జీవితం అప్పుడే తెల్లారిందా?

“అబ్బా….ఏమిటో ఇంత గోలగా ఉంది. ఏమైంది, నా భార్య తాయారు ఎంత పిలిచినా పలకదే? అనుకుంటూ వంటిపై దుప్పటి తొలగించుకుంటూ లేచాడు కామేశం. తన గదిలో ఎవ్వరూ కనిపించలేదు. హాలులో మాత్రం చాలా సందడిగా బాగా జనం వచ్చినట్లు ధ్వనులు వినిపిస్తున్నాయి. మన ఇంటికి ఇవాళ ఎవరు వచ్చి ఉంటారు? నాకు తెలియకుండా ఇంతమంది ఎందుకు వచ్చారో? ఒకవేళ తాయారు పిలిచినా నాకు ముందే చెప్పాలిగా? సరే… ఏమిటో చూద్దాం అని నెమ్మదిగా మంచం దిగి మొహం కడుక్కుని హాల్లోకి అడుగుపెట్టాడు కామేశం. చాలా మంది గుమిగూడి కనిపించారు. అర్ధం కాలేదు. ఇంతకూ ఇది తన ఇల్లేనా? అనుమానం వచ్చింది. నా భార్య ఏమయ్యింది? అంటూ చుట్టూ పరిశీలించాడు.

అవును తన ఇల్లే. గోడమీద తాను, తాయారు కలిసిన ఫోటో, దాని కింద పిల్లలతో ముచ్చటగా గుర్రం ఎక్కి తీయించుకున్న ఫోటో కనిపించాయి.

మరి వీళ్లంతా ఎవ్వరు? మరి మా ఆవిడ ఏది? అక్కడ వాతావరణం చూస్తుంటే ఏదో అశుభం జరిగినట్లుగా ఉంది. హాలు మధ్యలో ఏదో పెట్టె పెట్టినట్లుంది. అందులో ఎవరినో పడుకోబెట్టారు. అంటే తాయారుకు … ఏమయిందో? కంగారు కంగారుగా ”తాయారూ… తాయారూ…” అంటూ బిగ్గరగా అరిచాడు. తన అరుపులు తనకే ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ ఎవ్వరూ విన్నట్టు, పట్టించుకోనట్లు ప్రవర్తించారు. విసుగొచ్చిన కామేశం గబగబా ఆడవాళ్ళ గుంపులోకి తోసుకుంటూ దూరాడు. ఆశ్చర్యంగా అక్కడ అందరి మధ్యలో ఏడుస్తూ ఉన్న తాయారు కనిపించింది. “ఏమిటే… ఏమయ్యింది. ఎందుకు ఇంతమంది వచ్చారు. మన పిల్లాడు నరేష్ ఏడి? చెప్పవే?” అంటూ బిక్క మొహం పెట్టాడు కామేశం.

” పొద్దున్నే నా ముఖం చూస్తూ, నేను లేపితే కానీ లేచేవారు కాదు వదినా…. నా కాఫీ అంటే ఆయనకు చాలా ఇష్టం. బెడ్ కాఫీ తాగితే కానీ కాలు కిందకు పెట్టేవారు కాదు. ఇవాళ అదిగో అలా ఐపోయారు” అంటూ గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడవటం చేసింది తాయారు.

“అదేంటి… నేను ఏదో అడుగుతుంటే నువ్వేదో అర్ధం కాకుండా మాట్లాడుతా వేమిటి…. నా ముఖానికి బెడ్ కాఫీ కూడానా? ఎప్పుడైనా ఇచ్చావా? అందరూ గుమిగూడారని ఉత్త కబుర్లు చెప్పకే. అయినా అసలు నీకు ఏమయ్యింది? కొంపతీసి నా మాటలు నీకు వినపడటం లేదా ఏమిటి? ఒసే తాయారు. నిన్నే” అని అరుస్తూ నిలబడ్డాడు కామేశం.

ఎంతకూ తన మాటలకు తాయారు బదులు ఇవ్వక పోవడంతో ఎందుకో అనుమానం వచ్చి గాభరాగా హాల్లో జనాల మధ్యలో ఎవరిని పడుకోబెట్టారో చూడటానికి వెళ్ళాడు. చూస్తే….. తానే. అరే.. ఇదేంటి నేను ఇక్కడున్నాను… మరి నేను… ఒక్క క్షణంలో అర్ధం అయ్యింది కామేశంకు. తాను చనిపోయినట్లు. అందుకే తనకు అన్నీ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ తాను ఎవ్వరికీ తెలియటం లేదని. ఒక్కసారి నిశ్చేస్టుడయ్యాడు. జీవితం అప్పుడే తెల్లారిపోయిందా? తన చిన్న కొడుకు ఇంకా స్థిర పడలేదు. తన బాధ్యతలు ఏమీ తీరలేదు. జీవితం ఇంకా ఎంతో ఉండాల్సిన తనకు అప్పుడే తెర దించేశాడా ఆ దేముడు.
** **
ఒక్క క్షణం మూగగా అయిపోయాడు. అసలు ఎలా జరిగిందో? గుండె ఆగి పోయిందా? బహుశా రాత్రి నిద్రలోనే జరిగిందేమో? డాక్టరును పిలిచే సమయం కూడా రాలేదేమో? అయ్యో పాపం. తాయారు గుక్కపెట్టి ఏడుస్తోంది. తాను నా జీవితంలోకి వచ్చిన తరువాత ఇదే ఏడవటం. నేనైనా అప్పుడప్పుడు ఏడ్చానేమో కానీ తను మాత్రం నవ్వుతూ గడిపేసింది. ఇంకా చెప్పాలి అంటే నన్ను ఏడిపిస్తూ నవ్వేసేది. అంత విషాదంలోనూ కామేశంకు నవ్వు వచ్చేసింది.

ఎలాగూ చచ్చిపోయాను. అసలు ఇక్కడ మనుషులు ఏమి అనుకుంటున్నారో ఓసారి వింటే పోలా… కనీసం చచ్చిన తరువాతయినా తన వాళ్ళెవరో, పై వాళ్ళెవరో అర్ధం అవు తుందన్న కుతూహలం పెరిగింది. నెమ్మదిగా చుట్టూ పరికించాడు. చాలా మంది గుంపులు, గుంపులుగా వచ్చారు. పరవాలేదే తాను చనిపోతే ఇంత మంది వచ్చారా? అంటే ఏదో కొద్దో, గొప్పో పరపతి ఉందన్న మాట.

అలా చుట్టూ చూస్తుంటే వాళ్ళ మధ్యలో తనకు అప్పు ఇచ్చిన సేఠ్ చందూలాల్ కనిపించాడు. అమ్మో… వీడికి కనబడకూడదు డబ్బులు అడుగుతాడు… అని అప్రయత్నంగా దాక్కోడానికి ప్రయత్నం చేసాడు. మళ్లీ గుర్తుకు వచ్చింది, తాను చనిపోయినట్లు ఎవ్వరికీ కనిపించనని. అంతే ధైర్యంగా అడుగు ముందుకు వేసాడు. వెళ్లి సేఠ్ చందూలాల్ ముందు ధైర్యంగా నుంచున్నాడు. సేఠ్ సుమారు ఐదు అడుగులు కూడా లేడు. వీడికా ఇన్నాళ్లు నేను భయపడ్డది, నా భుజాల దగ్గరికి కూడా రాలేదు. ఒక్క గుద్దు గుద్దితే చచ్చేలా పీలగా ఉన్నాడు అని ఆలోచిస్తుంటే…

అప్పుడే చందూలాల్ పక్కనే తన సహోద్యోగి సత్యం ఏదో మాట్లాడటం విన్నాడు. ఒక బలహీన క్షణంలో డబ్బులు అవసరం అయితే ఈ సత్యం వల్లే సేఠ్ పరిచయం, అప్పు తీసుకోవటం జరిగాయి.

“ఇదిగో చందూలాల్…. కామేశం చనిపోయాడు. మరి అతని బాకీ నీకు పూర్తిగా వసూలు అయ్యేట్టు నేను వాళ్ళతో మాట్లాడి వచ్చేలాగ చూస్తాను. కానీ నా బాకీ సగం రద్దు చేయి. అదీ ఒప్పందం. లేకుంటే నువ్వే వారితో మాట్లాడుకో. కామేశం పిల్లలు ఎవ్వరూ సరిగ్గా స్థిర పడలేదు. బాకీ వస్తుందో రాదో నేను గ్యారెంటీ ఇవ్వలేను” అంటూ బేరం పెట్టాడు.

“అమ్మ… సత్యంగా… నువ్వు ఇలాంటి వాడివిరా. నా చావును కూడా వాడుకుంటున్నావా? ఎంత దుర్మార్గుడివిరా? నీ పేరులో సత్యం ఉంది కానీ, వ్యవహారంలో మాత్రం అంతా అసత్యమేనన్న మాట” బుస్సుమన్న కోపంతో కొడదామని చెయ్యి ఎత్తాడు. కానీ తన పరిస్థితి తెలిసి ఊరుకున్నాడు.

“ఊరుకో …సత్యం గారు. చనిపోయిన వ్యక్తి శవం ముందు ఈ మాటలు ఏమిటి? నేను వ్యాపారం చేస్తాను కానీ మానవత్వం వదులుకుని కాదు. దాన్ని మరచిపోలేదు. కామేశం పిల్లలని అడిగి చూస్తాను. ఇస్తే సరి లేకుంటే రద్దు చేసుకుంటా. అంతేకానీ ఈ కష్ట సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం ఏమిటి? కాసేపయినా మనిషిగా ఉందాం ఊరుకో” అంటూ చిన్నగా విసుక్కుంటూ మందలించాడు చందూలాల్.

చందూలాల్ మాటలు విన్న సత్యం అక్కడనుండి మారు మాట్లాడకుండా జారుకున్నాడు. కానీ కామేశం కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లూ సేఠ్ను ఎంత రాక్షసుడిలా తలచాడో తలుచుకుని లెంపలు వేసుకుంటూ అతని మాటలకు కరిగి అతనికి నమస్కారం పెడుతూ అక్కడ నుండి మరోవైపు వెళ్ళాడు.

తన చిన్న నాటి స్నేహితులు ఆది నారాయణ, సుబ్బారావు, మాణిక్యం, బోసు అందరూ విచారంగా కూర్చున్నారు. తమ మొబైల్లో అందరికీ కామేశం మరణం సంగతి పంపిస్తూ తమలో ఒక స్నేహితుడు అప్పుడే చనిపోయాడని కన్నీరు కారుస్తున్నారు. ఎప్పటిలాగే ఆదినారాయణ తన సందేహం వెలిబుచ్చుతూ ” ఇంతకూ ఎలా జరిగిందంటావ్? బాగానే ఉండేవాడు కదా, ఏవిధమైన రోగాలు లేవు. మరి ఎలా? సహజ మరణమేనా? అంటూ.

“ఊరుకోరా బాబూ…ఎవరైనా వింటే తంతారు.నీకు అన్నీ అనుమానాలే” అంటూ ఆ సంభాషణ సాగకుండా ఆపేశారు మాణిక్యం. వాళ్ళ మాటలు విన్న కామేశంకు కాస్త విచారంగానే వాళ్ళను దాటుకుంటూ ఇంకా ఎవరెవరు వచ్చారు, ఏమని అనుకుంటున్నారా అని కలియ తిరిగాడు.

ఇంతలో ఒక మూల తన స్నేహితుల మధ్య చిన్నకొడుకు నరేష్ ఏడుస్తూ కనిపించాడు. “ఏం జరిగిందో తెలియదురా. నిద్రలోనే ప్రాణం పోయింది. మరి నాకు దిక్కు ఇంకెవరు ఉన్నారురా? నాకు ఎన్ని డబ్బులు కావాలి అంటే అన్నిఇచ్చేవారు. నేను మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడటం ఆయన కల. అది ఇంకా నెరవేరకుండానే ఇలా అయిపోయారు. అన్నయ్య వేరే రాష్ట్రం నుండి రావాలి. బయలు దేరాడు” అంటూ వాపోయాడు.

“నేను డబ్బులు ఇవ్వటం ఏమిట్రా? నా చొక్కా జేబులో ఎలా మాయం అయిపోతున్నాయో ఇప్పుడు అర్ధం అవుతోంది. పోనీలే ఇప్పటికైనా నాన్న మనసు నీకు అర్ధం అయ్యింది. నీకు నాన్నంటే ప్రేమ ఉందిరోయి” అని సణుగుతూ ముందుకు సాగాడు. అలా అందరినీ దాటుకుంటూ ఇంటి బయటకు వెళ్లగానే , ఇంటి బయట పనివాళ్ళు, ముష్టివాళ్ళు ఎవరికి వాళ్ళు గుమిగూడి సమాచారం కోసం తర్జనభర్జనలు పడుతున్నారు. రోజూ పాలు పొసే పాలవాడు, కూరగాయల వాడు తన మంచితనాన్ని గుర్తు చేసు కుంటూ విచారం వ్యక్తం చేయడం చూసాడు.

“అయ్యో…దేముడా…నాకు చాలా తక్కువ ఆయుస్సు ఎలా ఇచ్చావయ్య? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావుగా, మరి ఇలా అర్ధంతరంగా నా కథ ఎందుకు ముగించావ్” అని బాధగా మరోసారిఇంట్లోకి వచ్చాడు కామేశం.

“ఒరేయ్….సుబ్బారావు… మనసంతా బాధగాఉందిరా. కామేశం గాడి మరణం జీర్ణించుకోలేక పోతున్నా. ఇంట్లో పర్సు మరచి వచ్చేసాను,ఏమైనా డబ్బులు ఉంటే సాయం చేయరా. కాస్త మందు వేసి వచ్చేస్తా. లేకుంటే ఈ గాభరా తగ్గదు” అంటూ ఇంకో స్నేహితుడు తాగుబోతు రమేష్ గాడి అభ్యర్ధన.

“వీడ్ని తగలెయ్య. ఇంత ఇదిలోనూ వీడికి మందు కొట్టడానికి కారణం ఒకటి దొరికింది. దొంగ వెధవ” మరి సుబ్బారావు ఏమంటాడో అని అనుకుంటుండగా ” ఒరేయ్. రమేషు.. ఆగరా బాబూ. కార్యక్రమం అవ్వనీ. రాత్రికి చూస్తానులే” అంటూ అప్పటికి శాంత పరిచాడు. ఇంతలో ఇన్సూరెన్స్ ఏజెంట్ రామనాధం రావటంతో కామేశం చిన్న కొడుకు నరేష్ కలిసి”సార్. మా నాన్న గారికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? వస్తుందా? చేయించానని చెప్పారు. కానీ వివరాలు నాకు తెలియవు” అంటూ అడిగాడు.

” ఇంతకూ ఎలా మరణించారంటావ్? సహజ మరణమేనా? లేక ఆత్మహత్య.. అని తేలితే కట్టిన ప్రీమియం తప్ప ఇంకేమీ రాదు. అదే మామూలుగా గుండె ఆగి చనిపోతే ఒక పది లక్షలు మాత్రమే వస్తాయి. ఇదే ఏదో ప్రమాదంలో చనిపోయి ఉంటే మీకు ముప్పై లక్షలు దాకా వచ్చేవి” అంటూ అంత బాధ సమయంలో కూడా తన వ్యాపార ధోరణి మానకుండా చెప్పడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా కామేశం స్నేహితులకు వినబడేలా, ఎందుకంటే ఇలాంటి సన్నివేశం చూసైనా భయపడి ఏదో ఒక పాలసీ కట్టకపోతారా అన్న దిక్కుమాలిన వ్యాపారసూత్రం ఆచరణలో పెడుతూ. అన్నీ వింటున్న కామేశంకు వళ్ళు మండిపోయింది.

” దొంగ వెధవ. నాకు ఇన్సూరెన్స్ ముప్పై లక్షలు చేయిస్తున్నానని చెప్పి, పది లక్షలే చేశాడా? పైగా ఇన్ని కండీషన్లు పెడుతున్నాడు. వాడి మాటలు చూడు. నేను చనిపోయానన్న బాధ లేదు , ఏదో ప్రమాదం జరిగి చనిపోయి ఉంటే ఇంకా వచ్చేదని ఓ బోడి సలహా. చనిపోయేముందు వీడి సలహా తీసుకుని దేన్నైనా గుద్ది చచ్చిపోవాలేమో…ఛీ” అని తిట్టుకుంటూ అక్కడ నుండి కదల బోతుంటే ఎవరో ఇద్దరు లోపలికి వచ్చారు. బహుశా డాక్టర్లు అనుకుంటా, వీళ్ళు ఎందుకబ్బా అని అనుకుంటుండగానే అక్కడ అందరినీ హాలు వదిలి ఒక అరగంట బయట ఉండమని చెప్పారు. అందరూ బయటకు వెళ్లంగానే తన శరీరం దగ్గర కూర్చుని కళ్ళను దూదితో తుడవడం మొదలుపెట్టారు. అప్పుడు అర్ధం అయ్యింది.

“బాబోయి..వీళ్ళు నా కళ్ళు పీకేస్తారేమో. నేనుఎప్పుడో ఆఫీసులో అందరూ సంతకాలు పెడుతుంటే ఏదో సరదా కొద్దీ సంతకం పెట్టేసాను. నిజంగా అయితే కళ్ళను దానం చెయ్యలేదు. నాకు అస్సలే చాలా భయం. కళ్ళ డాక్టరు దగ్గరకే ఎప్పుడూ వెళ్ళలేదు. వీళ్ళను ఎలా అయినా ఆపాలి. నాకు ఇష్టం లేదు. ఎంత నొప్పి వస్తుందో. ఒరేయ్… నరేష్ వద్దని చెప్పరా? ఏమేవ్ తాయారు… తాయారు. నువ్వైనా చెప్పవే.నాకు ఇష్టం లేదు మొర్రో అంటున్నా వినిపించుకోరేమిట్రా. వద్దు బాబోయి” అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు.


** **


” ఏమండోయి… మిమ్మల్నే… ఏమండోయి. ఏమిటీ వద్దంటున్నారు. ఏమిటా అరుపులు, కలవరింతలు మిమ్మల్నే. ఆ ముఖంపై చమటలు ఏమిటీ” అంటూ తాయారు కంగారుగా ముఖంపై ముఖం పెట్టి కనిపించింది. అప్పుడు కామేశంకు అర్ధం అయ్యింది ఇదంతా కలలోనని.

“ఏమయ్యింది. ఏమైనా పీడకల వచ్చిందా? భయపడ్డారా? అంత చమటలు పట్టాయి. ఇంకొంచెం ఉండి ఉంటే మంచం మీద నుండి కిందకు పడేవారు. ఇవాళ ఆదివారం, ఏదో మీరు నాకు కాఫీ ఇస్తారు అనుకుని ఆగాను. సరే నేనే పెడతాను. మీరు మొహం కడుక్కోండి” అంటూతాయారు వంట ఇంట్లోకి వెళ్ళింది.” ఓరి దేముడో… ఎంత పిచ్చికల. నిజంగానే చచ్చాను. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో.బాబోయి బాకీలు అన్నీ తీర్చేయాలి. చెయ్య కలిగిన సాయం వెంటనే చేసేయ్యాలి. ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే , ఈ పాటికి తన పని అయిపోయి ఉండేది. అమ్మో.” అంటూ గుండెల మీద చెయ్యి రాసుకుంటూ లేచాడు కామేశం. కాసేపటికి తాయారు సుబ్బరంగా స్నానం చేసి మంచి చీర కట్టుకుని కాఫీ కప్పుతో కామేశం ముందు ప్రత్యక్షం అయ్యింది. తాయారును చూసిన కామేశంకు ఏదో జ్ఞాపకం ఊరిస్తూ, పూర్తిగా రాకుండా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది.

“తాయారు….నిన్ను ఎక్కడో చూసినట్లుందే” అంటూ విచిత్రమైన ప్రశ్న వేశాడు కామేశం.” చాళ్ళెండి..ముప్పై సంవత్సరాలయ్యింది నన్ను చూడటం మొదలు పెట్టి, ఏమిటా పిచ్చి ప్రశ్న? పొద్దుటనుండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.ఏమయ్యింది మీకు?” అంటూ కాస్త విసుక్కుంటూ తన అందాన్ని పొగిడాడేమోనని మనసులోనవ్వేసుకుంటూ వెళ్ళిపోయింది.

కామేశం మరేమీ మాట్లాడలేకపోయాడు. ఏదో అనుమానం ఇంకా మనసుని పీకుతోంది కానీ ఇంకేమీ అనలేక, ఏమైనా అంటే కొట్టేలా ఉందని భయంవేసి కాఫీ తాగి హాల్లోకి వచ్చి పేపర్ చదవటం మొదలు పెట్టాడు. కాసేపటికి ఎవరో గుమ్మం దగ్గర చెప్పులు విడుస్తూ “నమస్తే సర్” అంటూ ఎదురుగా ఒకతను చిరునవ్వుతో ” నేను సార్…ఇన్సూరెన్స్ ఏజెంట్ రామనాధం” అంటూ.

అప్పుడు గుర్తుకు వచ్చింది కామేశంకు రాత్రి కలలో వీడు కూడా ఒక భాగమేగా ” అమ్మో. వీడు మళ్లీ వచ్చాడు. పైగా ఇవాళే” అని అనుకుంటూ “ఏమిటి రామనాధంగారు ఇవాళ వచ్చారు పొద్దున్నే” అంటూ కాస్త పదాలు వత్తిపలుకుతూ అన్నాడు.”అదే సార్. మరచిపోయినట్టున్నారు. ఆమధ్య కనబడినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ముప్పై లక్షలు దాకా చేస్తాను, ఏదైనా పాలసీ ఉంటే చెప్ప మన్నారుకదా. అది చెబుదామని , ఈ నెల మీతోనే గ్రాండ్ గా మొదలు పెడదామని వచ్చాను” అంటూ ఉత్సాహంగా తన చేతి సంచీలో నుండి ఏవో కాగితాలు ముందు పెట్టాడు. కామేశంకు గుండె గుభేలుమంది. “రామనాధం గారు ఇవాళ వద్దులెండి. నేను మీ దగ్గరే చేస్తాను. కానీ ఇంకొరోజున. వచ్చే వారంలో ఆలోచిద్దాం” అంటూ ముగించాడు. కాసేపు బతిమాలిన రామనాధం ఇక లాభం లేదని ఉసూరుమంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

“ఒరేయ్….నరేష్…ఇలా రారా” అంటూ కొడుకుని పిలిచి తన జేబులో ఒక ఐదు వందల నోటు తీసి చేతిలో పెట్టాడు.

“ఎందుకు నాన్న….ఏమి తేవాలి” అని అన్న కొడుకును వారిస్తూ ” ఉండనీయరా… నీకు ఉద్యోగం వచ్చేవరకు ఇలా కుదిరినప్పుడల్లా ఇస్తాను. నీకూ ఏమైనా ఖర్చులు ఉంటాయికదా, ఖర్చు పెట్టుకో. ఇంకా ఏమైనా కావాలంటేనా జేబులో తీసుకో. నీకా స్వతంత్రం ఉంది. మంచి ఉద్యోగం సంపాదించుకో” అంటూ కొడుకు భుజం తట్టాడు.

తండ్రికి ఏమయ్యిందో, ఎందుకు ఇలా అన్నాడో అర్ధం కాలేదు. కానీ చేతులో పడిన ఐదు వందల రూపాయలకు తగ్గ బడ్జెట్ మనసులో తయారయిపోయి, హుషారుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు నరేష్. కామేశంకు ఆ మధ్యాహ్నం లోపు తన కలలో వచ్చిన పాత మిత్రులందరూ ఏదో రకంగా, ఫోన్ లోనో, రోడ్డుమీదో తారస పడ్డారు. ఇన్ని జరుగుతున్నాకామేశం మదిలో ఇంకా పొద్దున్నే చీర కట్టుకుని అందంగా తయారైన తాయారు మీదే ఉంది. ఏమిటో ఏదో చెప్పాలి, ఏమిటా అది అనుకుంటుండగానే భోజనం అయిన తరువాత విశ్రమిస్తుంటేఏమిటా అన్నది స్ఫురించింది.

” ఒసే …తాయారు ” అంటూ గావుకేక పెట్టాడు.”ఏమయ్యిందండీ” అంటూ పడక గదిలోకి అడుగుపెట్టిన తాయారును గబాలున లాక్కుని చీరకొంగు పట్టుకోవడానికి ప్రయత్నం చేసాడు. “చీ… ఇప్పుడేమిటండీ” అని సరసంగా సిగ్గుపడుతున్న తాయారును చూసి విసుక్కుంటూ”అది కాదే. ముందు ఆ చీర విప్పేయి. ఇంకెప్పుడూ కట్టకు. ఎందుకో కారణం మాత్రం అడగకు. అర్ధం అయ్యిందా” అంటూ తాయారు వంటి మీద చీర లాగేసాడు.

ఇదేంటి ఈయనకు ఇవాళ పొద్దున్న నుండి ఏమయ్యిందో అని తలుచుకుంటూ బీరువాలోమరో చీర తీసుకుని కట్టుకుని బయటకు వచ్చేసింది తాయారు కామేశం ప్రవర్తనకు విస్తుపోతూ. “అమ్మయ్య”… అని అనుకుంటూ కామేశం తృప్తిగా మంచంపై వాలి. “ఈ దిక్కు మాలిన చీరతోనే రాత్రి కలలో నా శవం ముందు ఏడుస్తూ కూర్చుంది. ఆ చీరలో తాయారును చూస్తుంటే ఏదో చచ్చిపోయినట్లు ఫీలింగ్ వచ్చేస్తోంది. ఇదీ విషయమని దీనికి ఎలా చెప్పేది” అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు.
** **

కలం పేరు ఉషారం. స్టేట్ బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. కవిత్వం, కథలు రాస్తారు.

15 thoughts on “జీవితం అప్పుడే తెల్లారిందా?

 1. చక్కటి కథ.. అనుభూతుల్ని . భావావేశాల్ని రచయిత
  అద్భుతంగా వ్యక్త పరిచారు.. మరిన్ని మంచి కథలు
  రావాలని ఆకాంక్షిస్తూ….

 2. PRESENTATION IS GOOD. ONE WOULD GET A FEELING THAT ATMMA OF A DEAD PERSON WILL BE AT THAT PLACE FOR SOMETIME. GOOD SRIRAMA RAO . YOU HAVE GIVEN POSITIVE A CLOSING..

 3. * జీవితం… అప్పుడే తెల్లారింది * కధ బాగుంది.సస్పెన్స్ మెయింటైన్ చేసిన విధానంలా ఉంది.కొన్ని కథలు, మనం కన్న కొన్ని కలలు స్ఫూర్తిని రగిలిస్తాయి. నీ కధ ఒక గమ్యం లేకుండా, ఆలోచన లేకుండా సాగుతున్న జీవితాల్లో కొద్దీ శాతం మందిలోనైన ప్రేరణ ఇస్తుందనడంలో సందేహం లేదు.
  మరిన్ని కధలు రావాలని కోరుతూ

 4. శ్రీరామ్, చాలా ఆనందంగా ఉంది, నీ కథ ప్రచురణ చూసి. Congratulations first of all.
  నీ కథ subject, రాసిన విధానం, ఒక్కొక్క character ని మలచిన తీరు, అద్భుతం.
  చెప్పేందుకు మాటలు చాలవు. సస్పెన్స్ తో పాటు ఒక సందేశాన్ని కూడా వెల్లడి చేశావ్.
  God Bless You and Expecting many more from you.

 5. చాలా బాగుంది శ్రీరామ్. Funny గా వుంది, అలాగే planning వుండాలని hint ఇచ్చినట్లు వుంది. Proud of you. Congratulations

 6. Sriramji! కధ, దాని నడిపిన తీరు చాలా బాగుంది. సందేశాత్మకంగా కూడా ఉంది. కధ సుఖాంతమవడం కూడా నచ్చింది. Congratulations.

Leave a Reply