ఆశలో మేల్కొని
నిరాశలో నిద్రపోతే మాత్రం ఏం?
నా తరానికి నేను నాయకుణ్ని
నా యుగస్వరానికి నేను గాయకుణ్ని
పగటి కలల ప్రతిఫలాల్ని
రాత్రి స్వప్నంలో మాత్రమే
అనుభవిస్తే మాత్రం ఏం?
ఈ దినమంతా నెత్తుటితో చెమటతో
కళ్లు తడిసిపోతే మాత్రం ఏం?
రేపటి వెలుగులపై విశ్వాసం వీడని వాణ్ని.
నాకు తెలుసు
నేను నా చుట్టూ వున్న అశాంతిని పలుకుతున్నాను
నాలో దాగివున్న సుప్తాగ్నిని కెలుకుతున్నాను
రేపటి శాంతి కోసం
రేపటి కాంతి కోసం
అనంత కోటి అవ్యక్త భావాలు
నా అక్షరాల్లో అభివ్యక్తి కోసం వెతుక్కుంటున్నాయి
తమ వ్యక్తిత్వం కోసం వెతుక్కుంటున్నాయి
నీగ్రో సోదరుని ఉద్యమం లోనేగాని
ఇంకా జీవితంలో ఉదయించని సూర్యుడు
నా హృదయంలో మండుతున్నాడు
ఆసియాలో ఆఫ్రికాలో
యూరప్లో అమెరికాలో
విశ్వాంతరాళంపై ఏ గోళంలోనూ
విధ్వంసం కాదు విక్రాంతి కోరుతున్న
మానవుడు నా వారసుడు
ఆకలితో, తీరని కోర్కెలతో
ఆరిపోయిన అభాగ్యులకు
ఈ లోకంలో మిగిలిపోయిన ఆశను నేను
ఏం? ఎంత అపరిపక్వమయితేనేం!
ఎంత అస్పష్టమయితే మాత్రం ఏం?
నేను పలుకుతున్నాను
నా యుగవాణిని పలుకుతున్నాను
ఆవేశంలో ఆకాంక్షతో
హృదయంలోంచి స్పందించి…
ఈ జనరేషన్ జనరేటర్ లోంచి
జన్మించిన విద్యుత్తును నేను
నేను వెలుగుతున్నాను
నేను వెనుకటి దీపాల్లా గాలిలో
దేవుణ్ని నమ్ముకొని పుట్టలేదు
నేను అణువును ఆడించి
పరమాణువుతో పాడించగలను
ప్రపంచ ప్రగతి సాధించగలను
రాకెట్టుతో చంద్రునిపై
నా విజయాన్ని
రాయించి తీరుతాను
నా వంటి వెయ్యిదీపాల్ని వెలిగించి
నా వొంట్లో ఊపిరిపోతే మాత్రం ఏం?
ఈ యుగకాంతిని నేను
ఈ జనరేషన్ జనరేటర్ లోంచి
జన్మించిన విద్యుత్తును నేను
విప్లవాన్ని నేను