చిట్టి పాదాల సందేశం

ఆ చిట్టి పాదాలు
ఇప్పుడేదో రహస్యాన్ని
చెబుతున్నట్లుగా లేదు
ఆకలి మర్మాన్ని
చెబుతున్నట్లుగానూ లేదు
నాగరిక వైఫల్యాల్ని విప్పి
చెబుతున్నట్లుగా లేదు

ఆకలిని మించిన
భయంకరమైనది ఏదీ
ఈ భూమండలాన్ని
ఇంతవరకు
బాధించింది లేదని
దేశం ముఖంపై
రక్తపు సంతకం
చేసినట్లుగా మాత్రమే
చెబుతున్నది

బ్రతకటం చావటం
రెండూ సమానమే
అయిన చోట
ఆకలి చావు దూత అని
ఆ పసిపాదాలు
రహదారుల నిండా
రాస్తూ వెళుతున్నాయి
గమనించారా?

మానవత్వం గుడ్డలు
విప్పతీసుకుని
కరెన్సీ నోట్లు మొలకు చుట్టుకొని
ఎసి గదుల్లో పొర్లుతున్నప్పుడు
దోషులెవరని అడగకు
ఆకాశవాణి అరిచి చెప్పదు కానీ
అందరూ ముద్దాయిలే
అందుకే కదా
కాలం మనందరి ముఖాన
కాండ్రించి ఉమ్మేసి పోతున్నది
ఒక్కసారి నిజాయితీగా
ముఖం తుడుచుకుందామా!?.

మనకోసం దేశ దరిద్రాన్ని
గుడ్డ సంచుల్లో వేసుకొని
మోయలేక మోస్తున్నది
రహదార్ల వెంట బరబరా
తనని తాను ఈడ్చుకెళుతున్నది
నువ్వూ నేను కాదుగా?
అందుకే ఈ లోకమెప్పుడూ
మనకు అందమైనదే…

***

అదో చిన్న క్రిమి అయితేనేం?
మనిషికి మనిషినే
యమపాశం చేసి వదిలింది
ఊపిరి నిలుపుకోవడం కోసం
బతకటాన్ని ఒంటరి చావు
ప్రయాణం చేసింది
ఓ నా ప్రపంచమా వెలిగిపో
పేదవాడి రక్తపు చారలతో
తడిసి మెరిసి మురిసిపో

ఓ సామాజిక స్మశానమా!
ఇన్ని మరణాలను నీ ఒడిలో
ఎలా సేదతీరుస్తున్నావు

ఓ నా ప్రజాస్వామ్యమా!
వాళ్ళు తల దాచుకునేందుకు
నీ దగ్గర ఇంత నీడ కూడా
దొరకదని తెలిసీ
ఎలా కూలిపోకుండా
నిలబడే వున్నావు?
ఆ చిట్టి పాదాలు
చేసిన రక్తపు సంతకం
నీకు రాసిన ప్రేమలేఖనుకున్నావా?

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

4 thoughts on “చిట్టి పాదాల సందేశం

  1. కరోనా కన్న పాలకుల నిర్లక్ష్యమే భయానక కరోనా

Leave a Reply