జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 3

సమకాలీన చారిత్రక ఆధారాల నుంచి, పత్రికల నుంచి జూలై 3 నాటికి తెలుగు సమాజంలో, కనీసం బుద్ధిజీవుల్లో నెలకొని ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకుంటే ఈ జూలై 4 తెల్లవారు జామున జరిగిన పరిణామం యాదృచ్ఛికంగా జరిగినది కాదని, అనివార్యమైనదని, సహజమైనదని, విప్లవ రచయితల సంఘం అనేది ఆ కాలం కన్నబిడ్డ అని తేటతెల్లమవుతుంది.

ఒక ఉదాహరణ చెప్పాలంటే, జూలై 3 నాటి ఆంధ్రప్రభ సంపాదకీయం పేజీలో రెండు కాలమ్ ల నిండా నక్సలైట్ల వార్తలున్నాయి. అప్పటికి సంపాదకీయం పేజీలో కూడ వార్తలు అచ్చు వేసే అలవాటుండేది. ఎనిమిది కాలమ్ ల పేజీలో రెండు, రెండున్నర, మూడు కాలమ్ ల సంపాదకీయం వదిలి, మిగిలిన పేజీ అంతా వార్తలు అచ్చువేసేవారు. జూలై 3 నాటి పత్రికలో దాదాపు మూడు కాలమ్ ల సంపాదకీయాలు, మూడు కాలమ్ లు దేశీయ, ప్రాంతీయ వార్తలతో పాటు, ‘కలకత్తా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీపై నక్సలైట్ల ఎర్రజెండా’ అనే రెండు కాలమ్ ల శీర్షిక కింద ‘మిడ్నపూర్ జిల్లాలో ఇద్దరి మృతి’, ‘కళాశాలపై నక్సలైట్ల దాడి’, ‘17 వేల ఎకరాల ఆక్రమణ’, ‘పోలీసు అధికారులకు హెచ్చరిక’, ‘స్వదేశ్ పత్రిక సంపాదకునికి నక్సలైట్ల బెదిరింపు లేఖ’, ‘ఆంధ్ర నక్సలైట్ల కోసం బొంబాయి పోలీసుల గాలింపు’ వంటిఎనిమిది నక్సలైట్ల వార్తలతో రెండు కాలమ్ లు నింపారు.

అదే విధంగా ఆంధ్ర సచిత్ర వారపత్రిక 10-7-1970 సంచిక ఒక పేజీ నిండా ‘ఏనోట విన్నా నక్సలైట్’ అనే శీర్షికతో ఐదు కార్టూన్లు అచ్చయ్యాయి. ఆ కార్టూనిస్టు ఎవరో తెలియదు, సంతకం లేదు. ఆ కార్టూన్లన్నీ నక్సలైట్లంటే భయం గొలిపేటట్టే, వ్యతిరేకార్థంలోనే ఉన్నాయి. కాని అసలు ప్రధాన స్రవంతి వారపత్రికలో ఒక పేజీ నిండా కార్టూన్లు వేయవలసినంత ప్రబల శక్తిగా, ఏ నోట విన్నా నక్సలైట్లు ఉన్నారన్నమాట.

ఒక్కమాటలో చెప్పాలంటే, అప్పుడు గాలిలో, ప్రధానంగా బుద్ధిజీవులలో నక్సలైట్ భావాలు వ్యాపించి ఉన్నాయి. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం అనివార్యంగా, సహజంగా జరగడానికి ఆ వాతావరణమే కారణమయింది.

కేంద్ర బిందువైన శ్రీశ్రీయే రాకపోయినప్పటికీ, నిర్వాహకులు అభ్యుదయ సాహిత్య సదస్సును యథావిధిగా నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘంతో తన సంబంధాలను తెంచుకుంటున్నట్టు శ్రీశ్రీ చేసిన ప్రకటన సైక్లోస్టైల్డ్ కాపీలు ప్రాంగణంలో పంచిపెట్టారు. ఆంధ్రప్రభలో ఆ మర్నాడు (జూలై 5న) అచ్చయిన వార్తను బట్టి, “అయితే శ్రీశ్రీ నాయకత్వాన కొందరు విప్లవ కవులు ఈ సదస్సుతో సంబంధం లేదని ప్రకటించడంతో సదస్సు అనుకున్న విధంగా జరగలేదు.”

ప్రారంభోపన్యాసం చేసిన తాపీ ధర్మారావుతో పాటు, అధ్యక్షత వహించిన సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సమాచార శాఖ మంత్రి ఎ. వాసుదేవరావు, సెవెన్ స్టార్స్ సిండికేట్ అధ్యక్షుడు బి ఎ వి శాండిల్య, అరసం నాయకులు, ఆహ్వాన సంఘం కార్యదర్శి రాంభట్ల కృష్ణమూర్తి ప్రసంగించారు.

‘అభ్యుదయ సాహిత్య సదస్సులో చీలిక’ అనే శీర్షికతో ఆ రోజు ఆంధ్రప్రభ ప్రచురించిన వార్తాకథనం ఆ నాటి ఉద్వేగభరిత వాతావరణాన్ని కొంతవరకు చిత్రిస్తుంది (ఆ వార్తాకథనంలో కొన్ని తప్పులు, పునరుక్తులు ఉన్నప్పటికీ చరిత్ర కోసం యథాతథంగా ఉటంకిస్తున్నాను) :

“ఎంతో ప్రచారం కావించబడి నేటి ఉదయం ఇక్కడి జూబిలీ హాలులో ప్రారంభమైన అభ్యుదయ సాహిత్య సదస్సుతో తమకెట్టి సంబంధం లేదని విప్లవకవి శ్రీశ్రీ నాయకత్వాన నలుగురు ప్రముఖ కవులు ప్రకటించడంతో ఈ సదస్సుకు ఆదిలోనే విఘాతం ఏర్పడింది.

నేటి సదస్సులో ముఖ్య కార్యక్రమాలు రెండు. అందులో ఒకటి శ్రీశ్రీకి సన్మానం. రెండవది ఆయన ‘మహాప్రస్థానం’ పై చిత్రాల ప్రదర్శన. సన్మానాన్ని తాను స్వీకరించబోనని శ్రీశ్రీ ప్రకటించినా, సదస్సు నిర్వాహకులు చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

కమ్యూనిస్టు ఆధిపత్యంలో గల అభ్యుదయ సాహిత్య సంఘంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక, విప్లవ రచయితల సంఘం అనే కొత్త సంస్థను ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నూతన సంస్థ మరింత శక్తివంతమైన, అర్థవంతమైనదని ఆయన అభివర్ణించారు.

సదస్సులో చీలిక వచ్చినా మామూలుగా సాహితీ సదస్సు ప్రారంభమైంది.

నేటి సదస్సులో ప్రముఖ పాత్ర వహించవలసిన శ్రీశ్రీ సభాస్థలానికి రాలేదు. ఆయనకు రేపు సాయంత్రం 116 సంస్థలు సన్మానం చేయదలచాయి. ఆ సన్మాన సభలో ఆయనకు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి 1,116 ల పర్సును కూడ బహూకరించవలసి ఉంది.

కాని గత రాత్రి కొందరు యువరచయితలు ఆయనను కలుసుకొని విప్లవ రచయితల సంఘం నూతన సంస్థకు అధ్యక్ష పదవిని స్వీకరించవలసిందని నచ్చజెప్పారు. దాని మీదట శ్రీశ్రీ గతరాత్రి తమ సంతకంతో ఒక ప్రకటన చేశారు.

ఆయన అందులో ఇలా పేర్కొన్నారు: “నేను సన్మానాన్ని స్వీకరించకుండా, అభ్యుదయ రచయితల సదస్సులో పాల్గొనే ఉద్దేశంతో 3వ తేదీ ఉదయం హైద్రాబాద్ వచ్చాను. ఈ జూలై 3వ తేదీ రాత్రి మరింత శక్తివంతము, అర్థవంతమైన విప్లవ రచయితల సంఘం అవతరించిందని, నేనీ సంఘం ఆశయాలను మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను. అందువల్ల ఇప్పటి నుంచి నేను నానాటికీ కాలగర్భంలో మరుగున పడిపోతున్న అభ్యుదయ రచయితల సంఘంతో నా సంబంధాలను తెగతెంచుకుంటున్నాను.”

శ్రీశ్రీని ఆంధ్రప్రభ ప్రతినిధి సదస్సులో పాల్గొనడానికి అంగీకరించి, ఇపుడెందుకు తెగతెంపులు చేసుకుంటున్నారని ప్రశ్నించగా ఆయన సమాధానమిస్తూ, అభ్యుదయ సాహిత్య సదస్సు కాలగర్భంలో కలిసిపోతున్నదని, అందువల్ల తాను మరింత శక్తివంతము, అర్థవంతమైన సంస్థను కాంక్షిస్తున్నానని చెప్పారు.

మార్క్స్, లెనిన్ ల సిద్ధాంతాలే శ్రీశ్రీకి శిరోధార్యం. ఆయన వాటిని తప్ప వేటినీ అంగీకరించరు. కొందరు యువ విప్లవ రచయితలు ముందుకువచ్చి, విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి ఆయనను అధ్యక్షుణ్ని చేశారు.”

ఆ వార్తలో భాగంగానే ‘సాహిత్యంలో నక్సలైట్లు’ అనే ఉపశీర్షిక కింద మరికొంత రాశారు: “విప్లవ రచయితల సంఘం అనే నూతన సంస్థను తన అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు కూడా శ్రీశ్రీ నేడు ప్రకటించారు.

ఈ నూతన సంఘానికి ఉపాధ్యక్షులు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి.
కార్యదర్శి శ్రీ కె వి రమణారెడ్డి.
వర్కింగ్ కమిటీ సభ్యులు: నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, వరవరరావు.

ఈ ఐదుగురు వర్కింగ్ కమిటీ సభ్యులు దిగంబర కవులుగా పేరొందారు. తెలుగు సాహిత్యంలో తిరుగుబాటుదారులు అయిన వీరు తెలుగు సాహిత్యంలో నక్సలైట్లుగా ప్రసిద్ధికెక్కారు.”

అదే రోజు ‘అభ్యుదయ రచయితల సంఘం’ అని తుమ్మల వెంకటరామయ్య రాసిన పరిచయ వ్యాసాన్ని కూడ ఆంధ్రప్రభ అచ్చు వేసింది. మరొక పేజీలో పెదాల మీద సిగరెట్ తో శ్రీశ్రీ ఫొటో వేసి, దానికి “అభ్యుదయ సాహిత్య సదస్సుతో సంబంధం లేదని జారీ చేసిన ప్రకటన పాఠంతో శ్రీశ్రీని చిత్రంలో చూడవచ్చు. హోటల్ గది ముందు ప్రకటన పాఠాన్ని అంటించి ఉన్న దృశ్యం ఇందులో చూడగలరు” అని రాసింది. అదే పేజీలో ‘శ్రీశ్రీ ప్రకటన పట్ల 12 మంది రచయితల విస్మయం’ అనే శీర్షికతో మరొక వార్తలో, “అభ్యుదయ రచయితల సంఘానికి చెందిన 12 మంది రచయితలు నేడు శ్రీశ్రీ చేసిన ప్రకటన పట్ల విచారాన్ని, ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ, సదస్సులో శ్రీశ్రీ సంబంధాలను వదులుకున్నట్లు పేర్కొన్నారు.

గత పెక్కేండ్లుగా అభ్యుదయ తెలుగు రచయితల సంఘానికి శ్రీశ్రీ మార్గదర్శకులని వారు పేర్కొన్నారు.

నగరంలో నిన్న రాత్రి ఏడు గంటల వరకు జరిగిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశానికి శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. అభ్యుదయ రచయితల సంఘాన్ని పునరుజ్జీవింప చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అభ్యుదయ రచయితల సంఘాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీశ్రీ నిన్నటివరకూ ఎప్పుడూ కూడా చెప్పలేదు. సమావేశంలో శ్రీశ్రీ అత్యుత్సాహంతో పాల్గొన్నారు కూడా అని ఈ రచయితలు తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

‘రాష్ట్రంలోని అభ్యుదయ భావాలు గల రచయితలందరికీ అభ్యుదయ రచయితల సంఘం ఒక్కటే వేదిక’ అని కూడా వారు వివరించారు.

ప్రకటన చేసిన 12 మంది రచయితల పేర్లు: శ్రీయుతులు పి అప్పలస్వామి, ఆరుద్ర, విద్వాన్ విశ్వం, సి నారాయణరెడ్డి, ఎ సుబ్బారావు, ఎన్ చిరంజీవి, ఎన్ ఉమామహేశ్వరరావు, ఎం వెంకట్రామయ్య, ఆర్ కృష్ణమూర్తి, ఎం రామమోహనరావు, ఎ. బలరామమూర్తి, బి శివరామకృష్ణ”.

(ఆంధ్రప్రభ వార్తలో ఉమారాజేశ్వరరావు పేరు తప్పు గానూ, వెంకట్రామయ్య, బలరామమూర్తి ఇంటి పేర్ల పొడి అక్షరాలు తప్పుగానూ రాశారు. అసలు ఆ రచయితలందరూ తమ పూర్తి ఇంటి పేర్లతోనే – పురిపండా, అనిశెట్టి, నార్ల, నిడమర్తి, తుమ్మల, రాంభట్ల, మహీధర, ఏటుకూరు, బొల్లిముంత – సుప్రసిద్ధులు).

విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం వ్యవస్థానుకూల సంస్థలలో, వ్యవస్థానుకూల భావజాలం ఉన్న వ్యక్తులలో వెంటనే ఎంత వ్యతిరేకతను ప్రేరేపించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.ఈ సంఘం ఏర్పడి, తనదైన మార్గంలో ఎంతో కొంత పని చేసిన తర్వాత, ఆ పని పట్ల, ఆ పని వల్ల వ్యతిరేకత వచ్చి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కాని అప్పటికింకా పనే మొదలుపెట్టని, కేవలం ఫలానా పని చేయదలచుకున్నాము అని ప్రకటన మాత్రమే చేసిన సంఘాన్ని, ఆ సంఘ నాయకులను ఇంతగా విమర్శించడం, నిందించడం, వారి మీద అన్యాయమైన ఆరోపణలు చేయడం చూస్తే విరసం పుట్టుకే వ్యవస్థా నిర్వాహకులలో, యథాస్థితివాదులలో గంగవెర్రులెత్తించిందని అర్థమవుతుంది.

విరసం ఏర్పడిన నాలుగో రోజున, జూలై 8న, ఆంధ్రప్రభ దినపత్రిక ఈ పరిణామాల గురించి నోరి నరసింహశాస్త్రి అభిప్రాయాలు ప్రచురించింది. ఆ మర్నాడు విశ్వనాథ సత్యనారాయణ అభిప్రాయాలు ప్రకటించింది.

శ్రీశ్రీ సన్మానాన్ని తిరస్కరించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని, జూలై 3న పత్రికలలో దిగంబర కవుల ప్రకటన చదవగానే “ఇటువంటిదేదో జరుగబోతున్నదని…పసి కట్టాను” అని నరసింహశాస్త్రి అన్నారు. “శ్రీశ్రీ ప్రధానంగా అవకాశవాది. 116 సాహిత్య సంఘాలు చేయదలచిన సన్మానాన్ని తిరస్కరిస్తే వచ్చే పబ్లిసిటీ కాంక్షే ఎక్కువ ఆకర్షించింది” అన్నారు. సృజన శ్రీశ్రీ సంచిక నాటి నుంచే ఈ “పూర్వకథ” ఉన్నదని, “ఇది నిజముగా శ్రీయుతులు వరవరరావు, కుటుంబరావుల విజయం”అని ఆయన అన్నారు. విరసం భవిష్యత్తు గురించి చెపుతూ “శ్రీశ్రీ విప్లవకవి కాడని రుజువు చేయడానికి ఎక్కువకాలం పట్టదు” అన్నారు. “నక్సల్ బరీ ఉదంతాల వల్ల ఈ మధ్య నక్సలైట్లు అనే శబ్దము పుట్టింది. దానికి రాజకీయ ప్రేరితులైన బందిపోట్లు అని నేనర్థము చేసుకుంటున్నాను. నిజమైన సాహిత్యపు విలువలు దోచివేసి, సాహిత్య పాఠకులను ఖూనీ చేస్తున్న సాహిత్య నక్సలైట్లు చాలా కాలము నుండీ సాహిత్య రంగంలో విలయతాండవము చేస్తున్నారు. ఈ సంగతి కొందరు సహృదయులైనా గుర్తించి, నిర్భయంగా ముందుకు రాగలిగితే, ఈ ఉదంతము ఆంధ్ర సాహిత్య ప్రపంచానికి శుభోదర్కమే కాగలదు” అన్నారు.

ఇక విశ్వనాథ సత్యనారాయణ అయితే తాము ఏమి చెప్పినా రాయరని, పట్టించుకోరని, విప్లవ సాహిత్యకారులకు మాత్రం విపరీత ప్రచారం ఇస్తున్నారని పత్రికల మీద విరుచుకు పడడంతో మొదలుపెట్టి, దాదాపు పూర్తి పేజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు తనకీ పరిణామం తెలియదని, తాను పత్రికలు చూడనని, ఎవరో ఒక ఇన్ కం టాక్స్ అధికారి వచ్చి ఈ విషయం చెప్పి, తనకు తెలియదంటే పత్రిక తెప్పించి చదివి వినిపించాడని అన్నారు. కాని ఆ తర్వాత చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఆయనకు అభ్యుదయ సాహిత్య సదస్సు బహిష్కరణ, విరసం ఏర్పాటు తెలియకపోయినా, మొత్తంగా తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణుల గురించి తెలుసుననీ, వాటి పట్ల వ్యతిరేకత ఉందనీ అర్థమవుతుంది.

సంప్రదాయ సాహిత్యపు గొప్పతనం, తమకే ఎక్కువమంది పాఠకులు ఉన్నప్పటికీ పత్రికలు పట్టించుకోకపోవడం వల్ల తమ గురించి తెలియకపోవడం గురించి కొంత సేపు మాట్లాడారు. కందుకూరి వీరేశలింగాన్నీ, గురజాడ అప్పారావునూ, వాళ్లను తలకెత్తుకుంటున్న కమ్యూనిస్టులనూ విమర్శించారు. ఆయన ఆ సహజ ధోరణిలో మాట్లాడుతూ పోతుండగా, విలేఖరి మళ్లీ ప్రస్తుత సందర్భానికి తెచ్చి, “ఈ విప్లవ రచయితలను సాహిత్య నక్సలైట్లు అన్నారు. మీరు చదివారు కదా” అని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించారు.

దానికి జవాబిస్తూ, “చదివాను. మనం ఏమి చెయ్యగలుగుతాము? మన హోం మంత్రి శ్రీ వెంగళరావు గారు. వారి దృష్టి ఈ సాహిత్య నక్సలైట్ల మీద పడకపూర్వం, మనం కూడ ప్రొద్దువాక రైతుకు మల్లే అయితే మన ఖర్మ” అని జవాబిచ్చారు.

ఈ జవాబును కాస్త జాగ్రత్తగా చూడవలసి ఉంది. అందులో రెండు అంశాలున్నాయి. ఒకటి, విప్లవ రచయితల మీద చర్యలు తీసుకోవలసిన బాధ్యత హోం మంత్రిదనే సూచన. అంటే ఇది ఒక సాహిత్య ధోరణి అని, దీనిలో ఉన్నవి భావాలనీ, కావాలంటే ఆ భావాల మీద విమర్శను భావాలతో ప్రకటించవచ్చుననీ కాక, భావ సంఘర్షణ సాగించవచ్చుననీ కాక, రాజ్య భౌతిక చర్యల గురించి బహుశా మొట్టమొదట ప్రస్తావించినది విశ్వనాథ సత్యనారాయణే అనాలి.

రెండోది, వెంగళరావు దృష్టి విప్లవ రచయితల మీద పడక ముందే ఎవరైనా “ప్రొద్దువాక రైతుకు మల్లే అయితే” అది వారి ఖర్మ అన్నారు. ప్రొద్దువాక అనేది తొలిదశలో విప్లవోద్యమం జరిపిన ఒక చర్యకు ప్రస్తావన. అక్కడ జరిగినటువంటి ప్రమాదం సాహిత్యలోకానికి కూడ జరుగుతుందనీ, ప్రభుత్వ చర్యలు లేకపోతే అది ఖర్మ అనీ విశ్వనాథ అభిప్రాయం.

ప్రొద్దువాక కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో ఒక గ్రామం. అక్కడ కురుగంటి అప్పయ్య శాస్త్రి అనే 160 ఎకరాల భూస్వామి ఇంటి మీద 1970 ఏప్రిల్ 26-27 రాత్రి నక్సలైట్లు దాడిచేశారు. అది కేవలం ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి జరిగిన దాడే, బందిపోటు మాత్రమే అని సెషన్స్ కోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు కూడ అన్నాయి. అయినప్పటికీ, అప్పుడు జరిగిన ఘర్షణలో అప్పయ్య శాస్త్రి చనిపోయాడు. ఆ హత్యారోపణ ముద్దాయిలైన ఇద్దరిని పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేశారు. మరో ఇద్దరికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా, హైకోర్టు యావజ్జీవశిక్షగా మార్చింది. కోర్టు విచారణలూ, ఎన్ కౌంటర్ హత్యా, శిక్షలూ ఆ తర్వాత జరిగాయి గాని, ఘటన జరిగిన రెండున్నర నెలల లోపే, విశ్వనాథ సత్యనారాయణ ఆ ఘటనను ఉదహరించి, దాన్ని సాహిత్య పరిణామాలతో ముడివేశారంటే అప్పటి యథాస్థితి వాదులలో నక్సలైట్ల పట్ల గూడు కట్టుకున్న దురభిప్రాయాలకు అది నిదర్శనం.

అభ్యుదయ సాహిత్య సదస్సు బహిష్కరణ, విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం తెలుగు సాహిత్యకారులందరి ఆలోచనలనూ లోలోపలి నుంచి కదిల్చాయి. విశాఖపట్నంలో ఫిబ్రవరిలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంలో ప్రారంభమైన విభజన మరింత లోతుగా, విస్తారంగా, తీవ్రంగా జరిగింది. నోరి నరసింహశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రధాన, ప్రభావశీల స్పందన అలా ఉంచి, సగటు యథాస్థితివాదులు, సంప్రదాయవాదులు కూడ స్పందించారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, అప్పటికే వరంగల్ లో ఏర్పడి ఉన్న సంప్రదాయ సాహిత్యవేత్తల వేదిక సాహితీ బంధు బృందం కార్యదర్శిగా పేర్వారం జగన్నాధం ‘శ్రీశ్రీ క్షమాపణ చెప్పుకోవాలె’ అని జనధర్మ వారపత్రిక 1970 జూలై 16 సంచికలో రాసిన ఉత్తరం చూడాలి.

శ్రీశ్రీని సన్మానించడానికి ఆహ్వానం పొందిన 116 సంస్థలలో తమ సంస్థ కూడ ఒకటని, ఆ అవకాశం దొరికినందుకు ఎంతో ఉత్సాహంతో తమ ప్రతినిధి హైదరాబాద్ వెళ్లాడని ఆయన రాశారు. “వస్తానని ముందు ఆమోదాన్ని తెలిపి, నిర్వాహకుల భత్యంతో హైదరాబాద్ చేరుకొని, ఎవరో కొందరు బచ్చాల మాటలు విని అర్ధరాత్రి అభిప్రాయం మార్చుకొని చివరికి ఇలా మోసం చేయడం, ఒక్క సెవెన్ స్టార్స్ సిండికేట్ వారినే కాక, 116 సంస్థలను కూడా అవమానించినట్లు భావిస్తున్నాము. అంతేకాదు, ఈ అవమానం సమస్తాంధ్ర ప్రజలకున్నూ జరిగినట్లే. శ్రీశ్రీ ఇంతటి నైచ్యానికి దిగజారుతాడని మేమెన్నడూ ఊహించలేదు. తాను చేసిన అవమానానికి, మోసానికి పశ్చాత్తాపపడి సమస్తాంధ్ర ప్రజలకు శ్రీశ్రీ క్షమాపణ చెప్పుకుంటాడని ఆశిస్తున్నాము. సన్మానానికి పూనుకొని విచ్చేసిన ఇతర సంస్థలన్నీ కూడా ఈ అసభ్య చర్యను ఖండించాలని కోరుతున్నాము” అని ఆయన రాశారు.

ఈ ఉత్తరానికి అనుకూల స్పందనలు రాష్ట్రంలో మరెక్కడైనా వచ్చాయో పరిశోధించాలి గాని, జనధర్మ పత్రికలో మాత్రం ఈ ఉత్తరాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాఘవరావు – బుచ్చిరెడ్డి, టి వెంకటరెడ్డి రాసిన రెండు ఉత్తరాలు అచ్చయ్యాయి.

కుతకుత ఉడుకుతున్న సాహిత్య వాతావరణానికి, సాహిత్యంలో వర్గపోరాటం తీవ్రతరమవుతున్న వాతావరణానికి ఇవి సూచనలు. విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించిన ఆ వాతావరణానికే మరొక ప్రధాన సూచిక ‘మార్చ్’ కవితా సంకలనం.

యాబై ఏళ్లు వెనక్కి తిరిగి ఇప్పుడు ఆలోచిస్తే ‘మార్చ్‘ కవితా సంకలనం ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించాలని పిలుపునిచ్చిన కవులు, సరిగ్గా ఆ సదస్సు నాటికి వెలువడేలా ఈ సంకలం తయారు చేయడం ఒక విచిత్రం. లేదా, ఆ బహిష్కరణ సహజంగా మరొక సంఘటిత కార్యాచరణగా పర్యవసిస్తుందని, ఆ నూతన పరిణామానికి సూచికగా ఈ పుస్తకం నిలుస్తుందని వారు అనుకున్నారేమో తెలియదు.

అప్పటివరకూ వ్యక్తిగతంగా ఒకే కవి సంపుటమో, సమష్టిగా వివిధ కవుల సంకలనమో వెలువడినప్పుడు తప్పనిసరిగా కవి/కవుల పేర్లో, కనీసం కలం పేర్లో ఉండేవి గాని, ఈ 36 కవితల, 82 పేజీల సంకలనంలో ఒక్క కవితకు కూడ కవి పేరు ఇవ్వలేదు. ముఖపత్రం మీద తెలుపు నేపథ్యంలో ఎరుపులో ‘ప్రజను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి’ అని పైన చిన్న అక్షరాలు, మధ్యలో ‘మార్చ్’ అని పెద్ద అక్షరాలు, కింద ‘విప్లవ కవులు’ అని మళ్లీ చిన్న అక్షరాలు ఉన్నాయి. ప్రచురణ సంస్థ పేరు లేదు. అచ్చయిన ప్రెస్ పేరు లేదు గాని “పి. కిషన్ రావు చేత ముద్రించి, ప్రచురించబడినది” అని ఒకే ఒక్క వాక్యం, అక్కడే “ప్రతులకు” అని కిషన్ రావు చిరునామా ఉన్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే అప్పటికే ప్రారంభమైన విప్లవోద్యమ అజ్ఞాత, రహస్య ప్రచురణల సంప్రదాయాన్ని బహిరంగ, కవిత్వ ప్రాంగణంలోకి తీసుకువచ్చింది మార్చ్. అప్పటికి ఆరు నెలల ముందే బహిరంగంగానే శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని సమర్థించిన ‘తిరుగబడు’ సంప్రదాయానికి భిన్నంగా, ‘తిరుగబడు’ వెనుక ఉన్న కవులే, ‘మార్చ్’ ను ఇలా ప్రచురించడం భవిష్యత్తులో మరింతగా పెరగనున్న నిబద్ధ కార్యాచరణకు ఒక సూచన కావచ్చు.

ఈ సంకలనం విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి ముందే తయారైనప్పటికీ, ఇది భవిష్యత్తులో విప్లవ రచయితల సంఘానికి కవిత్వం పట్ల ఎటువంటి అవగాహన ఉండబోతుందో సూచించింది. “ప్రజను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి” అని ముఖపత్రం మీద ఉండడం మాత్రమే కాదు, మొట్టమొదటి కవితగా, ప్రత్యేకంగా చుట్టూ బార్డర్ కట్టి అచ్చువేసిన ‘మైక్రోస్కోపిక్’ కవిత సమాజం మీద, సామాజిక చైతన్యం మీద, అప్పటికి సామాజిక చైతన్యానికి నాయకులుగా ఉన్నవారి మీద విస్పష్టమైన అవగాహనను ప్రకటించింది. మారుతున్న కాలంలో ఈ సమాజంలో ఏమి చేయవలసి ఉన్నదో, అందుకు అవసరమైన సామాజిక చైతన్యాన్ని ఎవరు ఎలా ముందుకు తీసుకుపోవాలో సూచించింది.

ఒకరకంగా విప్లవ కవిత్వానికీ, సాహిత్యానికీ ఈ కవిత ఒక మార్గదర్శి. అప్పటికి కనీసం మూడు సంవత్సరాలుగా విప్లవ కవిత్వం ఉన్నది. కాని తొలిదశలో విప్లవ కవిత్వం రాసిన సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యనారాయణ, పార్వతీపురం కుట్రకేసు నిందితులు అందరూ కూడ విప్లవోద్యమంలో భాగంగా, తమ నిత్య పోరాట అవసరం కోసం రాశారు. తిరుగబడు కవులు విప్లవోద్యమానికి తమ స్నేహహస్తాలు అందిస్తున్నామంటూ రాశారు. ‘మైక్రోస్కోపిక్’ మొదటిసారిగా బైటి కవులు విప్లవోద్యమంలో ఎలా భాగం కావాలో నిర్దేశించింది. ఈ కవితను అప్పటికే విప్లవోద్యమ నాయకుడిగా, అజ్ఞాత జీవితం గడుపుతున్న కె జి సత్యమూర్తి (అప్పటికింకా శివసాగర్ అనే పేరు కూడ లేదు) రాయడం ఆ తర్వాత ఏర్పడిన, కొనసాగిన విప్లవోద్యమ, బహిరంగ ప్రజా జీవన రంగాల అన్యోన్య మైత్రికి సూచిక.

బహుశా సంకలనకర్తలు ఊహించినట్టుగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ ను నిషేధించింది. ముప్పై ఆరు కవితలు ఉన్నప్పటికీ, కొన్ని కవితలను ప్రత్యేకంగా నిషేధపుటుత్తర్వులలో పేర్కొన్నప్పటికీ, కవులెవరూ తెలియదు గనుక కేసు ప్రచురణకర్త పి. కిషన్ రావు మీద మాత్రమే పెట్టారు. ఆయన స్వగ్రామం చెన్నూరులో ఆయనను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసు అధికారి ఆయన మీద చెయ్యి కూడ చేసుకున్నాడు. ఈ పుస్తకం కరీంనగర్ లో నిర్మలా ప్రిటింగ్ ప్రెస్ లో అచ్చయిందనే అనుమానంతో ఆ ప్రెస్ యజమాని, విరసం సభ్యుడు బి విజయకుమార్ ను అరెస్టు చేసి వేధించారు. కిషన్ రావు మీద మార్చ్ కు సంబంధించి ‘రాజద్రోహం’ నేరారోపణతో పాటు, విప్లవోద్యమ నాయకుడు పి. రామనర్సయ్యకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణ కూడ చేశారు.

వరంగల్ సెషన్స్ కోర్ట్ ఆశ్రయం కేసును కొట్టివేసి, రాజద్రోహానికి మాత్రం ఆరునెలల కఠిన కారాగార శిక్ష లేదా ఐదు వందల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పు మీద హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు శిక్షను, నిషేధాన్ని నిర్ధారించారు. ఆ రకంగా విప్లవ రచయితల సంఘం ఎదుర్కోనున్న దారుణ దమన కాండను కూడ మార్చ్ సూచించింది.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply