చిన్నక్క

మూడు రోజులుగా విడవని ముసురు.
గుడిసెల సూర్లపొంట, చెట్ల ఆకుల కొస్సలకు పూసవేర్లోల్లు అమ్మే బోగరు ముత్యాల లెక్క ఆగి ఆగి రాలుతున్న నీటి చుక్కలు.
పాకురుపట్టిన ఒక్కరిద్దరి బెంగళూరు గూన ఇండ్లు, కుమ్మరి పెంకల ఇండ్లు, తాటాకుల గుడిసెలు.
ఒక్కటేoది – నల్లటి మనుషుల లెక్క తుమ్మ చెట్లు సాయెనలుపొల్ల లెక్క వేపచెట్లు ముసలోళ్ల లెక్క చింతచెట్లు.
గడ్డికుప్పలు, ఎడ్లు గొడ్లు, బండ్లు, మనుషులందరూ పెయి మీద తీద్దామంటే గింత మట్టి లేకుండా నిమనిమాల కడిగినట్లున్నాయి. మన కండ్లనే సబ్బుతోని కడుక్కున్నామేమో అనేంతటి మైల లేనితనం కనుచూపుమేర.

”రేడియోలల్ల ఇంక మూడు రోజులు ఉన్నదంటార్రట తుఫాన్”

మా ఇంటి ముంగటి కుమ్మరి కేశవులు తాత మా బాపుకినబడేటట్టు ఆయన కాయెనే చెప్పుకుంటాండు.
బండ మీద కూసోని ముందుకు వంగి రెండు కాళ్లని పర్ర పర్ర గోక్కొని దోతినీ బుడ్డగోసి లెక్క దగ్గరకు చేసి పెయ్యి మీద అంగీ లేకుండానే…, వీపుల కట్టె వెట్టుకొని నడి వీపుల నుండి ముడ్డి పై బాగం దాకా రాక్కుంటూ అందినకాడ ఆయిమనేలా గోక్కుంటూ అందని కాడ ఆపతిపడుతూ ”అన్నన్నా… ఆ …, ” కేశవులు తాత.

ఈ మధ్య ఇందిరా గాంధీ సచ్చిపోయినప్పటి నుండి మా వాడకి వాళ్ళింట్లో ఉండే ఏకైక రేడియో వార్తలకి ఎక్కడ లేని గిరాఖీ. వాడపొంటోల్లకి ఎక్కడలేని నమ్మకము ఆయన నోట వినే వార్తల మీద.

మా బాపుకి కేశవులు తాతకి మాటలు బందు అయినయి ఈ మద్య. ఇద్దరిది అయ్యా కొడుకుల వరుస.
ఇప్పుడిప్పుడే మాటలు కలుస్తున్నాయన్నట్లు గుర్తుగా కేశవులు తాత మాటకి మాట కలుపుతున్నాట్లూ …
”వీనవ్వ సెడగొట్టు తుఫాన్ అవ్వనీ దెం.., వానలు పడితే బతుకుతరు రైతులు. గని గీ తుఫాన్ నాశడగాలానికేరా !” అని తిడుతండు బాపు మొగులు దిక్కు చూసుకుంటూ. అది వానానో కేశవులు తాతనో !?

నానిన ఇండ్ల మట్టి గోడలు కూలిపోతున్నాయి. ఆ కూలుడుకు ఎర్ర అలుకు గోడల మీద సున్నంతో వేసిన ముగ్గులు, మనుషుల, ఎడ్ల బండ్ల , వండుక తినపోయేటప్పుడు గంపలు నెత్తిన బెట్టుకున్న ఆడోల్ల బొమ్మలు రాలిపోయి తొవ్వపోంట నీళ్ళల్లా కలిసిపోతన్నయి. ఎగిరిపోయిన గుడిసె మీది గడ్డిని, తుంగని, తాటాకులని తుంపుర్ల నడుమనే సదురుకునెటోల్లు కొందరు.

”మద్యాహ్న భోజన” బడి బియ్యంని అర్ధరాత్రి పూట ఎడ్ల బండ్లల్ల ఏసుకొని మా ఊరి సర్పంచ్ దొర రంగారెడ్డి ఆయన వెంబడి ఉండే బట్టు రాజయ్య, ఆది వెంకట్రాజం, మద్దికుంట నర్సయ్యలు కలిసి దొంగతనంగా అమ్మటానికి పోతాoటే కొత్తగా తయారైన సిపాయి ( సీపీఐ ) పోరగాండ్లoదరు గ్రామ పంచాయితీ వెనుక పిచ్చి చెట్లల్ల రాత్రంతా పానసరం పండి వాళ్ళని దొరకబట్టిండ్రు.

ఆది మధుసూదన్, తాళ్ళపెళ్ళి లక్ష్మణ్, మల్లయ్య, శంకర్, నల్ల జనార్దన్, సాకలి శంకర్, వడ్ల లక్ష్మీరాజం, తూడి కనుకయ్య…, ఇంకా సోపతులు అందరూ కలిసి సర్పంచ్ రంగారెడ్డి దొరని అతని సాయిత బట్టు రాఘయ్యని దొరకబట్టి గ్రామ పంచాయితీ ఆఫీసులో కట్టేసి తాలాలేసిండ్రు. దొరికినట్లే దొరికిన ఆది వెంకట్రాజం, మద్దికుంట నర్సయ్యలు వాళ్ళ ఖమీజులు విప్పి పుస్కిపోయి సగం బరివాతనే దొరకకుంట తప్పించుకుకొని చెట్లల్ల వడి కర్నాలకుంట దిక్కు ఉరికిండ్రు శీకట్ల దొరకకుండా రాయి రప్ప అనకుండా.

తెల్లారి పోలీసోల్ల ముందర ఊరు ఊరంతా వచ్చి చూసినందుకు మానం పోయిన సర్పంచ్ రంగారెడ్డి దొర ఊరిడిచి పోయి కరీంనగర్ లో పడ్డడు . అట్లా మా ఊరు సర్పంచ్ లేని ఊరయ్యింది.

ఇట్లా ముసురు కొట్టినప్పుడు గోడలు కూలితే వాడల పొంట పేరుకన్న వచ్చి రాసుకపోయే సర్కారు మనుషులు పత్తా లేరు.
పెద్ద మాదిగ దేవుని రాజయ్య పొద్దు పొద్దుగాలనే డప్పు చాటింపు చేస్తాండూ…,

”ఇగో ఇన్నోళ్లెవరో ఇననోళ్లెవరో … తర్వాతనైతే నన్ను తప్పు పట్టద్దుండ్రీ… పెచ్చెరువు కింద కట్ట కింది పొలాలళ్ళకెళ్లి నారు మడులు దున్నాలంటే.. మానెట్ల దిక్కు పోవాలంటే… పెచ్చెరువైతే నీళ్లు దాటనిత్తలేదు. సిపాయోల్లు ఊరంతా మూటేసి పైపులు అడ్డమేసి మట్టి వోసి ఏసిన రొడ్డాంకి నీళ్ల తడ ఎక్కువై తెగేటట్లు ఉన్నదట … ఇంటికొగలు రావాలని… ఇది సిపాయి పాల్టీ ఏయిస్తున్నా దప్పో….అహా…”

డప్పు అయిపోయినంక మళ్ళీ ఉత్తగనే వివరంగా అక్కడున్నోళ్లందరికి చెప్పుతాండూ దేవుని రాజయ్య.
”ఓరి రాజీగా .. ఇగా ఊరు ఉంటాదిరా.. పెద్ద పులసొంటి దొరని ఊరు దాటిచ్చిరి ఈ నడ్మంత్రపు సిపాయోల్లు. ఈ మదుసూదన్ మీ మాదుగులు మన్నెపొల్లని సిల్లరగాళ్లని పట్టి హరరా అన్పించవట్టే దొరని…. ఇయ్యాల నువ్వు కూడా వాళ్ళు సెప్పినట్టే విని దప్పు సాటింపుసేయబడితివి. మారే.. నేను సూడనా? సర్పంచ్ దొరోరు మల్ల రాకపోతడా ఊల్లెకి… మీకు రోకలి బండలెక్కియ్యకపోతడా …?”

కాళ్ళు నెర్రతన్ని నిల్సోని తలకాయ ఊపుకుంటా కను గుడ్లు తింపుకుంటా కేశవులు తాత.
నాకైతే ఏం తెల్వదు అన్నట్లు మాట్లాడకుండానే కొంచెమంతా పరాశికంగానే నవ్వుకుంటూ రెండు చేతులతో దండం పెట్టి మల్లీ డప్పు కొట్టుకుంటూ ముందుకు సాగిండు దేవుని రాజయ్య.

”రాజు పోతే రాజీర్కం పోతదా? ఊళ్ళో ఉన్న చిన్న దొర మీ లగ్గము మా జేత్తడు ఆగలేవుర్రి …” అని తొవ్వల పోయేటోళ్లందరు వినాలని సెప్తండు కేశవులు తాత.

సూర్యుడు బయటికొచ్చిండు మబ్బు చాటు నుండి.

అంబటాల్లైంది.

సినుకులు తుప్పురు తుప్పురు చిన్నగా ఇంకా పడుతున్నాయి.
జనాన్ని పోగు చేత్తార్రు సిపాయోల్లు. ఆది మధుసూదన్, తాళ్ళపెళ్ళి లక్ష్మణ్, మద్దికుంట మల్లవ్వ, శ్రీరాములపేట మల్లవ్వ, ఆడెపు రాంబాయిల నాయకత్వములో రోడ్డాముకీ మళ్ళీ మట్టి పొయ్యాలని.

ఒక మూలకి ఒచ్చోరువకు ఉండే మా గంజులు బోళ్లు కంచాలు మా గుడిసంతా పర్చుకున్నాయి ఎక్కడ చినుకు ఉరిస్తే అక్కడ. కింద అడుగుపెట్టే మార్గము లేక బొంతని చుట్టుకొని గడాంఛలో మా గుడిసె ముందు బాజు మా తాత దగ్గర పండుకున్నాను నేను ఆ మొత్తు వాసనలో నాకు కల్పించిన ఆ సౌలతులో .

”ధర్ణినందున సుల్తానాబాద తాలూక కనగర్తినందునా” పద్యము మద్యల్నే ఆపి
”ముసురుకు వుడిగే మల్లయ్య గొర్లు చిటుకు రోగము వచ్చి టప్పటప్ప సత్తన్నయటయ్యో ..” చీరిన పిండిబత్తాల సంచి కప్పుకొని తొవ్వ పొంట మోకాళ్ళ దాకా బురద చిల్లిన ఉరుక్కుంట చెప్పుకుంటాపోయే మాజీ సర్పంచ్ మడక రాఘవరెడ్డి పాలేరు మన్నెపొల్ల సంజీవ్.

కొంచెము గెరువులాగా తప్పతప్ప చినుకులు పడుతుండగానే అరికట్లాలు కట్టుకొని సెంబడుక పోయే ఆడోల్లు. బైలుకి, పనికి పెసరు సేనులల్లకి, మడికట్టు పొలాల దిక్కు చూసిరాను పోయేటోల్లు కొందరు.

అగ్గువ సచ్ఛిన గొర్రె కూర ఆముదాను తిని దొడ్డికి ఆగక మా వాడ ఆడోల్లు పోయే తుమ్మ చెట్ల దిక్కే పోయి చాటుకని మూలమలుగు నడి తొవ్వలనే ఏర్గ కూర్లవడ్డడు మా వీరయ్య తాత.

ఆనెగాల్ల మీద కూసోని దండి కష్టమే వచ్చినట్లు తల్కాయ కంతలని రెండు సేతులతో రెండు దిక్కులా గట్టిగా ఒత్తుకుంటూ
”దీనవ్వ కట్టం పెండ్లాన్ని … ఆ… ఆ…అ. గొర్రె సచ్చి ఆడికి ఎన్ని దినాలయిందో? అండ్లకే బుడ్డు కల్లు సోపతాయే.

మోసం జరిగెరా ! శంకరా ! … ” అని అటు దిక్కు పోయే ఆడోల్లకి హెచ్చరికలా ,ఎవలన్న ఛూస్తే తన పరిస్థితిని అర్థం చేస్కోవాలని గట్టిగా మాట్లాడుకుంటూ కూసోని ఏరుగవోతాండు.

కడుపంత గాలిచ్చినట్లయ్యేసరికి తినుకుకుంటా అపసోపలు పడుతుంటే మాట ఆగిపోయింది.
అంతట్లనే రోజులెక్కనే ముచ్చట పెట్టుకుంటూ ఆ దగ్గరి దాకా పోయి మూలమల్గిన ఆడోల్లు పిడాత ఎదురైన ఆ ధృశ్యము చూసి
”వవ్వో … వీనింట్ల పీనుగెల్లా ..”
”ఇంతంత భయం గాలే.”

అని సెంబుల నీళ్ళు ఆన్నే పారవోసి సేతుల ఊంచుకొని ఎవరి వీపుల వాల్లే గట్టిగా కొట్టుకోని ఇంటికి మర్రుతార్రు.


** ** **


మా పెద్ద గోపు తాత ఎడ్ల కొట్టం కిందా –
కొట్టాం అడ్డసరం దూలాలు గట్టిగా లేవని బలముకల్ల మనుషుల్నే నిల్చోబెట్టి ఆళ్ళ జబ్బల మీద అడ్డము కట్టెవెట్టి సచ్చిన గొర్లని కొలికిడేసి కోత్తార్రు.. ఏ సప్పకి ఆ సప్పలు తీసి పొగులేసినంక పట్టుకపోయేటోల్లు కొందరైతే మిగుల్తే అచ్చేదేమున్నదని అర్కులల్లా గిన్నెలల్ల పెట్టి కొందరు ఇండ్లళ్లకే పంపిత్తండు ఉడిగే మల్లయ్య , దూదేకుల ఖాజా చిచ్ఛా.

మీద పడేత్తే తిన్నంక వాళ్ళే ఇత్తరని సచ్చినోని పెండ్లికి అచ్చిందే కట్నమని వాళ్ళ అందాద.

** ** **

కొంచెమంత తేటగైంది మొగులు ఆ రోజు.

మా వాడ మూడు బజార్ల కాడ కల్సిండ్రు మా రంగు తాత (రంగయ్య ) గోపు తాత ( గోపయ్య ) వెంకు తాత ( వెంకటయ్య ) దోతుల సింగుల్నిరొండిల కుచ్చుకొని బరి కాళ్ళతోనే నిల్సుoడి ‘’ విన్నావురా వెంకటి ! వొర్నీ అక్క ఇంత బతుకు బతికి ఇంటెనుక పడి సచ్చినట్లైపాయే కదరా దేవుడా ! సచ్చిన గొర్లని తిన్నామనే పేరొచ్చింది గీ సావుదలకి. సౌరానికని గా మంగలి ఆయిలయ్య ఇంటికి పోతే తొవ్వపోంట పోయేగా ఆడక్కెల లింగడు
“ సచ్చిన గొర్ల తిండి మంచిగనే పడుతాంది నీకు పటేలా ! కొయ్యగాల్లకి సిగురచ్చినట్లైతార్రు మీ అన్నదమ్ములంతా …, ”

అని కారెడ్డంగా ముసిముసి నవ్వుకుంట ఈ మాట నలుగురి ముందు అనేసరికి నాకైతే ఇంతంత నామర్దే అన్పించలే ‘ అన్నడు గోపు తాత మొదలు.

‘’ అంతేనా… ఆడి దాకా తెల్సిందా? చెత్తెరీ ! ఎంతపనైపాయే ఎంతపనైపాయె ‘’ పింజాము పింజాము అని చేతులన్ని పిసుక్కుంటాండు మా వెంకు తాత ఇజ్జత్దారీ మనిషి.

‘’ నేనాడికి వద్దంటే ఆ కుర్మ గాడిదికొడుకు వినకపాయే. తిననైతే తినరా ఎల్లితే ఇత్తువు లేపొతే లేదని మీద పడేసే. కాపుదనపు పుట్టువడి పుట్టి సావుదలకి ఎంత నామోషితనమయిపాయేరా నాయిన్నా! సచ్చిన గొర్లు తిన్న కులం అని రేపు ఎవనితోని ఏ మాట పడాల్సి అత్తదో. అంగదోలడానికి ఓ సందు దొరికే ఎదురైనోనికి. మందెందుకు రేపు మా మేకలోళ్ల సట్టo మేక రామయ్య బామ్మర్దే అంటడు. లోపలికెళ్లి చూత్తే వానింట్ల ఆటమైన తినే చిప్ప గతి లేదు కని నిలువుపోకిల్ల తనపోడు. ‘’అని తుప్కుమని కాండ్రకీంచి దండి దూరమే ఊoచిoడు రంగు తాత.

ఇంత పొగాకు పెట్టరా అని రంగు తాత దగ్గర అడిగి తీసుకొని నోట్లో వేసుకొని నములుకుంటా ఆలోచిస్తాండు గోపు తాత ఈ అపవాదుని ఎట్లైన పోగొట్టే మార్గము చూడన్నని.

‘’అమ్మా నాకేమో గాని ఆ… కాలి అవుతుంది . ఆకలి బాధ తీర్చవే మా అమ్మ జననీ “అని చిరుతల రామాండాముల ఆంజనేయుని పాట అందుకొని బీడీ తాగుకుంట వస్తున్న కీసల మంగలి కత్తులేసుకొని తిరిగే మంగలి ముత్యాల రాజయ్య మామ.

దూరం నుండే ఈ ముగ్గురిని హేళన చేసుకుంటూ దగ్గరికొచ్చి మోకాళ్లపై కూసోని దండం పెట్టి ఆంజనేయుని లెక్క ఫోజు పెట్టి కిలుక్కున గట్టిగా నవ్విండు. వీళ్ళ ఇషారమ్ దూరం నుండే గమనించిన వ్యక్తి.

రాజయ్య మామ కాలుతున్న బీడీని అడిగి బీడీ అంటుబెట్టుకొని తాగుకుంట గుసగుస చెప్పుతాండు మా వెంకు తాత.


** ** **

గెరువు కాంగనే దుక్కి సవరియ్యాలే, ఒడ్డు ఒరము సరిచెయ్యాలని మా ఇంట్లోళ్లందరు మాకున్న ఎకరంనర పొలము కాడికి పోయిండ్రు. మా పొలం పక్కనే ఉన్న మురార్రెడ్డి దొర భూమి పాలుకు పట్టినం మేము.

నేను మా తాత దగ్గరే ఇంట్లో ఉన్నాను. ఊకే చేసే పనే – గుడిసె వాసాలని లెక్కపెడుతూ ఏదో కొత్త ఆలోచన వచ్చి
”మనసోoటి ఊర్లు ఇంకెన్నుంటాయి తాత?” అని అడిగిన నేను మా ముసలోన్ని.

”ఓ మా పాడైతాయిరా.. “ అనుకుంట చెవులకెళ్ళి ఎండిపోయినా సుట్ట తీసి మూలలు ఒత్తి తుప్ప తుప్ప ఊంచి, దూరంగా ఉన్న కుంపటిని దగ్గరికి తెమ్మని నాకు సైగ చేసి “ ఇప్పుడు చూడలేవు ఇగ మన తాతలే సర్కారోనితోని పడక మెతుకు (మెదక్) జిల్లా నుండి భూములు జాగాలనిడిసిపెట్టి ఉన్న గొడ్లను, జినుకల్న, మేకల్ని మేపుకుంటా మేపుకుంటా అచ్చి ఇగో ఈ ఊర్లే కి రాంగనే అబద్దము అడద్దు వాళ్ళ దీపమే”
అనుకుంట రెండు చేతులతోని మొగులు దిక్కు మొక్కి ఆగిండు.

”తెనుగు పిట్టల యెల్లయ్య తాతలు ఇగో మెట్టుపల్లి గుట్ట దగ్గర మనల్ని ఎదుర్కొంటే ఇక్కడ ఆగినము మనము గైశెట్టూల్లము, సెర్కుతోటోల్లము, కొట్టోల్లము మునుపున్న కాడ కూడా అందరము దగ్గరోల్లమే అయితిమి. ఇగ సూడలేవు ఆడికి మెతుకుకి సర్కారోడు ఎంత దూరముంటడో… ఈడికెళ్ళి మెతుకు ఇంకెక్కువనే ఉంటదట. అవతల ఇంకా పదుల సర్కార్లు ఉన్నాయట. మా ముత్తాత రాయేశరాయుడి కాలముల మనము రాజులమేనటరా అయ్యా, రాజుల సంబంధపొల్లమే. రాజులసొంటి సట్టమే మనది. ఇయ్యాల గీ గతి అచ్చింది గని ”అనుకుంట చుట్ట ఓ దమ్ము పీల్చి తుపుక్కున ఊంచితే అది మా తాత మీసాలకె చిక్కి ఆగి ఊగులాడుతుంది సీమిడి కండ.

”ఇగ నువ్వు ఎప్పుడన్న గా గుమ్మెనుక పాత ఇనుప సామానుల కాడ చూడు మా రాయేషా రాయుడి కత్తి ఉంటది. ఆ తర్వాత ఏమీ నాశడకాలము పుట్టిందో మనకు సర్కారుకి పడలేదట నాత్రికి నాత్ర్రే పీక్కోనచ్చి ఒగని అయ్యకి దొరక్కుండ గుట్టలబాజుపొంటిపడి గుట్టలల్లనే బతుక్కుంట అత్తాంటే…, ఈ ఊరికి ఉత్తరము బాజు మెట్టుపల్లి గుట్టల్లో పిట్టల ఎల్లయ్య ముత్తాత గుట్టకి సింతపలక్కాయలు తెంపుకుంట మనోల్లను చూసి కలిసి ఈ ఊరికి నేనే పెద్ద , ఊరిని పొందించిందే మా తాతలు మీరేం ఫికర్ పడకుండ్రని మాటిత్తే మెట్టుపల్లి గుట్ట కింద ఇగ ఈడ నిక్రానైనం.”

నాకు ఆ ముచ్చట ఏం పెద్దగా వినబుద్దైతలేదు కానీ మా తాత వద్దన్నా గాని ఆపేటట్లు లేడు.
ఆయన మనసులో ఉన్నదంతా కక్కాలనుకుంటాండు. మళ్ళీ మొదలుపెట్టిండు.

“ఈ ఊల్లే ఆ మెట్టుపల్లి చెరువు తవ్వింది మన తాతలే. జంగలంతా కొట్టి సాపు చేసినం. పొగాకు మొదాలు పండించింది మనమే. ఇట్టాలోల్ల పొగాకు తోటంటే లోకమంత ఆశపడి సత్తురు. అచ్చుకట్టి భూమి పొదన చేసింది మనమే. ఇప్పటికీ శీనువాస్రెడ్డోడు మీ బాపు జంబు కొడితే తప్ప ఇంకొగల్ని మెచ్చడు ఈ ఊళ్ళే. అప్పుడు మనకు తెలివిలు లేవు గాని ఆపుకుంటే ఊరంతా మనదే అవు. మా అయ్యలు దొంగ గాడుదులు ఉన్న పశురాల కోసుక తినుకుంట తాగుకుంట తిన్న బొక్కలు కుండలల్లా బుడ్లల్ల పెట్టి తిన్నకాడనే ఏరిగినట్లు నడింట్లనే పాతి పెట్టిరి సంపాదన లెక్క, కని భూములు కాపాడలే. నా ఎరుకకి ముప్పై ఎకరాల భూమి ఉండేది మా నాయిన్నలకి. మా పోరాగాండ్లు పెరిగిన కాడికెళ్ళి ఉప్పు పుట్నాల కింద నేనే సగమంత అమ్మితి ఎల్లువాను లేక. పిల్లిగుండ్ల కాడి సెలుక నేనే పోగొడితి సిన్నదొరకి. మన భూములు పోవుడు కెనాల్ పారుకం నీళ్ళు అచ్చుడు ఒకటైంది.

జెట్టవ్వ కూసుంది మన మీద ఏం జేద్దము బిడ్డా ? మొన్న ఎలాంబిలు బ్యాంక్ లోన్ ఇత్తరంటే అందరం పోతే పోట్వోలు దిగాలని పెద్ద జంజాటకామే చేసిండ్రు మండల ఆఫీసుల. ఒక్కొక్కల పేరు పెట్టి పిలుత్తాంటే నా పేరు రాంగానే రాయుడు అని పిలువంగానే ఎక్కడొల్లు అక్కడ పక్కకి దొలగి చూసిర్రు. నీ అక్క నేనే ఐతిని ఆ రాయున్ని. రాయుడు అంటే ఈడె౦త పెద్ద మనిషో అనుకున్నోళ్ళు పెయ్యి మీద అంగీ లేక జబ్బ మీద పంచేసుకున్న నన్ను చూసి “ నీ అక్క గీ ఊసుకండ్ల ముసలోడేనా రాయుడు అని వక్కడ వక్కడ నవ్వవడితిరి బద్ధుమాసులు. ఏం జేద్దముర అయ్యా అంగవడి మొద్దు కట్టం చేసుడే కని ఉషారుతనం లేకపాయే మనకి. ఎనుకట ఊరికి మనము, పిట్టలెల్లయ్యోల్లే ఉండేది నీతికైనా న్యాయానికైన. మడక రాఘవరెడ్డోని తాత ఏడి నుంచి ఊడిపడ్డడో కచ్చురాలు మందితోని డామూడీముగా సర్కారోనితోని ఏదో సిలుకు రాయించుకొని తెచ్చుకొని పిట్టలెల్లయ్య తాత ఎల్లయ్యని పిల్చుకొని సర్కార్ హుకుమత్ సూయించి ఊరు మీది మంచి మంచి భూములన్నీ గుంజుకొని ఇక్కడనే ఆడు దొరోడైపాయే. ఆనితోని సిన్నదొర సీనువాస్రెడ్డి తాత ఆని బామ్మర్దొల్లు ఆచ్చిరి. సిన్న సిన్నోల్లనైతే బెదిరించి , ఎవనికెళ్లుమాను లేకుంటే వాని భూములన్నీ ఉప్పు పుట్నాల కిందనే గుంజుకునిరీ…, సెప్తేముంది కథ ఒకనాడు ఒడిసేదా బిడ్డ ! దొరోళ్ళతోని పెట్టుకొని మా తాతలు కొందరు నెగ్గక తూర్పుదేశానికి ఒరంగల్ దిక్కున పోయిండ్రు. జంగల్ కొట్టుక భూములు చేసుకొని ఆన్నే నిక్రాన్ అయిండ్రు.

అంతట్లనే ఎనగర్రకున్న బల్లి కిట్ కిట్ మని అరవడముతో “కిట్ట కిట్ట. సచ్చమ్. “ అని ఆగి “చ్చొ చ్చో చ్చో “అని చప్పుడు వచ్చేలా నాలుకతో ముంగటి మీది పండ్లని ఊంచుడుతో కలిపి తాకించిండు.

కొద్దిసేపు ఏదో ఆలోచనలో పడిపోయి ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టిండు.

“శివుని గుడి పోచమ్మ దేవుల్లే మన దేవుళ్ళు. అయ్యోరి వరదయ్య పంతులు ఆళ్ళ తాతలు నీసు తినేటోల్లే ఏదన్నా సావుకి సాత్రానికి ఇంత చాటల ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది ఉన్నాయేమన్న పెడితే పంచల కట్టుకొని తీసుకపోయేటోల్లు ఇంత అడ్డంబొట్లు నొసలుకు దండ చెయిలకు పెట్టేటోల్లు . తమ్మలి నర్సయ్యోల్ల సట్టానికి శివ్ని గుడి కింద ఇనామ్ భూమి ఉంటే దున్నుక బతుకుకుంట గుల్లే దీపానికి, ఊడ్చుటానికి మొక్కులకి ఉండేటోల్లు . గుల్లే దీపాలు పెట్టినోళ్ళు, ఊడ్చినోళ్ళు ఇపుడు దొరల ఇండ్లల్ల దీపాలు పెట్టుకుంట ఊడ్చుకుంట దొర దగ్గర దాసి పని చేత్తార్రు. ఇదంతా నడుమంత్రాన్నే పుట్టిన సిరత్తు. నా పెండ్లి మా కొండాల్రాయుడు తాతే చేసే. మా మేనమామగాడు మాకేం లేదని మీ అమ్మని (మా బాపమ్మ) నాకియ్యానంటే మా నాయిన్నలు నడిజాము రాత్రి సవారి కచ్చురములల్లా పోయి రాత్రి పూట ఏక్సీపాయిల లెక్క ఎత్తుకచ్చిర్రు చిన్నపోరి మీ అమ్మని.

బావనోడెక్కడిది గీ మంత్రాలెక్కడివి? గింత పెద్ద కట్నాలెక్కడివి? ఏ కులముల ఆ కులపు పెద్దనే నాలుగు బుద్ది మాటలు చెప్పి, పాటలు, పదాలు పాడి లగ్గం చేసేది. మజ్జలో ఎవడు రాజ్యానికెక్కిండో ఏమో గాని ఈ ఊరికి దొరోడచ్చిoడట, అటెనుకనే మోతుక చెట్టుకు మూడాకులన్నట్లు ఇప్పుడీ బావన్ (బ్రాహ్మన్ ) శంకర్ రావు , నత్తి రాజయ్య బావన్ పంతులోళ్ల తాతచ్చిండు. చుట్టూ పదూర్లు దొరోడు నాయంటే , చుట్టూ ముప్పై ఊర్ల పెట్టు అటు ఏటి అవుతల జంగంపల్లే నుండి ఇటు కొల్లూరు గుంపుల గూడెం వరకు నాయేనని బావనోడన్నడు. మడక రాఘవ రెడ్డి ఇంటికాడి గుండ్లల్ల వేంకటేశ్పర్ల సామి గుడికట్టిండ్రు బావన్ పంతులు సెప్తే. అటెనుక బావను పంతులచ్చి పాత శివుని గుల్లే చొచ్చిండు. అందరి ఇండ్లల్ల ఉన్న మల్లన్న, రాయేసుడు దేవుళ్ళని తీసుకపోయి ఆ శివుని గుల్లనే ఇడ్సపెట్టమన్నడు. మా నాయిన్నలు బడ్డు కూడా ఇనలే. అందుకే ఇయ్యాల్ల మన రాయేసుడు దేవుడు, పెద్దేవర మన దేవన దేవతలు మనకున్నరు. “అండ్ల లింగం ఇండ్ల లింగం “అని మన దేవుడు మనకు, మన దుబ్బులోడు కొలిత్తే మన పెద్దేవర మనకి ఉన్నది. ఇప్పటికీ ఆ వెంకటేస్పర్ల గుడి పడావే ఉంది. మొదాలు మన ఈ ఊరి పేరు మెట్టుపల్లి గుట్ట పేరు మీద మెట్టుపల్లేనాయే. అటు మెట్టుపల్లి చెరువు ఇటుఊరు పొడుగూత పెచ్చెరువు నడుమల దానకుంట ఉత్తరాన మానేరు ఏటిగడ్డ ఊరంతా బంగారం పండిందేనాయే.

ఒక్కేడేదో కరువత్తే వానలు రాక, ఊరు పొందించినపుడు బావనోడు పుల్గము పోయలేదని తొంపు పెట్టి పూజలు చేసి బంగారం సంపాయించే ఊరని కనగర్తి అని మారుపేరు పెట్టిండ్రు బావoడ్లు. ఆయింత కట్ట కింద మంచి పంటలు పండే భూముల దొబ్బిండ్రు. ఈ బావండ్లు ఊరికి చదువు చెప్పినోళ్ళు కాదు శాత్రము చెప్పినోళ్ళు కాదు. తురుకలు, గుల్లల్లకెళ్లి బయటికొచ్చినంక అయ్యోరోళ్ళు ఇంత చదువు చెప్పిండ్రు మందికి. ఆది రామయ్య, చిన్న ఇమామ్, కమ్మరి ఎంకటసామసొంటి పోరగాండ్లు ఎదిగినంక ఊరికింత తెలివచ్చింది రామండము, భారతం పదం, పద్యం తెలిసచ్చినయి. మన్నెపోల్ల సుక్క పోసిగాడు “అర్జన్స్ రామండము”ల తాటకి ఏషమేత్తే బొబ్బకొట్టాలే ఊరంతా, చిన్నపోరగాళ్ళు నాల్గు రోజులదాకా తల్లి రొమ్ము ముట్టరు. అని తాత సెప్పుకుంటా పోతాoటే…

ముసురుల తడిసిన మట్టిగడ్డోలే అయి మా అవ్వ అనుక్కుంట వచ్చింది.

గుడిసెల లోపలబాజుకిపోయి “సాకలి కనుకు (కనుకవ్వ) అచ్చిందానే మామ “ అని అడిగితే
“రాలేదు బిడ్డ “అనుకుంటనే
“పెసరు దంటాలు బురదలకి తొక్కిండ్రా బిడ్డా “ అని అడిగిండు తాత.

గంజులల్ల గిన్నెలల్ల నిండి ఎక్కువైపోయిన నీళ్లన్నీ కారి ఇల్లంతా అలికిన పుట్టమన్నురంగుతోని ఇసుకిసుకు అయింది. గిన్నెలల్ల నీళ్ళు బయటపారపోసుకుంటా మా బాపుని తిడుతంది మా అవ్వ.

“ వీని ఇల్లు పాడుగాను. వీని ఇల్లు నాశడం కాను. ఎంతకని సెయ్యాలే సేత. పదేండ్ల పోరినై ఈ లేకిడింట్ల సొత్తే. ఇగ ఒడవదాయే. అగొడవదాయే కట్టం. కాల్జేతుల నల్గురు పోరగాండ్లు ఐరి. పెద్ద పోరి పెండ్లికి ఎదిగే. అదెపాయే సక్కగ పందామంటేనన్న ఇంత జాగా దిక్కులేకపాయే. దేశగల్ల మారాజుకి దేశగల్ల వేషం … “అని ఏడ్సుకుంట తిడుతంది మా అవ్వ.

గిన్నెలు బాసనులు మల్ల అక్కడనేపెట్టి మా కుటుంబము అందరము కిందపండి కప్పుకొనే దుప్పటిని సుట్టుకొని తడిసిన సీరే రైక విడిసి నాకిచ్చి
“మా అయ్యా కాదు నాకింతంత దవజోర్రలేదు బిడ్డ పానమంత ఉగ్గబట్టినట్లైతాంది “ అని ఆ సీరే రైకల్ని బయటిబాజు తాత దగ్గరి దండెము మీద ఆరెయ్యమని జెప్పి అనుక్కుంటనే మాకున్న ఇంకో నులక మంచముల పన్నది మా అవ్వ దుప్పటినే కప్పుకొని బట్టల్లేక .
యాల్ల పొద్దుగాలనే సాకలి కనుకవ్వ ముసురుకి అలుకు పిడుసోలే మారిన తడిచిన బట్టల్ని తెచ్చింది.

మాబాపు పెద్దక్క చిన్నక్క అన్న అందరు ఇంటికొచ్చిర్రు. బాపు అన్న అచ్చేటప్పుడే బాయిల మునిగచ్చినట్లున్నరు. పెయి మీది బట్టల్ని పెయిమీదే పిండుకుంటార్రు.

పెద్దక్క తానము చేసి పొయ్యి అంటుపెడితే నేను మా చిన్నక్క మా అవ్వ పొయ్యి చుట్టూ చేరినము.

** ** **

ఆకాశం ఎల్లడమయింది పూర్తిగా. కోడి పిల్లలు గప్పుడు బయటికొచ్చి భూమిని తవ్వుక బుక్కుతున్నాయి గద్ధల భయము లేకుండా.
ఇంత పెద్ద వానకి గద్ధలెక్కడనో పెద్ద పెద్ద నేలబోయిరములల్ల మల్సుకోని పండి ఉంటాయని చెప్పిండు మా తాత. బయట చెట్టు మీద కాకులు కావురుకావురమని అరుత్తన్నయి. ఉరుముల చప్పుడుపోయి ఇప్పుడు కాకుల చప్పుడు వింటూంటే ఆ వాతావరణము మంచిగ అన్పిత్తాంది .
పరుపాటి మల్రెడ్డి ( మల్లారెడ్డి ) మామ ఇంటికచ్చి బాపుతో మాట్లాడుతుండు. గుండ్లల్ల చెరువుకాడి పొలము కాడ మాకు వాళ్లకి వాయిలింజన్ మరియు మోటకొట్టే పొత్తుల బాయి ఉంది.

హవుసలొల్ల నారాయణ తాత వచ్చిండు. మా ఇంట్లో ఉండే రెండు కట్టే కుర్చీలల్ల ఒకటి తీసుకచ్చి ముందటేసిండు మా అన్న .
“ఇంట్ల కొత్త రూపాయి లేదు. బియ్యం లేవు. ఎట్లా ఎట్లా “ అని మా అవ్వ చేతులన్నీ పిసుక్కుంటంటే మా పెద్దక్క ఎండాకాలములో పరిగే ఏరుకొని అమ్ముకున్న వడ్లకి వచ్చిన ఒక్క రూపాయి ఉన్నదని చెప్పింది. మా అవ్వకి పానం లేచి వచ్చింది. చాట్ల రెండు ఉల్లిగడ్డలు ,నాలుగు మిరపకాయలు ,చింతపండు ముద్ద ,పిరుకడంత పెసరుపప్పు పోసి రూపాయి బిల్ల మూలకి వేసి నారాయణ తాత దగ్గర పెట్టింది మా అవ్వ.

కొత్త ఇంటికి నక్ష గీసిండు నారాయణ తాత. మంచి రోజులున్నయి నాలుగు తట్టల మట్టి తీసి మొదల్పెట్టుర్రి గని ఇప్పుడే పునాది పని నడువదని కార్తీక మాసం దాకా ఆగాలని చెప్పిండు.

కుర్చేసి కూసుండవెట్టుడే తప్ప నారాయణ తాత కాళ్ళు మొక్కుడు వంతు లేదు. సెనార్తి మామ అని మా బాపు రెండు సేతులు తన ఛాతీ దిక్కు తింపుకుని తల్కాయ కొంచెం కిందికి వంచిండు.

నారాయణ తాత కూడా అట్లనే సెనార్తి చెప్పుకుంట చాట్ల పోసినవి తన తువ్వాలులో ముడేసుకోని వెళ్లిపోయిండు.

** ** **

పొద్దు గూకే యాల్ల.
ఆకాశమంతా ఆస్మాన్ రంగు తీరు మారింది. ఇటుక రంగులో ఇంకా ఎండ ఎల్తురు వస్తాంది. సూత్తే ఆ వాతావరణము గమ్మతిగా ఉంది. నాకైతే ఎగురుకుంట ఉరుక్కుంట తొవ్వ అంతా ఒక్కసారి తిరిగి రావాలన్పిచ్చింది.

ఇంతట్లనే సట్టసట్ట మనుషుల చెప్పుల, కాళ్ళ సప్పుళ్ళతో ఓ ఆరుగురు మంది సీదా మా గుడిసె లోపలకొచ్చిర్రు.

వాళ్ళని బయటనే చూసి బాపు లోపలకొచ్చిండు. వాళ్లెట్ల లోపాలికత్తార్రో అట్లనే తీగోలే తప్పించుకొని మా పెద్దక్క అవతల పడి మా రంగు తాతిoటికురికింది. అన్న వాళ్ళ దోస్తులని కలువడానికీ కచ్చీరుకాడికి పోయిండు. బాపు అవ్వ తాత ఏదో తప్పు చేసినోల్ల లెక్క భయపడుతార్రు.

వాల్లలో పొడుగ్గా బక్కగున్నచామన చాయే మనిషిలో ఏదో కొట్టొచ్చిన తేజం కనిపిస్తాంది. మా బాపు మేలు వయసు మీద ఉంటే ఎట్లుంటాడో అట్లున్నడు. మాసిపోయిన డ్రెస్సుకే బెల్ట్ పెట్టుకోకుండానే టక్కు వేసుకున్నాడు. నేనటువంటి మనుషుల్ని అంత దగ్గర చూసుడు అదే మొదలు. సలాకలెక్క సాఫుగున్నడు.

నన్ను చూసి ‘’సిన్న బామ్మర్దానే మామ‘’ అన్నడు బాపుతో.

“బావకాదు బిడ్డ రమణయ్య బావకి పదివేల దండాలు పెట్టు’’ అన్నడు మా బాపు నాతో.

నేను చేతూల్లేపేసరికి రెండు సేతులందుకొని వద్దన్నట్లు నన్నెత్తుకొని ముద్దు పెట్టిండు ఆయ్నే. ఆయన మా రమణయ్య బావ అని నాకు అర్థమైంది. మా రమణయ్య బావకి మా పెద్దక్క లచ్చక్కనిచ్చి పెండ్లి సేత్తరని మా ఇంట్లో వినపడే మాట. బాపు అందరికీ చూరుల చెక్కిన పిండి ( ఎరువు , మందు ) బస్తాల ఖాళీ సంచులు తీసి మనిషికోటి మనిషికోటి ఇచ్చిండు. నీళ్లురవని కాడ ఒక్కోక్కలు సంచులేసుకొని కూసునేటోల్లు కూసున్నారు , కొంతమంది నడుము ఆనిచ్చిర్రు. అందులో ఇద్దరే పాయింట్లు వేసుకున్నారు. మిగతోల్లు లుంగీలు కట్టుకున్నరు. బుడ్డగోసి పెట్టుకున్నరు . అందులో ఒక్కాయెన లుంగిని గోసిపెట్టి పండి పెయి మీది బనీనుని విప్పి ముద్దలెక్క చేసి నెత్తికింద పెట్టుకొని ఒక్కపక్క మీద పండి లేచి నన్ను దగ్గరికి పిలిచి రూపాయిచ్చి “దుఖాన్లోకి పోయి బీడీ కట్ట తెత్తవ?” అన్నడు.

నేను మా చిన్నక్క దిక్కు చూసిన.

” ఏమీ బీడీ ?” అని రూపాయి తీసుకొని మా చిన్నక్క అడిగింది . ఫోట్వో బీడీ అని చెప్పిండు ఆయెన.

నేను మా సిన్నక్క దుఖానంలకి పోతాoటే ‘’ అరే తమ్మి మన రమణయ్య బావెంబడి అచ్చినోళ్లెవరో ఎరికెనా ?’’ అని తొవ్వపొంట పోతూ పోతూ ఆగి రెండు చేతులు గుండెల దగ్గరబెట్టుకొని నోరంతా తెరిచి నన్నడిగింది. నేను అడ్డంగా తల ఊపడముతో తనే మళ్ళీ “మన రమణయ్య బావ రాడికల్సులో కల్సిండట “ అని తానే ఆశ్చర్యపోయినట్టు చూసింది. నాకు రాడికల్సు అంటే ఏంటో తెలవకున్న ఆ పేరు ఐతే పెద్దోల్లు గుసగుసపెట్టంగా విన్నాను.

నాకు అర్థం కాలేదని గమనించి “మొన్న గైశెట్టోల్ల తుమ్మలళ్ళకెళ్లి కట్టెలు పట్టుకొని అచ్చి పొన్నం రామస్వామి బావొల్ల ఇంట్ల సారా క్యానులు , సారా బత్తాలు పగలకొడుతుంటే మనం తపాలెలు, చెంబులు పట్టుకొని పోయి ఆ సారా తెచ్చి ఇత్తే మన తాత బాపు తాగలేదా?

అవునని నేను తల ఊపిన.

“ఆ పలగ్గొట్టి బెదిరిచ్చి పోయింది రాడికల్సే .. అన్నలు “ అని అక్క చెప్పింది అది చాలా పెద్ద విషయమన్నట్లు.

నాకు మా ఊరి రాత్రి ఓపెన్ టాకీస్ లో ఆ మద్యనే చూసిన ఏదో సినిమాల హీరోలు గుర్తుకొచ్చిండ్రు. మా బావని చూస్తే ఖైదీలో చిరంజీవి, ఇంకేదో సినిమాలో సుమన్ యాది కొచ్చిండు.

బీడీకట్ట తెచ్చి ఆయనకిచ్చినంక చిల్లరలకెళ్ళి నాకో ఐదు పైసలిచ్ఛిండు ఉంచుకొమ్మని నేనాద్దంటున్నకాని. నేను ఆయన దిక్కే చూస్తున్న ఊకే.
మా అవ్వ కుమ్మరి రాజమ్మోళ్లింటికాడ కొంగుల బియ్యము పట్టుకొనచ్చి బువ్వండుతాంది సుట్టమై వచ్చినోళ్ళకి గడుక పెట్టద్దని. పొయ్యిల కట్టెలు లేవు. బాపుని పొయ్యిల కట్టెలు తేనందుకు లేనందుకు తిట్టలేక అప్పటి పరిస్థితిని గట్టెక్కించడానికి బయటకొచ్చి తాత మంచం దగ్గర గుడిసె చూరు నుండి వాయిలి పొరకల్ని అక్కడోటి అక్కడోటి ఇరిచింది చప్పుడు కాకుండా. ఈ లోపు యాకాశి పండుగకి లక్ష్మిపురం నుండి మా కొట్టే రామయ్య తాత తెచ్చిన అప్పాలు బయట ఉంటే మెమొకటే పూటకు ఓడకొడ్తమని దాచిపెట్టిన అప్పాలు రెండు కంచములల్లెసీ ఆళ్ళ ముందు పెట్టింది. జెప్పనే మొత్తం అప్పలు తిన్నారు వాళ్ళు.

కొద్దిసేపు నిశ్శబ్దం.

తుకతుకా … బువ్వ ఉడుకుడు అలికిడి.

టుకటుక మూత కొట్టుకునే చప్పుడు. బయట మళ్ళీ పెద్ద డల్లులాగా వాన మొదలైంది. గుడిసె లోపల మబ్బు కమ్మినట్టు లోపల్నే ఆగిపోయిన పొగ. మా తాత నేను గుడిసె ముందుబాజు అంపులకాడ మా గుడ్లు పెట్టె కోడిని కొత్తాన్నాము కూరకోసము. కడుపుల తయారవుతున్న గుడ్లని పరీక్షగా చూస్తున్న నేను. కోడి పేగుల ఆశకి తోకూపుకుంటా మా కుక్క బైరాగి. మా రమణయ్య బావ వచ్చిరానట్లు హ్ము అనుకొంటూ ఏదో రాగం తీత్తుండూ. అగో అప్పుడు బయట వాన ఇంకా పెరిగింది ఉరుముల మెరుపుల సప్పుడు. వాతావరణములో ఏదో అలజడి.

మా తాత “హరిహర అర్జునా శాంతి శాంతి కొంచెము గెరువియ్యలేవు . అప్పుడే మేము బతికిపోతిమా… నీ వాన పెండ్లాం … “అని తిడుతండు.
వాన జోరు అందుకుంది. ఉరుములు మెరుపులు. ఎక్కడో పిడుగుపడ్డ పెద్ద సప్పుడు. మట్టుకున్న తాడు తెంపుకుని ఎదురుంగా గుట్ట అడ్డమచ్చిన గుద్దుడే అన్నట్లు నెత్తి పోజుపెట్టి తోకని గాల్లోకి లేపి ఇంతెత్తు ఎగురుకుంటా వాడ మొత్తం ఉరుకుతున్న ఇంకా మెదుపని ఇత్తుకొట్టని మా కోల్లాగే.
అగో అప్పుడే మా బావ రాగాన్నందుకొని లేచి – ఆ మనీషే … నాకు తెలిసిన మనిషి – భూమికి దండం పెట్టి లేచినోని తీరుగా కుడి చేతుని సారతికాల్లోల్ల తీరుగా సాపుతూ… పైకి మెల్లిగా పాటందుకున్నాడు.

‘’ఎర్ర జెoడేర్రజెండెన్నియ్యాలో ఎర్రెర్రనిదీ జెండెన్నియ్యాలో…’’
అని పాడుతూ ఆయన బనీనుని గాల్లో ఎగిరేసి మల్లి అందుకుంట కండ్లు మూసుకొని ఆయన గుండ్రంగా తిరుగుతండు. శివరాత్రికి మా ఇంట్లోని దుగుట్లో ఉన్న దేవుడు గురిగిలోని ముతుక బట్ట పట్టుకుంటే రాయేషుని దేవుడు తూలి మా తాత ఎట్లా ఉగ్రరూపముకత్తడో ఆ తరీఖా ఎగురుతాండూ.
ఆయనకి ఇంకో ఇద్దరు జమ అయ్యిండ్రు కోలాటం లెక్క. దేవుడచ్చిన మా తాతని చూసి “ఏయు… “మంటూ పెయ్యంతా ఇరుసుకుంటూ, పండ్లు పటపట కొరికే, దేవుడు తూలే కుమ్మరి లచ్చమ్మ, గండ్ల యెల్లమ్మల లెక్క ఆ ఇద్దరు. మిగతా వాళ్ళు బయటకు చప్పుడు బాగా వినత్తదేమోనని మెల్లి మెల్లిగా పాడుతుండ్రు కోరస్ లాగా. అందులో ఇంకో అతను అప్పాలు తిన్న కంచాన్ని బోర్లించి కట్టే పుల్లతోని చేత్తోని సప్పుడు కొడుతండు.

వాన ఎల్సే దాకా ఎగిరిండ్రు పాడుకుంటూ.

అందరూ తినడానికి కూసున్నరు. కంచాలు సరిపోక ఇద్దరు తప్కులల్లనే తిన్నరు. ఇద్దరు ఒకే పల్లెముల తిన్నరు. మా రమణయ్య బావ తన చిన్నప్పటి అలవాటు ప్రకారము మా ఇంట్లో ఉండే ఒకే ఒక స్టీల్ పళ్ళెం, మా అవ్వకి ఆళ్ళ చిన్నపుడే కొట్లాటల ఇరికి ఊరిడిచి దెంకపోయి పట్నముల కోమటామెని (ఆమె కోమటామే కాదని మా చుట్టాలల్ల గుసగుస) చేసుకొని మల్ల మా అవ్వ పెండ్లికి ఊరికచ్చినపుడు వాళ్ళ మేనమామ కొనిక్కచ్చిన స్టీల్ గిన్నె అది. అగో ఆ పల్లెములనే తిన్నడు రమణయ్య బావ.

** ** **

అందరూ తిన్నంక వాతావరణము కొంచెము గంభీరంగా మారింది.

మా అవ్వ కండ్లల్ల నీళ్ళు తీస్కుంది. బాపు మనసంతా దుఖ్ఖo కొద్ది ఉన్నది. మా రమణయ్య బావే గట్టిగా సరాయించి మాట్లాడడం మొదలువెట్టిండు.
“మామ బాధపడేదేoదే…! మీకు ఆరుగురు పుట్టిర్రు. అందరు బతికిర్రా? ఇద్దరు చిన్నప్పుడే సచ్చిపోయిరీ. మేము జనం కోసం బతుకుతున్నాం.

జనముతోనే బతుకుతున్నాము. మేము మీరు వేరు కాదు. మేము మీ నుండే వత్తిమి. ఇప్పటికీ ఊళ్ళల్లో ఎంతోకొంత న్యాయం జరిగింది. దొరల పెత్తనం తగ్గింది. లేనోల్లకి మీ ఊళ్లే లెక్కనే పరంపోగు, బంజేరు భూములు పంచుతున్నం. ఎక్కడికక్కడ ప్రజా కోర్టులు పెట్టి తప్పు చేసినోన్ని శిక్షిస్తున్నాం. లేకుంటే దొరల చేతుల్లో మలమల మాడి సత్తురు జనం. మేం అందకున్న గాని మా పేరు చెప్పి సబ్బండ జనం దైర్యంగా బతుకుతార్రు ఎక్కడికక్కడ. అట్ల ప్రజలకి దైర్యమిచ్చేటోల్లైతే ఎవలో ఒకరు కావాలే కదా ! అర్వకట్టం చేసి బతికే మనుషులకి ఇంత కడుపుకి తిండి లేకుంటే ఈ దేశమెందుకు? రాజ్యమెందుకు ? గుట్టలకొద్ది సంపద ఎవనికి ? ఇంకా పోరాటాలు పెరగాలే… మనమందరము చేయాలే…” అని సెప్తూంటే మా అవ్వ రెండుచేతుల పబ్బతి పట్టి కూర్చూండి ఔనన్నట్లు తల ఊపుకుంటా కండ్లల్ల నీళ్ళు తీత్తంది.

మళ్ళీ బావే –

”నీ రుణముల పడిపోతున్న మామ ! మా సిన్నప్పుడు నన్ను జబ్బమీదేసుకొని మానేరులకెళ్ళి దాటి నడిచొచ్చి పండుగకు ఉప్పు పప్పు మా ఇంటికి తెచ్చి మమ్మల్ని సాదినావు. పండుగకి బట్టలు కుట్టిత్తే అవ్వేసుకొనే బడికి పోయేటోన్ని. నువ్వు లచ్చవ్వ కి వేరేటోళ్లని చూసి పెండ్లిజేయు మామ. నాది నమ్మకము లేని బతుకు. నీ చిన్నప్పుడే మీ అవ్వ సచ్చిపోతే అవ్వ తర్వాత అవ్వ అని, లచ్చవ్వ అని మీ అవ్వ పేరు పెట్టుకొని సాదుకున్నవు. దానికన్యాయం కావద్దు మామ. పార్టీలనే నేను ఒక ఉప్పరోల్ల పిల్ల పెండ్లి చేసుకున్నం”. అని అనేసరికి మా అవ్వ శోకము పెట్టి ఏడ్చుడు మొదలు పెట్టింది. మా తాత సన్నగా ఏడుత్తాoడు. అది చూసి మా చిన్నక్క ఏడుపందుకుంది. మా బాపు కూడా గొంతు పూడుకపోయి దగ్గి సీమిడి తీసుకొని
”దాని గతి ఎట్లైతే గట్లైతది గని నీకెంత కట్టమచ్చేరా బిడ్డా !” అనుకుంటా మా బావని గట్టిగా అలుముకొని పెయ్యంత పునికిండు బాపు.

బనీన్ లేక పల్చటి అంగీ వేసుకున్న రమణయ్య బావ వీపుల మా బాపు పునుక్కుంటూ అంగి లేపితే పెయ్యంత అంబోరు మొఖం లెక్క చెదలు చెదలు గా ఉంది. ఆ నడుమ పోలీసోళ్ళకి దొరికినప్పుడు చిత్రహింసలు పెడుతూ సిగరెట్లు వట్టి కాలుస్తే అయిన పుండ్లు మరకలట అవి. అప్పటి దాకా ఆపుకున్నా కానీ బాపు తరం కూడా కాలేదు. ఎక్కి ఎక్కి ఏడుత్తాండు. మా బావకి కూడా కండ్లల్లో నీల్లు వచ్చినట్లే అనిపిoచింది నాకు. మిగతా వాళ్లందరు నిశ్శబ్దంగా నిల్చున్నారు. పాట పాడినతనే ఒక సంచి మలిచి జబ్బల కింద పెట్టుకొని పట్టుకున్నడు అందులో ఎమున్నయో గని ?

ఎదురింటి మధురమ్మ, రాధమ్మ లు వచ్చిండ్రు ఏడుపు శోకాలు విని. అప్పుడే వచ్చిన మాదిగ జోగు రాజవ్వ అందరి కళ్ళల్లో నీళ్ళు చూసి తను కూడా గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నది.

మా బావ మా అందరి దగ్గర వీడుకోలు తీసుకుంటూ మా తాత దగ్గరికొచ్చి ”ఏమోయ్ రాయుడా! పండ్లు మంచిగానే ఉన్నాయి కదా కొంచెం మంచిగా తిను. నువ్వు ఎక్కువ రోజులు బతుకాలే మాకోసమైన. కొంచెము ఇల్లు కట్టే దాకా, కుటుంబం సుదూరాయి౦చుకునే దాకా ఆగు ”అని తాత భుజాలు పిసికి నా దిక్కు చూసి ”మామ బామ్మరిది బడికి పోతాండానే ?” అన్నడు.

”లేదు బిడ్డ ఇంకా” బాపు.

”అర్రరే… ఆలిసెం కానియ్యకిగా ఇద్దరిని సిన్నదాన్ని వీన్ని ఇద్దరిని జెప్పన బడిలో వేయు ”అని చెప్పి మా ఇంటెనుకాల నుండి తుమ్మ చెట్లల్లపడి చీకట్ల కలిసి పోయిర్రు వాళ్ళు.

వాళ్ళు పోయేటపుడు ఆ పాటపాడినాయెన నా చెంపలని నిమిరి పోయిండు.

** ** **

ఆ రోజు పొద్దు తేటగా పొడ్సిండు.

మబ్బులు మస్కలల్లా ఆగే సూర్యుడి కిరణాలు సక్కగా జెప్పన్నే గుడిసె మీద పడ్డయి.

ఆ వెలుతుర్లో మా గుడిసె మీది కప్పు కొత్త తాటి కమ్మలు మెరుత్తన్నయి.

ఆ రోజు పొద్దుగాల్నే నాకు ఎన్నడూలేంది వేడి నీళ్ళు పోసి తానము పోసింది మా అవ్వ. శోభన్ బాబు లెక్క దూసి బుగ్గ తీసిండు మా బాపు నాకు. మా చిన్నక్కని నన్ను తయారు చేసి నన్నుబడికి పంపించిండ్రు. మా చిన్నక్క మా పలకల్ని తట్టు సoచిలో పెట్టి, అగ్గిపెట్టెలో బలపము ముక్కలు వేసుకొని నా చేయి పట్టుకొని బడికి తీసుకెళ్లింది. మొదటి రోజు బడoతా బెరుకు బెరుకుగానే అన్పించింది. నా పక్కకు కూసుండి నన్ను ఏడిపించిన సుండు గాడిది రాయేషన్ని ఒంటేలు బెల్లులో బయటకు రాంగానే అందుకొని రెండు చంపింది మా అక్క. వాడు, వేరే పోరగాండ్లoదరు నా దిక్కు భయంగా జూసీర్రిగ . మద్యహ్నము పూట పేర్లు ఎక్కించే పెబ్బే రామరాజు దగ్గరికిపోయి మా అక్క ఏమీ చెప్పిందో కానీ నా ఒక్కని పేరు తప్ప నా చుట్టున్నోల్ల అందరి పేర్లెక్కినాయి.

రాత్రి ఇంట్లో వాళ్ళందరూ చర్చించుకున్నరు బయట. కొత్తగా కట్టబోయే ఇంటికి పునాది పని మొదలైనంక చట్టమెత్తాలే, సుంకు మొగురం కావాలె అని చర్చించుకున్నరు. మంచేరియాల్ అడవులల్లకెళ్ళి దండెం రాజయ్య మామ నరుక్కచిన పాల చెట్టు దూలం సుంకు మొగురంగా 70 రూపాలకి ఇస్తానన్నాడని మా అన్న చెప్పిండు. ఆరెల్లి వెంకన్న దగ్గర మూడు రోజులకి మక్కలెయ్యడానికి మనిషికి ఆరు రూపాల చొప్పున నలుగురికి రోజుకు ఇరవై నలుగు రూపాలు మొత్తం 72 తీసుకున్నానని అవ్వ చెప్పింది. ఆ నలుగురిలో మ చిన్నక్క కూడా లెక్కే.

ఆ రాత్రి ఇంటికి వచ్చినంక బడి గురించిన నా భయాలన్నీ పోయి తెల్లారి లేచి మొఖం కాళ్ళు రెక్కలు కడుక్కున్న. ఒక్కడినే పలకపట్టుకుని మా ఇంటి మూలమలిగిన.

మూడు బజార్ల కాడ మా రంగు తాత, గోపు తాత వెంకు తాత ముగ్గురు మాట్లాడుకుంటున్నరు. వారి కళ్ళల్లో, వాళ్ళు బండల మీద కూర్చున్న రీతిలో ఏదో ఆనందం విజయ గర్వం కనిపిస్తుంది.

ఊళ్ళో రాత్రి మళ్ళీ ఏదో సంఘటన జరిగినట్లే ఉంది.

నేను మా ఇంట్లో రోజు వినే కోరేపల్లి, వీణవంక, వావిలాల, వెల్ది, వెగురుపల్లి, షెల్పూరు, వడ్కాపూరు, చల్లూరు, ఓడేడు, కల్లుపల్లె, పొత్కపల్లి ఊళ్ళల్లో దొరలని అన్నలు ఒక్కొక్కలని ఎట్ల చంపిండ్రో, ఎట్ల కొట్టిండ్రో విన్నసొంటి కథల్లాగానే ఉంది వాళ్ళ ముచ్చట.

నేను పలక పట్టుకొని వడ్లోల్ల ఇల్లు దాటి దూదేకుల ఇండ్లల్లకెల్లి రోడెక్కి మా చిన్నదొర గారి గుట్టెత్తు ప్రహారీ గోడ కల గఢీ దగ్గరికి చేరే సరికి చిన్నగా భయమయింది నాకు.

ఆ తొవ్వ పొడుగూత గఢీ నుండి కచ్చీరు వరకు ఒక్క పురుగు లేరు.

ఆ రోజు పాటకుల లోపలకెళ్ళి దైర్యం చేసి చూస్తే చెట్టెత్తు ఉండే పెద్ద దర్వాజ తలుపులు మూసి ఉన్నాయి.

ఐనా నాకెందుకో దాని ముందటకచ్చేసరికి భయమై వెనుక దిక్కు తిరిగి చూసిన.

నా వెనకాలే అనుసరిస్తూ సద్ది సేతుల బట్టుకొని దూరాన్నుంచి చేతులూపుకుంటూ నవ్వుకుంటూ చూస్తున్న, తానొదిక్కు పోవాల్సిన మా చిన్నక్క.
“ మా చిన్నక్క నా తీరుగా బడికెందుకు రాదో ? ఎందుకు సదువుకోకుండా ఎండల వానల చలిల సిన్నతనములనే ఆ మోటుకట్టానికి కూలీ పనులకెందుకు పోతుందో ?”

నాకెందుకో లోపలంత మంచిగ అనిపించలేదు. భయం, దు:ఖం కల్సిపోయి కాళ్ళల్లో ఏదో తెల్వకుండనే చిన్న వణుకు.

ఎట్లాగో గఢీ దాటి కచ్చీరు చేరి బడి తొవ్వను అందుకోగానే కొత్త మనిషిలాగా హుషారుగా నడుస్తున్న నేను.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

Leave a Reply