్లనగ్రోవి) కవితలో దేశపు నేల లోని మట్టిరేణువులలో సంపద మూలమైన తేజోవిశేషం ఉందని ప్రశంసిస్తూనే ఎంత సంపద ఉండనీ ‘కూడుగుడ్డ కొఱకు కుమిలిపోయిన క్షుధావ్యధితులైన పేదవారి బ్రతుకు లోన వెలుగు రేకలు మొలకెత్తితేనే దేశవిభవం ..’ అని స్పష్టం చేసాడు. సమత నెలకొన్న దేశమే దేశం అని కూడా అన్నాడు. ముప్ఫయి మూడేళ్ళ స్వాతంత్య్ర మహోత్సవం సందర్భంగా జ్ఞానానంద కవి ‘స్వాతంత్య్ర సందేశము’ కవిత వ్రాసాడు.స్వతంత్రతా రమకు విశ్వక్షోణిలో గీర్తిపెంపొందవం జేసిన’ త్యాగ మూర్తులు తలుపుకు వస్తున్నా తనను బాధిస్తున్నవి మందు లేకుండాపోయిన కులజబ్బు, పంచముల దురవస్థ, అంటరానితనం, పేదరికం, లంచగొండి తనం అని చెప్పుకొచ్చాడు కవి. ‘స్వాతంత్య్ర సందేశము’అనే శీర్షికతోనే ముప్పది యెన్మిదేండ్ల స్వాతంత్య్ర దినం నాడు(1984) మరికోన్ని పద్యాలు వ్రాసాడు. (రాజధాని) పంజాబ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, భివాండీ అల్లరులను ప్రస్తావిస్తూ అశాంతికి ఇల్లయినదేశం భారతదేశం అంటాడు. గుండాలు, త్రాగుబోతులు తిరిగే నేలమీద స్వాతంత్య్రం ఉనికి ఎక్కడ అని వాపోతాడు. అఖండభారతం అనే కవితలో మాత్రం “దేశభక్తి మరియు దేశ సమగ్రత /ప్రజల నాడు లందు ప్రబలి, ప్రబలి/ కర్మభూమియగు నఖండ భారత మాహాక్షితిని నెగురు ప్రగతి నికేతనమ్ము” అని భావించాడు.

భిన్న మతాలు, కులాలు, జాతులు ఉన్న దేశంలో జాతీయసమైక్యత అవసరాన్ని నొక్కి చెప్తూ దానిని సాధించటానికి సంసిద్ధులు కావాలని ఇచ్చిన పిలుపు ఆహ్వానం కవిత( ఆహ్వానం)
“ఒక దేశము సమైక్యమా ప్రజలయందుండున్ ప్రజాస్వామ్యమం
దుకు రాణించు జనాళి గుండియలయందున్ దేశభక్త్యంకురా
లకు తావున్న యాదొక్క శోభ నిజముల్ నర్తింప పాలించునా
యకులున్నన్ పని లేదు చెప్పగ సమైక్యమ్మున్ ప్రతిష్ఠింపుడీ” ప్రజాస్వామ్యం, దేశభక్తి, మంచి పాలనా నాయకత్వం ప్రజలలో సమైక్యతా సాధనకు షరతులు గా పేర్కొన్నాడు. స్వాతంత్య్ర లక్ష్మి 45వ స్వతంత్ర దిన సందర్భంలో వ్రాసినది. అంటే 1992 నాటిది ఇరవైఏళ్ళ కాలం మీద వ్రాసిన ఈ కవితలన్నిటిలో గాంధీ మార్గంలో దేశాన్ని నిర్మించటమే దేశ స్వతంత్ర కు సార్ధకం అన్న భావం కనబడుతుంది.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఇరవైఏళ్లు అయిన సందర్భంలో జ్ఞానానంద కవి వ్రాసిన ఖండిక తెలుగుతల్లి.(అక్షరపూజ). ఇంతకు పూర్వమే వచ్చిన పాంచజన్యంలోను, ఆ తరువాతి ఖండ కావ్యాలలోను ఇదే శీర్షికతో ఆయన వ్రాసిన కవితలు ఉన్నాయి. ఈ కవితలో ఆయన తెలుగు దేశానికి ఘనచరిత్రను, కీర్తిని సమకూర్చారంటూ విద్యారణ్యులు, హరిహరబుక్కరాయలు, ముసునూరి కాపయ, సాళువ తిమ్మరుసు, కృష్ణదేవరాయలు మొదలైన వారిని ప్రశసించిన మరుక్షణమే సమతా గంధం, సహన శక్తి లేని తెలుగువారి వర్తమానస్థితి పట్ల కలవరపడటం చూస్తాం. మళ్ళీ అంతలోనే అభివృద్ధి సాధించామని ఆనందపడతాడు. జొన్నకూడు తప్ప దొరకని పల్నాటి సీమ ఈ నాడు దివ్య భోజనాలతో నాగరికమైనదని అంటాడు. మెగస్తనీసు, రాజరామమోహన్ రాయ్, ఫిలిప్ బ్రౌన్, గాంధీ, కృష్ణదేవరాయలు మెచ్చిన దేశం, భాష అని ఆంధ్రదేశం గురించి గర్వపడతాడు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన ఇరవై ఒకటవ వార్షికకు వ్రాసిన ఆశాభావము అనే కవితలో త్యాగ రాజస్వామి, టంగుటూరి ప్రకాశం, పొట్టిశ్రీరాములు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి మొదలైన వాగ్గేయ కారులు, రాజకీయనాయకులు, కవులు పుట్టిన నేల అని ఆంధ్రదేశాన్ని చూసి గర్వపడతాడు. ‘కడచిన ప్రాత భారతగాథలు త్రవ్వక వర్తమానమందడుగులు వెయ్యాల’ని మళ్ళీ తానే అంటాడు. ( భావిభారతము)

పిల్లనగ్రోవిలో తెలుగుతల్లి పాతికేళ్ల ప్రాయంలోది.(1980) యుగయుగాల వైభవోన్నత చరిత. శాతవాహనుల నుండి కాకతీయులవరకు తెలుగు పాలకుల సామర్ధ్యమే సామర్ధ్యం. సంఘ సంస్కరణ కారకులు కర్తలు అయిన తత్వవేత్తలు, కవులను, రచయితలను కన్నతల్లి. పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలైన వాళ్ళ వల్ల ఉజ్వల ప్రశస్తి పొందిన దేశం. శిల్ప చిత్ర గాన కళల కాణాచి. కానీ ఇప్పుడామె సమైక్య సాధన మహామాన్యత్వం మాయమైన నేల. ప్రాంతీయతత్వం, వర్ణభేదాలు, రాజకీయాల రభస, కుటిలత్వం, అసహన దృష్టి దేశానికి పట్టిన చీడలు. ఇవన్నీ పోయి పురావైభవం ప్రాప్తించాలి అన్నది కవి కామన.

చైతన్యవల్లి ఖండిక కూడా తెలుగుతల్లిని సంబోధిస్తూ వ్రాసిన పద్యాల హారమే. తెలుగువాడు స్వేచ్ఛ కొరకు గాంధీ మార్గంలో పయనించిన తెలుగువాళ్ళ ఘనకీర్తిని భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండావెంకటప్పయ్య, అల్లూరి సీతారామరాజు, బులుసు సాంబమూర్తి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు మొదలైనవాళ్లను, కృష్ణరాయలవంటి రాజులను, గరిమెళ్ళ సత్యనారాయణ, గిడుగు, గురజాడ, కందుకూరి మొదలైన కవులను నీ గర్భఫలములే కదా అని స్తుతించటమే వస్తువు. ‘తెలుగువెలుగు’, ‘జాతీయ సమైక్యము’ ఖండికలలోనూ( వంశధార) తరతరాలనాటి తెలుగు వారి ఉజ్వలోజ్వల చరిత్ర కథనమే జరిగింది.
నాది భారతమ్ము మీదట నాంధ్రమ్ము
లేదు మతము గీతము లేదు నాకు
సత్యపథమే నాకు స్వర్గ దమము నాకు
నంతరంగా శుద్ధి యాత్మబలము -( ఆహ్వానం) అన్న ధిషణాహంకారం కలవాడు కనుకనే తెలుగుతల్లిని, తెలుగుదేశాన్ని కేంద్రంగా చేసుకొని వ్రాసిన కవిత్వంలోనూ భారతదేశాన్ని, స్వాతంత్య్ర ఉద్యమ నాయకులను మరీ ముఖ్యంగా గాంధీని ప్రస్తావించకుండా ముగించడు.

ఇక ఉగాది మొదలైన పర్వదినాల సందర్భంలో వ్రాసిన కవితలలో కూడా దేశ చరిత్ర సంస్కృతుల ప్రశస్తి, వర్తమాన సామాజిక అవలక్షణాలపట్ల ఆక్షేపణ ఒకే నాణానికి రెండు ముఖాలై కనబడతాయి
పరీధావి సంవత్సరం (1972)నుండి బహుధాన్య ఉగాది(1998) వరకు 26 సంవత్సరాల మీద జ్ఞానానంద కవి వ్రాసిన ఉగాది కవితలు పద్దెనిమిది(18). ఎట్టి మార్పును తెస్తావుఅన్న ప్రశ్నతో పరీధావి((అక్షరాక్షతలు) సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాడు.
“కలవారెల్లరు కూడబెట్టుకొని సౌఖ్య శ్రీలలో మున్గి పే
దల దుఃఖాలకు సానుభూతి నెఱపన్ దారిద్య్రమింతైన నా
వలకుం బోవునె ఇండియాపొలములో బాహాటమ్ముగా సాగు నీ
కులరోగాలు నయమ్ము గానియెడల ……” అని సంపద వ్యత్యాసాల కుల వ్యత్యాసాల భారతీయ సమాజంలో మార్పును తీసుకురాగలుతుందా ఈ కొత్త సంవత్సరం అని ఒక సవాల్ ను ముందుకు తెచ్చిన కవి హఠాత్తుగా బుద్ధుడు, అశోకుడు, బాపూజీ, వేమనల ప్రశస్తి కి దిగటం, వాల్మీకి, శంకరాచార్యుడు, శ్రీరాముడు మొదలైన వాళ్ళను ప్రస్తావించటం జాతీయభావన, వీరారాధనలో భాగమే. అయితే ఇది పూర్వ సంస్కృతిని గని మురిసిపోవటమే అని కవికి తెలుసు. వాస్తవం ఏకత లేకపోవటం అని కూడా తెలుసు.

“బంధితంబైనట్టి యంధవిశ్వాసాలవలయాన జిక్కె నా వలపు టూహ
దిక్కుమాలిన కులద్వేష మహోన్మాద లోకాన మ్రగ్గే నాలోని ప్రతిభ
దయనీయమైన పేదరికపు బ్రతుకులో సన్నగిల్లినది నా శౌర్య దీప్తి
కామందు నాదు భాగము భుజించుటచేత మృగ్యమైపోయే నా భాగ్యలక్ష్మి
యుగయుగాలనాటి నుండి యూరికి దూరమై
బ్రతుకు గడిపినందు వలన నాదు
చరిత జన్మధరణి మరచిపోయెను కాళ
యుక్తి యేమి సేసెదో మదుక్తి” (కాళయుక్తి(1978) అక్షరపూజ ) సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి.ఏ సంవత్సరమైనా ఊహలు స్వతంత్రంగా సాగటానికి అవరోధమైన అంధ విశ్వాసాలను, ప్రతిభా వికాసానికి అవరోధమైన కులద్వేషాన్ని, శక్తిహీనులను చేసే పేదరికాన్ని, పేదరికానికి కారణమైన దోపిడీని, అస్పృశ్యులై కొందరు వూరికి దూరమై విస్మృతికి గురి కావటాన్ని ఈ కాళయుక్తి సంవత్సరమైనా పరిష్కరించగలుగుతుందా అన్నది కవి ప్రశ్న.

ఆ తరువాత సిద్దార్థి సంవత్సరం రావటం పోవటం అయి రౌద్రి(1980) నామ సంవత్సరం వచ్చింది సరే… “క్షుదాఖిన్న స్వాంతులకేమి సంతసము గల్గెన్ ( రౌద్రి, పిల్లనగ్రోవి) అని ప్రశ్నిస్తాడు కవి. దోపిడీ సంఘం ఎన్నాళ్లిలా గంతులేస్తూ సాగుతుంటుంది అని వేదన పడతాడు. పిల్లన గ్రోవి లోని మరొక ‘ఉగాది’ కవిత దుర్మతి ఉగాది సందర్భం నుండి వ్రాసిన ఆంధ్రుల ఔన్నత్య సంకీర్తన. మళ్ళీ దుందుభి ఖండికలో పేదరికం, దోపిడీ , హత్యలు, మానభంగాలు , పార్టీ మార్పిడులు మొదలైన వాటితో దేశం కునారిల్లుతున్న పరిస్థితులలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాడు. రుధిరోద్గారిఉగాది కవిత(రాజధాని)లో “ప్రభుత్వాలెన్నియో మారినన్ సుకములు గూర్చిన దింతలేదు” అన్న ఉపమానంతో సంవత్సరాలు ఎన్ని వచ్చి పోతున్నా జీవితంలో మార్పు లేదని వేసటపడతాడు. రక్తాక్షి(రాజధాని) క్రోధన, అక్షయ ( వంశధార) మొదలైన ఉగాది కవితలన్నీ ఇంచుమించు ఈ ధోరణిలో సాగినవే. ప్రభవ ఉగాది కవితలో ( ఆహ్వానం ) “కడు దూరమ్మున నాగె గాంధిపలుకులు కాగా ప్రజాస్వామ్యమ / మ్ముడువోయెన్ మఱి యెట్లు నిల్చునిట సంపూర్ణ స్వతంత్రమ్ము” అని ప్రశ్నిస్తూ ఈ పరిస్థితిలో వస్తున్నఉగాది పాలన ఎట్లా సాగుతుందో అని సందేహ పడతాడు. “బడుగుల్, దీనులు, ప్రత్తిరైతుల కుటుంబాల్ వందలన్మించున్ / మరణిస్తున్న కాలాన ఉగాదులు, ఉషస్సులు ఎవరికి అన్న చింత ఆయనది. ( బహుధాన్య, ధర్మాగ్రహము) ధాత, యువ , భావ సంవత్సరం ఏదైతేనేమి సమతా, మమత లేని దేశంలో కులం దేశాన్ని పట్టి పీడిస్తున్న చీడగా ఉన్న స్థితిలో కొత్త సంవత్సరం మార్పు ఏమైనా తీసుకురాగలుగుతుందా అన్నదే కవి ఆరాటం.

దీపావళి సందర్భంగా వ్రాసిన దీపావళి, ఈ దీపాలవెలుగులో(వంశధార) సత్యను సంబోధిస్తూ లోకంలో నరకులు అనేకమంది వారిని ఏమి చేస్తావు అని నిలదీస్తాడు. “…కృధా/ జ్వలితోన్మాద పరీతచిత్తుల కుల వ్యామోహమీ భోగి మంటలలో గాల్చుము పౌష్యలక్ష్మి” అంటాడు ఒక సంక్రాంతి కవితలో ఆలా పండుగ ఏదైనా రానీ అది అందరికీ సంతోషాన్ని పంచేదిగా ఉండే పరిస్థితులు మాత్రం లేవని బాధపడతాడు కవి.

పేదరికాన్ని, కులమతవివక్షలను, అవినీతిని, లంచగొండితనాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీని, హింసను దేషాభివృద్ధికి అవరోధాలుగా గుర్తించటం వరకు బాగానే ఉంది. వాటికి కారణాలను గురించికానీ, వాటి నిర్మూలనను గురించికానీ ఆచరణ మార్గాలు ఏమిటన్న విచికిత్స వరకు పోలేదు జ్ఞానానంద కవి. ఒకే పార్టీకి కట్టుబడి ఉండే రాజకీయనాయకులు, ప్రతిభ చూచి పదవులిచ్చే విధానం ఆయన ఆశయం. అవి లేవని అసంతృప్తి. అలాగని సమకాలపు రాజకీయాలలో ఉన్న వ్యక్తులతో ఆయనకు స్పర్ధ ఏమీలేదు. అందువల్ల ఆయన కవితలు ఎన్ని వ్రాసినా అవి ఈ పరిమిత సమస్యలను పదేపదే ప్రతిధ్వనిస్తాయి.
అయితే అదే సమయంలో ఆయన గరీబీ హఠావో నినాదాన్ని( అక్షరక్షతలు, పరీధావి) ఇరవై సూత్రాల పథకాన్న’భరతోర్వికి పట్టుగొమ్మల’ ని వరలుతున్నాయని’ (అక్షరపూజ, సమతాగానం) ప్రశంసించటమేకాక ఎమర్జన్సీని కీర్తిస్తూ కవిత్వం వ్రాయటం(1976, పిల్లనగ్రోవి) దిగ్బ్రాంతికరమైన వైరుధ్యం. ‘అణగిపోయినది నీ యధికారఘాతాన కలవాని పెను కండకావరమ్ము’ అంటూ ఏ క్షణంలో ఇండియాలో ‘స్వారీ సలుప బయలుదేరినావో ఎదో వికాసమిట్టే పొదవె నెమర్జన్సి’ అంటూ దానిని స్వాగతించాడు. యుగయుగాల దగాచారిత్రల దర్పం అణచి శాంతి చంద్రుడు కాంతులు ప్రసరించటానికి కారణమైందంటూ ఎమర్జన్సీకి హారతులు ఇచ్చాడు. ఎమర్జన్సీ కాలాన్నిదేశపు చీకటి రోజులుగా చెప్పే చారిత్రక వాస్తవాన్ని శాంతివిరిసిన కాలంగా వర్ణిస్తున్నాడు అంటే శాంతి ఏ వర్గానికి చేకూరిందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

2.

ప్రతి ఖండకావ్యంలో అంకితాలు సాంప్రదాయ కావ్యపద్ధతిలో అంకితం తీసుకొంటున్న వాళ్ళ వంశవర్ణన, గుణ వర్ణన, సాహిత్యాభిరుచుల సంకీర్తన చేస్తూ సుదీర్ఘంగా సాగాయి. దానికితోడు తన కవితా వ్యాసంగానికి సహాయకారులైన వాళ్ళను ఇతరేతర ఖండికలలో విస్తృతంగా కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకొన్నాడు.కృతజ్నతాంజలి ( అక్షరాక్షతలు) సన్మానము,ధన్యవాదము( అక్షర పూజ)ప్రత్యభినందన శీర్షికతో రెండు ఖండికలు (పిల్లనగ్రోవి) అదే శీర్షికతో మరొక కవిత, దానితోపాటు కృతజ్ఞతాంజలి అనే మరొక కవిత(ధర్మాగ్రహము) ఈ రకమైన కవితలు. ఈ కవితలలో ప్రస్తావించబడ్డ వాళ్ళ పేర్లు అన్నీ ఒక జాబితా చేస్తే వందకు చేరవచ్చు ఆ సంఖ్య. నెహ్రు, ఇందిరా గాంధీ, కాళేశ్వరరావు, మొదలైన దేశ రాజకీయ నాయకులు, ప్రాచీన ఆధునిక కవులు, సాహిత్య సామాజిక మత తాత్విక రంగాలలో పనిచేసిన వ్యక్తులు, సమకాలికులు అయిన వ్యక్తుల గురించి ప్రత్యేకంగా వ్రాసిన కవితలు మరో 50 వరకు ఉన్నాయి. ‘కులమతాల మత్త కలభాలు రేగి / విశృంఖలముగ ఘీంకరించినపుడు’ విప్లవాత్మక కవిత్వం వ్రాసాడని వేమనను, ‘వర్ణబాహ్యులైన పంచమజాతికి / నెమ్మి మీర వైష్ణవమ్మొసంగి సంస్కరించి ..’ నందుకు రామానుజాచార్యుడిని ఆత్మీయంగా తలచుకొన్నాడు.(అక్షరాక్షతలు)ఇలా ఆయా వ్యక్తుల విశిష్టతలను విలువల రీత్యానో, ప్రయోజ నాలరీత్యానో ఈ కవితలలో ఆయన వర్ణించాడు.

అంటరానితనం, కుల వివక్ష ప్రస్తావించని ఖండిక జ్ఞానానంద కవి వ్రాయలేదంటే అతిశయోక్తికాదు. అయితే అది అనేకవిషయాలలో ఒకటిగా ఉంటుంది. ప్రత్యేకంగా అస్పసృశ్యత కేంద్రంగా వ్రాసిన కవితాఖండిక ‘తమాషా.’ (వంశధార) ఒక్కటే కనిపిస్తున్నది. 15 పద్యాల ఖండిక ఇది. ‘ఈ యశ్యస్పృతకు ఏది హేతువగునోయీ’ అన్న ప్రశ్నతో ప్రారంభించి దీనిని ఖండించేవాడే కనబడడు అంటూ ఎంత చర్చించినా ‘లేదేనాటికీ దేశమందీ యస్పృశ్యతకున్ విమోచనము’ అని నిరాశ వ్యక్తం చేస్తాడు. ‘ఎవడో తుంటరి వర్గ లాభమునకై ఈ వర్ణభేదాలు హైం / దవ విశ్వంభరలో సృజించి’ తమాషా చూస్తున్నాడు అని అంటాడు. ఒక వర్గం తన అధికారాన్ని నిలుపుకొనటానికి ద్వేషంతో ఏర్పరచిన విధానం అస్పృశ్యత అని భావిస్తాడు. పాలన ఆ వర్గానిదే కనుక ప్రశ్నించటానికి వీలులేకుండా పోయిందని ఇదంతా భగవంతుడి పేరుమీద జరుగుతున్న కుటిల వ్యాపారమని నిరసిస్తాడు.

లోకంలోని కష్టాలకు కన్నీళ్లు పెట్టుకొనే కవి ఆత్మ నివేదనం తరచు భాష్పసందేశం అవుతుంటుంది. జాషువా గబ్బిలం భాష్ప సందేశమే. జ్ఞానానందకవి భాష్ప సందేశం అనే కవిత ( ఆహ్వానం ) వ్రాసాడు. వరకట్నం, పేదరికం, కులం, తీవ్రవాదం అన్నీ కవి దుఃఖానికి కారణాలే. “ఏ శనిగాడు వర్ణముల కృత్రిమ సృష్టికి హేతువౌచు నీ/ దేశపు నికృష్టపున్ స్థితికి దిక్కయి భేదములుద్ధరించెనో / ఆ శనిగాని శాసనములన్నియు గూలెడుదాక భాష్ప సం/దేశము దిగ్దిగంతముల నిండును గాక ప్రతిధ్వనించుచున్” అని వర్ణ వ్యవస్థ పట్ల తన క్రోధాన్ని ప్రకటించాడు. భూములను శ్రమను కాజేసి గ్రామాలలో ఉండరాదని తన జాతిని తరిమేస్తున్న దుర్మార్గ వ్యవస్థ పట్ల కోపమే దుఃఖం అయింది కవికి.

“అతిసామాన్యులరుంధతీ తనయులా యంబేద్కరీయుల్ ప్రజా
పతులై నిల్చిరోకానొకప్పు డిది పాపమ్మయ్ తయారయ్యె నే
డతిహీనమ్ముగనూచకోతలకు పాలౌటన్ క్షమార్హమ్మే స్వ
చ్ఛత గాంక్షించినవాని దృష్టికగు నాశా భాష్ప సందేశముల్” — అరుంధతీ తనయులను కవి అంబేద్కరీయులుగా పేర్కొంటున్నాడంటే అంబేద్కర్ మార్గంలో అభివృద్ధిని ఆదర్శంగా చేసుకొన్నారని సూచించటమే. వాళ్ళు ఊచకోతలకు గురవుతున్న కాలానికి కవి ప్రత్యక్ష సాక్షి. అది ఆయన దుఃఖ కారణాలలో ప్రధానమైనది.

కవి అన్న అస్తిత్వ స్పృహ జ్ఞానానందకవిలో దళిత అస్తిత్వాన్ని మించి ఉన్నదా అని అనిపిస్తుంటుంది ఆయన కవిత్వాన్ని చూస్తే ఒక్కొక్కసారి. కవుల సమస్యల పై చాల కవిత్వం వ్రాసాడు. కవికి సర్వ సౌకర్యాలు సమాజం, సంపద కలవాళ్ళు సమకూర్చవలెనన్నది ఆయన దృష్టి. కవులు తమ కావ్యాలను ఎవరికైనా అంకితం చేశారంటే వాళ్ళ జీవితపు జరుగుబాటుకు ఆ కృతి స్వీకర్తలు పూచీ పడాలన్నది ఆయన అభిప్రాయం. (అంకితం, అక్షరాక్షతలు) కవులకు సన్మానాలు చేయటం అన్నా ఆర్ధికంగా వాళ్లకు వూతం ఇయ్యటమే. అది విస్మరించినవాళ్లను కవి జాతికి ద్రోహం చేసినవాళ్లుగా భావిస్తాడు. దుద్దులు, తుంటరి వంటి ఖండికలు ఆ కోవలోవే (అక్షరాక్షతలు)కవులకు ఎవరైనా ఏమైనా ఇస్తే మధ్యవర్తులు దానిలో వాటా కొట్టెయ్యటం ఖండిస్తాడు( గర్హణీయం, వంశధార) సత్కవికి గౌరవమీయనట్టి సంకటపు పరిస్థితుల (తెలుగుతల్లి, పిల్లనగ్రోవి) గురించి సంతాపం ప్రకటించాడు.

జ్ఞానానంద కవి ఇతరేతర అంశాలు వస్తువుగా వ్రాసిన కవిత్వం అరుదు. వరకట్న సమస్య వస్తువుగా అరణపుగోల, సుంకము వంటి కవితలు పిల్లనగ్రోవి సంపుటిలో కనబడతాయి. వరశుల్కము ఆర్ష సంస్కృతికి పెద్ద మచ్చ అంటాడు కవి. సహగమనం అమానుషత్వాన్ని గుర్తుచేసే కట్నపు దహనాలను ఏవగించుకొన్నాడు. ప్రేమ కలిగినవాళ్ల మధ్య కూడా పెళ్లికికట్నం అవరోధం కావటం సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డాడు.
“కాసుల్ పేరిట గర్హణీయమగు నీ కట్నాల రాకసిన్
దాసోహమ్మనునట్టివారల తగాదాలలోన నైరాశ్య బా
ధా సంసారపు జీవితాన తనువున్ దగ్ధమ్ము గావించు నా
రీ సంకల్పము నాపుచో నచట పర్వెత్తున్ దయా నిర్ఝరుల్”
వరకట్నపు ఆత్మహత్యల పర్వం గురించిన స్పృహతో వ్రాసిన పద్యం ఇది.

మద్యనిషేధకవితాసందేశం, కుటుంబనియంత్రణము మొదలైనవి(పిల్లనగ్రోవి) ప్రభుత్వ పథకాల గురించి వ్రాసినవి కావాలి. క్రైస్తవ సమాజాన్ని సంబోధిస్తూ, క్రీస్తును కేంద్రంగా చేసుకొని కవిత్వం వ్రాయటం జ్ఞానానంద కవి లోని విశేషలక్షణం. పిల్లనగ్రోవి లో క్రిస్మస్ అనే శీర్షికతో వ్రాసిన కవితలు రెండు ఉన్నాయి. క్రీస్తు ప్రశంస గా ఉపదేశము అనే ఖండిక వ్రాసాడు. నాజరేతు ప్రభూ అన్నది మరొకటి. మేలుకొలుపు( వంశధార ) ఆ కోవలోదే.

ఇదీ జ్ఞానానంద కవి ఖండకావ్య వస్తురీతి. ఇక ఆయన వ్రాసిన కావ్యాల వస్తుశిల్ప వివేచన చెయ్యాలి.

(ఇంకావుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply