జైలు నుండి ఉత్తరం

కవీ…
నీ ఉత్తరం
ఖండాంతరాల ఆలింగనం
ఓ విస్మయం…

ఎన్నెన్ని నిఘానేత్రాలు
దాటివొచ్చిందో
ఎన్నెన్ని ఎత్తైన గోడలు
ఎగిరెగిరి వొచ్చిందో
పావురంగా నా ఒడిన వాలింది
సైనిక విముక్తమైన
పాలస్తీనా తల్లిలా నన్నల్లుకున్నది

జైలునుండి వొచ్చిన ఉత్తరం గదా..
ఎంత ఒత్తిడిలో రాశావో
అక్షరాలన్నీ
విరిగిన కొండపల్లి బొమ్మల్లా
చెదిరిన కాలిమువ్వల్లా ఉన్నాయ్

వాక్యం తెగినచోట
వేలుతెగినంత బాధ..


****

ఉత్తరంలో నన్నయితే పొగిడావుగాని
నెర్రెలిడ్సిన భూమి వెనుక
గోడాడిన రైతు గుండెలాగ
గజిబిజి అక్షరాల వెనుక
నీ అలిసిన గుండెను మాత్రం చేరగలిగాను
తుఫానులో చిక్కుకున్న
పడవ రాక కోసం
తీరమంతా కళ్ళయిన
నీ సహచరి నిరీక్షణల్ని ఊహించగలిగాను
ప్రశ్నించినందుకు
పంజరంలో బంధించి
శుష్కదేహాన్ని సూదుల్తో పొడిచే
రాజ్యపు క్రూరత్వానికి విస్తుపోయాను


****

అక్షరాలెంత
గజిబిజిగా ఉంటేనేం
అమ్మతనం అర్థంగాకుండా పోతుందా..
పల్లవించే పాటకూ
ప్రవహించే నదికీ
భాషేమిటి… భావమేమిటి
అడ్డేమిటి… హద్దేమిటి

ఉత్తరం చదువుతూ ఉంటే
అక్షరాల మధ్యనుండి
వేనవేల చేతులు లేచి
ధిక్కార పతాకలై
రెపరెపలాడినట్లే ఉంది
నా కాళ్ళను
సముద్రం చుట్టేసినట్టే ఉంది


****

అయినా
నేను ఎదురు చూస్తున్నది
మరో ఉత్తరంకోసం గాదు..
నీ విడుదల కోసం

అటు చూడు
జైలువాకిట చూపులు పర్చుకు
జగమంతా నీకై నిల్చి ఉంది…

( 18 – 02 – 2021)

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

One thought on “జైలు నుండి ఉత్తరం

Leave a Reply