చిగురంత ఆశ – పిల్లల సినిమాలు 25 

ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు మనకు తక్కువ. కొ.కు అన్నట్టు ‘మనం ఏ చిత్రాలైతే చూస్తున్నామో మన పిల్లలూ ఆ చిత్రాలే చూస్తున్నారు’. ఈ పుస్తకం పిల్లలకోసం తీసిన 25 ఉత్తమ చిత్రాల సమీక్ష. పెద్దల సినిమాల సమీక్ష ‘రియలిస్టిక్ సినిమా’ పుస్తకం రాసిన శివలక్ష్మిగారే ఇది కూడా రాశారు.వివిధ దేశాల, భాషలకు చెందినవి. అన్నీ అవార్డులు గెలుచుకున్నవే! సినీ ప్రపంచ దిగ్గజాల ప్రశంసలు పొందినవే! సరే కానీ రచయిత్రే ఒక చోట చెప్పినట్టు పెట్టుబడి ఊసెత్తని దృశ్యీకరణ ఎంత గొప్పగా ఉంటే మాత్రం ప్రయోజనమేమిటి?

ముందుగా అందరూ తప్పకుండా చూడాల్సిన ఒక సినిమా సమీక్ష చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనకాలంలో స్త్రీలు బురఖా ధరించాలనీ (మహిళల ముఖాలు చూడటమే సమాజంలోని అనర్ధాలకు కారణమని తాలిబన్ల విశ్వాసం), పని హక్కున్నా సరే, భర్తతో తప్ప స్త్రీలు బయట తిరక్కూడదనీ, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే గుట్టుగా బురఖాలో వెళ్లి పని చూసుకుని వెంటనే ఇంట్లోకొచ్చి పడాలనీ తాలిబన్లదౌర్జన్యపూరితమైన నిబంధన. అలాంటి పరిస్థితిలో ఒక ఇంట్లో అమ్మమ్మ, అమ్మ, మనవరాలు ఒసామా  ఉన్నారు. యుద్ధం వల్ల మగదిక్కు లేదు. స్త్రీలు బయటికి రాకూడదు కాబట్టి అమ్మ చేసే నర్స్ ఉద్యోగం పోయింది. పూట గడవడం కష్టమవుతుంది. గత్యంతరం లేక ఒసామాకి అబ్బాయి వేషం వేసి పనికి పంపిస్తారు. కానీ తాలిబన్లు బాలురనందరినీ మతపరమైన పాఠశాలకు పంపించడంతో ఒసామా కూడా వెళ్ళక తప్పలేదు. అక్కడ ఆమె మెన్సెస్ అవడంతో రహస్యం బట్టబయలవుతుంది. అమ్మ కావాలనే ఒసామాబాలిక హృదయవిదారకమైన కావాలనే ఆమె రోదనను పట్టించుకోకుండా ఒసామాకి శిక్షగా తాలిబన్లు ముగ్గురు భార్యలున్న పండు ముసలి వాడికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ ముసలి భర్త ఈమెను ఓ గదిలో పెట్టి తాళం వేస్తాడు. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. మనకు ఒసామాపై సానుభూతీ, తాలిబన్ల దారుణాలపై అసహ్యం పుట్టుకొస్తుంది. ఈ సినిమాలోనే ఒక మహిళను గొంతువరకూ పాతిపెట్టి ఆ పై రాళ్ళు రువ్వే దృశ్యాన్ని చూస్తే తాలిబన్ల కర్కోటక పాలన అర్ధమవుతుంది.

ఎదుగుతున్న పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన చిత్రం “HAYAT”. ఇరాన్ లోని హయాత్ అనే 12 సం.ల  నిరుపేద  బాలిక స్కాలర్ షిప్ కోసం పోటీ పరీక్షకు కష్టపడి చదువుతుంది. కానీ పరీక్షరోజు తండ్రి మంచాన పడతాడు. వాళ్ళమ్మ తండ్రిని పట్నం ఆసుపత్రికి తీసుకెళుతూ తమ్ముడినీ, చెల్లెల్నీ, పశువుల్నీ చూసుకోమని అప్పజెపుతుంది. ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూనే హయాత్ పరీక్షరాయడమే ఈ సినిమా ఇతివృత్తం. సినిమాటో గ్రాఫర్ సయీద్ నిక్జాత్ నేర్పరితనం గురించి చెబుతూ ‘ఈ చిత్రంలో పదాలు జీవిస్తాయి. విజువల్స్ మాట్లాడుతాయి. చిత్రాలు కథలు చెబుతాయి’ అంటారు రచయిత.

ఈ సినిమా సమీక్షలు చదువుతుంటే ‘ఎలాగైనా మన ఇంట్లోని పిల్లలకు ఈ సినిమాలు చూపించాలి’ అని అనిపిస్తుంది

యుద్ధ వీరురాలిగా ఎదగాలనుకున్న ఒక రెడ్ ఇండియన్ అనాధ ఆదివాసీ బాలిక కథ “THINA”, 

తాజ్ మహల్ లాంటి భవంతిని నిర్మించుకోవాలనుకున్న చీమ కథ “CHINTI”.  

ప్రపంచీకరణవల్ల గ్రామీణ జీవితాన్ని ధ్వంసం చేసిన ఇతివృత్తంతో వచ్చిన సినిమా “GRAVEYARD KEEPER’S DAUGHTER”, 

పాఠాల సారాంశాన్ని ఆటపాటలతో విద్యార్ధులకందించే ప్రయోగం చేసిన ట్రైనీ టీచర్ కథ “MEES KEES”,   

గుర్రానికీ మనిషికీ మధ్య ఉండే అనుబంధంపై తీసిన చిత్రం “OSTWIND”,   

నృత్యం, సంగీత కళల సమాహారాన్ని తండ్రీ – కూతుళ్ళ అనుబంధం ద్వారా చూపిన  “PAPA’S TANGO”,  

యానిమేషన్ ద్వారా తాతా-మనవళ్ళ మధ్య మానవ సంబంధాలను హృద్యంగా చిత్రించి మంచి సందేశాన్నిచ్చిన “FIREWOOD, KANTA AND GRANDPA”, 

కాశ్మీర్ లో శాంతిసాధనకు పరిష్కారం కనిపెట్టాలనుకున్న చిన్నారి కథ “NUREH”, 

అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని అందంగా తెరకెక్కించిన “CHILDREN OF HEAVEN”, 

తన పేరు నచ్చక సంఘర్షణకు గురైన చిన్నారి మనోవేదన తెలిపే “ANINA”, 

తలి-దండ్రులిద్దరి ప్రేమా, సంరక్షణలను పిల్లలు బలంగా కోరుకుంటారని కాకిపిల్లతో స్నేహం చేయడం ద్వారా తెలిపిన బాలుడి కథ “KAUWBOY”, 

క్రీడాకారుడిగా, కళాకారుడిగా రాణించాలని తపించిన బాలుడి కథ “HORIZON BEAUTIFUL” .. ఇలా విభిన్నాంశాల కథలతో తీసిన సాటిలేని మేటి చిత్రాల సమీక్షే ఈ పుస్తకం.

వీటిలో మన దేశం నుంచి మరాఠీ ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన “GOLDEN MANGO” (బంగారు మామిడి పండు) సినిమా కూడా ఉంది. 8 నిమిషాల ఈ సినిమా పిల్లలకి మాత్రమే సాధ్యమైన అందమైన ఊహల లోకాన్ని కలగలిపి కళాత్మకంగా ఎనిమిదేళ్ళు పైబడిన పిల్లలకోసం తీసినది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – ముంబై లలో ఆ బాల గోపాలాన్నీ ఆకట్టుకున్న ఈ సినిమా దర్శకుడు గోవిందరాజు మన తెలుగువాడే కావడం విశేషం!

నెట్ లో ఈ సినిమాలు చూడగలం. కానీ శివలక్ష్మి గారు ఈ సమీక్షల్లో దర్శకుల పుట్టు పూర్వోత్తరాలనూ, గొప్పతనాన్ని మనకు తెలియజేశారు. ప్రసిద్ధ కథాంశాన్ని ఎన్నుకోవడంలోనూ దాన్ని చిత్రీకరించడంలోనూ ఎంత ప్రతిభను కనబర్చారో చెప్పారు. సినిమాలో కనిపించిన దృశ్యాల చరిత్రను వివరించారు. “MOTHER I LOVE YOU” అనే సినిమాలోని యాక్ట్ ఒన్, మిడ్ పాయింట్, పాయింట్ ఆఫ్ నో రిటర్న్స్ విశ్లేషణ, “MAHARAL” సినిమాలోని ప్రేగ్ నగర చరిత్ర వివరణే ఇందుకు ఉదాహరణలు. “NONO THE ZIG ZAG”సినిమాలో దర్శకుడు విన్సెంట్ బాల్ స్వీయానుభావాలున్నాయనీ, ఆ సినిమా ప్రపంచ ప్రఖ్యాత రచయిత డేవిడ్ గ్రాస్మన్ రాసిన ఒక నవల ఆధారంగా తీశాడని మనకు ఈ పుస్తకం ద్వారానే తెలుస్తుంది. ప్రీ టీన్స్ బాలల కోసం ఎంత అర్ధవంతమైన సినిమాలున్నాయో  తెలుసుకోవాలంటే అన్ని దేశాల్లోని దర్శకులూ, సినీప్రియులూ

 ఐజర్ అలియూ నిర్మించిన “TO GUARD A MOUNTAIN”  చిత్రాన్ని చూసి తీరాలి అంటారు.

 ప్రేక్షకులకు ఇలా తమ జీవితాలను తామే చూసుకుంటున్నామా అనిపించడమే గొప్ప సినిమా లక్షణం అంటారు సినీ విజ్ఞులు! అటువంటిదే పర్షియన్ భాషలో వచ్చిన సినిమా “WHERE IS MY FRIEND’S HOME”. బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 50  ఉత్తమ చిత్రాలలో 10అత్యుత్తమ చిత్రాలను  ఎంపిక చేస్తే వాటిలో ఇది చోటు చేసుకుంది. దీన్ని  చూసినపుడు ‘నా బాల్యాన్ని నేనే చూసుకుంటున్నానా’ అనే భావన కలిగింది అన్నారు శివలక్ష్మిగారు. దీని డైరెక్టర్ అబ్బాస్ కియరోస్తమి. “భారతీయ దర్శకుడు సత్యజిత్ రే మరణించినప్పుడు అంత గొప్ప సామాజిక వాస్తవ చిత్రనిర్మాత మరొకరు లేరని నేను విచారించాను. కానీ ఇరానియన్ డైరెక్టర్ అబ్బాస్ కియరోస్తమి తీసిన చిత్రాలు చూసినప్పుడు సత్యజిత్ రే లేని లోటు పూడ్చడానికి అబ్బాస్ కియరోస్తమి ఉన్నాడని నా విచారం పోయింది” అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత అత్యుత్తమ దర్శకుడు అకిరా కురోసావా. అది అబ్బాస్ కియరోస్తమి ఘనత! రచయిత్రి ఈ సినిమా సమీక్ష కోసం 5 పేజీలు  కేటాయించారంటేనే  ఆ సినిమా గొప్పతనాన్ని ఊహించవచ్చు.

రియలిస్టిక్ సినిమాలాగే శివలక్ష్మిగారు ఈ పుస్తకానికి కూడా చక్కని ప్రణాళిక వేసుకున్నారు. సినిమా ఏ దేశానికి, ఏ భాషకు సంబంధించినది, నిడివి ఎంత? యానిమేషనా? ఏ వయసువాళ్లకోసం తీశారు? సబ్ టైటిల్స్ ఉన్నాయా లేదా? ఏ సినిమా ఎన్ని అవార్దులు గెలుచుకుంది? ఇవి తానెక్కడ చూశారు. వగైరా వివరాలన్నీ ఇచ్చారు. తాను ఆ సినిమాలు ఏయే సందర్భంలో ఎక్కడెక్కడ చూసారో చెప్పారు. 

అయితే సమీక్షల అరటిపండు ఒలిచిపెట్టలేదు. ఉత్కంఠభరితంగా కథనూ సన్నివేశాలనూ వివరిస్తూ సస్పెన్స్ లో ఆపేసి, కథకు సంబంధించిన ప్రశ్నలు వేసి (ఉదాహరణకు “NONO THE ZIG ZAG”) సమాధానాల కోసం సినిమా చూడమన్నారు.  ముందుమాటలో పిల్లల వైద్య నిపుణులు డా. నళిని చెప్పినట్టు “ప్రతి బడిలో ఇలాంటి మంచి సినిమాలు నెలకు ఒకటైనా చూపించగలిగితే, పిల్లల దృష్టి విస్తరిస్తుంది. వాటి మీద చర్చపెడితే, వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది.” 

బాలల చిత్రాలగురించి కొ.కు చెప్పిన మాటలతో ఈ నా సమీక్షను ముగిస్తాను. “బాల కళలు పిల్లల జ్ఞానేంద్రియాల శక్తులను పెంపొందించి, మనస్సుకు ఉల్లాసం ఇవ్వడమేగాక, వారి భావిశీలానికీ, ఆధ్యాత్మిక పరిమాణానికి బీజాలు వేయగలవు. పిల్లలకు కరుణ శృంగార రసాల అవసరం లేదు, వారికి అద్భుతం కావాలి. అది పురాణ చిత్రాలలో పుష్కలంగా ఉంటుంది…. చందమామ లాంటి పిల్లల పత్రికలో పడే కథలను హ్రస్వచిత్రాలుగా తయారుచేయడానికి ఎవరన్నా పూనుకున్నట్టయితే చక్కని బాలల చిత్రాలు మనదేశానికి ఉపకరించేవి తయారవుతాయి. ( కొ .కు. సినిమా వ్యాసాలు)

                                       —————–

చిగురంత ఆశ’ పిల్లల సినిమాలు25. కుహు ప్రచురణలుశివలక్ష్మి 94418 83949 

Leave a Reply