చీకటి గుళికలు

“వెల్కమ్ టు ఇండిగో ఎయిర్లైన్స్”

ఎయిర్ హోస్టెస్ గొంతు అలవాటుగా, తీయగా తన లైన్స్ చెప్పుకుంటూ పోతూ ఉంది. విమానం ఎక్కిన వాళ్ళు తమ తమ లగేజీ పైనున్న రాక్ లో పెట్టుకుంటున్నారు, కొంత మంది సీట్లు వెతుక్కుంటుంటే, ఒక ఎయిర్ హోస్టెస్ వారికి దారి చూపిస్తూ ఉంది. మరి కొందరికి ఆకాశయానం అది మొదటి సారి అనుకుంటా.. విపరీతమైన ఉత్సాహం తో ఫోన్ లో కెమెరా తీసి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, ఇంకొందరేమో బెరుకుగా కూర్చుని ఊపిరి బిగబట్టి గాల్లోకి ఎగరడానికి ఎదురుచూస్తున్నారు.

ఫ్లైట్ లో ప్రయాణాలు అలవాటు ఐన ఆధిరకు మాత్రం ఈ హడావిడి ఏమి పట్టట్లేదు. కొద్దీ సేపట్లోనే విమానం వేగం అందుకుని, ఒక్క ఉదుటున మేఘాల్లోకి ఎగిరింది. విమానం కంటే వేగంగా ఆధీర మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి.

                          ***** 

సరిగ్గా ఆరు నెలల క్రితం ఆధీర ఇలాగే ఇండిగో ఫ్లైట్ లో శ్రీనగర్ కి బయల్దేరింది. ఆధీర తన కాశ్మీర్ ప్రయాణం గురించి వాళ్ళ అమ్మకు చెప్పగానే, వెంటనే ఆమె అభ్యంతరం చెప్పింది, ‘ఎందుకంత దూరం ఒక్క దానివే వెళ్లడం? మరీ అంతగా మంచు చూడాలనిపిస్తే ఏ మనాలి కో, ధరమ్ శాల కో వెళ్ళు. అక్కడ ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవసరమా?’

‘అబ్బా, ఎం కాదమ్మా.. అయినా కాశ్మీర్ కూడా ఇండియా లోనే కదా ఉంది? నేనేమీ చిన్న పిల్లను కాదు. ముప్పై ఐదేళ్ళొచ్చాయి. నువ్వు ఇప్పుడు నసిగి అనవసరంగా నా ట్రావెల్ మూడ్ పాడు చేయకు.’ అని ఆధీర తన తల్లికి ధైర్యం చెప్పింది.

అక్టోబర్ లో కూడా అదిరిపోయే హైదరాబాద్ ఎండలను తప్పించుకుని శ్రీనగర్ విమానాశ్రయంలో దిగగానే చిక్కటి చలి చుట్టుముట్టింది. బస్సు స్టేషన్ నుండి హోటల్ రూమ్ కు క్యాబ్ లో బయల్దేరింది. ఊర్లో అక్కడక్కడా పోలీసులు కనిపించారు.

ఆధీర మెల్లిగా క్యాబ్ డ్రైవర్ తో మాటలు కలిపింది. అతను పదే పదే అడిగాడు. ‘అకేలే ఆయే క్యా మేడం?’ అని. అవునన్నట్టు తలూపింది. ఆ పూట మాత్రమే ఆధీర శ్రీనగర్ లో ఉంటుంది, మరుసటి రోజు పొద్దున్నే తన గురేజ్ ప్రయాణం. అదే మాట క్యాబ్ డ్రైవర్ కు చెప్పింది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు అతను. ఉలి పెట్టి చెక్కినట్టు మోన దేలిన ముక్కు మీదుగా, ఆధీర ను వింతగా చూసాడు.

‘కాశ్మీర్ టూర్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, గుల్మార్గ్, సోనామార్గ్, పెహేల్గాం, ఇలాంటి ప్రదేశాలకు వెళ్తారు. మీరేంటి గురేజ్ వెళ్తా అంటున్నారు? అది కూడా ఒంటరిగా!’ అని అడిగాడు.

“బస్ ఐసే హీ’ అని నవ్వి ఊరుకుంది.

కాసేపటికి హోటల్ దగ్గర ఆధీర ను దింపేసి, అతను వెళ్ళిపోయాడు. సూర్యుడు దిగే కొద్దీ చలి ఎక్కుతుంది. హీటర్ లేకుండా ఉండడం అసంభవం. చలి దెబ్బకి గది నుండి బయటకి అడుగు పెట్టాలన్నా భయం వేసింది ఆధిరకు. కానీ ఇంత దూరం వచ్చి అలా గదిలో ఉండాలనిపించలేదు. ఒక ఫ్లీస్ కోట్, పైన ఒక మంచి థర్మల్ జాకెట్ వేసుకుని, ఆ పైన ఒక శాలువా కప్పుకుని, తలకి వుల్లెన్ క్యాప్ పెట్టుకుని, హోటల్ బయటకు వచ్చింది. చలికి అరచేతులు తిమ్మిరెక్కి పోయాయి. గ్లోవ్స్ వేసుకోవడం మర్చిపోయినందుకు తనను తాను తిట్టుకుని, మళ్ళీ గది లోకి పరిగెత్తింది. గ్లోవ్స్ వేసుకోగానే కొద్దిగా వెచ్చగా అనిపించింది వేళ్ళకు.

అంతకు ముందే గూగుల్ లో దగ్గర్లో కాశ్మీరీ వాజవాన్ దొరికే మంచి రెస్టారెంట్ కోసం వెతికింది. అర కిలోమీటర్ దూరం లో ఉన్న జీరో డైనింగ్ వైపు మెల్లిగా అడుగులు వేయసాగింది. రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు మూసేస్తూ కొంత మంది కనిపించారు. ఎప్పుడో గాని ఆటోలు, కార్లు, రోడ్డు మీద తిరగట్లేదు. అలాగే ముందుకెళ్లి ఒక చిన్న ఫుట్ బ్రిడ్జి దాటి, జీరో డైనింగ్ చేరింది. చక్కటి క్లాసిక్ చెక్క పనితనం ఒలుకుతూ ఉంది ఆ నిర్మాణం లో. చీకట్లో మిణుకు మిణుకు మంటూ వెలిగే దీపాలతో, ఏదో రాజమహలులా అనిపించింది, ఆధీర కి.

లోపలికి అడుగు పెట్టగానే, వెచ్చని గాలి చుట్టుముట్టింది. లోపల ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని టేబుల్స్ నిండిపోయి ఉన్నాయి. వెనుదిరుగుదామని ఆధీర అనుకునే లోపే, సన్నగా, పొడుగ్గా, ఉన్న ఒక అందమైన అబ్బాయి ఎదురొచ్చాడు.

“కిత్నే లోగ్ హై?” అని అడిగాడు, పలకరింపుగా నవ్వుతూ.
“మై అకేలి హూ” అని బదులిచ్చింది.

ఆశ్చర్యంగా అనిపించినా, అది పైకి కనబడనివ్వకుండా, “ఆప్ యహా బైట్ సక్తే, ఖానా యహి పర్ లాయేంగే” అంటూ కుడి వైపు ఉన్న సోఫా చూపించాడు.

ఈ చలిలో ఇంకో రెస్టారెంట్ వెతుక్కుంటూ వెళ్లడం కన్నా.. ఇదే ఉత్తమం అనుకున్న ఆధీర తలాడించి వెళ్ళి అక్కడ సోఫా లో కూచుంది. సోఫా ముందు ఒక చిన్న కాఫీ టేబుల్ ఉంది. దాని మీద ఒక వాస్ లో ఒక టులిప్. పక్కనే రెండు పెద్ద షెల్ఫ్ లు. వాటి నిండా పుస్తకాలు. పుస్తకప్రియురాలు ఐన ఆధీరకు వాటిని చూడగానే ప్రాణస్నేహితుడిని చూసినంత ఆనందం కలిగింది. లేచి వెళ్లేలోపే ఆ అబ్బాయి మెనూ తెచ్చి ఇచ్చాడు. కొన్ని పరిచయం ఉన్న వంటల పేర్లు కనిపించాయి, కానీ ఆధీర ఏ ప్రాంతానికి వెళ్లినా, తప్పకుండా అక్కడి వంటలు రుచి చూడటం అలవాటు. అందుకే, ఆ హోటల్ లో స్పెషల్ కాశ్మీరీ వంటకం ఏది దొరుకుతుందో అడిగి, ఆ అబ్బాయి చెప్పే ఐటమ్స్ అన్ని విని, చివరికి కాశ్మీరీ పులావ్ ఆర్డర్ చేసింది.

ఎలాగూ ఆర్డర్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి, పుస్తకాల దగ్గరికి వెళ్ళి చూడసాగింది. కొన్ని ఫేమస్ నవలలు, కొన్ని ఫోటోగ్రఫీ బుక్స్, కొన్ని లోకల్ కాశ్మీరీ రచయితల కథలు, కాశ్మీర్ టూరిజం కి సంబంధించిన పుస్తకాలు కొన్ని, పాతవి కొన్ని, కొత్తవి కొన్ని, చాలానే ఉన్నాయి. ఉత్సాహంగా తనకు నచ్చిన కొన్ని పుస్తకాలు తీసి, వెనక ఉన్న ఎక్సర్ప్ట్ చదివి తిరిగి షెల్ఫ్ లో పెడుతూ సమయం గడిపింది.

ఇంతలో వేడి వేడి గా కాశ్మీరీ పులావ్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు ఆ అబ్బాయి. కడుపు లో నుంచి మెల్లిగా వెన్ను లోకి పాకుతున్న చలి కాస్త, ఆ పులావ్ ఒక్క ముద్ద నోట్లోకి వెళ్లే సరికి.. వొళ్ళంతా నులి వెచ్చగా మారసాగింది. ఇంక రుచి మహాద్భుతంగా ఉంది. ఆకలి మీద ఉందేమో, మొత్తం లాగించేసింది. చివర్లో కాంప్లిమెంటరీ డెసర్ట్ అని, ఒక చిన్న మట్టి గిన్నె లో కాశ్మీరీ ఫిర్నీ తెచ్చి ఇచ్చాడు ఆ వెయిటర్ అబ్బాయి. అది కూడా ముగించేసి, బిల్ కట్టి, టిప్ ఇవ్వబోతే, ఆ అబ్బాయి నవ్వుతూ, “నహి మేడం, హమ్ టిప్ నహి లేతే!” అని వినయంగా తిరస్కరించాడు. ఫుడ్ చాలా బాగుంది అని అతనికి కంప్లిమెంట్ ఇచ్చి అక్కడి నుండి బయటపడి చలి లో మళ్ళీ వణుక్కుంటూ హోటల్ రూమ్ చేరింది.

ఒక సారి బాగ్ మొత్తం చెక్ చేసుకుంది, అన్ని సామాన్లు సరిగ్గా ఉన్నాయో లేదో అని. మరుసటి రోజు తనను పిక్ చేసుకోబోయే డ్రైవర్ కి ఒక మెసేజ్ పెట్టింది, చిన్న రిమైండర్ లాగ. రూమ్ హీటర్ టెంపరేచర్ పెంచి, ఒక దాని మీద ఒకటి మూడు దుప్పట్లు వేసి, వాటి కింద చేరి నిద్రకు ఉపక్రమించింది.

                         ****

టాటా సుమో వేగంగా పరిగెడుతూ ఉంది. శ్రీనగర్ సరిహద్దులన్నీ పచ్చగా, చుట్టూ మంచు పర్వతాలతో ఎంతో అందంగా ఉంది. మొదట్లో కాసేపు తన DSLR కెమెరా తీసి కొన్ని ఫోటోలు తీసింది. కొద్ది దూరం వెళ్ళాక ఆధీర కి అర్థం అయింది.. ఈ లెక్కన ఫోటోలు తీస్తూ పోతే తనకు ఎంత పెద్ద హార్డ్ డిస్క్ కూడా సరిపోదు, కెమెరా లెన్స్ పక్కన పెట్టి కళ్ళతో ఆ అందాలని చూడాలి అని. తనతో పాటుగా సుమో ఎక్కిన వాళ్లంతా తనని తరచి చూసి పలకరింపుగా నవ్వటం గమనిస్తూనే ఉంది, కానీ ఎవరూ తనను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. ఒకరిద్దరు మాట కలిపి ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో అడుగుతున్నారు. పొద్దున్నే లేవడం వల్ల కాబోలు నిద్ర ముంచుకుని వస్తూ ఉంది కానీ, చుట్టూ అన్నేసి అందాలను పెట్టుకుని నిద్రపోవాలని అనిపించలేదు తనకు.

కొద్ది గంటల్లో బందిపూర చేరింది సుమో. అక్కడ సుమో స్టాండ్ లో దిగీ దిగగానే, సుమో డ్రైవర్ గురేజ్ కి వెళ్ళే మరో సుమో చూపించాడు. సుమో లో సామాను పెట్టి, పక్కనే ఉన్న చిన్న పబ్లిక్ బాత్రూం కి వెళ్ళొచ్చి తిరిగి సుమో లో కూచుంది.

డ్రైవర్ వెనక్కి తిరిగి అందరూ అడిగే ప్రశ్నే అడిగాడు, “గురేజ్ క్యూ జానా హై ఆప్కో? బహుత్ ఖతర్నాక్ రాస్తే హై, ఉపర్ సే ఆప్ అకేలే హై!”

ఆధీర నవ్వుతూ, “జబ్ ఆప్ లోగ్ వహ రెహ్ సక్తే హో.. క్యా మై సిరఫ్ ఘోమనే నహి జా సక్తి?” అని అడిగింది అతని కోటేరు లాంటి ముక్కు చూస్తూ.

ఏమనుకున్నాడో, అలవోకగా నవ్వేస్తూ.. “ఐసి బాత్ నహి హై మేం. జరూర్ దేఖ్ సక్తే.” అని సుమోను ముందుకు దూకించాడు.

ఇంక అక్కడి నుండి దారి చాలా వైశాల్యం తగ్గింది… పరిసరాల అందం పెరిగింది. మధ్యలో దాదాపు నాలుగు మిలిటరీ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడి వారు కాని వాళ్ళు ఎవరైనా అక్కడ ఐడెంటిటీ చూపించి, పేరు ఎంట్రీ చేయించుకోవాలి. తిరిగి వెళ్లేప్పుడు కూడా తప్పకుండా వాళ్ళకు చెప్పే వెళ్ళాలి. ఆధీర కూడా తన ఆధార్ కార్డు చూపించి ఎంట్రీ చేయించుకుంది. ఒక చెక్ పోస్ట్ లో అయితే, ఒక తెలుగు ఆఫీసర్ తనని చూసి తెగ ముచ్చట పడిపోయాడు. ఏదైనా అవసరమైతే తప్పక ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చాడు. టీ తాగి వెళ్ళమని బలవంతం చేస్తే, వాళ్ళతో కూచుని కాసేపు కబుర్లు చెప్పి ఛాయ్ తాగి వాళ్ళందరికి వీడ్కోలు చెప్పి ప్రయాణం కొనసాగించింది.

గురేజ్ వెళ్లాలంటే రోహ్తాంగ్ పాస్ దాటి వెళ్ళాలి. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో దారికి ఇరువైపులా నాలుగు అడుగుల పైనే మంచు గోడ. మంచు తో తడిసిన దారి జారుడుగా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా, ఇంతే సంగతులు. ఎదురుగా ఏదైనా బండి వస్తే, ఇక అంతే! ఎంతో జాగ్రత్తగా పక్కకు తప్పుకోవాలి. రోహ్తాంగ్ పాస్ లో సుమో వెళ్తుండగా ఉన్నట్టుండి వర్షం.. కాదు కాదు.. మంచు. ఆధీర ఆనందానికి పట్టా పగ్గాలు లేవు. తన జీవితం లో చూసిన మొదటి మంచు. రెండు కళ్ళు చాలలేదు. దారి కనిపించకుండా మంచు విండో షీల్డ్ ను కప్పేయడం తో, డ్రైవింగ్ కుదరక సుమో ను డ్రైవర్ ఒక పక్కకు ఆపేసాడు. అందరూ దిగి, దగ్గర్లో ఉన్న మాగ్గీ పాయింట్ లో చేరారు. ఆధీర కూడా వణుక్కుంటూ వెళ్ళి మాగ్గీ ఆర్డర్ చేసింది.

‘ఇదియే కదా స్వర్గసీమ’ అని కాశ్మీర్ లో ఉన్నందుకు అనిపించిందో, లేక చిక్కటి చలిలో, చేతిలో వేడి వేడి మ్యాగీ పట్టుకుని తింటూంటే అనిపించిందో కానీ, ఆ క్షణం మాత్రం ఆధీర జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం.

కాసేపటికి మంచు కురవడం ఆగిపోయింది, సుమో ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది.

                           ****

గురేజ్ రిట్రీట్ ముందు నుండి కిషన్ గంగా నది నిండుగా ప్రవహిస్తూ ఉంది. కొద్దీ దూరం లో హుందాగా కనిపించే హబ్బా ఖతూన్ పర్వతం. అంతేసి నీలం, పచ్చదనం చూసే సరికి ఒక్క సారి వేరే లోకం లోకి విహారానికి వొచ్చినట్టు అనిపించింది ఆధీర కి.

జావేద్ భాయ్ చేసి ఇచ్చిన కాశ్మీరీ చాయ్ తాగుతూ, సూర్యాస్తమయం చూస్తూ ప్రయాణ బడలిక మొత్తం మర్చిపోయింది. మరు రోజు చుట్టూ ఉన్న కొన్ని చిన్న చిన్న ఊర్లు చుట్టి రావడానికి ఏర్పాట్లు చేసాడు జావేద్ భాయ్. అతనితో మాట్లాడుతూ, ఊరి విశేషాలు అడిగి తెలుసుకుంది. చిన్న వంట గది. పగలు ఒక గంట, రాత్రి ఒక గంట మాత్రమే కరెంటు ఉంటుంది ఆ ఊర్లో. అందుకే పొద్దెక్కక ముందే రోటి, ఇంకా సబ్జి చేసి పెట్టేసాడు ఆయన.

తినేసి, ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి, పొద్దున్నే లేవడానికి అలారం కూడా పెట్టేసుకుంది. భూతల స్వర్గం లో వెంటనే నిద్రలోకి జారుకుంది.

                       ****

తెల్లవారు ఝాము ఐదింటికి లేచి బాత్రూం కి వెళ్తే రక్తం గడ్డకట్టించేంత చల్లటి నీళ్ళు. జావేద్ భాయ్ కట్టెల పొయ్యి మీద నీళ్ళు వేడి చేసిస్తే, కాలకృత్యాలు తీర్చుకుని, ఏదో స్నానం చేసాననిపించింది. గరం గరం ఛాయ్ తాగి ఆలూ పరాఠా లు తినేసి షికారుకి బయల్దేరింది. అప్పటికే మొహిసిన్ కారుతో గుమ్మంలో తయారుగా ఉన్నాడు.

కారు స్టీరియో లో మహమ్మద్ రఫీ గాత్రం వినిపిస్తూ ఉంది. కాసేపటికి మొహిసిన్ తో మాటల్లో పడిపోయింది. ప్రతి ఒక్కరు ప్రేమగా మాట్లాడే వాళ్ళే. దారిలో ఒక ఊరు చూడటానికి దిగితే, ఒక పెద్దాయన ఇంటికి తీసుకెళ్ళి ఛాయ్ తాగే దాకా వదిలిపెట్టలేదు. ఆయన ఇంటి ముందు నుండి చూస్తే పక్కనే ఉన్న పాకిస్థాన్ బోర్డర్ కనిపిస్తుంది.

“చాహే కోయి కుచ్ భి బోలె! హమ్ హిందూస్థానీ హై. యహి పైదా హుయే ఆర్ యహి మరెంగే,” మాటల్లో వ్యక్తం చేయలేని గర్వం ఏదో ఆ కళ్ళల్లో కనిపించింది ఆధీర కి.

చిన్న ఊర్లు, చిన్న పాఠశాలలు, పెద్ద మైదానాలు, పెద్ద మనసున్న మనుషులు.

సరైన ఆసుపత్రులు కూడా లేవు. చలికాలం వస్తే ఆరడుగుల ఎత్తున మంచు కురుస్తుంది. అందరూ ఇళ్ళల్లోనే ఉండిపోతారు. బయటకి రావడం దాదాపు అసాధ్యం. అక్కడి సంగతులు మొహిసిన్ చెప్తుంటే ఆశ్చర్యంగా వింటూ కూచుంది ఆధీర.

“మరి అలాంటి సమయంలో ఎవరిదైనా ఆరోగ్యం పాడవడం లాంటిది జరిగితే ఏంటి పరిస్థితి?”

“క్యా కర్ సక్తే మేడం? ఫోన్స్ కూడా పనిచేయవు. సాటిలైట్ ఫోన్ ద్వారా మిలిటరీ వాళ్ళకి విషయం చేరవేస్తే, వాళ్ళు హెలికాప్టర్ ఏర్పాటు చేస్తారు. ఈ లోపు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు,” అన్నాడు మొహిసిన్.

                         ****

దాదాపు నాలుగు ఊర్లు చుట్టి తిరిగి గురేజ్ రిట్రీట్ చేరుకుంది ఆధీర. గుమ్మం దగ్గర బాలీవుడ్ సినిమా హీరో లా ఉన్న ఒక పదిహేడేళ్ళ కుర్రాడు కనిపించదు. దాదాపు ఆరడుగుల పొడవు, చక్కటి తీరైన ముక్కు, ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే ఛాయ. ఆధీర చూడగానే ఆ అబ్బాయి నవ్విన నవ్వుతో కరెంటు లేదన్న విషయం కూడా మర్చిపోయింది తను.

లోపలికి వెళ్ళి వంట గదిలో జావేద్ భాయ్ తయారుగా ఉంచిన ఛాయ్ తాగుతూ ఆ రోజు విశేషాలు మాట్లాడసాగింది. ఇంతలో ఇందాక ఆధీర బయట చూసిన అబ్బాయి లోపలికి వచ్చాడు. జావేద్ భాయ్ ఆ అబ్బాయిని చూపిస్తూ, “మేర బేటా అరీబ్ సి మిలియే మేడం! ఏ సాల్ శ్రీనగర్ కా ఏక్ బడా మెడికల్ కాలేజ్ మే సీట్ మిలా ఇస్కో” ఆనందంగా పరిచయం చేసాడు.

“అరె వాహ్! బహోత్ స్మార్ట్ హై ఆప్కా బేటా!” పొగిడింది ఆధీర.

సిగ్గుతో ఎర్రబడిపోయాడు అరీబ్. అది చూసి విరగబడి నవ్వింది ఆధీర.

“చూస్తున్నారు కదా మేడం ఇక్కడి పరిస్థితి. ఎవరికైనా ఏదైనా జరిగితే సరిగ్గా ఆసుపత్రి కూడా లేదు మాకు. వీడి అమ్మ కూడా సమయానికి వైద్య సహాయం అందక పురిట్లోనే వీడిని కని చనిపోయింది. అందుకే నా బేటా ని డాక్టర్ చేయాలని ఎప్పటి నుండో అనుకున్నా. ఈ ఏడు సీట్ వచ్చింది. ఇంకో నెల రోజుల్లో కాలేజ్ లో చేరతాడు. మంచి డాక్టర్ అయ్యాక వచ్చి ఇక్కడే అందరికి అందుబాటులో ఉండి, అందరినీ బాగా చూసుకోవాలని నా కోరిక,” జావేద్ భాయ్ ఉబలాటంగా చెప్పుకున్నాడు.

“జరూర్, భాయ్! పక్కా ఆప్కా బేటా ఆప్కా నామ్ రోషన్ కరేగా. హై నా, అరీబ్?” సంతోషంగా అంది ఆధీర.

                           ****

ఆ మరు రోజు మళ్ళీ ఉత్సాహంగా పొద్దున్నే లేచింది ఆధీర, తులైల్ అనే అందమైన చిన్న ఊరికి ఆ రోజు ప్రయాణం మరి. బయట చిమ్మ చీకటి అనిపించింది. కొద్దిగా కిటికీ లోంచి తొంగి చూసేసరికి అర్థమయింది ఆధీరకి, బయట విపరీతంగా మంచు కురుస్తున్న సంగతి. ఏం చేయాలో పాలుపోక వంట గదిలోకి జావేద్ భాయ్ ని వెతుక్కుంటూ వెళ్ళింది. పొయ్యి దగ్గర కూచుని అరీబ్ కనిపించాడు.

తనూ వెళ్ళి నిప్పుల ముందు చలి కాచుకుంటూ అరీబ్ తో కబుర్లలో పడింది. ఉన్నట్టుండి మంచు తుఫాను రావడం వల్ల గురేజ్ నుండి బయటికి రాకపోకలు పూర్తిగా నిలిపేశారని, ఒక వారం దాకా మళ్ళీ రోడ్లు తెరవరని చెప్పాడు అరీబ్. అది విన్న ఆధీర కు ఏం చేయాలో పాలుపోలేదు. నిజానికి తను ఇంకో రెండ్రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ ముందే బుక్ చేసుకుంది. ఎయిర్ లైన్స్ వారికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే, అసలు సిగ్నల్ దొరికితే గా!

అరీబ్ ధైర్యం చెప్పి, తన ఫోన్ మొబైల్ డేటా ఆన్ చేసిచ్చాడు. ఫ్లైట్ పోస్టుపోన్ చేసుకుంది. ఒక పక్క చాలా అడ్వెంచర్ లో ఉన్నట్టు ఉత్సాహమేసినా, మరో మూల ఒక లాంటి గుబులు అయితే ఉంది ఆధీర మనసులో!

ఆమె మొహం లో భావాలు చదివినట్టే, “అప్నే హాథ్ మే కుచ్ నహి హై మేడం! బస్ ఇంతెజార్ కర్ సక్తే హై, ఔర్ కుచ్ నహి!” అన్నాడు అరీబ్ మెరిసే కళ్ళతో తనకేసి చూస్తూ.

ఒక వారం రోజులు అంత వేగంగా గడిచిపోవడం ఆధీర జీవితం లో అది మొదటి సారి కాబోలు. సొంత వాళ్ళలా జావేద్ భాయ్, అరీబ్ లు అసలు తనకి ఏ లోటు తెలీకుండా చూసుకున్నారు.

ఇంక అరీబ్ తో ఆధీరకి ఏర్పడిన అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే! చాలా తక్కువ వనరులు ఉన్నప్పటికీ చాలా చక్కగా చదువుకున్నాడు అరీబ్. కాగితం ముక్క కనిపిస్తే చదవకుండా వదిలిపెట్టడు. అది దేనికి సంబంధించింది అయినా పర్లేదు! ఇది అది అని కాకుండా, అన్ని అంశాల గురించిన అవగాహన ఉన్న అరీబ్ ని చూస్తే, పదిహేడేళ్ళ అబ్బాయిలా కాదు, పండు ముసలి తో మాట్లాడుతున్నట్టు అనిపించేది ఆధీరకు. దేశం గురించి, పరిపాలన గురించి, తప్పొప్పుల గురించి, ప్రజల గురించి, పాలకుల గురించి మాట్లాడే వాడు.

అద్భుతంగా పాటలు పాడటమే కాదు, సాజ్-ఏ-కాశ్మీర్ అనే వాయిద్యం మీద అద్భుతంగా పాటలు కట్టి వాయిస్తాడు. అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోవడం ఆధీర వంతయింది. కలలు, కళలు నింపుకున్న ఆ కళ్ళు చూస్తే ఎక్కడ లేనంత ఆనందం కలిగేది ఆమెకు.

మంచు తుఫాను తగ్గుముఖం పట్టడానికి, రోడ్లు మళ్ళీ ప్రయాణాలకు అనుకూలించడానికి వారం రోజులు పట్టింది. గురేజ్ నుండి బందిపూరా కు వెళ్తున్న టాక్సీ లో కూచుంటుంటే ఆధీర కు ఒక మనసు తునక అక్కడే వదిలి పోతున్నట్టనిపించింది. ఆ వారం రోజులు వాళ్ళిచ్చిన ఆతిథ్యం తలచుకుని మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పింది.

                       *****

ఈ ఆరు నెలల్లో వారానికి ఒక్క సారైనా అరీబ్ తో మాట్లాడేది ఆధీర. అరీబ్ కాలేజ్ లో చేరాక ఉత్సాహంగా కాలేజ్ కబుర్లు చెప్పే వాడు. మధ్యలో ఒక సారి తన కోసం అదే పనిగా కొన్ని మెడిసిన్ కి సంబంధించిన పుస్తకాలు, సైకాలజీ కి సంబంధించిన పుస్తకాలు కొని పంపింది ఆధీర. అరీబ్ ఉత్సాహం గమనించి కొన్ని ఫారిన్ మెడికల్ జర్నల్స్ కూడా సబ్స్క్రయిబ్ చేసి పెట్టింది అరీబ్ ఇమెయిల్ ఐ డి కి. ఎంతో గొప్పవాడవుతాడని ఆధీర గట్టిగా నమ్మేది.

అలాంటి సమయం లో ఉన్నట్టుండి నాలుగు రోజుల క్రితం జావేద్ భాయ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ తో ఆధీర మనసు ముక్కలైపోయింది. పెల్లెట్ గన్ షాట్స్ కి గురయ్యి అరీబ్ కంటి చూపు పోగొట్టుకున్నాడు అని చెప్పి వాపోయాడు జావేద్ భాయ్. ఆ తరువాత ఆయన చెప్పిందేమీ చెవికెక్కలేదు ఆధీరకు.

ఉన్నఫళంగా శ్రీనగర్ కి ఫ్లైట్ బుక్ చేసుకుంది.
“నువ్విప్పుడు వెళ్లినంత మాత్రాన ఆ అబ్బాయి కి కళ్ళొస్తాయా? అయినా ఉత్తిగానే ఫైర్ చేసి ఉంటారా పోలీసులు మాత్రం? ఏ గొడవలకు పోయాడో ఏంటో!” నిష్టూరాలాడుతున్న అమ్మను చూస్తే అసహ్యం వేసింది ఆధీరకు.

“సరిగ్గా పోయినేడాది ఒక ఐదేళ్ళ అమ్మాయి కూడా ఇలాగే పెల్లెట్ గన్ షాట్ లకు గురయ్యి కుడి కంటి చూపు పోగొట్టుకుంది. ఆ పిల్ల కూడా గొడవలకు పోయి ఉంటుందంటావా? ఇలా ఇప్పటి దాకా కంటి చూపు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంది తెలుసా? నేను వెళ్లినంత మాత్రాన అరీబ్ కి కళ్ళొచ్చేయవు. కానీ పక్కన నిలబడి రెండు మాటలు ధైర్యం చెప్పగలిగినా నాకు తృప్తిగా ఉంటుంది. అసలు జంతువుల మీద తప్ప మనుషుల మీద వాడటానికి అనుమతి లేదు. కానీ ఒక్క కాశ్మీర్ లో మాత్రమే దాన్ని మనుషుల మీద వాడటానికి ఉపయోగిస్తారు, తెలుసా? చావు కంటే దారుణం కాదా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో జావేద్ భాయ్ కన్న కొడుకు మీద. ఆ రోజు నేను గురేజ్ లో మంచు తుఫానులో చిక్కుకుపోయినప్పుడు, మాకెందుకులే అని వాళ్ళనుకుని ఉంటే, ఈ రోజు నేను ఎలా ఉండేదాన్నో! ఒక్క పైసా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా వారం రోజులు ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. ఎన్ని కోట్లిచ్చి తీర్చుకోగలను వాళ్ళ ఋణం?” ఆవేశంగా అంది ఆధీర

*****


శ్రీనగర్ లో ల్యాండ్ అవబోతున్నామని అనౌన్స్మెంట్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ మాటలకు మళ్ళీ ఈ లోకం లో కి వచ్చి పడింది ఆధీర. అక్కడి నుండి ఆదుర్దాగా బయల్దేరింది కానీ, మెరిసే కలువ పూల లాంటి కళ్ళు ఇక లేని అరీబ్ మొహం ఎలా చూడాలో, జావేద్ భాయ్ కి ఏమని ధైర్యం చెప్పాలో తనకి తెలీదు. పోయిన సారి కాశ్మీర్ లో అడుగుపెడుతుంటే స్వర్గం లో కి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది కానీ ఈ సారి మాత్రం చీకట్లోకి జారిపోతున్నట్టనిపించింది ఆధీరకు.

పుట్టింది కడప. గత పదిహేడేళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. పుస్తక ప్రేమి. కవయిత్రి. కథా రచయిత్రి. మీర్కట్ ప్రెస్, పెంగ్విన్ రాండమ్ హౌస్ లాంటి అనేక పబ్లిషింగ్ సంస్థలకు www.theclippednightingale.com అనే బ్లాగ్ లో పుస్తక సమీక్షలు రాస్తారు. ఈ మధ్యే కవితలు, కథానికలు రాస్తున్నారు. వృత్తి రీత్యా ఒక IT కంపెనీకి రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

16 thoughts on “చీకటి గుళికలు

  1. Madhuri gaaru , you are my favourite writer and with this I am even more liking your way of writing ❤️❤️ Keep writing and keep going

  2. Madhuri garu, read your story ” cheekati gulikalu” Beautiful description of the whole journey, as if you are going through that situation. . Very unique. Very good style of writing. 👌👌

  3. Nice story by reading it we can experience the beautiful places in Kashmir and also the innocent people how they are living there.Good, keep it up.

  4. Wonderful narration. Beautiful story. Felt bad about Arib losing his sight. Heart touching story. Congratulations!

  5. “నిష్టూరాలాడుతున్న అమ్మను చూస్తే అసహ్యం వేసింది ఆధీరకు”

    మానవి మీరు మాధురి గారూ 💐💐

Leave a Reply