చెప్పదలుచుకున్న మాటేదో…

వానొస్తదా? ఏమో. మబ్బు కమ్మింది. వానొస్తే తడవడమే.

అయినా వానలో తడిచి ఎంత కాలమయింది…? మట్టి వాసన పీల్చి ఎన్నాళ్ళయింది…?

ఇప్పుడే స్టాఫ్ రూమ్ నుండి బయటకు వచ్చిన.

ఏం చేయాలి? అవును… ఏదో ఒకటి చేయాలి. లాభం లేదు.

ఎవరికీ పట్టనిది నాకెందుకు?

నాకెందుకు అంటే మరి ఎవరికీ కావాలి? పిల్లల జీవితం కదా. అయినా, వాళ్ళయినా బాధ్యతగా ఉండాలి కదా. ఏమో ఇప్పటి పిల్లలు అలాగే ఉంటారేమో. మనకెందుకు అనుకుంటే ఎట్లా? ఎవడి దారిన వాడు పోతే ఎలా? మంచో చెడో ఎక్కడో ఒక దగ్గర నిలబడాలి కదా?

విద్యార్థులు నిలబడకుండా మనం వెళ్లి మాట్లాడితే…

విద్యార్థులు చివరివరకు నిలబడకపోతే… చరిత్రంతా ఇలాగే ఉంది కదా…

ఎవరో ఒకరు అడగాలి కదా. అది నేనే అయితే ఏమౌతుంది? పిల్లలకు మంచి జరుగుతుంది. స్టాఫ్ తిట్టికుంటరు కావచ్చు. వాళ్ళు తిట్టుకుంటే నాకేంటి?

అయినా ఈ కంప అవసరమా? లాక్కోలేక పీక్కోలేక చావడం తప్ప.

కారిడార్లో చెత్త చర్చలు. ఎక్కడా అగాలనిపించలేదు. నేరుగా బయటకొచ్చిన.

సంతకం పెట్టి పో. మళ్లీ ఏమొస్తావు అనే మాటలు వినపడ్డాయి… కానీ పట్టించుకోలేదు.

బైక్ తీద్దామా ? ఎందుకు… మళ్ళీ వచ్చేదే కదా అని ఫర్లాంగు దూరంలో ఉన్న బ్లూ మూన్ కు బయలుదేరాను- టీ కోసం.

రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్త చెదారం, దుమ్ము ధూళి. డ్రైనేజీ పొంగి పొరలుతుంది. దేశం నిండా కూడా ఇంతేనా? డ్రైనేజీలో మునిగి తేలుతున్న పందులను చూసి కుక్కల అరుపులు. డ్రై నేజీ పక్కనే చెప్పుల షాపు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ?

అసలు ఏం మనుషులు? వీళ్ళవి ఏం జీవితాలు ? ఎన్ని మాటలయిన పడే మనుషులు… ఛ… ఛ… ఒక్కసారయినా ఆలోచించరా…?

అసలు వాళ్ళ శరీరాల్లో రక్తం ప్రవహిస్తుందా?

వీళ్ళను చూస్తే కోపం నషాళానికి అంటుతుంది.

కుర్చీలోనే కూర్చుని పాఠాలు చెప్పేదొకరు…

పుస్తకాన్ని ముందు పెట్టుకుని పాఠం చదువుకుంటూ పోయేది మరొకరు…

సిలబస్ మారింది. “ఇక్కడ వీస్తున్న చెట్ల గాలి” కవిత ఉంది. రాసింది నందిని సిధారెడ్డి.

“ఎవరు ఈవిడ? ఎప్పుడూ, ఈమె కవిత్వం చదవలేదు” ఇరవై ఏండ్ల అనుభవంతో నందిని సిధారెడ్డి ఆడో మగో కూడా తెలువని అధ్వాన స్థితిలో సాహిత్యం బోధిస్తున్నదొకరు… ఏం ఖర్మరా బాబు?

సంవత్సరంలో చాలా అరుదుగా క్లాసు రూమ్ లోకి వెళ్లి పాఠాలు చెప్పకుండానే నీతి వాక్యాలు చెప్పే ప్రబుద్దులు ఇంకొందరు.

ముప్పయి వేలకు మార్కెట్లో దొరికే ఎంఫిల్ సర్టిఫికేట్ లతో ఇంక్రింమెంట్లు తీసుకుని ఆదర్శాలు వల్లించే వాళ్ళు కొందరు. ఒక పీరియడ్ చెప్పి నాలుగు పీరియడ్ లు చెప్పినమని గప్పాలు కొట్టే వాళ్ళు మరికొందరు… కాలేజి ఎక్కడ పొతే నాకేమని ప్రవర్తించే ప్రిన్సిపల్ ఒక పక్క…

ఉద్యోగం వచ్చిన కొత్తలో పాఠాలు ఎట్లా చెప్పాలో అర్థం కాక ట్యూషన్ చెప్పించుకొని పాఠాలు చెప్పినోళ్ళు కొందరు. చివరకు పాఠాలు చెప్పకున్నా ఏమి కాదని అర్థమయ్యాక ట్యూషన్ చెప్పించుకోవడం మానేసి తనకు వచ్చింది తాను చెప్పే వారొకరు.

తమ మాట వినని పిల్లలను. ఎదురు ప్రశ్నలు వేసే పిల్లలను ఇంటర్నల్ మార్క్స్ పేర బెదిరించే మహానుభావులు మరికొందరు.

నోట్స్ ఇచ్చాం కదా ఇక చదువుకోండి. క్లాసులు చెప్పడం కుదరదు అని తప్పించుకునే వాళ్ళు కొందరు…

ఇదేమన్న ఎల్ కె జీ నా… క్లాసు లు చెప్పడానికి? మీకు మీరే చదువుకోవాలి. ఆ మాత్రం జ్ఞానం లేదా అని హితబోధ చేసే బడుద్దాయిలు ఇంకొందరు.

తెలివి లేనివాడే చదువుతాడు తెలివి ఉన్నవాడు ఎందుకు చదువుతాడు క్లాసుకు పోయే ముందు చదువుతున్న వాళ్ళను చూసి వెక్కిరించే వాళ్ళు మరికొందరు.

దినమంతా కబుర్లు చెబుతూ పాఠాలు చెప్పకుండా తిరిగేవాళ్ళు కొందరు…

నోటికి వచ్చింది చెప్పి పాఠం అయిందనిపించే వాళ్ళు మరికొందరు.

తమ సొంత సోది చెప్పేవాళ్ళు కొందరు… పొద్దున్నే సంతకం పెట్టి బయట పడేటోల్లు కొందరు… అన్ని తనకు తెలియాలి, తనకు తెలియకుండా ఏం జరుగద్దు అనే మూర్కుడొకరు… కాలేజీ పని చెప్పి క్లాసు లకు పోనీ వాళ్ళు కొందరు…

–ఇలాంటి చవటలు ఒక దగ్గర చేరిన తరువాత కాలేజీలు ఎలా నడుస్తాయి? పిల్లలు ఎలా బాగుపడుతారు?

***

హోటల్ దగ్గరికి వచ్చిన. అక్కడంతా గందరగోళం. పక్కనే సినిమా టాకీస్. ఏదో కొత్త సినిమా అనుకుంటాను. జనం విరగబడి ఉన్నారు. కొంతమంది హోటల్ కి వచ్చినట్టు ఉన్నారు. అందుకే హోటల్ లో చాలా మంది ఉన్నట్టు ఉన్నారు. అయినా లోపలికెళ్ళి టీ తాగుదామా? లోపల సిగరెట్ వాసన ఎక్కువుంటది. కాసేపు ఆగి పోదామా? పక్కనే పుస్తకాల దుకాణం కదా. ఒకసారి చూస్తే… కొత్త పుస్తకాలూ ఏమైనా వచ్చాయో… చత్… అక్కడ ఎక్కువ పనికి రాని పుస్తకాలూ… అవసరమా?

లోపలికి వెళ్లి కూర్చున్న. టీ వచ్చింది. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉన్న టీ యే రుచిగా ఉంటుంది. ఎవడు కనిపెట్టిండో కదా ఈ టీ ని. మొదట్లో నాకు లేని అలవాటు ఇది. ఉద్యోగంలోకి వచ్చాక చాలా కాలం టీ కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసిన. కానీ ఎవరి ఇంటికి వెళ్ళినా టీ ఇచ్చేవాళ్ళు. వద్దని చాలాసార్లు వారించిన. ఎవరు వినలేదు. పైగా ఇది విషం కాదు కదా అనే వాళ్ళు. నీవేం చావవులే అనేవాళ్ళు. వాళ్ళ సందేశాలు వినలేక తప్పని సరి స్థితిలో తాగాను. ఆ విధంగా అలవాటు అయ్యాక టీ నా జీవితంలో భాగమైంది.

ఒక్కొక్క సిప్ తో నా శరీరంలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్టు ఫీల్…మనసుకు హుషారు వచ్చినట్టనిపించింది.

బిర్యానీ తిన్నాక టీ ఎంత బాగుంటుందో… అర్ధరాత్రి దాటాక, ఆరుబయట వెన్నెల వెలుగులో టీ తాగుతూ కూర్చుటే ఎంత బాగుంటుందో…

అయినా… మళ్ళీ ఆలోచనలు కందిరీగల్లా…

“ఎందుకు రాలేదురా? ఎట్లా పాస్ అయితర్రా”

“సార్లే, రావద్దన్నరు. అయినా, వచ్చిన తరువాత క్లాసులు ఎక్కడ జరుగుతున్నయి. ఏం చెపుతండ్రు. ఏం అర్థమవడం లేదు. ఈ సారి ఖచ్చితంగా ఫెయిల్. థియరీ చెబితే లెక్కలు చెప్పరు. లెక్కలు చెప్పితే థియరీ చెప్పరు. చెప్పే లెక్కలు, థియరీ కూడా టెస్ట్ పేపర్స్ లోనివే. వాటి కోసం కాలేజికి రావాలా. ఇవే చదవండి. ఇవే ఎగ్జామ్స్ లో వస్తయి అని చెప్పే వాళ్ళు ఒకరు.

‘సర్ ఖాళీగా ఉన్నాం క్లాసు చెప్పండి’ అంటే ఏవో పనికి మాలిన సాకులు. మీ ఉద్యోగం మాకు పాఠాలు చెప్పడానికి అంటే కోపంతో అరుస్తారు. ఏం చెప్పమంటారు మీకు.

మీరేమో ‘క్లాసుకు రండి. పాఠాలు వినండి. ప్రశ్నలు అడగండి’ అంటరు. కానీ మిగతా వాళ్ళు అలా లేరు కదా సర్. ఏం చెయ్యమంటారు? చెప్పండి”

“సిలబస్ కాకుండా ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు?”

“అంత చూచి రాతే కదా సర్”

“ఎగ్జామ్స్ లో రాయనీయకపొతే?”

“ఏముంది సర్ ఫెయిల్ అవుతం అంతే కదా!” నిర్వేదంగా… గొంతులో చెప్పలేని విషాదమేదో…

“ఏమైనా చేద్దాం…”

“ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? కానీ ప్రయత్నిద్దాం. ఫలితం ఎలాగైన ఉండనీ… ఏమంటారు”

సరే అనుకుంటూ వెళ్లారు, సాయంత్రం కలుద్దామని.

విపరీతంగా ఉక్కపోత… చెమట వాసన… అల్లకల్లోలంగా మనసు…

కొలీగ్స్ మాటలు… ఏం నేర్పరితనం… ఎంతటి అవకాశవాదం… గోడమీది పిల్లుల్ల…

నిన్ను పాఠాలు ఎవరు చెప్పుమన్నరు?. ఎందుకు ఆలోచిస్తావు?. అలోచించి ఏం చేస్తావు?. లోకమే… ఇలా ఉంది. లోకం తీరు నడువాలే కదా. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా…? హిత బోధ చేసిన మిత్రుడిని చూసి నవ్వొచ్చింది.

నేను ఇరవై ఎండ్లలో ఒక్కసారి కూడా పాఠం చెప్పలేదు అని గళ్ళ ఎగురవేసేవాడు ఒకడు…

పాఠాలు చెప్పిన వాడిని నేరస్తుడిగా చూస్తున్నారు. పాఠం చెప్పడం నేరంగా మారడం ఎంత బాధాకరం.

ఏమన్నా చెయ్యాలి… ఏం చెయ్యాలి? మెదడులో సునామిలాంటిది ఏదో…

ఏలు చూపితే కొండ పాకాలే అంటారు. మరి ఈ పిల్లలు ఇలా తయారయ్యారేంటి. వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోలేని దుస్థితి ఎట్లా దాపురించింది. కడుపు నోచ్చినవాడే ఓమ బుక్కలంటారు కదా. ఈ విషయం పిల్లలకు ఎలా అర్థం కావాలి, చేయించాలి.

తాగడానికి మంచినీళ్ళు ఉండవు, టాయిలెట్స్ ఉండవు. రూమ్స్ ఊడవరు. స్కాలర్ షిప్స్ ఎప్పుడు వస్తయో ఎవరికీ తెలువదు. బస్సు పాస్ లు ఇవ్వరు. ఇచ్చినా బస్సులు టైం కు ఉండవు. లేట్ ఎందుకయిందని అడగితే బస్సు లేటు అంటారు.

సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. టీసీ కావాలంటే నీ స్కాలర్ షిప్ రాలేదని పిల్లల దగ్గర డబ్బులు కట్టించుకోవడం… ప్రతి దానికి సర్ ఏం చేయమంటారు? అని ఒకరు. టీసీ ఇత్తలేరు అని ఒకరు, ఏదో కారణం చెప్పి వచ్చే వారు ఒకరు… ఎన్ని సమస్యలనీ…

ప్రభుత్వ కాలేజీ అంటే మరీ ఇట్లనా…

ఏదో ఒకటి తేల్చుకుని ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడల్లా, సమస్యలు వచ్చిన ప్రతి సారీ తనే గుర్తుకు వస్తుంది… ఎంత ధైర్యంతో నిర్ణయం తీసుకుంది… అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో… సమస్యలు ఎదురైనప్పుడే మనుషులు చురుగ్గా మంచి నిర్ణయాలు తీసుకుంటరేమో…

***

అప్పుడే నేను రివటలా గాలి వస్తే కొట్టుకొని పోయేలా ఉండేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే టీబీ పేషేంట్ లా ఉండేవాడినని పేరు.

అప్పటికీ, నా జీవితంలో పరిచయం లేని పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను. తను నాగలి దున్నడం, మోట కొట్టడం, నీల్లు కట్టడం, ఒడ్లు చెక్కడం ఒకటేమిటి మగవాడు చేసే ప్రతి పని చేసేది. ఆడవారి దేనికి తక్కువ కాదని తనను చూసి చెప్పొచ్చు.

అయినా జీవితంలో కొన్ని పరిచయాలు గమ్మత్తుగా జరుగుతాయి. పరిచయాలకు పద్దతంటూ ఏమి ఉండదు కదా. పరిచయాలు ఇలా జరగాలని ఎక్కడయినా వ్రాసి ఉంటుందా? ఉండదు కదా. అలా ఉంటే బాగుండేదేమో. కొన్ని పరిచయాలు ప్రయోజనం కోసం, మరికొన్ని ఆదర్శాల కోసం జరుగుతాయి. మరికొన్ని ఎందుకు జరుగుతాయో తెలియదు. ఏమి ఆశించకుండా జరిగే పరిచయాలు కూడా ఉంటాయి. ప్రయోజనాల ప్రాతిపదికన ఏర్పడే పరిచయాలు ప్రయోజనాలు నెరవేరిన మరుక్షణం అదృశ్యమవుతాయి. ఆదర్శాల కోసం జరిగే పరిచయాలు మనల్ని నిరతరం మనుషులుగా నిలబెడుతాయి. అయితే కొన్ని పరిచయాలు జీవితాంతం నిలిచి ఉంటాయి. పరిచయం అయిన తరువాత మళ్ళీ ఒక్కసారి కూడా వారిని కలువకపోవచ్చు. కానీ ఆ పరిచయం మనలను ఎప్పటికి వీడిపోదు. ఆమెతో అలాంటి పరిచయమే!.

సూర్యోదయం ఉండదు. సూర్యాస్తమయం ఉండదు. ఇవి అబద్దాలు. అయినా, ప్రతిరోజు లేని సూర్యోదయ, సూర్యాస్తమయాల గురించి మాట్లాడుకుంటాము. మనం రోజు అబద్దంలోనే బతుకుతున్నాము గనుక మనం ఏమి పట్టించుకోకపోవచ్చు.

ఆదర్శాల గురించి మాట్లాడేటప్పుడు బంధాలు అంత ముఖ్యం కాకపోవచ్చు. విలువల కోసం నిలబడడం అంటే కత్తుల వంతెన మీద నడవడమే కదా. వ్యక్తిగత సమస్యలు ప్రాధాన్యంగా ఉండకపోవచ్చు. కనిపించే ప్రతిదానికి స్పందించకపోవచ్చు. అంత మాత్రాన స్పందనలు లేవని కాదు. ఉన్నా బయటకు చెప్పకపోవచ్చు. మనసులో ఉన్న ప్రతీ దాన్ని వ్యక్తీకరించలేం కదా. అలజడులను ఎలా బయట పెడుతాం.?

కోలముఖం, అమాయకత్వం కలగలసి ఉన్న రూపం. ఒక చిన్న పిల్ల, పరిచయం అయింది. అప్పుడే పెద్దమ్మ చెప్పినట్టు గుర్తు. ఆ అమ్మాయి చాలా మంచిదని. ఆమె దృష్టిలో మంచిది అంటే ఇంటి పనులు అన్ని బాగా చేస్తదని. చెప్పినట్టు వింటదని. అందుకే ఆ అమ్మాయి మంచిది. పదవ తరగతో ఇంటర్మీడియటో. అయిందో లేదో కూడా తెలియదు.

బహుశా టీ పెట్టిందనుకుంటాను. టీ తాగాను. తను ఇంకా చదువుకుంటున్నదట. ఏం చదువుతుందో నేను అడిగినట్టు కూడా జ్ఞాపకం లేదు.

మధ్యలో సాహిత్యం గురించి చర్చ వచ్చినట్టున్నది. ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ అప్పటికి నేను ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం చదువుతున్నాననుకుంటాను. క్లాస్ లో ఏదో జరిగింది. తెలుగు సర్ ఏదో అన్నట్టు ఉన్నారు. బహుశ మీ లెక్కల కంటే కూడా తెలుగు కష్టమని. అది నిజమో కాదో తేల్చడానికి లైబ్రరీ నుండి తీసుకొచ్చి చదువుతున్నాను. ఆ విషయమే మాట్లాడినట్టు గుర్తు.

ఆ మాటల సందర్భంలోనే తెలిసింది తన జీవితం లోని పెద్ద కుదుపు.

“చాలామంది స్త్రీల జీవితం వాళ్ళకు సంబంధం లేకుండానే నడుస్తుంది. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళ నిర్ణయాలను తల్లుదండ్రులే తీసుకుంటారు.

ఏ తండ్రి తన బిడ్డకు ఇష్టమా లేదా అని అడుగడు. దానికేం తెలుసు చిన్న పిల్ల అంటాడు. అమ్మాయిల అనుమతి లేకుండానే వివాహాలు జరుగుతాయి.

బహుశా వివాహం స్త్రీ ల జీవితాలలో అతి పెద్ద హింసేమో.

వివాహం పవిత్ర బంధం అంటారు గాని అందులో పవిత్రత ఏదీ లేదు అనిపిస్తుంది. అంతా అపవిత్రమే. వివాహం స్త్రీని తనకు కాకుండా పరాధీనను గావిస్తుంది, చేస్తుంది. తను ఎలా ఉండాలో అలా ఉండలేని స్థితి దాపురిస్తుంది. ఆమె మాట మీద, పనుల మీద, ఆమె మీద ఎప్పుడు నియంత్రణే. వివాహం స్త్రీలను ఒక బోనులో కట్టిపడేస్తుంది. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అ బోనులోకి నడవడానికి సిద్దంగా ఉండవలిసిందే.

వివాహం జన్మజన్మల బంధం అంటారు గాని నా దృష్టిలో అయితే అది వట్టి ట్రాష్. ఎవరో రచయిత అన్నట్టు అవకాశం ఉంటే చాలా మంది స్త్రీలు వివాహచట్రం నుండి బయటపడుతారేమో!” ఇది తన మనసులోని వేదన…

తప్పో ఒప్పో తనకే తెలియదు… తనలో దాగిన ఉద్వేగమంతా ఇలా తన్నుకొచ్చింది… వాళ్ళ మాటలను ఓపిగ్గా సానుభూతిగా వినేవాళ్ళు ఉంటే చాలా మంది తమ మనస్సులో దాగిన మాటలను, ఉద్వేగాలను ఇలా పంచుకుంటరేమో…

కిటికీలోనుండి చల్ల గాలి వస్తుంది. పక్కనే ఏదో పక్కనే ఏదో పెరడి ఉన్నది. దూరంగా చెరువులో నీల్లు. వీధుల్లో మనుషుల అలికిడి. ఎవరు ఎందుకు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. కానీ వాళ్ళ ముఖాల్లో చెప్పలేని అనుభవమేదో కన్పిస్తుంది. ఎవరో బిడ్డకు అన్నం తినిపిస్తున్నట్టు ఉన్నది. ఆ బిడ్డ తల్లిని తప్పిఉంచుకుని పరుగెడుతున్నాడు. అందమైన సీతాకోక చిలుక… భయంతో… గమ్యం తెలియక ఎగురుతుంది.

ఎవరో అరుస్తున్నారు నువ్వు దొరకవా… దొరికినాక నీ పని చెపుతానని. ఇంకెవరో ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో ఎన్ని జన్మల విషాదమో వినపడుతున్నది. రైతు తన మానాన తాను నాగలి దున్నుతున్నడు. ఎవరు ఎందుకు పరుగెడుతున్నారో తెలియదు.

“నీకు తెలియకుండానే ఆ హింస వలయంలోకి వెళ్లావు, వచ్చావు. మన జీవితం మన ప్రమేయంతోనే నడవాలి. ఎవరు అవునన్నా కాదన్నా. మన గ్లాస్ మన చేతిలో పగిలిపోతే మనకు బాధ ఉండదు. అదే వేరే వాళ్ళ చేతిలో పగిలిపోతే చెప్పలేని బాధ. ఇకనైనా నీ జీవితం నీ చేతిలో ఉండాలంటే చదువుకోవాలి. జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే స్త్రీలకూ చదవడం తప్ప మరో గత్యంతరం లేదు. తన కాళ్ళ మీద తను నిలబడనంత కాలం స్త్రీ స్వతత్రురాలు కాదు. తన కాళ్ళ మీద తను నిలబడితేనే తన నిర్ణయాలు తాను తీసుకోగలదు” – ఇలా ఇంకా… ఏదేదో మాట్లాడినట్టున్నాను, అంతా గుర్తులేదు.

కానీ చెప్పడం మాత్రం చాలా స్పష్టంగా గట్టిగా చెప్పినట్లున్నాను.

ఎందుకో ఆమెను ఆ స్థితిలో చూశాక నాకే తెలియకుండా నా అభిప్రాయం కావచ్చు సలహా కావచ్చు అంత గట్టిగా చెప్పేసాను.

చాలాసార్లు అనుకున్నాను ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడు ఎందుకు నేను అట్లా స్పందించానా అట్టే పరిచయం లేని వ్యక్తితో… బహుశా ఆమెను చూసినప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెను విన్నప్పుడు పరాయి మనిషి అన్నట్లు అనిపించినట్లు లేదు.

చాలా కొంతమందితో మాట్లాడినప్పుడు మాత్రమే మనసుకు అట్లా తోస్తుందేమో!

అదీగాక మనిషి కి జరిగిన అన్యాయం పట్ల వేగిరం స్పందించకుండా ఉండలేని నా మనస్తత్వం కూడా అందుకు కారణం కావచ్చు.

నా మాటలు ఎట్లా అర్థం చేసుకుందో కూడా నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ, నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళలేదు. తనని కలువలేదు. మా పెద్దమ్మను కూడా కలువలేదు. నిర్దిష్టమైన కారణం ఏదీ లేదు వెళ్ళడానికీ, వెళ్లకపోవడానికీ.

మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలేనని మార్క్స్ అన్నాడు కానీ అది నా జీవితంలో నిజమేనని అప్పటికే నిర్ధారించుకున్నవాన్ని. గనుక ఎక్కడికయినా వెళ్ళాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించే వాన్ని. ఒక్కొక్కసారి అబద్దాలే నిజంగా ప్రచారమవుతుంటాయి. జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఏవి అబద్దాలో ఏవి నిజాలో తెలుసుకోలేని గందరగోళంలో పడిపోతారు. అక్కడే మనుషుల ఆలోచనాశక్తి మనకు తెలుస్తుంది.

మాట్లాడే వాళ్ళు ఎన్నయినా మాట్లాడుతారు. చేసినా మాట్లాడుతారు. చేయకున్నా మాట్లాడుతారు. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. తల బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు. మనం చేయగలిగితే చేయాలి. ప్రయత్నిస్తే అవుతుంది అనుకుంటే ప్రయత్నించాలి. కుదరదు అనుకున్నపుడు వదిలివేయటం శ్రేయస్కరం.

అవసరాల ప్రాతిపదికన సంబంధాలు కొనసాగించలేని అసహాయున్ని. నా పరిస్థితి ఇది అని ఎవరికైన ఎలా చెప్పాలి? ఎలా అర్థం అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటే చేసుకొని… లేకపోతే లేదు… అని బలంగా నమ్మేవాన్ని. ఎవరినో మెప్పించడం నా మనస్తత్వానికి విరుద్దం. వాళ్ళు ఏమో అనుకుంటారని ఎందుకు అనుకోవాలి. అనుకుంటే అనుకోని… వాళ్ళిష్టం… ఎట్లన్న అనుకుంటారు. దానికి మనమెందుకు బాధపడాలి.

***

ఏవేవో మధనాలు… అంతర్మధనాలు, అనుభవాలు, పరాభవాలు, దుఃఖాలు, అలుపెరుగని జీవన పోరాటాల మధ్య నాలుగేండ్లు గడిచాయి.

ఉద్యోగం వచ్చింది. కౌన్సిలింగ్ కు రమ్మన్నారు పోస్టింగ్ కోసం. కౌన్సిలింగ్ రాత్రి పగలు లేకుండా నడుస్తున్నది. చాలా చీకాకుగా ఉన్నది. బయటకు వెళ్లి వచ్చాను. ఈ లోపు నన్ను పిలిచారు. ఎక్కడ పనిచేస్తావంటే చెప్పాను. తెల్లవారి ఆర్డర్స్ ఇస్తామన్నారు.

ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి వచ్చి పలకరించిది. తన పేరు చెప్పింది. నేను గుర్తు పట్టలేదు. ఊరు పేరు చెప్పింది. గతం గుర్తు చేసింది. ఓహో మీరా అన్నాను. ఇక్కడేం చేస్తున్నారన్నాను. పోస్టింగ్ ఆర్డర్స్ కోసం తను కూడా వెయిటింగ్ చేస్తుందట. మళ్ళీ ఒకసారి గతం కదలాడింది కళ్ళ ముందు. ఆనాటి తన జీవితం గుర్తుకొచ్చింది.

పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్నాక మిత్రుడి ఇంటికి వెళ్ళాను లగేజి తీసుకొని బయలుదేరటానికి. అక్కడికి తను కూడా వచ్చింది. నా మిత్రుడు వాళ్ళకు బంధువులు అవుతారట.

మళ్ళీ ఉద్యోగం గురించి చర్చ… మధ్యలో తనకు పెళ్లి కుదిరింది అన్నది. అబ్బాయి చదువుకున్నాడట. తెలిసిన వాళ్ళే నట. ఉద్యోగం లో జాయిన్ అయ్యాక పెళ్లి అని చెప్పింది.

“తొందర పడ్డావేమో” అన్నాను.

“లేదు” అన్నది. “ఇంట్లో చేసుకో అన్నారు. మొదట్లో తటపటాయించిన. అయినా ఆడవారి ఇష్టాయిష్టాలకు విలువ లేదంది. మంచో చెడో తప్పదని ఒప్పుకున్నాను. ఏం చేయలేను కదా. ఎట్లా చెప్పాలి వాళ్లకు? జరిగేది జరుగుతుంది… చూస్తూ ఉండవలసిందే… బహుశా అమ్మాయిల జీవితాలు ఇంతేనేమో…”

ఆకాశంలో నల్ల మబ్బు… నాలుగు చినుకులు రాల్చేసి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది.

మళ్ళీ మొదలుపెట్టింది. “నిజమే ఆడవారి మాటలకూ విలువ ఎక్కడుంది… ఎంతసేపు ఆడవాళ్ళను ఎలా పంపించాలని చూసేవారు తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టాలని ఆలోచించేవారు లేరు కదా. అయిన తనేం చేస్తుంది. లోకులు పలు గాకులు. ఎప్పుడు ఏదో ఒకటి అంటారు. వాళ్ళకు ఏం చెపుతాం. స్త్రీ దేవత అంటారు కానీ నిజంగా దేవతను ఇలాగేనా చూసేది. ఆడవారి చదువుల పట్ల ఎగతాళి. వాళ్ళ వేషధారణ పట్ల చులకన. ఒంటరిగా ఒక అమ్మాయి రోడ్ మీద నడిచే పరిస్థితి లేదు.” ఇది అని చెప్పలేని స్థితి తనది.

“గతంలో ఏం జరిగింది అనవసరం. ఇప్పుడు ఏం చేస్తావో ఆలోచించు. నీవు తీసుకునే నిర్ణయాలకు నీవే బాధ్యురాలవు. మంచి ఏదో చెడు ఏదో నీకు తెలుసు. ఎక్కడో ఒక దగ్గర నీ అభిప్రాయాలూ చెప్పవలసిందే. గతం ఏది నీ చేతుల్లో లేదు. గత గాయం నీ ప్రమేయం లేకుండా జరిగింది. మరి వర్తమానం అంతే అయితే ఆర్థం ఏమిటి? ఏ మనిషి అయినా తన అనుభవాల నుండి నేర్చుకుంటాడు. నేర్చుకోకపోతే అతని ఉనికి మాయమైపోతుంది. డార్విన్ చెప్పింది అదే. మనుగడ కోసం పోరాటం చేయవలసిందే. చేతులు కాలాక ఆకులూ పట్టుకుని ఏం లాభం? ఆలోచించు. నీ జీవితాన్ని నీవే రివ్యూ చేసుకో. ఏం చేయాలో అర్థమవుతుంది. పదే పదే తప్పులు చేయకు. ఇప్పటికిప్పుడు పెళ్లి అవసరం లేదనుకుంటాను. నీకు ఇష్టం లేకపోతే నిర్ణయం తీసుకో. గత గాయం మళ్ళీ రిపీట్ కాకుండా. జీవితంలో ఒడిదొడుకులుంటాయి. అర్థం చేసుకోవాలి. నేర్పుగా తప్పుకోవాలి. సమస్యలు ఎదురయినపుడే మనవాళ్ళు ఎవరో తెలుస్తుంది. సమస్యలకు భయపడి పారిపోవలసిన అవసరం లేదు. పారిపోతే సమస్యలు పరిష్కారం కావు. నీ లాంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ అందరి కంటే నేవే మెరుగయిన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది. నీ కాళ్ళ మీద నిలబడే అవకాశం వచ్చింది. అవకాశాన్ని జారవిడుచుకోకు. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంకా చాల జీవితం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకో. ఇలా చెబుతున్నానని ఏం అనుకోవద్దు. ఇక నీ నిర్ణయం నీ ఇష్టం.” అంటూ వెళ్ళిపోయాను.

రెండు మూడు ఏండ్ల తరువాత ఒక టెలిగ్రామ్ వచ్చింది. పెళ్ళికి రమ్మని తన నుండి. ఆశ్చర్యం గా పెళ్లయిన తెల్లవారి నాకు టెలిగ్రామ్ అందింది. పెళ్లి రోజు సెలవనుకుంటాను. సెలవులలో టెలిగ్రామ్ వాళ్ళు పని చేయరు కదా. అందుకే ఆలస్యంగా అందింది.

తరువాత తెలిసింది ఏమిటంటే తను అప్పటి పెళ్లి రద్దు చేసుకుందట. వాళ్ళ బంధువు చెప్పాడు. తరువాత తనతో మాట్లాడాలనుకున్నాను. కానీ కుదరలేదు. నిజానికి రద్దు చేసుకోవలిసిన సందర్భాల్లో రద్దు చేసుకోకపోవడం వలన ఎంతమంది కూతుర్లు తల్లిదండ్రులకు కూతుర్లు కాకుండా పోయారో…

ఒక స్త్రీ కి ధైర్యం ఇస్తే ఎలా నిర్ణయాలు తీసుకోగలదో అర్థమైంది. నేను చెప్పిన మాటలే పనిచేసినాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తన జీవితం తనకు నేర్పిన అనుభవాల నుండి తను నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చింది. సమస్యల్లో ఉన్నవారిపట్ల సానుభూతి చూపడం, సరియైన నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రోత్సహించడం, అవసరమయితే సహాయంగా ఉంటామని ధైర్యం చెప్పడం… మనుషులుగా మనం నెరవేర్చాల్సిన బాధ్యత.

***

ఛ ఛ… ఏంటిదంతా… ఏం ఆలోచిస్తున్నాను.

నిజమే బలహీనుల పక్షమే నిలబడాలి.

ఏం చెప్పామన్నదే ముఖ్యం, ఎటు నిలబడ్డామన్నదే ముఖ్యం. మాట శక్తివంతమైన ఆయుధం కదా! ఏదేమైనా పిల్లల కోసం నిలబడాలి… ఏదయితే అదే అవుతుంది.

జాతి భవిష్యత్తు పిల్లలు. వాళ్ళని దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్ది, మనుషులుగా తయారు చేయవలసిన బాధ్యత విద్యాలయాలది కదా.

నీరు నిలువ ఉంటే మురిగిపోతుంది. ప్రవహించే నీటికే విలువ ఉంటుంది. పురిటి నొప్పులకు తల్లి భయపడితే బిడ్డ ఎలా బయటకు వస్తుంది? పండ్ల నిచ్చే చెట్లకే రాళ్ల దెబ్బలు…తెలవంది కాదు కదా. లెనిన్ కూడా అన్నాడు ప్రజలకు ముందు నడువకు, వెనుక నడువకు. ప్రజలతోనే నడువుమని.

కాలేజీ లోకి అడుగుబెట్టానో లేదో “ఎక్కడికి పోయారు సర్ మీ కోసం పిల్లలు స్టాఫ్ రూమ్ కు పోయారు” రోజూ నాతో టీ కి వచ్చే మిత్రుడి పలకరింపు…

“బ్లూ మూన్ దాక పోయిన. టీ తాగిన”.

“అయ్యో మేము కూడా వచ్చేవాళ్ళం కదా”

“అట్లా ఆలోచించలేదు” అనుకుంటూ నాలుగు అడుగులు వేసానో లేదో పిల్లలు ఎదురొచ్చారు.

“సర్ మీ కోసమే స్టాఫ్ రూమ్ కు పోయాం ఏమైనా చేద్దాం. చెత్త ఏదో ఒక రోజు కొట్టుకుని పోతుంది. పురుగు పట్టిందని రైతు వ్యవసాయం చేయకుండా ఉంటాడా? ఏటికి ఎదురీదుదాం. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడుదాం. తప్పదు. ఆపరేషన్ అవసరం. మనమే శస్త్ర చికిత్స చేద్దాం. ఒక రకంగా షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం.

ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచిద్దాం. చెట్ల కింద కూర్చుందామా, స్టాఫ్ రూమ్ కు వెళ్దామా?”

చెట్ల కింద వాతావరణం చల్లగా ఉందంటూ వాళ్ళే దారి తీసారు.

గాలి బలంగా వీస్తోంది…అయినా పిల్లలు దీన్ని లెక్క చేసేటట్లు కనబడలేదు. మాట్లాడుకోవడం కోసం… ముందుకే అడుగులేస్తూ… వాళ్ళు.

ఏం చేస్తారో ఏం చేయరో అది వేరే విషయం. కానీ వాళ్ళు ఏం చేయడానికైనా, వాళ్లు మరొకసారి ఆలోచించడానికి అయినా, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి అయినా, లేదా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటానికి అయినా, చెప్పదలుచుకున్న మాట, చెప్పాల్సిన వాళ్ళు, చెప్పాల్సిన సమయంలో, ఏదైమైనా చెప్పి తీరడం ముఖ్యం!

ఎవరికి వాళ్లు ఏం చెబుతాంలే అని అందరూ మౌనంగా ఉండి పోతే- మనకెందుకులే అని నిస్తేజంగా ఉండిపోతే, చెప్పేవాళ్లు లేక, ఆ ఒక్క మాట… అందక ఎంతమంది ఏమవుతున్నారు? ఎన్ని జీవితాలు కాలిపోతున్నాయి?

చెప్పదలుచుకున్న మాటేదో సూటిగా చెప్పి తీరడానికన్నట్టు నేను…! అయినా గురి చూసి పాడే పాటో, మాట్లాడే మాటో బయటకు రావాల్సిందే కదా ఎప్పు డైనా…! ఎట్లాగైనా…!

Leave a Reply