చీకటి స్వరం

నన్ను నేను మిగుల్చుకున్న నిజంలో
శరీరం పాలిపోయింది.
తీక్షణగా చూసుకున్నప్పుడు, అద్దంలో
ముఖం వెక్కిరిస్తున్నది.
కళ్ళలో మెరుపులేదు.
కళ్ళక్రింద గుంతల్లోనేమో దుఃఖబావులు.
తల దువ్వుకుంటున్న ప్రతిసారీ అయితే
చెప్పనవవసరమే లేదు.
శిరోజాలతో దువ్వెన బరువుని గ్రాముల్లెక్కన తూకమేసుకోవచ్చు.

మాటలకు మెరుగుపెట్టి మాట్లాడడం వరకూ
నేనొక అపోహని.
ఊహల వెంట పరుగాపి చూసుకున్నప్పుడు
నేనొక ఒంటరిని.

గతం పెట్టిన గాట్లతో నాలో స్త్రీ మాయమయినది.
ఇక మిగిలిన బేలచూపుకీ పేర్లుపెట్టి పిలుచుకుందామనుకునే సమాజానికి నేను ఎక్కడా దొరకలేదు కనుక గమ్మునుండిపోయింది.

పురుషుడి విన్యాసాలకు విలాసాలకు
సమాజం పరచిన రెడ్కార్పెట్ క్రింద
స్త్రీ నలగడాన్ని మాట్లాడేచోట
నాకు ఫెమినిస్ట్ అన్న ముద్రవేస్తారు.

సంస్కృతి, సహనం అణువణువునా పేర్చుకుంటూ
నేనో నాటకమై నా పాత్రలో కుమిలికాలిపోతున్నప్పుడు నాకు దక్కే కితాబులకోసమే నేను జీవిస్తున్నానని అర్ధమైనప్పుడు, నేను ఇక ఖచ్చితంగా
అక్షరాలను ఆహ్వానిస్తాను.
పదాలకు పదును పెట్టుకుంటూ
వాక్యసంపదని పోగుచేసుకుంటాను.
అల్పసంతోషులు, నాలాంటివారేనేమో,

అధిక సంతోషులు గురించి నాకసలు ఇప్పుడు వద్దే వద్దు.
నా పిరికితనంలో ధైర్యంవాసన ఇసుమంతా లేదు.

ఎలాగో బ్రతకడానికి ఒక పుస్తకమైపోయే చొరవ చాలనుకునేదాన్ని నేను.
అయినా కలలు వస్తాయి.
నేను శ్వాసిస్తాను.
కన్నీటి ప్రవాహంలో కలల్ని పడవలుగా తిప్పుతాను.
హృదయం పనిచేస్తున్నంత వరకూ నేను
బ్రతికున్నజాబితాలోనే ఉంటాను.

కవయిత్రి. కథా రచయిత. కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామం. కవిత్వం, కథలంటే ఆసక్తి. వివిధ వెబ్ పత్రికల్లో కవిత్వం రాస్తున్నారు.

10 thoughts on “చీకటి స్వరం

  1. కుమిలి కాలిపోతున్నప్పుడు నాకు దక్కే కితాబుల కోసమే

  2. అధ్బుతంగా రాశారు అనురాధ గారు🙏

  3. చాలా అద్భుతంగా వ్రాశారండీ అనురాధా గారూ.. స్త్రీ సమాజంలో ఏవిధంగా నలిగిపోతుందో కొలిమి లో చాలా చక్కగా వర్ణించారు..

  4. అంతరంగంలో వెలిగించుకునే దీప కాంతి అక్షరాలకంటుకున్నాక
    మెరిసేదంతా ఒకవైపు, నీడలు పరచుకునేదంతా మరోవైపు – బయటనుండి చూస్తే తనలోని పార్శ్వాలు తనకైనా తెలియకపోవడమే తానంటే; అస్తిత్వాన్ని ఆ అన్వేషణలో గడపడమే తన అంతరంగంలో జీవనానందమంటే.! చక్కగా రాశారు అనురాధ గారు. కంగ్రాట్యులేషన్స్ 🎉

  5. భిన్నమైన స్వరం మీది. చాలా బావుందండీ

Leave a Reply