చలిస్తూ… చరిస్తూ…

“సరిగ్గా రెండు నెలలయింది చిన్న చెల్లిని చూసి” ఇలా అనుకుంటే గుండె గాద్గదమయింది శ్రీనివాస్ కి.

కప్పులోని కాఫీ గొంతు దిగలేదు. చిన్న చెల్లి చేతి కాఫీ చాలా రుచిగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం వాకింగ్ కి చెల్లి వాళ్ళ ఇంటి వైపే వెళ్తాడు శ్రీనివాస్. వాకిట్లో పేపర్ తిరగేస్తన్న బావగారి ముందు కొద్ది సేపు కూర్చుని చెల్లి చేత్తో ఒక కప్పు కాఫీ తాగి తిరిగి నడుచుకుంటూ ఇల్లు చేరుకుంటాడు.

“అయ్యి గారికి కాళ్ళు కట్టేసినట్టుగా వుండాది – దినమ్ము పోయి చెల్లెలని చూసి రావాల. ఏం చేస్తాం మోడీ చప్పట్లు కొట్టి మరీ చెప్పె ఇల్లు కదలద్దని. మరి వయసయినోళ్ళు అస్సలు పోకూడదంట”. దుర్గ పదే పదే భర్తని హెచ్చరిస్తూ కోడలితో అంటోంది పరోక్షంగా.

“నిజమే అత్తమ్మా మావయ్య లాంటి వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు. అందులో యిది వరకు జబ్బులోచ్చి తగ్గినవాళ్లు జాగ్రత్తగా వుండాలి” కోడలు హెచ్చిస్తుంది. కొడుకు వర్క ఫ్రమ్ హోమ్ తో సతమత మవుతున్నడు.

అసలా వైరస్ ప్రయోగశాలల్లో తయారు చేసేది కాదని, మనుషులు జీవావరణం నాంది దూరమై, ప్రకృతి అంతా కాంక్రీటు జంగిల్ గా మారిపోతున్న తరుణంలో, వాటి సహజ రూపాలు మార్చుకుని ఇటువంటి వికృతమైన వైరస్లు తయారవుతున్నాయని, కరోనా అనేక మ్యుటేషన్స్ తర్వాత ఏర్పడిన ఒక చిన్న జీవ రహిత కణం అని చెప్పినా వీళ్ళకి అర్థంకాదు. అయితే పదే పదే చైనాని తిట్టుకుంటూ చేతులు కడుక్కుంటు వుంటారు. బయట నుండి తెచ్చినవన్ని ఎండబెట్టి ఇంట్లోకి తెస్తారు. సుధీర్ మాస్క్ లేకుంటే అడుగు బయటపెడితే ఒప్పుకోరు. “కూరలు తీసుకుని నేరుగా ఇంటికి రా ఫ్రెండ్సని కలవటానికి పోవద్దు” అంటూ కోడలు వెంటబడి మరీ చెప్తుంది.

మనుషుల్ని ఒకరినొకరు కలవనీకుండా దూరాలు పెంచి ఒంటరిని చేస్తున్న కరోనా మీద కినుక పడ్డాడు శ్రీనివాస్. ఇంట్లో వాళ్ళు కూడా దూరాలు వహిస్తూ ఒకరికొకరు అంటరాని వాళ్లుగా ఇలా ఎంత కాలం?..

“తాతయ్య మనం డాలీ అక్క దగ్గరకు పోదాం” అంటూ ముద్దు ముద్దుగా చేతులు పట్టుకుని లాగుతుంది వైష్ణవి. డాలీ పెద్ద చెల్లి మనవరాలు.

చెల్లెలిద్దరూ ఒకే అపార్ట్మెంట్ లో ఒకటి, ఐదు అంతస్తులో వుంటారు. శ్రీనివాస్ సాధారణంగా ఒకటో అంతస్తులో వున్న చిన్న చెల్లి ఇంటికి మాత్రమే వెళ్లి వెన్నక్కి వస్తారు. పెద్ద చెల్లిది పెద్ద సంసారం. భర్త, అత్తగారు, కొడుకు, కోడలు, మనవళ్లు, కోడలి వైపు చుట్టాలు, ఎప్పుడు నిత్య తిరణాల్లలా వుంటుంది. వాళ్ళ ఇల్లు కిందదాకా వచ్చి పైకి, పై అంతస్తులో వున్న తన వద్దకు రారని అమ్ములు నిస్టురమాడుతుంది శ్రీనివాస్ ని…

“తాతా డాలీ అక్క దగ్గరికి పోదాం” బుంగమూతి పెట్టుకుని కూనిరాగం తీస్తున్నదానిలా అతని కుదిపింది వైష్ణవి. ప్రతీ ఆదివారం రాజహంస అపార్ట్మెంట్ కి వెళ్లి టౌలీ అక్కతో ఆడుకోవడం ఆ పిల్లకి అలవాటు. ఈ రెండు, రెండున్నర నెలలుగా జైల్లో వున్నట్టుగా వుంది వైష్ణవి. మరీ వారం రోజులుగా ఆ మారాం ఎక్కువయింది. “వద్దు తల్లి బయట కరోనా వుంది కదా బయటకి వెళ్ళగూడదు” చెప్పాడు. “కరోనా? ఏంటది? ఎందుకుంది? ఇంట్లోకి రాదా?”

మామూలుగానే వైషూ ప్రశ్నల పుట్ట. కొంచెం సందు దొరికితే చాలు ప్రశ్నల మీద ప్రశ్నల వేస్తుంది. చిన్ని చెల్లి కూడా ఇంతే ఎనెన్ని ప్రశ్నలు వేసేదో. దానికి విస్తృతమైన ప్రపంచాన్ని తెలుసుకోవాలని చాలా వుండేది. అమ్మకి లైబ్రరీ నుండి నవలలు తెచ్చి యిస్తూ తనూ చాలా పుస్తకాలు చదివేది. అమ్మనడిగి కథలు చేపించుకునేది. అమ్ములు తనని అన్న అని పిలిస్తే పప్పి ఎట్లా అలవాటయిందో గాని ‘అన్నయ్యా’ అని పిలిచేది ముద్దు ముద్దుగా… తండ్రి తన ఒక్కగానొక్క కొడుకుని నెల్లూరు సింహపురి పబ్లిక్ స్కూల్ కి పంపుతుంటే అన్నయ్యని పంపొద్దంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

సంవత్సరం తరువాత తనక్కడ వుండలేనంటూ హాస్టల్ నుండి తిరిగి వచ్చేస్తే అమ్మా నాన్న బాధ పడుతుంటే అమ్ములు కూడ చాల నిష్టూరాలాడింది. కాని పప్పి మాత్రం తెగ సంతోష పడిపోయింది అమాయకంగా.

“తాతా కరోనా ఏం చేస్తాది చెప్పూ” చేతులు పట్టి లాగుతోంది వైష్ణవి.

“నేను చెప్తారామ్మా కరోనా ఒక బూచి…. బయటకు వెళ్ళామంటే మనని పట్టుకుంటుంది. అందుకని మనం ఇంట్లోనే వుండాలి” చెప్పింది అటుగా వచ్చిన పాప నాయినమ్మ.

“ఎందుకు దుర్గా అలా భయపెడతావు. పాప బాగా అర్ధం చేసుకోగలదు వైరస్ అనే చెప్పు” అన్నారు శ్రీనివాస్. “వైరస్ అంటే” మళ్లీ ఒక ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది.

“వైరస్ అంటే ఒక జీవం లేని కణం… అది మన ముఖం మీదకి వచ్చేస్తుందనుకో, మన కళ్ళల్లో వున్నపుసి లోను, ముక్కులో వున్న తడితోనో, గొంతులో వున్న గల్లతోనో కలిసి ప్రాణం తెచ్చుకుని వేగంగా అనేక కణాలుగా విడిపోతుంది. నేరుగా మన ఊపిరి తిత్తుల్లోకి వెళ్ళి అంటే లంగ్స్ లోకన్న మాట మనని చాలా బాధపెడ్తుంది. నా వంటి ముసలి వాళ్ళు అది తట్టుకోలేక చనిపోతరన్నమాట” చెప్పాడు శ్రీనివాస్ సాధ్యమైనంత తేలిక మాటలతో ఆపిల్లకి అర్థమయ్యేలా.

“అయ్యో తాతా చచ్చిపోవడమంటే ఎప్పటికీ కనపడరంట కదా. మొన్న పూజి వాళ్ళ నానమ్మ చనిపోతే అందరూ ఏడ్చారు. నాకు చాల భయమేసింది. వద్దు తాతా మనం ఎక్కడికి వెళ్ళదులే, నువ్వు కనపడక పోతే నాకు చాలా ఏడుపొస్తుంది” అంది వైష్ణవి తాతని కౌగలించుకుంటూ…

బడికి వెళ్తూ వెళ్తూ ఆటోలో నుండి కింద పడి తనకి కాలు విరిగినప్పుడు పప్పి కూడా అలాగే తనని చుట్టేసుకుని ఏడ్చింది. రెండు వారాలు పాటు బడిక్కుడ వెళ్లకుండా తనకి సేవలు చేసింది. అయినా అమ్ములు కంటే పప్పికే ఎక్కువ మార్కులు వచ్చేవి. ప్రశాంతి, ప్రవీణ వాళ్ళ పేర్లయితే ఇంట్లో అంతా అమ్ములు, పప్పి అని పిలిచేవాళ్ళు. స్కూల్ ఫైనల్ తర్వాత కాలేజీకి వెళ్తానని గొడవ చేసింది పప్పి,

కానీ తండ్రి తనకంత శక్తి లేదన్నాడు. అప్పటికే అమ్ములు పెళ్ళి చేసి చాలా అప్పుల్లో కూరుకు పోయివున్నరు. కొడుక్కి చదువబ్బలేదని ఒకవ్యధ. రాను రాను పొలాన్ని నమ్ముకొలేక, అమ్ముకోలేక సందిగ్ధంలో నుండి మథనపడి చివరికి అమ్ముకోక తప్పని పరిస్థితులు తండ్రిని నిర్వీర్యుడ్ని చేశాయి.

ఆ డబ్బుతో కొంత అప్పులు తీర్చి రోడ్డు పక్కన ఉన్న స్థలంలో ఐదు షాపులు కట్టించాడు. ఒక దాంట్లో తనకి మందులంగడి పెట్టించాడు. మెడికల్ షాప్ క్లిక్వడం, మిగిలిన నాలుగు షాపుల బాడుగలు, ఒక విధంగా జీవితం కొంత గాడిలో పడినప్పటికీ పప్పీ పెళ్లి తర్వాతి పరిణామాలు అమ్మానాన్నల్ని కృంగదీసాయి.

లెక్చరరుగా పనిచేస్తున్నాడు కదా అని పిల్లనిస్తే ఆరు నెలలు కాకముందే కలేజీ లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు రాజీనామా పారేసి… అప్పటికే కడుపుతో ఉన్న పప్పి ప్రతీ చిన్న ఖర్చుకి నాన్న వైపు చూడక తప్పింది కాదు. అతడికి మరే ఇతర దర్శనాలూ లేవుగానీ తీవ్రమైన కోపం ముక్కు మీదే ఉంటుంది. “పాపం మంచివాడే నమ్మా కొంచెం కోపం ఎక్కువ సరిపెట్టుకో తల్లి” అని నచ్చజెప్పే వాడు నాన్న.

కోపం అనేది ఎంత భయంకరమైన వ్యసనమో ఆ తర్వాత గాని అర్థం కాలేదు ఇంట్లో అందరికీ.

సప్త మహా వ్యసనాల్లో తాగుడు ఏడో స్థానంలో ఉంటే కోపం అన్నది మొదటి స్థానంలో ఉందట… అతడు అడిగినది అందించడం క్షణం పాటు ఆలస్యమైతే చడామడా తిట్టడమే కాకుండా టేబుల్ మీదవన్నీ నెట్టి పారేస్తాడు.

“ఇంట్లో మగ మనిషి అన్నం తినకుండా మనకి మాత్రం ఎట్లా సహిస్తుంది” అంటుంది అత్త మార్మికంగా. అసలే సున్నితం ఇక ఆ మాటతో రోజంతా ఆభోజనంగా ఉంటుంది పప్పీ. ఎప్పుడూ అంతే ఆ పూటకి వండుకున్న అన్నం తినేదాకా నమ్మకం వుండదు. చిన్నచిన్న విషయాలనే పెద్ద రచ్చలు చేస్తాడతడు. పక్కన వాళ్ళు వింటారేమోనని వణికి పోతుంది పప్పి…

పప్పీ కడుపుతో ఉండి కూడా నెల్లూరుకి పోయి చీరలు తెచ్చి చుట్టుపక్కల వాళ్ళకి అమ్మేది… ఇంటి పనంతా చేసుకుంటూనే చిన్నప్పుడు ఇష్టంగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ చేసి వచ్చిన 5,10 ఇల్లు గడపడానికే ఖర్చు చేసేది. ఆ తర్వాత ఎప్పటికో పాపకి మూడు ఏళ్ళు వచ్చాక బ్యాంకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఎన్ని చోట్ల కి బదిలీ అయినా కుటుంబాన్ని మాత్రం ఇక్కడే ఉంచి తను తిరుగుతూ ఉండేవాడు. లెవెల్ పెరిగింది… అపార్ట్మెంట్ కొన్నాడు. కూతురికి నగలు చేయించాడు. ఒక్క పాపకీ పిల్లలు వద్దు అనుకుంది పప్పీ.

ఆ పిల్లని తన ఆశలకి ఆలోచనలకి అనుగుణంగా పెంచుకుంటూ వచ్చింది. తల్లిదండ్రులకి పైసా ఖర్చు లేకుండా మెడిసిన్ లో సీటు తెచ్చుకుంది అపరాజిత…. మెడిసిన్ పూర్తయి విజయవాడ కోవిడ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ గా పని చేస్తోంది. కరోనా ఆస్పత్రిలో పని చేయడానికి వీల్లేదని తండ్రి, నాయనమ్మ మేనత్తలు వారించినా ఆ పిల్ల వినలేదు. ఇప్పుడు మాత్రం అందరితో గప్పాలు కొడుతూ ఉంటాడు అతడు “నా కూతురు కోవిద్ డ్యూటీ చేస్తోందని…

లెవలు పెరిగాక పప్పీని పుట్టింటికి పంపించడం మానేసాడతడు.

పప్పీ దిగులుతోనే తల్లి, తండ్రి వృద్ధాప్యం రాకుండానే ఈలోకం నుండి జరిగి పోయారు. ఆ సమయంలో కంటతడి పెట్టకుండా రాయిలా ఉండిపోయిన పప్పీ గుర్తొచ్చి మళ్లీ గుండె కదిలింది శ్రీనివాస్ కి. ఇవ్వాలా ఎందుకో మరీ పప్పీ ఆలోచనలు కదల భారస్తున్నాయి. ఫోన్ చేయాలన్నా భయమే…

“తాతా వద్దులే మనం ఇంట్లోనే ఉందాం. ఇదిగో ఇది తాగు ఇది తాగితే చచ్చిపోరంట…” వాళ్ళమ్మ తీసుకొచ్చిన కషాయాన్ని చూపిస్తూ చెప్పింది వైష్ణవి… నవ్వుతూ కోడలి చేతిలోని గ్లాస్ అందుకున్నాడు శ్రీనివాస్…

షాపుల వాళ్ళు రెండు నెలలుగా బాడుగ ఇవ్వలేదని ఎవరితోనో బిగ్గరగా గొడవ పడుతోంది దుర్గమ్మ గేటు వద్ద… అసలే అంగళ్లు జరగకుండా వాళ్లు మాత్రం బాడుగలు ఎట్లా ఇస్తారు అనుకున్నాడు శ్రీనివాస్ కషాయం మింగుతూ.

రాత్రీ పగలూ, వారాలూ, వర్జ్యాలూ, తేదీలూ, తిథులూ ఏమీ తెలియకుండానే గడిచిపోతున్న కాలంలో చీకట్లు ఇంకా విడిపోక ముందే ఎవరిని లేపకుండా, సందు తలుపు తీసుకుని మెల్లిగా వాకిట్లో కొచ్చి నిలబడ్డాడు శ్రీనివాస్.

ఒక్కసారిగా చీకటి గుహలోంచి బయటపడి వేటకి వెళుతున్న ఆది మానవుడిలా వున్నాడు తనకు తానే. ఎదురింటి భాస్కర్ భార్య బక్కెట్లో నీళ్లు మోసుకొచ్చి గుమ్మం ముందు ఉంచి గేట్ లోంచి తొంగి తొంగి చూస్తోంది కలుగులోని ఎలుకలా.

పని వాళ్లంతా మాని వేయడంతో ఎవరికి వాళ్ళు ప్రతి పని చేసుకోక తప్పడం లేదు. అలా పని చేసుకోవడం ఇంకా నామోషీ గానే ఫీల్ అవుతున్నారు కొందరు. దుర్గ మాత్రం లక్ష్మీని మాన్పించలేదు. ఒక డెటాల్ సోపిచ్చి వాకిట్లోనే కాళ్లు చేతులు కడుక్కొని రమ్మని శాసించింది…

రోడ్డు మీదికి వచ్చి తడబడుతున్న అడుగుల్ని నిలదొక్కుకుని గాలి పీల్చుకుంటే ఆక్సిజన్ సిలిండర్ ని గుండెల్లో నింపుకున్నంత ఆనందంగా ఉంది శ్రీనివాస్ కి… ఎలాగైనా ఈరోజు చెల్లెలని చూడ్డానికే నిశ్చయించుకున్నాడతడు.

నిర్మానుష్యంగా ఉన్న రోడ్లమీద ఇష్టారాజ్యంగా తిరుగాడుతున్న కుక్కలు శ్రీనివాస్ ని పలకరిస్తున్నట్లుగా ఆగి ఆగి మొరుగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల పులులూ, ఏనుగులూ కూడ అడవుల్లో నుండి ఊర్లలోకి వస్తున్నాయట ఈ లాక్ డౌన్ సమయంలో,

గాంధీ బొమ్మ దాకా నడిచాక ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చి కలిశాడు.

మూతికి మాస్కులు కట్టుకొని దొంగతనానికి బయలుదేరిన ముసుగు దొంగల్లా ఉన్నారు ఇద్దరూ. గత కొన్ని ఏళ్లుగా తెల్లవారుజామునే లేచి స్వర్ణముఖి నది తీరం దాకా వాకింగ్ కి వెళ్లి తిరిగిరావటం అలవాటు ఇద్దరికీ, అటు వైపైతే ట్రాఫిక్ ఉండదని, ఇప్పుడు ఎటువైపు అయినా ఒకటే…. ఎటు చూసినా గాలి శబ్దం తప్ప మనుషుల అలికిడి లేదు. జీవితం లేదు. ఊరంతా ఆగమ్యంగా ఉంది.

“ఏం కరోనా బోనా పనులన్నీ ఆగిపోయి, మీదంటే మందుల షాపు కాబట్టి దానంతటదే నడిచి పోతా ఉందాది” అన్నాడు ప్రభాకర్ రెడ్డి ఒకింత అసూయగా” నడక కూడా మర్చిపోయినామ్ బోన అన్నాడు మళ్ళీ తనే.

“మనమే అట్ల అనుకుంటే ఎట్ల ప్రభా… మైగ్రంట్స్ చూడు ఎంతెంత దూరాలు నడిచే పోతా ఉండరో. అసలు మధ్యలో ఉంటామా పోతామా కూడా తెలీదు. అయినా తమ ఊళ్లు చేరుకోడానికి ఎంత తపన పడతా ఉండారు”.

“అవునన్నా ఈ మధ్య ట్రాక్టర్ బోల్తా పడి ఎంతమంది చనిపోయారు. అక్కడెక్కడో రైల్వే ట్రాక్ మీద 16 మందిని రైలు కొట్టేసిందంట. ఆ రోజైతే అన్నం తినాలని కూడా అనిపించలేదు…” చెప్పాడు ప్రభాకర్ రెడ్డి దిగులు గొంతుతో.

“అవును ప్రభా అసలు ఇన్ని కోట్ల మంది వలస కూలీలు ఉన్నారని, ఒక ప్రత్యేకమైన సమస్యని ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు, కరోనా వచ్చి తెలియజెప్పింది. ముందస్తు జాగ్రత్తలు లేకుండా నోట్లు రద్దు చేసినంత తేలిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు ప్రకటించి అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి లాక్ డౌన్ అంటే ఎక్కడోళ్లు అక్కడే ఆగిపోయి ఎంతెంత ఇబ్బందులు పడ్డారు.

జనవరి మూడవ వారం లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తే మార్చి 22 దాకా ఏం చేస్తున్నట్లు.

జనవరి ఆఖరులోనే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది”. వారి అడుగులు కొంత వేగాన్ని పెంచుకున్నాయి.

ఎదురుగా వేగంగా సైకిల్ లో వస్తోన్న మరో ముసుగు దొంగ డివైడర్ తగిలి గాలిలోకి ఎగిరి కంట్రోల్ అయ్యాడు. చేతిలో ఉన్న పాల ప్యాకెట్ కిందపడి రోడ్డంతా పరుచుకుంది. దాని మీద పడిన పండు టమాటా మీద అతడి కాలు పడి చితికింది. సైకిల్ ని వెనక్కి తిప్పి అడిగేసాడు అతడు. అతడి పాదముద్ర ప్రతి ఊరి బయట బారులు బారులు గా నడుస్తోన్న బాటసారుల నెత్తుటి పాదముద్రలా ఉంది. గొంతు పట్టినట్టు మౌనంగా నడవసాగాడు శ్రీనివాస్.

అప్పటికీ నదీ తీరం వైపుగా సాగే రోడ్డుమీదికి మలుపు తిరిగారిద్దరు, చల్లటి గాలి, నును వెచ్చని మే మాసపు సూర్య కిరణాలతో కలిసి శరీరాన్ని తాకుతూ గిలిగింతలు పెడుతోంది. ఆగాలి రెండు నెలలుగా దాచి ఉంచిన గుప్పెటని విప్పి ఎన్నెన్నో రహస్యాలను గుసగుసగా తన చెవిలో చెప్తున్నట్లుగా ఉంది శ్రీనివాస్ కి, అవి అన్ని కరోనా కబుర్లే. మనుషుల మధ్య దూరాలని పెంచిన కరోనా గురించి చర్చిస్తూ చాలా రోజుల తరువాత బయటికొచ్చిన తనని కౌగలించుకున్నట్లగా ఉందా గాలి. లేక తనే ఆ గాలిని కౌగలించుకున్నాడో.

“ఈ కరోనా వల్ల మనిషి ఒంటరై పోతున్నాడన్న, మనిషికి, మనిషికి సంబంధం లేకపోతే పనులు ఎట్లా జరుగుతాయి అసలు ఉత్పత్తి ఎట్లా? ఉత్పత్తి లేకపోతే బతికేదే ? మొదట్లో లాక్ డౌన్ అయినప్పుడు ఆర్థికం కంటే ప్రాణం ముఖ్యం కదా అనుకున్నాం.

కానీ అవి రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని ఇప్పుడు కదా తెలిసింది”. తెలిసో తెలియకో ప్రభాకర్ రెడ్డి మాట్లాడే మాటల్లోనీ వాస్తవాలను బేరీజు వేస్తూ అతనితో పాటు అడుగులు వేస్తున్నాడు శ్రీనివాస్.

మామూలుగా అయితే ఈ పడమటి బజార్ అంతా విపరీతమైన రద్దీతో ఏప్పుడు వెలుగుతూ ఉంటుంది. అటువంటిది ఒక భయ విహ్వలత తాండవిస్తోంది అన్న. ఈ రోడ్డు మీద అక్కడక్కడా ఎదురొస్తున్న ముసుగు మనుషుల కళ్ళల్లో కూడా ఆ భయం పరావర్తిస్తోంది.
సంభాషణలు నడుస్తోన్న వారి నడక కూడా వేగంగా సాగుతోంది.

ఇద్దరూ రాజహంస అపార్ట్మెంట్ వద్దకు చేరుకోవడానికి గంట పట్టింది. అప్పటికి సూర్యుడు కాషాయ వర్ణంలో నుండి నిమ్మ పండు రంగులో కి మారి గాలిలోని తేమని పిలుస్తున్నట్టు గా ఉన్నాడు. ఇద్దరూ అపార్ట్మెంట్ కిందనే ఉన్న కుళాయి వద్ద కాళ్లుచేతులు శుభ్రంగా కడుక్కుని లిఫ్టు వద్దకి చేరుకోవడానికి నడిచారు కానీ లిఫ్ట్ ఎక్కడం ఇష్టం లేని వారిలా మెట్లమీద నడవడం మొదలుపెట్టారు. చేపట్టు కూడా పట్టుకోకుండా మొదటి అంతస్తులోని చిన్న చెల్లి ఇంటికి చేరుకునే సరికి బావ వరండాలోనే కూర్చుని పేపర్లు తిరగేస్తున్నడు.

“ఎలా ఉన్నారు?” అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు శ్రీనివాస్. “రండి రండి” అంటూ అతడు ప్రభాకర్రెడ్డిని ఆహ్వానించాడు.

“కాళ్లు చేతులు కడుక్కునే వచ్చినాము నా” అడగని ప్రశ్నకు సంజాయిషీ ఇస్తూ మాస్కు సవరించుకున్నాడు ప్రభాకర్ రెడ్డి.

చిన్న బావ రానీనవ్వొకటి విసిరి “ఎలా ఉన్నారు అంతా” అన్నాడు. శ్రీనివాస్ కంటే ముందు ప్రభాకర్ నోరు విప్పాడు. “ఎట్టుండాం బోనా …. కడిగిందే కడగాతా, తుడిచింది తుడుస్తా ఇంట్లో నుంచి కదలకుండా, రెండు నెలల తర్వాత ఇదిగో ఈరోజు బయల్దేరామ్ వాకింగ్కి. ఏం పాండమిక్ కో, ఏం ఎపిడమిక్ కో బోనా”, అంటూ టీపాయ్ మీద ఉన్న జిల్లా ఎడిషన్ ని అందుకున్నడతడు.

ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కరోనా కబుర్లు తప్ప మరో టాపిక్ ఉండడం లేదు ప్రభాకర్ మాటల్ని చిన్న బావ అందుకున్నాడు.

“అంటే ఒక ప్రత్యేక ప్రాంతం లో మాత్రమే ఏర్పడే ముప్పుని ఎపిడమిక్ అని అంటారు. అదే ప్రపంచ వ్యాప్తంగా ఒక విపత్తు ఏర్పడి మొత్తం ప్రజలందరినీ కలవర పెడుతుంటే దాన్ని పాండమిక్ అంటారు.

“అవునా?” అన్నాడు ప్రభాకర్ వింతగా చూస్తూ.

“అవును ఏం చేద్దాం ఇదంతా మనం చేతులారా కొన్ని తెచ్చుకున్నదే పర్యావరణ విద్వంసం” అన్నాడతడు చేతిలోని పేపర్ ని టీపాయ్ మీదికి విసురుతూ… శ్రీనివాస్ సూటిగా ఆతడి కళ్ళల్లోకి చూసాడు.

ఇన్ని తెలిసిన వాడు, ఇంత చదువుకున్నవాడు, ఇంత తెలివైనవాడు భార్యనీ ఎందుకలా బానిసలా అణచేస్తాడో ప్రతి విషయంలో.. ప్రేమ, స్వేచ్ఛ కలిసే ఉంటాయని ఒకటి లేని చోట మరోటి నిలవదని అర్థం కాదా ఈ మూర్ఖుడికి, చిన్న విషయంలో కూడా స్వతంత్రం లేకుండా భార్య తన ఆలోచనలు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఎంత నిక్కేస్తాడో. అయినా పప్పీ దేవలోకం నుండి దిగి వచ్చిన దానిలా ఇగిరి ముక్కలవుతోన్న ఆ ప్రేమ మీద ఎప్పుడూ నాలుగు చుక్కలు నీళ్లు చల్లి తడి చేసుకుంటూనే ఉంటుంది.

చినబావ, ప్రభాకర్ ఇద్దరూ కరోనా విపత్తులో మునిగి తేలుతూ ఉండగా మెల్లిగా లేచి లోపలకి నడిచాడు శ్రీనివాస్, వెనుక వరండాలో కూర్చుని చెమటలు కారుతూ పప్పు రుబ్బుతోన్న చిన్న చెల్లి వద్దకు వెళ్ళాడు పప్పీ అంటూ.

“హాయ్ అన్నయ్య ఎన్నో ఏళ్ళైపోయినట్టుంది నిన్ను చూసి” అంది. “అవును అందుకే వచ్చాను అయినా ఇదేమిటీ?” అన్నాడు పక్కనే స్టూలు లాక్కుని కూర్చుంటూ. “అయిపోయిందిలే అన్నయ్య మిక్సీలో వేస్తే మీ బావకి నచ్చదు” అంటూ నవ్వింది పప్పీ. ఆ నవ్వులో ఆమె పళ్ళతో పాటు కళ్ళు కూడా మెరిసాయి పల్చటి నీటి పొర తో… “రెహనా రావట్లేదా?”

“లేదన్నయ్యా అప్పుడే రెండు నెలలు అయింది. మా అత్తగారు రావద్దని పంపించేసింది. ఆ మర్కజ్ ప్రార్థనల తర్వాత ముస్లిముల అంతా కరోనా క్యారియర్స్ అయిపోయారు ఈ ఊర్లో, వీళ్ళ దృష్టిలో కూడా అంతే రెహనానీ నానామాటలూ అని పంపించివేశారు. నేనేమి పట్టించుకోకుండా రెహనా కి నాలుగు వేలు ఇచ్చేశాను. ఈ ఇంట్లో చాలా యుద్ధం జరిగింది అనుకో. ఏం బ్యాంకు కి వెళ్లకుండా కొన్నాళ్లు, మధ్యాహ్నం వరకే వెళ్లి ఒక నెలా ఈయన పూర్తి జీతం తీసుకున్నాడు కదా అన్నయ్య పని వాళ్లు కూడా అంతే కదా మరి ఇది అనుకోని సందర్భం కదా అమ్ములక్క కూడా పనామెకి జీతం ఇవ్వను అన్నది నేనే కోప్పడి ఇప్పించాను”. ఈ జరిగిందంతా ఏదో సరదాకి చెబుతున్నట్లు గానే చెప్పింది గిన్నెలోకి పాప్పు తీస్తూ, లోపల నొప్పి అర్థమవుతూనే ఉంది శ్రీనివాస్ కి.

“అత్తమ్మ లేదా?” గుసగుసగా అడిగాడు. “లేదు లే అన్నయ్య కూతురు ఇంటికి వెళ్ళింది…” మళ్ళీ నవ్వింది పళ్ళు, కళ్ళు మెరిసేలా. “సరే నాకూ, ప్రభాకి కాఫీ ఇవ్వు మేం బయలుదేరుతాం”.

“లేదులే అన్నయ్య టిఫిన్ చేసి వెల్తురు గాని” అంది గొంతు రద్దమౌతూ ఉండగా.. బాణలి స్టవ్ మీద పెట్టి నూనె పోస్తూ.

“అన్నయ్య నాకో హెల్ప్ కావాలి” అన్నది హఠాత్తుగా.

నాన్న పోయాక ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సాయం అడగలేదు పప్పీ…” అన్నయ్య” రెట్టించింది మౌనాన్ని చూసి. “చెప్పు”.
“నాకో పదివేలు కావాలి. ఇదిగో ఈ ఉంగరం నాన్న ఇచ్చిందే నా పెళ్ళికి ముందుది.. ఇది తీసుకెళ్ళి అమ్మి నాకు పదివేలు తెచ్చి ఇవ్వు అన్నయ్య”.

శ్రీనివాస్ కి చాలా ఇబ్బందిగా అనిపించింది. “ఎందుకో చెప్పు” అన్నాడు.

“అన్నయ్య మన రైల్వే స్టేషన్ లో చాలా మంది వలస కార్మికులు ఆగిపోయి ఉన్నారట. వాళ్లకి మా ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు, ఎదురు వాళ్ళు ఇలా రోజుకొకరు భోజనాలు పెడుతున్నారు అన్నయ్య… వాళ్ళు వెళ్లి చూసి వచ్చి ఆ పరిస్థితి, వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా బాధనిపిస్తోంది.

రాత్రిపూట మెలకువ వస్తే మళ్లీ నిద్ర పట్టడం లేదు… మనం పడేవే మనం బాధలు అనుకుంటాం నిజానికి మనం ఎంత సేఫ్ జోన్ లో ఉన్నాము అన్నయ్య. స్నానాలుచేస్తున్నాం మూడు పూటలా తింటున్నాం, కంటినిండా నిద్ర పోతున్నాం, తలచుకుంటే ముద్ద దిగడం లేదు అన్నయ్య…. ఒక్క పూటన్నా వాళ్ళకి భోజనాలు పెట్టడం సాధ్యమైనంత మందిని వాళ్ల ఊర్లకి పంపడం ఏదైనా చేద్దాం అన్నయ్య ప్లీజ్ నాకీ హెల్ప్ చేయి”.


ఎంగిలి మింగుడు పడలేదు శ్రీనివాస్ కి. తాగుతున్న కాఫీ కప్పు బేసిన్లో పెట్టేసాడు తాదూర కంత లేదు మెడకో డోలా అన్నట్లుగా ఈ పప్పీకి ఎన్ని ఆలోచనలు బహుశా ఆలోచనల్లో నుండి రాలిన నాలుగు చినుకుల్ని ఇగిరిపోతోన్న ప్రేమ మీద చల్లి మొలకెత్తించడానికి ప్రయత్నం చేస్తుందేమో పిచ్చిది. గుండె గొంతులోకి వచ్చినట్టయింది శ్రీనివాస్ కి.

అప్పటికి కాగిన నూనెలో గారెలు వదులుతూ…

“రెహనాకి జీతం ఇవ్వాలి” అంటూ ఆపేసి మౌనంగా గారెలు వేయసాగింది… ఆమె ముఖం మీది చిరు చెమట మీద స్టవ్ మంట పరావర్తించి ఎర్రగా మెరుస్తోంది. అన్నయ్య మౌనం ఆమెని బాధిస్తోంది, లేదో కూడా అర్థం కావడం లేదు. జీవితంలో భయపడం, బాధపడ్డం, లేదు అనిపించుకోవడం బాగా అలవాటైపోయిన దానిలా నిర్భావంగా గారెలు వేస్తోందామె… ఇప్పుడూ చిరునవ్వు ఆమె ముఖాన్ని విడిపోలేదు.

బేసిన్లో ఉన్న కప్పులన్నీ కడిగి పెడుతూ నోరు విప్పాడు శ్రీనివాస్.

“ఉంగరం వద్దు నేను ఇస్తాలే. అయినా నువ్వు ఒక్క దానివే కాదులే. అమ్ములుకి చెప్తాను, ప్రభాకి చెప్తాను, నేను వాళ్లకి కావాల్సిన రోజువారీ మందులు, బ్రష్సు, పేస్టు, తువ్వాలు వంటివిన్నీ రెడీ చేస్తాను. నువ్వు అసలే మీ చేయొద్దు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుండి నీకు ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప. ఇక వదిలేయ్ రేపే వెళ్లి మనం అందరికీ అన్ని ఇచ్చి వద్దాం నీ చేత్తోనే ఇప్పిస్తాను. మాస్క్, చౌజులు వేసుకోవడం మర్చిపోవద్దు” నవ్వాడు వాతావరణాన్ని తేలిక పరుస్తూ.

“అన్నయ్యా వదిన కోప్పడుతుందేమో. అయినా నాకూ తృప్తి కావాలి కదా” అంటున్న పప్పీ భుజం మీద చేయి వేసి “ఒక్కగానొక్క కూతుర్ని కోవిడ్ డ్యూటీకి పంపావు. అంతకంటే తృప్తి మరేముంది? అది మనందరికీ గర్వకారణం కదా. రేపు పదకొండు గంటలకి రెడీగా ఉండు. నేను ఇవ్వాళ అంతా ఆపని మీదేనే ఉంటాను. అమ్ములుతో మాట్లాడి వెళ్తాను” అంటూ వరండాలోకి ప్రవేశించాడు శ్రీనివాస్… –

“వాళ్లు రోడ్లమీద చిన్న చిన్న టార్పాలిన్ కప్పిన గూళ్ళలో నివసిస్తూ మనకి పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యా లని నిర్మించి పెడతారని, వాళ్లే మొత్తం ఈ అభివృద్ధికి కారకులని మనం ఎంతకీ ఒప్పుకోం. ఇప్పుడు వాళ్లంతా ఏమైపోవాలి? ఇప్పుడేం చూశాంలే… ఇంకా ఇంకా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని సృష్టించబోతోంది కోవిడ్, ప్రజల ఆరోగ్యానికి భద్రత నివ్వని ప్రభుత్వాలు కూలిపోక తప్పదని కూడా చెప్తోంది కదా కరోనా…..” ఇంకా ఏదో చెప్పబోతూ శ్రీనివాస్ ని చూసి ఆగాడతడు.

అప్పటికే బోరు కొట్టిందేమో. ప్రభాకర్ కూడ చప్పన లేచాడు.

ఇదంతా పై పై నిరసనే తప్ప మొసలి కన్నీళ్ళే తప్ప తన జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలన్న తుత్తరే తప్ప నిజంగా అతడికి వలస కార్మికుల పట్ల సానుభూతి లేదని అర్థమవుతునే వుంది. లోలోపల విసుక్కుంటూ పైకి మాత్రం ‘వస్తాం బావా’ అంటూ నిప్పుల గుండం లోంచి బయట పడట్లుగా బయటకి నడిచాడు శ్రీనివాస్. ప్రభాకర్ నీ వెయిట్ చెయ్యమని, తను ఐదో అంతస్తుకి వెళ్లి పెద్ద చెల్లితో మాట్లాడి వచ్చాడు శ్రీనివాస్…


స్టేషన్లో ఆగిపోయి వున్న వందల మంది వలస కార్మికుల గురించి ప్రభకర్తో చర్చిస్తూ, తనకి ఇటు వంటి ఆలోచన రానందుకు మదన పూ లోలోపలే పప్పీని అభినందించాడు శ్రీనివాస్.

రెండు నెలల తర్వాత చెల్లెళ్ళిద్దరినీ కలిసిన ఆనందమేదో రెట్టింపయినట్లుగా వుందతడికి.


ప్రభుత్వాలని అధిగమించి, ఎక్కడికక్కడ ప్రజలు చేస్తోన్న ఈ అన్నదానాలు, వలస కూలీల అవసరాలను తీర్చి వాళ్ళను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చెయ్యడం, ప్రజలే ప్రభుత్వాలయి పనిచేయడం అంటే ఇదే కదా అనిపించింది అతడికి.

“పదన్నా నేను వస్తాను స్టేషన్ కి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. నాకు మాత్రం పనేముంది?” చెప్పాడు ప్రభాకర్ ఉత్సాహంగా. అతడికి తనకి తోచిన ఉడత సహాయమేదో చేయాలని ఉత్సాహంగా ఉన్నట్టు వుంది. ఇది వరకటి కంటే వేగంగా, నమ్మకంగా వాళ్లిద్దరి అడుగులు రైల్వే స్టేషన్ వైపుగా సాగుతున్నాయి.

ఊరి గాలిలో వున్నటుండి సంతోషపు తరంగాలు వ్యాపించి ఒక అద్భుత రాగమేదో వారి హృదయాలను ఓలలాడిస్తున్నటు వుంది.

కథా రచయిత. చెన్నైలో పుట్టి, నెల్లూరులో స్థిరపడ్డారు. రచనలు: పక్షి (2004), ఖండిత (2008), సుప్రజ (2001) కథా సంకలనాలు), రెండు భాగాలు (2008) కవితా సంపుటి ప్రచురించారు.

Leave a Reply