జనజీవన సమరదీప్తిగా విరాజిల్లే ‘జీవన సమరం’

మనుషులు రూపంలో విడివిడిగా కనబడినప్పటికీ నిజ జీవితంలో వారు నిర్దిష్ట సామాజిక సంబంధాల వ్యక్తీకరణగానే జీవిస్తారు. ఆ సంబంధాల స్వరూప స్వభావాలను విశ్లేషించడం ద్వారానే మానవ జీవిత సత్యం ఆవిష్కారం అవుతుంది. అయితే ఆ విశ్లేషణకు నిత్యం గతిశీలమైన మానవ జీవితానికి సంబంధించిన సకల సామాజిక వైరుధ్యాలను ఆకళింపు చేసుకోవడం అవసరం. ఆ ఆకళింపు రచయితకు గల లోతైన జీవితానుభవం, భౌతిక ప్రపంచం పట్ల తనకు గల దృక్పథం అతనిలో ఏ మేరకు జీర్ణమై విశ్వాసంగా మారింది అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. అట్టి సంపూర్ణ ఆకళింపుతో ఉన్న రచనలు ఏ మేరకు సామాజిక వాస్తవికతను ప్రతిఫలిస్తూ సత్యాన్ని ఆవిష్కరిస్తాయో ఆ మేరకు ఆయా రచయితలు సమాజపు ‘ఆత్మలు’గా, అంతరంగాలుగా భాసిల్లుతారు. పైగా ఆ రచయితలకు చారిత్రిక గతిక్రమాన్ని సాహిత్య రూపంలో రికార్డు చేసే గొప్ప అవకాశం లభిస్తుంది.

మన తెలంగాణ సమాజపు అలాంటి ఒకానొక ‘ఆత్మ’, అంతరంగపు ఆవిష్కర్తే రచయిత ఎం.వి.తిరుపతయ్య గారు. ఎందుకంటే ఆయన సమాజజీవిత సౌధానికి మూలకారకులైన పునాది వర్గాలను, పేద ప్రజలను ప్రేమించాడు. ఆయన ఆ శ్రామిక ప్రజల జీవితోన్నతి కోసం ఉపయోగపడే నికార్సైన స్థూల ప్రజాస్వామిక దృక్పథం కలిగిన అరుదైన రచయిత.

నా దృష్టిలో ఎం.వి. తిరుపతయ్య గారు ఎందుకు అరుదైన రచయితనంటే – ఆయన తన నవల మాధ్యమంగా పరిసర సామాజిక జీవన వాస్తవికతను ఎటువంటి వక్రీకరణ లేకుండా దాని పలు పార్శ్వాలను సజీవంగా చిత్రీకరించాడు. తన వైయక్తిక అనుభవానికి, చదువు వల్ల తన బుద్ధి వికాసం ద్వారా అలవడిన సామాజిక, చారిత్రక జ్ఞానాన్ని జోడిస్తూ ఎప్పటికప్పుడు తనను తాను సమకాలీనం చేసుకున్నాడు. తనకున్న ప్రజాస్వామిక దృక్పథాన్ని కాలానుగుణంగా అప్ డేట్ చేసుకుంటూ విస్తరించుకున్నాడు.

అలా అప్ డేట్ చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలోనే ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకి మృత్యువు త్వరలోనే సంభవిస్తుందని నిర్ధారణ అయింది. అప్పుడే మనిషి బతుకు గురించి తనకున్న ఆలోచనానుభవాలను నవలా రూపంలో రాయడానికి పూనుకోవడం వల్లనే ఆయనలోని రచయిత మళ్లీ బయల్పడ్డాడు. అంటే చావుకు సంసిద్ధమైతే తప్ప బతుకును గురించి ధైర్యంగా రాయలేని సామాజిక దుస్థితిని మనం ప్రజాస్వామ్యం అంటామా? ముమ్మాటికీ అనలేము.

సరిగ్గా ఇటువంటి అప్రజాస్వామిక స్థితిలోనే ఎమర్జెన్సీ కాలంలో తిరుపతయ్య మొదటిసారి అరెస్టయి భయంకర పోలీసు నిర్బంధాన్ని చవిచూశాడు. ఆ నిర్బంధ కాలంలోనే తాను అనుభవించిన చిత్రహింసల్ని, తద్వారా ఉద్భవించిన తన మనోభావాలను సిగరెట్ ప్యాకెట్లపై డైరీగా రాసి బైటికి పంపించాడు. వాటి ఆధారంగానే అంపశయ్య నవీన్ తర్వాతి కాలంలో ‘చీకటి రోజులు’ అనే నవలను రాసాడు. అలాంటి ‘చీకటి రోజులు’ నవలకు మూలకారకుడయిన తిరుపతయ్య ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు రచయితగా తెలియని చీకటిలోనే జీవించాడు. మళ్ళీ 1986లో సామాన్య తెలంగాణ శ్రామికుల బతుకు తీరుపై ‘బతుకు’ అనే మొదటి నవలను రాసాడు. 1987లో చతుర మాసపత్రిక నిర్వహించిన నవలల పోటీలో ఆ నవల బహుమతి పొంది పుస్తకంగా అచ్చయింది. మళ్ళీ మరో రెండు దశాబ్దాల పాటు ఏ రచనా చేయకుండా సహజంగా లోన ఉబికి వచ్చే ఉప్పెన లాంటి భావోద్వేగపు ఉపద్రవాలను కట్టడి చేసుకుంటూ బయటికి గంభీరమైన సముద్రం వలె మౌనంగా బతికిన రచయిత ఎం.వి.తిరుపతయ్య. ఆ తర్వాత 2007లో క్యాన్సర్ సోకిన కారణంగా సంభవించ బోయే మృత్యువును ధిక్కరిస్తూ రాసిన రెండవ నవల ‘జీవన సమరం’ ద్వారా తెలంగాణా సమాజపు బతుకు స్వరూప సారాంశాలను రచయిత పాఠకులకు అందించాడు.

రచయిత తన ‘జీవన సమరం’ నవల ఇతివృత్తానికి బాలమల్లు, భద్రమ్మల పేద కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ కుటుంబంతో పాటు కూలివాడలో నివసించే ఇతర పేదవాళ్ళ జీవితాలను, వారి దైనందిన బతుకుపోరును ఎంతో ఆర్తితో చిత్రించాడు. నవలలో అడుగడుగునా జీవితం పట్ల ఎనలేని ప్రేమ కనిపిస్తుంది. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండా జీవితం తాలూకు సకల భావోద్వేగాలను, బలమూబలహీనతలను, ఆరాటపోరాటాలను, ఆశానిరాశలను రచయిత ప్రభావవంతంగా దృశ్యీకరించాడు. పాత్రల రూపకల్పనలో ఎక్కడా ఆదర్శీకరణ చోటుచేసుకోకుండా వాటిని స్వతంత్రంగా నడిపించి పాత్రల వ్యక్తిత్వ స్వరూప స్వభావాలను వాటి సొంత చైతన్య పరిమితుల్లోనే సహజంగా చిత్రించాడు. అయితే బతుకును ప్రేమిస్తూ నిరంతర బతుకుపోరే తమ జీవితంగా జీవిస్తున్న నిజాయితీ గల మనుషులెప్పుడూ ఒక శూన్యం లో ఉండరు. వేర్లలాంటి సంస్కృతీ సాంప్రదాయాలు కలిగినటువంటి మనుషుల జీవితచిత్రణ లోనే సజీవత్వం, సహజత్వాలతో పాటు నిజమైన సామాజిక మానవసారం వ్యక్తీకరించబడుతుంది.

కనుకనే సంస్కృతీసంప్రదాయాల్లో భాగంగా ప్రజలు అనుసరించే పండుగలు, దేవతల పూజా కార్యక్రమాలు, చివరకు మనుషులు చనిపోయినప్పుడు నిర్వహించే శవయాత్రలను సైతం రచయిత డజన్ల పేజీల కొద్దీ వర్ణించాడు. తొలుత ఈ నవల రాసినప్పుడు 600 పేజీల దాకా తయారయింది. ఇన్నిన్ని పేజీలు వర్ణించారేందని అడిగితే- సంస్కృతీ సంప్రదాయాలు లేనిది అసలు మనిషెక్కడున్నాడని రచయిత ఎదురు ప్రశ్న వేసాడు. అడుగడుగునా పునరుక్తి పొందిన వర్ణనలను ఆయన ఒప్పుదల మేరకే సగానికి సగం తగ్గించి నప్పటికీ ఈ నవల 282 పేజీల దాకా విస్తరించింది. నా మట్టుకు నాకయితే ఆయన వర్ణనలు తర్వాతి తరాలవారికి తెలంగాణకు సంబంధించిన ఒక గొప్ప చారిత్రిక సాంస్కృతిక సంపదగా నిలుస్తాయనిపించింది.

ఈ నవలలో పేదవాళ్ల బతుకుల్లోని సంఘర్షణ మాత్రమే కాదు సమైక్యత కూడా ఎన్నెన్ని రూపాల్లో ఉండగలదో మనం చూస్తాం. రెక్కాడితే గాని మన లేని బతుకులు, మంచినీళ్ల కొరత, నరసమ్మ కల్లు దుకాణం దగ్గర చర్చలు, గొడవలు, కిరాణాకొట్టు దత్తయ్యతో, మాంసం కొట్టు ఇమామ్ తో, సోడా సిద్దయ్య తో, స్వీట్ పాన్ రాంలాల్, గుడిసె హోటల్ తుకారాంలతో బాలమల్లు లాంటి మనుషుల సంబంధాలలో సమైక్యతా సంఘర్షణలను మనం ఇందులో చూస్తాం.

నందు స్కూలుకు పోయివచ్చే దారిలో జరిగే పోచమ్మ గుడి దగ్గర పూజలు, కల్లు దుకాణంలో చెప్పే పాండవుల కథలు, ఒగ్గు కథలు, ఆటగాళ్లు చేసే గారడీ విన్యాసాలు, కోతుల్ని, ఎలుగుబంట్లనాడించి, పాము ముంగీసలకు పోట్లాటపెట్టి ఆడించి పొట్ట పోసుకునే వాళ్ళు, మూడు నాలుగు రోజులకు ఒకసారి మున్సిపాలిటీ నీళ్లు వచ్చినప్పుడు బజార్ లో మనుషులు తిట్టుకోవడం, కొట్టుకోవడం, మళ్లీ కలిసిపోవడం, కట్టమీద చాకలి వాళ్ళు బట్టలు ఉతకడం, గాడిదలు చిత్తుకాగితాలు ఏరుకుతినడం, చెరువులో చేపలు పట్టేవాళ్ళను చూడడం, సమాధుల మీద పడుకొని మిత్రుడు వెంకన్న ద్వారా నందు లోకరీతుల్ని తెలుసుకోవడం లాంటి సమస్త ప్రాపంచిక విషయాల్ని రచయిత దృశ్యమానం చేస్తాడు.

మొత్తంగా మానవ జీవితం వైవిధ్యంగా మాత్రమే కాదు ఎంత వైరుధ్యంగా కూడా కొనసాగగలదో మనం ఈ నవల్లో చూస్తాం. ముఖ్యంగా దైనందిన జీవితంలో తలెత్తే సకల వైరుధ్యాలతో ప్రజలు ఎలా వ్యవహరిస్తారో, వాటి తాలూకు చేదు జ్ఞాపకాలను వెన్వెంటనే మరచిపోయి మళ్ళీ ప్రేమను పంచుకుంటూ నిరంతరం ఎలా జీవితాన్ని పునర్నిర్మించుకుంటారో ఈ నవలలో స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు భద్రమ్మ, ఆమె అత్త ఒకరినొకరు విమర్శించుకుంటారు. దెప్పి పొడుచుకుంటారు. మళ్ళీ వెంటనే పశ్చాత్తాపపడి పరస్పరం ప్రేమ చూపుకుంటారు. పరస్పరం సానుభూతి ప్రదర్శించుకుంటారు. ఎడతెగని కష్టాల్లో మునిగి ఉండి కూడా బతుకు పట్ల ఒక ఆశావహ దృక్పధాన్ని ఎలా కలిగి ఉంటారో మనం భద్రమ్మ పాత్రలో చూస్తాం. కుల మత భేదాలతో నిమిత్తం లేకుండా ప్రజల మధ్య ఎలాంటి సమైక్యతా సామరస్యాలు౦టాయో కూడా మనం ఈ నవలలో గమనిస్తాం. మత్తు పానీయాలు తాగడం లాంటి వ్యసనాలకు బానిసలు కావడం, మత్తులో కష్టాలను మరచిపోవడం, మళ్ళీ మర్నాడు తమ దైనందిన బతుకుపోరులో నిమగ్నం కావడమూ మనం చూస్తాం. అంటే రచయిత మానవ జీవితంలోని వైరుధ్యాలను రూపంలో పైకి కనబడినట్టుగా కాకుండా లోలోతుల్లోకి వెళ్లి వాటి సారాన్ని పట్టుకొని చాలా పరిణతితో చిత్రిస్తాడు. అడుగడుగునా ప్రజల నాలుకలపై నిత్యం నడయాడే సామెతలను వాడడం వల్ల జనసామాన్య జీవితాన్ని చాలా సహజంగా పాఠకుల హృదయాలకు హత్తుకునేట్టుగా రచయిత వర్ణిస్తాడు.

కులమతాల ఘర్షణల రూపంలో మారణహోమం జరుగుచున్న ఈనాటి కాలంలో వైరుధ్యాల పట్ల సరైన అవగాహన లేకుంటే రచయితలు ప్రభావవంతమైన రచనలు చేసే అవకాశం ఉండదు. ఒక చిన్న భేదాభిప్రాయమే శత్రుపూరితంగా మారుతున్న వేళ, మతమే రాజ్యాధిపత్యమై ఫాసిజంగా మారిన నేటి కాలంలో వైరుధ్యాల తాలూకు రూపసారాలను ప్రతి రచయితా సూక్ష్మస్థాయిలో అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని కూడా ఈ నవల తెలియజేస్తుంది.

అంతేగాకుండా ఈ నవలలో ప్రతిచోటా బతుకుకు సంబంధించిన ఒక ఆశావహమైన తాత్వికత కనిపిస్తుంది. మనుషుల్ని కలిపివుంచే ప్రేమతత్వం కనిపిస్తుంది. ఉదాహరణకు – నందుకు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత తల్లి భద్రమ్మ నందుతో ఆత్మీయంగా ఇలా మాట్లాడుతుంది. ‘’గట్లనే మన బతుకులల్ల ఒక్క చేదు మాత్రమే లేదు నందూ! దానక్క ప్రేమ కూడా ఉన్నది. ఇప్పుడు మనమనుబగిస్తున్న చేదు కొన్ని రోజులకు తియ్యగైపోద్ది. ఇప్పటి ఈ కష్టాలే రేపటి మన సంతోష సమయాలల్ల సుకాలైతయి. ప్రేమ మన బతుకులకు తల్లి. నువ్వు మంచిగ సదువుకుంటే దుక్కం ఎనుకకు పోయి సుకం ముందటికొస్తది నందూ!’’ (పే. 85- జీవనసమరం).

ఇట్లా చెబుతూ చెబుతూ… ‘’బిడ్డా మన బతుకుపాట ఎప్పుడన్న నీ చెవుల్లో వినిపిస్తుందా నందూ? నువ్వు మనసుపెట్టి యి౦టే మాగినిపిస్తది. సావుపాటలో బతుకు గొప్పదని మనకు తెలుస్తది’’ అని భద్రమ్మ కొడుకు నందుతో అంటుంది. (జీవన సమరం- పే.85)

అట్లే అత్త మరణించినప్పుడు భద్రమ్మ ఆమె గురించి స్వగతంలో ఇలా తలపోసుకుంటుంది. ’’మగని ఆధారం లేదని భయపడినప్పుడు నేనున్నానని అక్కున చేర్చుకున్నది ముసలమ్మ. నేను గర్భవతినైనప్పుడు, కాన్పులప్పుడు ఆలనాపాలనా చూసి తల్లి ప్రేమనందించింది ముసలమ్మ. ఆమె తమతో సుఖం కన్న దుఃఖాన్నే ఎక్కువగా అనుబగించింది. తమ పేదరికాన్ని, ఆకలిని, ఆర్తిని, అవమానాల్ని పంచుకునే అత్త ఇక లేదు అన్న ఆలోచనే తనను బాధపెట్టి భయపెడుతోంది’’ అననుకుంటుంది. (జీవనసమరం, పే.97)

ఇలా జీవితాన్ని అన్ని కోణాల్లో చూసి అర్థం చేసుకోవడం, అననుకూలాంశాలతో పాటు సానుకూలాం శాలను కూడా గుర్తించి గుర్తుపెట్టుకొని మనుషులతోనున్న అనుబంధాలను తలపోసుకోవడం ద్వారా మానవ జీవితాన్ని సరిగ్గా అర్థంచేసుకోవచ్చని కూడా ఈ నవల ద్వారా పాఠకులు తెలుసుకుంటారు.

ఒక చోట నందు తన స్వగతంలో ఇలా అనుకుంటాడు. అందరినీ తిట్టినట్టుగా కాకుండా నాయినమ్మ తనను మెత్తగా తిట్టేదని, ఆమె తిట్టినా,దీవించినా తనకానందమే కలిగేదని అతడు తలపోసుకుంటాడు.

అలాగే బడిలో నందుకు గురువు ఆచార్యతో ఏర్పడిన గాడానుబంధాన్ని కూడా ఇందులో చూస్తాం. ఒకసారి ఆచార్య ఈ ప్రపంచంలో ఉన్న కష్టాల గురించి, జీవితంలో ఉన్న హింసాద్వేషాల గురించి చెబుతూ నందుకు ఇలా ఉద్బోధిస్తాడు.
‘’నందూ, ప్రపంచంలో ఇంత కష్టంవుందా? ఇంత దుఃఖంవుందా? ఇంత కసి,పగ,ద్వేషం,హింసవుందా? అని నీకనిపించవచ్చు.కాని ఇంత కన్న ఎక్కువగా సుఖం,సంతోషం,ఆనందం,ప్రేమా ఉన్నాయి…..అక్రమాల నుంచి ఆనందం దొరకదు. మనుషుల్ని ప్రేమించడం ద్వారా మన కష్టాలతో పాటు వారి కష్టాల్నీ మోసే ఆత్మీయతా భావంతో మాత్రమే ఆనందం లభిస్తుంది. ఇతరుల కష్టాల్ని మోసే అనుభవం లేకుండా ఆనందం అర్థం కాదు.ఆనందం దొరకదు గూడా’’ అనంటాడు ఆచార్య. (జీవన సమరం, పే.213)

నందు అన్న యాదగిరి రాడికలై అన్నల్లో కలిసిపోయిన తరువాత బాలమల్లు కుటుంబం భయంకరమైన రాజ్య నిర్బంధానికి గురవుతుంది. దానికి తోడు ఒక లెఫ్ట్ పార్టీతో ఉన్న బాలమల్లు తాగుబోతు అయినప్పటికీ ఎంతో కొంత స్వతంత్ర వ్యక్తిత్వం ఉండడం వల్ల నమ్మకాలు,లక్ష్యాలు గుండెను తట్టి లేపినప్పుడు ఎంతోకొంత దృఢంగా నిజాయితీ నిబద్ధతలను ప్రదర్శించడం కారణంగా రాజ్యం కంటగింపుకు గురవుతాడు. అతన్ని అరెస్టు చేసి, అతనిపై రాజద్రోహం కేసు మోపి ఎటువంటి బెయిల్ రాకుండా చేసి జైల్లోనే నిర్బంధస్తారు.అటువంటి కష్టకాలంలో ఒకరోజు గురువు ఆచార్య ‘’నువ్విప్పుడు దుఃఖంతో పాటు చదువుతో కూడా పోరాడాలి. బతుకుతో పోరాడాలి.ధైర్యం కోల్పోవద్దు. నీ చదువే నీ ఆయుధం కావాలి’’ అని నందుకు హితబోధ చేస్తాడు.

నందేమో లోకాన్ని అర్ధం చేసుకోవడంలో తీవ్ర సంఘర్షణకు గురవుతూ ఉంటాడు. దైనందిన పోరులో అవిసి పోతున్న బతుకులను, ప్రజల ఆక్రందనలను, నిస్సహాయతను చూసి అతడు చలించిపోతాడు. బతుకు బాధతో విలవిలలాడుతున్న ప్రజలకు విముక్తి మార్గం ఏది అన్న ఆలోచన అతన్ని దహించివేస్తుంది. ఇంత హింస,అన్యాయం,దుఃఖం ఉన్న ప్రపంచం వుంటే౦ది, లేకుంటే౦దని కూడా అనుకుంటాడు నందు.

ఏళ్ల తరబడి ఒకేచోట కలిసి బతుకుతున్న ప్రజలు ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా బద్ద శత్రువులు కావడం, పోలీసుల లాఠీ దెబ్బలు తినడం, ప్రత్యర్థి పార్టీల దాడుల్లో కాల్జేతులు పోగొట్టుకొని వికలాంగులు కావడానికి, ప్రాణాలను సైతం పోగొట్టుకోవడానికి సిద్ధమయ్యే ప్రజలను చూసి నందు గుండె తరుక్కుపోతుంది. పైగా ఈ ఎన్నికల హింస ఒక ప్రజోపయోగ సిద్ధాంతం కోసమో, సమాజ శ్రేయస్సు కోసమో జరగడం లేదని బాధపడతాడు. దేశాన్ని దోచుకు తినే నాయకుల కోసం, వాళ్లు ఇచ్చే డబ్బుల కోసం, సార పొట్లాల కోసం మొత్తంగా తమ ప్రయోజనాల కోసం కాకుండా పరుల ప్రయోజనాల కోసం తమలో తాము హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజలకు కనువిప్పు ఎలా కలుగుతుందని ఆవేదన చెందుతాడు. అసలు ఈ ఎన్నికల రాజకీయాలు ప్రజల్ని చీల్చి వాళ్ళ మద్య పగ పెంచుతున్నాయి తప్ప వాళ్లను ఒక్కటిగా చేయడం లేదని స్వగతంలో నందు అనుకుంటాడు.


ఇలా నందుకు ఈ ప్రపంచం ఎన్నో లోపాలతో ఉన్నట్టు కనిపించింది. ఈ లోపాలను సవరించడానికేనా ఇంతమంది ఇన్ని బాధలు పడుతున్నారా? అందుకే నాయన బాలమల్లు దేశాన్ని దోచుకునే పెద్ద పెద్ద (పార్టీ) వాళ్లను ధిక్కరించి జైలు పాలయ్యిండా? తన నాయిన లాగా ఎందరో ప్రజలు ఏవో కొన్ని విలువలు కలిగి ఉండి తమ ఆలోచనాశయాలకు దగ్గరగా ఉండే వామపక్ష పార్టీల మీటింగ్ లకు వెళ్తున్నారా? అందుకే అన్న యాదగిరి లాంటివాళ్ళు తాము నమ్మిన అన్నల దారిలో పయనిస్తూ పోరాడుతున్నారా? సమసమాజపు ఉన్నతాశయాలు ఆచరణ రూపం దాల్చబోతున్నాయనుకున్న సమయసందర్భాల్లో తీవ్ర సంఘర్షణకు గురై తమకున్న బలహీనతలనధిగమించి నూతనావేశంతో ప్రజలు పోరాటాలకు సిద్ధమై అరెస్ట్ అవుతున్నారా? మరి కొందరు అజ్ఞాతంగా పోరాడుతూ పోలీసులు ఎన్ కౌంటర్ల పాలవుతున్నారా? అసలు అన్నలు,పోలీసులు చేస్తున్న యుద్ధంలో మామూలు జనం ఎందుకు చనిపోతున్నారు? అన్నలకు,పోలీసులకు మధ్య ఏమైనా పగ ఉన్నదా? లేకుంటే యుద్ధమె౦దుకు జరుగుతోంది? ఇటువంటి ప్రశ్నలెన్నో టీనేజ్ లో ఉన్న నందును చుట్టుముట్టి తీవ్ర మనస్థాపానికి గురి చేస్తాయి.

అప్పుడప్పుడు ‘’ఈ వయసులో మనకిప్పుడు గా సంగతులు అర్థం కావు’’ అన్న తోటి మిత్రుడు శ్రీను అన్న మాటలు నందుకు గుర్తుకువస్తాయి. ఆచర్యేమో పోరు సిద్ధాంతం గురించి తనకు సంపూర్ణ అవగాహన లేదంటూనే, తప్పొప్పులపై విమర్శాప్రశంసలు ఎలా ఉన్నప్పటికీ చరిత్రలో అన్నలు సాధించింది మాత్రం చాలా ఉందని, ఒకప్పటి దొరల ఆధిపత్యం, వెట్టిచాకిరీ పోయాయని చెప్పిన మాటలు అతనికి గుర్తుకొచ్చాయి. ఇంకా, పగ ఉంటేనే కాదు ప్రేమ కోసం కూడా యుద్ధం జరుగుతుందని, అన్నలది అలాంటి దీర్ఘకాలిక పోరాటమేనని, ఎన్నటికైనా వాళ్ళు దుఃఖాన్ని రూపుమాపి విజయం సాధిస్తారని ఆచార్య అన్న మాటలు నందు చెవుల్లో మార్మోగుతాయి.

కురుమ గూడెంలో టీచర్ శంకరయ్యను అన్నలు చంపడం పై చర్చ వచ్చినప్పుడు ‘’ఇండ్ల మనకు ఎరుకలేనిదేదో ఉన్నదని, అన్నలిట్ల చేసి౦డ్రని తెలిసి నేను సతమతమై పోతున్నానని’’ పెదనాయిన రాఘవులు అన్న మాటలు కూడా నందుకు గుర్తుకొస్తాయి.

మరి అట్లయితే అన్నల్నెందుకు అందరూ గుర్తించడం లేదన్న నందు ప్రశ్నకు జవాబుగా – మారిపోతున్న పరిస్థితులను, కాలానుగుణంగా మారుతున్న అవగాహనా చైతన్యాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రతీకారేచ్ఛతో మాత్రమే పోరాడుతున్నారనే విమర్శ వాళ్ల మీద ఉందని, పైగా వాళ్ళ లక్ష్యాలను హింస లేకుండా కూడా సాధించవచ్చని మరికొందరు అనుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు సమాజంలోని అందరిక౦దరూ అన్నలను గుర్తించే పరిస్థితి లేదని ఆచార్య చెప్పిన మాటలు కూడా నందుకు గుర్తొచ్చాయి.

ఒక్కోసారి నందుకు నాయిన బాలమల్లు గుర్తుకొచ్చి అతడు ఒక యుద్ధవీరునిలా కనిపిస్తాడు. ములాఖత్ లో నాయిన తనకు కొత్తగా కనిపిస్తాడు. ఇతర ఉద్యమకారులతో స్నేహం వల్ల అతడు మారిన మనిషిగా కనిపిస్తాడు. అతని కళ్ళల్లోని ప్రేమను చూసి ఆ ప్రేమ జీవితానికి చాలదాననిపించి పులకించి పోతాడు నందు. కొన్ని కొన్ని సార్లు అన్న యాదగిరి కూడా నందుకు గుర్తుకొస్తాడు. అన్న కూడా ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల ఎన్ కౌంటర్లో చనిపోతాడేమోనని అతడు ఆవేదన చెందుతాడు. యుద్ధమని తెలిసే వెళ్ళాడు కనుక ఎప్పుడైనా చనిపోవచ్చని ఆచార్య చెప్పిన మాటలూ అతనికి గుర్తుకొచ్చాయి. ఇంకా ఆయనే చెప్పినట్లుగా – ప్రజల మధ్య ఒక్క హింసే గాదు, అంతులేని ప్రేమ కూడా ఉంటుందన్న విషయం తన నాయిన బాలమల్లు అరెస్ట్ అయి నిర్బంధంలో ఉన్నప్పుడు స్వానుభవంలో తనకు నిజమని తెలుస్తు౦ది. తమ కుటుంబం పై ప్రజలు చూపుతున్న ప్రేమకు వివశుడై పోయి ఆనందిస్తాడు, గర్విస్తాడు. అలాంటి ప్రజల పట్ల అంతులేని ప్రేమను, గౌరవభావాన్ని అతడు పెంచుకుంటాడు.

క్రమక్రమంగా నందు వాడలో ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. కాని నందు అందరి మనిషిగా గుర్తింపు పొందడం తన తల్లికి ఇష్టం లేదు. అతన్ని కూడా కోల్పోతానేమోనన్న భయం ఆమెను పీడిస్తుంటుంది.కనుక ఆమె నందును పరిసరాలన్నింటినీ పట్టించుకోకుండా చదువుమీదనే శ్రద్ధ పెట్టి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోవాలని కోరుకుంటుంది. కాని తల్లి మాటలు నందును బాగా కలవర పెడతాయి. ఏ పునాదుల నుంచి తాను పుట్టి పెరిగాడో వాటిని తల్లి వద్దంటోంది. వాటిని త్యజించి వేరే పునాదుల్ని, మేడా నిర్మించుకోమ౦టుంది. నిజానికి నందుకు చదువు అంటే భయం లేదు. తన తల్లి కలల్ని నిజం చేయాలని బలంగా కోరుకుంటాడు. కాని మిత్రుడు వెంకన్న అన్నట్లుగా తాను తననుకున్నట్లుగా బతుక గలడా? తల్లి కంటున్న కలలు నిజమవుతాయా? అని సందేహిస్తాడు నందు.

తన తల్లి, గురువు ఆచార్య లు చెబుతున్నట్లుగా పరిసర పరిస్థితుల్ని పట్టించుకోకుండా చదువుకోవడం అతనికి అసాధ్యం అనిపించింది. ఒకవేళ అలా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే మాత్రం ఈ పరిస్థితులన్నీ మారుతాయా అని కూడా ప్రశ్నించుకుంటాడు. అట్లని అప్పటికప్పుడు నందు నాయిన బాలమల్లు లాగానో, అన్న యాదగిరి లాగానో కార్యాచరణలోకి పోవడానికి మానసికంగానూ, వయసురీత్యానూ సిద్ధంగా లేడు. ఇద్దరి లక్ష్యం మంచిదే అయినప్పటికీ మార్గాల విషయంలో తనకు ఇంకా ఏకీభావం కుదరలేదు. నాయిన అనుసరించే మార్గం వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేది కాకపోగా, అన్న యాదగిరి అనుసరించే మార్గంలో అపశృతులుగా కొన్ని కొన్ని చోట్ల విచ్చలవిడి హింసకు పాల్పడుతూ, విచక్షణా రహితంగా ప్రజలనే చంపే తీరు పట్ల అతడు విముఖంగా ఉంటాడు. నిజానికి 2006-2007 నాటికే ఆంధ్రదేశంలో విప్లవ ప్రతిహింసపై తీవ్రంగా చర్చోపచర్చలు జరిగిన కాలం అది. వాటి ప్రభావం రచయిత(ల)పై గాని, సమాజంలో నందు లాంటి ఎందరో యువతీ యువకులపై గానీ లేకుండా పోలేదన్న విషయం పాఠకులకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.

ఏదేమైనప్పటికీ తాను శూన్యంలోంచి రాలేదని, జనంలో౦చి పుట్టుకొచ్చిన తాను జనం బతుకుపోరులో కలిసిపోవాలని, చిలుంబట్టిన ఇనుప ముక్కల్లాంటి జనం బతుకులను వెలిగించడానికి తానొక సమిధ కావాలని కోరుకుంటాడు నందు. చెత్తాచెదారంలో బతుకులీడుస్తూ తమ మానాల్ని అమ్ముకుంటూ దుర్భర జీవితాలను గడుపుతున్న ఎందరో స్త్రీలను, శ్రమను అమ్ముకుంటూ బతుకుతో పోరాడుతున్న కూలినాలి జనాన్ని చూస్తాడతడు. దుర్గంధమయ జీవితాన్ని మనస్ఫూర్తిగా కౌగిలించుకొని, అనుభవించి రుచి చూసాక , దానికోసం బాధపడి, వేదన చెంది, అప్పుడు దాన్ని ప్రేమించడం మొదలు పెట్టాడతడు. ఎక్కడైతే బతుకు కిందకు తోసేస్తుందో అక్కడే లేచి నిలబడాలని నిర్ణయించుకుంటాడు.

ప్రజల గొర్రెదాటు మనస్తత్వాన్ని మార్చి, వారిలో చైతన్యాగ్నులను రగిలించాలనుకుంటాడు. ప్రజల్ని పావులుగా చేసి, వారి మాన ప్రాణాలను హరించే ఏ రంగు రాజకీయ పార్టీలైనా అవన్నీ ప్రజల పాలిట మృత్యుశకటాలేనని అతడు భావించాడు. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఓట్లు కొనుక్కోవడం, దొంగ ఓట్లు వేయించుకోవడం, అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం, అధికారంలోకి వచ్చాక గెలిపించిన ప్రజల వీపుల మీద తన్ని వారి నడ్డి విరిచే పరిస్థితులు మారాలనుకుంటాడు. తినడానికి పిడికెడు కూడు, కట్టుకోవడానికి మూరెడు గుడ్డ, ఉండడానికి౦త గూడు, అనుభవించడానికి౦త స్వేచ్ఛనివ్వలేని రాజకీయాలు తన దేశానికి వద్దేవద్దనుకుంటాడు. ఈ దేశంలో ఇన్ని లోపాలతోనున్న ప్రజాస్వామ్యాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్యమనడం పెద్ద ఆత్మవంచనేనని భావిస్తాడు.

కనుక ఇప్పుడున్న రాజకీయాల పట్ల ప్రజల అవగాహనా చైతన్యాలను పెంపొందించాలని, ఎటువంటి విరుద్ధమైన అభిప్రాయాలనైనా వ్యక్తపరిచే నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రాజ్య వ్యవస్థలో ఉండాలని, ఆ అభిప్రాయాల మంచి చెడ్డలను నిగ్గు తేల్చే స్వేచ్ఛావకాశాలు ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యమవుతుందని అతడు అభిప్రాయపడతాడు. అందుకు ఇప్పుడున్న ‘ ప్రజాస్వామ్యాన్ని’ ప్రక్షాళన చేయడం కోసం తాను కృషి చేయాలని అనుకుంటాడు. సామాజిక న్యాయంతో కూడిన స్వేచ్చే మెరుగైన నూతన సామాజిక వ్యవస్థను స్థాపించడానికి దారి చూపుతుందని అతడు విశ్వసిస్తాడు.


ఎప్పుడైతే నందు ఇలా కొత్త కొత్తగా ఆలోచిస్తాడో అప్పుడే అతనిలో నూతన జవసత్వాలు వచ్చి చేరినట్లనిపిస్తుంది. అతడప్పుడు సుందర భవిష్యత్తును స్పష్టంగా దర్శిస్తాడు కానైతే వాస్తవికం కాని ఒక స్వాప్నిక లోకంలో. అక్కడతనికి మారిన జనం కనిపిస్తారు. అక్కడ తనలాంటి వాళ్లతో పాటు ఆచార్య లాంటి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా కనపడతారు. ఇంకా నాయిన, పెదనాయిన, శ్రీను, అమ్మ, జమున, వెంకన్న తదితర తెలిసిన వాళ్ళ౦దరూ సుశిక్షితులవుతున్నారు. అక్కడ ఇదివరకు తానెన్నడూ చూడని స్వేచ్ఛా సమానత్వాలు, సహకార సమిష్టి జీవనం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయి. అక్కడ దోపిడీ దౌర్జన్యాలు, హింసా రక్తపాతాలు, అత్యాచారాలు లేవు. కుల మత వర్గ విభేదాలు లేవు. అక్కడ నిష్పక్షపాత౦గా న్యాయమైన తీర్పులిస్తున్నారు. జనమంతా తమ బతుకులను బాగు చేసుకుంటున్నారు. బతుకుటేరులో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.

తీరా చూస్తే అదొక కల. అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి తాను కొన్ని నిర్ణయాలను తీసుకున్నాడు. తల్లి, ఆచార్య చెప్పినట్లే తాను తప్పక చదవాలి. కాని పుస్తకాలను మాత్రమే కాదు. తనను తాను చదవాలి. లోకాన్నీ చదవాలి. ప్రజల్ని, వాళ్ల మనస్తత్వాల్ని చదవాలి. రాజ్యాంగాన్ని, విజ్ఞాన శాస్త్రాలను, తత్వ శాస్త్రాలను చదవాలి, జనం బతుకుపోరులో కలిసి పోరాడుతూ జ్ఞానాన్ని పొందాలనుకున్నాడు. ఆ జ్ఞానాన్ని మళ్లీ జనానికి పంచుతూ తనను తానర్థం చేసుకోవడానికి, ప్రజలు కూడా తమను తామర్థం చేసుకోవడానికి పాటుపడాలనుకున్నాడు. ప్రజలకు మేలు చేయని రాజ్యాంగ చట్టాలను మార్చి, సమ సమాజ నిర్మాణం కోసం దోహదపడే నూతన చట్టాలను రూపొందించుకోవాలని, అప్పుడే తన జీవితానికో సార్ధకత లభిస్తుందని అతడు గాఢంగా విశ్వసిస్తాడు. అంటే వర్గాలుగా విభజితమై ఉన్న సమాజం సమూలంగా మారి సమసమాజ౦ నిర్మాణం కావాలని బలంగా కోరుకుంటున్న టీనేజర్ నందు ఒక ప్రాథమిక స్థాయి మేధావి. అతడు భవిష్యత్తులో ప్రజల తరఫున రూపొందబోయే ఒక బాధ్యతాయుతమైన భావి మేధావి.

అయితే రచయిత ఈ నవలను నందు అనే పాత్ర అంతరంగ దృష్టి కోణంలోంచి రాసిన౦దువల్ల నందు ప్రధాన పాత్రయ్యి౦ది. అట్లని మిగిలిన పాత్రలు అప్రధానమైన పాత్రలు కావు. వాటికి తమవైన దృష్టికోణాలేమీ లేవని కాదు. రాఘవులు, ఆచార్య, బాలమల్లు, భద్రమ్మ, జమున తదితర పాత్రలన్నీ నవలలో అనేక చోట్ల తమతమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తాయి. నవలలో ప్రత్యక్ష అస్తిత్వమేమీ లేకున్నా యాదగిరి పాత్ర తన నేపథ్య అస్తిత్వంతో పరోక్షంగా వ్యక్తీకరించబడుతుంది. ఇలాంటి మిగతా పాత్రల దృష్టికోణాల పట్ల నందుకు గల ఏకీభావం, విముఖతల మాటెలా ఉన్నప్పటికీ, అతనికి పరమ నిశ్చలాభిప్రాయాలేమీ లేవు. నిస్సందేహంగా అతడు సొంత ఇష్టాయిష్టాల ప్రమేయంతో కూడిన తనదైన స్వతంత్ర దృక్ఫథంతో వ్యవహరించే ఒక విశిష్ట వ్యక్తిత్వం కలిగివున్న ప్రధాన పాత్ర. ఆ మాటకొస్తే – రచయితకు కూడా ఎలాంటి మార్పుకు ఆస్కార౦ లేని అంతిమతీర్పుల్లాంటి నిశ్చల నిశ్చితాభిప్రాయాలేమీ లేవు. అందుకే రచయిత నికార్సయిన ప్రజాస్వామిక దృక్పథంతో చాలా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ నవలను ఓపెన్ ఎండెడ్ గా ముగించాడని చెప్పవచ్చు.

అలాగే రచయిత తన ఆత్మకథా౦శాలను నందు పాత్రలో ఎక్కువగా చిత్రించినప్పటికీ, మిగతా పాత్రల్లో రచయిత అంశ లేనే లేదని చెప్పడానికి వీల్లేదు. తల్లి భద్రమ్మ, గురువు ఆచార్య, రాఘవులు లాంటి పాత్రల్లో రచయిత అంశ ఎంతో ఉన్నదని సోదాహరణంగా వివరించే అవకాశం ఎంతో ఉంది. అసలు శరీరం లేని మనసు, మనసు లేని శరీరం ఉండనట్లే రచయిత లేని గొప్ప రచనా ఉండదు. రచన లేని గొప్ప రచయితా ఉండడు. రచన, రచయితా రెండు అవిభాజ్యాలుగా కలిసి ఉండే సాహిత్యమే గొప్ప సాహిత్యం. వ్యక్తిగా రచయితకు గల విశ్వసనీయతను, అతనిలో జీర్ణమై విశ్వాసంగా మారిన భావాల విశ్వసనీయతను రెండి౦టినీ భంగ పడనీయని అతని సమన్వయపూర్వక దృఢమైన వ్యక్తిత్వ౦లో నుంచే గొప్ప సాహిత్య రచనా జీవశక్తి ఉద్భవిస్తుంది.


నవలా పరిధిలో నందే ప్రధాన పాత్రయినప్పటికీ, నందుతో సహా మిగతా పాత్రలన్నీ ఎంత సజీవమైనవంటే, అవి నవలా పరిధిని దాటి నేటి నిజసమాజం లోనూ నిత్యం చలించే పాత్రలు. వేరే మాటల్లో చెప్పాలంటే – సమాజంలోని బతుకుపోరులో భాగమై నిరంతరం చలిస్తున్న సజీవమైన మనుషుల్నే రచయిత ఈ నవలలో పాత్రలుగా మలిచాడని చెప్పవచ్చు. ఈ నవల స్వల్ప కాలావధిలో ఒక కాలబిందువు దగ్గర మొదలై మరొక కాలబిందువు దగ్గర ముగిసిపోవచ్చు గాని, దీర్ఘకాలావధిలో సామాజిక, చారిత్రకావరణలో ప్రజల జీవన సమరం ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్నల్లో కలిసిన పాత్ర యాదగిరి లాంటి వాళ్ళెందరో నేడు దండకారణ్యంలో జనతన సర్కారును నడుపుకుంటూ నందు కన్న కలను అక్షరాలా నిజం చేస్తున్నారు. అలాగే నందు లాంటి యువతీ యువకలెందరో ప్రధాన స్రవంతి రాజకీయాలకు భిన్నంగా నిరంతరం ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కార మార్గాల కోసం స్వతంత్రాన్వేషణ కొనసాగిస్తుండడం ఈ నవలలోని ప్రత్యక్షర వాస్తవం.

చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే – నిర్దిష్టంగా వర్గం పట్ల వివిధ ప్రజాశ్రేణుల రాజకీయ చైతన్యావగాహనలు ఎలా ఉన్నప్పటికీ, పీడిత ప్రజల౦దరూ తామొక వర్గంగా నిరంతరం బతుకుపోరునెలా సాగిస్తున్నారో అత్యద్భుతంగా చిత్రీకరించిన అరుదైన తెలంగాణ నవల ఈ ‘జీవన సమరం’.

స్వస్థలం వరంగల్. కవి, రచయిత. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(ఇంగ్లిష్), సీకేఎం ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.

 

 

 

Leave a Reply