నా కవితా ప్రేరణ

నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు.

దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది.

మార్క్సీయమైన శాస్త్రీయ అవగాహన నా కవితా ధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది.

నా ఐదుగురి మిత్రులతో కలిసి అహోరాత్రులు ప్రపంచాన్ని చుట్టివచ్చిన క్షణాలు ఎంత విలువైనవో.

వచ్చిన విమర్శలూ, పొగడ్తలూ నా దష్టిని పటిష్టం చేశాయి, చేస్తున్నాయి.

సమాజం ఇంజెక్టు చేసే కొత్త రక్తాన్ని ఎప్పటికప్పుడు మనసా, వాచా ఆహ్వానించి గ్రహిస్తూనే వున్నాను.

చెరబండరాజు వయస్సు అయిదున్నర సంవత్సరాలే.

కవితా వయస్సు అనూహ్యం.

ఏం రాశాను అనేదానికన్నా, ఏం రాయాలి అనే, ఎవరికోసం రాయాలి అనే, ఎందుకు రాయాలి అనే సమస్య నాకీనాడు లేదు.

నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికే కలం పట్టాను. అనేక పుంతలు తొక్కి, బాటలు గడిచి ఇవాళ మీ ముందు ఇలా వుంది.

ఎవరేని ఈ కవితల్లో రసాస్వాదన కోసం పుస్తకం విప్పితే ఎండమావులే.

పుండును అందమైన ఎర్రగులాబీ పువ్వులా చిత్రించే- ఆకలి మంటల ఆర్తనాదాల్ని జీవుని వేదనగా వర్ణించే- ప్రణయైక జీవితంతో మేళవించే దశను తెలుగు సాహిత్యం దాటిపోయింది.

మంటను మంటగానే చిత్రించి, తృప్తిపడే, పరిష్కారం చూపని రచనా ధోరణిని నేటి తెలుగు కవిత్వం వెనక్కి తరిమేసింది.

అందుకే విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించి ఊపిరి పీల్చకుంటోంది.

సాహిత్యం వేరు, రాజకీయాలు వేరు అనే పలాయన వాదం ఉమ్మిలా ఆరిపోతుంది.

రాజకీయాల్ని జీవితం నుంచి, సాహిత్యం నుంచి వేరుచేసి చూసే బూతద్దాల కళ్లవాళ్లు ఎండుటాకుల్లా రాలిపోవడం చూస్తున్నాం. అయితే దేని విలువలు దానికి తప్పకుండా ఉంటాయి.

వర్తమాన సామాజిక పరిస్థితుల్ని, నిర్మొహమాటంగా, నిర్ద్వందంగా చిత్రించి, ప్రజల త్యగాల్ని కీర్తించి, భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించడం కన్నా కవి ఏం కోరుకుంటాడు?

అందుకే నా చుట్టూ వున్న పీడిత జన జీవన్మరణ సమస్యలే నా కవితా ప్రేరణలు.

1970 అక్టోబరు 2,
(దిక్ సూచికి ముందుమాట)


నిర్బంధ కవిత్వం

నా మాటగా ఇలా ఏదీ రాయగూడదనే అనుకున్నాను. కాని రాయవలసిన అవసరం తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఈ దేశంలో 21 ప్రభుత్వాలపైన ప్రభుత్వం నెరుపుతున్న పెద్ద ప్రభుత్వమయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమయినా నాకు ఒక్కటే. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక్క మా విప్లవ రచయితలే కాదు, ఎన్నో రాష్ట్రాల్లో ఎందరో కవులు, రచయితలు ప్రభుత్వ నిర్బంధాలకు రోజూ గురి అవుతున్నారు. నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నారు. అందుకే ఇవాళ వస్తున్నది నిర్బంధ కవిత్వం అంటున్నాను.

కవుల మీద చేయిచేసుకున్న కసాయిగాళ్లే ఆస్థాన కవుల్ని పోషిస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు, రాజులు లేకపోయినా రాజరికం ఇంకా మన విధాన సభల్లో, పార్లమెంటులో కొత్త చిగుళ్లు వేస్తూనే వుంది.

ఇక్కడే ప్రభుత్వ కవులు ప్రజల కవులు అని రెండువర్గాలు ఏర్పడుతున్నాయి. ఆయుధాల్తో హింసించేవాళ్లకు ఆయుధాలతోనే జవాబు చెప్పాలనడం, చెప్పడం ఎంత సబబో, కవుల్ని దండించడానికి వాళ్లు పోషిస్తున్న కవుల్నే ప్రేరేపించమనడం అంతే సబబు గదా! కాని అది చేయరు. చేయరు గనుకనే చేయి చేసుకుంటారు. ఆస్థాన కవుల అవసరమేమిటో అదైనా చెప్పరు. చెప్పలేరు గనకనే జెయిళ్లమీదా, పోలీసు బాయినెట్లమీద, హత్యలమీదా ఆధారపడతారు.

ఇందులోని చాలా కవితల్ని నన్ను పి.డి. చట్టంకింద నిర్బంధించడానికి “చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం” కారణాలుగా చూపింది. అదే చట్టం మళ్లీ విడుదల చేసింది. దొంగకు రెండు ద్వారాలుండడం ఎప్పుడూ అవసరమే మరి. పాముకు తలలో వుంటే, ఖలునికి నిలువెల్లా విషం. ఇది విషప్పురుగులు ఏర్పరచుకున్న రాజ్యాంగం కాబట్టి విషానికి విరుగుమందు తిరగబడడమని ప్రజలు తెలుసుకుంటున్నారు.

ఆ ప్రజల్లో నేనూ ఒక్కణ్ణి కాబట్టి, విషం తీసివేసి సంస్కరించడం కాదు. (తియ్యబోతే కాటేసి చంపదనీ గ్యారంటీ ఏమిటి?) విషప్పురుగును లేకుండా చేయడం ధర్మం అన్నాను. అందుకు కావలసిన ఆయుధాలు ప్రజలే తయారు చేసుకుంటారన్నాను. చరిత్రలో అట్లా జరిగిందని బుద్ధి ఉన్న పెద్ద ఎవడయినా గ్రహిస్తాడన్నాను. చెడును చంపడం నీతుల్లోకెల్లా నీతి న్యాయం అన్నాను. పసిపిల్లలకయినా ఇంతేగదా చెబుతాం. అందుకే కాబోలు ప్రజాకవి పాణిగ్రాహి “ఎరుపంటే కొందరికి భయం, భయం వారికంటే పసిపిల్లలు నయం” అన్నాడు.

రచయితలమీద దమన నీతిని ప్రదర్శించే ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా సాహిత్య వివేచన చేయడం మాకు చాతగాదని వూరుకుంటే మంచిది.

1972 ఏప్రిల్ 24
(ముట్టడికి ముందుమాట)


హృద్ఘోషకు జైలు లేదు
జనవాహిని కెదురులేదు.

మళ్లీ ఒకసారి విప్లవ రచయితల సంఘంమీద అంతరంగిక భద్రతా దండాన్ని ఈ కసాయి పోలీసు ప్రభుత్వం ప్రయోగించి ప్రజలంటే ఎవరో, వారు ఎప్పుడూ ఎవరివైపు ఎందెందుకుంటారో ప్రపంచానికి పరోక్షంగా విదితం చేసింది. (పెట్టుబడిదారీ గర్భంలోనే విప్లవాలు పుడతాయి. వాటికి శత్రువులే ప్రచారం చేసిపెడతారు కూడా) గ్రామ గ్రామాన నగర నగరాన ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా అగ్ని నినాదాలతో అచంచల విప్లవ దీక్షతో వీధుల్లోకొచ్చిన విద్యార్థులూ, మేధావులూ, శ్రామికులు శ్రీకాకుళం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల సాంప్రదాయాన్ని కాపాడారు. ఈ ప్రజా వెల్లువ విప్లవాలు విజయవంతమయ్యే యుగమనే గతితార్కిక సత్యాన్ని చాటిచెప్పింది. సాయుధ పోరాటమే ఏకైక మార్గంగా ఎన్నుకొని దేశం నలుమూలల నుంచి విరసంపట్ల తమ జన్మహక్కయిన విప్లవం పట్ల ప్రజలు కనబరచిన పోరాట పటిమే ఈ కవితలకు ప్రాణం. ఈనాటి జైళ్లు విప్లవ రాజకీయ పాఠశాలలే గాదు కవితా వ్యవసాయ కళాక్షేత్రాలు గూడా. ప్రజలు తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలకు అమానుషాలకు ప్రతిగా వర్గకసితో భారత పాలక వర్గాల పునాదులు కదిలిపోయే “యుద్ధం” ప్రకటించారు. ఎవరెన్ని భాష్యాలు చెప్పుకొని తప్పుకున్నా, ఎందరు తలకిందులుగా నడుస్తున్నా నాటి తెలంగాణా పోరాట వైఫల్యం పునరావృతమయ్యే ప్రసక్తి లేదు. ప్రకటించిన యుద్ధంతో రాజీలేదు. దావానలంగా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న రైతాంగ సాయుధ పోరాట ఫలితాల్ని కాపాడుకుంటూ భారత ప్రజలు జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని పరిపూర్తి చేసుకుంటారు.

ఒక వందమంది విప్లవకారుల్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకోవచ్చుగాక. నక్సల్బరీ తరువాత ఈ ఆరేండ్లలో కొన్ని వేలమంది విప్లవకారులు భారత గడ్డమీద సాయుధులై నించున్నారు. దేశభక్తులైన 32 వేలమంది నక్సలైట్లని జైళ్లలో బంధించవచ్చుగాక, దేశమే జైలుగా మారినప్పుడు ఈ జైళ్లకు అర్థం లేదు. ఎన్ని నిర్బంధాలు కొనసాగుతున్నా ఎక్కడా ఏ పోరాటాలు ఆగిపోలేదు. అవి ఇంకా విస్తృతమవుతాయి. అవుతున్నాయి.

విరసం ఆ నిర్బంధాలకు అతీతం కాదు. పుస్తకాలు నిషేధింప బడుతున్నా ఆరెస్టులు, సోదాలు సాగుతున్నా విరసం తన కార్యకలాపాల్ని విరమించుకోలేదు. తన సాహిత్య, సాంస్కృతిక కర్తవ్యాల్ని నిర్దేశించుకొని నెరవేరుస్తుంది. ప్రభుత్వం గుండెలదరేట్లు మొట్టమొదటిసారిగా బహిరంగ ప్రదర్శనలకు పూనుకుంది. ఇంకో నెలలో నాల్గవ మహాసభలు జరుపుకోనుంది.

ఇవి నాలుగడుగులు మాత్రమే. ఈ అడుగులకే ప్రభుత్వం గడగడ బాడుతోంది, సర్కా రాభ్యుదయ సాహితీవేత్తలారా! ప్రజల పక్షాన నిలబడ్డ కలాలకు గులాములై ఆర్ద్ర సవ్యాసం చేయక దమ్ములుంటే మా రచనల్ని మా ప్రజల్నుంచి. దూరం చేయండి. మాకు గులాములు కాకండి. మీ సలాములు మేము స్వీకరించం, మీతో రాజీకి అంగీకరించం. మేం బావిసత్వాన్ని పోషించం. ప్రజా వ్యతిరేకమైన ఓ ప్రభుత్వమా! నీ అంగాంగాన్ని ఖండించి నూతన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే మా ధ్యేయం.

1973 డిసెంబర్ 12,
(కాంతి యుద్ధానికి ముందుమాట)


ఆకాంక్ష

కథలు, నవలలు, నాటకాలు ఎక్కువగా రావలసిన తరుణంలో నేనింకా. కవిత్వాన్ని వొదలడంలేదు. విప్లవ ప్రచార అవసరాన్ని వచన కవిత్వం ఎక్కువగా తీర్చలేదని అనుభవం చెబుతోంది. కాబట్టే పాటలు రాయడం, పదిమంది నోళ్లల్లో నలగడానికి, ప్రతిక్షణం మననం చేసుకోవడానికి, మనకు తెలియకుండానే పాడుకోవడానికి పనికివచ్చే సాహిత్య ప్రక్రియ పాట, ఆపాట జానపద శైలిలో, సరళంగా, సూటిగా కవుల దృష్టితోగాక, ప్రజల దృష్టితో, వాళ్ల స్థాయిలో, విప్లవ అవసరాల దృష్ట్యా రాయబడినపుడు పాట, ఎంత బలమైన ఆయుధంగా పని చేస్తుందో తెలుగునాట ‘ జననాట్య మండలి’ రుజువు చేస్తోంది. మధ్య తరగతి భాషా కుటీర పరిశ్రమ నుండి, పద ప్రయోగాల్లో, బాణీల్లో ఆ సాహిత్య కొలమానాల నుండి బయటపడితే పాటకు ఇంకా ప్రాణం వస్తుంది. ఆ ప్రయత్నం. నేనెంతో చేయాల్సి వుంది. విప్లవ ప్రచారం ఎందుకన్నానంటే, ఏ వర్గం రచయితలు, ఆవర్గ ప్రయోజనాల్ని కాపాడడానికి తమ కళా సాహిత్యాలు సృష్టిస్తారనేది చారిత్రక సత్యం, బూర్జువా రచయితలు ఇది ఒప్పుకోరు. వివాదం అని హేళన చేస్తారు. మొత్తంగా విప్లవ రచనలు ‘వొట్టి ప్రచార సాహిత్యం’ అని కొట్టి వేయడానికి సాహసించే వీరు తమ రచనలు ఎవరి ప్రయోజనాల్ని కాపాడుతున్నాయో తెలుసుకోలేరు. అసలు ఆలోచించరు. వీటన్నింటి వెనక వున్నది ఒకటే భావన. కళ కళకోసం అనే వాదన, నలుగురితోపాటు నారాయణ అవడం వారి పద్ధతి, కాని అది ప్రజా వ్యతిరేకమైన భూస్వామ్య విధాన సమర్థన. బావిన ఆలోచన. రాజీబేరం. పరస్పరం సంఘర్షించే శక్తుల్ని చూడ నిరాకరించడం. విప్లవ రచయితల్లోనే కొందరు రచనల్లో వివాదాన్ని జీర్ణం చేసుకోలేనివాళ్లు లేక పోలేదు. ఇలాంటివాళ్లు “ప్రచార సాహిత్యం” అని కొట్టివేసేవాళ్ల బుట్టలో పడే ప్రమాదం వుంది. అల్లని విప్లవ రచయితలు కళా విలువల్ని ఖాతరు చెయ్యని వాళ్ల కిందికి ఎంతమాత్రమూ రారు.

పాట అవసరాన్ని నొక్కి చెప్పేప్పుడు వచన కవితకు రెండో స్థానం కల్పించడమే అవుతుంది. అయితే, ఆ రచనే సాగించ వద్దని కాదు, తీసుకునే ఇతివృత్తాన్ని బట్టి, ఏదైనా వుంటుంది. అన్నింటికన్నా ముఖ్యం శ్రమజీవుల పోరాట అవసరాలు తీర్చడమే రచనా ప్రయోజనం కావాలి. ఈసారి జైలుకెళ్లాక ఎక్కువగా పాటలు రాయాలనుకున్నాను. రాశాను. ఆ ప్రయత్నంలో భాగమే ‘గౌరమ్మ కలలు’. ఇది చిన్న కథా కావ్యం నవలలో లాగా జీవితాన్ని చాలా కోణాలనుండి చెప్పడానికి కథాకావ్యం బాగా వినియోగ బడుతుంది. నృత్య వాటికగా ప్రదర్శించుకోవచ్చు. అయితే కొన్ని అవసరమైన మార్పులు చేయాల్సి వుంటుంది. రాసేప్పుడు నృత్య నాటిక రచనా దృష్టి నాకు లేదు, లేకపోవడం తప్పు. ఊరు మేలుకుంది కవితను దివి తాలూకా జననాట్య మండలి వారు బ్యాలెట్గా ప్రదర్శించి జనామోదం పొందగలిగారని విన్నాను. కవితా ఖండికలకన్నా కథా కావ్యాలు పాఠకులమీద చెరిగిపోని ముద్ర వేస్తాయన్నది వాస్తవం. అవి గేయ రూపకాలుగా రంగస్థలంమీద ప్రాణ ప్రతిష్ట చేసుకున్నప్పుడు వచ్చే ఫలితాలు, ఒక్క మంచి నాటకం తప్ప మరే సాహిత్య ప్రక్రియ సాధించ లేదు. అయితే ఇదంతా శ్రమతో, ఖర్చుతో కూడుకున్నది. ప్రత్యేకమైన ఉత్సవాల్లో సభల్లోనే వీటిని మనం ప్రదర్శించగలం, రోజూ వేలాదిమంది చదవడానికి కథ, నవల మంచి సాధనం, వచన పాఠకుల సంఖ్య ఎప్పుడూ ఎక్కువే. కాబట్టి విప్లవ రచయితలు ఇతోధికంగా కథ, నవల, నాటక రచన సాగించాల్సి వుంది.

1975 మార్చి 19
(గౌరమ్మ కలలకు ముందుమాట)

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

Leave a Reply