జీవితమంత విస్తృతం, భవిష్యత్తుకొక అవసరం – చెహోవ్ సాహిత్యం

తెలుగు సాహిత్య పాఠకులకు 2022 వ సంవత్సరం అందించిన ఒక గొప్ప కానుక, ఆంటన్ చెహోవ్ రాసిన వంద కథల అనువాద గ్రంథం. తెలుగు పాఠకుల అభిరుచిని ఉన్నతీకరించటంలో తోడ్పడిన రష్యన్ రచయితలలో చెహోవ్ కు ముఖ్యమైన స్థానం ఉన్నది.

సోషలిస్టు స్వప్నాన్ని సాకారం చేసిన మొదటి దేశంగా రష్యానూ, అక్కడ సాగిన విప్లవోద్యమాన్ని చిత్రించిన సాహిత్యాన్నీ ప్రపంచం లోని ప్రగతిశీల శక్తులు సొంతం చేసుకున్నాయి. యుద్ధ కాలంలో ప్రజలు చూపిన సాహసాలనూ, త్యాగాలనూ వివరించిన సాహిత్యం ఎంతగా ప్రాచుర్యం పొందిందో,ఆ పోరాటానికి పరోక్షంగా భూమికను సిధ్ధం చేసిన తొల్ స్తోయ్, దోస్తోయేవ్ స్కీ, కుప్రీన్, చెహోవ్ వంటి కొందరు విప్లవ పూర్వ రచయితలకు కూడా అంత ప్రాధాన్యం ఉంది. ఇతివృత్తాల లోని వైవిధ్యం,శిల్పంలోని నైపుణ్యం కారణంగా మరింత విలక్షణమైన సాహిత్యం చేహొవ్ ది.

1860 లో పుట్టిన ఆంటన్ చెహోవ్ 1904 లో మరణించాడు. 1880 నుండి సాహిత్య రచన ప్రారంభించాడు. దాదాపు ఇరవై నాలుగేళ్ళ చిన్న వ్యవధిలో వందలాది కథలూ, కొన్ని నాటకాలూ రాశాడు. తన సమకాలం లోని రష్యన్ సమాజాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించిన విశాలమైన కాన్వాస్ చెహోవ్ సాహిత్యానిది. రైతులు, భూస్వాములు, గుమాస్తాలు, సైనికాధికారులు, మఠాధిపతులు… సమాజం లోని అన్ని రకాల మనుషులూ ఆ కథల్లో ప్రత్యక్షం అవుతారు.

చిన్న చిన్న సంఘటనలతో, మానవ స్వభావం లోని వైవిధ్యాల చిత్రణతో ఉండే ఈ కథలు చాలావరకూ ఓపెన్ ఎండెడ్ గా ముగుస్తాయే తప్ప కచ్చితమైన తీర్పులనూ, పరిష్కారాలనూ చెప్పవు. అలా చెప్పటం తన లక్ష్యం కాదని చెహోవ్ నేరుగా చెప్పుకున్నాడు కూడాను.

పైకి చూట్టానికి చాలా సాధారణంగా కనబడే ఈ కథలు నిజానికి ఎంతో సంక్లిష్టమైనవి. సాహిత్య రచనను గురించి, దాని లక్ష్యాన్ని గురించి చెహోవ్ కు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిని తన ఉత్తరాల్లోనూ, వ్యాసాల్లోనూ, సంభాషణల లోనూ వ్యక్తం చేశాడు – “నిర్దిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆయా రంగాల్లో కృషి చేసిన నిపుణులు ఉన్నారు. రైతులను ఎలా కూడగట్టాలి, పెట్టుబడిదారీ వ్యవస్థతో ఎలా పోరాడాలి, స్త్రీల సమస్యలను ఎలా పరిష్కరించాలి – అనే విషయాలపై ఆయా రంగాల్లో విశేష నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. తనకు అర్థం కాని విషయాలపై కళాకారులు తీర్పులు ఇవ్వకూడదు… వాళ్లు చెయ్యవలసినది సమస్యను లోతుగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం, తన అవగాహనను నిజాయతీగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా చిత్రించటం.” అని ఒక ఉత్తరంలో రాశాడు చెహోవ్. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న సాహిత్యం ఆయనది.

చెహోవ్ రచనలు చేస్తున్న కాలంలో రష్యన్ సమాజం సంక్షుభితంగా ఉన్నది. జార్ చక్రవర్తుల పాలనలో అవినీతి, నిరంకుశత్వం, అసమానతలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశాయి. మేధావులకూ, కళాకారులకూ భావప్రకటనా స్వేచ్ఛ కరువైంది. ఈ పరిస్థితుల నుండి దేశాన్ని తప్పించటానికి వివిధ దృక్పథాల నుండి అన్వేషణ జరుగుతోంది. సోషలిస్టులూ, అనార్కిస్టులూ ప్రజలను సమీకరిస్తున్నారు. ప్రజల నిరసనలపై అణచివేత సాగుతున్నది.

చెహోవ్ ఆనాటి ఏ రాజకీయ నిర్మాణం లోనూ భాగంగా లేడు. కానీ ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉన్నది. దాని లక్ష్యం అన్నిరకాల ఆధిపత్య వ్యవస్థలనూ వ్యతిరేకించటం. అయితే ఆ పనిని ఒక రాజకీయ సంస్థ వలె వాచ్యంగా, నినాద ప్రాయంగా చెయ్యటం సాహిత్యం పని కాదు. అది ఆయా రంగాల నిపుణులు మాత్రమే చెయ్యగలిగిన పని. ప్రజలకు తమ సమస్యల పట్ల ఎరుకనూ, వాటిని ఎదుర్కొనే చైతన్యాన్నీ, పీడితులతో సహానుభూతినీ కలిగించే పనినీ సాహిత్యంలో కళాత్మకంగా నిర్వహించాలని ఆయన నమ్మకం.

స్వతంత్రమైన ఆలోచనను చంపేసి, మనుషులను మూసల్లోకి కుదించే ధోరణి ప్రజలకు హానికరమని అతడి అభిప్రాయం. అలా నిర్బంధించే మతాధిపతులపై ఎంత చిరాకేస్తుందో, కొందరు వామపక్ష సాహిత్యకారులను చూసినా తనకు అంతే విసుగ్గా ఉంటుందని అన్నాడు.

“తాను ఏ పరిస్థితుల్లో బతుకుతున్నదీ మనుషులకు తెలియజెపితే, వాళ్లు దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది.” అని చెహోవ్ నమ్మాడు. ఆ నమ్మకానికి ఉదాహరణలు ఆయన కథలు. ఆనాటి సమాజం ఎంత దుర్భరంగా ఉందో ఆ కథలు చిత్రించాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి, నిర్లక్ష్యం, పెత్తందారీ తనం; శ్రామికులపై దోపిడీ, కుటుంబాల్లో స్త్రీలపై అణచివేత, మానవ సంబంధాల్లో డొల్లతనం వంటి అన్యాయాలనూ- వాటిపట్ల నిర్లిప్తతతో, స్వప్రయోజన కాంక్షతో భద్రజీవనాల్లో ముడుచుకు పోయిన మేధావులనూ కూడా చెహోవ్ సాహిత్యం తీవ్రంగా నిరసించింది. పదునైన వ్యంగ్యాన్ని ఇందుకు సాధనంగా వాడింది. ఆచరణకు దూరంగా కూర్చుని తాత్విక చర్చలతో, నిరాశావాదంతో కాలం గడిపే బుద్ధిజీవులను ఎగతాళి చేసింది. సున్నితమైన మానవ స్పందనలనూ, వాటిని వికసింపజేసే అభిరుచులనూ ప్రోత్సహించింది. దీనినంతటినీ కళాత్మకమైన శిల్పంతో, సరళమైన శైలిలో నిర్వహించిందే తప్ప వాచ్యంగా చెప్పదు ఆయన సాహిత్యం.

చెహోవ్ సాహిత్యం రష్యన్ విప్లవానికి పూర్వపు రోజులది. ఆయన సోషలిస్ట్ రాజకీయ నిర్మాణాలకు వెలుపలివాడు. ఐనా, లెనిన్ వంటి విప్లవకారులూ, విప్లవానంతర సోవియెట్ సమాజమూ ఆయన రచనలను ఎంతగానో అభిమానించారు. తాము కూలదొయ్యాల్సిన వ్యవస్థను గురించి అవగాహన ఇచ్చినందుకూ, నిర్మించుకోవలసిన కొత్త సమాజానికి ఒక నమూనాను ప్రతిపాదించినందుకూ వారు ఆ సాహిత్యాన్ని సొంతం చేసుకున్నారు.

చెహోవ్ మరణించిన ఇరవయ్యేళ్ళ తర్వాత ఆయన సాహిత్యం ఇంగ్లిష్ లోకి అనువాదమై రష్యా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు,ముక్తవరం పార్థసారథి గారు తెలుగులోకి కొన్ని కథలను అనువదించారు. ఇప్పుడు వెలువడిన ఈ పుస్తకంలో వంద కథలున్నాయి. కూనపరాజు కుమార్ గారి పూనికతో, అరుణా ప్రసాద్ చేసిన సరళమైన అనువాదంలో, చేహోవ్ కథలు ఇంత పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం తెలుగు పాఠకులకు సంతోషకరమైన సందర్భం. అంతేకాదు, ఈనాటి మన సామాజిక సందర్భంలో అవసరమైన అవగాహన కోసం ఉపయోగకరమైన ఒక సాధనంగా కూడా ఈ సాహిత్యం మనకు అందుబాటులోకి వచ్చిందని భావించాలి.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply