“చివరి వాక్యం” కథ వెనుక కథ

నేనీ కథ “చివరి వాక్యం” రాస్తానని అనుకోలేదు. పౌర హక్కుల సంఘం మిత్రులు(ఆంజనేయులు గౌడ్, శివాజీ)నాకు ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడం… నేను బయలుదేరడం అనుకోకుండా జరిగింది. మా జీపు బాలానగర్(మహబూబ్ నగర్ జిల్లా) దాటి రాగ్యా తండా వైపు బయలుదేరినప్పుడు నేను సంఘటన గురించి అడిగాను. ”ఎవరో పాషా(45)అనే వ్యక్తి తొమ్మిదవ తరగతి చదివే లక్ష్మి(15) మీద అత్యాచారం జరిపాడని, వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి పోతున్నాం” అని చెప్పారు.

***

జీపు సరాసరి లక్ష్మి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. శ్రీశ్రీ అన్నట్టు అది “ఒక బదులు లేని పల్లెటూరు(తాండ)” ఈ పల్లెటూరు నాకు ఓ కథనిస్తుందని కూడా అనుకోలేదు. ఉదయం 11 గంటలకే తాండా అంతటా ఒక విధమైన నిశ్శబ్దం ఆవహించింది. అది భయం వల్ల కావొచ్చు. మెల్ల మెల్లగా నాకు వాతావరణం అర్థం కావడం మొదలైంది. అత్యంత నిరుపేద కుటుంబం. నిరుపేద తల్లిదండ్రులు. సగం కూలిన ఇల్లు…ఇదీ అక్కడి వాతావరణం. అందరం ఒక చాప మీద కూర్చున్నాం. నేను, లక్ష్మి పక్కనే కూర్చున్నాను. ఆ పిల్లలో అత్యాచారపు సంఘటన తాలూకు భయాలు కళ్ళలో తొంగిచూస్తున్నాయి. పులి బోను నుండి బయట పడ్డ లేడి పిల్లలా ఉంది ఆమె. ఆ పిల్ల మొఖంలో దైన్యం, భయం ఇప్పటికీ వెంటాడుతుంటాయి. తల్లిదండ్రులు మాట్లాడుతుంటే ఎటో శూన్యంలోకి చూస్తుంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడం లేదు. అసలు మాట్లాడడం మరిచిపోయిందా… స్వరపేటిక ఎండిపోయిందా… అన్నట్టుగా ఉంది ఆ పిల్ల. ఈ మూగ పిల్ల గురించి నేనేం రాసేది.. నేను చొరవగా ఆ పిల్ల చేతిని నా చేతిలోకి తీసుకోని, ”ఏం జరిగిందిరా” అన్నాను. ఆ పిల్ల నా వైపు అపనమ్మకంగా చూసి తన చేతిని తీసేసుకుంది. అవే చూపులు… ఆక్రోష్ సినిమాలో పోస్టర్ మీద ఓంపురి బొమ్మ కనబడుతుంది. ఆ మనిషి మొఖంలో దైన్యం, అపనమ్మకం, ఆక్రోశం కలగలిసి వ్యవస్థ మీద ఏ మాత్రం నమ్మకం లేని మనిషిలా కనబడుతాడు. ఈ పిల్ల అంతే….చుట్టాలు, శ్రేయోభిలాషులు ఎందరున్నా ఆ పిల్లకి ప్రపంచం బరోసా ఇస్తున్నట్టు లేదు.

లక్ష్మి పై అత్యాచారం చేసిన పాషా డబ్బుపరంగాను రాజకీయంగాను బలమైన వ్యక్తి అని తెలిసింది. అంతేనా…? కేసులు గీసులు అంటే జైల్లో పెట్టించి కుల్లబొడుస్తామని బెదిరించారట. “ఈమెకు ఎవరు లేరు..”ఎందుకో గాని ఆ విషయం నాకు చప్పున అర్థం అయిపోయింది. తండ్రికి చేయి విరిగితే కట్టు కట్టించుకున్నాడు. ముసలమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఉన్న అన్న తాండా లోనే వేరు కాపురం పెట్టాడు. నేను సంఘటన లో పూర్తిగా లీనమైపోయాను. కాని అప్పటికి ఏమైనా రాయాలని అస్సలు అనుకోలేదు.

***

లంబాడ యువకులు మమ్ములను అత్యాచారం జరిగిన స్థలం కాడికి పోదాం అన్నారు. ఎట్లా తెలిసిందో ఏమో గాని పాషా ఇద్దరి కొడుకులు మమ్మల్ని మార్గ మద్యoలో కలిసారు. తమ తండ్రి చాల అమాయకుడనీ, నలబైఐదు ఏండ్ల మనిషి పదిహేను సంవత్సరాల పిల్లపై ఎట్లా అత్యాచారం చేస్తాడని అంతకంటే అమాయకంగా చెప్పుకొచ్చారు. తాగుబోతులైన లక్ష్మి తల్లిదండ్రులు తమ పరువు గల కుటుంబాన్ని రచ్చ కీడ్చి డబ్బుగుంజాలని ప్రయత్నిస్తున్నారని లాజిక్ పాయింట్లు లేవనెత్తారు. అక్కడ మూగ భూమి సాక్ష్యం చెప్పకనే చెప్పింది. అత్యాచారం జరిగిన చోట విరిగి పోయిన మొక్కలు, వాలిపోయిన గడ్డి, ఏదో భీభత్సo జరిగినట్టు ప్రకటిస్తున్నాయి. ఆ రోజున లక్ష్మి తొడల వెంబడి చాల రక్తమే పోయిందట. పాషా పారిపోతున్నప్పుడు అతడు విడిచిన లుంగీ కనబడింది.

***

లక్ష్మి ముఖం వెంటాడుతుంటే, జీపు ఎక్కుతూ” ఇదంతా ఎవరు వింటారు…? ఈ కేసు వీగిపోతది.” అన్నాను మా మిత్రులతో జీపు బాలానగర్ తోవ పట్టింది. ముందుగా పోలీసు స్టేషన్ కె వెళ్ళాము. SI లేడు.. వార్త పేపర్ లో రావడంతో కొంత హడావిడి కనబడ్డది. FIR అతిగతి లేదు. లంబాడ పిల్లలకి అడిగే ధైర్యం చాలడం లేదు. లంబాడ హక్కుల సంఘం రాజీ పడమంటుంది. బాల నగర్ సర్కార్ దవఖానలో మరో డ్రామా నడుస్తున్నది. అక్కడున్న డాక్టరమ్మ ఏకంగా పాషా మనః స్థితి సరిగ్గా లేదని రిపోర్ట్ రాసేసింది. గత మూడు రోజులుగా కక్కుడు కాలువలు పెట్టి దవఖాన లోనే గ్లూకోజులు ఎక్కిoచుకుంటున్నాడని రాసింది. వార్డుకి పోయి పాషా ను చూసాము. అతను దుండు ముక్కలాగా ఉన్నాడు. నామ్ కే వాస్తే గ్లూకోజులు ఎక్కిస్తున్నారు. పండ్ల రసాలు డబల్ రొట్టెలు తెస్తూ పిల్లలు హడావిడులు సృష్టిస్తున్నారు. బయట ఓ జర్నలిస్టు, ఇట్లాంటి సంఘటన జరిగే వీలులేదన్నాడు. లంబాడి కుటుంబాలని తిట్టిపోసాడు. పాషాను రక్షించడానికి పకడ్బంది పథకం తయారైంది. చూడబోతే ఊరు వాడ, న్యాయం చట్టం, డబ్బు, మీడియా, రాజకీయం సమస్తం కలిసి ఓ బక్కపలచటి పిల్లమీద యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. జీపు ఎక్కుతుంటే కథ రాయాలనే అలజడి మొదలైంది.

***

ఏం రాసినా “ఆ పిల్లకి ఎవరు లేరు.”అన్న కాడికొచ్చి కథ ఆగిపోతోoది. ఏం చేయాలి..? చాల అసంతృప్తి. నా మీద నాకు విసుగు. ద్వారం లేని సొరంగం గుండా ప్రయాణం చేస్తూ అలసిపోతున్నట్టుగా ఉంది. ఆ పిల్ల నన్ను బతకనివ్వడంలేదు. ఊపిరి ఆడనిస్తలేదు. అట్లని విడిచిపెడుదునా… తప్పని అనిపించింది. సగం చెక్కిన శిల్పం ముందు ఏమి తోచని శిల్పిలా చూస్తూ ఉండిపోయాను. చప్పున తుమ్మేటి రఘోత్తం రెడ్డి “పనిపిల్ల” కథ గుర్తొచ్చింది. ఆ పిల్ల చివరి ఘట్టంలో కరువు దాడిలో పాల్గొనడం నన్ను షాక్ కు గురిచేసింది. ఇక నా కథకి కాళ్ళు వొచ్చాయి. ఒక ఊరేగింపు, అందులో అగ్ర భాగాన లక్ష్మి నిలబడి నినాదాలు ఇచ్చినట్టు ఒక ఫ్రేమ్ ని పది సార్లు ఊహించుకున్నాను. ఒక విధంగా తుమ్మేటి “పనిపిల్ల” లంబాడ లక్ష్మిని ఆవహించేసింది. తక్కిన కథంతా లక్ష్మి నడిపింది. ”ఆ పిల్లకి ఎవరు లేరు.” అన్న వాక్యం కొట్టేసినంక నాకు ఆ రాత్రి నిద్రపట్టింది. ఇక ఇంతటితో ఆపాలి అనుకున్న. కాని ఇంకా ఎదో కావాలి. ఇది సరిపోదు. మరింత బాగా ముగించాలి. ఏం చేయాలి…? బాలు మహేంద్ర సినిమా “నిరీక్షణ”యాదికొచ్చింది. దాంట్లో చివరి సీన్ నన్నెపుడు వెంటాడుతుంటది. అందులో ఓ గిరిజన స్త్రీ, జైలు నుంచి ఒస్తున్న తన ప్రియుడి కోసం కొన్ని వేల దీపాలు వెలిగించి వాటి మధ్యన కూర్చొని ఎదురుచూస్తూ ఉంటది. దాన్ని నేను ఇట్లా అన్వయించుకున్నాను.”ఆ రోజు కలలో వేలాది దీపాల మధ్యన కూర్చొని నేనొక కథ రాసుకుంటున్నాను. నా అక్షరాలన్నీ ఒకటొకటి కనుమరుగై వాటి స్థానంలో లంబాడ లక్ష్మి మిగిలిపోయింది.” కథ ముగిసింది. కాని ఆ పిల్ల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. ముఖ్యoగా, ఆ ముఖం. వేయి ఎలిజీల సంతకం.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply