(పంచాయితీరాజ్ ఉపాధ్యాయ ప్రత్యేక సంచిక 1981లో ప్రచురించిన కథ)
ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల మూలకంగా ఆ గ్రామంలో నుండి దొరలు పట్నాలకు వెళ్లారు. దొరలు ఖాళీ చేసిన గ్రామాల్లో ఏడవ లోక్ సభ(1980 జనవరి)ఎన్నికల కోసం వచ్చిన పారామిల్ట్రీ దళాలు గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టాయి. ముఖ్యంగా స్కూల్ లలో ఇలాంటి మిల్ట్రీ
క్యాంపు వేసుకొని ఉండేవి. ఆ క్యాంపులు, గస్తీలు అట్లాగే కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో, రాడికల్ సంఘాలు ఏర్పడి అనేక పోరాటాలు నిర్వహించాయి. ముఖ్యంగా ఉత్పత్తి వనరుల పంపకం గురించి పెద్ద ఎత్తున రైతాంగం కదిలింది. దున్నేవారికే భూమి నినాదంతో ప్రతి గ్రామంలో వందల ఎకరాల భూమి ప్రజల పరమైంది. ముఖ్యంగా అప్పటికే వ్యవసాయంలో ఉన్న బహుజన రైతులకు ఎంతో కొంత భూమి దొరికింది. గ్రామంలో నిరంతరం పీడ, దోపిడీ సాగించే దొరల పీడ పోయింది. కానీ, గ్రామాలలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నిరోధించడానికి కల్లోలిత ప్రాంతాల చట్టాలతో ప్రభుత్వం, పోలీసులు, పారా మిలటరీ దళాల ద్వారా నేరుగా రంగంలోకి దిగింది. అరెస్టులు, కోర్టు కేసులు.. ఇది భరించలేక అజ్ఞాతమైన యువకులు దాదాపుగా ఈ పోరాటాల నుంచి ఎదిగిన యువతరం కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లారు. కోర్టులు, కేసులు ముమ్మరమయ్యాయి. మరికొంతమంది యంత్రాంగంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఉపాధ్యాయులు, గుమస్తాలు, పోలీసులు, డాక్టర్లు, లాయర్లు, రెవెన్యూ ఉద్యోగులు….
ఉద్యమాల నుండి ఎదిగిన తరం … పోరాట అనుభవం గల తరం పెద్ద ఎత్తున నిర్మాణమై పీపుల్స్ వార్ గా ఏర్పడింది. సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా అనేక ఒడిదొడుకులతో … వేలాదిమంది విప్లవకారుల బలిదానంతో ప్రజాపోరాటం నిలదొక్కుకున్నది. తెలంగాణ ఒక విప్లవోద్యమ ఛోదక శక్తిగా అనుభవం గడించి.. మిగతా ఆంధ్ర ప్రాంతాలకు విస్తరించి… దేశవ్యాప్త ఉద్యమాల్లోకి విస్తరించింది. అందుకు తగిన వ్యూహం, ఎత్తుగడలు ఏర్పాటు చేసుకున్నది.
సుదీర్ఘ కాలపు అనేక పరిణామాత్మక పోరాటాలు… ప్రజల్లో నిలదొక్కుకొని గుణాత్మకంగా మారే దశకు వచ్చాయి.
ఈ దశలో.. స్థల కాలాల్లో.. మార్క్సిజం- లెనినిజం-మావో ఆలోచన విధానం వెలుగులో.. తమ పోరాటాలను అధ్యయనం చేసి… ముందుకు తీసుకుపోవాల్సిన డిమాండ్లను ప్రజా పోరాటాలు… పోరాటాల నుండి రూపొందించిన శక్తులు ముందుకు తెచ్చాయి.
ఈ దశలో రాజకీయ, ఆర్థిక శాస్త్ర, తత్వశాస్త్రం అధ్యయనం పెరిగింది.
ఈ అనుభవం తెలుగు సమాజానికి కొత్త. తెలుగు సాహిత్యంలో అంతకు ముందున్న సాహిత్యమంతా కూడా… ఉన్న సమాజాన్ని యధాతథంగా చిత్రించడమో? లేదా మంచి చెడ్డలు విశ్లేషిస్తూ, విమర్శిస్తూ.. ఉద్వేగాలతో రాసిన సాహిత్యమే ఎక్కువ. మొత్తంగా ఈ సమాజం బాగలేదు. మారాల్సిందే దాకా సాహిత్యం వచ్చింది. ఎట్లా మారాలి? ఎవరు మారుస్తారు? అసలు సమాజమంటే ఏమిటి? ఉత్పత్తి శక్తులకు … ఉత్పత్తి సంబంధాలకు ఉన్న వైరుధ్యాన్ని అధ్యయనం చేసి… ఉత్పత్తి శక్తులను పోరాటం ద్వారా అభివృద్ధి చేసి నూతన ప్రజాస్వామిక విప్లవం కొనసాగించే స్పష్టమైన అవగాహనతో జరుగున్న పోరాటాల సాహిత్యం శ్రీకాకుళ పోరాటాల నుండి విరివిగా వచ్చింది. దాని పరిమాణాత్మక కొనసాగింపు కావాలి. విప్లవ ప్రచార స్థాయి నుండి సాహిత్యం ఎదగాలి. ఇప్పుడు సాహిత్యంలో తాత్విక అనివార్యమైంది. సాహిత్యం, కళలు పూర్తిగా భావవాదంతో నిండివున్నాయి. భౌతికవాదం, ముఖ్యంగా గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, సృజనాత్మక రచనల్లో ఎట్లా తీసుకురావాలి? అప్పటిదాకా గద్దర్, సుందిళ్ల ధర్మన్న, వంగపండు ప్రసాద్ లాంటివాళ్ల పాటల్లో మార్పు వచ్చింది. పోరాట రంగంలో… ప్రజలల్లో మౌళికంగా విప్లవోద్యమం తన శక్తి మేరకు, పోరాటాల అవసరం దశ, దిశ కోసం భావవాదాన్ని ఎదుర్కొని భౌతిక వాదాన్ని నిలబెట్టకపోతే పోరాటాలు ముందుకు జరగవు. వైరుధ్యాలను అధ్యయనం చేయకుండా వైరుధ్యాలను పరిష్కరించలేం. ఇది అన్ని సాహిత్య, కళా రూపాల్లో వస్తే తప్ప ప్రజల చైతన్యస్థాయి పెరగదు.
ఈ అవగాహన నేపథ్యంలో కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు మొదలు, ప్రేమ్ చంద్, లూసన్, చెహోవ్ చాలా కథలు రాశారు. ఇన్ని చదవడంతో మరింత అలజడి… ఇక్కడ పోరాటాల అనుభవాల ఒత్తిడి… ఆ కథలన్నీ విశ్వజనీన వైరుధ్యాల గురించి రాసినట్లన్పించింది. పోరాట అనుభవాలకు… అది రూపొందించాల్సిన తర్కబద్ధ… గతితార్కిక జ్ఞానానికి మధ్య ఘర్షణ… మన అనుభవమే గొప్పదనే ఉద్వేగం… ఈ సిల్ సిలా లో తత్వశాస్త్రం విరివిగా చదవడం, సహచరులు చెప్పడం జరిగేది.
ముఖ్యంగా అనుభూతుల ద్వార ప్రతిఫలించేది భౌతిక వాస్తవికతే అయినా అనుభూతులలో స్వీయాత్మకత ఉంటుంది. ఇదిగో ఇక్కడ వచ్చింది చిక్కు. ఈ స్వీయాత్మక బలమైంది. పైగా ఎవరి అనుభవం మేరకు… వారిదే. ప్రజల్లో ఎన్ని కులాలు, ఎన్ని వర్గాలు, లింగ-మత, ప్రాంత స్వీయాత్మక ధోరణులు వచ్చాయి. వాటిమధ్య ఘర్షణ … దీనివల్ల పోరాటం గురించిన భ్రమలు, వక్ర ప్రతిబింబాలు… ఇప్పటికి అనేక రూపాల్లో కొనసాగే స్వీయాత్మకత ఉద్వేగాలు ఎంత బలమైనవో? అవి ఆచరణగా మారాలి. అంటే సామాజిక ఉత్పత్తి, వర్గపోరాటం, శాస్త్రీయ ప్రయోగాలు… అనుభూతి జాన దశ తర్కబద్ధ జానదశకు ఎదగడానికి తోడ్పడుతాయి.
అనుభూతి నుండి భావాత్మక ఆలోచనకు అక్కడి నుండి ఆచరణ ఇదే సత్యాన్ని గురించి తెలుసుకొని గతితార్కిక పంథా అన్నాడు లెనిన్. అంటే ఎప్పటికప్పుడు పోరాటంలో తలెత్తుతున్న అన్ని అంశాలను… వైరుధ్యాలను తాత్వికంగా అర్థంచేసుకోవడం. ఈ సంఘాన్నంతా సాహిత్యంలో తప్పనిసరిగా రావాలనేది అనుకున్నం. మొదలైతే కావాలి. ఏడికి చేరుకుంటామో తరువాత.
ఇదంతా జరుగుతున్న క్రమంలోనే పోరాటం రైతాంగం నుండి ఆదివాసీల్లోకి, కార్మిక, సింగరేణి, ఆర్టీసీ లాంటి చోట్లకు ఈ రంగాలకు విస్తరించింది. గ్రామీణ ప్రాంతంలోని అన్ని వర్గాలను, కులాలను కదిలించింది. అన్ని రంగాల్లో పాత ప్రజావ్యతిరేక నిర్మాణాల స్థానే కొత్త నిర్మాణాలు ఆరంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ స్థాపితంగా ఉపాధ్యాయులు లక్షలమంది ఉండేవారు. జీతభత్యాలు అప్పుడు మిగతా రంగాలతో పోలిస్తే తక్కువగా ఉండేవి. స్థానిక సంస్థల కింద పనిచేస్తూ రకరకాల ఒత్తిళ్లకు లోనయ్యేవాళ్లు. అనేక యూనియన్లు ఉండేవి. యూనియన్లన్నీ పైరవీ సంఘాలుగా, ప్రభుత్వానికి, భూస్వాములకు ఏజెంట్లుగా పనిచేసేవారు. ఎలాంటి రవాణా సౌకర్యాల్లేని పల్లెల్లోకి హేతు విరుద్ధమైన కంపుగొట్టే భూస్వామిక… దళారీ పెట్టుబడిదారీ భావజాలాన్ని… ప్రచారంచేసే కార్యకర్తలుగా ఉండేవారు. ప్రజల జానం కాని చదువు, పుస్తకాలు… ప్రజలు అలాంటి జ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎదిరిస్తున్నారు. నిజానికి ఉపాధ్యాయులే గ్రామాల్లోని అందరికీ మిగతా ప్రపంచానికి చేరుకొనే మార్గం. కిటికీ. అతడు గ్రామపు రాత కోతలు చేసేవాడు. చిన్నపాటి వైద్యుడు, వాతావరణం చేప్పేవాడు. ఉత్తరాలు చదివిపెట్టేవాడు. చీకటి ఖండాలుగా ఉన్న భారతీయ గ్రామాల్లోకి, రోగగ్రస్తమైన, కులాల కుమ్ములాటలో ఉన్న గ్రామాల్లోకి ప్రవేశించిన మొట్టమొదటి కలల బేహారి ఉపాధ్యాయుడు. కానీ, చెహోవ్ అన్నట్టు పంతుళ్లంతా సగం సగం కాలిన ఇటుకల్లాంటి వాళ్లుగా ఉన్నారు. హేతువిరుద్ధమైన పుస్తకాలు… పుక్కిటి పురాణాలు చదివి ఉన్నారు. ఒక జాతిని గానీ, మనుషులను గానీ ఇలాంటి పంతుళ్లతో నిర్మించలేం.
తేలిందేమంటే అర్ధ వలస, అర్ధభూస్వామిక భావజాల వాహకుల, వ్యాప్తికి వీళ్లే కీలకమైనవాళ్లు. అందుకే ప్రభుత్వం పంతుళ్లను, పోలీసులను ఎక్కువగా నియమించుకొనేది.
అయితే ఇందులోకి విప్లవోద్యమం వ్యాపించింది. వెంపటాపు సత్యం నుండి కొండపల్లి సీతారామయ్య దాకా పంతులే. రాడికల్ విద్యార్థుల తరం నుండి ఎదిగిన ఉపాధ్యాయులు- ఆకుల భూమయ్య, రవీందర్ రెడ్డి, కె.నారాయణ, వీరగోని పెంటయ్య, లచ్చన్నలాంటి అనేకమంది ఉపాధ్యాయులు ఎదిగారు. ఉపాధ్యాయ సంఘాల్లో కొత్తతరం వచ్చింది. అదో పెద్ద సుదీర్ఘ చరిత్ర.
నాకు మొదటి నుండీ వీళ్లంతా మిత్రులు. ఉపాధ్యాయ సంఘాలతో కలిసి తిరిగేవాణ్ని.
అలాంటి సందర్భంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం వాళ్లు… వాళ్ల ప్రత్యేక సంచికకు నన్ను 1981లో కథ అడిగారు.
వాస్తవికత లేని భూస్వామిక భావవాద పాఠాలు… అందుకు తగిన పుస్తకాలు, రైతాంగ పోరాటాలు… ఆ పోరాటాల్లో పెరుగుతున్న పిల్లలు… వాళ్ల భౌతిక అనుభవం… లాజికల్ అనుభవంగా, భౌతికవాద అనుభవంగా ఎదుగుతున్న దశ. నశించిపోతున్న పాతదానికి రూపొందుతున్న కొత్తదనానికి మధ్య వైరుధ్యం.. ఘర్షణ.. భౌతికవాద తాత్వికత… పురాణాలు, భగవద్గీత ప్రపంచం మారనిది మనుషులు నిమిత్తమాత్రులు అని బోధిస్తుంది. సొంతాస్తి కేంద్రంగా గల భావజాలం అన్ని రకాల ప్రజల్లో భూస్వామిక భావజాలం… నేరం, శిక్ష భావనలు రాజ్యానికి సంబంధించిన హింస ఉంటాయి.
సాంస్కతిక రంగం పూర్తిగా మధ్య యుగాల నాటి కరడుగట్టిన భూస్వామిక భావజాలంతో ఉంటుంది. మధ్యతరగతి ప్రభుత్వ యంత్రాంగం అవకాశవాదంతో అలాంటి భావజాల వాహికలుగా ఉంటూ ప్రజలను తప్పు పట్టిస్తుంటారు. అయినా అనివార్యంగా అసమ దోపిడీ, పీడనలు భరించలేక పోరాటంలోకి వచ్చిన ప్రజల పట్ల వ్యతిరేకత ఉంటుంది. విప్లవ శక్తుల పట్ల పిరికి ఉంటుంది. ఇది గోడ మీది పిల్లి. విప్లవోద్యమాలు పుంజుకుంటే వాళ్ల గొంతు మారుతుంది. అయినా మధ్య తరగతి శ్రామికుల శ్రమలో నుండే బతుకుతున్నది కనుక అది అనివార్యంగా ప్రజలతో కలిసి పోరాడాల్సిందే. అనుభవ జ్ఞానం, ఆచరణ ద్వార గతితార్కిక జానంగా అభివృద్ధిచేయడంలో మొదటి దశలో… పెటీ బూర్జువారంగం కషి మరువలేనిది. పోరాటాలు ముందుకు సాగినకొద్దీ అంటే పరిణామాత్మక పోరాటాలు గుణాత్మకంగా మారే క్రమంలో పెటీ బూర్జువాలో ఒక సెక్షన్ ఒక దశలో అడ్డంకిగా నిలుస్తుంది. ఒక సెక్షన్ శ్రామిక వర్గంతో మమేకమవుతుంది.
ఇలాంటిదో, మరేదో లోలోపల కదులుతుండగా గోపీచంద్ నవలలు- చీకటి గదులు, అసమర్ధుని జీవయాత్ర, మధ్య తరగతి, ఉపాధ్యాయులు, విప్లవోద్యమం, ద్వైతం, అద్వైతం, భగవద్గీ, అరెస్టులు, కేసులు… అజాత వాసాలు… ఉపాధ్యాయులు 1992లో రిలీజ్ అయిన ‘సారాపినా’ ఆఫ్రికన్ సినిమాలో చిత్రించినట్లుగా తెలంగాణ గ్రామాలు … స్కూల్ లలో పోలీసులు, పట్నాల్లో దొరలు, అడవుల్లో యువకులు, స్కూల్ లలో ఉపాధ్యాయులు.. ఇదీ … ‘చేపలు – కప్పలు’. కథ నేపథ్యం.
ఈ కథ మీద బోలెడు చర్చలు. రకరకాల అభిప్రాయాలు. అవన్నీ రాస్తే మరో కథ.
అయితే ఈ చర్చలు నిరంతరం సాగేటివి….
- (24. 7. 2020)