చైనా ఆధునిక కవిత్వానికి ఆద్యుడు – షుఝిమొ

1897 లో చైనా లోని ఝజియాంగ్ లో పుట్టిన షుఝిమొ, కేవలం 34 ఏళ్ళు మాత్రం బతికి 1931 లో మరణించాడు. పోర్చుగీసు కవి ఫెర్నాండో పెసోవ మాదిరే తన జీవిత కాలంలో అనేక పేర్లతో కవిత్వం రాసినవాడు ఈ చీనా కవి. మరణించేనాటికి నాలుగు కవితా సంపుటులు, వేలాది కవితల అనువాదాలు మిగిల్చి వెళ్ళాడు.

ఉన్నత చదువుల కోసం అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్లడం వలన అతడి కవిత్వం ఒక భిన్నమైన రూపాన్నితీసుకుని, ఆధునిక చైనా కవిత్వానికి దారిని వేసింది. చైనా సంప్రదాయ కవిత్వ మార్గాన్ని సారంలో కొనసాగిస్తూనే, రూపంలో ఇంగ్లిష్ కవిత్వ మార్గాన్ని స్వీకరించడం వలన షుఝిమొ కవిత్వం నవ్య రూపాన్ని సంతరించుకుని, ఆధునికచైనా కవిత్వానికి దారి దీపంగా వెలిగింది అని విమర్శకులు అంటారు.

రాజకీయ, సామాజిక శాస్త్రాలలో డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లిన షుఝిమొ అక్కడ ఇమడలేక ఇంగ్లాండ్ కు వొచ్చి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని కింగ్స్ కాలేజీలో చేరిపోయాడు. అక్కడే కీట్స్, షెల్లీ ల భావకవిత్వంతో ప్రేమలోపడిపోయాడు. తనకు ఇష్టమైన ఎంతో కవిత్వాన్ని చైనా భాషలోకి అనువాదం చేసాడు. 1922 లో చైనాకు తిరిగి వచ్చాక, ఆధునికకవిత్వ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు.

1923 లో ‘క్రిసెంట్ మూన్ సొసైటీ’ అన్న సాహిత్య సంస్థను స్థాపించి ‘కళ కళ కోసమే’ అన్న వాదాన్ని ప్రచారం చేసాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రోత్సహించిన ‘రాజకీయాల కోసమే కళ’ అన్న నినాదంతో పనిచేసే సంస్థలతో అనేకవాదోపవాదాలు నిర్వహించేవాడు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ చైనాలో పర్యటించినపుడు, రవీంద్రుని కవిత్వాన్నివ్యాఖ్యానించే సహాయకునిగా వ్యవహరించాడు.

చదువు ముగించుకుని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విడిచి వెళ్లే సమయంలో షుఝిమొ రాసిన ‘కేంబ్రిడ్జ్ కు వీడ్కోలు’ కవితఅటు ఇంగ్లిష్ లోనూ, ఇటు చైనా లోనూ అతనికి అనేక మంది అభిమానులను సంపాదించి పెట్టింది. కేంబ్రిడ్జ్ నుచూడడానికి వొచ్చే చైనా యాత్రికులు అక్కడ రాతిపై చెక్కి వున్న షుఝిమొ రాసిన ఈ కవితను చూడకుండా వెళ్లరట!

షుఝిమొ వైవాహిక జీవితం కూడా వివాదాలమయం. సంప్రదాయ పద్ధతిలో చేసుకున్న తొలి వివాహం సంతోషాన్నిఇవ్వకపోవడంతో ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత మొదటి భార్యకు విడాకులిచ్చాడు. ఇంగ్లాండ్ లో వున్నపుడు, అప్పటికే వేరొకరితో వివాహం నిశ్చయమైన మరొక చైనా యువతితో కొన్నాళ్ళు ప్రేమలో పడ్డాడు. చివరిగా సహజీవనం చేసినస్త్రీ దుబారా ఖర్చులు చేసే మనిషి కావడంతో, ఆమె కోసం చివరి రోజులలో చిల్లరమల్లర ఉద్యోగాలు అనేకం చేసాడు.

చివరికి, 1931 లో విమాన ప్రమాదంలో మరణించాడు.
కానీ, అది ప్రమాదం కాదనీ, పథకం ప్రకారం చేసిన హత్య అనీ అంటారు.
ఏమయినా, కేవలం 34 ఏళ్ళు మాత్రం బతికి ఆధునిక చైనా కవిత్వానికి దారులు వేసిన కవిగా షుఝిమొ చరిత్రలోనిలిచిపోయాడు

కేంబ్రిడ్జ్ కి వీడ్కోలు

మృదువుగా వీడ్కోలు తీసుకుంటున్నాను
ఎంత మృదువుగా వొచ్చానో అంతే మృదువుగా
పశ్చిమాకాశంలోని మేఘాలకు
నా సుతిమెత్తని వీడ్కోలు

నది ఒడ్డున బంగారు వర్ణంలో మెరిసే
గుబురు చెట్ల పొదలు
సూర్యాస్తమయ వేళల్లో
కాంతులీనే నవ వధువులు
తళతళలాడే నది మీద
మెరిసిపోయే వాటి ప్రతిబింబాలు
నా హృదిలో ఎగిసిపడే అలలు

మెత్తని బురదలో పాతుకుపోయిన
పచ్చటి గడ్డి తాలూకు నాచు
నీటిలో రికామీగా ఊగుతోంది
సున్నితంగా ప్రవహించే నదిలో
అటువంటి నాచులా బతకాలని వుంది నాకు

ఆ చెట్ల నీడన వున్న సరస్సులో ఉన్నది
వుబికివొచ్చే నీళ్లు మాత్రమే కాదు
పేరుకున్న నాచు నడుమ
నలిగిన ఇంద్రధనస్సు కూడా
అక్కడ ఇంద్రధనస్సు వంటి కలలు
ఆశ్రయం పొందుతాయి

ఒక కలను వెతకాలా ?
పొడవైన కర్ర సాయంతో
నది ప్రవాహానికి అభిముఖంగా
పచ్చగడ్డి మరింత పచ్చగా కనిపించేంత దాకా
బలమైన శక్తితో పైకి ఎగురు
నక్షత్ర కాంతి నిండిన శక్తి వెలుగులో
బిగ్గరగా పాట పాడు

కానీ, ఇప్పుడు నేను బిగ్గరగా పాడలేను
ఇప్పుడు శాంతి నా వీడ్కోలు సంగీతం
కేంబ్రిడ్జ్ నిశ్శబ్దంగా వున్న ఈ సాయంత్రం
క్రికెట్ కూడా నాకోసం మౌనంగానే వుంది

నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాను
ఎంత నిశ్శబ్దంగా వొచ్చానో అంతే నిశ్శబ్దంగా
ఒక్క మేఘాన్ని కూడా
నేను నా వెంట తీసుకు వెళ్లడం లేదు

అదృష్టం

నేను అనంతాకాశంలో ఒక మేఘాన్ని
నీ హృదయ కెరటంపై
నీడగా వాలే అదృష్టం దక్కిన వాడిని
ఆశ్చర్యపోవొద్దు
ఉబ్బి తబ్బిబ్బు కావొద్దు
మరుక్షణంలో ఆనవాలు సైతం
లేకుండా అదృశ్యమయే వాడిని

మనం చీకటి రాత్రి సముద్రం దగ్గర కలిసాము
నీవు నీ దారిలో, నేను నా దారిలో
నీకు మనసైతే జ్ఞాపకంగా దాచిపెట్టుకో
లేక, మరిచిపోతే మరీ మంచిది
మనం కలిసినపుడు
వెలుగులీనే కాంతి
ఇరువైపులా ప్రవహించింది

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply