చిగురించిన ఆశను చీకటి కమ్మేస్తుందా? ఆఫ్ఘనిస్తాన్ స్త్రీల భవిష్యత్తు ఏం కాబోతోంది?

ఆఫ్ఘనిస్తాన్ లో ఆగష్టు 15 నాటి పరిణామాల తర్వాత ఎంతోమంది దేశం వదిలి వెళ్ళాల్సి వస్తున్న తప్పనిసరి పరిస్థితిని చూస్తున్నాం. అనేక వేలమందితో పాటు అక్కడి ప్రముఖ గాయని అరియానా సయీద్ లాంటి వాళ్లు ఇందులో వున్నారు. ఆఫ్ఘన్ జాతీయుడు, బిబిసి లో రిపోర్టర్గా వున్న బిలాల్ సర్వారి లాంటివాళ్ళు కూడా కన్నీళ్లతో బరువెక్కిన గుండెలతో దేశం వదిలి వెళ్ళాల్సిన స్థితి ఒక భయానకమైన వాతావరణాన్ని సూచిస్తోంది. ఈ సంక్షోభం ఒక్కరోజులో వచ్చినది కాదు. దీనికి నాలుగున్నర దశాబ్దాల రక్త చరిత్ర వుంది. తాజాగా అమెరికన్ నాటో సేనల ఉపసంహరణతో దేశం మళ్లీ తాలిబన్ ల వశం కావటం ముఖ్యంగా 1996- 2001 నాటి హింసాత్మక పరిస్థితులు పునరావృతం అవుతాయేమో అనే భయం అక్కడి ప్రజల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ వ్యక్తమవుతోంది. అవి నిరాధారమని కొట్టిపారేయ్యటానికి వీల్లేదనే సంకేతాలు కూడా అత్యంత బలంగానే కనిపిస్తున్నాయి. గతంలో స్త్రీల వేషధారణపై, కదలికలపై, సామాన్య ప్రజల జీవితాలపై తాలిబన్ లు తీవ్రమైన ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు అంతర్జాతీయ సమాజ భయాలతో పాటు, అక్కడి ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఏమనుకుంటున్నారు? తాము వ్యక్తులుగా, పౌరులుగా ఎటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఆశిస్తున్నారు? తాజా పరిణామాలని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా స్త్రీలు, పిల్లల పరిస్థితి ఏమిటి? సామాజికాభివృద్ధి ఎలా వుంది? అంతర్జాతీయ సమాజం నుంచీ ఏ సహకారాన్ని ఆశిస్తున్నారు? తాలిబన్ ఆవిర్భావానికి కారణమైన అమెరికా రాజకీయం అక్కడి స్థానిక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి ఉపయోగపడిందా? అమెరికా మద్దతుతో కొనసాగిన ప్రభుత్వం పట్ల అక్కడి ప్రజానీకంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆఫ్ఘనిస్తాన్ గడ్డమీద అమెరికా చేసిన రాజకీయాల వల్ల స్థానిక అఫ్గన్లకి జరిగిన మేలు ఏమైనా ఉందా? అమెరికా సేనల ఉపసంహరణ మొదలైన వెంటనే అనూహ్య రీతిలో తాలిబన్ ఆ స్థాయిలో ఎలా విజృంభించగలిగారు? అంటే వారు నివురు గప్పిన నిప్పులా తమ అస్తిత్వం ఎలా కాపాడుకోగలిగారు? తాలిబన్ల తీరుపైనా, వారి పాలనపైనా ప్రచారమైన విషయాల్లో వాస్తవం ఎంత? కల్పన ఎంత? నిజంగానే స్థానిక ప్రజల్లో వారి పట్ల వ్యతిరేకత ఉంటే ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చి చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర ఇస్లామిక్ దేశాల జీవన విధానం, వ్యవహారాలలో వున్న వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశప్రజలందరికీ క్షమాభిక్ష ఇస్తున్నామని, అధికార వర్గాలకి హాని తలపెట్టబోమనీ, స్త్రీల హక్కులకి భద్రత ఉంటుందనీ, కాశ్మీర్ విషయంలో తాము కలుగజేసుకోమనీ వరుస ప్రకటనలు ఏం సూచిస్తున్నాయి? అక్కడి సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం చేయగలిగిన పని ఏమిటి? ముఖ్యంగా భారతదేశం చేయగలిగిన పని ఏమిటి? ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైన ప్రశ్నలు. వీటిని వరుస వ్యాసాల్లో వివరించే ప్రయత్నమే ఈ కథనం.

వివిధ దేశాల సామాన్య ప్రజల మధ్య జరిగే మానవీయ సంభాషణలు, సాహిత్యం, కళలు, జీవన విధానాలు వంటివి ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టే వారధిగా వుంటాయనటంలో సందేహం లేదు. ప్రజల మధ్య వున్న స్నేహపూరితమైన, మానవీయమైన ఆత్మీయ సంబంధాలు నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వాలు, దేశ నాయకులూ జరిపే అధికారిక సంభాషణల్లో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అత్యవసర పరిస్థితిలో స్నేహ హస్తాన్ని అందించగలగాలి. ఆ మానవీయ జీవన కథనాల్ని వెతికి పట్టుకునే అవసరం ఇప్పుడు ఎంతైనా వుంది.

దాదాపు పన్నెండు సంవత్సరాలపాటు వివిధ స్వచ్చంధ సంస్థల్లో అక్కడి ప్రజా సమూహాలతో కలిసి పనిచేసిన విజయ్ రాఘవన్ ఆఫ్గనిస్తాన్ ప్రజల స్నేహపూరిత స్వభావం గురించి ఎంతో అభిమానంగా ప్రస్తావించారు. “ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అంటే తాలిబన్ కాదు. ఈ ఆలోచనా ధోరణి మారాలి. తాలిబన్ అనే ఒక హింసాత్మక గ్రూప్ ఆవిర్భావం వెనుక అగ్రరాజ్య సామ్రాజ్యవాదం వుంది. సామాన్య ఆఫ్ఘన్లు శాంతి కాముకులు. ప్రశాంతంగా, ఆనందంగా జీవించటానికి ఇష్టపడతారు. తమదైన సాంస్కృతిక జీవనం వుంది. భారతదేశం లో వచ్చే హిందీ సినిమాలు, సీరియళ్లు ఆఫ్ఘనిస్తాన్ పట్టణ నగర వాసుల కుటుంబాల జీవితంలో భాగంగా వుంటాయి. హీరో షారుఖ్ ఖాన్ అంటే అత్యంత అభిమానం. భారతదేశం నుంచీ వచ్చిన వాళ్ళను చాలా ప్రేమగా చూసుకుంటారు. ‘షారుఖ్ ఖాన్ ని ఎప్పుడైనా కలుస్తారా’ అని అమాయకంగా అడుగుతారు. తెగల మధ్య జరిగే అంతర్యుద్ధం, దేశం మీద ఇతర దేశాల దురాక్రమణ, సుధీర్గమైన యుద్ధ వాతావరణం, అన్నీ కలిపి ఆ దేశ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టేశాయి. అందరూ ఒకే మత సమూహమైనప్పటికీ వివిధ తెగలుగా వారి జీవన విధానం వుంటుంది. కలుపుగోలు మనుషులు. తెగలుగా విభేదాలు ఉన్నప్పటికీ మనుషులుగా హోదాలతో సంబంధం లేని, తారతమ్యం లేని వాతావరణం కూడా వుంటుంది. ముఖ్యంగా గత శతాబ్దకాలపు చరిత్ర చూస్తే, రాచరికం నుంచీ ఇప్పటివరకూ కూడా సైన్యం రాజ్యానికి జవాబుదారీగా, దన్నుగా ఎన్నడూ లేదు. ఇది ఇప్పటి తాజా పరిణామాల్లో కూడా చూడొచ్చు. ప్రజలు కూడా స్థానిక భూస్వాముల కనుసన్నల్లో వుంటారు. వారికి తప్పించి వేరేవారికి అనుకూలురుగా వుండటం కనిపించదు. ఆయా పరగణాలలో మెజారిటీ ప్రజల్ని శాసించే ఒక విధమైన జమిందారీ వ్యవస్థ వుంటుంది. కాలక్రమేణా మార్పులు వచ్చినప్పటికే ‘ప్రజాస్వామ్యం’ అనే ఆలోచన పూర్తిగా ఆచరణలోకి రాలేదు. ప్రపంచం చూపంతా ఆఫ్ఘనిస్తాన్ దేశం మీదే వుంది. అంతర్జాతీయ మీడియా ఇస్తున్న సమాచారం అంతా నిష్పక్షపాతంగా వుందా అంటే సంపూర్తిగా అవుననే సమాధానం రావటం లేదు. పాత పరిణామాలు పునరావృతం అవుతాయోమోననే భయాలే వున్నాయి. అవి అత్యంత బాధపెట్టే, ఇంకా గాయపరిచే జ్ఞాపకాలు. టెర్రరిజాన్ని తుదముట్టిస్తామని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏర్పాటు చేస్తామనే వాగ్దానంతో ఆ దేశం లోకి అపరిమితమైన సైనిక బలగాలతో వచ్చి ఇరవై ఏళ్ల పాటు ఆ దేశ దిశను అమెరికా నిర్దేశించింది. వేలాది కోట్ల డాలర్లు టెర్రరిజం అంతం పేరుతో ప్రవహించాయి. కానీ దీనివలన, స్థానిక ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? అమెరికా ప్రభుత్వ పెట్టుబడులు దేనికోసం, ఎవరికీ ఉపయోగపడ్డాయి? కాంట్రాక్టర్లు ఎవరు? వారు నిలబెట్టిన ప్రభుత్వాల్లో అవినీతి అంత పెద్ద ఎత్తున ఎలా సాధ్యమయింది? పేపర్లో ఒక వెయ్యికి పైగా కట్టినట్లు వుండే పాఠశాలలు, వాస్తవ రూపంలో ఇరవై ముప్ఫై కూడా ఎందుకు వుండవు? భారీ కాలువలు నిర్మించామని చెబుతారు కానీ అవి అక్కడ వుండవు. ఏదైనా విచారణ జరిగితే భారీ వర్షాల్లో కొట్టుకుపోయాయని చెబుతారు. ఇది ఎలా సాధ్యం? అసలు విచారణలు కూడా వుండవు, వున్నా ఏదో ఒక సాకు చెప్పి ఆ విషయాన్ని కొట్టివేస్తారు…ఇలా ఎన్నో కోట్ల డాలర్ల పెట్టుబడి వృధా అయింది. వీటికి జవాబులు దొరకవు. యుద్ధం పేరున ఇవి వెలుగు చూడవు.

ఒకప్పుడు స్త్రీల మీద తాలిబాన్ పెట్టిన నిర్బంధం అత్యంత క్రూరమైనది. అంతకు ముందు ఇస్లామిక్ మత ఆచరణలో వుండే పితృస్వామిక ఆధిపత్య అంశాలు వున్నప్పటికీ ఇంత క్రూరమైన పరిస్థితి వుండేది కాదు. నిజానికి ఈ ఇరవై సంవత్సరాలలో కొన్ని పాజిటివ్ మార్పులు జరిగాయి. అసలు మార్పు జరగలేదని అనలేం. ముఖ్యంగా స్త్రీలు తిరిగి ఆంక్షలు లేకుండా చదువుకోగలిగారు. వివిధ రకాలైన వృత్తుల్లోకి వచ్చారు. జర్నలిస్టులు పెరిగారు. తమ స్వంత వీడియో ఛానెళ్ళు పెట్టుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసారు. ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది మహిళా రచయితలు, కవయిత్రులు బయటికి వచ్చారు. చాలా బాగా రాస్తారు కూడా. వివిధ ప్రభుత్వ సంస్థలలో, అంతర్జాతీయ, జాతీయ స్వచ్చంధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే దురదృష్టం ఏమిటంటే ఈ విద్యా, ఉద్యోగావకాశాలేవీ గ్రామీణ ప్రాంతాల వరకూ విస్తరించలేదు. మళ్లీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం అప్పుడే వెనక్కి వెళ్లిపోవటం మొదలయింది. వాటి పట్ల ఎంత విమర్శనాత్మక దృష్టి వున్నప్పటికీ ఈ నిర్ణయాల వల్ల ఆరోగ్య వ్యవస్థల వంటి కొన్ని రంగాల మీద ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి కావలసింది సైనిక సాయం కాదు, సామాజికాభివృద్ధిలో అవసరమైన చేయూత.”

2013 నుంచీ ఆఫ్గనిస్తాన్ లో పనిచేస్తున్న ఇరానీ కెనెడియన్ ఫోటోగ్రాఫర్ ‘కియాన హయేరి’ గత మే నెలలో తన ఫేస్బుక్ వాల్ మీద జవ్జ్జన్ ప్రావిన్స్ లో షెబెర్‌ఘన్‌ ప్రాంతంలో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల గురించి, బడికి వెళుతున్న ఆడపిల్లల మీద పెరిగిన ఆంక్షల గురించి ” చదువు కోవటం కోసం తాలిబాన్ నియంత్రిత ప్రాంతాలలోని అమ్మాయిలు పారిపోతున్నారు” అంటూ ఈ విధంగా తెలియజేశారు. “బాలికల పాఠశాలలను మూసివేయాలనే ఆదేశాన్ని మసీదులో ప్రకటించారు. గ్రామ పెద్దలు కూడా ఈ సమావేశంలో వున్నారు. ఈ సందేశం ఉపాధ్యాయుల ద్వారా, విద్యార్థుల ఇళ్లకు చేరింది. స్థానిక పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు కూడా ఆదేశాలు వెళ్లాయి. తాలిబన్లతో చర్చించడం, వేడుకోవటం, విజ్ఞప్తులు ఇవ్వటం అనేవి సాధ్యం కాని అంశాలు. దీనితో మూడేళ్ల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని రెండు గ్రామీణ జిల్లాలలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు పాఠశాలలకు హాజరు కావడం మానేశారు. ఒక్క ఆదేశంతో 6,000 మంది బాలికలు పాఠశాల నుండి ఇండ్లలోకి గెంటివేయబడ్డారు. బాలికలకు విద్యను అందించినందుకు పురుష ఉపాధ్యాయులు కూడా అకస్మాత్తుగా తొలగించబడ్డారు. బాలికలకు విద్య అనేది ఇస్లాంకు వ్యతిరేకం కాబట్టి ఆ కార్యక్రమంలో వున్నందుకు వారిని తొలగించినట్లు తాలిబన్ పేర్కొంది.
తాలిబన్ నియంత్రణలో ఉన్న దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ జిల్లాలలో కొన్ని చిన్న మినహాయింపులతో చిన్నపిల్లలు తప్ప మిగతా ఎవరికీ పాఠశాల విద్య అనేది ఉండదు. కిషోర బాలికలు (టీనేజ్ అమ్మాయిలు) తమ తల్లులకు సహాయం చేస్తూ ఇంట్లోనే ఉండాలి అనేదే తాలిబన్ సందేశం. తాలిబన్ ఆంక్షలను తప్పించుకుని కుటుంబ మద్దతుతో నగరాలకు వచ్చి తమ విద్యను కొనసాగించడానికి అనేకమంది బాలికలు ప్రయత్నిస్తూ వుంటారు. అలా నగరాలకు చేరిన ఆ అమ్మాయిలు తమ స్నేహితులతో కిలాకిలా నవ్వుతు, ఉదయాన్నే నలుపు తెలుపు యూనిఫామ్‌లతో పాఠశాలకు వెళ్లే దృశ్యాన్ని చూస్తుంటే పుష్పించే మైదానాలు వారి పాదాల వెంట పరుగెడుతున్నట్టే వున్నట్టు అనిపిస్తుంది. షెబెర్‌ఘన్‌లోని పాఠశాలలు అన్ని శరణార్థులుగా వచ్చిన ఈ కిషోర బాలికలతో నిండి వుంటాయి. వీరంతా తాలిబన్ నియంత్రిత ప్రాంతాల నుండి ఉత్తరాదికి వెళ్లి ఇక్కడ బంధువులతో ఉంటారు. అందులో చాలామంది తాము టీచర్లు కావాలని చెప్పారు; ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదవాలని ఆశించింది. తాలిబన్ లు ‘మమ్మల్ని చదువుకోవద్దనటం అనేది అర్థరహితమని, ఏ వాదనకు నిలబడదని’ ఒకరంటే, మరొక అమ్మాయి ‘బాలికలు పాఠశాలకు వెళ్లడం ముఖ్యం అని తెలుసుకోవడానికి తాలిబన్లకు మెదడు లేదు’ అని పేర్కొంది.

కాబూల్ పశ్చిమంలోని ఒక ఉన్నత పాఠశాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన క్రూరమైన దాడిలో, తరగతి గది నుంచీ బయటకు వస్తున్న అనేకమంది గాయపడ్డారు. కనీసం 90 మంది మరణించారు. వారిలో కిషోర బాలికలే ఎక్కువ.” నిజానికి షెబెర్‌ఘన్‌ లాంటి ప్రాంతాలు చాలా కాలం పాటు తాలిబన్ ప్రభావానికి లోను కాలేదు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలను పాఠశాలలకు, ఉన్నతవిద్యకు పంపటానికి తల్లిదండ్రులు ధైర్యం చేయలేరు, అసలు అవకాశాలు కూడా వుండవు.”

తాలిబన్ లు ఆడపిల్లల చదువుకి అనేక అడ్డంకులు కలిగించారనటానికి అనేక ఉదాహరణలు వార్తా కథనాల్లో బయటకు వస్తూనే వున్నాయి. 2012 లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ తఖర్ లోని బాలికల పాఠశాలలో దాదాపు నూటఅరవై మంది ఆడపిల్లల పైన విష ప్రయోగం జరిగిన ఒక సంఘటన ఇది. పిల్లలు తరగతి గదిలోకి రాకముందే అక్కడ విష రసాయనాలను చల్లటంతో ఆ ఆడపిల్లలందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన విజయ్ రాఘవన్ మాట్లాడుతూ ‘ఆ పిల్లలందర్నీ తమ వాహనాలు ఉపయోగించే హాస్పిటల్స్ కు తీసుకెళ్ళామని, చాలా మంది ప్రాణాలు కాపాడగలిగామని’ గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పేరు రాయటానికి ఇష్టపడని ఒక మిత్రురాలు మాట్లాడుతూ “ఆఫ్ఘన్‌ లుగా మేము అన్నిరకాలైన అభద్రతాభావాలతోనే యూనివర్సిటీకి వెళ్లి పనిచేశాము. మా యూనివర్సిటీపై దాడి జరుగుతోంది. అయినా గానీ నేను ఇంకా కొనసాగుతున్నాను. మా నాయకులు దేశాన్ని పూర్తిగా అమ్మేయడం మాత్రమే చేశారు. మేము కష్టపడి పనిచేశాం. మా దేశం కోసం చనిపోవాల్సి వచ్చినా ఫర్వాలేదు. కానీ ఇప్పుడు మాకు ఏ ఆశా కనిపించడం లేదు. మా చుట్టూ చీకటిగా అనిపిస్తోంది” అని సందేశం పంపింది.

చిత్రకారిణి షంసియా హస్సాని చిత్రాలు ఆఫ్గన్ స్త్రీల అణిచివేతను, అటువంటి స్థితిలోంచి బయటపడాలన్న జీవన ఆకాంక్షలకు అడ్డం పడతాయి. ‘ఐ కాంట్ బ్రీథ్’ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ కి మద్దతుగా వేసిన చిత్రంలో తమ జీవన ఆకాంక్ష ను కూడా తెలియజేస్తుంది. అలానే గర్భంలో బిడ్డ మీద ప్రేమను, ఇంకో పక్క తమ నుదిటి మీంచి నడిచి వెళుతున్న యుద్ధ టాంకులను ఒకే చిత్రంలో వ్యక్తీకరిస్తుంది. ప్రపంచమంతా ఆకాశ హర్మ్యాలతో, ఆధునిక వాహనాలతో దూసుకుపోతుంటే తాము ఇనుప జాలీల వెనుక శరీరం కుదించబడి ఉండటాన్ని చూపిస్తుంది. ప్రపంచం కనిపించనివ్వని బురఖాలతోనే స్త్రీల మధ్య వుండే సంఘీభావాన్ని వ్యక్తీకరిస్తుంది. పగిలి అతుకులు పడ్డ కుండీలోనుంచే ప్రపంచమనే మొక్క ప్రాణం పోసుకోవటాన్ని, గుండె స్వరాల్లో వున్న సంగీతాన్ని, కవిత్వాన్ని బయటకు ప్రవహింప చేయటానికి హిజాబ్ అడ్డం కాదని, అవకాశాలు వుంటే ఆకాశమే హద్దుగా ఎగరగలగమని చెప్పే చిత్రాలు అక్కడి స్త్రీల సృజనాత్మక చైతన్యానికి ప్రతీకలు.

ఇవన్నీ కూడా పరిస్థితి తీవ్రతను చెప్పే కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటి నేపథ్య అంశాలు అర్థం కావాలంటే రెండు అగ్ర రాజ్యాల అభిజాత్యం, కుటిల రాజకీయం గురించి తెలుసుకుని తీరాలి. అలానే 250 అంతకు మించిన సంవత్సరాల ఆఫ్గానిస్తాన్ గత చరిత్రను కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే ఈ తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితి అర్థం అవుతుంది.

(ఇంకా వుంది)

రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా  ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై  వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు.  వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.

Leave a Reply