చేపలు – కప్పలు

లంచవరయ్యింది. పిల్లలు బిలబిలలాడుతూ, నవ్వుతూ క్లాసురూముల్లో నుంచి వరద నీళ్ళల్లాగా బయటకొచ్చేస్తున్నారు…

టీచర్లు చాక్‌పీసు ముక్కలు, డస్టర్లు చేతుల్లోకి తీసుకొని ముఖాలు ముడుచుకొనో, గొణుగుతూనో బయటకొచ్చి స్టాఫ్ రూం కేసి వెళుతున్నారు…

సైన్సు టీచర్ కమల స్టాఫ్ రూంలోకి అడుగు పెట్టేసరికి అక్కడ మిగతా టీచర్లంతా సుఖాసీనులై కప్పల్లా ఒకరి మాట ఒకరు పట్టించుకోకుండా వదురు తున్నారు. “వెధవ సబ్జెక్టు… వెధవ సబ్జెక్టు… సిలబసో సిలబసని హెచ్.ఎమ్. నా దుంప తెంచుతున్నాడు… కప్పలా కళ్ళు తిప్పి లెక్కల టీచర్ బుచ్చిరెడ్డి విసుక్కుంటున్నాడు.

“నా చిన్నతనం నుండి మహాభారతం, భాగవతం, తిన్నడో మరొకడో యమ బోరు…” అన్నాడు తెలుగు ఉపాధ్యాయుడు విశ్వేశ్వరరావు.

“కాకుంటే మరేం కావాలోయ్…” అన్నాడు గూని రామయ్య పంతులు ఆశ్చర్యపడుతూ.

“ఏమి కావాలో మనకన్న పిల్లలకు బాగా తెలుసు…” అంది సైన్సు టీచర్ కమల తను ఒక కుర్చీలో కూర్చుంటూ…

ఎప్పటిలాగే మాటలు… ఆ మాటల్లో ప్రత్యేకతేముండదు… ఆ మాటల పరిధి కూడా ఆ స్కూలు భవనాలు, క్లాసు పుస్తకాలు వొదిలి బయటి ప్రపంచంలోకి పోవు… సంవత్సరం క్రితం అన్ని స్కూల్లు వంతులవారిగా తరమగా తరమగా కమల, గోపాలరావు ఆ స్కూల్లో వచ్చి పడ్డారు… అప్పటి నుండి స్టాపు రూంలోకి కొత్త గాలి వచ్చి చేరింది… మాటలు స్కూలు భవనాలు దాటాయి… గోపాలరావు కేమయ్యిందో ఆర్నెల్ల నుండి బడికి రావడం మానేశాడు… గత ఆరు నెలల నుండి స్టాఫ్ రూమ్ గాలి మళ్ళీ స్కూలు గోడలనంటిపెట్టుకునే తిరుగసాగింది… ఆ మాటల్లో ఎక్కడో గోపాలరావు ప్రసక్తి రాకుండ ఉండదు.

“మనకెందుకు రాజకీయాలు సార్… ప్రజలో ప్రజలంటూ వాళ్ళింట తిరుగుతే అరెస్టులు చివరకు చిప్ప చేతికి…” రాజన్న సార్ విరక్తిగా పెదవి విరిచి భాగం వక్క కోసం జేబులు వెతికాడు…

కమల బయట ఎండలో ఆడుకుంటున్న పిల్లలకేసి చూస్తు కూర్చున్నది…

“అలాంటి వారు పెళ్ళీ పెటాకులు ఎందుకు చేసుకోవాలోంటా?” అన్నాడు బుచ్చిరెడ్డి.

కమల బయటకు చూస్తూనే “ఐ డోంట్ వాంట్ దిస్ టైపాఫ్ కర్టసీ… ఐ హేట్ కర్టసీ…” అన్నది.

“ఎంతైనా మానవులం కదండీ… మీరట్లా పుల్ల విరిచినట్లు మాట్లాడ్తే ఎట్లా?” విశ్వేశ్వరరావు…

“మానవుని బతుకు దినదినం కుంచించుక పోతుంటే – మానవుడు పెనం మీద నుండి పొయ్యిలోకి తోయబడుతుంటే – కాలిపోతూ కూడా కదలకుండా ఉండడమే నాకాశ్చర్యంగా ఉన్నది – ఫ్రాగ్స్ నెవర్ లుక్ ఎట్ ది స్కై” కమల…

ఆ తరువాత చాలా మాట్లాడారు… కమల మాత్రం ఎటో చూస్తూ మరేం మాట్లాడకుండా కూర్చున్నది… ఆమె మనసులో జైల్లో ఉన్న తన సహచరుడు గోపాలరావు చెప్పిన కథ ఒకటి గుర్తుకొస్తోంది…

మళ్ళీ బెల్లయ్యింది. టీచర్లంతా గొనుగుతూ క్లాసు రూంలోకి నడిచారు…

కమల పదవ తరగతి క్లాసు రూంలోకి ప్రవేశించి కప్ప బొమ్మ బ్లాకు బోర్డుకు తగిలించింది.

“మేడమ్ ఇవ్వాల్టికి ఏదన్న కథ చెప్పండి-” చిత్ర అనే అమ్మాయి లేచి అడిగింది…

నిజానికి కమలకు కూడా పాఠం చెప్పాలనే ఆసక్తి లేదు.

“అయితే ఒక షరతు – కథ అయిపోయేదాకా నిశబ్దంగా కూర్చుంటాం అంటేనే!”

“ఓకే మేడం” పిల్లలందరు. కమల కుర్చీలో కూర్చుండి – ఈ విధంగా కథ చెప్పసాగింది.

“అనగనగా ఒక దేశం. ఆ దేశంలో ఒక ఊరు. ఊరి పక్క ఒక నీటి గుంట. అలాంటి నిలువ నీటిగుంటలో ఒక చేపపిల్ల, ఒక కప్ప చిక్కుపడి పోయాయి. ఎండలు తీవ్రం కావడంతోటి గుంటలో నీళ్లు తగ్గి పోసాగినయ్. పాపం చేపపిల్ల దిక్కుతోచక మడుగంతా పిచ్చిపట్టినట్టుగా కలియతిరిగేది. ఎట్లాగైనా ఈ మడుగులో నుండి బయటపడాలని రోజూ తలపో సేది… మధ్య మధ్య నీటి పై భాగానికొచ్చి ఆకాశం కేసి ఆశగా చూసేది.

కప్ప మాత్రం ఏ చీకు చింతా లేనట్లు అస్తమానం నాలుగు కాళ్ళు ముడుచుకొని మడుగులో నిద్రపోయేది – పైగా చేపపిల్ల ఆదుర్దా చూసి దానికి వేళాకోలంగా కూడా ఉండేది.

‘మడుగులో నీళ్ళున్నంత వరకు ఎందుకు హైరానా పడడం, చేపల జాతే అంత తిరుగుబోతు జాతి. ఒక్క దగ్గర నిలకడగా ఉండలేవు గదా! భగవంతుడు మనకు ఏది ఇస్తే దానితో సంతృప్తి పడాలె. మనకు ఎంతరాసుందో అంతే దొరుకుతుంది. ఎక్కడన్నా ఇట్లా గాభరా పడతారా? పడ్డా ఫలితమేమున్నదిగన్క?’ ఇట్లా కప్ప మాగన్నుగా నిద్రపోతూ అప్పుడప్పుడు మనసులో అనుకునేది. చేపపిల్ల అటూ ఇటూ ఆదుర్దాగా పరుగెత్తడం చూసి తనలో తానే ‘భగవంతుని నిర్ణయం ఎవరు మారుస్తరు? పిచ్చిగాని – మనం ఎక్కడుండాలో నిర్ణయించేది మనమా? మన చేతుల్లో ఉంటుందా? ఈ నీటి మడుగే రాసి పెట్టుంటే విధి లిఖితం తప్పుతుందా?’ మనుసులో అనుకుంటూ వేదాంతిలా నవ్వుకునేది.”

ఒకమ్మాయిలేచి “కప్పలు నవ్వుతయా మేడం” అని అడిగింది. “అందుకే నిశబ్దంగా వినమన్నది. ఇదో కథ పద్దతి, ప్రశ్నలు తరువాత” కమల.

“ఇట్లా ఉండగా ఒకనాటి సాయంత్రం చేపపిల్ల యమ సంబరపడుతూ – నిద్ర పోతున్న కప్పను ముక్కుతో పొడిచి లేపింది. కప్ప విసుక్కుంటూ కళ్ళు తెరిచింది.”

“ఏం? ఏం ముంచుకొచ్చిందని ఆ గాభరా? నువ్వెట్లాగు ప్రశాంతంగా ఉండలేవు – మీ జాతే అంత – ఈ మడుగులో వచ్చిన దగ్గరి నుండి చూస్తున్నా నువ్వెప్పుడైనా నిద్రపోయి ఎరుగుదువా?” మళ్ళీ కళ్ళు మూసుకుంటూనే కప్ప గొనిగింది.

“లే… లే… కొంచెం పైకొచ్చి చూడు…. ఆకాశంలో ఎట్లా మబ్బులు పరుగెత్తు తున్నాయో? ఆ ఉరుములు విన్నావా? ఓహ్… నాకెంత సంతోషంగా ఉందని.” చేపపిల్ల మళ్ళీ ఒకసారి పైకి తేలి చూసొచ్చి చెప్పసాగింది.

“ఆఁ… బోడి ఉరుములు… ఎప్పుడు వచ్చేవేగా?”

“నీకు మాత్రం సంతోషంగా ఉండదూ! మరి కాసేపట్లో… ఓయ్ కప్ప… వింటున్నావా? వర్షం! వర్షం పడుంది… నీళ్ళు… నీళ్ళు… ఈ మురుగునీళ్లు ఎంత కాలం భరిస్తాం… కొత్త నీళ్లు-చల్లటి నీళ్ళు – ప్రవాహం -” చేప తన్మయత్వంతో వర్ణించసాగింది.

“ఉండెహెఁ- వెధవ నీళ్ళు – బంగారంలాంటి నిద్ర పాడుచేస్తివి గదా!” కప్పింకా విసుక్కుంటూనే.

“నీకెట్లా అర్థమవుతుంది – ఈ మడుగే దాటితే బయట ఎంత ప్రపంచం? ఎందరిని కలవొచ్చు – ఎంతని తిరగొచ్చు” చేప.

అంతలో ఉరుము ఉరిమింది.

కప్ప కళ్ళు పూర్తిగా తెరిచి “వెధవ ఉరుము… వెధవ ఉరుము- వాననెవడు పుట్టించాడోకదా! భగవంతునికి బుద్ధి లేదా హెఁ వాన పడేది పడక మధ్యలో ఈ గడబిడంతా ఎందుకూ?”

ఇంతలో చేప మళ్ళీ ఒకమారు నీటిమీదికి తేలి యమ సంతోషంగా ఉరుకొచ్చి “కప్ప మావ- వర్షం- వర్షం- వర్షం- నా బంగారు వర్షం- ఎంత తెల్లటి నీటి చుక్కలు- ఎంత మధురంగా కురుస్తోంది- ఓయ్ కప్ప మావాఁ మరింక సిద్ధంకా – నావెంట వస్తే ఎన్ని మడుగులు చూపిస్తానో! నేను పుట్టిన జాగా చూపెడతా! ఏడాదిపాటు తిరిగినా తరగని నీళ్ళు అందులో మాజాతివాళ్ళు ఎంత మందున్నా రనుకున్నావ్- అక్కడ మీవాళ్ళు కూడా చానామంది ఉన్నార్లే- తయారవు. అక్కడికి చేరిన తరువాత నువ్వెన్ని సంవత్సరాలైనా హాయిగా నిద్రపోవచ్చు.” గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది.

“ఆఁ ఏమి హాయిలే… చూడు నువ్వింకా చిన్నపిల్లవు- నీకు లోకం గురించి ఏమి తెలియదు కనుక అట్లా మిడిసిపడుతున్నావ్! నీ మాట నమ్ముకుంటే అయినట్టే… నీటి ధారంటే మాటలుగాదు. ఎదురెల్లాలే- నాకైతే కాళ్ళు నొప్పి పెడతాయబ్బా! ఎందుకంత తిప్పలు – చూడు నీ ఒళ్ళెంత తళతళ వెండిలాగా మెరిసి పోతుందో? అక్కడెక్కడో రాక్షసిలాంటి మనిషి వల బట్టుకొని నీ కోసం సిద్ధంగా ఉంటాడు. వల విసురుతాడు. నువ్వు దొరికి పోతావు. నిన్ను నీ వెండిరంగు పొలుసులను నేలమీదేసి రాసి నిన్ను పులుసు కాసుకుంటాడు. ఎందుకొచ్చిన ఇబ్బందులివన్ని? రెండేళ్ళబట్టి నేనీ గుంటలో ఉంటున్న – నాకేమి ఇబ్బంది రాలె- భగవంతుని మీద భారమేసి కృష్ణారామా అనుకుంటూ ఏదో కాలం వెల్లదీయాలె- నిజమేననుకో ఎండకాలం నీళ్ళు మురుగుతాయి. ఓర్చుకోవాలి – ఆ తర్వాత నీ ఇష్టం…” కప్ప మళ్ళీ నిద్రకుపక్రమిస్తూ హితబోధ చేసింది.

వర్షం పెద్దదయ్యింది. చేపపిల్ల వెర్రి సంతోషంతో మడుగంతా ఉరుకులు పరుగులు పెట్టింది. వరదనీళ్ళు తెల్లగా గలగల శబ్దం చేస్తూ పారసాగినియ్. మడుగంతా కొత్త నీరుతో నిండిపోయింది.

చేపపిల్ల మళ్ళీ కప్ప దగ్గరకు పోయి “చూడు మావాఁ మనం సంవత్సరం పాటు కలిసున్నాం- ఈ మురుగునీళ్ళల్లో మురిగి సంవత్సరాల తరబడి బతికేకంటే ప్రవాహంలో ఒకగంట బతకడం ఎన్నో రెట్లు మిన్న – నీకా మజా తెలియదు. నా వెంట రా నీకు లోకం చూయిస్తా…” చేప ప్రాధేయపూర్వకంగా అడిగింది.

“ఆఁ బోడి లోకం నాకంతా తెలుసులే…” కప్ప నిర్లక్ష్యంగా తీసి పారేసింది.

“నీ ఇష్టం…కాని నువ్వెప్పటికైనా ఈ మురుగునీళ్ళల్లో బందీవైపోయి విచారిస్తావు” అనేసి చేపపిల్ల మడుగులోనుంచి నీళ్ళ ధారవెంట పరుగెత్తసాగింది.

అట్లా బయలుదేరిన చేపపిల్ల ఇసుకతో, మట్టితో, రాళ్ళు, రప్పలతో వేగాతి వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహానికి అడ్డంపడి ఈదసాగింది. దాని వెండిలా తళతళలాడే పొలుసులన్ని ఊడిపోసాగినయ్. రెక్కలు తుక్కుతుక్కు అవుతున్నాయి. పిల్ల కాలవలు, ఎత్తులు, వంపులు, రాళ్ళు రప్పలు, సుడిగుండాలు, కయ్యలు వీరావేశంతో ఈదసాగింది. దానికి శారీరకంగా కలిగే బాధ గురించి లక్ష్యం లేదు. దాని లక్ష్యమల్లా తనవాళ్ళను కలవడం – సుదూర జలాశయాన్ని చేరడం.

ఒక్కొక్కసారి ప్రవాహం దాన్ని ఉండగా చేసి ఎక్కడికో విసిరే సేది…

కమల కంఠం విషాద, వీరోచిత పాటలాగా చిత్రాతి చిత్రంగా ధ్వనిస్తోంది… క్లాసు రూం బయట వరండాలోపల సిమెంటు స్తంభానికానుకొని ఎవరో ఎండలోకి చూస్తూ నిలబడటం కమల చూసింది… మళ్ళీ పిల్లలకేసి చూసింది… పిల్లలు అత్యంత శ్రద్ధతో ఉత్కంఠతో వింటున్నారు.

“చేపపిల్ల ఒక్కొక్కసారి ఎత్తులాళ్లమీదినుండి అగాధంలో పడిపొయ్యేది. చెక్కిళ్ళ నుండి నెత్తురు కారేది. అయినా చేపపిల్ల నెత్తురును, గాయాలను లెక్కచేయకుండా ప్రవాహానికి ఎదురీదుతూనే ఉన్నది…

అట్లా ఆ చిన్నారి చేపపిల్ల ప్రవాహానికి అడ్డంపడి ఈదుతూ అనేక నీటి మడుగులు చూసింది. తనలాగా ఎదురీదే ఎన్నో చేపలను కలుసుకుంది. ముచ్చటించింది. దాని సంతోషానికి కంతులేదు. అప్పుడప్పుడు దాని మనుసులో మురికి నీళ్ళల్లో కాళ్ళుండి కూడా కాళ్ళమీదనే నిద్రపోతున్న కప్ప మనసులో మెదిలేది.”

పిల్లలు గాలి పీల్చుకున్నారు.

“ఈ విధంగా చేపపిల్ల సుదీర్ఘ ప్రయాణం చేసి అనేక కష్టనష్టాలకోర్చి జలాశయం సమీపించింది. అక్కడ అనేక రకాల చేపలు అలజడిగా గందరగోళంగా తిరుగుతున్నాయి. కొన్ని తమ పిల్లలకోసం, బంధువుల కోసం ఆరా తీస్తున్నాయి. కొన్ని ఏడుస్తున్నాయి. తన సంతానం చావగా మిగిలిన పదిమంది ఇసక కప్పి ఎట్లా చచ్చాయో ఒక ‘గండెపరుక’ చేప చెప్పుతూ మతిస్థిమితం లేనిదానిలాగా ఎగురుతోంది. తన భర్త రాయికింద నలిగిపోయాడని ఇంకో పడుచుజెల్ల ఏడుపు గొంతుతో జీరగా చెప్పుతోంది.

ఆ చేపలన్ని జలాశయం చెరువులోకి చేరాలంటే ఎత్తైన (చెరువు మత్తడి చెరువు చివర చెరువులో చేరిన ఎక్కువ నీళ్లు పోవడానికి కట్టిన కట్టడం) గోడను పాకాలి. ఆ మత్తడి గోడ నున్నగా ఉన్నది. పైగా ఆ మత్తడి మీదినుండి నీళ్ళు యమ భయంకరంగా నురుగులు కక్కుతూ దూకుతున్నాయి. మత్తడి దాటితేగాని చేపలు చెరువులోకి చేరలేవు. చెరువులో చేరితేనే ప్రమాదాలు లేని మంచిబతుకు తనవాళ్లతోకలిసి బతుకొచ్చు. మత్తడి పాకడమంటే నీళ్లకిందబడి మరణించడమే. అయినా కొన్ని చేపలు సాహసించి నీళ్ళతో పాటు మత్తడి మీదికెగురుతూనే ఉన్నాయి. కిందపడి గాయపడేవి గాయపడుతూనే ఉన్నాయి. మత్తడి కింది నీళ్లల్లో తమ బంధువుల గురించి రోదించేవి రోదిస్తూనే ఉన్నాయి. మత్తడి దాటడం చేపల లక్ష్యం.

చేపపిల్ల తన లక్ష్యం గుర్తొచ్చి మత్తడివేపు కురికింది. సర్వశక్తులు కూడదీసుకొని నీటి ధారతో పాటు పైకి ఎగిరింది… కాని ప్రవాహం ఆ చిన్నారి చేప పిల్లను తొక్కేసింది.”

“అయ్యో పాపం.!…” అన్నారు పిల్లలు పెద్ద పెట్టున.

కమల నిశబ్దమైపోయి క్లాసురూంలో పచారు చేసింది… బయట నిలబడిన అతను క్లాసురూంకేసి చూశాడు… అతను విశ్వేశ్వరరావు… కమల అతని ముఖంలో ఎక్కడో చేపపిల్ల బాధను చూసింది.

“చేపపిల్ల రెక్కలు నలిగిపోయాయి. పొలుసులూడి పోయాయి. నెత్తురు ముద్దయిపోయింది… అయినా మళ్ళీ ప్రయత్నించింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది…”

“అయితే బతికిందన్న మాట.” పిల్లలు నిట్టూర్చారు…

“వినండి… మిగతా చేపలన్ని దాని తెగింపుకు ఆశ్చర్యపోయాయి. నెత్తిమీద కళ్ళుగల సాలె కొర్రమట్టలు కొన్ని ప్రమాదం కోరితెచ్చుకోవడమెందుకు… ఇక్కడే ఉంటే పోలా – అంత దూరమెందుకు ఎగురాలి ఇవి నీళ్ళుకావా?’ అని గేలిచేశాయి.

చేపపిల్ల తత్వం ఎక్కడైనా పడి ఉండడం కాదు… అది ఉండేది ప్రవాహంలో. నిలువ నీటిలో కాదు.

చివరిసారిగా నెత్తురుముద్దలాగా ఉన్న చేపపిల్ల! చిన్నారి చేపపిల్ల! సర్వశక్తులను కూడదీసుకొని నీళ్ళ ధారతో పాటు ఎగిరింది. దాని ప్రయత్నం ఈసారి ఫలించింది. చెరువులో కెక్క గలిగింది… చేపపిల్లలు దాన్ననుసరించాయి.

ఆ సంతోషంలో పరుగుతీసింది… అది కొంచెం దూరంలోనే ‘వల’ పొంచి ఉన్న సంగతి గమనించలేదు… వలలో చిక్కుకుపోయింది.”

“అయ్యో” అన్నారు పిల్లలు ఏడుపు గొంతులతో.

“వలవేసినవాడు వల ఒడ్డుమీదకు తెచ్చాడు. నేలమీదేసి మిగిలిన పొలుసులు ఊడేదాకా నెత్తురు చిమ్ముతుండగా చేపపిల్లను రాకినాడు.”

కమల అయిదు నిమిషాలు మాట్లాడలేదు. పిల్లలు విషణ్ణవదనాలతో…

“కాని చేపపిల్లకేమి బాధలేదు… అది మరణంలో కూడా సంతోషంగానే ఉన్నది. దానిది వీరమరణం. దానికి చచ్చేటప్పుడు కూడా అస్తమానం నాలుగు కాళ్ళమీద నిద్రపోతూ ఉండే కప్ప గుర్తొచ్చింది…”

అయిదు నిమిషాలు చేప మరణానికి శ్రద్ధాంజలి ఘటించినట్లుగా క్లాసురూంలో మౌనం.

చిత్ర అనే అమ్మాయి లేచి నిలబడి అసంతృప్తి ధ్వనించే కంఠంతో “మరి కప్పేమయింది మేడమ్?” అని అడిగింది…

“వస్తున్నా… అక్కడికే వస్తున్నా… మళ్ళీ ఎండాకాలమొచ్చింది. ఈసారి ఎండలు విపరీతంగా కాశాయి. మడుగుల్లోని నీళ్ళన్ని ఎండిపోసాగినయ్. కప్ప నివసించే మడుగులో కూడా నీళ్ళన్ని ఎండిపోతున్నాయి. కప్ప నిదురపోతూనే ఉన్నది. మడుగులో నీళ్ళు ఎండిపోయి బురద మాత్రమే మిగిలింది. కప్ప బురద అడుగుకు చేరిపోయి మట్టి తనమీద కప్పుకున్నది. బురద కూడా ఎండిపోసాగింది… “చీ…చీ… వెధవ ఎండలు” కప్ప విసుక్కున్నది. “భగవంతుని కృప ఉంటే వాన రాకపోదు-” పదే పదే అనుకోసాగింది.

భగవంతుడు కృప జూపనేలేదు… బురద ఎండి మండసాగింది… కప్ప చర్మంలో నీళ్ళు ఇంకిపోసాగినయ్… “భగవంతుడా!” కప్ప ఏడ్వసాగింది. అయినా భగవంతుడు కప్ప ఏడుపును పట్టించుకోలేదు – కప్ప ఒంట్లో నెత్తురు ఇరిగిపోసాగింది.

“చేపపిల్ల మాట నిజమేనేమో?” అనుకొన్నది.

భగవంతుడు కప్పను కటాక్షించలేదు. కప్ప గిల గిల తన్నుకొని చని పోయింది…”

బెల్లయ్యింది… కమల క్లాసు బయటకొచ్చింది… పిల్లలు క్లాసురూంలో కప్ప గురించి చేప గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నారు.

“చిన్న సవరణ పంతుల్లంతా కప్పలుకాదు” విశ్వేశ్వరరావు.

“ఆ సంగతి నాకు బాగా తెలుసు.” కమల కంఠం వణికింది. త్వరత్వరగా అడుగులేస్తూ కమల అక్కడినుండి వెళ్ళిపోయింది.

(పంచాయితిరాజ్ ఉపాధ్యాయ ప్రత్యేక సంచిక – చేపలు కప్పలు 1981)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply