చెంపదెబ్బకు ఎదురుదెబ్బ ‘థప్పడ్‌’

1990. జగదేక వీరుడు చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవిని ఒక చెంపదెబ్బ కొడతాడు. కథ ప్రకారం ఆఫ్టరాల్‌ ఒక ‘మానవ’ టూరిస్టు గైడ్‌ ఒక దేవతా స్త్రీని కొడతాడు. అయినా ఆ దేవకన్యకు మానవుడిపై కోపం రాదు. ఎందుకంటే అతగాడు తను ఇష్టపడ్డ ‘మగాడు’ కాబట్టి. మగాడు ఆడదాన్ని కొట్టడం పెద్ద ఇష్యూ కాదు బొడ్డు రాఘవేంద్రరావుకి. అందుకే శ్రీదేవి చేత ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ని అంత ‘కమ్మ’గా పాడించాడు. చెంపదెబ్బ పాట ఆ తర్వాత రొటీన్‌ ఐపోయింది ‘వారసుడొచ్చాడు’ వగైరా సినిమాల్లో.

2017. విష పుంసత్వం తలకెక్కిన తిక్క మనిషి ‘అర్జున్‌ రెడ్డి’. ప్రీతిని తను ఇష్టపడితే చాలు, ఆ అమ్మాయి ఇష్టాయిష్టాల ప్రమేయమే లేదతడికి. ముఖ్యమైన నిర్ణయాన్ని ఆరు గంటల్లోగా విన్పించలేదని ఆమె చెంప ఛెళ్లుమనిపిస్తాడు. ఆమె ఏడుస్తుంది కాని కోపం తెచ్చుకోదు. రెండేళ్ల తర్వాత ఈ సూపర్‌ హిట్‌ సినిమా హిందీలో వచ్చింది. ‘కబీర్‌ సింగ్‌’ అదే చెంప దెబ్బను మరింత సౌండ్‌ ఎఫెక్ట్‌తో కొట్టాడు. ఈసారి మాత్రం స్త్రీవాదులు కొంత గొడవ చేశారు. కానీ దర్శకుడు సందీప్‌ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఇలా సమర్ధించుకున్నాడు. ‘‘స్త్రీ పురుషులిరువురూ గాఢమైన ప్రేమబంధంలో వున్నప్పుడు దాన్ని భౌతికంగా ప్రదర్శించుకునే హక్కు వుంటుంది. అటువంటప్పుడు చెంపదెబ్బలో నాకు పెద్ద విశేషమేం కన్పించడం లేదు.’’

2020. ‘థప్పడ్‌’ సినిమాలో – ‘‘వెన్‌ యూ ఆర్‌ ట్రూలీ ఇన్‌ వ్‌, ఆ మాత్రం కొట్లాట ప్రేమ వ్యక్తీకరణే కదా?’’ అనంటాడు, హీరో ఫ్రెండ్‌ తమ వైపు లాయర్తో. ఇది నేరుగా రెడ్డి గారికి పెట్టిన చురకే అని మనకర్ధమవుతుంది. ఒక్క చెంపదెబ్బ! ప్రేమించే భర్తే కావచ్చు, మొదటిసారే కావచ్చు, మనసు బాగా పాడయిన సందర్భంలోనే కావచ్చు, అప్రయత్నంగానే కావచ్చు! భార్యను కొట్టే అధికారం భర్తకెవరిచ్చారు? మరిచిపోయి సర్దుకుపోవాలని ఎవరైనా ఎందుకు చెప్పాలి? ‘థప్పడ్‌’ సినిమా ఈ ప్రశ్నల్ని కెలుకుతుంది. సమాజ నైతికతలో సర్వసాధారణమైపోయిన విలువల్ని షాక్కి గురిచేసి పునరాలోచించమంటుంది. మతతత్వంపై ‘ముల్క్‌’, కులతత్వంపై ‘ఆర్టికల్‌ 15’ సినిమాలు తీసిన అనుభవ్‌ సిన్హా స్త్రీ పురుష సంబంధాలపై తీసిన మరో ప్రయోజనకర సినిమా ‘థప్పడ్‌’.

కథ విషయానికొస్తే ….

అది డిల్లీలోని ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం. అమృత (తాప్సీ పన్నూ) ఆ ఇంటి కోడలు. క్లాసికల్‌ డాన్సర్‌ కావాల్సిన ఆ అమ్మాయి తన కేరీర్ను వదిలి, పెద్దింటి కోడలుగా సెటిలై, మంచి ‘హౌస్‌ వైఫ్‌’ అనిపించుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తూంటుంది. అలార్మ్‌ గొంతునొక్కుతూ అందరి కంటే ముందే నిద్ర లేస్తుంది. డోర్‌ బయటి పాల సీసాలు, న్యూస్‌ పేపర్‌ కలెక్ట్‌ చేయడం, టీ మరిగించి భర్తను మేల్కొలపడం, మొక్కలకు నీరు పోసి టీ సిప్‌ చేస్తూ సుప్రభాతాన్ని సెల్లో బంధించడం, పక్కింటావిడకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పడం, అత్తయ్య షుగర్‌ చెక్‌ చేయడం, ఆ తర్వాత వంట రాకపోయినా ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం, భర్తను ఆఫీసుకు బయల్దేరిస్తూ అతడు తినలేకపోయిన టిఫిన్ను కారు వరకూ పోయి తినిపించడం, పక్కింటి పిల్లకు డాన్స్‌ నేర్పడం, పనులన్నీ పూర్తయ్యాకే భర్త పక్కకు చేరడం – ఇదీ ఆమె అనుదినచర్య. తనకంటూ వేరే కల లేదు, భర్త కలే తన కల! భర్త లండన్‌ పోస్టింగ్‌ ఖాయం కాక ముందే ఊహల్లో లండన్‌ చేరిపోయే పిచ్చిపిల్ల.

అమృత భర్త విక్రమ్‌ (పావైల్‌ గులాటీ). తండ్రి బిజినెస్‌ చూసుకునే అవకాశమున్నా, అది కాదని, తన సత్తా చూపడానికి కార్పొరేట్‌ నిచ్చెన మెట్లపై అగ్రస్థానానికి చేరాలనుకునే కేరీరిస్టు. ఆ దిశలో ఏది అడ్డొచ్చినా తట్టుకోలేడు. మామూలుగా ప్రమాదరహిత వ్యక్తిలా కన్పించే అతని స్వభావంలోని చీకటి కోణాలు అతడి మాటల్లో బహిర్గతపడుతుంటాయి. హిందీ సంభాషణలు గ్రహించలేకపోతే ఈ పాత్ర మనకు అర్ధం కానట్టే! ‘‘అమృతా! ‘నీ’ ప్రింటర్‌ పనిచేయటం లేదు చూడు’’ అని కాస్త వెటకారపు ధ్వనితో మాట్లాడతాడు. స్త్రీల పట్ల అతడి అభిప్రాయాలెలా వుంటాయో మరికొన్ని మాటల్లో చూడొచ్చు. ‘‘(పాత గర్ల్‌ఫ్రండ్‌) పింకీ చటర్జీ నుండి ఫోన్‌ వచ్చింది, ఆమెకు పెళ్ళట!’’ అని భార్య చెబితే, ‘‘ఓహ్! దానికీ ఎవడో దొరికాడన్నమాట!’’ అని జవాబిస్తాడు విక్రమ్‌. ‘‘ఈ ఆడాళ్లు బండి వేసుకుని రోడ్డున పడతారెందుకో!’’ అని కారు నడుపుతున్నప్పుడంటాడు తన స్నేహితుడితో మరో స్త్రీని ఉద్దేశించి. తమ పక్కింటి విధవరాలు శివానీ తన కంటే పెద్ద కొత్తకారు కొనుక్కోవడం అక్కసుగానే వుంటుందతడికి. ‘ఆమె కష్టపడి సంపాదిస్తోంది’ అని భార్య చెప్పే మాట పెద్దగా రుచించదతడికి. తన భర్తలో లోపాలేమిటి అన్నంత ధీమాగానే వుంటుంది అమృతకు, ఆ రాత్రి ఆ సంఘటన జరిగే వరకూ!

కీలక సన్నివేశం:

విక్రం లండన్‌ ప్రమోషన్‌ ఖాయమౌతుంది. దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఆ రాత్రి వారింట్లో 40 మంది బంధుమిత్రులతో ఒక అర్జెంటు పార్టీ ఏర్పాటౌతుంది. విందు, చిందు సాగుతుంటే విక్రమ్‌కు బాస్‌ థాపర్‌ (‘థప్పడ్‌’కు దగ్గరి పదం) నుంచి ఫోనొస్తుంది. లండన్‌ ఆఫీసుకు తనే రారాజని అనుకుంటుండగా, తను మరో తెల్లవాడి సబార్డినేట్‌గా, ‘సెకెండ్‌ మ్యాన్‌’గా వుండాలన్న దుర్వార్త చెబుతాడు థాపర్‌. తట్టుకోలేక పోతాడు విక్రం. ‘దీని వెనక రాజ్‌హంస్‌ కుట్రే దాగివుంది’ అనుకుని పార్టీ మధ్యలోనే అతడితో తగువుకు దిగుతాడు విక్రం. అన్నయ్య ఆపినా, స్నేహితుడు వారించినా వినడు. చివరికి అమృత అతడి చెయ్యిపట్టి వెనక్కి లాగేసరికి, తన నిస్పృహనంతా, కోపాన్నంతా ఆమె బుగ్గమీద చూపించేస్తాడు – పార్టీ కొచ్చిన వారు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా! ఊహించని ఈ దెబ్బకు నిశ్చేష్టురాలౌతుంది అమృత. అది ఆమె చెంపపై కంటే మనసుపై ఎక్కువగా తగుల్తుంది. ఆత్మ గౌరవంపై తగుల్తుంది. తన భర్త మంచోడన్న పిచ్చి నమ్మకంపై తగుల్తుంది.

ఒక వైపు పార్టీ నడుస్తూనే వుంది. అమృత కిమ్మనకుండా మెల్లగా అక్కడ్నుంచి, ఆ పార్టీలోంచి, మేడపై తన గదిలోకీ, తన లోలోపలికీ కుంచించుకు పోతుంది. జరిగిన అన్యాయాన్ని ఖండించాలన్నట్టు కాక, ఆడవాళ్లు కాస్త సర్దుకుపోవాలన్నట్టు వుంటాయి చుట్టుపక్క వాళ్ల రియాక్షన్లు. ‘‘విక్రంకి ఏదో ఫోన్‌ వచ్చింది, చాలా చీకాకుగా వున్నాడు’’ – అంటూ మరిది తరుపున సంజాయిషీ ఇస్తుంది పెద్దకోడలు! ‘‘అమృతా! ఇంట్లో అతిథులు వున్నారు. ఏమనుకుంటారు? పద! ఇది మన ఆంతరంగిక విషయం (కాశ్మీర్‌ లాగా!)’’ – అత్తయ్య (తన్వీ ఆజ్మీ) సముదాయింపు! ఆ మాటలేం అర్ధం కావడం లేదు అమృతకు! ఆ ఇంట్లో తన స్థానమేమిటన్న ప్రశ్న దగ్గరే వుంది ఆమె ఆలోచన! జరిగినదానికి బాధగా వున్నా, కూతురి సంసారం సర్దుకోవాలన్న ఆదుర్దా అమృత తల్లిది (రత్నా పాఠక్‌). తన చిట్టి తల్లి చెంప మీద పడ్డ దెబ్బ తన గుండె మీద పడినట్టైంది అమృత నాన్నకు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన మొదటి సంఘటన కాబట్టి సర్దుకోవడం మంచిదన్న ఆలోచన అమృత తమ్ముడిది. అతడి ప్రియురాలు స్వాతి (నైలా గ్రేవల్‌) మాత్రం అమృతకు అన్యాయం జరిగిందని భావిస్తుంది.

హీరో గారికి తన కేరీర్‌పై పడ్డ దెబ్బే పెద్దదిగా వున్నట్టుంది. ఆ రాత్రి ఎంత సేపు, ఎంత తాగి తన ఫ్రస్ట్రేషన్‌ తీర్చుకున్నాడో తెలీదు. అమృతకు మాత్రం ఆ రాత్రి కునుకు పడితే ఒట్టు. సామాన్లు ఇటునుండి అటు సర్దేస్తూ, తుడిచినవే మళ్లీ తుడిచేస్తూ, సోఫా సెట్లు ఇక్కడ్నుంచి అక్కడికి జరిపేస్తూ, తన కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తుంది. రాత్రంతా జాగారం చేసి, లోలోపల ఆలోచనల సునామీలు ఎగిసిపడుతుండగా, తెల్లవారే సరికి శాంత సముద్రంలా మారుతుంది అమృత. మళ్లీ అదే రొటీన్‌. యాంత్రికంగా తన పనుల్లో తను పడుతుంది. ‘విక్రం సరిగా నిద్రపోయాడా?’ అన్నది అత్తయ్య ప్రశ్న. ఉదయం నిద్రలేచిన విక్రం భార్యకు బేషరతుగా క్షమాపణ చెప్పే ఆలోచన చేయడు. ‘సునీతా (పని మనిషి), జ్వరం మందు తీసుకురా’ అంటూ భార్య సింపథీ సంపాదించడానికి ఒక ఎత్తు వేస్తాడు. ఆశించిన రియాక్షన్‌ లేకపోయేసరికి అమృత చేయి పట్టి, భుజంపై తల ఆన్చి – ‘‘థాపర్‌ ఫోన్‌ రావడం, రాజ్‌హంస్‌ కుట్ర (నిజానికది అనుమానం మాత్రమే) తెలిసి రావడం, ఆ మధ్యలోకి నువ్వు రావడంతో కోపమంతా నీపై తీర్చుకోవడం జరిగిపోయింది అమూ (అమృత)’’ అని అంటాడు. కానీ ఆ వెంటనే ‘‘ఛీ, నా గురించి జనాలు ఏమనుకుంటారు?’’ అని గొణగడంతో ఈ మగాడికి సొంత పరువు ప్రతిష్టల ఆలోచనే గానీ, తన మనసుకు తగిలిన గాయం పట్టింపు లేదు అని అర్ధమవుతుంది అమృతకు. ‘‘మూడేళ్లు ఈ కంపెనీలో పనిచేశాను. నా ఇమోషన్స్‌ ఇన్వెస్ట్‌ చేశాను. కంపెనీ నాదనుకున్నాను. నాకు విలువే లేదని హఠాత్తుగా ఓ రోజు తెలిస్తే ఎలా వుంటుంది? అందుకే ఈ కంపెనీ వదిలేయానుకుంటున్నాను’’ అంటూ విక్రం చెప్పుకుంటూ పోతుంటే తనకేదో దిశా నిర్దేశం దొరికినట్టనిపిస్తుంది అమృతకు. తెల్లని వస్త్రం చావుకు చిహ్నం. అమృత వేసుకున్న తెల్లని బట్టలు భర్తతో ఆమె సంపర్కం మరణించిందనడానికి ప్రతీకాత్మకంగా ఉంటాయి.

విడాకులకు దారితీసిన దెబ్బ:

అమ్మగారింటికి వెళ్లిన అమృతను ఒప్పించి రప్పించే బాధ్యత విక్రందే. కానీ అతడి పురుషాధిక్యత అతడు సరైన పద్ధతిలో వెళ్లనీకుండా అడ్డుపడ్తుంది. ఖరీదైన నగతో అమృతను పడేద్దామనుకుంటాడు మొదట్లో. కానీ ఆ ఎత్తు పారక కాస్త వాగ్వివాదం జరగ్గానే, ధనికుల సంబంధం కోసం మొదట సంప్రతింపులు చేసింది అమృత వాళ్లే అని దెప్పిపొడిచి రసాభాస చేస్తాడు. ఇక అమృత దగ్గర విడాకులు తప్ప వేరే ఆప్షన్‌ లేదు. ‘‘అడవాళ్లు కాస్త ఓర్చుకోవాలి’’ అని అమ్మ చెప్పినా, ‘నీ ఇళ్ళు అక్కడ’ అని తమ్ముడు గుర్తుచేసినా ఆమె నిర్ణయం మారదు. నాన్న బేషరతుగా అందించిన సపోర్టుతో, తమ్ముడి ప్రేయసి స్వాతి సహాయంతో లీగల్‌ ప్రాసెస్‌లోకి వెళుతుంది. ‘ఒక్క చెంపదెబ్బ విడాకులుకు కారణం ఎలా ఔతుంది?’ అందర్లాగే లాయర్‌ కూడా ప్రశ్నిస్తుంది.

‘‘ఒక్క చెంపదెబ్బే కావచ్చు. కానీ కొట్టకూడదు. (కొట్టే హక్కు లేదు) నేను ఆనందంగా వుండాలనుకుంటున్నాను. నేను ఆనందంగా వున్నానని చెప్పేటపుడు అది అబద్దం చెపుతున్నట్టనిపించ కూడదు.’’

‘‘ఆ ఒక్క చెంపదెబ్బతో ఏమైందో తెలుసా? అప్పటి వరకూ పట్టించుకోకుండా దాటేస్తూ వచ్చిన చాలా అనుచిత, అన్యాయమైన సంగతులన్నీ స్పష్టంగా కళ్లముందు కన్పించినట్టైంది’’ – మరోచోట అమృత.

‘‘ప్రతి సంబంధంలోనూ లోపాలుంటాయి. కలిపి వుంచాలి.’’ – లాయర్‌ నేత్ర.

‘‘కలిపి వుంచాలని అంటున్నామంటే, అది ముక్కలైవున్నట్టే కదా?’’ – అమృత.

శక్తివంతమైన సంభాషణలు – అర్ధవంతమైన దృశ్యాలు:

‘‘కంపెనీలో నిన్ను నువ్వు ఇన్వెస్ట్‌ చేసుకున్నావు. అందుకని ‘మూవ్‌ ఆన్‌’ కాలేకపోతున్నావ్‌. నేను నా జీవితాన్ని నీతో ఇన్వెస్ట్‌ చేసుకున్నాను. ఎలా మూవ్‌ ఆన్‌ అవ్వాలి?’’ అమృత ప్రశ్న తన భర్తకు.

‘‘అతడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు. మొదటి సారే. కానీ కొట్టకూడదు. ఈపాటి సంగతే. నా పిటీషన్‌ కూడా ఈపాటిదే.’’ ఇలాంటి చిన్న చిన్న శక్తివంతమైన డైలాగులు ఈ సినిమాకు ప్రాణం.

‘‘తప్పేదో జరిగిపోయింది నాన్నగారూ? ఇక జరగదు కదా?’’ అని విక్రం తన మామగారితో అన్నప్పుడు “జరిగిందన్నది కాదు, ఎందుకు జరిగిందన్నది ప్రశ్న” అని జవాబిస్తాడాయన. కవితలు రాయడం, చదవడం ఇష్టపడే ఆయన రామ్‌ధారీ సింగ్‌ ‘దినకర్‌’ రాసిన ‘సమర్‌ శేష్‌ హే’ అనే సుప్రసిద్ధ కవితను విన్పిస్తాడు. అందులోని ఆఖరు పంక్తి ‘జో తటస్థ్‌ హే, సమయ్‌ లిఖేగా ఉన్కా భీ అపరాధ్‌’ (తటస్థంగా వున్నవాళ్లు చేస్తున్న నేరాన్నీ కాలం లిఖిస్తుంది.) నేటి పరిస్థితిలో మధ్యస్థాన్ని పాటిస్తున్న బుద్ధిజీవులకూ, కళాకారులకూ హెచ్చరికలా వుంటుంది.

‘‘కోర్టులో ‘మన్‌ కీ బాత్‌’ చెల్లదు’’ – అమృతతో లాయర్‌ అన్న మాట ఎవరి మీద సెటైరో మనకర్ధమౌతూనే వుంది.

ఇల్లాలి పనికి జీతం వుండదు. కానీ ప్రతి చిన్నపనీ చాలా అవసరమైనదే. ఆ సంగతిని చక్కగా చూపాడు దర్శకుడు విక్రం తన మార్నింగ్‌ టీ తనే కాచుకోబోయిన దృశ్యంలో. పురుషుల సమస్త కష్టాలకూ స్త్రీలే కారణమనే జోకులన్నీ స్త్రీల శ్రమను అనుభవిస్తూ స్త్రీలపై వివక్ష చూపేవే. ‘చెంపదెబ్బ ప్రేమకు చిహ్నం’ అని చెప్పిన వ్యక్తే మరోచోట పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి – ‘‘ఏం వదిన గారూ? నేను ఆనందంగా వుండడం మీకు నచ్చడం లేదా?’’ అనంటాడు.

చక్కని నటీనటులు – ప్రతి పాత్రకూ ప్రాధాన్యత:

అమృత పాత్రలో అద్వితీయంగా నటించింది తాప్సీ. డైలాగ్‌ డెలీవరీ ఎంత బాగా చేసిందో, మౌనం ద్వారా మనోభావాల్ని అంతే బలంగా పలికించింది. ఆమె నాన్న పాత్రలో కుముద్‌ మిశ్రా ఆ పాత్రను సొంతం చేసుకున్నాడు. తన భార్యను ‘సంధ్యాజీ’ అని గౌరవంగా సంబోధించే వ్యక్తిత్వం గల ఆయన – ‘ఒప్పు అనుకునే మనం ఏ పనైనా చేస్తాం నాన్నా! కానీ ఒప్పు చేసినందుకు ఫలితాలు ప్రతిసారీ హ్యాపీగా వుండక పోవచ్చు’ అని కుమార్తెకు నైతిక మద్దతు ప్రకటించే దృశ్యం హృద్యంగా వుంటుంది. అమృతకు ఆమె అత్తయ్యతో వున్న స్నేహబంధం కూడా చక్కగా చూపించారు. అందుకే అత్తయ్య నుండి తనకు అవసర సమయంలో తగిన మద్దతు దొరకనందుకు చాలా బాధపడినట్టు మనసుకు హత్తుకున్నట్టు చెబుతుంది అమృత. ‘‘నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. నా శాయశక్తులా మీకు సేవ చేయడానికి ప్రయత్నించాను. కానీ మీరు నన్ను తగినంత సపోర్టు అందివ్వలేదు. ఆ విషయాన్ని నేనెప్పటికీ క్షమించలేనప్పుడు, మీతో ఎలా కలిసి వుండగను?’’ అన్న సుతిమెత్తని ప్రశ్నకు అత్తయ్య కళ్లలోనే కాక, ప్రేక్షకుల కళ్లలోనూ నీళ్లు సుళ్లు తిరుగుతాయి. ‘‘నా కుమారులను ఇంకాస్తా మంచిగా పెంచాల్సింది’’ అని అత్తయ్య జవాబు చెప్పక తప్పలేదు. అత్తయ్య ప్రమాదంలో వుందని తెలిసినపుడు అమ్మగారింటి నుంచి పరుగున వచ్చి కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడినది అమృత అయితే, పక్కన నిల్చుని భోరున ఏడుస్తూ మార్కులు కొట్టేసే క్యారెక్టర్‌ పెద్ద కోడలిది. అమృత లాయర్‌ నేత్రా జైసింగ్‌ (బహుశా ఇందిరా జైసింగ్‌కు గౌరవంగా పెట్టిన పాత్రేమో!) కూడా మరో పురుషాధిక్య బాధితురాలు. మామయ్య, భర్త కీర్తి ఛాయల్లో బతుకుతున్న ఆమె ఒకవైపు సెక్సువల్‌ హెరాస్మెంట్‌ కేసును గెల్చి సెలబ్రిటీ ఐపోయినా, తమ ఇంట్లో తనే అలాంటి బాధితురాలు. టీవీలో నేత్ర విజయాన్ని చూపుతుంటే, ఆ ప్రక్కనే ఆమె భర్త (మానవ్‌ కౌల్‌) ఆమెతో చేస్తున్నప్రవర్తన మనం గమనించదగ్గది. అమృత పట్టుదల నేత్రలోని ఆత్మ గౌరవ లోపాన్ని సరిచేసి, ఆమె జీవిత నిర్ణయానికి దారితీస్తుంది. నేత్రకూ, అబ్బాయి పక్షం లాయర్‌కూ (రామ్‌ కపూర్‌) వాదన జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. పనిమనిషి సునీతగా అద్భుతంగా నటించింది గీతిక వైద్య. ‘మమ్మీజీ’ అన్న పిలుపు లోని వేరియేషన్స్‌ వింటే తెలుస్తుంది ఆమె నటనా ప్రతిభ ఏంటో. రోజూ తాగొచ్చిన భర్త బాదుడు భరించే ఆమెలో సడన్‌ మార్పు రావడం మాత్రం కొంచెం కృతకంగా అన్పిస్తుంది. విధవరాలు శివానిగా దియా మీర్జా వెండితెరపై సరికొత్తగా తనను తను ఆవిష్కరించుకుని హుందాగా నటించింది.

సాంకేతికంగా:

చాలా చక్కని స్క్రిప్టు రాసినందుకు అనుభవ్‌ సిన్హా, మృణ్మయీ లాగూలను అభినందించాలి. చక్కగా తెరకెక్కించిన ‘అనుభవ’జ్ఞుడికి మరింత క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. మంగేశ్‌ ధడ్కే నేపథ్య సంగీతం దృశ్యాల ఇంపాక్టును పెంచేలా అద్భుతంగా వుంది. అనురాగ్‌ సైకియా స్వరపరిచిన ‘ఏక్‌ టుక్‌డా ధూప్‌కా’ పాట వింటే ఏ.ఆర్‌. రెహమాన్‌ ‘యెజో దేశ్‌ హే మెరా స్వదేశ్‌ హే మెరా’ (‘స్వదేశ్‌’ సినిమా పాట) గుర్తొస్తుంది. పాటలోని సన్నాయి ధ్వని ఒళ్లు జలదరింప జేస్తుంది. ఈ సినిమా సకాలంలో వచ్చిన మంచి సినిమా. ‘ఇది హిందీ సినిమాల్లో ఒక మైలురాయి’ అని ప్రశంసించాడు సినీ రచయిత జావేద్‌ అఖ్తర్‌. ఇది పురుషవ్యతిరేక సినిమా కాదు, పురుషుల కళ్లు తెరిపించే సినిమా. చాలా మందికి నచ్చి ఓ మాదిరి బిజినెస్‌ చేస్తున్న తరుణంలో ఈ సినిమా కరోనా బారిన పడడం విషాదం.

పూర్తి పేరు అయిక బాలాజీ. 1990లో చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపకుల్లో ఒకరు. ప్రస్తుత సంపాదకులు. ‘జన విజ్ఞాన వేదిక’ పశ్చిమ బెంగాలు శాఖ అధ్యక్షులు . ‘బాలాజీ’ (కోల్‌కతా) పేర సాహిత్యం, సైన్సు వ్యాసాలు , సినిమా సమీక్షలు , అనువాదాలు రాస్తుంటారు. ‘ముందడుగు’, ‘ప్రజాసాహితి’, ‘రస్తా’ (వెబ్‌ మ్యాగజైన్‌), ‘సైన్స్‌ - హేతువాదం’, ‘ప్రజాశక్తి’, ‘మాతృక’ తదితర పత్రికల్లో ఇతని రచనలు వస్తుంటాయి. గతంలో ‘మందుల మాయాబజార్‌’ అనువాద రచన, ఇటీవల ‘అసత్య ప్రేలాపనలు – సైన్సు సమాధానాలు’ పుస్తకం వెలువడింది. ‘ముందడుగు’ తరుపున స్లయిడ్‌ షోలు, టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతిశీల విమర్శకులు. కోల్‌కతాలో నివసించే సామాజిక కార్యకర్త. వృత్తిరీత్యా బ్యాంక్‌ ఉద్యోగి.

One thought on “చెంపదెబ్బకు ఎదురుదెబ్బ ‘థప్పడ్‌’

  1. ఈమధ్య ఇంతచక్కటి పదాలతో, భావాలతో రాసిన వ్యాసాన్ని, సమీక్షని చూడలేదు. ఇంటర్ నెట్ ని నింపేస్తున్న నాసిరకపు రాతలు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తుండడం వల్లనో లేదా ఇలాంటి వ్యాసాలు అరుదుగా నాకు కనిపించడం వల్లనో లేదా నిజంగానే ఈ వ్యాసం శక్తివంతంగా వుండడంవల్లనో… ఒక గొప్ప అనుభూతి కలిగింది చదువుతున్నంతసేపూ. ఎప్పుడో చిన్నప్పుడు చదివి ఆపేసిన ఇండియా టుడే తెలుగు పత్రిక లోని వ్యాసాన్ని చదువుతున్నట్లు కూడా అక్కడక్కడా అనిపించింది బహుశా మంచి తెలుగు భాష ని కలిగివుండడంవల్లనేమో. మీ రచనా శైలికి వందనములు మరియు ధన్యవాదములు… మరిన్ని విషయాలపైన ఇలాంటివి చక్కటి భావప్రకటనాత్మక వ్యాసాలు రావాలని ఆసిస్తూ… కిరణ్

Leave a Reply