చారిత్రిక విభాత సంధ్యల్లో… కాలం అడుగు జాడలు

శ్రీకాకుళంలోన చిందింది రక్తమ్ము
కాల్వలై కలిసింది కొండవాగులలోన
బండలే ఎరుపెక్కినాయీ…
పోరాడ కొండలే కదిలినాయీ

– వై.కె. (వై. కోటేశ్వరరావు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి)

శ్రీకాకుళం : దేశంలో వ్యవసాయిక విప్లవోద్యమ చరిత్రలో అదొక మహోజ్వల అధ్యాయం. సామూహిక చేతన. మానని గాయం. ఒక జ్వలించే స్ఫూర్తి. ఒక మరువలేని గుణపాఠం. నూతన ప్రజాస్వామిక భావజాలానికి అదొక అసామాన్యమైన చేర్పు. అనితరమైన తీర్పు. ప్రత్యామ్నాయ రాజకీయ ఆచరణకు దిక్సూచి. చుక్కాని. వేగుచుక్క.

రక్తసిక్తమైన శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాట చరిత్ర యీ నేలపైన విప్లవ సాహిత్యోద్యమానికి సరైన భూమికని యేర్పరచింది. శ్రీకాకుళం సాహిత్యకారులకి కావ్యవస్తువైంది. కవిసమయమైంది. రచయితలు యెటువైపో తేల్చుకోమని సవాలు విసిరింది. విప్లవ దృక్పథాన్ని విస్తృతపరచింది. పోరాట కాలంలోనే వెలువడ్డ పాణిగ్రాహి సుబ్బారావు పాటలు – జముకుల కథ 31 అక్టోబర్, వెంపటాపు సత్యం పాటలు తదితర రచనలు, యెందరో జ్ఞాత అజ్ఞాత కవుల కవిత్వం, తర్వాతి కాలంలో వచ్చిన భూషణం కొండగాలి అడవంటుకుంది మరికొన్ని కథలు, కానూరి శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాట గాథ బుర్రకథ నృత్యరూపకాలు, ఛాయారాజ్ శ్రీకాకుళం దీర్ఘకావ్యం, వంగపండు సిక్కోలు యుద్ధం కంజరి కథ భూభాగోతం, ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం పరిశోధన… యిలా తెలుగునాట ఆటా పాటా మాటా భిన్న సాహిత్య ప్రక్రియలూ శ్రీకాకుళాన్ని శాశ్వతం చేశాయి. దాని పోరాట వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించాయి. ఉద్యమకారుల త్యాగ నిబద్ధతని కీర్తించాయి. ఆ చాలులో పుట్టి యెదిగిన విలక్షణ రచయిత అట్టాడ అప్పల్నాయుడు.

వంశధార, నాగావళి, జంఝావతి (అప్పల్నాయుడి రచనల్లో ప్రళయావతి), వేగావతి, మహేంద్ర తనయ, బాహుదా నదీ తీరాల్లో ఆర్థిక – సామాజిక – రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న చలనాన్నీ, వందకు పైగా సంవత్సరాల చరిత్రనీ అప్పల్నాయుడు వొక నిబద్ధతతో తన రచనల్లో నమోదు చేసాడు. విల్లమ్ములతో తిరగబడ్డ ఆదివాసీ పోరాటం దగ్గర్నుంచి దాన్ని క్రూరంగా అణచివేసిన పాలకుల బహుముఖ వ్యూహాల మీదుగా యిటీవల ‘బీల’భూముల్లో జీవ విధ్వంసానికి కారణమైన థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా జరిగిన కాకరపల్లి, సోంపేట ఆందోళనల వరకూ పీడిత ప్రజా సమూహాల గొంతుని సాహిత్య మాధ్యమంగా వినిపిస్తూ తననేల మీద తనదైన రచనా బలంతో కళింగాంధ్ర ప్రాతినిధ్య రచయితగా నిలబడి వున్నాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య ప్రస్థానంలో కథ నవల నాటకం వ్యాసం ప్రక్రియ యేదైనా కళింగాంధ్ర అప్పల్నాయుడి రచనలకీ జీవధాతువైంది. అక్కడి జన జీవితం అతని సాహిత్యానికి ప్రాణవాయువైంది. కారా యజ్ఞానికి ముందు యజ్ఞానికి తర్వాతి కాలం చరిత్రని అధ్యయనం చేయాలన్నా, కళింగాంధ్ర ప్రజల గుండె చప్పుడు వినాలన్నా, ఆ నేలపై ప్రభవించిన వీరుల పోరుగాథలు తెలుసుకోవాలన్నా, సమాజ చలనాన్ని వొడిసిపట్టుకోవాలన్నా అందులో కంఠదఘ్నుడైన అప్పల్నాయుడిని ఆశ్రయించాల్సిందే.

1.

కళింగయుద్ధ క్షతగాత్రుడని నేను యిష్టంగా గుండెకు హత్తుకునే రచయిత అప్పల్నాయిడు. అతను యింతకు ముందు రాసిన నాలుగు నవలల్లో (పునరావాసం, ఉత్కళం, అనగనగా ఒక రాజద్రోహం, నూకలిస్తాను; వాటిని నవలికలు అని పేర్కొన్నారు), పోడూ పోరూ, ప్రత్యామ్నాయం, క్షతగాత్ర గానం మొ. కథల సంపుటుల్లో కళింగ నేలపై నడిచిన యుద్ధాల్నే, యుద్ధాల్లో గాయపడ్డ ప్రజా సమూహాల జీవితాల్నే వొక జ్వర పీడితుడి పలవరింతలా యేకరువు పెట్టాడు. వాటన్నింటిలో చెప్పగా యింకా మిగిలిన ఖాళీలని పూరించడానికన్నట్టు యిప్పుడు ‘బహుళ’ నవలని అందిస్తున్నాడు. ఉద్యమ గమనంలో గమ్యంలో ఆచరణలో తనలో పుట్టిన సవాలక్ష ప్రశ్నలకు తనకు తానే చెప్పుకున్న సమాధానం ‘బహుళ’. ఈ నవల్ని రూపంలో టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి నవలతో పోల్చవచ్చు. ఆ నవల్లోలాగానే యిందులో కూడా రక్తమాంసాలతో వందలాదిమంది సజీవ వ్యక్తులు పాత్రలై బతుకు భాష్యాన్ని ఆవిష్కరిస్తారు. మెరుగైన జీవితాలకోసం తపించిన వాళ్ళు, జీవితాల్ని గెలవాలని పోరాడినవాళ్ళు, పోరాడి వోడినవాళ్ళు, రాజీపడ్డ వాళ్ళు, వోటమిని అంగీకరించని వాళ్ళు, వోడి తలయెత్తి లేచినవాళ్ళు, తెలిసో తెలియకో యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచినవాళ్ళు … యిలా అతి సామాన్యులు, సాహసులు అప్పల్నాయుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా తారసపడ్డ అసంఖ్యాకులైన మనుషులు… అనేక వుద్వేగాలతో నిండిన వాళ్ళ జీవిత అనుభవ సారాన్ని అక్షరాల్లోకి అనువదించిన కారణంగా ‘బహుళ’ వొక బృహన్నవలగా రూపొందింది.

‘బహుళ’ భూమిని నమ్ముకున్న వాళ్ళ చరిత్ర. భూమికోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన వాళ్ళ చరిత్ర. కష్టపడి పొందించుకున్న మడిచెక్క అన్యాక్రాంతమౌతుంటే తిరగబడ్డ వాళ్ళ చరిత్ర. పోరాడితే బానిస సంకెళ్ళు తప్ప పోయేదేమీ లేదని తెగించిన వాళ్ళ చరిత్ర. ఇతిహాసపు చీకటి కోణంలో అట్టడుగున పడి కాన్పించని పీడితుల చరిత్ర. వెరసి ‘బహుళ’ పాలితుల చరిత్ర. జన శ్రుతిలో, దస్త్రాల్లో, జానపదుల పుక్కిట దాగిన గాథల్ని తవ్వి అప్పల్నాయుడు తిరగ రాసిన యీ చరిత్రలో గతం వర్తమానం జమిలిగా కలిసిపోయాయి. పరోక్ష గతాన్ని రచయిత చెబితే, వర్తమానాన్ని సమీప గతంతో కొల్లేజ్ చేస్తూ పాత్రలు చెబుతాయి. ఇది వొక విశిష్ట ప్రయోగం.

నవలలో తొలి భాగానికి నాయకుడైన నారాయుడి తాత పెదనారాయుడు. పెదనారాయుడికి పిల్లనిచ్చిన మామ జగన్నాథ దాసు దగ్గర్నుంచి పెదనారాయుడి మునిమనవడు రాధేయ వరకు… రాధేయ నేస్తం జానేషు, జానేషు కొడుకు సత్యకాం వరకు భూమిని నమ్ముకున్న సబ్బండ కులాల వాళ్ళ చరిత్ర. తెల్ల దొరల కింద జమీందార్ల శిస్తులకు వ్యతిరేకంగా, షావుకార్ల దోపిడీకి వ్యతిరేకంగా, అగ్రహారీకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా, భోక్తల రాజుల భూదాహానికి వ్యతిరేకంగా, మోఖాసాదారుల యినాందారుల మిరాసీదారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా, అన్నిరకాల ఆధిపత్యాలకూ అణచివేతలకు వ్యతిరేకంగా తిరగబడ్డ శ్రామిక కులాలకు చెందిన కౌలుదారుల చిన్న రైతుల రైతు కూలీల చరిత్ర. ఆ తర్వాతి కాలంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా పౌర సమాజం కన్న కలలన్నీ చెదిరిపోయాకా అది సాయుధంగానో నిరాయుధంగానో ‘బహుళ’మై యే యే రూపాలు ధరించిందీ, వర్తమాన వేదిక మీదికి యే యే రాజకీయ సమీకరణలకీ పోరాట యెత్తుగడలకీ దారితీసిందీ, యే యే ప్రజాశ్రేణుల్ని కదిలించి కూడగట్టిందీ యీ నవల్లో చర్చకు వస్తుంది.

అవడానికి వ్యవసాయాన్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వొక కుటుంబాన్ని నేపథ్యంగా చేసుకుని చెప్పిన కథే గానీ దాదాపు నూట యాభై యేళ్ళలో కళింగాంధ్రలో భూమిపై హక్కు కోసం మొదలైన సంఘర్షణ భూ విముక్తి పోరుగా పరిణమించే క్రమం అంతటినీ వర్షధారల్ని వొడిసిపట్టి చెరువులోకి మళ్ళించినట్టు అప్పల్నాయుడు యీ నవల్ని నిర్మించాడు. విశాలమైన కాన్వాస్ మీద తాను విన్న కన్న అనుభవించిన అనేక ఘటనల్ని భిన్న వర్ణాల్లో చిత్రించాడు.

అయితే ఘటనలు వాటికవే చరిత్ర సారాన్ని చెప్పనట్లే ఘటనలు వాటికవే సాహిత్య రూపాన్ని ధరించలేవు. సాహిత్యం ఘటనల్ని గతితార్కికంగా విశ్లేషిస్తుంది. ఘటనల మధ్య కార్య కారణ సంబంధాన్ని తరచి చూస్తుంది. సామాజిక శాస్త్రాల వెలుగులో వాటికి కారణమైన ఆర్థిక – రాజకీయ కారణాలని మూలాల నుంచి అన్వేషిస్తుంది. పరస్పరం సంఘర్షించే శక్తులలో చరిత్ర పుడుతుంది కానీ ఆ సంఘర్షణలో చోటుచేసుకున్న మనిషి వుద్వేగాల మూలాల్లోకి, మానవ సంబంధాల లోతుల్లోకి, సంభవించే పరిణామాల ప్రమేయాల్లోకి తొంగి చూడగలిగింది సాహిత్యం మాత్రమే. వాస్తవికతని కాల్పనిక తలంలోకి తీసుకుపోవడానికి అవసరమైన సామగ్రి హంగులు వనరులు సమకూర్చుకుంటుంది. సన్నివేశాలు కల్పిస్తుంది. వాతావరణాన్ని చిత్రిస్తుంది. కొన్నిపాత్రల్ని యథాతథంగా గ్రహిస్తుంది. కొన్ని పాత్రల్ని సృష్టిస్తుంది. వాటి మధ్య సంఘర్షణని నిర్మిస్తుంది. వుద్వేగాల్ని రంగరిస్తుంది. వాటిని వ్యక్తీకరించడానికి తగిన భాషని యెంచుకుంటుంది. చివరికి జీవన అనుభవ సారాన్ని జోడించుకొని కళగా రూపొందుతుంది. ఈ క్రమం అంతటిలో రచయిత కొన్నిసార్లు తటస్థంగా మరికొన్ని సార్లు తల్లీనమై వుండటం జరుగుతుంది. ఈ దూరాల్ని దగ్గరల్ని బ్యాలెన్స్ చేయడంలోనే రచయిత ప్రతిభ వ్యక్తమౌతుంది. ఈ తీగ మీది నడకని అప్పల్నాయుడు సమర్థవంతంగా నిర్వహించాడు.

‘బహుళ’ నవల రాస్తూ అప్పల్నాయుడు సంవత్సరాల తరబడి పడిన శ్రమ యాతన చాలా సందర్భాల్లో స్పష్టంగా గోచరిస్తాయి. కారణం – యీ కథ అతని స్వీయ జీవిత అనుభవం కూడా. ఆటో బయోగ్రాఫికల్ ఫిక్షన్ ని వొక చారిత్రిక డాక్యుమెంట్ గానో రాజకీయ నివేదికగానో మలిచి పరిరక్షించే క్రమంలోనూ, వాటికి కళాత్మకతని అద్దే పనిలోనూ అతను అత్యంత జాగరూకుడై వున్నాడు. ఆ జాగరూకత కారణంగా తన సహజ సిద్ధమైన శైలిని సైతం అతను వదులుకున్నాడు. అప్పల్నాయుడికి బాగా యిష్టమైన కవితాత్మక శైలి, సునిశిత వ్యంగ్య మిళితమైన క్రుద్ధ వచనం, హాస్యచతురత యీ నవల్లో వొకటి రెండు సందర్భాల్లో మాత్రమే వొక మెరుపులా మెరిసి పోతాయి. పైపెచ్చు యిదీ అని చెప్పలేని వొక తెలీని విషాద గంభీర స్వరం నవల పొడవునా వినిపిస్తుంది. కవి అన్నట్టు ‘గతమంతా తడిసెను రక్తంతో కాకుంటే కన్నీళులతో’.

తల పండిన జానపద గాయకుడు వేదనాభరితమైన జీరవోయిన గొంతుతో పాడిన ఆద్యంతాలు లేని వొక దీర్ఘ స్మృతిగీతంలా నవల నన్ను వెంటాడింది. పెదనారాయుడి శవం తోటలో చెట్టుకు వేలాడిన దగ్గర్నుంచీ నారాయుడు అతని మేనమామ రామస్వామి నాయుడు, భార్య అన్నపూర్ణ, రాధేయ నాయుడి భార్య సంధ్య, ఆమె తండ్రి బలరాం, చివరికి రాధేయ కన్నతల్లి బంగారమ్మ వరకూ అనేక సహజ – అసహజ మరణాలు వూపిరి తీసుకోనివ్వలేదు. వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసంల అమరత్వం నవలకి మరింత గాంభీర్యాన్ని అద్దింది. ఆ దృశ్యం రాధేయకు లాగానే నాక్కూడా మెదడు పొరల్లో ముద్రితమై పోయింది. నవల ఆయువుపట్టు ఆ ఘట్టం. రాధేయ బతుకులో ప్రధానమైన మలుపు.

సత్యం కైలాసంల మరణం దగ్గర నవల మొదలైతే బాగుండేది అని నాకనిపించింది. కానీ అలా చేస్తే యిది రచయిత ఆత్మ కథగా పరిణమించేది. నవల జానపదుల బోనెల (జముకుల) కథ ఒగ్గుపాట బుర్రకథ ద్వారా పెద నారాయుడి వీరగాథని గానం చేయడం దగ్గర మొదలైంది. చివరికి అతని సంస్మరణ సభతో అంతమైంది. ఆ విధంగా స్వీయ జీవితం – కుటుంబ జీవితం – వంశ చరిత్ర వీటి నుంచి అప్పల్నాయుడు నవలను Local Political Social Historical Documentation గా తీర్చిదిద్దాడు. ఒక విధంగా వుద్యమ చరిత్రని అతను పునర్నిర్మించాడు. వర్తమానంలో నిలబడి గతంతో చేసిన సంభాషణ యిది. గతంలోని మంచి చెడుల్ని బేరీజు వేసే లోచూపు యిది. జ్ఞాపకాల దొంతర నుంచి నిర్మించిన పురాగాథ. ఇదంతా పురాజ్ఞాపకాల్ని తలపోయడమే కాదు పొరలు పొరలుగా తవ్విపోయడం. ఒక నాస్టాల్జియాలా కనిపిస్తూనే జ్ఞాపకాలు వైయక్తిక తలంనుంచి సామూహిక తలంలోకి యెగబాకుతాయి.

రాధేయ నాయుడికి ముందూ వెనకా ఏడుతరాల చరిత్ర యిది. కథ ఆసులో కండెలా గత వర్తమానాల మధ్య తిరుగుతూ చేసిన విలక్షణమైన అల్లిక శ్రీకాకుళం వుద్యమానికి ముందు వెనక గ్రామీణ సమాజంలో చోటు చేసుకున్న చలనాన్ని సూక్ష్మాతి సూక్ష్మదృష్టితో విమర్శనాత్మకంగా లోతుగా ఆవిష్కరించింది. చారిత్రిక విభాత సంధ్యల్లో కాలం వదిలిన అడుగుజాడల్ని పదిలపరచింది.

నవలలో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం: వంశ చరిత్రకి అప్పల్నాయుడు పితృస్వామ్య ఆధిపత్య రూపాన్ని నిరాకరించాడు. నారాయుడి తండ్రి కుటుంబ గాథ కాకుండా తల్లి పుట్టింటి తరపు వారి చరిత్రే ముఖ్య భూమిక వహిస్తుంది. ఆ క్రమంలో పెడ నారాయుడి భార్య వైపు వారి వివరాలు కూడా వచ్చి చేరతాయి. అలాగే రాధేయ తరంలో అతని భార్య సంధ్య కుటుంబ చరిత్రకే ప్రాధాన్యం యివ్వడం చూస్తాం. నవల రెండో భాగం సంధ్య జ్ఞాపక శకలాలుగా సాగుతుంది. నారాయుడి మొదటి భార్య బంగారమ్మ దగ్గర మొదలైన కథ నాటకీయంగా ఆమె దగ్గరే అంతమౌతుంది.

కురుపాం జమీలో నాగావళి నది శిరస్సు మీది గంగువాడ గ్రామ నేపథ్యంగా జరిగే కథ పార్వతీపురం శ్రీకాకుళం విశాఖపట్నం బొబ్బిలి విజయనగరం సూరన్న పాలెం టేకువలస ప్రళయావతి రిజర్వాయర్ కింద ముంపుకి గురైన వీరపుదొర వలస, లక్ష్మీపురం మొ. గ్రామాలతో పాటు ఒరిస్సాలోని రాయగడ వరకూ వ్యాపించిన కళింగాంధ్ర మొత్తం చుట్టివస్తుంది. అక్కడి అడవులు కొండలు మైదానాలు సముద్రతీరం కేవలం కథాస్థలాలు కావు. స్థానిక సామాజిక చరిత్రకు కేంద్రాలు.

ఆ ప్రాంతంలో గ్రామీణ – పట్టణ – నగర ప్రజా జీవితాల్లో వుత్పత్తి సంబంధాల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడుల బదలాయింపులు, అధికార మార్పిడి, రాజకీయాల్లో కులాల సమీకరణ, పదవుల పంపకం, భూస్వామ్య పెత్తనం నుంచి కొత్త దళారీ దోపిడిలోకి పరిణమిస్తున్న ఆర్థిక సంబంధాలు… యివి మాత్రమే గాక భిన్న వర్గాల కులాల మధ్య వుండే సాంస్కృతిక వైవిధ్యం – తినే తిండి పండించే పంట, కట్టిన యిళ్ళు పంచలు మండువా లోగిళ్ళు, వాటి నిర్మాణం… యిలా యెన్నో సామాజికాంశాలు, వస్తు సంస్కృతి – అలవోకగా నవలలోకి చొచ్చుకువస్తాయి.

తినే తిండే కాదు ప్రజలు తమ విరామ సమయాలు యెలా గడుపుతున్నారన్నది కూడా వొక సమాజానికి చెందిన ప్రత్యేక సంస్కృతిని నిర్వచించడానికి తోడ్పడుతుంది. నవల తప్పెటగుళ్ళు జానపద కళారూప ప్రదర్శన దగ్గర మొదలౌతుంది. ఆ సందర్భంగా శిష్ట కళలకీ, జానపద కళలకీ రూప సారాల్లో వుండే మౌలికమైన భేదం గురించి రచయిత ప్రస్తావిస్తాడు. గుడి – మడి కళల మధ్య వైరుధ్యాన్ని విమర్శనాత్మకంగా చూపుతాడు. నారాయుడి యవ్వన కాలానికే యీ చైతన్యం వుండడం ఆశ్చర్యమే. అలాగే ‘నాయుడోరి’ నారాయుడు గొల్ల సింహాద్రి అప్పయ్య దగ్గర తప్పెటగుళ్ళు నేర్చుకోడానికి వుత్సాహం చూపిస్తే అతని సహచరులు యెగతాళి చేసినప్పుడు కళకి కులం అంటదని చెప్పిన సమాధానాలు రచయితవే. రాధేయ ప్రజా గాయకుడిగా మారి జన కళామండలిని రాజకీయ చైతన్య వేదికగా మార్చడానికీ, అందులో భిన్న శ్రామిక కులాల కళాకారులు భాగం వహించడానికీ బీజాలు యిక్కడే వున్నాయి. ప్రజా సంస్కృతికీ, బూర్జువా సంస్కృతికీ మధ్య గీతల్ని అవసరానుగుణంగా రచయిత స్పష్టం చేస్తాడు. యిటువంటి విషయాలెన్నో నవలకి విస్తృతినీ, బహుముఖీనతనీ సాధించాయి.

2.

గత చరిత్రని చెప్పే నెపంతో ‘బహుళ’ రాజకీయాలనే ప్రధానంగా చర్చకు తెచ్చింది. నవల ‘రాజకీయాలకీ బతుక్కీ లంకె’ పెడుతుంది. గతం వర్తమానంలోకి ప్రవహిస్తుంది. గతానికి చెందిన వెలుగో చీకటో వర్తమానంపై ప్రసరిస్తుంది. వర్తమాన రాజకీయాలకి అవసరమైన అంశాలనీ, అనుభవాలనీ గతం నుంచి స్వీకరించడం ద్వారా ఆచరణని దిద్దుకోవచ్చు అన్న స్పృహ నవల్లో అంతర్లీనంగా గోచరిస్తుంది. పొలిటికల్ ఎకానమీకీ, పొలిటికల్ హిస్టరీకీ మధ్య వున్న గీతని కూడా నవల చెరిపేసింది. అవి రెండూ వొకదాన్ని మరొకటి ప్రభావితం చేసుకుంటూ అవిభాజ్యమన్నంతగా మిళితమై కనిపిస్తాయి. నవల నిర్మాణంలో రచయిత కాన్షియస్ గా పెట్టిన పూనిక యిది.

భూమి చుట్టూ తిరిగిన రాజకీయాలు రాజుల జరజాం (కురుపాం?) కోట లోపలి నుంచి అగ్రహారం మండువా లోగిళ్ళ నుంచి బయటపడి నాయుళ్ళ, గొల్లల పంచలోకి అక్కడి నుంచి మాల వీధిలోకి రెల్లి గుడిసెల్లోకి ప్రయాణం చేశాయి. ఆ ప్రయాణం పొడవునా యెన్నో కత్తుల వంతెనలు. దారి అంత సుకరమైంది కాదు. పెద నారాయుడి లాంటి వారి తలలు యెన్నో తెగిపడ్డాయి. నారాయుడు లాంటి వాళ్ళ బతుకులు జీవన మాధుర్యాన్ని కోల్పోయి బండలయ్యాయి. కనకం నాయుడు లాంటి వాళ్ళు అనివార్యంగా రాజుల బ్రాహ్మల కరణాల ఆధిపత్యం కింద రాజకీయ బాధితులయ్యారు. కుట్ర కేసులు, చార్జిషీట్లు, కోర్టులు, తీర్పులు, బెయిళ్లు, జైళ్లు … వొకటేమిటి జనం రాజ్యం పెట్టిన పుర్రాకులన్నీ అనుభవించారు. భూమిపై ఆధిపత్యాన్ని స్థిరీకరించుకొని దాని ద్వారా రాజ్యాధికారం నిలుపుకోడానికి ఒక వర్గం. జీవిక కోసం భూమిని నమ్ముకొని దాని కోసం ప్రాణాలొడ్డి పోరాడే వారు మరొక వర్గం. పార్లమెంటరీ రాజకీయాలు వొకవైపు. వాటికి దీటుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు మరోవైపు. దేశంలో యితర ప్రాంతాల కంటే కళింగం ముందుగా రణస్థలి అయ్యింది.

శ్రీకాకుళం అడవిలో గిరిజనులు రాజేసిన నిప్పుని కొండగాలి పల్లానికి మోసుకొచ్చింది. మెరకనీ బంజరునీ వొరకట్టి, నొల్లి, చదును చేసి, సాగుజేసే రైతుల జీవితాల్లోకి వాళ్ళ బతుకుల్ని వొరకట్టి, నొల్లి, చదును చేసి, సాగుజేసే అద్భుతమైన మనుషులు వచ్చారు. సమత్వ భావనని మోసుకొచ్చారు. సాంఘిక న్యాయాన్ని పంచిపెట్టారు. మందిని కూడగట్టారు. గాలివాటం రాజకీయాల స్థానే వొక నిర్మాణాత్మకమైన ఆలోచనని, ఆచరణని అందజేశారు.

కొండనీ పల్లాన్నీ, ఆదివాసినీ పల్లె రైతునీ కలిపింది వుద్యమమే. ఊరిని దళితవాడలో కలిపిందీ వుద్యమమే. రెల్లి జానేషు రాధేయతో కలిసి చదువుకున్న ఆత్మీయ స్నేహితుడే గానీ అగ్రహారంలో లక్ష్మీనారాయణ యింటికి వెళ్లి రాత్రులు సైతం గడిపినట్టు రాధేయకి జానేషుతో కుటుంబ బాంధవ్యం యేర్పడలేదు. అలా యేర్పడక పోవడానికి కులమే అడ్డొచ్చింది. ఆ గోడలు వూళ్లోకి బలరాం రావడంతో బద్దలయ్యాయి. అతని అజ్ఞాత జీవితం మాల వీధి గుడిసెల్లోనే. రహస్య సభలూ సమావేశాలూ అక్కడే జరిగేవి. వాళ్ళే అతణ్ణి కడుపులో పెట్టుకుని కాపాడేవారు. కనకం నాయుడి రాజకీయాలు చేయని/ చేయలేని పనిని సాయుధ పోరాట భావజాలంలోంచి తయారైన కార్యకర్తలు సాధించారు. నాయుడు, గొల్ల, మేదర, మాల, మాదిగలనందర్నీ కులభేదాల్ని అధిగమించి వుద్యమంలోకి కూడగట్టారు. జానేషు కాలానికి కాకపోయినా సత్యకాం కాలానికి ప్రజా వుద్యమాలలో దళితులు నాయకత్వ స్థానంలోకి యెదదగాల్సిన అవసరాన్ని రచయిత బలంగా ఆకాంక్షించాడు. జానేషు భార్య ప్రమీల మాలపేటలో స్థాపించిన పాఠశాల యీ క్రమాన్ని వేగవంతం చేసింది. ప్రమీల ప్రైవేటుగా నడిపిన ఆ స్కూల్లో టీచర్లు జనకళామండలిలో పనిచేసే వాళ్ళే కావడం వల్ల వూరు పార్లమెంటరీ రాజకీయాల వైపు మొగ్గినప్పటికీ హక్కుల పోరాటం కోసం నిలబడే తరం అక్కడే రూపొందింది.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందే క్రమంలో సంపద విశాఖ నగరం వైపు కదిలిపోయే పరిస్థితినీ, అది కోస్తా ప్రాంతం నుంచి వచ్చినవారి చేతిలో కేంద్రీకృతమయ్యే మార్పునీ ప్రధానమైన అంశంగా రచయిత ముందుకు తెచ్చాడు. పర ప్రాంతాల పెట్టుబడుల వెల్లువ ధాటికి స్థానిక భూస్వామ్య సమాజంలో కదలిక కలిగింది. సంపద కేంద్రీకరణకీ రాజకీయ అధికార కేంద్రీకరణకీ వున్న లింక్ ని రచయిత బలంగా ఆవిష్కరించాడు. అది స్థానిక బి సి లకు – కోస్తా అగ్రకుల ఆధిపత్యానికీ మధ్య జరిగే సంఘర్షణగా నవల్లో బహిర్గతమైంది. అంతేకాదు; కొండ అడవి పల్లం తీర ప్రాంతం తేడా లేకుండా గుత్త పెట్టుబడుల ప్రాబల్యం పెరిగింది. ప్రాంతీయ కుల అస్తిత్వాలతో పాటు సహజ వనరుల మీద ఆధిపత్యం ఎజండాగా విజృంభించిన కార్పోరేట్ కంపెనీల హైటెక్ దోపిడీ అవి దళారీ పాలకులకులతో మిలాఖత్ అయిన వైఖరీ… యిలా రచయిత గమనంలోకి, దృష్టిపథంలోకి వచ్చిన యెన్నో అంశాల్ని జోడించడం వల్ల నవలకు ‘బహుళ’ పేరు సార్థకమైంది.

సత్యం కైలాసంల అమరత్వం రాధేయ మీద బలంగా పడటం దగ్గర్నుంచి అతను బలరాం కి దగ్గర కావడం, బలరాం కూతురు సంధ్యతో కలిపి జన కళామండలి కార్యక్రమాలు నిర్వహించడం, నెమ్మదిగా వుద్యమంతో మమేకమవడం, పార్వతీపురం కుట్రకేసుని యెదుర్కోవడం, సంధ్యతో అతని వివాహం, చిన్నా చితకా ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతల కారణంగా పార్టీ పూర్తికాలం వ్యవహారాలనుంచి బయటకువచ్చి కేవలం సానుభూతి పరుడిగా వుండటం వరకు నవల సంధ్య రాధేయల చుట్టూ నడిచినప్పటికీ, వాళ్ళు వూరికీ వుద్యమానికీ దూరమైనప్పటికీ వూరూ సమకాలీన రాజకీయాలూ కేంద్ర స్థానం నుంచి తప్పుకోలేదు. అదే యీ రచన బలం.

భిన్న సందర్భాల్లో శ్రీకాకుళోద్యమంలో వుద్యమ ఆచరణలో పార్టీ చేపట్టిన ‘వర్గ శత్రు నిర్మూలన’ విధానంలో వ్యక్తమైన అనేక అంశాల్ని, భిన్న అభిప్రాయాల్ని రచయిత బలరాం ముఖత: వినిపించాడు. పార్టీ అంతర్గత పాలసీలు, నిర్మాణ విధానం, క్రమశిక్షణ, టెక్ వ్యూహాలు వంటి అనేక విషయాల్ని రచయిత నవలలో సందర్భానుసారంగా చాలా మెలకువతో యిమడ్చడం గమనించవచ్చు.

‘ప్రజలకు కంటకంగానూ ప్రజల ఉద్యమానికి ఆటంకంగానూ వుండినపుడూ; మరోవిధంగా శత్రువును తొలగించడం సాధ్యం కానపుడూ మాత్రమే భౌతికంగా తొలగించాల’ని బలరాం అభిప్రాయం. కానీ ‘ఆ అభిప్రాయాన్ని పార్టీలో చర్చకు పెట్టి మెజారిటీ సభ్యులకు వ్యతిరేకమయినాడు. శత్రువన్నవాడిని చంపాల్సిందే. శత్రు రక్తంలో చేతులు తడపనివాడు విప్లవకారుడే కాదని సహచరుల తీర్మానం’
‘ఎందరి కన్నీళ్ళతోనో, నెత్తుటితోనో నిత్యం యీ దేశం తడుస్తోంది. ఆ కన్నీళ్ళాగాలి. ఆ నెత్తురింక వొలక గూడదు.’
యిది బలరాం ఆశయం. ‘సహచరులెందరో అమరులైనారు. కొందరు జైళ్ళల్లో. కొందరు పార్టీ నుంచి దూరంగా. పార్టీ చీలికలైంది. సమకూర్చాలి అంతటినీ మళ్ళా సమకూర్చాలి. అమరుల త్యాగాలకు న్యాయం చేయాలి. మారిన పరిస్థితులకు తగ్గ బాటలో మళ్ళా ఉద్యమించాలి’– ఇదే బలరాం పోరాట పంథా.

పార్టీ పోరాట పంథా గురించి, భావజాలపరంగా పార్టీలో వచ్చిన విభేదాలు, అంతర్గత వైరుధ్యాలు వంటి చర్చనీయాంశాలు నాకు తెలిసినంతవరకు ఛాయారాజ్ శ్రీకాకుళం దీర్ఘకవితలో తప్ప మరే యితర సృజనాత్మక సాహిత్యంలోనూ యింత విస్తృతంగా ప్రస్తావనకు రాలేదు.

అలాగే ప్రభుత్వం క్రూరమైన అణచివేత – ప్రలోభాలు – సంక్షేమాలు అనే త్రిముఖ వ్యూహం అమలుచేయడంతో వుద్యమం సెట్ బ్యాక్ కి గురైన కారణాల గురించి కూడా అప్పల్నాయుడు నవల్లో చర్చకు పెట్టాడు. ఉద్యమం బలహీనపడే క్రమంలో మూర్తి లాంటి హార్డ్ కోర్ కార్యకర్తలు వుద్యమానికి దూరమవడం అతణ్ణి బాధించింది. ఆ సందర్భంగా రాజకీయ నిబద్ధత నిమగ్నతల గురించి రాధేయ చేసిన వాదనల్లోని కంఠస్వరం రచయితదే. అరెస్టులు, జైళ్ళు, కోర్టు కేసులు… వాటిని పరిష్కరించుకోడానికి చేపట్టిన రాజకీయ కార్యాచరణ గురించి, వాటి లోటుపాట్లు గురించిన ఆలోచనలు సంధ్య జ్ఞాపకాల్లో నలుగుతుంటాయి. ఆమె మరణం తర్వాత మరోసారి రాధేయ తాను దూరమైన ప్రజారాజకీయ క్షేత్రం వైపు దృష్టి సారించాడు. అలా నవల గతం నుంచి వర్తమానంలోకి మలుపు తిరిగి ప్రాసంగికతని సాధించింది.

3.

వర్తమానంతో అనుసంధానం కాని చరిత్ర, ప్రస్తుతంతో ముడివేయని పురాస్మృతి సాహిత్యంలో నిష్ప్రయోజనాలే. గతాన్ని నేటిలోకి తీసుకువచ్చి అన్వయించడంలోనే రచయిత దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గతంలో స్వీకరించదగినవాటినీ తిరస్కరించదగినవాటినీ విమర్శనాత్మకంగా చూడడానికి దృక్పథం తోడ్పడుతుంది. నవల్లో పెదనారాయుడి సంస్మరణ ద్వారా అది ద్యోతకమైంది.

చరిత్రలో వొక ఆశయం కోసం అమరులైన వీరుల సంస్మరణ వర్తమాన పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది. భీమా కోరేగాం, ఇంద్రవెల్లి స్థూపం, కారంచేడు రుధిర క్షేత్రం… యిలా యేదో వొక స్మారక చిహ్నాన్ని పోరాటానికి ఆయుధంగా కొత్త తరాలు అందుకుంటాయి. కానీ పాలకులు అప్రమత్తమై యీ స్ఫూర్తిని ప్రజలనుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కొన్ని స్మృతుల్ని తొక్కివేయడానికి హింసని ప్రయోగిస్తారు. కొన్నిటిని తాము సొంతం చేసుకుని అనామకం చేస్తారు. ఇంద్రవెల్లి స్థూపం దగ్గర సంస్మరణకి ఆంక్షలు విధిస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెని బ్రాహ్మనైజ్ చేసి గిరిజన జాతరని జాతీయ వుత్సవంగా ప్రకటిస్తారు. భగత్ సింగ్ ని కొమురం భీం ని హైజాక్ చేస్తారు. వొకవైపు దళితవాడలో అంబేడ్కర్ బొమ్మ పెట్టుకోనివ్వరు. మరోవైపు వోట్ల కోసం వంద నూట యాభై అడుగుల విగ్రహం లేపుతామంటారు. నవల్లో పాణిగ్రాహి బొమ్మని ప్రతిష్టిస్తామని బూర్జువా పార్టీలు ముందుకొస్తాయి. విగ్రహ రాజకీయాలకు పరాకాష్ట యిది. అయితే యిటువంటి వ్యూహాత్మక ద్రోహాల్ని ప్రజలు పసిగడతారు.

గంగువాడ పరిసర ప్రాంతాల్లో నెలకొల్పబోయే కార్పోరేట్ కంపెనీల విధ్వంసక కర్మాగారాలకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకంతో జరిపే వుద్యమానికి పెదనారాయుడి సమాధి దగ్గర జరిగే సంబరాల్ని సత్యకాం వేదికగా మార్చుకుంటాడు. స్థానిక సాంస్కృతిక వీరుల స్ఫూర్తిని అందుకోవడం కొత్త పోరాట యెత్తుగడ. పెదనారాయుడు వర్తమాన ఉద్యమానికి ప్రేరణ అవుతాడు.

వర్తమానంలో నిలబడి రాధేయ తరం అందించిన అనుభవాల నుంచి, వ్యాఖ్యానించిన చరిత్రసారం నుంచి నేర్చుకున్న పాఠాలతో సత్యకాం భవిష్యత్తులోకి చూపు సారిస్తాడు. దేశంలో జరిగిన అనేక వుద్యమాల్ని అధ్యయనం చేశాడు. మార్క్సిజానికి అంబేద్కర్ ని జోడించాడు. అందుకే అతని పోరాట రూపాలు వేరు. పోరాడే శక్తుల సమీకరణ వేరు. బహుళమైన రాజకీయాల్ని అతడు కోరుకుంటున్నాడు.

‘కార్పోరేటీకరణ చేసే అభివృద్ధి మనుషుల్ని విడదీస్తుంది. దాని విధ్వంసం మనుషుల్ని యేకం చేస్తుంది. మనుషుల్ని యేకం చేసే అభివృద్ధి కొస మనుషులు ఆలోచించాలి’ అంటాడు సత్యకాం.

యే రాజకీయ పార్టీల అఫిలియేషన్ లేకుండా, జెండాల నీడా పడకుండా వుద్యమంలో బాధిత సమూహాలన్నిటినీ కలుకుపోవాలని సత్యకాం అభీష్టం. తద్వారా వుద్యమానికి విస్తృతి సాధించవచ్చనీ మరింత ప్రజామోదం పొందవచ్చనీ అతని ఆలోచన. వుద్యమాన్ని ప్రజాస్వామ్యీకరించడం ద్వారా దాన్ని చట్టబద్ధ పోరాటంగా మలచవచ్చనీ అతని వ్యూహం. అందుకే పోరాట ఎజండాలో పర్యావరణ కోణం కూడా ముందుకు వస్తుంది. తమ మధ్య వున్న వైషమ్యాల్ని పక్కనపెట్టి కార్పోరేట్ వర్గం అంతా వొకటై దోపిడీకి మార్గాలు సుగమం చేసుకుంటున్నప్పుడు పీడితులు శకలాలుగా తలోదిక్కున బలహీనం కాకుండా ఐక్య వేదికలు నిర్మించుకోవాలనీ, పోరాట రూపాల్ని రూపొందించుకోవాలనీ, ప్రజా వుద్యమాలు బహుళం కావాలనీ రాధేయకి కొత్త యెరుక కలగడం దగ్గర నవల ముగుస్తుంది.

‘సమాజాన్ని మార్చడానికి బహుళ ప్రయోగాలు అవసరం, బహుజనోద్యమం అవసరం అని యిక్కడ సత్యకాం ద్వారా మీ ద్వారా మీ విశాల ఐక్య సంఘటనోద్యమం ద్వారా తెలుసుకున్నాను.’

రాధేయ ఆలోచనల్లో వచ్చిన యీ మార్పు రచయితదే. రాధేయ వొక కళాకారుడిగా, కార్యకర్తగా వుద్యమంలో పూర్తికాలం పనిచేశాడు. పత్రికా నిర్వాహకుడిగా ప్రత్యామ్నాయ రాజకీయ భావజాల వ్యాప్తికి దోహదం చేశాడు. ప్రజల కోసం సమస్తాన్నీ వదులుకొని పనిచేసిన బలరాం లాంటి నిస్వార్థ నాయకుల్ని, ప్రాణాల్ని గడ్డిపరకలా త్యాగం చేసిన వీరుల్నీ దగ్గరగా పరిశీలించాడు. వాళ్ళని ఆదర్శంగా స్వీకరించాడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వాళ్ళనీ చూశాడు. బతుకు పోరులో అలసి రాజీపడ్డ వాళ్ళనీ చూశాడు. ఉద్యోగంలో చేరి పూర్తికాలం పనిచేయలేని స్థితిలో కూడా వుద్యమ సానుభూతిపరుడిగా వున్నాడు. కళా మాధ్యమంగా వుద్యమానికి సహాయ సహకారాల్ని అందించినప్పటికీ అతణ్ణి యేదో వెలితి పీడిస్తూనే వుంది. సంధ్య చనిపోయాకా ఆ ఖాళీ మరింతగా అనుభవంలోకి వచ్చింది. వొక అపరాధ భావన అతణ్ణి వెంటాడుతున్న క్రమంలో వూరికీ, తన వాళ్ళకీ, ప్రజల మధ్యకీ రావాలనుకున్న సమయంలో సత్యకాం లాంటివాళ్ళు నడిపే ప్రత్యామ్నాయ పోరాట రూపాలకు దగ్గరయ్యాడనిపిస్తుంది.

అందుకే రాధేయ లాంటి వాళ్ళు కొత్త పాలకులకు ‘అర్బన్ నక్సలైట్’.

ఒకప్పుడు బలరాం కాలంలో, ఆ తర్వాత రాధేయ కాలంలోనూ రాజ్యం దోపిడీ వర్గాల సంపదని కాపాడే కావలి కుక్క మాత్రమే. ఇప్పుడు సత్యకాం నాటికి అదనంగా అది వారికి దళారిగా మారింది. ఒకప్పుడు పోలీసుల సమక్షంలో వారిపైనే పాట కట్టి గొంతెత్తి పాడిన రాధేయకు ఇవ్వాళ తన సొంత వూరిలోనే మాట్లాడే హక్కు కూడా లేని పరిస్థితి. వొకప్పుడు పాలకుల రాజ్యాంగ నైతికత నేతిబీరకాయ వంటిదైతే, యిప్పుడు లౌకికత సమత్వం వంటి దాని మౌలిక సూత్రాలనే తొలగించి తమ వర్గానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చి రాయాలనే కుట్రకి ఫాసిస్టు పాలకులు తెర లేపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా భిన్న అస్తిత్వాల్లో శకలాలుగా వున్న లౌకిక ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన అవసరాన్ని ‘బహుళ’ నవల తెలియజేస్తుంది.

ఈ మాటలు రాస్తూండగా దేశ రాజధానిని దిగ్బంధం చేసి గడ్డకట్టే చలిలో ప్రాణాల్ని పణంగా పెట్టి కార్పోరేట్ నీ, దానికి తొత్తుగా పనిచేసే దళారీ ప్రభుత్వాన్ని యెదురొడ్డి నిలిచి పోరాడుతున్న రైతాంగం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రజాతంత్ర వాదులందర్నీ కలుపుకుపోవాలన్న స్ఫూర్తిలో నడుస్తున్న వుద్యమ దృశ్యం కొత్త ఆశలకు పాదులుగడ్తూ భవిష్యత్తుకి గొప్ప భరోసానిస్తుంది.

ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితె
శ్రీకాకుళం వైపు చూపాలి

తమ రక్తంతో యెర్ర జెండాని మరింత యెరుపెక్కించిన అమర వీరుల్ని స్మరించుకొంటూ…

శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తిలో ‘బహుళ’ నవల ప్రాసంగికతని గుర్తించి పాఠకులకి అందిస్తున్న శ్రీకాకుళ సాహితికి అభినందనలు తెలుపుతూ… సెలవ్.

హైదరాబాద్, 31/12/2020

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “చారిత్రిక విభాత సంధ్యల్లో… కాలం అడుగు జాడలు

  1. ఈ వాక్యం చదువుతున్నప్పుడే అనుకున్నా. ఇది ప్రభాకర్ గారి వాక్యమని. నవలని తక్షణమే చదవాలి అనిపించింది ఈ సమీక్ష. గొప్ప నవల మీద గొప్ప సమీక్ష. ఇరువురి కీ అభినందనలు.

Leave a Reply