జాతి జనుల ఆత్మగీతం

దళిత జీవన తాత్విక సారాంశాన్ని కలంలో, గళంలో నింపుకున్న అద్భుత ఉద్యమ కవి మాష్టార్జీ. ఉద్యమాలకు ఊపిరినిచ్చే పాటలతో, రచనలతో సంచలనం సృష్టించిన సహజకవి. అస్పృశ్యతా వేదనల్లోంచి ఆదిమ మూలాల్ని శోధించి మూలవాసుల సిద్ధాంతకర్తగా సాహిత్య శాస్త్రంలో కొత్త ద్వారాలను తెరచిన మూలకవి మాష్టార్జీ. మెదక్ జిల్లా గజ్వేల్ కు సమీపాన గల అనాజీపూర్ లోని పూర్వీకుల వారసత్వ దళిత జీవనవేదనను గుండెనిండా నింపుకున్న ఉద్వేగ కవి మాష్టార్జీ 7 సెప్టెంబర్ 1952లో బొల్లారం కంటోన్మెంట్ లో జన్మించాడు. తల్లిదండ్రులు గంగాధరి రాజయ్య, సత్తెమ్మలు. బాల్యం నుండే అడుగడుగునా కులవివక్ష, పీడన, అవమానాలు ఎదురైనాయి. ఎన్ని అవరోధాలు, ఆర్థిక దుస్థితులున్నా విద్యను విస్మరించలేదు. జీవనోపాధి కోసం పనిచేస్తూనే బి.ఏ., ఎల్.ఎల్.బి., ఎం.ఏ. వరకు చదువుకొని తనవారికి మార్గదర్శిగా నిలబడ్డాడు. తాత తత్త్వగీతాలు, తండ్రి జానపద గేయాలు, వీధి భాగోతాలు ఆడటం, మేనత్త పల్లెపదాలు, చుట్టూ ఉన్న జానపద కళారూపాలను ఆకళింపు చేసుకున్న మాష్టార్జీ చిన్నతనం నుండే పాటల రచన వైపు అడుగులు వేశాడు.

భక్తిగీతాలనుండి భావకవిగాను తన స్వరముద్రను బలంగా వినిపించాడు. మాష్టార్జీ అసలుపేరు గంగాధరి శ్రీరాములు. విద్యార్థులు గౌరవంగా పిలుచుకున్న ‘మాష్టార్జీ’ పిలుపును తన కలం పేరుగా మార్చుకున్నాడు. దళితగీతాలు, స్త్రీ తత్త్వ గీతాలు, గుడి గంటలు, బౌద్ధగీతాలు, వెన్నెల గానం, ముక్తకాల పల్లకి, మట్టిపూల పాటలు, కవితా సంపుటాలతో విభిన్న సామాజికాంశాలపై చైతన్యాన్ని వైవిధ్యభరితంగా ప్రజాపరం చేశాడు. అణగారిన జాతుల అస్తిత్వాన్ని మేల్కొలుపుతూ, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కూల్చివేసే పాటలను ‘దళిత కళా మండలి పాటలు’, ‘మూలవాసుల పాటలు’ పేరుతో సంకలనం చేసి తన చారిత్రాత్మక బాధ్యతను చాటుకున్నాడు.
ఆ క్రమంలో తను రాసిన పాటలు ఉద్యమాలలో పతాక గీతాలుగా మారుమ్రోగాయి. వాటిలో ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ అనే పాట తెలుగునాట ప్రతిధ్వనించింది. ఈ పాటను పాడుకుంటూ మనిషి ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు ప్రతీకైన దళిత దార్శనికుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించుకుందాం…

“అందుకో దండాలు బాబా అంబేద్కరా
అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో
ముందుగా నిను దలిచి పాటలు పాడేము
చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో”
భారతదేశ జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ ఎంత కీలకపాత్ర వహించాడో అందరికీ తెలుసు. స్వాతంత్య్రానంతరం, తన మరణానంతరం కూడా దేశంలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోత్తముడు డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్. మాష్టార్జీ ఈ పాటకు ముందే ‘అందుకో జోహార్లు – అంబేద్కరందుకో జోహార్లు’ అనే పాటను రచించాడు. దీనితోపాటు ‘అఖండ విప్లవజ్యోతి అంబేద్కర్’ అనే రూపకాన్ని, నాటకాన్ని కూడా అందించాడు. మాష్టార్జీ సామాజిక గీత రచనలో ఎంతోమంది ఆదర్శనీయులైన మూల అభ్యుదయ వాదులను స్మరించుకున్నాడు. ‘అగ్రవర్ణ ఆధిపత్య శక్తులు, మనువాద ప్రచారకుల తిరోగమన విధానాలను ప్రతిఘటించిన ‘ఈ మహనీయులు సదా స్మరణీయులు’ అంటూ మాష్టార్జీ మహాత్మాపూలే, నారాయణ గురు, సాహు మహరాజ్, పెరియార్ లపై విలువైన గీతాలను రచించాడు.
వారి స్ఫూర్తిదాయక జీవితాన్ని కీర్తిస్తూ ఈ తరానికి వాళ్ళందరిని పరిచయం చేశాడు. మాష్టార్జీ అంబేద్కర్ మీద మరింత ప్రత్యేక గౌరవంతో విభిన్న ప్రక్రియల్లో వారిని స్మరించుకున్నాడు. ఎన్నో అవమానాలు,ఎగుడు దిగుళ్లలో నడిచిన అంబేద్కర్ అనంత ఆత్మవిశ్వాసాన్ని, రాజ్యాంగమంత విలువైన అంబేద్కర్ విస్తృత జీవితాన్ని, అనుభవాలను సంక్షిప్తంగా ఒక పాటలోకి పొదగడం సామాన్యమైన విషయం కాదు.

ఈ కవికి అంబేద్కర్ నామమే ఒక నాందిగీతం. అందుకే ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ అంటూ దళితుల మదిలోని గౌరవాన్నంతా పల్లవిగా రూపొందించాడు. నిమ్నజాతుల వెనకబాటుతనాన్ని తొలగించాటానికి, అంతరానితనాన్ని నిర్మూలించడానికి, కుల వివక్షతపై చేసిన పోరాటలన్నింటిని కవి గుర్తు చేస్తున్నాడు. పగలు సైతం చీకట్లు కమ్ముకున్న దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపిన సూర్యుడిగా అంబేద్కర్ ను అభివర్ణిస్తున్నాడు మాష్టార్జీ. ఆకాశంలో సూర్యుడు పన్నెండు గంటలే వెలుగునిస్తాడు. ఈ అంబేద్కర్ సూర్యుడు మాత్రం ఎల్లవేళలా జాతి జీవనంలో వెలుగుల్ని ప్రసరిస్తూనే ఉన్నాడు.
“అంటరాని వాడంటూ
అగ్రజాతి మూర్ఖులంత
అడుగడుగున నిను బడిలో
అవమానం చేసినపుడు
అంటరానితనమును పాటించిన వాళ్లకూ
తగిన శాస్తి జేస్తనంటూ శపథము జేసావో”
ఉన్నత విలువలు నేర్పే బడిలో సైతం అంటరానివాడంటూ అవమానాలకు గురిచేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు కవి. అంబేద్కర్ జీవితంలోని కీలకమైన దశలను, ఘట్టాలను రేఖామాత్రంగా గుర్తుచేస్తూ శ్రోతలలో ఉద్వేగాన్ని నింపుతాయి ఈ చరణాలు. అవమానాన్ని అధ్యయన సోపానంగా మార్చుకుని ఎదిగిన తీరు అసామాన్యం. అంబేద్కర్ చేసిన శపథాన్ని సైతం జాతి జనులు వారసత్వంగా అందుకొన్న ఈ సమయం ఉత్తేజభరితం. ‘చదువుకున్న వాడిముందు ప్రపంచం మోకరిల్లుతుందన్న’ పూలే మాటల్ని నిజం చేసినవాడు అంబేద్కర్.

నాడు బడిలో అవమానం పొందిన అంబేద్కర్ నేడు ఎన్నో బడుల్లో గది గోడలకు చిత్ర పటమై జ్ఞాన దరహాసాలు అందిస్తుండడం విశేషం.
“పట్టుదలగ ప్రాపంచపు
పెద్ద సదువులన్ని సదివి
రంకు నేర్పు గ్రంథాల
రంగంతా బయటబెట్టి
కులగజ్జి మూర్ఖులతో
ఎనలేని పోరుజేసి
పీడితులకు తాడితులకు హక్కులు సాధించి
హీనమైన బ్రతుకులకు వెలుగును జూపావో”
అంబేద్కర్ కేవలం డిగ్రీల కోసం చదవలేదు. అంబేద్కర్ అధ్యయనం అకడమిక్ గ్రంథాలకే పరిమితం కాలేదు. మనిషి స్వేచ్ఛ, సమానత్వం కోసం తపించిపోయాడు. కాలదోషం పట్టిన వ్యవస్థల డొల్లతనాన్ని వెక్కిరించాడు. ప్రజల ఉన్నతి కోసం శాస్త్రీయ దృక్పథంతో గ్రంథాలయాలన్నింటిని లోతుగా అధ్యయనం చేశాడు. ‘మనం ఏ దిక్కుకు తిరిగినా దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ’ అని గుర్తించాడు. మత గ్రంథాల పేరుతో పవిత్రత, ఆధ్యాత్మికత ముసుగులో ప్రజలమధ్య నెలకొల్పబడుతున్న వైషమ్యాలను విమర్శించాడు. ‘కులం ప్రకృతి విరుద్ధమైన వికృత వ్యవస్థ’గా నిరసించాడు. ‘కుల నిర్మూలన’ కోసం ఒక యుద్ధమే చేశాడు.
అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో చారిత్రక బాధ్యతను తలకెత్తుకున్నాడు. వెనకబడిన, అణగారిన వర్గాలకు కులం పేరుతో వెలివేయబడ్డవారికి, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ రక్షణల కోసం పోరాడాడు. చివరకు వెనకబడిన ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. ప్రాంతాల అస్తిత్వాన్ని కూడా ఆనాడే గుర్తించాడు. మాష్టార్జీ కొండలాంటి అంబేద్కర్ మేధస్సును, ముందుచూపును చిన్న చిన్న చరణాల అద్దంలోంచి చూపాడు.
“ఎంతకు ఇగ మారమన్న
హైందవుల గుండెలదర
కుళ్ళిపోయి కంపుగొట్టు
కులరక్కసి కోరలిరగ
మనుధర్మపు రక్షకులు
మంటలల్లా మాడిపోగ
హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు
బౌద్ధ ధర్మాన గలిసి ధన్యుడవైనావో”
‘హిందూమతం అంటేనే ఫాసిజం’ అని అంబేద్కర్ తీవ్రంగా హిందూమతాన్ని నిరసించాడు. భారతీయ ప్రజలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్న ‘కులమతాల’మధ్యనున్న అభేదాన్ని నిశితంగా విశ్లేషించాడు. హిందూమత గ్రంథాల్లోని కాలకుట విషం లాంటి భావజాలాన్ని తూర్పారబట్టాడు. మనుధర్మ శాస్త్రంలోని దుర్మార్గపు సూక్తులను ఎండగట్టాడు. హిందూమతాన్ని నిర్మూలించకుండా కుల నిర్మూలన జరగదనే సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. బౌద్ధమతం వైపు ఆకర్షితుడయ్యాడు. బౌద్ధంలోనే సమానత్వం సాధ్యమని తెలుసుకున్నాడు. మనిషి ఆత్మగౌరవం కోసం బౌద్ధాన్ని స్వీకరించాలని భావించాడు. “హిందువుగా పుట్టిన నేను హిందువుగా చావనని” శపథం చేశాడు. బౌద్ధం పరిపూర్ణమైన మతం. బౌద్ధాన్ని సమతా సాగరంగా భావిస్తూ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంబేద్కర్ జీవితంలోని ఒక ప్రాముఖ్యమైన పరిణామాన్ని శక్తివంతంగా పలికించాడు మాష్టార్జీ.
“దేశభక్తి నీ సొత్తు
మానవతే నీ గుండె
కరుణంటే నీ మనసు
సమతంటే నీ ధర్మం
ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు
పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో”
భారతదేశ సంక్షోభ సమయంలో, విభజన సందర్భంలోనూ అంబేద్కర్ సమైక్య భారతదేశ భావనకే ప్రాధాన్యమిచ్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టత కోసం పరితపించాడు. రాజ్యాంగ రూపకల్పనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అందరికి ఆమోదయోగ్యమైన పంథాలో నడిచాడు. ప్రజలకు సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి తపించిపోయాడు. బుద్ధుని ప్రబోధాలకు అనుగుణంగా నడిచిన అంబేద్కర్ ధర్మ వర్తనుడే. అందుకే పీడితుల దుఃఖాన్ని తొలగించే ప్రయత్నంలో నిబద్ధతతో కృషిచేసాడు. మాష్టార్జీ పాటలో అంబేద్కర్ మరో అభినవ బుద్ధుడుగా సాక్షాత్కరిస్తాడు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు రాజ్యాంగ స్పృహను, పౌర హక్కుల ప్రాధాన్యతను, ధర్మాలను తెలుసుకోవడంలో ఈ పాట ఒక పాఠంగా దారిచూపుతుంది. ‘ దళితజాతి ఆత్మగౌరవ గీతంగా, దళిత ఉద్యమ జాతీయ గీతంగా’ ఈ పాటను కత్తి పద్మారావు వర్ణించడంలో అతిశయోక్తి ఏమిలేదు.

ఈ పాట వెనుక ఆసక్తికరమైన నేపథ్యం వుంది. ప్రాథమిక విద్యాభ్యాస దశలో మాష్టార్జీని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్ ఆదుకుంది. డా. అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఆ పథకం ఎందరో దళితులను ఉన్నతస్థాయికి చేర్చింది. మాష్టార్జీ మనసులో అప్పుడే అంబేద్కర్ గాఢంగా ముద్రించుకుపోయాడు. 1979 లో జి.యం. అంజయ్య హైదరాబాద్ కంటోన్మెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు అడ్డగుట్టలో నిరుపేదలకు గుడిసెలు వేయించాడు. ఆ సందర్భంగా అక్కడి పిల్లలకు పాటలు, నృత్యాలు నేర్పించమని మాష్టార్జీని అడిగాడు. గుడిసెలకు దగ్గరలో చిన్న తడకలతో గదిలాంటిది తయారు చేసి ‘అంబేద్కర్ విద్యానికేతన్’ పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే అంబేద్కర్ మీద ఇదే పాటను లలితగీతం బాణీలో రాశాడు. ఆ తర్వాత ఈ పాటను మరింత ప్రజాదరణ పొందే విధంగా మార్చాలని ఆలోచన చేశాడు. 1979 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున జానపద బాణీలోకి మార్చి పాడాడు మాష్టార్జీ. సరళమైన పదాలతో, సూటైన భావాలతో, సంక్షిప్తతతో అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని, దృక్పథాన్ని, లక్ష్యాలను గానం చేసిన పాట ప్రజలకు చేరువయింది. ఈ పాట 2001లో దక్షిణాఫ్రికా డర్బన్ దళిత మహాసభలలోనూ, ఆస్ట్రేలియా సిడ్నీలోనూ దళిత ఉద్యమాల్లో సిగ్నేచర్ ట్యూన్ గా మార్మోగింది. ఈ నాలుగు దశాబ్దాల తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో వేయిమంది విద్యార్థులతో పదహారు గంటలపాటు ఈ పాటను జడ కోలాటం రూపంలో ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ లో చేరి రికార్డ్ సృష్టించింది.

మాష్టార్జీ తన సృజన పౌరుషానికి ‘నా కులమే, నా అంటరానితనమే నాకు ప్రేరణ’ అంటాడు. ఎలెక్స్ హేలీ ‘ఏడుతరాలు’, వేమన, జాషువాల ప్రభావంతో దళిత తాత్వికతను పాటగా అనువదించి ప్రజాపరం చేశాడు. “అందుకో దండాలు బాబా అంబేద్కరా” అనే పల్లవిని తన చిరునామాగా మార్చుకున్నాడు. రాజ్యాంగం మీద ఎంత గౌరవముందో ఈ పాట మీద ప్రజాస్వామ్యవాదులచేత అంత గౌరవాన్ని పొందింది. అంబేద్కర్ ఒక్క దళిత వర్గానికి చెందిన వ్యక్తి కానట్టే మాష్టార్జీ దళిత ఉద్యమానికి, మూలవాసీ సిద్ధాంతానికి పరిమితం కాడు. పాటల చరిత్రలో తల్లివేరులాంటి ప్రజాకవి మాష్టార్జీ!

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply