జీవశ్చవాలు

పొద్దున్నే ఎండ చిట చిట లాడుతుంది. రోడ్లన్ని వాహనాలతో కిట కిట లాడుతున్నాయి. సెంటర్లో పండ్ల వ్యాపారస్తులు అప్పుడే బండ్ల మీద సర్దుకుంటున్నారు. షాపులు డ్ర్..ర్..ర్ అంటూ షెటర్లు తెరుచుకుంటున్నాయి. రోడ్ల మీద జనం రద్దీగానూ, పోలీసు వాహనాలు హడావుడిగా తిరుగుతున్నాయి.

చాలమంది కార్మికులు వాహనాల్లో క్వారీలవైపు వెళుతున్నారు. వాళ్లతో పాటు నేను కూడా ఆటోలో ఎక్కి కూర్చున్నాను.

అది ఎతైన కొండ ప్రాంతం. అక్కడున్న ఎ.పి.యం.డి.సి. ప్రాంగణం మొత్తం పోలీసుల వలయంలో వుంది. క్వారీల ఓనర్లు, మేనేజర్లు, ఏజెంట్లు మైనింగ్ అధికారులు అక్కడే ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్పెషల్ కలెక్టర్ కూడా ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం, ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం తీసుకోవడానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆ టెంట్ల క్రింద కూర్చున్నారు. ఆ రోజు నుండి మూతబడిన అన్ని క్వారీల కార్మికులు అక్కడ హాజరయ్యారు. మా క్వారీల యూనియన్ నాయకులు కూడ అక్కడికి వచ్చారు.

గనుల మంత్రి వేదిక మీదకువచ్చాక సమావేశం ప్రారంభమైంది. ప్రసంగాలు జరుగుతున్నాయి. క్వారీ యూనియన్ నాయకులతో నేను కలసివున్నాను. మమ్మల్ని గుర్తుపట్టిన స్థానిక యస్.ఐ, పోలీసులతో పరుగెత్తుకొచ్చి నిలిపివేశారు. ఇక్కడ గొడవలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మేము గొడవ చేయడానికి రాలేదని, మంత్రి గారి దృష్టి కి మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామని మా యూనియన్ నాయకులు మోహన్, నరసింహరావులు చెప్పారు. అయితే ఇప్పుడు కలవడానికి కుదరదని, మీటింగ్ అయిపోయాక పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పారు పోలీసులు. మేము మౌనంగా ఉండిపోక తప్పలేదు, మా చుట్టూ పదిమంది పోలీసులు కాపాలాగా ఉన్నారు.

దాదాపు రెండు గంటలు ప్రసంగాలు, క్వారీలో భద్రత గురించి, తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి చెప్పారు. తర్వాత బాధిత కుటుంబాలకు కలెక్టర్ గారు పేర్లు చదువుతుంటే, మంత్రి గారి చేతుల మీదుగా మరణ ధృవీకరణ పత్రాలు, చెక్కులు పంపిణీ జరుగుతోంది.

ఆ క్షణంలో నాకు కాళ్లు చేతులు ఆడడంలేదు. మొన్నటి దాకా నాతో కలసి పనిచేసినవాళ్ళు, వారందరితో అనుబంధంగా ఉన్నోడినే… ఇవ్వాల ఇలా చూడాల్సి వచ్చింది.

కొన్ని పేర్లు తర్వాత, నా మిత్రుడు శివారెడ్డి పేరు వచ్చింది. ఆయన భార్య వేదిక మీదికి ఎక్కింది. మంత్రి చేతుల మీదుగా చెక్కు అందుకుంటూ ఇటు తిరిగింది.

సరిగ్గా ఇరవై రెండేళ్ల వయసుంటుంది, ఏడు నెలల గర్భవతి కూడ, ఏడ్చి ఏడ్చి ఏమో ముఖం వాచిపోయింది. ఆమెను ఆలా చూడలేక తల తిప్పుకున్నాను. ఎంత ఆపుకుందామన్నా ఉగ్గపట్టి వున్న దుఃఖం ఒక్కసారి ఉప్పొంగింది. నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఎవరూ చూడకుండా ఉండేట్టు చేతి గుడ్డతో కన్నీళ్లు తుడుచుకుంటున్నాను. నా ప్రియమైన మిత్రుడు, శివారెడ్డితో నా పరిచయం తెరలు, తెరలుగా గుర్తుకొస్తుంది.

***

ఉదయం తొమ్మిది గంటలకే ఎండ పెట పెట లాడుతుంది. జనరల్ షిఫ్ట్ కొచ్చిన కార్మికులు పిట్ లో ఎవరి పనుల్లో వాళ్లున్నారు.

మిషనరీ శబ్దాలతో క్వారీలో సందడి సందడిగా వుంది. ఒక చోట వర్టికల్ కటింగ్ వయర్సా నడుస్తుంది, దాని ప్రక్కన డెబ్భై మీటర్ల మాస్ మీద నేను టెమరాక్ తో డ్రిల్లింగ్ హోల్స్ వేస్తున్నాను.

అంత దూరంలో పొక్లయిన్ తో రాళ్లను పల్టీలు వేస్తున్నాడు శివారెడ్డి. అలా పల్టీలు వేసిన రాళ్లకు కట్టర్ మేస్త్రీ మురగన్ మార్కింగ్ ఇస్తుంటే, కంప్రెషర్ గాలి ద్వార నాలుగు ”జాకీలు” రాయిమీద నాట్యాలు చేస్తున్నాయి. ఒకొక్క జాకీకి ముగ్గురు చొప్పున జాకీని కాళ్లతో, చేతులతో బలంగా అదిమిపట్టి డ్రిల్లింగ్ చేస్తున్నారు.

పిక్చర్ గన్నులతో కట్టర్లు రాయి అంచులను డ్రస్సింగ్ చేస్తున్నారు. అలా డ్రస్సింగ్ అయిన రాళ్లను పైన మార్కింగ్ యార్డుకు తరలించడానికి ర్యాంపుల ఇరువైపులా నేర్పుగా పొక్లయిన్ తో పెడుతున్నాడు శివారెడ్డి. అలా ఒక్కొక్కటిగా పేరుస్తూ పోతున్నాడు. మరో పొక్లయిన్ తో నిన్న కొట్టిన బ్లాస్టింగ్ వేస్టును డంపర్లకు లోడింగ్ వేస్తున్నాడు సురేంద్ర.

మధ్యాహ్నం భోజనానికి అందరం పిట్ లో నుండి పైకి వచ్చాం. శివారెడ్డి, నేను పైకి వచ్చి పంపు దగ్గర కాళ్లు చేతులు కడుక్కోని ”మెస్” లోకెళ్ళి అన్నం తిన్నాం. కాస్త దూరంగా ఓచెట్టు క్రింద రాయి వుంటే మాట్లాడుకుంటూ కూర్చోవడం అలవాటు.

శివారెడ్డితో నా స్నేహం దాదాపు పన్నెండేళ్ల నాటిది. వాడు అనంతపురం జిల్లా నుండి వచ్చాడు. ఊళ్లో శెనక్కాయ, సీనాయి (బత్తాయి) తోటలకు వర్షాలు లేక ఏటేటా నష్టాలు వస్తుంటే అప్పుల బాధలు పడలేక ఆత్మాభిమానంతో కొన్నాళ్లు ఊరగాయ పచ్చళ్ళ వ్యాపారం చేసాడు. మామిడికాయ, నిమ్మకాయ, టమాటా పచ్చళ్ళు స్వయంగా తయారు చేసేవారు. రెండు మూడు డ్రమ్ములకు తయారు చేసి పెట్టుకొని ప్రక్కన ఉండే బళ్లారి, మైసూరు, గుల్బర్గా, తమిళనాడు రాష్ట్రాల కూడా పోయి వ్యాపారం చేసేవాడు. అయినా అది పెద్ద లాభసాటిగా లేకపోవడంతో తెలిసినవారు ఎవరో ఇక్కడ క్వారీల గురించి చెబితే అమ్మానాయనలను అక్కడే వదిలి క్వారీ పనుల కోసం ఇక్కడకొచ్చాడు.

మొదట పొక్లయిన్ హెల్పరుగా చాల కష్టపడి పనిచేసాడు. వాడికి కొత్త డ్రస్సంటే చాలా ఇష్టం. డ్రస్సు మెయింటనెన్స్ బాగా చేసేవాడు. ఎప్పుడు నీటుగా శుభ్రంగా ఉండేవాడు. అలాంటిది పాపం డ్యూటీలో వుంటే మాత్రం మురికి గుడ్డలతో పని చేయాల్సి వచ్చేది, ఆ డ్యూటీ డ్రస్సుని వారానికి ఒకసారి సెలవప్పుడు ఉతికేవాడు. ఆ డ్రెస్ మీద ఆయిల్, గ్రీజు మరకలు పడి నల్లగా మట్టి గొట్టుకుపోయి మాగిన గబ్బు కొట్టేది. డ్యూటీ అయినాక ఆ డ్రస్సును ఒక రూములో తగిలించి, శుభ్రమైన డ్రస్సు వేసుకొనేవాడు. అలా రూములో తగిలించిన డ్రస్ ను తనకు తెలియకుండా మరో హెల్పర్ వేసుకొనేవాడు.

మూడేళ్ల తర్వాత తన కష్టం ఫలించి ఇదే క్వారీలో ఆపరేటర్ గా చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం పెళ్లి కూడ చేసుకున్నాడు.

పదో తరగతి వరకు చదివిన నేను కొన్నాళ్లు ఊళ్లో వ్యవసాయ కూలి పనులు చేసి, క్వారీ పనులకోసం ఇక్కడికొచ్చాను. ఐదేళ్లుగా లైన్ డ్రిల్లింగ్ వేసి, టెమరాక్ అనే కొత్త యంత్రం వస్తే దానిని నేర్చుకొని ఆపరేటరుగా చేస్తున్నాను.

బ్యాచలర్స్ గా, మేమిద్దరం ఒకే రూములో కలసివున్నాం. శివారెడ్డి కలివిడితనం, మర్యాదల కోసం ఇతరులను గౌరవించే తత్వం, స్నేహానికి విలువిచ్చే గుణం. వాడితో దోస్తీ కుదిరింది. మా ఇద్దరికీ పెళ్లిళ్లు అయినా మంచి స్నేహితులుగా, ఒకరింట విందులకు మరొకరం వెళుతుండేవారం.

మేము పని చేసే నందిని గ్రానైట్స్ అంటే చుట్టు ప్రక్కల క్వారీలో ఒక ప్రత్యకత వుంది. అన్ని లిమిటెడ్ క్వారీలలో ఎనిమిది గంటలపాటు మూడు షిఫ్ట్ ల డ్యూటీలుంటే ఇక్కడ మాత్రం పన్నెండు గంటల డ్యూటీలుండేవి. అయితే నాలుగు గంటలు అదనంగా (అది గంటకు రెండు గంటలు) ఓటీలుండేవి. అందుకే కార్మికులు డ్యూటీల కంటే ఓటీలకు ఆశపడి అదనపు శ్రమను కూడా సంతోషంగా చేసుకుపోతారు.

***

ఆరోజు ఎప్పటిలాగే నైట్ డ్యూటీకి ఐదు గంటలకు స్టాఫ్ బస్సులో వచ్చాం. పగలు డ్యూటీ కార్మికుల దగ్గర మిగిలిన పని, మిషన్ వివరాలు కనుక్కొని, బ్లాస్టింగ్ ఉండడంతో కార్మికులందరం వైటింగ్ రూములో ఉండిపోయాం.

సాయంత్రం ఆరుగంటలు దాటింది. బ్లాస్టింగ్ లన్ని అయిపోయాయని, పనిలోకి పోవాలనీ, క్వారీ సైరన్ మోగింది. నైటు ఇన్చార్జి గోవిందం వచ్చి పని గురించి చెప్పి, అందర్ని పిట్ లోకి తీసుకుపోతున్నాడు.

స్లాటర్, వయర్సా ఆపరేటర్లు కోటి, రామాంజనేయులు, కంప్రెషర్ ఆపరేటర్ శ్రీను, పొక్లయిన్ ఆపరేటర్లు శివారెడ్డి, సురేంద్రలు ఇన్ చార్జి గోవిందం, హెల్పర్స్ తో కార్మికులందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పిట్ లోకి వెళ్లి మిషనరీల చుట్టు తిరిగి చెక్ చేసుకుంటున్నారు. కొంతమంది కార్మికులు ఇంజన్ ఆయిల్స్, డీజిల్ తెప్పించుకోని బళ్లకి పోసుకుంటున్నారు.

నేను కూడ స్టోరు దగ్గర డ్రిల్లింగ్ రాడ్లు తీసుకొని హెల్పర్ కి ఇచ్చి పిట్ లో వస్తున్నాను. నా ముందు పంపింగ్ వేసే పెద్దాయన రామారావు నడుస్తున్నాడు. అప్పటికే పిట్ లో కొన్ని మిషనరీలు స్టార్ట్ అయ్యాయి. వయర్సా కటింగ్ నడుస్తుంది.

”ఢాఢాఢాం” అనే పెద్ద శబ్దం… ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా భూమంతా వణికింది. ఆ భయంకరమైన శబ్దంతో ఏదో కూలినట్టుంది.

ప్రక్క క్వారీ వాళ్లు చెప్పకుండా బ్లాస్టింగ్ కొట్టినట్టుంది. ర్యాంపు మీద నడుస్తున్న నేను నాకు తెలియకుండానే క్రిందబడిపోయాను. ఎదురుగా నడుస్తున్న పంపింగ్ పెద్దాయన కూడా అప్పటికే క్రింద పడిపోయాడు.

నాకు కళ్లు కనపడడంలేదు. దాదాపు పదిహేను నిమిషాలదాక ఏం జరిగిందో అర్ధం కాలేదు, నా చుట్టూ ఎవరూలేరు, ఎదురుగా చూస్తే మా క్వారీ మొత్తం దుమ్ము, ధూళితో కప్పేసింది.

మా క్వారీ అంచులో కొండచెరియ, పెద్ద బండరాయి మొత్తం కుప్పకూలిపోయింది. దాని క్రింద సుమారు ఇరవైమంది కార్మికులు ఉండిపోయారు. నలుగురు మాత్రమే బయటకు కనబడుతున్నారు.

తన కొడుకు ఆ కొండ చెరియ క్రింద ఉండడం, అంత పెద్ద ప్రమాదం తనకళ్ల ఎదురుగా జరగడం వల్లనేమో, నాకు అంత దూరంలో నడుస్తున్న ఆ పెద్దాయన రామారావు ఆ సంఘటనకు షాక్ కి గురై గుండాగిపోయి మరణించాడు.

ఇక్కడ పరిస్థితిని ఇన్చార్జి గోవిందం వెంటనే మైన్స్ మేనేజరుకు ఫోన్ చేసి చెప్పాడు. అర గంటలో క్వారీ సిబ్బంది మొత్తం వచ్చారు. మేనేజర్, ఓనరుకి, డి.డి.యం.యస్ సమాచారం ఇచ్చారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.

కాసేపటికి నందిని గ్రానైట్ ప్రమాద వార్త దావానంలా వ్యాపించింది. టి.వి.లలో తాజా వార్తయ్యింది. 108 అంబులెన్స్ లు గాయపడినవారిన తీసుకుపోతున్నాయి. అధికారుల ఆదేశాలతో పోలీసులు అప్పటికప్పుడు వందలమంది వచ్చి ఎవరిని లోనికి పోకుండ క్వారీకి కాపలాకాస్తున్నారు.

టి.వి.లలో వార్తలు రావడంతో కార్మికుల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఊరి దగ్గర బంధువులు కూడ ఫోన్లలో సమాచారాలు తెలుసుకుంటున్నారు.

ఒక్క నిమిషంలో ప్రాణాపాయం నుండి భయటపడ్డ నాకు కళ్ళెదుట జరిగిన దారుణానికి ఏమర్ధం కాలేదు. ఆ సంఘటనలో నలుగురు మాత్రమే గాయాలతో బయటపడి 108 లో ఆస్పత్రికి వెళ్లారు.

ప్రమాదంలో కొన ఊపిరున్నవారిని, మరణించిన బాడీలను బయటకు తీయడం చాలా కష్టంగా మారింది. పొక్లయిన్లతో బండరాళ్ళను బయటకులాగి తెగిన శరీర భాగాలతో వేలాడుతున్న బాడీలను తీయడం చాలా కష్టమైపోతుంది.

తెల్లవారే వరకు మృతదేహాల గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రాళ్ల గుట్టల్లో తమ తోటి కార్మికుల బాడీలను వెతకలేక, అలాగని వదిలేయలేక, నిద్రాహారాలు మాని మా పొక్లయిన్ ఆపరేటర్లు వెతుకుతూ అలసిపోతున్నారు.

ఆ రాత్రి ఇంటికాడ నుండి నాకు ఒకటే ఫోనులు. బ్రతికి ఉన్నాననే సమాధానంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.

క్షతగాత్రులను రక్షించి సహాయక చర్యల్లో పాల్గొని, అర్ధరాత్రి ఇంటికి వచ్చిన నన్ను చూచి మా సుభాషిని అమాంతంగా వాటేసుకుని ఏడ్చేస్తుంది. ఇక ఈ క్వారీ బ్రతుకు మనకొద్దని వేడుకుంటుంది. చుట్టు ప్రక్కలవారు ఎంత ఓదార్చిన ఆమె ఆగడంలేదు. ఇవేం పట్టనట్టు మంచం మీద ఏడాది పాప హాయిగా నిద్రబోతుంది.

ఆ రాత్రంతా అదే కలవరంలో మెలకువతోనేవున్నాను. అసలు కునుకు పట్టనేలేదు, ఒక్క నిమిషంలో ప్రాణాపాయం నుండి బయటపడడం, ఇది కలా! నిజమా! అని పదే పదే గుర్తుకొస్తుంది.

ఇంటి దగ్గర అమ్మా, చెల్లెలు గుర్తుకొచ్చారు. నన్నే నమ్ముకున్న ఎదురుగా సుభాషిని, పాప కనిపించారు, నాకు ఏదైనా అయివుంటే వీళ్ల పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచనలే ముసురుకుంటున్నాయి.

అంత పెద్ద బండ క్రింద ఎంతమంది కార్మికులున్నది. డ్యూటీలో ఎంతమంది పనిచేస్తున్నది మేనేజమెంట్ దగ్గర వివరాలు లేవు. క్వారీ ఎంప్లాయీస్ అయిన ఆపరేటర్ల పేర్లు మాత్రమే రిజిష్టర్ లో నమోదు చేస్తారు. రోజువారీ కూలీల బయోడేటాలు, గుర్తింపు కార్డులు లేవు. ఆధారాలు కంపెనీ దగ్గర లేకపోవడంతో మరణించినది మొత్తం పది మంది అయి ఉంటారనీ యాజమాన్యం బయటకు చెబుతుంది.

క్వారీ బండరాయి క్రింద చిక్కుకున్న యంత్రాలను, మరణించిన కార్మికులను తీయడానికి కష్టంగా మారింది. రోజుకొక శవం మాత్రమే బయట పడుతుంది. చుట్టు ప్రక్కల క్వారీల పొక్లయిన్ ఆపరేటర్ల సహకారంతో షిఫ్ట్ ల వారిగా సహాయ చర్యలు చేపట్టారు. వారంరోజులు గడిచినా మృతదేహాలను వెతకడం పూర్తి కాలేదు.

తమ పిల్లల ఫొటోలను పట్టుకుని ఎంతో మంది అమ్మలు విచారణ శిబిరం దగ్గరకొచ్చి అధికారులను మా పిల్లోడు కనిపించలేదని వేడుకుంటున్నారు.

నా మిత్రుడు శివారెడ్డి, మరో ఆపరేటర్ సురేంద్రల శవాలు దొరకకపోవడంతో తల్లడిల్లుతున్న వారి కుటుంబాలను ఎలా ఓదార్చాలో తెలియడంలేదు నాకు.

కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద రాయిని బ్లాస్టింగ్ చేసి పగల కొడితేగాని మిగిలిన బాడీలు వెతకడానికి వీలుపడదు. కానీ, ఆ రాయిని పగలగొట్టడానికి యాజమాన్యం ఇష్టపడడం లేదు, ఎందుకంటే దాదాపు వంద చదరపు మీటర్ల ఖరీదైన గిలాక్సీ రాయది. కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కార్మికుల మృతదేహాల కంటే వారికి బండరాళ్ళే ప్రధానమయ్యాయి.

బయట కార్మికుల ఆందోళనలకు భయపడిన అధికారులు, యజమానులు అప్పటికప్పుడు బ్లాస్టింగ్ హోల్స్ వేయించి పేల్చారు. మొత్తం బండరాళ్ళు తొలగించి చూస్తే ఎనిమిది మంది మృత దేహాలు ఒకే చోట దొరికాయి. అది శివారెడ్డి నడిపే పొక్లయిన్ మిషన్ క్రింద గుట్టగా పడివున్నాయి.

సహజంగా క్వారీలో ఏదైనా పేలుడు పదార్థాలు పేల్చేటప్పుడు భారీ యంత్రాల క్రింద సెల్టర్ తీసుకోవడం సహజం. అలాగే ప్రక్క క్వారీలో ఎక్కడన్నా బ్లాస్టింగ్ కొడుతున్నారని తెలిసినా తక్షణ రక్షణగా కార్మికులు చాలా మంది అలా పొక్లయిన్ క్రింద గానీ, డంపర్ల క్రింద దూరడం అలవాటు.

ఆ రోజు ఒక ప్రక్కఅంచు రాయి మొత్తం కూలడం వల్ల భారీ యంత్రాలు సైతం నేల మట్టమయ్యాయి. అందులో దాగిన కార్మికులు ముక్కలు, ముక్కలైపోయారు. ఎవరిది ఏ చెయ్యో, ఎవరిది ఏ కాలో గుర్తించడం కష్టంగా మారింది.

మరణించిన వారికి అక్కడే పోస్టుమార్టం చేస్తున్నారు. అలా మాంసపు ముద్దలనే రక్తబంధువులకు ఇస్తున్నారు. భార్య పిల్లలతో, తల్లిదండ్రులు రక్తసంబంధీకులతో మిత్రులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

క్వారీలో నమోదయిన ఆ పదిమంది శవాల మూటలు మాత్రమే బంధువులకు అప్పగించి, మిగిలిన శరీర భాగాలను అలాగే వదిలేసి గాలింపు పూర్తయిందని అధికారులు, పోలీసులు చేతులు దులుపుకున్నారు.

ఒకే ఇంటిలో తండ్రీకొడుకులు మరణించడంతో ఆ కుటుంబానికి మగ దిక్కులేకుండ పోయింది.

విజయవాడ నుండి అనేక మంది అనాధ యువకులను సరఫరా చేసే బ్రోకర్ల దగ్గర నుండి ఇక్కడి లేబరు మేస్త్రీ లు తీసుకొచ్చారు. ఆ యువకులందరూ చిన్నతనంలో అమ్మనాన్నల ఆదరణ లభించక పారిపోయివచ్చినవారే. పద్నాలుగు ఏళ్ల వరకు చైల్డ్ హోంలో పెరిగి బయటకువస్తారు. అలాంటి వారందరూ విజయవాడలో ఏవో పనులు చేసుకుంటూ బతుకుతుంటారు.

క్వారీ పనులలో కూలి ఎక్కువ ఉంటుందని ఆశపడి వచ్చారు. ఇక్కడ కొందరు మేస్త్రీల వారిని తీసుకొచ్చి కూలి డబ్బులు సరిగా ఇవ్వకపోవడంవల్ల, మోసాలకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు.

ఎలాంటి అడ్రసులు లేకపోవడం వలన ఇక్కడ మరణించిన కూలీల కోసం, ఎవరూరాలేదు. అలా మేస్త్రీల యజమానుల మధ్య లాలూచీ కుదిరింది. అందుకే యజమానులు ఇరవైమంది కార్మికులు మరణిస్తే పదిమందినే గుర్తించారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు.

ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో, ప్రభుత్వం, ప్రతిపక్షం పరామర్శకు వచ్చారు. ఆందోళన చెందిన కార్మికులు రాష్ట్ర, కేంద్ర మంత్రులను ఘోరావ్ చేసి కార్మికులకు కల్పించాల్సిన భద్రత, తీసుకోవల్సిన జాగ్రత్తల మీద కార్మికులు నిరసనలు, దీక్షలు చేపట్టారు.

పదిమంది అడ్రసు లేని కార్మికుల బాడీలను గుర్తంచాలనీ, వారికి కూడ కాంపన్షేషన్ చెల్లించాలనీ, వారి పేర్లు రిజిస్టర్లో నమోదు చేయని యాజమాన్యాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కార్మికులు ఆందోళనకు దిగారు.

రెండు రోజులు రాస్తారోకోలు చేస్తే లాఠీ చార్జి జరిగింది. చాలా మంది కార్మికులను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కేసులు పెట్టి విపరీతంగా హింసించారు.

***

ఎవరో భుజం మీద తట్టేసరికి ఉలికిపాటుతో కళ్లు తెరిచాను. మీటింగ్ అయిపోయింది. అక్కడకు చేరిన వేలమంది కార్మికులు, యాజమాన్యాలు, అధికారులు ఇంటిదారి పట్టారు.

మా ఇరవైమంది కార్మిక నాయకులు మాత్రం మంత్రి గారి అపాయింట్‌మెంట్ కోసం అర్జీలు పట్టుకు ఎదురుచూస్తున్నారు. క్వారీ యాజమాన్యం మీటింగ్ లో అప్పటిదాక గడిపిన మంత్రి, కార్మిక నాయకత్వంతో చర్చించకుండానే బయటకు వెళ్ళబోతున్నాడు.

ఆగ్రహంతో మోహన్, నరశింహరావు మరి కొందరం బిగ్గరగా నినాదాలు చేస్తూ మంత్రి కారుకు అడ్డంపడ్డాం. పోలీసులు లాఠీఛార్జి చేసారు. అయినా బెదరకుండా కారును కదలనీయలేదు. దిగి వచ్చిన మంత్రి కార్మిక నాయకులతో చర్చలు జరిపారు.

వందల మీటర్ల లోతుకు పోయిన క్వారీలలో ఎత్తుకు తగ్గ మార్జిన్లలో బెంచీలు లేకపోవడం, హైవాల్ వున్న ప్రాంతంలో క్రాక్ లు ఉన్నాయేమోనని గుర్తించకపోవడం, రిగ్ బ్లాస్టింగ్ అదుర్లకి కృంగుతున్నయో గమనించకపోవడం. రహదారులు పన్నెండు మీటర్లు వెడల్పు ఉండేటట్టు చేయకపోడం, అంత పెద్ద హైవాల్ క్రింద కార్మికులతో పనులు చేయించడమే అసలు ప్రమాదాలకు ముఖ్యకారణమని తెలిపాము.

యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ క్వాలిటీ రాయి వుంటే అక్కడ తవ్వకాలు చేసి ఒక పొక్లయిన్ తిరిగే ఇరుకుదారి మాత్రమే వుంచి, దారి విశాలంగా లేకపోవడం వల్ల ఇవ్వాల ఈ ప్రమాదంలో కొన ఊపిరితో చిక్కుకున్నవారిని రక్షించే అవకాశాలు లేకపోవడం జరిగిందని మంత్రి దృష్టికి తెచ్చాం.

రోజువారీ కూలీలు (లేబర్) చిరునామాలు నమోదు చేయకపోవడం వలన, కంపెనీలు రికార్డ్ చేయకపోవడం వలన ప్రమాదంలో మరణించిన కార్మికులు దిక్కులేని అనాధలుగా మారారు.

క్వారీ నిబంధనలకు విరుద్ధంగా క్వారియింగ్ చేస్తూ ఇంతమంది మరణాలకు కారణమైన యజమానుల క్వారీ లీజులను రద్దు చేసి, వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కార్మిక నాయకులు మంత్రి కి విన్నవించారు. క్వారీ లో భద్రత, కార్మికులు సంక్షేమం, కార్మిక చట్టాలు అమలు ప్రధాన డిమాండ్లతో అర్జీలిచ్చాం.

ఆ రోజు ఆ గనుల మంత్రి ఇచ్చిన హామీలతో కార్మికులందరం ఆందోళన విరమించి యూనియన్ సభ్యులం మాట్లాడుకోనీ ఇంటికి చేరాము.

వారం రోజులు కూడ కాలేదు పొద్దున్నే టీ తాగుతుండాగా కార్మికులు చర్చించుకుంటున్నారు. స్థానిక శాంతన్ క్వారీలో “డెరిక్” క్రేన్ కూలిపోయి నలుగురు కార్మికులు దుర్మరణం.

లాభాల్లో యజమానులు, నెలవారీ మామూళ్లలో ఆధికారులు, బండల క్రింద ఛిద్రమవుతున్న కార్మికుల బతుకులు. చావు ముంగిట్లోకి పోటీపడి పరిగెత్తి వాహనాలు ఎక్కిపోతున్న కార్మిక సోదరులు.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

4 thoughts on “జీవశ్చవాలు

  1. బండరాళ్ళ కిందపడి చిధ్రమవుతున్న జీవితాల గురించి చక్కగా రాశారు. మంచికధ

  2. అవసరమైన స్వరం..అథెంటిక్ స్వరం.. – ఇంకా ఇంకా జీవన చిత్రాలను గీస్తూ సాగాలని కోరుకుంటూ…అభినందనలు!

  3. సాధారణ ప్రజలకు తెలియని మైనింగ్ కార్మికుల జీవితాల వెతలను కథగా మలిచిన తీరు బాగుంది.అభినందనలు..గాజోజు నాగభూషణం

Leave a Reply