జాషువా కవిత్వంలో దళిత సమస్య – రాజకీయార్థిక దృక్పథం

దళిత ఉద్యమం, జాతీయోద్యమం భారత దేశంలో సమాంతరంగా సాగిన ఉద్యమాలు. అయితే అవి రెండూ ఎప్పుడూ వేరువేరుగా మాత్రం లేవు. ఒకటి ప్రధానంగానూ, రెండవది ఆనుషంగికంగానూ ఉంటూ వచ్చాయి. సాహిత్యరంగంలో కుసుమధర్మన్న వంటి వారు దళిత అస్తిత్వ సమస్యకు ప్రాధాన్యం ఇస్తూనే వర్ణసమానత లేని స్వరాజ్య ఉద్యమానికి సార్ధకత లేదంటూనే దానిని అభిమానించారు. సంబోధించారు. కాగా జాషువా మొదటి అస్తిత్వం భారతీయత. అందులో భాగంగా ఆంధ్రత్వం. అందువల్లనే ఆయన స్వరాజ్య ఉద్యమాన్ని గాంధీ నాయకత్వంతో సహా అభిమానించాడు. అలాగని ఆయన తన దళిత అస్తిత్వాన్ని విస్మరించలేదు. స్వరాజ్య సాధనలో భాగంగా దళిత విముక్తి ని ఆకాంక్షించటం అడుగడుగునా కనబడుతుంది.

1

జాషువా అప్పుడప్పుడూ వ్రాసిన విడి ఖండికలు ఖండకావ్యము అనే శీర్షికతో 1937 లో రెండు భాగాలు అచ్చయినాయి. మొదటి సంపుటికి వ్రాసుకొన్న విజ్ఞప్తి లో తన రచనలు తెలుగు పొలమున ఈషన్మాత్రమైనను చైతన్యమును కలిగించగలిగినచో అంతకన్నా తనకు కావలసిందేమీ లేదని చెప్పుకొన్నాడు. ఈ రెండు సంపుటాలు కలిపి 72 ఖండికలు. రెండు భాగాలలోనూ మొదటి ఖండికలు భరతమాత గురించి వ్రాసినవే. మొదటి భాగపు ఖండికలో సగరుడు మొదలైన చక్రవర్తుల భార్యగా, కాళిదాసాది కవికుమారులను కని కీర్తినందిన గృహస్థురాలిగా ప్రశంసిస్తూ భారతమాతను “ సింధుగంగానదీ జలక్షీరమెపుడు( / గురిసి బిడ్దల( బోషించుకొనుచున్న / పచ్చిబాలెంతరాలు ..” గా సంభావించాడు. రెండవ భాగంలోని ఖండికలో భారతదేశ పౌరాణిక సంప్రదాయాన్ని,హిమాలయాలు హిందూ మహాసముద్రము హద్దులుగా గల భౌగోళిక విశిష్టతను ప్రస్తావించి “ఇట్టి నినుఁ జూచి బిచ్ఛంబుఁ బెట్టమనుచు / నన్ని దిక్కులు యాచించు చున్నవమ్మ!” అని దేశ సంపత్ సమృద్ధిని సూచించటం వరకు కనబడేది జాతీయాభిమానమే. దానికి కొనసాగింపుగా “యైకమత్యంబు గల్గి నిన్ననుభవించు / కొఱ(త పూరింపవే మాకు భరతమాత” అని అభ్యర్ధించటంలో ఉంది ప్రత్యేకత. ఈ అభ్యర్ధనలో ఐక మత్యం, అనుభవం అని రెండు మాటలు ఉన్నాయి. వర్ణాలుగా , వర్గాలుగా చీల్చబడిన సమాజం గురించిన చింతన నుండి కలిగిన ఆకాంక్ష ఐకమత్యం. ఆ చీలికలే దేశ సంపద అనుభవానికి కొందరిని పరాయీకరిస్తున్నదన్న వాస్తవాన్ని గురించిన స్పృహ అనుభవం అనే పదప్రయోగంలో ఉంది.

జాషువా వ్రాసిన ఖండికలలో ‘ఆంధ్రు(డను’ అనేది ఒకటి. ఇందులో సాహిత్యకళా సాంస్కృతిక వారసత్వాన్ని తలచుకొని ఆంధ్రపుత్రుడను, ఆంధ్రవీరుడను అంటూ సగర్వంగా చాటుకున్న జాషువా ‘తెలుఁగు తల్లి’ అనే ఖండిక లో నాలుగు సీసపద్యాలకు అనుబంధంగా ఉన్న తేటగీతి పద్యాలను “ గారవంబున నన్నేల గాంచవైతి !/ తెలుప( గదవమ్మ! నను( గన్న తెలుఁగు తల్లి!” అన్న ఒకే మకుటంతో పూర్తిచేయటం గమనించవచ్చు. తెలుగు తల్లి తనను గారాబంగా చూచుకోక నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణ ఉంది అందులో. నిర్లక్ష్యానికి కారణం ఏమిటో వాచ్యం చెయ్యలేదు కానీ ‘అందరూ హిందమ్మ బిడ్డలే’ అయినా పంచములు ఆ తల్లి గారాబానికి నోచుకోలేకపోవటం గురించిన సమకాలపు ప్రశ్న జాషువా మదిని కలవరపెట్టకపోతే అలాంటి ఆరోపణకు అవకాశమే లేదు. నన్నయ తిక్కనాది కవుల కవిత్వ వైభవం వెల్లివిరిసిన కాలంలో తెలుగుతల్లి కనుక తనను అట్లా నిర్లక్ష్యం చేయకపోతే ఏమి జరిగి ఉండేది? తాను కూడా కవిగా కూర్పునేర్పు సంపాదించేవాడు. ‘ నేఁడు నా కవిత్వంబు రాణించియుండు’ అన్న పద్యపాదం దానినే సూచిస్తుంది. ఆ నాటి నుండి ఈ నాటివరకు కొనసాగివస్తున్న నిర్లక్ష్యం తమను చదువుకు, పాండిత్యానికి, కవిత్వ నైపుణ్యాలకు దూరంచేస్తున్నదన్న బాధను అది ధ్వనిస్తుంది. వీరులు, వీరపత్నులు, దానధర్మాలు, శరణాగత రక్షణ, పాతివ్రత్యం మొదలైన వాటితో ఘనకీర్తి గల గతం ఎంతో ఉన్న దేశంలో ఆ కీర్తి సంపత్తిలో కొంతలో కొంత అయినా తాను పంచుకోలేక పోయానే అన్న కవి వేదన ఈ పద్యాలలో వ్యక్తీకరించబడింది. ఇది జాషువా స్వంత వేదన కావచ్చు. కానీ అంతకన్నా ఎక్కువగా అది దళితజాతి ప్రతినిధిగా పడిన వేదన అనటమే సబబు. ఎందుకంటే ఈ ఖండికలో ‘సహజ పావనమైన సర్వ సమత్వంబు ప్రతినేత్రమున జాలువారటం’ గురించిన ఆయన కల కూడా ఉంది.

హిందూరమ అనే మరొక ఖండిక ఉంది. మూడు శార్దూల పద్యాల ఖండిక ఇది. గాంధీ ప్రశస్తి ఇందులో విషయం.

“ ఖాదీరాటపువింత తుమ్మెదలు, ఝంకారించే , నీ ఇంటిలో
నీ దారిద్ర్యము గో(చిపా(త వలె( బన్నెన్ గాంధి బైరాగి ,
బాలాదిత్య ప్రభతోడ స్వేఛ్చ యను సంధ్యాలక్ష్మి రానుండె,
నేడేదీ! తొల్లిటిమందహాసముల మమ్మీక్షింపు హిందూరమా” —

పేదలకు వంటినిండా కట్టుకొను బట్ట లేనప్పుడు తనకు సూట్లు బూట్లు వేసుకొనే నైతిక హక్కు లేదని కొల్లాయిగట్టిన గాంధీ, బ్రిటిష్ వారి వస్త్రపరిశ్రమ విధానంమీద సవాల్ గా రాట్నం వడికి నూలుతీయటాన్నిఒక సంకేతంగా చేసిన గాంధీ రాకతో ఉదయిస్తున్న స్వేఛ్చ హిందూ రాజ్యలక్ష్మికి మునుపటి వైభవాన్ని తెస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు కవి. “ నీ గర్భంబున గాంధి పుట్టినపుడే నీ కష్టముల్ చుట్టలై యేగెన్” అని ప్రారంభించిన రెండవపద్యంలో గుండ్రని బల్ల సమావేశాలను పేర్కొన్నాడు. రౌండ్ టేబిల్ సమావేశాలు మూడు. 1930 నవంబర్ నుండి, 1932 డిసెంబరు మధ్యకాలంలో జరిగాయి. స్వరాజ్యం, స్వయంపాలన అన్న డిమాండ్లకు భారతదేశంలో పెరుగుతున్న ప్రాధ్యాన్యత దృష్ట్యా సైమన్ కమీషన్ నివేదిక తరువాత భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను ఉద్దేశించి బ్రిటిష్ ప్రభుత్వం భారత రాజకీయ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాలు ఇవి. మహాత్మాగాంధీతో కలిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను జాషువా ప్రస్తావించాడు కనుక అది రెండవ రౌండ్ టేబిల్ సమావేశం అయివుంటుంది.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలోనే అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక కులవర్గ ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటు ప్రతిపాదన రెండవ రౌండ్ టేబిల్ సమావేశంలో కూడా అంగీకారాన్ని ఆమోదాన్ని పొందలేకపోయింది. ఆ నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యునల్ అవార్డును ప్రకటించటం, అది నచ్చక గాంధీ నిరసన వ్రతానికి పూనుకొనటం, ప్రత్యేక నియోజక వర్గాలు కాక , నియోజకవర్గాలలో కొన్నిటిని అణచివేయబడ్డ సమూహాలకు కేటాయించే ప్రాతిపదికన పూనా ఒడంబడిక (1932 సెప్టెంబరు 24) కుదరటంజరిగింది. బహుశా ఈ పరిష్కారంలో కీలక పాత్ర గాంధీది కనుక జాషువా గాంధీ ని హిందూరమ ముద్దుబిడ్డగా సంభావించి ఉంటాడు. గాంధీ కట్టిన కొల్లాయి బట్టను చూసి నవ్విన ఆంగ్లేయులే ఇప్పుడు ఆయనను లిల్లీ పూలతో అలంకరించి ఆయన చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఇక్కడి వరకు ఈ ఖండిక గాంధీ పట్ల ఆయన నమ్మకాన్ని, గౌరవాన్ని వ్యక్తంచేస్తుంది. అంతవరకే అయితే ఈ ఖండిక ప్రత్యేకత ఏమీ లేదు. “ నీ ఢిల్లీ గుండెలు నిబ్బరించుకొని ,చెండింపింపు మస్పృశ్యతన్” అన్న ముక్తాయింపుతో ఈ ఖండికకు జాషువా తనదైన ముద్రను ఇచ్చాడు. పూనా ఒడంబడిక గాంధీ మీద, కాంగ్రెస్ మీద పెట్టిన పెద్ద బాధ్యత దళిత వివక్షకు గౌరవకరమైన ఒక సమాధానం కనుక్కొనటం. ఆ దిశగా హిందూ దేశంలో అస్పృశ్యతను ఖండించే కార్యాచరణగురించి హెచ్చరించటమే జాషువా చేసినపని. అందుకే జాషువా గాంధేయవాదం తన్నుమాలిన ధర్మం మాత్రం కాదు అని చెప్పటం.

2

ఖండకావ్యము మొదటి రెండు భాగాలలో ప్రత్యేకించి దళితసమస్యపై వ్రాసిన ఖండికలు మూడే. ‘భాష్ప సందేశము’ తొమ్మిది పద్యాల ఖండిక. భారతకుమారులను సంబోధిస్తూ వేలసంవత్సరాలుగా స్వేఛ్చను కోల్పోయిన దళితుల గురించి చెప్తూ “… దీనికీవే ,సాక్ష్యంబును, కారణంబును .. “ అని చెప్పటానికి ఏమాత్రం సందేహించలేదు. ఇప్పటికీ మించిపోలేదు.. నీ పాత చుట్టాలు వాళ్ళు .. ఆదరించు అని హితవు చెప్పాడు. “ అను( గుందమ్ములు దిక్కుమాలి , పురాబాహ్యక్షోణి( గారాడ హె / చ్చిన సౌభాగ్య సువర్ణమందిర సమాసీనుండవై ,హాయిగా / కను మూయం దగునా .. “ అని సవర్ణ హిందువులలో మానవత్వాన్ని మేల్కొల్పటానికి ప్రయత్నించాడు. దళితులు చదువుసంధ్యలు, శుచిశుభ్రతలు నేర్చి నీతో నిత్యోచిత దైవపూజకని వస్తున్నారు వాళ్ళను సంతోషంతో చేరనీయకపోతే చరిత్రలో రాక్షసుడిగా మిగిలిపోతావని సవర్ణ సోదరుడిని హెచ్చరించాడు. అంటరానితనాన్ని ఖండించలేకపోతున్నవే ..!? ఇటువంటి నీకు మారాజ్యం మాకియ్యండి అని వేడుకొంటే మాత్రం ఆంగ్లేయులు ఇస్తారా? అని సవాల్ చేసాడు. మరొకరి స్వేఛ్ఛా స్వాతంత్ర్యములకు భంగం కలిగించేవారికి స్వేఛ్ఛా స్వతంత్రాలు కోరుకొనే హక్కు లేదన్నది ఆయన ఆంతర్యం. అందుకనే “ ప్రారంభంబున నిన్ను దిద్దు కొనుమయ్యా ! కోర్కి సిద్ధించెడిన్” అని హితవు చెప్పాడు.

“మా ముత్తాతలనాటి నుండి నిను సన్మానించి , నీ కోసమై
మామేనం గలరక్తబిందువుల సంపత్తిన్సమర్పించినా
మేమో ; నీ హృదయంబులో నెనరులేదీషత్తు, నింకెన్నఁ డ
న్నా! మా కష్టము గట్టుకెక్కు” ననుచున్నారేమి వాక్రుత్తువో !” అన్న పద్యం ఈ ఖండికలో చివరిది. దళితులకు ఉన్న సంపద శరీరం కంటే భిన్నమైనది కాదు. అది వాళ్ళ శ్రమ సాధనం. తర తరాలు గా తమచెమటను, రక్తాన్ని కూడా అగ్రవర్ణాల సేవకు, సంపదల పెంపుకు సమర్పించినావాళ్ళే వాళ్లంతా. ఈ నాడు వాళ్ళంతా ఆ సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళు కనుక తమ నెత్తురుతో లాభపడి తమ పట్ల కొంచంకూడా హృదయాలలో దయను మిగుల్చుకోలేకపోయిన మనవీయతను ప్రశ్నించ గలుగుతున్నారు. మాకష్టాలు గట్టేక్కేది ఎప్పుడని నిలదీయ గలుగు తున్నారు. వాళ్ళ ప్రశ్నకు మీరేమి సమాధానం ఇస్తారు అంటున్నాడు కవి ఆ పీడితుల పక్షాన నిలబడి. కారంచేడు నుండి ఈ నాటివరకూ దళితులు విసురుతున్న సవాల్ అదే. దానికి జవాబియ్యలేనంతగా మూసుకుపోయిన హృదయాలు, నోళ్లు సవర్ణహిందువులవి. ఆ రకంగా ఈ నాటికీ అవసరమైనదే ఆ పద్యం.

“చక్కనికవితకు, కులమే
యెక్కువతక్కువలు నిర్ణయించినచో, నిం
కెక్కడి ధర్మము తల్లీ?” —- అని సమధర్మం లోపించిన సమాజానికి
స్వాతంత్య్రం సాధ్యమేనా అని ఆందోళన వ్యక్తంచేశాడు ‘సమదృష్టి’ అనే ఖండికలో.

సమదృష్టి ఖండికవలెనే ‘పంచముడు’ అనేఖండికలో కూడా కవి భరతమాతను ఉద్దేశించి మాట్లాడాడు. చెప్పేదొకటి చేసేదొకటిగా ఉన్న హరిజనోద్యమ రాజకీయాలు మహాత్ముని తృప్తి కోసం ఆడే నాటకం తప్ప మరొకటి కాదన్న అవగాహన వల్లనే “హరిజనులనుద్ధరించు ప్రయత్నమందు / వెనుకముందాడుచున్నవి పెద్దతలలు” అని చెప్పగలిగాడు. హరిజనుల దేవాలయ ప్రవేశానికి ఎదు రవుతున్న అభ్యంతరాలు, ఆటంకాలు చూస్తూ ఉన్నాడు కనుకనే అర్చకుల నుండి పూలు, పండ్లు పసుపు చందనాలు కానుకలుగా స్వీకరించి ధర్మపు త్రోవ తెలిసి కూడా అర్చకులతో చెప్పలేక పోతున్న దేవతలు ఆదిమాంధ్రులకు పగవారు అని చెప్పగలిగాడు.

“ముసలివా( డైన బ్రహ్మకు ( బుట్టినారు
నలువురు కుమారులనుట విన్నాము గాని
పసరముకన్న హీనుఁడ భాగ్యు ( డైన
యైదవ కులస్థు(డెవ్వరమ్మా! సవిత్రి!” అని తరచు ఉటంకించబడే జాషువా పద్యం ఈ ఖండికలోదే.

పంచములెవ్వరు అనే ప్రశ్న పై సమకాలం లో జరుగుతున్న వాదోపవాదాలను గమనించకుండా, వాటినుండి తనదైన ఒక అభిప్రాయాన్ని,అవగాహనను అభివృద్ధి పరచుకోకుండా ఇలాంటి పద్యం వ్రాయటం సాధ్యంకాదు. చాతుర్వర్ణ వ్యవస్థను నేనే సృష్టించాను అన్న గీతాకారుని మాటను ప్రమాణంగా తీసుకొని అయిదవవర్ణం కూట సృష్టి అన్నవాదం బలంగా ముందుకువచ్చింది. జాషువా దానిని మనసులో ఉంచుకొనే పసరముకన్న హీనుడు, అభాగ్యుడు అయిన అయిదవ కులస్థుడు ఎవ్వరు? అని ఒక ప్రశ్నను లేవనెత్తాడు. అలాంటివాళ్ళు ఎవరూలేరన్న నిరాకరణ ఆ ప్రశ్నలోనే ఇమిడిఉన్న సమాధానం. 1920 లనాటికే పంచములను ఆదివాసులు, ఆదిమాంధ్రులు అనటం ఆత్మగౌరవ సూచకం అయింది కదా! ఈ ఖండికలో జాషువా ఆమాటలనే వాడటం గమనార్హం. రుధిర మాంసములు గల సాటి మనుషులను అంటరానివారని అంటారేగానీ అసలు దేశ మూలవాసులు వాళ్లేనని ఈ ఖండిక ముగింపు పద్యంలో స్పష్టంగానే చెప్పాడు.

అదే సమయంలో ఆయన మనిషిని నిర్లక్ష్యంచేసి దైవానికి దాస్యం చేస్తున్న జాతిని నిరసిస్తూ కవిత్వం వ్రాసాడు.(ఆవేదన) “పగలు గూబలు రాతిరి పావురంబు / లేలుబడి సేయు జీర్ణ దేవాలయమ్మున/ వెలుఁగు చున్నది నేతి దిబ్బెముల వరుస / చిలిపి చీ( కటి నా యింట( జిక్కఁ బడియె” అనే పద్యంలో జీర్ణదేవాలయాలకు కూడా వెలుగునియ్యగల మతం చీకటీలో పడి మగ్గిపోతున్న పేద దళిత మానవ సమూహాలపట్ల ఎంత దయాహీనమై పోయిందో చెప్పటంలో కవి ‘ఆవేదన’ కనబడుతుంది.రాతిశిధిలాల పట్ల ఉన్న బాధ్యత మనుషులపట్ల లేని మత స్వభావాన్ని ఏవగించుకున్నాడు జాషువా. “ఆ శిలావిగ్రహంబున కాహుతి యయి/ పోవుచున్నది నా పేద భోజనంబు” అనటంలో రాళ్లకు దీపాలు , నైవేద్యాలు పెట్టటానికి అవసరమైన ఆహారఉత్పత్తుల వినియోగం ఆమేరకు పేదవాళ్ల భోజనాన్నిఅపహరిస్తున్నదన్నది అని జాషువా ఆంతర్యం. వర్ణం, వర్గం సామాజిక వైరుధ్యాలు. అధికారం,దోపిడీ పీడన లేకుండా ఆ వైరుధ్యాలకు ఉనికే లేదు. సామాజిక వైరుధ్యాలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా కొనసాగింప చేయటంలో మతం నిర్వహిస్తున్న పాత్రను గురించిన చింతన ఇందులో ఇమిడి ఉంది.

అస్పృశ్యత జాషువాను ఎంతవెన్నాడిందంటే అది లేని తావు శ్మశానం తప్ప మరొకటి ఆయనకు కనిపించనే లేదు.( శ్మశానవాటి) 1937 తరువాత 1946 నుండి 1965 వరకు దాదాపు రెండు దశాబ్దాల కాలం మీద మరి అయిదు భాగాలుగా ఖండకావ్యాలు ప్రచురించబడ్డాయి. వీటిలో దళిత సమస్యకు సంబంధించిన కవితలు రెండు కూడాలేవు. 1937 తరువాత నాలుగేళ్లకు ప్రచురించ బడిన గబ్బిలము కావ్యం మాత్రం జాషువా దళిత దృక్పథాన్నిప్రతిఫలించే పూర్తి కావ్యం. 1946 లో దీనికి రెండవభాగం కూడా వచ్చింది. అంటే1937 లో వచ్చిన మొదటి రెండు ఖండకావ్య సంపు టాల తరువాత మళ్ళీ 1946 లో మూడవ సంపుటం వచ్చేనాటికి గబ్బిలము ఒకటిరెండు భాగాలు వచ్చేశాయన్నమాట.

3

జాషువాకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ‘గబ్బిలము ’ రెండు భాగాలూ కథవల్ల, కథన శిల్పం వల్లకాక అభిప్రాయాల వల్ల, ఆ అభిప్రాయాల వ్యక్తీకరణలోని పదునువల్ల సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకొనగలిగింది.నిజానికి ఆ కావ్యంలో ఏకదేశమైన కథ కూడాలేదు. కాళిదాసు మేఘ దూతం ప్రేరణగా దళితవాస్తవికత నుండి వచ్చిన కావ్యం ఇది. విధినిర్వహణలో చూపిన నిర్లక్ష్యం కారణంగా కుబేరుడి శాపానికి గురై మధ్యభారతంలో ఏడాది కాలపు ప్రవాస శిక్ష అనుభవి స్తున్న యక్షుడు ఒకడు కదిలిపోతున్న మేఘాన్ని దూతగా ఎంచుకొని హిమాలయ పర్వత ప్రాంతాల లో ఉన్న తన భార్యకు సందేశం పంపటం మేఘదూతంలోని వస్తువు. మేఘదూతం కథా నాయకుడికి, గబ్బిలం కావ్యనాయకుడికి మధ్య తేడాలను జాషువా మాటల్లోనే చెప్పాలంటే “యిందలి కధా నాయకుడు మందభాగ్యుడగు హరిజనుడు’. కాళిదాసుని యక్షుడు ప్రణయ సందేశమునంపును. అ ఇతడంపునది తుకతుకనుడుకు నశ్రు సందేశము.అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజాన్మాంతం. తరతరములు. దీనికవధిలేదు. అతడు మన్మథాగ్ని తప్తుడు ఇతడు క్షుధాగ్ని పీడితుడు.” ఈ భేదాలు చెప్పిన తరువాత జాషువా ‘ ఇరువురిలో నితఁడు దయానీయుడు’ అని తన అభిప్రాయాన్ని కూడా చెప్పాడు ( విజ్ఞప్తి ) కనుకనే తాను అతనిపక్షాన నిలబడి గబ్బిలం కావ్యం రచించాడు.

మేఘమునకు బదులు గబ్బిలము ఇందులో దూత అయింది. సందేశం భార్యకు బదులు శివుడికి పంపబడింది. అక్కడ మేఘం వలెనె ఇక్కడ గబ్బిలం కూడా స్పందించి సమాధానం ఇయ్యగల జీవి కాదు. అవి వాళ్ళ వాళ్ళ వేదనల వ్యక్తీకరణలకు ఎన్నుకోబడిన మధ్యమ పురుషలు మాత్రమే. మొదటి పది పద్యాలలో కథానాయకుడి పరిచయమవుతాడు. కథానాయకుడు గబ్బిలాన్ని సంబోధిస్తూ మాట్లాడిన మొదటి మాటలు దళిత జీవిత విషాదాన్ని, దానికికారణమైన సామాజిక ఆర్ధిక మత దౌష్ట్యాన్ని వ్యాఖ్యానిస్తాయి. ఈ కావ్య విశిష్టత అంతా ఇందులోనే ఉంది. హరిజనుడు తాను నివాసమున్న తంజావూరు దక్షిణ భూముల నుండి తంజావూరు , నెల్లూరు, హంపీ గుంటూరు మండలం, రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, బొబ్బిలి, విజయనగరం, ఒరిస్సా, నలందా, పాటలీ పుత్రం, ఢిల్లీ, ఆగ్రా,కురుక్షేత్ర మొదలైన ప్రాంతాలమీదుగా కైలాస పర్వతాలకు వెళ్లే మార్గాన్నిగురించి గబ్బిలానికి ఆయా ప్రాంతాల విశేషాలను, దర్శనీయ స్థలాలను వర్ణిస్తూ చెప్పటంగా సాగిన మిగిలిన కావ్య భాగపు విషయం కేవలం సమకాలపు జాతీయోద్యమ ఆంధ్ర రాష్ట్రోద్యమాల నేపధ్యం నుండి స్వస్థానదేశభాషాభిమానాల వ్యక్తీకరణ మాత్రమే. “ఇంట బ్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తనకన్నీటికథనీశ్వరునితో జెప్పుమని వీఁడు ప్రార్ధించె గాని నిజమునకతని యుద్దేశ్యము దేశారాధన”. (విజ్ఞప్తి ) అని జాషువా చెప్పుకొన్న మాటలు అందుకు ప్రబల నిదర్శనం. అయినప్పటికీ నిర్దిష్టమైన, పదునెక్కిన జాషువా దళిత జీవిత దృక్పథాన్ని ప్రదర్శించిన కావ్యంగా గబ్బిలం చారిత్రక ప్రాధాన్యత కాదనలేనిది.

“చిక్కినకాసుచే (దనివి( జెందు నమాయికు( డెల్ల కష్టముల్
బొక్కెడు బువ్వతో మఱచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులుఁ గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీసుతుం
డొక్కఁడు జన్మమెత్తె భరతోర్వరకుం గడ(గొట్టు బిడ్డ(డై” అన్న ప్రారంభ పద్యమే చాలు దళితుల స్వభావాన్ని, స్థితినీ చెప్పటానికి. శ్రమ ఎంతైనా చేస్తాడు. లభించే ప్రతిఫలం శ్రమకు సరిగా కట్టబడిన విలువేనా అన్నది తెలియని అమాయకుడు. దొరికిన కాసుకే తృప్తిపడే అల్ప సంతోషి. ఆకలిమంటల ఆకారం. ఒక బుక్క తిండి దొరికితే అన్ని కష్టాలు మర్చిపోయే మానవుడు. నాలుగు దిక్కులున్న లోకంలో ఏ దిక్కూలేని అరుంధతీ సుతుడు భరత మాత పుత్రుడు గానే పుట్టాడు. కానీ కడగొట్టు బిడ్డడు. కనుకనే నిర్లక్ష్యానికి గురైనాడు. అటువంటి అరుంధతీ పుత్రులకు ప్రతినిధిగా కాథానాయకుడిని సృజించాడు జాషువా .

కావ్యశాస్త్రాలు కావ్యనాయకుడు ఉత్తమకుల సంజాతుడై ఉండాలని నిర్దేశించాయి. ధీరోదాత్త, ధీరోద్ధత , ధీరశాంత లక్షణాలలో ఏ ఒకటిగా అయినా కలిగినవాడై ఉండాలి అని కూడా చెప్పాయి. ఆ లెక్క ప్రకారం గబ్బిలము నాయకుడికి కావ్య నాయకుడి లక్షణాలు ఏమీ లేనట్లే. కానీ ఆ లేకపోవటంలో ఎంత ఉందొ చెప్తాడు జాషువా “ముప్పుఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి …” అనే పద్యంలో. హరిజనుడికి ఆపద కలిగించింది, కులంలేదని అవమానించింది, కలిమిని అపహరించిందీ ఎవరు? ‘భరత వీరుడు’ . భారతధాత్రి కి కడగొట్టు బిడ్డడంటే కడగొట్టు కులమువాడే. హరిజనుడే. భరత వీరులుగా పేరు ప్రఖ్యాతీ పొందినవాళ్లు అగ్రజన్ములు, అగ్రవర్ణులు. వాళ్ళే వీళ్ళ కులగౌరవాన్ని, శ్రమ సంపదను దోచుకున్నారు. అవమానాలకు గురిచేశారు. అట్లా దోచుకొనటం, అమానుషంగా ప్రవర్తించటమే ఉత్తమవంశ లక్షణమా అన్న ప్రశ్న ఇక్కడ పొడసూపక మానదు. దానికి అనుబంధంగా అలా తమను దోచుకొనేవాళ్ళ,తమకష్టాలకు కారకులైనవాళ్ల పాదాలు కందకుండా జెప్పులుకుట్టి జీవనంచేస్తున్న ఆ కడగొట్టు బిడ్డలది కాదా అసలైన ఉత్తమవంశ లక్షణం? అన్న ప్రశ్నను ఎక్కుపెట్టటం ద్వారా జాషువా ఈ పద్యంలో తన కావ్యనాయకుడు అణచి వేస్తున్న వాళ్లపట్ల కూడా ఆదరణ చూపగల ధీర శాంతుడైన నాయకుడని నిర్ధారించినట్లయింది.

కడగొట్టు కులానికి అతిపేద వర్గానికి ఉండే సంబంధం జాషువాకు తెలుసు. గబ్బిలము కథానాయకుడు అరుంధతీ సుతుడే కాదు, అత్యంత పేదవర్గానికి చెందినవాడు కూడా. పేదరికం పనిచేయకపోవడం వల్ల వచ్చింది కాదు. “వాని ఱెక్కల కష్టంబు లేనినాఁడు / సస్య రమ పండి పులకింప సంశయించు/ వాఁడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము ( బెట్టు వానికి భుక్తిలేదు” అసలు రహస్యం అది. వాడు కష్టం చేయకపోతే పంట లేదు. వాడు చెమట కార్చనిదే ప్రపంచానికి తిండిలేదు. కష్టంచేసి, చెమటలోడ్చి పంటపండించి ప్రపంచానికి అన్నదాత అయిన వాడికి తినడానికి లేకపోవటం ఏమిటి? అంటే వాడి శ్రమ ఫలితం తిండికి కూడా మిగల్చనంతగా దోపిడీకి గురిఅవుతున్నదన్నమాట.ఆ రకంగా దళితులపై జరిగే ఆర్ధిక దోపిడీ గురించి ఆందోళన వ్యక్తం చేసాడు జాషువా.

అస్పృశ్యత దళితులు ఎదుర్కొనే సాంఘిక బహిష్కరణ. అంటరానితనం అనేది సహజసిద్ధం కాదు. తలమీద తరతరాలుగా రుద్దబడుతూ వచ్చిన పంకిలం. ఎవరు రుద్దారు? ఎందుకు రుద్దారు? ఏమి ప్రయోజనాలు సాధించారు? అంటే అదంతా పెద్ద చరిత్ర. ఆ చరిత్ర జోలికి పోకుండానే జాషువా దుర్మార్గము, అమానవీయమూ అయిన ఆ పంకిల చరిత్రను ఇన్నాళ్లుగా కడిగేయ్యకుండా కాపాడుతూ వస్తున్న సంస్కృతిమీద విమర్శను సంధించాడు. ఆకాశంబునుండి, శంభుని శిరస్సునుండి అలా అలా నేలకు దిగివచ్చిన గంగానది పవిత్రమైనదని, పాపాలను కడిగేస్తుందనీ గంగాస్నాలను ప్రోత్సహించిన, కీర్తించిన సంప్రదాయం దళితుడి తలమీద పులిమిన పంకిలాన్ని కడిగి కరుణించలేకపోవటం గురించిన ఆరోపణ ఆయనది. అంటరానివాళ్లకు ఆలయప్రవేశం గురించిన ఉద్యమాలు, వాళ్ళు ప్రసాదాలు చేసుకొని గుళ్ళలోకి ప్రవేశించిన సందర్భాలలో దేవుడు అంటుపడ్డాడని జరిగిన వాదనలు అన్నీ చూస్తూ ఉన్నాడు కనుక జాషువా “వాని నైవేద్యమున నంటు వడిననాఁడు / మూఁడు మూర్తులకును గూడ( గూడు లేదు” అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసాడు. దళితులు ముట్టుకున్నవి అంటరానివే అయితే వాళ్ళ రెక్కల కష్టం ఫలితం అయిన ఆహారోత్పత్తులు కూడా అంటరానివే అవుతాయి. వాటితో తయారయ్యే నైవేద్యాలు అంటరానివే. అంటూ అనుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కూడు లేక అల్లాడవలసిందే అంటే ఇక మానవుల సంగతి చెప్పాల్సింది ఏముంది ? అస్పృశ్యత ఎంత అసంబంద్ధమైనదో జాషువా ఇక్కడ చెప్పకనే చెప్పాడు.

సర్వభూతముల యందూ సమదృష్టి, దయ భారతీయ సంస్కృతిలోని గొప్పధర్మాలని చెబుతారు కదా! ‘పామునకుఁ బాలు, చీమకుఁ బంచదార / మేపుకొనుచున్న కర్మ భూమి’ లో హరిజనుల పట్ల అంత దయారాహిత్యం ద్వంద్వ ప్రవృత్తి లక్షణమే కదా అన్నది జాషువా ప్రశ్న.

ఆ యాభాగ్యుని రక్తంబు నాహరించి / యినుపగజ్జెల తల్లి జీవనము సేయుఁ / గసిరి బుసకొట్టు నాతని గాలిసో(క / నాల్గు పడగల హైందవ నాగరాజు” అని ఏక కాలంలో దళితుల మీద జరుగుతున్న ఆర్ధిక దోపిడీని, అమలవుతున్న అస్పృశ్యతను నిరసించాడు. నాలుగువర్ణాల హిందూ మత వ్యవస్థ నా సృష్టే అని సాక్షత్తు భగవంతుడే చెప్పాడు దానికిక తిరుగులేదు అనుకునేవాళ్లను సవాల్ చేస్తూ జాషువా ఐదో వర్ణాన్ని సృష్టించి పొలిమేరల అవతలికి వెళ్లగొట్టిన హిందూమత విద్వేష స్వభావాన్ని ‘నాల్గు పడగల హైందవనాగరాజు’ అన్న ప్రయోగంతో బట్టబయలు చేసాడు.

గబ్బిలములో నాయకుడికి పెళ్ళికాలేదు. కాలేదు అనటం కంటే అతను చేసుకోలేదు అనటం సరైన మాట. ఎందుకు చేసుకోలేదు? అసమ వర్ణవ్యవస్థ మీద ఉన్న ఆగ్రహం వల్ల. అసమానతలకు కారణాలు తెలిసినప్పుడు వాటిని నిర్మూలించే కార్యాచరణ దిశగా ఆ ఆగ్రహాన్ని పరివర్తింప చేయవచ్చు. ఆగ్రహం సమూహాశక్తిగా మారినప్పుడే అది సాధ్యం. కారణాలు స్పష్టంగా తెలియకపోవటం వల్లనో , తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత వల్లనో వ్యక్తిగత స్థాయిలో ఆ ఆగ్రహం ప్రత్యేక పద్ధతులలో వ్యక్తీకరింపబడుతుంటుంది. గబ్బిలము లోని నాయకుడు తరతరాల వారసత్వంగా వస్తున్న అంటరానితనం, దరిద్రం మరొక తరానికి తానై అందించటం ఇష్టం లేక ఒక నిరసన చర్యగా పెళ్లిని వద్దనుకున్నాడు. “ కులములేని నేను కొడుకులఁ బుట్టించి / యీ యఖాతమందే త్రోయవలెనె / భార్య యేల ( బుట్టుబానిసకని వాఁడు / జరుప సా(గె బ్రహ్మచర్య దీక్ష” బానిస విముక్తి ఉద్యమాల రాకడను సూచించే వ్యక్తిగత తిరుగుబాట్ల స్వరూపం ఇది.

ఈ తిరుగుబాటులోని ఒక కసి అతను గబ్బిలంతో చేసిన సంభాషణలో ప్రతిఫలించింది. తనఇంటిని ‘ఆనందకిరణ లవము’ దొరకనిచోటు,‘అంటరాని వాడున్న నిషిధ్ధగేహము’, అన్నములేని పేదగృహము, ‘పిడుగులు పడ్డా తనలాంటి అస్పృశ్యులకు ప్రవేశం కల్పించని ధర్మసత్రాలు మొదలైనవాటి ప్రస్తావనలో కనిపించేది అదే. మొత్తంగా ఈ లోకాన్నే హృదయం లేని లోకం అంటాడు. ‘సనాతన ధర్మదేనువుల్ పిదికిన పాలు పేదకు లభించవు’ అని చెప్పి సనాతన ధర్మంలోని అధర్మం గురించి,మతాన్ని, దైవాన్ని ఇచ్చవచ్చినట్లు వాడుకొనే ధనికవర్గం గురించి బాధపడ్డాడు. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయం చేసే భారతీయ మత సంస్కృతిలో పేదల కడుపునింపటానికి మెతుకు విదల్పని దయా రాహిత్యాన్నిఎత్తిచూపాడు.’ ముప్పది మూడుకోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులాఱునే’ అని దేవతల పేరున జరిగే దోపిడీకి దరిద్రం పెరగటానికి మధ్య ఉన్న సాపేక్ష సంబంధాన్ని సూచించాడు.’ ఔషధంబు లేని అస్పృశ్యతాజాడ్య మందభాగ్యుల’ గురించి వేదన వ్యక్తపరిచాడు. “ కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి / స్వార్ధలోలురు నా భుక్తి ననుభవింత్రు” అన్న ఎరుక కలవాడతను. అనేకమంది తిండిని అపహరించే స్వార్థపరుల పద్ధతికి మరొకపేరు కర్మసిద్ధాంతం అన్న వాస్తవాన్ని అంత సులభసూత్రంగా వ్యక్తీకరించగల కవి నైపుణ్యం అతనిది.

4

గబ్బిలము మొదటి భాగం వెలువడిన ఐదేళ్లకు రెండవ భాగం వచ్చింది. కైలాసేశ్వరుడుకి గబ్బిలం ద్వారా దళిత నాయకుడు పంపిన సందేశం ఫలితాల కథనంగా ఈ భాగం మొదలవు తుంది. తిరువానుకూరు దేవాలయ తలుపులు హరిజనులకు తెరువబడిన ఘటన వాటిలో మొదటిది. 1936 నాటి ఘటన అది. అంటే గబ్బిలమురెండు సంపుటాలు ప్రచురణ కాలాలు 1941, 1946 అయినప్పటికీ వాటిలో కథాకాలం మాత్రం 1932 పూనా ఒడంబడిక తరువాత గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ హరిజనాభ్యుదయంకోసం కార్యాచరణకు దిగిన కాలం అన్నమాట. గాంధీని కీర్తిస్తూ వ్రాసిన సీసపద్యం దాన్నే నిర్ధారిస్తుంది.

“అంటరాని తనంబునంటి భారతజాతి భువన సభ్యత గోలుపోయెననుచు
క్షమకుమించిన కత్తి జర్మనీ యుద్ధాన గనుగొన్న మొనగాడు గలుగడనుచు
కుదురు రాట్నము చేతగాక స్వేఛ్ఛా స్వర్గ ముదము జిక్కుట నభః పుష్పమనుచు
నూరేండ్లుగాదు మున్నేరేండ్లు మనవచ్చు న్యాయమార్గంబున నడువుడనుచు
నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును గాల్చి వేయుననుచు
రాట్నమును దుడ్డుగఱ్ఱ కరానబూని
దెసలదోతెంచె, గుజరాతు ముసలిసెట్టి” —- అంటరాని తనం వలన ప్రపంచంలో భరతజాతి పరువు పోగొట్టుకొన్నదని భావించాడు కనుకనే గాంధీ నిమ్నజాతి ఉద్ధరణకు కార్యక్రమాలు తీసుకొనటం బాధ్యతగా భావించాడు. నిమ్నజాతుల కన్నీరు తుడిచే ప్రయత్నాలు చేయకపోతే అది దేశాన్ని కాల్చేసే పిడుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆ ప్రయత్నాలకు సానుకూల ప్రజాభి ప్రాయాన్ని కూడగట్టటానికి విస్తృతంగా పర్యటించాడు. ఆక్రమంలోనే తిరువానుకూరు రాజు హరిజనుల దేవాలయ ప్రవేశానికి అనుమతి ఇయ్యటం జరిగింది. ఈ సమీపగతకాలపు చరిత్ర వెనుక గాంధీ చలనచైతన్యాలను దృశ్యమానం చేసిన పద్యం ఇది.

హరిజన దేవాలయ ప్రవేశం ఒక గుడి నుండి మరొక గుడికి, ఒక వూరి నుండి మరొక వూరికి ఒక ఉద్యమంగా విస్తరించిన చరిత్రను “ గుడిలోదేవుడు చూచి పొమ్మనుచు నాకున్ వార్తలం పింపగా దొడగెన్ నల్వురచేత” అన్న మాటలలో సూచిస్తూనే దేవాలయ ప్రవేశానికి వస్తున్న అవరోధాలు, అడ్డుకొనటానికి జరిగే హింస మనసులోకి వచ్చిందేమో “ నీ వెనుకవత్తున్ నన్ను రమ్మందువా” అని గబ్బిలాన్ని అడుగుతాడు గబ్బిలం కథాపురుషుడు. పురాతన దేవాలయాలలోకి యధేచ్చగా వెళ్లగలవి గబ్బిలాలని జాషువా ఇంతకుపూర్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకొంటే ఆ అడగటంలోని విశేషార్థం స్ఫురిస్తుంది. గబ్బిలాలకు ఉన్న స్వేచ్ఛ, భద్రత దేవాలయ ప్రవేశాన్ని ఆకాంక్షించే దళితులకు లేకపోవటంలోని విషాద వీచిక అది. అలాగే “గుడికి రమ్మనినంతనే యొడలుమఱచి / పరుగులెత్తుట నాకంత పరువుగాదు” అని చెప్పగల ఆత్మగౌరవ చైతన్యం కూడా ఉన్న వ్యక్తి అతను. దేవాలయ ప్రవేశాల కల్పనతో హరిజనుల స్థితిగతులలో వచ్చే గొప్ప మార్పు ఏమీ ఉండదన్న స్పృహ కూడా అందులో ఉంది. అంటరానితనం, ఆకలి సమస్య అట్లాగే ఉన్నప్పుడు దేవాలయ ప్రవేశం వల్ల ఒరిగేదేమిలేదు. సువర్ణ హిందువుల దయాధర్మ భిక్షగా అనేక మినహాయింపులతో లభించే దేవాలయ ప్రవేశం మీద సమకాలపు విమర్శకు వ్యక్తీకరణ “గుడికి రమ్మనినంతనే యొడలుమఱచి / పరుగులెత్తుట నాకంత పరువుగాదు”. అన్న పద్య పాదాలు.

అస్పృశ్యతను గురించిన జాషువా భావనలు గబ్బిలం రెండవభాగంలో కనిపిస్తాయి. దిక్కులేనివారికి దేవుడే దిక్కుఅంటారు. కానీ దేవాలయప్రవేశమే నిషిద్ధమైన నిమ్నజాతులకు తమకష్టాలను చెప్పుకొనటానికి ఆ దేవుడు కూడా లేడు. అందుకనే కదా గబ్బిలము కావ్యంలో నాయకుడు తమ ఘోష కైలాసపతికి వినిపించమని గబ్బిలానికి పురమాయించాడు. గబ్బిలము చెప్తుంది సరే .. ఆ భగవంతుడు వినాలి కదా! తరతరాల అనుభవం నుండి అది అతనికి సందే హించ వలసిన అంశమే అయింది. తిరిగివచ్చిన గబ్బిలాన్ని “నరులన్ ముట్టక నందులం గొలిచి పుణ్యంబెల్ల సాధించు నప్పరమంబైన రహస్యమున్” గురించి శివునితో ప్రస్తావించావా అని ప్రశ్నించాడు. శివుడిచ్చిన సమాధానం ఏమిటో తరతరాల అనుభవం నుండి అతను వూహించ గలడు. ‘ఇవి నిమ్నజాతులకు సంప్రశ్నింపగా రాని వేదరహస్యములు” అని కోపగించుకొని శివుడు స్వార్ధంబు ప్రదర్శించెనే అన్న మరొక ప్రశ్న ఆ అనుభవం నుండి వచ్చినదే. శివుడి స్వార్ధం ఏమిటి? శివుడుకానీ మరేదేవుడైనా కానీ ఎందుకు సృష్టించబడ్డారు? లోకంలో రాజధర్మాన్ని, బ్రహ్మణాధర్మాన్ని ప్రశ్నించకుండా ఒక అతీతమైన శక్తిని చూపి ప్రజాసమూహాలను అదుపు చేయటానికి. అతీత,అద్భుతశక్తిగా భగవంతుడిని ప్రదర్శించి వ్యాఖ్యానించే బ్రాహ్మణీయ సంస్కృతిని నిలబెట్టటమే భగవంతుడి స్వార్ధం. ‘ఇవి నిమ్నజాతులకు సంప్రశ్నింపగా రాని వేదరహస్యములు” అని ఏ బ్రాహ్మణ వర్గం ఐహిక ప్రపంచాన్ని అదుపుచేస్తున్నదో అదే భగవంతుడి భాష. భగవంతుడు అంతకు మించి మాట్లాడలేడు అని తెలిసిన జాషువా కథానాయకుడి వర్ణకసి ఆ మాటల్లో కనబడుతుంది.

మాలమాదిగలమధ్య ఉన్న అంటరానితనం గురించి కూడా జాషువా ఆందోళన పడ్డాడు. కృష్ణుడు, కృష్ణుడిని నిరసిస్తూ క్రీస్తు మొదలైన దేవుళ్ళు ఎంతమంది అవతరించినా ఈ రెండుజాతుల మధ్య సయోధ్య సమకూర్చలేకపోతున్నారని బాధపడ్డాడు. ఎంత చదువుకున్నా ‘మామాలలుమాదిగల్ గులమహాలోభంబు రెట్టింపగన్ / తెగలంగట్టి తగాదాలెంచెదరు గానీ సంధి గావింప’ రని నిస్పృహ చెందాడు. వాళ్లలో వాళ్ళుకు వున్న ‘నీచోచ్చతా నిర్ణయవ్యసన వ్యగ్రత’ కు సిగ్గు పడ్డాడు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా నిర్మించబడి నడుస్తున్న ఉద్యమానికి ఇది ఎంతో చేటైన అంతర్గత వైరుధ్యం అన్న భావం జాషువా మాటల్లో ధ్వనిస్తుంది. ఇంటిగుట్టు ఖండిక ( ఖండకావ్యము, మూడవభాగం,1946) కూడా ఈ కోవలోదే. “మా కులాల గొడవ మాకుంచి మీ లోన / గలుపుకొనుడు సుగుణజలధులారా!” అన్న పద్య పాదాలలో అంటరానితనాన్ని రద్దుచేయాలని సవర్ణ హిందువులను సంబోధించి కోరుతున్న వాళ్ళు ఈ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించు కోలేక పోవటం గురించిన ఆవేదన ఆయనది. దేశానికి స్వతంత్రం రాకముందే హృదయాశల్యంగా వున్న ఆ వైరుధ్యాలు స్వతంత్ర భారతంలోనూకొనసాగటం, పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టకపోవటమే అరవైఏళ్ల తరువాత దండోరా ఉద్యమాన్ని అనివార్యంచేసాయన్నది కాదనలేని సత్యం.

కులం ఒక వివక్షారూపంగా మానవుల సకలజీవనరంగాలను ఆక్రమించి అధికారం నెరుపు తున్న దృశ్యాన్ని కూడా జాషువా గబ్బిలము రెండవభాగంలో చూపించాడు. కుంతీదేవి కర్ణుడిని కని గంగానదిలో వదిలి ‘విద్యాకుల రూపసంపదలకు’ పరాయీకరించిన పౌరాణిక నిదర్శనాన్ని చూపుతూ భారతకుంతి నిర్లక్ష్యానికి గురియైన సంతానంగా నిమ్నజాతులను పేర్కొన్న జాషువా పాండవులకు తెలియనట్లుగానే ఇప్పుడు సవర్ణ హిందూ సోదరులు తమ భ్రాతృత్వాన్ని తెలుసు కోలేకపోతున్నారని బాధపడతాడు. కులంవల్ల హీనులై మిగిలిన సమాజంతో, మానవ సమూహాలతో పొందులు,పొత్తులు నిషేధించబడిన జాతిగా మాల మాదిగలు సహజ మానవత్వానికి పరాయివాళ్లుగా పడే హింస ఆ విధంగా గబ్బిలంతో వేదన వెళ్లబోసుకొనే నాయకుడి ముఖంగా వ్యక్తమైంది.

“ కులభేదబుద్ధిచే కయికొనకుందువే సఖుల గర్భదరిద్రుల యాతిధేయముల్” అన్న వేదనాత్మక అభివ్యక్తిలో ఆతిధ్యానికి కులమే అడ్డు అయిన సామాజిక స్థితి పట్ల, నీతి పట్ల అసహనం వుంది. అదే “కనుపడలేదు వర్ణమున కన్నపిశాచము భారతంబునన్ / గనుపడలేదు పంచముని కన్నను నీచపుజంతువేదియున్” అన్న పాదాలలో క్రోధంగా నిరసన స్వరంతో నమోదు అయింది.

హక్కులు దోచి, మనుషులు అన్న మాటే మరిచి నిమ్నజాతులను జంతువులవలె హీన పరుస్తున్న కాలంలో ప్రతిఘటించే పౌరుషవహ్నిని ఆర్పేస్తున్న మతం మన పక్కనే ఉన్న క్రూర సింహం వంటిది అంటాడు జాషువా. కడుపులో రగిలే ఆకలి చిచ్చుకు అల్లాడే తన భోజనాన్ని భక్షింపగ పుట్టుకొచ్చిన బహురూపుల దేవతలను గురించిన దుఃఖం అతనిది. మతంచేసే మాయ, మతంచేసే దోపిడీ, హిందూమతంలోని బహుళ దేవతారాధన అన్నీ జాషువాకవిత్వంలో విమర్శకు గురిఅయ్యాయి.

” క్రూరుల్ కుత్సితులస్మదీయములు హక్కుల్ దోచుకొన్నారు న
నన్నూరిం బైటకు నెట్టినారిపుడు నన్నోదార్చుచున్నారు గాం
ధారేయుల్ నెలకొల్పినారు బహుసంస్థల్ లక్కయిండ్లక్కటా
మారుదమ్ములు నమ్మజాలని విశ్వాత్మ శ్రీ సమారంభముల్” – హక్కులు దోచుకొని వూరిబయటకు వెళ్లగొట్టినవారు ఈ నాడు తనను ఓదార్చటానికి వచ్చారని, అనేక సంస్థలు నెలకొల్పారనీ అవన్నీ కౌరవులు మారుతమ్ముల నాశనానికి కట్టిన లక్కయిండ్లవంటివనీ చెప్పటంలో సమకాలంలో హరిజన సంక్షేమం ,అభ్యుదయం పేరిట ఏర్పడ్డ సంస్థల లోగుట్టు తెలిసి విమర్శించిన తీరే కనబడుతుంది.

సాహిత్య రంగంలో కులం కవి హృదయాన్ని ఎంత గాయపరిచిందో చెప్పటం స్వీయాను భవం నుండి జాషువాకు మరింత సులభం అయింది. ఉచ్చత నీచత అనే ద్వంద్వ విలువలతో కూడిన కుల సమాజంలో కళాపూర్ణులైన వాళ్ళు మా కులంలో పుట్టనే కూడదు అంటాడు.’పుట్టినం గలుగ వెప్డున్ నిండు సన్మానముల్’ అన్నది ఆయనకు నిశ్చయంగా తెలుసు. “ కవిగారికిదె నమస్కారంబనెడి వాడు కళకు లెమ్మని పరోక్షమున బలుకు / కవనంబునకు మేను గరిగి మెచ్చినవాడు కవిచెంత నెఱబెఱికముగ మసలు / విద్యా కళంకంబు వెదకాజాలని వాడు జాతి లేదని నోరు చప్పరించు” అన్న పద్యపాదాలలో వ్యక్తమయ్యేది – కవిపుట్టిన జాతి కవిత్వాన్ని మెచ్చు కొనటానికి, కవితో కలిసిమెలసి ఉండటానికి అవరోధమవుతున్న సాహిత్య అన్యాయాన్ని గురించిన ఆవేదనే.

అసలు సాహిత్యం దళితులు రచనారంగంలోకి వచ్చినతరువాతే కొత్తమలుపు తిరిగిందని జాషువా అభిప్రాయం. “ప్రభువుల పెండ్లి పేరంటాలు వర్ణించి కాలంబు పెక్కేండ్లు ఖర్చు పెట్టి” అని ప్రారంభమయ్యే పద్యంలో లోకపు దుఃఖాన్ని నిర్లక్ష్యం చేసి ప్రపంచపు మేలుకై వాడాల్సిన సాహిత్యాన్ని స్వార్ధానికి ఉపయోగించే విరహవేదన, అంగాంగ వర్ణనల సంప్రదాయాన్ని నిరసించాడు జాషువా. ఆ వరుసలో “ పదియునెన్మిది మార్లు బాడిన శ్రీరాము చరితంబు వగరెక్క తిరుగబాడు’టను కూడా ఆయన పేర్కొనటం గమనించవచ్చు. మరల ఇదేల రామాయణంబన్నచో తినుచున్న అన్నమే తినుచున్న లోకాచారాన్ని మద్దతుగా తెచ్చుకొని రామాయణకల్పవృక్ష రచనకు విశ్వనాథ సత్యనారాయణ పూనుకొన్నది సరిగా అప్పుడే. ఆధునిక కాలాన, ప్రజాసమస్యలు అనేకం వేధిస్తున్న కాలాన ఇటువంటి రచనలు ఏమిటి? అన్న ఒక తిరస్కార దృష్టి లోలోపల మెదులుతుండగా జాషువా తనకథానాయకుడిముఖంగా ఆ విషయాన్ని ప్రస్తావించాడనుకోవచ్చు. పరిణామంలో లోకవృత్త పరిశీలనా శీలుడైన జాషువా ‘ఆడది లేనిసాహిత్యానికి అందమెక్కడ అన్న భావంతో కవులు ప్రణయకావ్యాలు వ్రాస్తూ పోతుంటే దళితకవులు ‘దయారసనవ్యకావ్య’ రచనకు సాహిత్యమార్గాన్ని మళ్లించారని గుర్తించాడు. కనుకనే “ తుల వాక్రుచ్చగ రాని నెత్తుటి సిరాతో వ్రాయుచున్నారు మత్కులజుల్ దుఃఖ రసోత్కటంబులగు పెక్కుల్ కావ్యముల్” అని సగర్వంగా స్వాభిమానంతో చెప్పగలిగాడు. ఈ ప్రయత్నాలు వేటగాళ్ల హృదయాలను ఏమైనా కరిగిస్తాయా.. లేక ప్రారంభంలోనే భగ్నమై యథాతధ స్థితి కొనసాగుతుందా అని ఆలోచనలో పడటం కూడా చూస్తాం. ఏమైనా దళితులు వ్రాసే దుఃఖరసోత్కట కావ్యములతో గానీ తెలుగు సమాజం సాహిత్యంలోకి సమగ్రంగా వచ్చినట్లు కాదని, ఆ పనిలో దళితులు ఉద్యమస్థాయిలో ప్రయత్నపరులు కావాలని కారంచేడు ఘటన తరువాత తెలుగునాట వచ్చిన దళిత సాహిత్య ఉద్యమం స్పష్టం చేసింది. దీనికి మూల బీజమైన ఆకాంక్ష జాషువా నుండి అందివచ్చిన చారిత్రక వారసత్వం అనుకోవచ్చు.

స్వదేశీ ఉద్యమంలో భాగంగా “నగరివెలుపలి మాలమాదిగలు గూడ / నరులు సుమ్మని దేశంబు గుఱుతుబట్టె”నని మురిసిపోయాడు కూడా జాషువా.ఆర్ధిక మత సాంస్కృతిక పరాయీకరణలకు గురైన అంటరాని వారి సమస్యకు స్వరాజ్య సాధనలోనే పరిష్కారం ఉందని జాషువా సమాధాన పడటం కూడా ఇందులో కనిపిస్తుంది. అయితే కులం నాశనం కాకుండా స్వరాజ్యానికి అర్ధమే లేదని అంబేద్కర్ భావన. స్వరాజ్ కు మద్దతు అంటే దాని నీడలో హిందూ వర్ణవ్యవస్థకు ఆమోదం తెచ్చిపెట్టటమే. హిందూ సమాజం కులరహిత సమాజం అయితేనే తననుతాను పాలించుకొనటానికి, రక్షించుకొనటానికి సమర్ధవంతం అవుతుంది. ఆ ఆంతరంగిక శక్తి లేకుండా హిందువులకు స్వరాజ్యం అంటే బానిసత్వంవైపు అడుగు వేయటమే అని అంబేద్కర్ అభిప్రాయం.( విశ్వనాధ్ బైట్, డా. అంబేద్కర్ అండ్ నేషనలిజం, https://www.Boloji.com.articles/13534 )నిజానికి జాషువా అంబేద్కర్ భావజాలాన్ని,ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాడు. అధ్యయనం చేస్తూనేఉన్నాడు.అభిమానిస్తూనే ఉన్నాడు. లేకపోతే “ కులముంచుకొని నన్ను గొలుచుకొండను వేల్పు కడగి నా కన్నీరు దుడువగలడె” అని సవాల్ చేయటం ఆయనకు సాధ్యమై ఉండేది కాదు. కానీ పూనా ఒడంబడిక తరువాత దళిత ఉద్యమంలో గాంధీ దృక్పథం వైపు మొగ్గు పెరిగిన నేపథ్యంలో జాషువా అడుగులు గాంధీవైపుకే సాగినా ఆలోచనలు అంబేద్కర్ చుట్టూనే తిరుగుతున్నాయనటానికి “కులముంచుకొని నన్ను గొలుచుకొండను వేల్పు కడగి నా కన్నీరు దుడువగలడె” అన్నప్రశ్న నిదర్శనం.

గబ్బిలము రెండవభాగం లో కథానాయకుడు కైలాస గిరినుండి తిరిగివచ్చిన గబ్బిలముతో చేసిన సుదీర్ఘ సంభాషణలో స్వరాజ్య ఉద్యమంలోకి హరిజనులను సమీకరించే పనిలో ఫలించిన గాంధీ వ్యూహం ప్రతిఫలించటం చూస్తాం.

వెఱపు వలదు నీకు హరిజనసోదరా
స్వీయరాజ్య రథము వెడలివచ్చె
లాగిపొమ్ము నీకు భాగంబు గలదంచు
బాడుచుండె రత్న భరతమాత — స్వరాజ్య రధం లాగటంలోనూ, స్వరాజ్య ఫలితాలను అందరితో సమానంగా అనుభవించటంలోనూ హరిజనులకు భాగం ఉందన్నగాంధీ భావనల ప్రతిధ్వనే ఇది. ‘పలనాటి బ్రహ్మనాయుడు నాటిన సంఘసంస్కరణ బీజం గాంధీచే ఈ నాటికి ఫలించిదిగదా’ అన్న నాయకుడి అభిప్రాయంలో ప్రతిఫలించింది కూడా అదే. తన పక్షాన రాయబారం తీసుకువెళ్లిన గబ్బిలానికి తాను బాకీ పడ్డానని అనుకొనే అతను ‘ స్వరాజ్య సౌధమున నావాసంబు సిద్దించినన్’ ఆ బాకీ తీర్చుకుంటానని నమ్మకంతో కూడిన షరతును పేర్కొనటం గమనించవచ్చు. స్వరాజ్యసౌధంలో హరిజనసోదరులకు స్థానం ఉన్నదని ఆశచూపినది గాంధీ హరిజనవాదమే. దానిపట్ల జాషువా నమ్మకమే షరతుతో కూడిన ఆ వాక్యంలో కనబడుతుంది.

“ ఏ జాతి కెంతవచ్చునొ
రాజత్వంబంత నాకు రావచ్చుగదా ?” అన్న కావ్యనాయకుడి తర్కంలో కూడా స్వరాజ్యం వస్తే అధికారంలో హరిజనుల వాటా దానంతట అదే వస్తుందన్న అభిప్రాయమే ఇమిడి ఉంది.అయితే స్వరాజ్య స్వర్ణ సూత్రాన్ని దివ్యసూత్రంగా భావిస్తూ కూడా అతను అది ‘అస్పృశ్యతా వ్యాఘ్రమున్’ కట్టివేయగలదా అని సందేహ పడ్డాడు. ఆదర్శానికి వాస్తవానికి మధ్య ఉన్న అగాథం అర్ధం అవుతుండటం వల్లనే ఆ సందేహం. “ స్వాతంత్ర్యంబను స్వర్గ సౌఖ్యమున మా భాగంబుమాకిత్తురో / ఖాతాలేదని త్రోసి పుచ్చెదరో ! వక్కాణింపవే చెల్లెలా!” అని గబ్బిలాన్ని అడగటంలోనూ ఉన్నది ఆ సందేహమే.

గాంధీని బుద్ధుని యంతవాడుగా తపస్విగా పేర్కొని సబర్మతిలో ఆయనను చూశావా అని గబ్బిలాన్ని ఆరాతీసిన కథానాయకుడు బాపూజీకి దీటైన వల్లభాయిపటేలుకు కూడా తన మనః క్లేశంతెలుసు నంటాడు. అతని మనఃక్లేశం అస్పృశ్యతకు, అవమానానికి సంబంధించినవే. గాంధీయే కాదు, పటేల్ వంటి జాతీయోద్యమ నాయకులు ఇతరులు కూడా హరిజన సమస్య పట్ల ఆర్తితో వూన్నారని ధైర్యం కూడదీసుకొంటున్న దళితుడు అతను. అయితే దానికి మరొక అంచు సందేహం ఉంటూనే ఉంది. రాజకీయాలను అదుపుచేసి నడిపించే నాయకుడు జవహర్ ఆ పనులు ఒత్తిడిలో స్వాతంత్య్రం తరువాత ‘మా చిక్కుల్ దీర్చుట విస్మరింపడు గదా’ అన్న సందేహం దానిలో భాగమే. శాఖోపశాఖలుగా పెరిగి సర్వ వర్ణములకు నివసించటానికి బసలు ఏర్పరచిన కాంగ్రెస్ అనే మందార వృక్షం శాఖలపై నివసించటానికి మనకుండదా స్థలం అన్న ప్రశ్నలోనూ నమ్మకంతో పాటు ధ్వనించేది సందేహమే. విశాల దేశప్రయోజనాల రీత్యా తమ సమస్య కంటే స్వరాజ్యనికి ప్రాధాన్యత ఇయ్యటానికి సిద్ధపడిన దళితులలో ఆ మాత్రం సందేహం అనివార్యమైనదే. వాళ్ళు తనవాళ్లు కాకపోవటం, తనజాతి కష్టాలు తెలిసినవాళ్ళు కాకపోవటం కూడా మరొక కారణం అయివుంటుంది. ‘కల డంబేద్కరు నా సహోదరుడు మాకై యష్టకష్టాలకుం బలి’ యైన వాడు అని అంబేద్కర్ గురించి చెప్పినంత ఆత్మీయంగా మరే నాయకుడి గురించి జాషువా చెప్పకపోవటం గమనించాలి.

మొత్తం మీద 1940లలో అంబేద్కర్ కుల తాత్వికత, గాంధీ స్వరాజ్య తాత్వికత ల మధ్య సాగుతున్న మేధోపరమైన సంఘర్షణ, సంవాదం నమ్మకానికి, సందేహానికి మధ్య వూగిసలాట గబ్బిలము రెండవభాగంలో కీలకాంశాలు అయినాయి. ఈ సందిగ్ధ సందర్భంలో దళిత అవగాహన ఏమిటో చెప్తుంది ఈ పద్యం.

“ఓటమిలేదు నా యతన మూరకపోదు తుపానువోలె నా
మాటలుమా మహేశ్వరుల మానసముం గదిలించి తీరు, క
న్నీట మునింగి పైకుబుకు నిర్మల సూక్తి ఫలింపకున్నచో
రాటములో స్వరాజ్యము విరాజిలుటల్ కృతక ప్రచారముల్” గబ్బిలంతో కథా నాయకుడు పంపిన సందేశం దళిత జీవన వ్యధకు సంబంధించిందే. “ నాదు కన్నీటి కథ సమన్వయము సేయ/ నార్ద్ర హృదయంబు( గూడ (గొంతవసరంబు” అని చెప్పి మరీ తన జీవిత వ్యధను వినిపించాడు అతను. దానిని ఉమామహేశ్వరులకు వినిపించే గబ్బిలానికైనా, వినే ఉమామహేశ్వరులకైనా ఆర్ద్ర హృదయం ఉండాలి. గబ్బిలము వెళ్ళింది, వచ్చింది. తనప్రయోజనం నెరవేరిందా లేదా అన్నది కథానాయకుడి ప్రశ్న. సందేహాలు ఎన్ని వున్నా తన సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ, విశ్వాసమే దళితుల బలం. ‘ఓటమిలేదు’ అన్న దృఢమైన నిశ్చయమే ఆ బలం. నా ప్రయత్నం వూరికే పోదు. తుఫాను వంటి తనమాటలు ఉమామహేశ్వరుల మనస్సును కదిలించి తీరుతాయి తనకు తరుణోపాయం దొరుకుతుంది అన్నది అతని నమ్మకం.

ఉమామహేశ్వరులు దేవుళ్ళు కదా!? అనేక సందర్భాలలో పేదవాడి కబళాన్ని హరించినవాడుగా దేవుడిని నిరాకరించిన జాషువా మళ్ళీ ఆ దేవుళ్ళకే దళితుల బాధ వినిపించటం ఏమిటి? అది వృధా ప్రయాస కదా! అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఉమామహేశ్వరులు ఒక నెపం మాత్రమే. అతని ఉద్దేశంలో అసలు వినవలసినవాళ్లు స్వరాజ్య సాధనకు ముందుబడ్డ కాంగ్రెస్ నాయకులు. గాంధీ వంటి వాళ్ళు. కన్నీటిలో మునిగి పైకుబికిన దళితుల మాట ఫలించకపోతే ‘రాటములో స్వరాజ్యము విరాజిల్లుతుందన్న ప్రచారంలోనే అబద్ధం, వంచన ఉన్నాయని అర్ధం అన్న ముక్తాయింపులో గబ్బిలము కావ్యనాయకుడు తన సందేశం లౌకికంగా అందవలసినది ఎవరికో ఆ విషయంలో స్పష్టతతోనే ఉన్నాడన్న సూచన ఉంది. అందువల్ల గబ్బిలము కావ్యం రానున్న స్వతంత్ర భారతానికి ఒక సవాల్.


5

1950లో వెలువడిన ఖండకావ్యము నాలుగువభాగంలో ‘స్వతంత్రదినంనాటి సంతోషగీతాలు మీదటి నిరాశాగీతాలు’ ఉన్నాయి. కవికి నిరాశ కలిగించిన అంశాలలో అస్పృశ్యతా సమస్య పరిష్కరించబడకపోవటంఒకటి. 1950 లో జాతిలింగమత భేదం లేకుండా అందరికీ సమానత్వాన్ని వాగ్దానం చేసిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ‘అంటరానితనము నడలించు శాసనల్, చేయటమైతే జరిగిందికానీ ఆచరణలోకి రాకపోవటమే విషాదం. ( ఆత్మస్తుతి ) కుల చట్రాన్ని దాటని సాహిత్యం వలన‘అమలుచేయంగ దాహతులేక వెనుదీయు నడుమంతరపు శాసనల’వలన దీనజాతి ముక్తి సాధ్యం కాకుండా పోతున్నదని (ప్రశ్న) వేదన చెందాడు. “కులమతాల సౌధములు గూలి పోనీక /కాపాలా యొనర్చు కవులచేత /వ్రాయబడ్డ పాతరచనలు వినిపించి బాధపెట్టే రేడియోను విమర్శించాడు.

నేతాజీ (1947), బాపూజీ(1948) వంటి జీవిత సంబంధ దీర్ఘ ఖండకావ్యాలలోనూ సందర్భాన్ని కల్పించుకొని మరీ హరిజన సమస్యను ప్రస్తావించాడు జాషువా. నేతాజీ కావ్యంలో అతనికి కనబడి ‘తనదగు సుఖదుఃఖయుత కథానక మెల్లన్’ వినిపించిన భరతమాత వర్ణవిభజన, తల్లిగా తనను బాధిస్తున్నదని చెప్పుకొంటుంది.

“తొలుతన్నల్వురు నాల్గుత్రోవలయి పుత్రుల్ నాటు కొన్నారు మొ
క్కలుగా వర్ణచతుష్టయం బిపు డసంఖ్యాకంబులై యైక్యతా
బల విచ్ఛిత్తి యొనర్చి నన్నొరులకున్ బట్టించె నీ హెచ్చు త
గుల కయ్యాలొక తల్లి పిల్లలకు సిగ్గుంజేటు యోచింపగన్” —— నాలుగు వర్ణాల సమాజమే అసంగతం అంటే ఆ నాలుగు వర్ణాలు ఈనాడు అనేక కులాలై , పంచములు అని అయిదవ వర్ణం ఒకటి తయారై ఒకరికంటే ఒకరు అధికులమని, ఒకరిమీద ఒకరు పెత్తనానికి తెగబడటమే అనైక్యత మూలమై తనను బ్రిటిష్ పాలకులకు అప్పజెప్పిందని ఆ తల్లి బాధ. ఒక తల్లి పిల్లల మధ్య ఈ అంతరాలు సిగ్గుచేటయినవి అని భారతీయులు ఎప్పుడు గుర్తిస్తారా అన్నది ఆమె ఆవేదన.

అట్లాగే భరతమాత గాంధీని భగవంతుడని ఆరాధించినవాళ్ళే ఆయన పంచమోద్ధరణ కార్యక్రమాన్ని దూషిస్తున్నారని కూడా బాధపడింది. ‘అంటంగూడదు ముట్టకూడ దను వాక్యం బాత్మ’ ను కష్టపెట్టగా నట్టింట్లో బాధపడే అభాగ్యజీవులను ఏ రాముడూ, కృష్ణుడూ కూడా గాంధీలాగా ఆదరించలేదని చెప్పింది.మైనపుటుండ వంటి భారతీయులను స్వర్థపరులైన సనాతన శిల్పులు ‘మనుకీలుబొమ్మలు’గా , మరమ్మత్తుకు లొంగని కొమ్ములు లేని దున్నలుగా తయారుచేస్తున్నారని బాధపడింది. “ ఎంతటి దాస్యమేని సహియింతును గాని సహింపజాల, నీ

స్వంత సహోదర ప్రబల బంధుర దాస్యము గబ్బిలాల శు
ద్ధాంతములైన వేల్పుల సుధాభవనాలకు దూరమైన నా
సంతతి నుద్ధరింపగల సత్పురుషుం డుదయింపకుండినన్” – స్వంత
సోదరులకే దాస్యం చేయవలసి రావటం కన్నదుస్సహమైనది మరొకటిలేదు. ఆ దాస్యం దేవాలయాలకు కూడా వాళ్ళను దూరం చేసింది. అటువంటి నిమ్నజాతులను ఉద్ధరించగల పురుషుడికై ఎదురుచూపులు భరతమాతవి.

బాపూజీ కావ్యంలో జాషువా ఆయనను “ నిమ్నజాతుల కంటి నీరంబు దుడిచి యాశ్వాసించు నిరుపేద బాంధవుండు”గా, ‘హరిజనావళి సముద్ధరణార్ధమనయంబు వగచి’ కన్నీరు పెట్టుకొన్న వాడుగా పేర్కొన్నాడు. “ రాట్నముచేత నిమ్నజుల కాహారంబు గల్పించి య / భ్యుదయాపాదక సామరస్యమున కాయుర్దాయముం బోసి”నవాడుగా గుర్తించాడు.స్వరాజ్య ఉద్యమంలో భాగంగా బ్రిటిషు వస్త్రపరిశ్రమను గురిచూసి వచ్చిన స్వదేశీ ఉద్యమం ఖాదీని కీలకాంశంగా చేసింది. స్వతంత్రానికి , స్వయం సమృద్ధికి అది సంకేతం అయింది. స్వదేశీ వస్త్ర ఉత్పత్తి అనగానే శ్రమ చేసే మనుషులు, శ్రమసాధనాలు చరఖా, మగ్గం వంటివి ఉంటాయి. భారతీయులస్వతంత్ర ఆకాంక్షకు ఖాదీ ప్రతీక కావటంతోనే చరఖా గాంధీ రాజకీయాలలో భాగమైంది.. ఆ క్రమంలో గాంధీ హరిజనులను ఏకంచేయాటానికి కూడా దానిని వాడుకున్నాడు.(Ektaa jain- Khadi A Cloth and beyond, https://www.mkgandhi.org/articles/khadi-a-cloth-and-beyond.html) నూలు వడకటం, బట్టనేయటం ద్వారా గౌరవకరంగా జీవించటం గురించి ప్రేరేపించాడు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా కొత్త ఆర్ధిక జీవన సంస్కృతిని ఎత్తిపట్టిన రాట్నం జాషువాకు చాలా ఇష్టమైనది. ఆయన కవిత్వంలో అనేక సందర్భాలలో అనేకరంగులతో రాట్నం దృశ్యమానం అవుతుంటుంది. జాతీయోద్యమంలో రాట్నానికి గాంధీ కల్పించిన ఈ తాత్విక ప్రాధాన్యాన్ని జాషువా ఎంతగా అభిమానించాడో “ రాట్నముచేత నిమ్నజుల కాహారంబు గల్పించి య / భ్యుదయాపాదక సామరస్యమున కాయుర్దాయముం బోసి” అన్న పద్యపాదాలను బట్టి తెలుసుకోవచ్చు.

“ మనము బానిసలము మనకును బానిసల్
శాశ్వతముగ నిమ్నజాతివారు
బానిసీండ్రక్రింద బానిసలున్నచో
బలము ముమ్మరించు పాలకులకు” — అన్న తత్వం తెలిసిన గాంధీ రాజకీయాలపట్ల జాషువా సానుకూలుడు.
“కులములవారిగా ప్రజలకున్ మరియాదలు పంచి పెట్టినం
గలహములుండబోవని యొకానొక వర్గమువారుపాయముల్
బలుకుదు రైకమత్య బలవధ్ఘన రజ్జువునుండి భిన్నమై
తొలగిన నూలుపోగులకు తోరపు జిక్కులు రాకపోవునే” (స్వయంవరం 1950) అని పూనా ఒడంబడిక నాటి గాంధీ వాదాన్నే స్వాతంత్య్రం తరువాత కూడా తనవాదంగా వినిపించినవాడు జాషువా. తాను క్రైస్తవ మత సంప్రదాయంలో వాడై కూడా, హిందూమతంలోని బహుదేవతారాధనను ఎక్కడికక్కడ దోపిడీ మూలంగా, పేదరిక కారణంగా విమర్శకు పెడుతూ కూడా అంటరానితనం, ఆకలి, సమాజిక సాంస్కృతిక వివక్షలనుండి పంచముల విముక్తికి ఎక్కడా అన్యమత స్వీకారాన్ని పరిష్కారంగా చెప్పకపోవటం, సవర్ణహిందూ సమాజంలో భాగంగా సమానగౌరవ ప్రతిపత్తిని తనజాతి సంపాదించుకోవాలనుకొనటం జాషువా వ్యక్తిత్వంలోని విలక్షణత.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply