జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 2

(విరసం చరిత్ర ‘అరుణాక్షర అద్భుతం’ పరంపరలో ఈ అధ్యాయపు మొదటి భాగం ఫిబ్రవరి 15, 2020 సంచికలో వెలువడిన తర్వాత కాస్త అవాంతరం ఏర్పడింది. అనేకానేక అనివార్య కారణాల వల్ల జరిగిన ఈ ఆలస్యానికి మన్నించమని కోరుతూ, మిగిలిన అధ్యాయాలను వీలైనంత త్వరలో, వెంట వెంటనే రాస్తానని హామీ ఇస్తున్నాను.)

ఇప్పటి దాకా గడిచినవి 1970 జూలై 3కు ముందరి పరిస్థితులు. అవన్నీ ఎంత సంక్లిష్టమైనవీ సంకీర్ణమైనవీ అంటే ఇవాళ గడిచిపోయిన ఘటనలనూ పరిణామాలనూ ఒక సరళరేఖలో పెట్టగలుగుతున్నాం గాని ఆనాటికి మాత్రం అది గందరగోళానికీ ప్రణాళికాబద్ధ ఆచరణకూ మధ్య, సద్యో స్పందనకూ క్రమబద్ధ ఆలోచనకూ మధ్య, వ్యక్తిగత ఆవేశకావేషాలకూ సమష్టి ఆలోచనాచరణకూ మధ్య ఒక స్పష్టాస్పష్ట గతితారిక ఐక్యతా-ఘర్షణా క్రమం. ఆ సంక్లిష్ట చారిత్రక క్రమపు అనివార్య ఫలితంగా రూపు దాల్చినది జూలై 4.

అంతకు ముందరి ఐదు నెలల గందరగోళం మధ్య తాను ఏ వైఖరి తీసుకోవాలో ఆలోచిస్తూ, మథనపడుతూ, చివరికి అభ్యుదయ సాహిత్య సదస్సు విషయంలో తన విచికిత్సను శ్రీశ్రీ బహిరంగంగానే ఆంధ్రప్రభ ఉత్తరంలో ప్రకటించారు (ఆ ఉత్తరాన్ని ఆయన ఆంధ్రప్రభతో పాటు విశాలాంధ్రకు కూడ పంపించానని 1971లో రాసిన మరొక వ్యాసంలో అన్నారు గాని అది విశాలాంధ్రలో అచ్చయినట్టు లేదు). ఆ ఉత్తరంలో తాను చేయగల అన్ని అవకాశాలనూ పేర్కొన్నప్పటికీ, జూలై 3 ఉదయానికి హైదరాబాదు చేరారు. సెవెన్ స్టార్స్ సిండికేట్ బుక్ చేసిన గదిలోనే (ద్వారకా హోటల్) దిగారు.

కె వి రమణా రెడ్డి కూడ సదస్సులో పాల్గొనే ఉద్దేశం లేకపోయినా, సదస్సు గురించి అప్పటికే ప్రతికూలమైన ప్రకటనలు చేసి ఉన్నా హైదరాబాదు వచ్చి న్యూమైసూర్ కేఫ్ లో దిగారు. సదస్సును బహిష్కరించమని పిలుపు ఇచ్చిన దిగంబరకవులు ఎట్లాగూ హైదరాబాదులోనే ఉన్నారు. సదస్సును బహిష్కరించమని పిలుపు ఇచ్చిన వరవరరావు, తిరుగబడు కవులు కూడ జూలై 3 నాటికే హైదరాబాదు చేరారు. ఈ పరిణామక్రమానికి తొలి బీజం వేసిన విశాఖపట్నం నుంచి రాచకొండ విశ్వనాథశాస్త్రి, చలసాని ప్రసాద్ కూడ ఆ నాటికే హైదరాబాద్ చేరారు.

ఈ సదస్సును బహిష్కరించమని పిలుపునిస్తూ, సదస్సు నిర్వాహకులనూ ఉద్దేశాలనూ విమర్శిస్తూ జూలై 3 నాటికే హైదరాబాదులో కనీసం అరడజను కరపత్రాలు వెలువడ్డాయి. ఇలా “రంగురంగుల కరపత్రాలతో” శ్రీశ్రీని, ఇతర పెద్దలను అదిరించి బెదరించి లొంగదీసుకోవాలని దిగంబరకవులూ వారి మిత్రులూ తీవ్ర ప్రయత్నం చేశారని కూడ అప్పటి అభ్యుదయ రచయితల సంఘం నాయకులు ఆరోపించారు.

ఆ అరడజను కరపత్రాలు: 1. “రా సమరానికి”, 2. “ప్రజా పక్షం గెలుస్తుంది”, 3. “శ్రీశ్రీ సాయుధ విప్లవ సందేశాన్ని దిగమింగడానికే విప్లవ ద్రోహులు శ్రీశ్రీ సన్మానానికి సాహసిస్తున్నారు”, 4. “ఈ పగటివేషగాళ్ల రంకు రాజకీయ సినీ కంపు సాహిత్య సంతని బహిష్కరిస్తున్నాం”, 5. “శకుని పాచికలు శకుని మొహాన”, 6. “ప్రజను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేటి కవి”.

వీటిలో మొదటి మూడూ అక్కడక్కడ ఉటంకించిన భాగాలు తప్ప పూర్తిగా ప్రస్తుతం లభించడం లేదు. వీటిలో రెండోది, “విద్యుల్లత, కరీంనగర్” పేరుతో వెలువడింది. మూడోది “వీర తెలంగాణ విప్లవ విద్యార్థులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం” పేరుతో వెలువడింది. నాలుగోదీ, ఐదోదీ అనంతం రాసిన “తెలుగు సాహిత్యంలో కల్లోల క్షీణ దశాబ్దాలు 1965-85’ లో చేర్చారు. ఆరోది పేరు లేకుండా వచ్చిన కె జి సత్యమూర్తి కవిత.

ఈ కరపత్రాలు నిజానికి జూలై 4-5 తేదీల్లో సదస్సు దగ్గర పంచడానికి తెచ్చినవి గాని, ఆ సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే మరింత లోతైన చారిత్రక పరిణామాలు జరిగిపోయాయి. ఇక ఆ కరపత్రాలకు ఒక గుణాత్మక మార్పుకు దోహదం చేసిన, చివరి కుదుపు ఇచ్చిన చారిత్రక ప్రాధాన్యత మిగిలింది.

అయినా జూలై 4 ఉదయం సదస్సు దగ్గర ఈ కరపత్రాలలో కొన్నిటిని పంచడానికి వరంగల్, జమ్మికుంటల నుంచి వచ్చిన విద్యార్థి యువజనులు ప్రయత్నించగా, అరసం కార్యకర్తలు వారిని అడ్డుకుని, కొట్టి, ఒక గదిలో నిర్బంధించారు. అలా నిర్బంధించడం మంచిది కాదని, వారిని విడుదల చేయకపోతే తాము కూడ సభలను బహిష్కరించవలసి వస్తుందని ఆరుద్ర వంటి ఒకరిద్దరు పెద్దలు అన్న తర్వాత వారిని విడుదల చేశారు. అలా నిర్బంధితులైన యువకులలో ఆ తర్వాత విప్లవోద్యమ నాయకుడైన, అప్పటి జమ్మికుంట విద్యార్థి నల్లా ఆదిరెడ్డి కూడ ఉన్నారని సమాచారం.

ఈ కరపత్రాలలో కనీసం రెండు వరంగల్ లో, ఒకటి గాని, రెండు గాని కరీంనగర్ లో అచ్చయి వచ్చాయి. “శకుని పాచికలు శకుని మొహాన” అనే కవిత సహదేవ్ అనే పేరు మీద అచ్చయింది. ఈ కలం పేరు అంతకు ముందూ, ఆ తర్వాతా కూడ వరవరరావు వాడినది. ఐదుగురు అన్నదమ్ములలో చివరివాడుగా ఆయన ఈ పేరు వాడారు. కాని ఈ కవిత తర్వాత ఆయన సంపుటాలలో వేటిలోనూ చేరలేదు. ఈ కవిత ఆనాటి సాహిత్య ఆధిపత్య శక్తుల మీద ఒక పదునైన విమర్శ.

“ఈ పగటివేషగాళ్ల రంకు రాజకీయ సినీకంపు సాహిత్య సంతని బహిష్కరిస్తున్నాం” కరపత్రం చివర “విప్లవ సాహిత్యాభిలాషులు” అని సంతకం ఉంది గాని దాని భాష వల్ల, అంతర్గత సాక్ష్యాల వల్ల బహుశా దిగంబర కవులు రాసినదని అనిపిస్తుంది.

అప్పటికే అజ్ఞాత వాసంలో ఉండి కవిత్వం రాస్తూ, హైదరాబాదులో శ్రీపతి ద్వారా దిగంబర కవులకూ, తిరుగబడు కవులకూ, వరవరరావుకూ పరిచితులైన కె జి సత్యమూర్తి రాసిన “ప్రజను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేటి కవి” అనే సుప్రసిద్ధ కవితా పాదంతో అంతమయ్యే ‘మైక్రోస్కోపిక్’ కవిత కూడ ఒక కరపత్రంగా జూలై 3 నాటికి వెలువడింది.

అలాగే, సరిగ్గా ఆ రోజుకే కవుల పేర్లు లేకుండా ‘మార్చ్’ కవితా సంకలనం కూడ వెలువడింది. ముఖపత్రం మీద తెలుపు నేపథ్యంలో ఎరుపు అక్షరాలతో, పైన “ప్రజను సాయుధం చేసున్న రెవల్యూషనరీ నేటి కవి” అనే వాక్యం, ‘మార్చ్’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కింద “విప్లవ కవులు” అని మాత్రం వెలువడిన ఈ సంపుటానికి ప్రచురణకర్తగా పెండ్యాల కిషన్ రావు పేరు, ఆయన చెన్నూరు చిరునామా, ముద్రణ జరిగిన నిర్మలా ప్రింటింగ్ ప్రెస్, కరీంనగర్ తప్ప అందులోని కవుల పేర్లేవీ లేవు.

శ్రీశ్రీ మద్రాసు నుంచి విమానం దిగిన దగ్గరి నుంచీ వెంట ఉండి, ద్వారకాలో మరెవ్వరూ కలవకుండా అరసం నాయకులు “పహారా”లో ఉంచారని కె వి రమణారెడ్డి అప్పుడే ఆరోపించారు. ఆ ద్వారకా హోటల్ లోనే ఆరుద్ర, విద్వాన్ విశ్వం తదితరులు కూడ ఉన్నారు.

జూలై 3 మధ్యాహ్నం తర్వాత విద్వాన్ విశ్వం గదిలో అరసం కార్యవర్గ సమావేశం జరిపారు. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా, 1955 ఆంధ్రా ఉప ఎన్నికల ఫలితాల నాటి నుంచీ దాదాపు పనిచేయకుండా, జీవచ్ఛవంగా ఉన్న అరసంకు కాయకల్ప చికిత్స చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఈ కార్యవర్గ సమావేశంలో మొదటి తీర్మానంలో స్వయంగా వారే “ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించి, అందుకోసం ఒక నిర్మాణ సంఘంగా ఇక్కడ సమావేశమైన రచయితలు ఏర్పడాలని నిర్ణయించడమైనది” అని రాసుకున్నారంటే అప్పటికి ఉన్న స్థితి తెలుస్తుంది. ఈ సమావేశానికి శ్రీశ్రీనే అధ్యక్షుడిగా పెట్టుకున్నారు.

ఆ సాయంత్రం బద్రూకా కాలేజి తెలుగు విద్యార్థి సంఘం సమావేశానికి అతిథులుగా శ్రీశ్రీ, ఆరుద్రలు వెళ్లవలసి ఉంది గనుక అరసం కార్యవర్గ సమావేశం 7 గంటలకు ముగించి ఆ ఇద్దరూ ఒకే కారులో బద్రూకా కాలేజికి వెళ్ళారు. బద్రూకా కాలేజి సభ అయిపోయిన తర్వాత అదే కారులో శ్రీశ్రీ ఎక్కి కూచోగా, మరొకవైపు తలుపు తెరిచిన హరి పురుషోత్తమరావు ఆయనను దిగమని, తాను తీసుకువెళ్తానని అన్నారు. శ్రీశ్రీ ఒకవైపు నుంచి దిగి ఆరుద్ర మరొకవైపు నుంచి ఎక్కగా కారు ద్వారకాకు వెళ్లిపోయింది.

శ్రీశ్రీని హరి పురుషోత్తమ రావు న్యూ మైసూర్ కేఫ్ లో ఉన్న కె వి రమణారెడ్డి గదికి తీసుకు వచ్చారు. అప్పటికే అక్కడ దిగంబరకవులు నలుగురు, వరవరరావు, చలసాని ప్రసాద్, రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉన్నారు.

అప్పటికే శ్రీశ్రీ మీద అరసం నాయకులు పెట్టిన కాపలాను బట్టి, ఐదు నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలను బట్టి, అరసం నాయకులు ఆ గదికి కూడ వచ్చి శ్రీశ్రీని తీసుకుపోతారేమోననే అనుమానంతో, అందరూ ఇంపీరియల్ హోటల్ కు చేరి అక్కడ గది తీసుకున్నారు.

బద్రుకా కాలేజి సభ 9 గంటలకు అయిపోయి ఉంటుందనుకుంటే వీళ్లందరూ ఇంపీరియల్ హోటల్ కు 10-11 మధ్య చేరి ఉంటారు. అప్పటి నుంచి రెండు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత దాదాపు ఒంటి గంటకు విప్లవ రచయితల సంఘం ఏర్పాటు నిర్ణయం జరిగి, ఆ నిర్ణయాన్ని కెవి రమణారెడ్డి తన చేతి రాతతో ఒక ప్రకటన తయారు చేశారు. శ్రీశ్రీ దాని మీద తొలి సంతకం చేసి ఒంటి గంటా ఏడు నిమిషాలు అని కచ్చితమైన సమయం వేశారు. ఆ తర్వాత వరుసగా అక్కడ ఉన్న పద్నాలుగు మందీ – కె వి రమణా రెడ్డి, వరవరరావు, జ్వాలాముఖి, రాచకొండ విశ్వనాథశాస్త్రి, నిఖిలేశ్వర్, రంగనాథం, శ్రీపతి, నగ్నముని, ఉమామహేశ్వర రావు, కేశవరావు, శ్రీనివాస రావు, ఎస్ హరి పురుషోత్తమ రావు, పినాకపాణి, సి ప్రసాద్ – సంతకాలు చేశారు.

అలా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ఉజ్వలమైన సందర్భం ప్రారంభమైంది. పోరాడుతున్న ప్రజల పక్షాన తమ కలాన్నీ గళాన్నీ ఉపయోగిస్తామని బహిరంగంగా నిర్ద్వంద్వంగా స్పష్టంగా ప్రకటించిన ఒక సాహిత్య నిర్మాణం సంఘటితమైంది.

“విప్లవ రచయితల సంఘం ఏర్పడక ముందు నుంచీ దాని అవసరం గురించి ఉత్తర ప్రత్యుత్తరాలలోనూ సంభాషణలలోనూ క్రమేపీ ఒక గుర్తింపు కలుగుతూ వచ్చింది. విశాఖపట్నంలో శ్రీశ్రీ సన్మానం జరిగిన నాటి నుంచీ ఇది ఆచరణీయమైన ప్రతిపాదనగా రూపొందింది….ఈ పరిణామంలో యువకులు నిర్వహించిన పాత్ర అత్యంత ప్రముఖమైనది. శ్రీశ్రీనిగానీ మరొకరినిగానీ “అదరించి బెదరించి లొందదీసుకోవాలని దిగంబరకవులూ వారి మిత్రులూ చాలారోజులుగా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు” అని తుమ్మల వారు ఒక వ్యాసంలో (విశాలాంధ్ర 13.7.70) అన్నారు. ఇది నిజం కాదన్నా వారు నమ్మరు. శ్రీశ్రీకి ఉత్తరాలు వెళ్లినమాట నిజమే. సదస్సులో పాల్గొనవద్దని పదిమందీ పది మాటలు చెప్పింది నిజమే. పాల్గోడానికి ఆయన తన సంసిద్ధతను తెలిపినప్పుడు శ్రీశ్రీని విమర్శించిందీ వాస్తవమే. అయితే ఇవి బెదిరింపులేనా? తుమ్మలవారు వర్ణించినట్లు సదస్సు ముందూ వెనకా అచ్చుపడి వచ్చిన “రంగురంగుల కరపత్రాలు” చూస్తే ఇవి బెదిరింపులు కావు, కర్తవ్యబోధనలని తెలుస్తుంది. అవి శ్రీశ్రీని మాత్రమే ఉద్దేశించి చెప్పినవి కావు. ఈ చారిత్రక దశలో రచయితలు – ముఖ్యంగా “అభ్యుదయ” రచయితలు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి గుర్తు చేసినవనీ తెలుస్తుంది” అని కె వి రమణా రెడ్డి 1970 ఆగస్ట్ సంచిక సృజనలో రాసిన మాటలు విరసం ఏర్పాటు ఒక క్రమ పరిణామంలో అనివార్య భాగమని తెలుపుతాయి.

ఆ చరిత్రాత్మకమైన పరిణామం గురించి ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు చర్చోపచర్చలు, వాద వివాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, అసత్యాలు, అర్ధసత్యాలు చెలరేగాయి. సాంప్రదాయిక సాహిత్య శిబిరం, ప్రభుత్వం, ప్రభుత్వానుకూల సాహిత్య శిబిరం మాత్రమే కాక, భారత కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులు ఈ పరిణామం మీద విపరీతమైన విమర్శలు చేశారు. నిందారోపణలు గుప్పించారు. విరసం నాయకులు, ముఖ్యంగా కె వి రమణా రెడ్డి సవ్యసాచిలా ఈ విమర్శలకూ నిందలకూ సమాధానాలు ఇచ్చారు.

(మిగతా వచ్చే సంచికలో)

శకుని పాచికలు శకుని మొహాన
– సహదేవ్

యాబై ఐదూ ఈ సారి సన్మానం ముసుగేసుకుని వచ్చావా?
జనకబంధ మంత్రీ, విశాలాంధ్ర వాళ్లతో కుమ్మక్కయి
రాజధాని నగరంలో నక్సలైట్ కవి ‘సన్మానానికి’ పూనుకున్నావా?
విశాల సాహిత్య వ్యాపారాంధ్రా
లెనిన్ శతజయంతి తిరునాళ్లలో గిట్టుబాటు కాలేదా?
గజ్జెకట్టిన ముసలిదాని నాట్యం గతి తప్పిందా?
ప్రజా పోరాట ‘తెలంగాణా’ను పోలీసు యాక్షన్ కు అంకితం చేసిన కుందుర్తీ
‘అగ్నిధార’ ‘రుద్రవీణ’లను మద్రాసు సినిమాలకు అమ్ముకున్న దాశరథీ
(నిన్ననే శ్రీశ్రీని ఇన్ ఖిలాఫ్ కవి అనీ నీ అన్ననీ ఎంతో ఇదిగా రాసావే)
ఇస్కస్ భట్రాయునితో
ఇనాముల ఇమాందారు రాముని తమ్మునితో
లాలూచీపడి
ఆరుద్ర సోమయాగానికి హోతలుగా వస్తున్నారా?
ప్రజాతంత్రవాదీ కాళోజీ
నీ ఇంట్లోకి తన ఇంట్లోకి వలె వచ్చిన శ్రీశ్రీ
నైజాం కాలంలో ఏం చేస్తున్నాడో చెబుదూ రావయ్యా
స్వతంత్ర పార్టీ టికెటిస్తాం
‘పెద్ద పెద్ద కబుర్లు’ సెప్పిన కవికి
ఆహ్వానం హమాలీ సంఘానికి పోయి
అడ్రస్ దొరక్క తిరిగొచ్చిందా?
(రాజమండ్రి లక్ష్మీ ఏజన్సీకి రీడైరెక్టు చేయండి)
రమణారెడ్డీ ఏసు క్రీస్తు శిష్యులలో నువ్వు కూడా చేరిపోతావా?
విశాఖ మయసభలో పరాభవం చెందిన దుర్యోధనుడు
జూదానికి పిలుస్తున్నాడు, శ్రీశ్రీ
వస్తే వచ్చావు
నీ పక్షం వహించిన తమ్ములు
విప్లవ కవులను విద్యార్థులను మాత్రం
అస్త్ర సన్యాసం చెయ్యమని చెప్పకు
అభ్యుదయ సాహిత్య సదస్సు
పచ్చీసు, త్రీసు, బుడ్డీసు
పైపందెం దూగ బెట్టుకో నక్షత్రకా
చంపుడు పందెం పుట్టలేదా పాపం!

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply