చిత్రకారుడి బొమ్మ

ఒక చేయి తిరిగిన ముసలి చిత్రకారుడు
అక్కడ కూర్చుని ఉన్నాడు ఆలోచిస్తూ…

అతడి చేతివేళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి
అతడో ముసలి మాంత్రికుడిలా ఉన్నాడు

ఏదో తట్టినట్టుంది
పిడికెడు మట్టిని చేతిలోకి తీసుకుని గాల్లోకి విసిరాడు
మట్టి కింద పడుతూనే ఒక బొమ్మగా మారింది

అప్పుడు
ఒక పచ్చని ఆకు తీసుకుని పొడుగ్గా చుట్టి అందులోంచీ
గాలిని ఊదాడు
బొమ్మకి ప్రాణం వచ్చి కదిలింది

పెదవులు కదిపాడు
బొమ్మ మాట్లాడటం మొదలుపెట్టింది

బొమ్మ ని భూమ్మీదకి విసిరాడు..
ఇంకొన్ని బొమ్మల్ని తోడిచ్చాడు.

కొన్నాళ్ళైంది
బొమ్మ కూడా తనకి పనికొచ్చే బొమ్మల్ని చేయడం మొదలు పెట్టింది

ఒక మాట్లాడే యంత్రాన్ని కనిపెట్టింది

కొన్నాళ్ళకి శబ్దం లేకుండా మాట్లాడటం కోసం
వేళ్ళతో అక్షరాలను పంపడం చేసింది

అంతే
అందరూ మాట్లాడటం మర్చిపోయారు

మతిపోయిన
చిత్రకారుడిప్పుడు దిక్కులు చూస్తున్నాడు

హైదరాబాద్ లో బీ. కామ్ చదివారు. ప్రస్తుతం Synchrony Financial కంపనీలో సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ గా పని చేస్తున్నారు. కవిత్వం, ముఖ్యంగా ప్రేమ కవిత్వం ఆమె ఆసక్తి.

Leave a Reply