జాకెట్… సోకా?

మహిళలందరూ కాలువ ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు వచ్చి ‘లాల్ స‌లామ్‌’ అని చెయ్యి కలిపి చక్కాపోయాడు.

దళంలోకి కొత్తగా వచ్చిన జ్యోతి కోపంతో రగిలిపోయింది. ఇదేంటి కామ‌న్‌సెన్స్‌ లేకుండా ఇట్లా వచ్చాడు. స్నానం చేస్తుంటే రాకూడదని తెలియదా?

జ్యోతిని గమనించిన సీనియర్ కామ్రేడ్ నిర్మల ”ఏం జ్యోతీ” అని న‌వ్వింది.

జ్యోతి ఇంకా ఆ కోపంలోంచి బయటకు రాలేదు. ముభావంగా వుండి పోయింది. దళం కామ్రేడ్స్ అయినా వారికి నేర్పించాలి కదా అనుకుంది.

”మొదట్లో నేను కూడా నీలాగే అనుకున్నా” జ్యోతి మనసులోని మాటను గ్రహించిన నిర్మల డ్రెస్సు వేసుకుంటూ అన్నది.

”అవునా?” అని మళ్లీ తనే ”దళం వాళ్లు చెప్పొచ్చు కదా అట్లా రావద్దని” అన్నది.

”చెప్పొచ్చు. కాకపోతే బయటివాళ్లలాగా మహిళలను వంకర దృష్టితో చూడటం వీళ్లకు తెలియదు. నువ్వు చూస్తూనే వున్నావు కదా, ఇక్కడి మహిళలు జాకెట్ లేకుండా ఉండటాన్ని.”

”అవును”

”వాళ్లకది సహజం. కాబట్టి మరోలా అనుకోరు. దళం కనిపిస్తే చెయ్యి కలిపి లాల్ స‌లామ్‌ చెప్పి పలకరించడం ఇక్కడి వారికి అలవాటైంది. అందుకే అట్లా వచ్చాడు. అంతే.” చెప్పింది నిర్మల.

ఆదివాసీ సమాజంలో ఒకరి కొకరు ‘రామ్ రామ్’ అని పలకరించుకుంటారు. దళం కామ్రేడ్స్ ఏ ఊర్లోకి వెళ్లినా చెయ్యి కలిపి ‘లాల్ స‌లామ్‌’ అని పలకరించేవారు. దాంతో వాళ్లూ దళం కనిపిస్తే చెయ్యి కలిపి ‘లాల్ స‌లామ్‌’ అనడం అలవాటై పోయింది.

అవును కదా. తానూ చిన్నప్పుడు గ్రామాల్లో చంటిపిల్లలకు జాకెట్ తొలగించి పాలివ్వడం చూసింది. అది చాలా సహజంగా అనిపించేది. అట్లాంటిది చదువుకోవడానికి నగరానికి వచ్చాక, ఇక్కడి మగవాళ్ల చూపులు అర్థమయ్యాక ఊరెళ్లితే మహిళలు పాలివ్వడాన్ని చూస్తే తనకు ఇబ్బందనిపించేది. ఉండే వాతావరణాన్ని బట్టి ‘చూపు’ మారుతుంది కదా.

అట్లా నగరం నుండి దళంలోకి, అందునా లోతట్టు అటవీ ప్రాంతంలో వచ్చిన జ్యోతికి మహిళలు జాకెట్లు వేసుకోకుండా తిరుగుతుంటే మొదట్లో చాలా సిగ్గుగానూ, ఆశ్చర్యంగానూ ఉండేది.

ఒక శతాబ్ద కాలం… అంత‌కంటె తక్కువో, ఎక్కువో… వెనక్కి వెళ్లి ఆదివాసీ సమాజాన్ని ప్రత్యక్షంగా చూస్తోంది తను. సమాజ పరిణామ క్రమాన్ని చూడటం ఎంత ‘అదృష్టం’ కదా! ఇట్లాంటి ఆదివాసీ సమాజం నుంచే కదా తను పెరిగిన ఈనాటి సమాజం ఏర్పడింది! ఆ అనుభవం చాలా వింతగానూ, అబ్బురంగానూ వుండేది. దళంలోకి రాకపోయి ఉంటే ఇట్లాంటి సమాజాన్ని తాను ఎన్నటికీ చూసి వుండకపోవును అనుకుంది జ్యోతి.

బస్తర్ గోండుల్లో పెండ్లికాని యువతులు జాకెట్లు వేసుకుంటారు. తప్పనిసరిగా వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదు కానీ జ‌న‌ర‌ల్‌గా అంద‌రూ వేసుకుంటారు. రకరకాల పూసల దండలు ధరిస్తారు.

నిజానికి యువతుల కంటే యువకులే ఎక్కువగా అలంకరించుకుంటారు. కాలివేళ్లు రెండు మూడింటికి ‘మెట్టెలు’ పెట్టుకుంటారు. చేతి వేళ్లకు కూడా అలాంటివే ఉంగరాలు, చెవులకు రింగులు, మెడలో పూసల దండలు ధరిస్తారు. జుట్టు పెద్దగా పెంచుకుంటారు. తలకు హెయిర్ బాండ్లాగా రిబ్బన్ లాంటిది కట్టుకుంటారు. అడవి కోడిపుంజు తోక ఈకలను తలకు ముందుభాగంలో రిబ్బన్లో దూర్చుతారు. అడవిలో నెమళ్లు చాలా ఉంటాయి. కావాలంటే నెమలి పింఛాలనే పెట్టుకోవచ్చు కానీ వీళ్లు కోడి ఈకలనే పెట్టుకుంటారు. నిజానికి ఈ ఈకలు రకరకాల రంగుల్లో నెమలి పింఛం కంటే కూడా అందంగా ఉంటాయి. పొడవుగా, బలిష్టంగా ఉంటారు. అంగీలాంటిది దాదాపుగా వేసుకోరు. వీరిని చూస్తే మహాభారతంలో శ్రీకృష్ణుడు గుర్తుకు వచ్చాడు. కృష్ణుడి బొమ్మ గీసిన చిత్రకారుని ఊహ అబ్బురమనిపించింది జ్యోతికి. తనున్న కాలానికి వెనక్కి వెళ్లి గీసాడా? లేక తానున్న సమాజంలోని మనుషులు అదే అలంకరణతో ఉండేవారా?

మగవాళ్లలో పెద్దవాళ్లు మాత్రం సంతలకు, ఏవైనా కార్యాలకు వెళ్లినప్పుడు కోట్ వేసుకుంటారు. బ్రాండ్ ది కాకపోవచ్చు కానీ బయటి సమాజంలో ఆఫీసర్స్ వేసుకునే లాంటిదే ఈ కోట్. కింద మాత్రం గోచి కట్టుకుంటారు. ఒకవైపు పూర్తిగా వెనకబాటు అలంకరణ, మరోవైపు ఆధునికమైన కోటు. ఆశ్చర్యంగా ఉండేది.

పెళ్లి అయ్యాక యువతులు జాకెట్ను తీసివేయాల్సిందే. అది ఆదివాసీల రివాజు. వారు పెరుగుతున్న వాతావరణమే అది కాబట్టి సాధారణంగా అంద‌రూ తీసేస్తారు. కానీ, కొందరు యువతులు తీసేయడానికి ఇష్టపడేవారు కాదు. ఇంత కాలం జాకెట్ వేసుకుని, అది లేకుండా ఉండటం సిగ్గుగా, అవమానంగా భావించేవారు.

దయగల అత్తింటివారు దొరికితే మొదటి కాన్పు వరకు ఊరుకున్నా ఆ తర్వాత తప్పక తొలగింప చేసేవారు. తొలగించకపోతే నానా హింస. తిడతారు, అవమానిస్తారు, కొడతారు, ఇంట్లో వేసి ఎండు మిరపకాయల పొగ పెడతారు. జాకెట్ తీసేసే వరకూ హింస తప్పదు. ఆ హింసను భరించలేక చివరకు తీసేస్తారు.

ఎద మీద ఏ ఆచ్చాద‌న‌ ఉండదు. కొందరు టవల్ లాంటి గుడ్డను పైట లాగా వేసుకుంటారు. తర్వాత్తర్వాత పిల్లలను కంటూ పోవడం, వయసు పెరుగుతూ ఉండటం, అలవాటూ అవడం వల్ల పైట ఉన్నా, లేకున్నా పెద్దగా పట్టించుకోరు. బయటి నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఆ కొంగును నిండుగా క‌ప్పుకుంటారు.

సమాజం మారాలి. మారుతుంది – కొంత వెనుకా ముందైనా. సమాజ మార్పు ఎప్పుడైనా అభివృద్ధికరమైనదే కదా. ఈ జాకెట్ వేసుకోక పోవడంవల్ల మహిళల్లో వెనుకా ముందాడేత‌నం ఉండేది. సంతకు వెళ్లి బేరం చేయాలంటే బెరుకు. అంగ‌ట్లో మగవాడి కళ్లు ఆబగా ఎదనే వెతుకుతాయి కదా.

ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యాన్ని తొలగించాలని, ఆదివాసీ సమాజంలోని ఈ రివాజును మార్చాలని దళంలో చర్చ జరుగుతూ ఉండేది. మనం దీనిని మార్చలేమా? రీతి రివాజుల పేరుతో స్త్రీలపై జరుగుతున్న అణచివేతను పార్టీ అర్థం చేయిస్తూ మార్పుకు కృషి చేస్తోంది కదా.

ఆదివాసీలంటే అశుభ్రంగా ఉంటారనే అభిప్రాయం సినిమాల వల్లనే ప్రధానంగా బయటి వారిలో ఏర్పడింది కావచ్చు. సబ్బుల వాడకం లేకపోవచ్చు కానీ వాళ్లు ప్రతీ రోజు స్నానం చెయ్య‌కుండా అన్నం తిన‌రు. అయితే స్త్రీలు స్నానం చేసేటప్పుడు నడముకు కట్టుకున్న ఆ కండువాను ఎట్టి పరిస్థితుల్లో విప్పేవారు కాదు. ఎండాకాలంలో వాగులు ఎండిపోతాయి. కుంట‌ల్లో స్నానం చేస్తారు. ఊర్లో చాలా మంది స్నానం చేస్తారు కాబట్టి మహిళలకు నడుము చుట్టూ గజ్జి ఉండేది. కొందరికి తీవ్రంగా కూడా ఉండేది.

దీని నివారణకు మందులు మాత్రమే ఇస్తే సరిపోదని దుస్తులన్నీ విప్పేసి శుభ్రంగా స్నానం చెయ్యాలని కూడా దళంలోని మహిళా కామ్రేడ్స్ ఏ ఊరికి వెళ్లినా మహిళలకు వివరించారు. అట్లా విప్పి స్నానం చెయ్యలేమని మహిళలు అన్నారు. బహిరంగంగా చేసే స్నానం కాబట్టి ఎవరైనా మగవారు అటుగా వెళ్తే తమ మర్యాద పోతదని చెప్పారు.

బహిష్టులో ఉన్నప్పుడు పూజారి కంట పడకూడదు. అందువ‌ల్ల‌ బహిష్టు అయిన మహిళలందరూ ఊరికి దూరంగా ఉండే గుడిసెలోనే ఉండేవారు. అడవిలో ఆకు తెంపడానికి వెళ్లినా వచ్చి ఆ గుడిసెలోనే ఉండేవారు. పూజారి కంట పడితే దండగ కట్టించేవారు. బహుశా ఇది కూడా అట్లాంటి సమస్యే కావచ్చు అనుకుంది జ్యోతి.

సరే, అయితే బాత్‌రూమ్‌లు క‌ట్టుకొని స్నానం చెయ్యాలని వివరించారు. మహిళలు అందుకు ఒప్పుకున్నారు. మహిళా సంఘానికి ఈ విషయంపై క్యాంపెయిన్ చేయాలని దళాల్లోని మహిళా కామ్రేడ్స్ చెప్పారు. సమస్య తీవ్రంగా ఉండటం వల్ల కావచ్చు… చాలా మంది తమ ఇళ్లలో వెంటనే బాత్‌రూమ్‌లు కట్టుకున్నారు. చెట్ల కొమ్మలతో కట్టుకోవడం వల్ల ఆవులు వాటికి రాసుకోవడంతో ఊరికెనే కూలిపోయాయి.

ప్రతీ రెండు నెలలకోసారి దళం సమావేశం అవుతుంది. మొదట స్క్వాడ్ ఏరియా కమిటీ సభ్యులు ప్రధానంగా ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాలను, మొత్తం తాము తిరిగే ప్రాంతాన్ని లీడ్ చేసేది వీరే. ఈ రెండు నెలల కాలంలో తాము తిరిగే ఏరియాలో చేసిన పనులు, వాటి మీద సమీక్ష, యువజన సంఘాలు, మహిళా సంఘం వారికి అప్పగించిన పనులు ఏ మేరకు చేయగలిగారు, శ‌త్రు నిర్బంధం, ఈ రెండు నెలల కాలంలో చేయాల్సిన పనులు, విమర్శ-ఆత్మవిమర్శ… ఆ తర్వాత దళం మొత్తంతో సమావేశం… సభ్యులు తమ పరిశీలనకు వచ్చిన విషయాలను, తమ అభిప్రాయాలను చెప్పడం, విమర్శ-ఆత్మవిమర్శ…. ఇట్లా పలు కార్యక్రమాలపై రెండు, మూడు రోజులు సమావేశమయ్యేవారు.

ఆదివాసీ మహిళలకు జాకెట్లు పంచాలనే విషయాన్ని నిర్మల చర్చకు పెట్టింది. ఈ విషయమై కొద్ది రోజులుగా జ్యోతి, నిర్మల మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచి ఆలోచన అని జిల్లా కమిటీ సభ్యుడు సుఖ్దేవ్ వెంటనే ఆమోదించారు. అభినందించారు.

మొదటిసారి వంద జాకెట్లను తెప్పించారు. ముందుగా మహిళా సంఘం నాయకురాళ్లకు మీటింగ్ వేసి జాకెట్లను ఎందుకు పంచాలని అనుకుంటున్నారో వివరించారు. మహిళా సంఘం నాయకులు పరిసర గ్రామాలు తిరిగి మీటింగ్ ఉందని ఫలానా ఊర్లో, ఫలానా రోజున జమ కావాలని ప్రచారం చేశారు.

ఆ రోజు మీటింగ్ కు మహిళలు బాగానే వచ్చారు. వారికి జాకెట్లు ఎందుకు ధరించాలో చెప్పారు. డిప్యూటీ కమాండర్ నిర్మల చెప్పే విషయాన్ని నిశ్శ‌బ్దంగా విన్నారు ఆ ఆదివాసీ మహిళలంతా. జాకెట్లు వేసుకుంటారు కదా అని అడిగితే ”ఇంగో” (అవును) అన్నారు. అంద‌రికీ జాకెట్లు పంచారు. చాలా మందికి సరిపోలేదు. జాకెట్ దొరకని వారు ఏమాత్రం బాధ పడనూ లేదు కూడా.

ఇచ్చిన వాటిని తీసుకుని వెళ్లి ఇంట్లో భద్రంగా పెట్టారు. ఎవరూ వేసుకోవడం లేదు. ఎందుకు వేసుకోవడం లేదనే చర్చ చేశారు దళంలో.

సాధారణంగా దళం గ్రామంలోకి వెళ్లినప్పుడు మహిళలతో, యువజనులతో, బాలల సంఘాలతో మీటింగ్లను వేర్వేరుగా నిర్వహిస్తారు. వీరితో మీటింగ్‌లు జరుగుతుండగానే మరోపక్క గ్రామం నుంచి వచ్చిన జనంతో ఇంకో సమావేశం జరుగుతూ ఉంటది.

జాకెట్లు పంచిన గ్రామానికి ఆ రోజు దళం వెళ్లింది. అక్కడి మహిళా సంఘం దీదీలతో దళం మహిళా కామ్రేడ్స్ నెమ్మదిగా విషయం కదిపారు.

”దీదీ, బాతమైదే జాకెట్ కెర్రోర్” (దీదీ, జాకెట్ ఎందుకు వేసుకోరు) అడిగింది నిర్మల.

”దాదాలోర్ రాంగ్తోర్ దీదీ (దాదాలు తిడుతున్నారు దీదీ)”

”బాతమైదే (ఎందుకు?)” జ్యోతి.

”నిమ్మె లైయ్య ఆత్తిన్ బాహె ఇంతోర్ (నువ్వు వయసు పోరివైనవా అంటున్నరు)”

”అదరమ్ ఇత్తేకే వెన్నే మావ నాటే ఇచ్చోన్ దీదీలోర్ కెర్తోర్. మతి దాదాలోర్ కొట్టోమన్నోర్ బో. రాంగ్తోర్ (అట్లా అంటే కూడా మా ఊర్లో కొంత మంది దీదీలు తొడుక్కున్నారు. కానీ దాదలు ఊకోరు కదా. తిట్టారు)” అని చెప్పారు.

”దీదీ… దాదాలోర్ రాంగ్తోర్ ఇంజి మిమ్మటు కొట్టో మత్తేకే ఆయో. జాకెట్ కెర్నా ఆయో ఇంజి మీకిన్ బెచ్చోన్ ముష్కిల్ కీయయైతోర్? రీతి రివాజ్ ఇంజోరే దీదీలోర పొర్రు కీసోరే మత్త దబావ్కిన్ బద్లా కీయానా. మిమ్మట్టు మున్నే వాత్తేకేనే, లడాయి కీత్తేకేనే ఇదు బద్లేమారత. హిల్వకే ఆయో. రీతి రివాజు ఇదరమే మంత. బెచ్చోన్ దిన్ ఇదరంతా దబావ్? మీవ సంగె పార్టీ మంత. (దీదీ… మగవాళ్లు తిడుతున్నారని మీరు ఊకుంటే కాదు. జాకెట్ వేసుకోవద్దని మిమ్మల్ని ఎంత హింసిస్తారు? రీతి రివాజ్ పేరుతో మహిళల మీద చేస్తున్న పెత్తనాన్ని మార్చాలి. మీరు ముందుకు వచ్చి పోరాడితే ఇది సాధ్యమైతది. లేకపోతే కాదు. ఈ రీతి రివాజు ఇట్లాగే కొనసాగుతది. ఇంకా ఎంత కాలం ఈ అణచివేతను భరిస్తారు. మీకు అండ మేముంటాం).”

”ఇంగో దీదీ, జాకెట్ కెర్కన్ హిత్తేకే నాకిన్ బెచ్చోనో తిప్పల్ కీత్తోర్ (అవును అక్కా. జాకెట్ వేసుకుంటానంటే నన్ను ఎంతో హింసించారు).” తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ బుద్రి అన్నది.

”అదీన్మైదే మీటు లడాయి కీయనా. కీత్తేకేనే రీతి రివాజుకిన్ బద్లా కీయ పరింతోమ్ (అందుకోస‌మే మీరు పోరాడాలి. లడాయి చేస్తేనే రీతి రివాజులను మార్చగల్గుతాము).”

”ఇంగో” మీటింగ్ వచ్చిన మహిళలంతా ఒక్కసారిగా అన్నారు. వారిలో కొత్త ఉత్సాహం. తేజస్సు.

మిగతా దళం మహిళా కామ్రేడ్స్‌కు ఇదే అనుభవం.

జాకెట్లు పంచినా ఎందుకు వేసుకోవడం లేదనే విషయం అర్థమైంది. కేవలం మహిళలకు మాత్రమే వివరించడం కాదు. పురుషుల్లోనూ మార్పు తీసుకు రావాలని. అప్పుడే రీతి రివాజులకు సవరణలు చెయ్యొచ్చు అనుకున్నారు దళం మహిళా కామ్రేడ్స్.

అందుకే ఈసారి మహిళలతో పాటు పురుషులనూ మీటింగ్కు పిలిచారు.

పురుషులు, స్త్రీలు కలిపి మూడు నాలుగు వందల మంది వచ్చారు. ఎంత పెద్ద మీటింగ్ అయినా ఆదివాసీలతో నిర్వహించడం సులువు. అడవిలో మమేకమైన వారు ఆ అడవిలోని జంతువులు నడిచినట్టుగా ఒకరి వెనకాల ఒకరు చాలా క్రమశిక్షణతో నడుస్తారు. వరుసగా వచ్చి ఒక లైన్ వెనకాల ఒకలైన్లో పద్ధతిగా కూర్చుంటారు. గుంపులుగా రావడం, కూర్చోవడం గురించిన గందరగోళం ఉండదు. పెద్దగా లొల్లీ ఉండదూ. అలాగే అచ్చంగా నేల మీద అస్సలు కూర్చోరు. చిన్న రాయినైనా తీసుకుని, దానిమీద చెట్టు ఆకును తెంపి వేసుకుని కూర్చుంటారు. అంత‌ చిన్న రాయి మీద కూర్చోవడం బయటివారికి అస్సలు సాధ్యం కాదు.

ఈసారి లలిత మాట్లాడింది. ”పెరడుల్ ఆత్తేకే జాకెట్ కెర్నా ఆయో ఇంజి జహ్త్తోర్్. దీదీలోర పొర్రు దబావ్ కీయయైతోర్. దీదీలోరు జాకెట్ కెర్తేకే లైయ్య ఆత్తిన్ బాహే ఇంజి రాంగ్తోర్. ఇదు బాతల్ న్యాయం? దీదీలోరు జాకెట్ కెర్వలేవ హాటుమ్ హత్తేకే అగ్గ పాయికాలోర్ బెదరం హూడింతోర్? జాకెట్ కెర్నా ఆయో ఇంజి రీతి రివాజు బనాకీత్తోర్ మతి దీదీలోరికిన్ బెచ్చోనో ముష్కిల్ ఆసోరే మంత. దాదాలోర్ మతి కోటు కెరిసి హాటుమ్ దాంతోర్. దాదలోరు కెర్తేకే బేసే మతి, దీదీలోర్ కెర్నా ఆయో? (పెండ్లి అయితే జాకెట్ వేసుకోవద్దని కొడతారు. దీదీల మీద పెత్తనం చేస్తారు. దీదీలు జాకెట్ వేసుకుంటే వయస్సు పోరివైనవు కావచ్చు అని తిడతారు. ఇదేమి న్యాయం? దీదీలు జాకెట్ వేసుకోకుండా సంతకు వెళ్తే అక్కడ బయటివారు ఎట్లా చూస్తారు? జాకెట్ వేసుకోవద్దని రీతి రివాజు తయారు చేశారు. కాని దీదీలకు ఎంతో కష్టంగా ఉంటోంది. దాదలు మాత్రం కోటు వేసుకుని సంతలకు వెళ్తారు. దాదలు వేసుకుంటే మంచిదే. కానీ దీదీలు మాత్రం వేసుకోవద్దు కదా.)” దాదాపు అరగంట సేపు వివరించింది లలిత.

చాలా శ్రద్ధగా విన్నారు దాదలు. ”అదరం వెహాటు (అట్లా చెప్పండి)” అన్నారు దీదీలు.

”దీదీలోరు జాకెట్ కెర్తేకే బేస్కీ ఆయో (దీదీలు జాకెట్ తొడుక్కోవడం మంచిదా, కాదా)” అడిగింది లలిత.

అంద‌రూ నిశ్శబ్దంగా కూచున్నారు.

”బాత ఆల్సయితిర్? మాటు వెహనాదు బేస్ కీ ఆయో? (ఏం ఆలోచిస్తున్నారు? మేం చెప్పేది మంచి విషయమా, కాదా?)”

ఎవరూ ఉలకలేదు, పలకలేదు.

”దీదీలోరికిన్ బాటా కీయలై ఇచ్చోన్ జాకెటింగ్ తత్తోం. హీముటు ఇంజి మిమ్మటు వెహెత్తేకేనే హీయకోం (మహిళలకు పంపిణీ చేయడానికి కొన్ని జాకెట్లు తెచ్చాం. ఇవ్వమని మీరు చెప్పితేనే ఇస్తాం).”

కొంచెం అటిటు నుసిలారు కానీ, చప్పుడు చేయలేదు.

”మిమ్మటు ఇదరం కొట్టో మన్తేకే ఆయో. (మీరు ఇట్లా చప్పుడు చేయ‌కుండా ఉంటే కుదరదు)” లలిత కూడా పట్టు వదలలేదు.

”హీముటు. మమ్మాటు బాత ఇంతోమ్ (ఇవ్వండి. మేమేమీ అంటాం).”

”ఆయే హీముటు హిత్తేకే ఆయో. దీదీలోర్ జాకెట్ కెర్నా ఎవనాల్ మీవదే జిమ్మేదారి” (ఊర్కనే ఇవ్వండి అంటే కాదు. అక్కలు జాకెట్లు వేసుకునే వరకు మీదే బాధ్యత)

మళ్లీ నిశ్శబ్దం

”బాతల్ ఇంతిరి (ఏమంటారు)?”

”దాదలు ఇగ్గ ఇదరమే వెహింతోర్. ఆన కెర్తేకే రాంగ్తోర్, పోస్క్తోర్ (ఈ మగవాళ్లు ఇక్కడ ఇట్లనే అంట‌రు. కానీ జాకెట్ వేసుకుంటే తిడతారు, బనాయిస్తారు)” సమావేశంలోంచి ఒక దీదీ.

”బాత దాదా? బాతల్ ఇంతిర్ (ఏం దాదా? ఏమంటారు)?”

”మమ్మాటు బాత ఇంతోం. బాత ఇన్నోం. ఓర విచార్” (మేమేం అంటం? ఏమీ అనం. వాళ్ల ఇష్టం)

మీటింగ్ అయిపోగానే జనం తమ ఊళ్ల దారిపట్టారు.

మీటింగ్ ప్రాంతానికి కిలో మీటర్ దూరంలో పెట్టిన తమ కిట్ల దగ్గరికి వెళ్లారు.

తన కిట్టు సర్దుకుంటూ ”మీటింగ్ సక్సెస్ కదా దీదీ” దళంలో అందరికన్నా చిన్నవాడైన సుక్కు అన్నాడు. అంత‌సేపు చెట్టు మీద సెంట్రీలో చేస్తూనే వీళ్లు మాట్లాడేది విన్నాడు.

”ఒక్క మీటింగ్‌తోనేనా?” జ్యోతి అన్నది.

”ఈసారి అయితే సక్సెస్ అయింది కదా” తను సరిగానే అన్నాడు కదా అనుకుంటూ సుక్కు మళ్లీ అన్నాడు.

”ఆ… కాకపోతే ఎంత మంది వేసుకుంటారో చూడాలి. ఈ రెండువందల మందిలో ఇరవై మంది జాకెట్లు వేసుకున్నా సక్సెస్ అని భరోసాగా అనుకోవచ్చు.” జ్యోతి.

”ఏం అంత‌ తక్కువ మందా వేసుకునేది” లలిత.

”లలితక్క నువ్వు ఇక్కడిదానివే కదా. నీకు తెలియందా? పని చేసేటప్పుడు జాకెట్ ఉంటే ఉక్కపోతని, పట్టేసినట్టు ఉంటదని దీదీలే అంట‌రు కదా.”

”నిజమే జ్యోతి. దీదీలు కూడా జాకెట్ వేసుకోవడానికి ముందుకు రావాలి.” నిర్మల.

”ముందు మగవారి పెత్తనం తగ్గితే మిగతాది సులువే అయితది కదా” లలిత.

”అవును. ఇద్దరిలోనూ మార్పు రావాల్సి ఉన్నది” జ్యోతి.

”సరే, సరే పదండి. దళం దగ్గరికి పొయ్యేసరికి చీకటి అయితది.” తొందర చేసింది డిప్యూటీ కమాండర్ నిర్మల.

మీటింగ్ కోసం విడిగా వచ్చిన ఈ నలుగురి టీమ్ దళాన్ని కలవడానికి వడివడిగా నడక సాగించింది.

ఇట్లా జాకెట్ల పంచడం సరైనదేనా? ఆదివాసీ సమాజాన్ని బలవంతంగా మార్చుతున్నామా? సహజంగా మారాలి కదా. ఏ సమాజమైనా ఎప్పుడైనా సహజంగా మారిందా? ప్రజలను హింస పెట్టి, ఊచకోత కోసి కదా మార్చారు అధికార వర్గం. ప్రజలకు అర్థం చేయించి వారిలో మార్పు… అభివృద్ధికరమైనది అయినప్పుడు తీసుకు రావడంలో తప్పు లేదు కదా. ఆలోచిస్తూ నడుస్తోంది జ్యోతి.

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

3 thoughts on “జాకెట్… సోకా?

  1. సమస్య వున్నప్పుడు మార్పు కోసం ప్రయత్నం చేయాలి.ఆ ప్రయత్నంలో లోపం వుండవచ్చు.కిందినుంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది.

  2. సమస్య వున్నప్పుడు మార్పు కోసం ప్రయత్నం చేయాలి.ఆ ప్రయత్నంలో లోపం వుండవచ్చు.కిందినుంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది.

  3. ఆదివాసీ మహిళల జీవన సంస్కృతిలో మార్పు కోసం జరుగుతున్న కృషితో పాటు అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కనిపిస్తున్నది. అదే విధంగా విప్లవ ఉద్యమబాట పట్టిన వాళ్ల జెండర్ చైతన్యం తెలుస్తున్నది . కొత్త విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు

Leave a Reply