చివరి రోజు

ఇవాళ్టికీ ఇదే నీ ఆఖరి ఊపిరి అనే వాక్యం ఒకటి
నీ చెవిన పడింది అనుకో
అప్పుడు నువ్వు
ఎలా వుంటావ్
పసిపాప లాంటి నవ్వుని
ప్రసారం చేయగలవా
ఇప్పటి దాకా చేసిన తప్పుల్ని
చేతులు కట్టుకుని ఒప్పుకోగలవా
ఎవరెవరినో
చూడాలని ప్రకటనలు చేస్తావ్ కదూ
ఆస్తిపత్రాలు,అప్పులు
పంపకాలు, భీమా సంతకాలు
వీటి కోసం
రక్త సంబంధాల ఆరాటం
నిన్ను కుదురుగా ఉండనిస్తుందా

పోతావ్ అని తెలిసిన క్షణం
వీలు ఉంటే ఎగురు, దుముకు
ఎవరినైనా నొప్పించి ఉంటే
వెంటనే క్షమాపణలు పంపు
పూలు కోయద్దు అని
ఆదేశాలు జారీ చెయ్
పోతే పోయింది
బోడి ప్రాణం అనే ధీమా వ్యక్తం చెయ్
ఒక చెట్టును నాటు
కొంత శ్వాసను వాగ్దానం చెయ్
ఇక నీకు
ఇల్లు ఉండదు
వాకిలి ఉండదు
ఊరు ఉండదు
ప్రాణం వలస పోతుంది
నెత్తురు బొట్లు, పేగు పాశాలు
గుంజకు కట్టిన పశువు లా లాగుతాయ్
అపుడు నీకు
ఒంటరి ప్రయాణం అని గుర్తుకు వస్తుంది
ఈ దిగులు
అప్పుడెప్పుడో ఉంటే
జీవితం ఎలా ఉండేదో అనే వార్త ఒకటి
నీకు తెలియకుండానే
ప్రచారం ఐపోతుంది.

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

5 thoughts on “చివరి రోజు

  1. అవును అది ఆది నుంచి ఉండవలసిందే……

  2. మరణం.. దైర్యం.. స్నేహం చేస్తే
    నీ కవిత అలా వుంది

  3. చివరి రోజు ముందే తెలిసినా ,తెలీకపోయినా మోహం లేని జీవితాన్ని గడపడం అలవరుచుకుంటే ఆ ప్రయాణం చాలా తేలిగ్గా ఉంటుంది..బావుంది సర్

Leave a Reply