చలిచీమలు

“చీమలు కవాతు ఎందుకు చేస్తున్నాయి?”

ఆ ప్రశ్న అతను అప్పటికి ఏ పదో సారో అడిగాడు. వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. పైగా విసుగ్గా చూశారు. 

“ఇప్పుడు కాకపోయినా మళ్ళీ చెప్పాల్సిందే. తరవాత మళ్ళీ పిలుస్తాం.” కోపంగా అన్నాడతను. అతనికి వీళ్ళ వ్యవహారం అస్సలు నచ్చలేదు. వీళ్ళదంతా  ఏదో తేడాగా ఉంది. ఇంట్లో ఎవరన్నా పుస్తకాలు ఉంచుకోడం సహజమే. ఎవరన్నా చదువుకునే పిల్లలు ఉన్నారా అంటే అదీ లేదు. అవును అసలు పిల్లలుండాలి కదా?

“పిల్లలెందుకు లేరు?”  

వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. “మేము కనలేదు కనక” అంది ఆమె. “వద్దు అనుకున్నాం” అతను అన్నాడు. 

“చూడండి. పిల్లలు వద్దనుకోడం ఏమిటి? చాలా తప్పు. అసలు మీకు పిల్లలు ఉంటే ఇలా ఉండేది కాదు.”

“ఎలా ఉండేది కాదు?” ఇద్దరూ ఒకేసారి అని మళ్ళీ ఇద్దరూ ముఖముఖాలు చూసుకొని నవ్వేసుకున్నారు. 

తనని చూసి కొద్దిగా కూడా భయపడకపోవడం అతన్ని నిరాశపరిచింది. ఎంత కొత్తగా చేరితే ఏమిటి? తాను ఒక దర్యాప్తు అధికారి. అయినా పట్టు వదలకూడదనుకున్నాడు. అసలు వూరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట దొక దారి లాగా ఉంది వీళ్ళ వ్యవహారం. పిల్లలను కనకపోవడం ఏంటీ? 

“చూడండి. పిల్లలు ఉంటే ఇంట్లో ఈ  పుస్తకాల బదులు, పిల్లలు చదువుకోవాల్సిన పుస్తకాలు ఉండేవి. మీరు వాళ్ళ అవసరాలు చూస్తూ ఆ పనుల్లో గడిపి ఉండేవాళ్లు. మిమ్మల్ని వాళ్ళు చూసుకొనే వాళ్ళు.”

ఆమె మధ్యలోనే అందుకొని, “పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ తలిదండ్రులను చూస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు.”

“అదే పొరపాటు. మీరు చూడండి. మీ పెద్దవాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారో. నేను అన్నీ గమనిస్తున్నా. పొద్దున్న మేము వచ్చినప్పటి నుండి మీరు మధ్య, మధ్యలో వాళ్ళకి చాయ్, టిఫిన్ అన్నీ ఎంత శ్రద్ధగా చూస్తున్నారో నేను గమనించలేదనుకున్నారా?” ఒకింత గర్వంగా అన్నాడు. “మీకు పిల్లలు ఉంటే ఈ దారిన వచ్చేవాళ్ళు కాదు.” 

బృందంలోని అందరికన్నా పొడుగ్గా ఉన్న వ్యక్తి కూర్చీ లాక్కుని దాని మీద ఎక్కి పైన అటక తలుపులు తెరిచి “సార్, సార్. ఇక్కడా ఇంకా చాలా ఉన్నాయి.” అని ఆనందాశ్చర్యాలతో కేక పెట్టాడు. 

ఇంతలో అతని ఫోన్ మోగింది. తీసి కొంచెం పక్కకు నిలబడి మాట్లాడాడు. “అబ్బో అప్పుడే అవ్వదు. చాలా ఉన్నాయి.”

వాళ్ళిద్దరూ మళ్ళీ ముఖాలు చూసుకున్నారు. చాలా విసుగ్గా వుంది ఈ వ్యవహారం. స్నానాలు లేవు. తిండి లేదు. తెల్లవారు ఝామున ఇంకా నిద్ర లేవకముందే వచ్చారు. ఇప్పటికే రెండు సార్లు అనేక తప్పుడు కేసులు పెట్టి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసారంటూ కేసులు పెట్టి జైళ్ళకి పంపారు. ఇలా ఎన్నిసార్లు? 

ఇల్లు తనిఖీ చేయడానికి వారంటు తీసుకొని వచ్చారు. మొత్తం బృందం సభ్యులు నలుగురు. అందరూ ఉత్తర భారతానికి చెందిన వారే. కాబట్టి ఒక స్థానిక అనువాదకుడు. ఒక మహిళా కానిస్టేబుల్. ఆమె కూడా స్థానికురాలే. మొదటి అంతస్తులో ఉన్న ఇంటికి, వాళ్ళు మాత్రమే వచ్చి మిగతా వారంతా కిందా, ఇంటి బయటా ఉన్నారు. పక్కింటి వాళ్ళు బాల్కనీ లోనుండి కుతూహలంగా చూస్తున్నారు. సంభాషణలు హిందీలో నడుస్తున్నాయ్. 

“ఎన్నిసార్లు ఇలా వేధిస్తారు?” అతను ప్రశ్నించాడు.

“మేము మీ రాష్ట్ర పోలీసులం కాదు. మేము మొదటి సారేగా వచ్చింది. మాది జాతీయ దర్యాప్తు సంస్థ.” ఒకింత గర్వం ధ్వనించింది. 

లోపలికి అడుగుపెట్టి నేరుగా బెడ్రూం లోకి నడిచారు. గదిలో ఒక వైపు గోడకి ఆనించి ఉన్న మంచం. దానికి ఎదురుగా ఉన్న గోడకి టీవీ పెట్టుకొనేందుకు వీలుగా గోడకే ఫిక్స్ చేసిన అందమైన ఫ్రేమ్. దానికి మూడు సొరుగులు కూడా ఉన్నాయి. 

సమస్య ఏంటంటే అక్కడ టీవీ లేదు. బదులుగా ఆ ప్లేసులో వరుసగా పేర్చి ఉన్న పు….స్త…..కా….లు!!!!! 

మొట్ట మొదట ఉన్న పుస్తకం తీశాడు. అది ఇంగ్లీషులోనే ఉంది కాబట్టి అనువాదం అవసరం లేదు. 13 ఇయర్స్. ఎ నక్సలైట్ ప్రిజన్ డైరీ.  భద్రంగా తీసి పక్కన పెట్టాడు. “చూడండి, ఇక్కడ పెట్టుకొన్నవి మేము నిశితంగా పరిశీలించాల్సినవి.  అందులో ప్రమాదకరమైనవి ఉంటే సీజ్ చేస్తాం. కాబట్టి మీరు వాటిని ముట్టుకోవద్దు, కలపొద్దు.” చెప్పేసి మళ్ళీ పుస్తకాలు చూడడం మొదలుపెట్టాడు. అతని దృష్టి ఒక పుస్తకం మీద పడింది. సన్నని పుస్తకం. లేత బూడిద రంగులో ఉన్న గోడ. దాని మీద బారులు బారులు గా కదులుతున్న చీమలు. ఒక్క క్షణం అతను తల విదిల్చాడు. అది ప్రింటే. అవి కదలడం లేదు. నల్లని అక్షరాల్లో ఏదో రాసుంది. అతను అనువాదకుడు ఎక్కడా అని పిలిచాడు. “సార్!” అనుకొంటూ అతను పరిగెత్తుకొచ్చాడు. నిజానికి అతన్ని సాక్షి గా పట్టుకొచ్చారు. అతను అనువాదం చేయాలని మర్చిపోయి పైకి గట్టిగా చదివాడు. “చలి చీమల కవాతు!” కవాతు హిందీ పదం కనుక అతనికి వెంటనే అర్థం అయిపోయింది. చీమలు కనపడుతున్నాయి. కాబట్టి అతను అనువాదం చెయ్యకపోయినా ఇంక పట్టించుకోలేదు. గబగబా తన సీనియర్ దగ్గరికి వెళ్ళి చూపించాడు. అతని ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు. పక్కన పెట్టి తొందరగా మిగిలినవి చూడు అన్నాడు. అతను వెనక్కి వచ్చి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టాడు. కానీ మనసు ఒప్పలేదు. అలాగే దానికేసి పరిశీలనగా చూశాడు. చీమలంటే పాకాలి. ఇవి కవాతు ఎందుకు చేస్తున్నాయని? మిలిటరీ పుస్తకం అయ్యుంటుందా? అతను మెదడు ఆలోచనలతో వేడెక్కింది. గబుక్కున వాళ్ళిద్దరి వైపు తిరిగీ చీమలు కవాతు ఎందుకు చేస్తున్నాయి?  అసలు ఈ పుస్తకంలో ఏముంది?” అన్నాడు. 

వాళ్ళు  “కథలు.” అన్నారు. 

అంటే ప్రమాదకరమైనవి అన్నమాట. అర్థం అయినట్టు తల పంకించాడు. 

మరొక వైపు గోడకి ఒక మూల కిటికీ ఉంది. మిగతా గోడ అంతా స్లైడింగ్ డోర్లున్న షెల్ఫ్.  ఒకతను వెళ్ళి తలుపు ఒక పక్కకి జరిపాడు. నిర్ఘాంత పోయినట్టుగా ఒక్క సారి చూసి తలతిప్పి తన సీనియర్ వైపు చూశాడు. అతను తల పంకించి షెల్ఫ్ దగ్గరికి వచ్చాడు. రెండు అరల్లో ఆమె బట్టలు ఉన్నాయి. మిగతా అన్నిట్లో పుస్తకాలు, ఫైల్సు!!! అతను గబగబా పక్క డోర్ కూడా ఇవతలికి జరిపాడు. అదింకా ఘోరం. ఒక అరలో సగం మాత్రమే అతని బట్టలు. మిగతా అంతా పుస్తకాలు, కాగితాలు, నోట్ బుక్కులు, అనేక ఫైల్స్. 

ఒకే లాంటి పుస్తకాలు ఒక అరడజను ఉన్నాయి. ఇంగ్లీషులోనే ఉన్నాయి. “ప్రిజన్ నోట్స్ ఆఫ్ ఎ వుమన్ యాక్టివిస్ట్.”  సీనియర్ ఆమె వైపు తిరిగి “ఏంటివి? ఇన్ని ఎందుకున్నాయి? చెప్పండి. ఎవరికి ఇవ్వడం కోసం ఇక్కడ పెట్టారు?” తీవ్రంగా చూస్తూ అన్నాడు. 

ఆమె కొద్దిగా ఆశ్చర్యంగా చూసి, “అవి నేను రాసినవే.” అంది. 

అయితే ఎందుకు పెట్టుకున్నారు? అని అడుగుతున్నాను. ఈ సారి ఆమెకు కోపమూ నవ్వూ రెండూ వచ్చాయి. 

నా పుస్తకం కాబట్టి పెట్టుకున్నాను. దురదృష్టవశాత్తూ నేను ప్రింటు చేసుకోలేకపోయాను. నేను ప్రింట్ చేసుకొంటే నా దగ్గర ఒక వెయ్యి కాపీలు ఉండేవి. వేరే వాళ్ళు చేశారు కాబట్టి 5 కాపీలు మాత్రమే ఉన్నాయి. మిగతావి, పబ్లిషర్ దగ్గర, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇంకా ….”

అతను మూడో వ్యక్తి కేసి చూశాడు. “చూడు” అన్నాడు. అతను గబగబా మొబైల్ తీసి అమెజాన్ లో కొట్టి చూశాడు. అతని కి చూపించాడు.”

“ఇలాంటివి మీరు ఇలా పెట్టుకోకూడదు.” అతను మందలింపుగా మళ్ళీ అన్నాడు. “రాయొచ్చా” అనబోయి ఆమె నవ్వింది. “తెలుగులో కూడా ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఒక కాపీ తీసుకోండి. తప్పక చదవాలి మీరు” అంది.  అతను నిరసనగా చూసి పక్కన పెట్టేశాడు. ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిప్పి పబ్లిషర్ పేరు చూశాడు. 

సీనియర్ ఒక ఫైల్ తీశాడు. 

చాలా లావుగా ఉంది. లోపల తెల్ల కాగితాల మీద తెలుగులో రాసినవి. ఎడమ వైపు కాగితం పైనుండి కిందకు మార్జిన్ ఉండాల్సిన చోట మట్టి రంగు క్రెయాన్ తో చిత్రించిన ఒక చెట్టు పైన పచ్చని ఆకులు కాగితం మీద పై భాగంలో కుడి వైపు దాకా చిత్రించి ఉన్నాయి. కింద “మై డియరెస్ట్ రవీ …..” అనేది మాత్రం ఇంగ్లీష్ లో ఉంది. మిగతా ఉత్తరం అంతా తెలుగులో ఉంది. ఉత్తరం అంతా నల్లని ఇంకులో ఉంటే పైన నీలి రంగు పెన్నుతో ఏదో రాసి ఉంది. అతను ఒక్క క్షణం చూసి “ఇది రాసింది మీరేనా?” ఆమెని అడిగాడు. ఆ ఫైల్ లో అలాంటివి చాలా ఉన్నాయి.  

“అవును”

“ఎందుకు రాశారు?” ఆమె అతనూ కూడా నిర్ఘాంత పోయారు. నమ్మలేనట్టు చూశారు. 

“అవి నా హజ్బెండ్ జైల్లో ఉన్నపుడు నేను రాసిన ఉత్తరాలు.”

“ఇక్కడ కామ్రేడ్ అని ఎవరు రాశారు?”

“ఆమె సందేహంగా ఆ ఫైల్ తీసుకొని చూసింది. ఆ పై పక పక నవ్వింది. అది కామ్రేడ్ కాదు. సెన్సార్డ్ అని జైలర్ సంతకం చేశాడు. స్టాంపు కూడా ఉందిగా” ఇంకా నవ్వుతూనే చూపించింది. అతను అనుమానం తీరక మళ్ళీ మళ్ళీ చూశాడు. రెండూ సి తోనే గా మొదలయ్యేది. ఏదో గొణుక్కున్నాడు. 

“ఎందుకు ఉంచుకున్నారు ఇవన్నీ?”

విస్తుపోయి చూసింది. 

“నా ఇష్టం.” నా మొగుడికి నేను ఉత్తరాలు రాసుకొని దాచుకొంటాను. మీకేందుకు అనాలని అనిపించింది. కానీ అదే వాడిలో హిందీలో అంత ఎఫెక్టివ్ గా అనువాదం చేయడం ఆమెకు రాలేదు. కాబట్టి “నా హస్బెండ్ కి నేను ఉత్తరాలు రాసుకొంటే మీకు ఏమి సమస్య ?” అంది. 

“ఏమి రాస్తున్నారు? అనేది సమస్య.” అన్నాడు. 

అతను కల్పించుకొని, “ అవి తెలుగులో ఉన్నాయి. కనీసం మీరు చదవను కూడా లేదు. ఏం రాసిందో మీకేమి తెలుసు. పైగా అవి జైలర్, సూపిరింటెండెంటు ఇద్దరూ చదివి సెన్సార్డ్ అని సంతకాలు కూడా చేశారు. జైలు స్టాంప్ వేశారు. ఇంకేంటి?” అన్నాడు. 

ఈలోపు కింద అంతా గుట్టలు గుట్టలుగా పుస్తకాలు, కాగితాలు తీసి పడేస్తూ ఉన్నారు మిగతా ఇద్దరూ. సీనియర్ ఇంకా అదే విషయం అతనితో వాదిస్తున్నాడు. 

జూనియర్ ఆఫీసరు హాల్లోకి నడిచి ఆమెను రమ్మని పిలిచాడు. సోఫాలో కూర్చుని ఆమెను కూడా కూర్చోమని అన్నాడు. 

చాలా మృదు స్వరంతో మొదలుపెట్టాడు. “చూడండి. మీరు ఇలా ఆ వుత్తరాలు ఉంచుకోవడం కరెక్టు కాదు. నిజం చెప్పండి ఎందుకు ఉంచుకున్నారు?”

ఆమె  “స్వీట్ మెమొరీస్”. అంది. 

నెత్తి కొట్టుకోబోయి జుట్టు సవరించుకొంటున్నట్టుగా ఆ చర్యని మార్చుకున్నాడు. “మీరు ఇలాంటి ప్రమాదకరమైనవి ఉంచుకోకూడదు. చిక్కుల్లో పడతారు.” 

“ప్రేమగా ఉత్తరాలు రాసుకోవడం కూడా ప్రమాదకరం అని నాకు ఇప్పటి దాకా తెలియదు”.

అతనికి లోలోపల చాలా కోపం వచ్చింది. “జైలుకు వెళ్ళాక ఇంకా ఉత్తరాలు రాసుకోవడం ఏమిటి? పైగా వాటిని దాచుకోవడం. ఎవరైనా జైలు అనుభవాలను గుర్తు ఉంచుకోవాలనుకుంటారా?”

“మర్చిపోకూడదనే కదా మీరు కూడా కోరుకుంటారు!” 

ఈలోపు అతని ఫోన్ మళ్ళీ మోగడంతో లేచి పక్కకు వెళ్ళాడు. ఆమె మళ్ళీ బెడ్ రూమ్ లోకి వచ్చింది. 

సీనియర్ ఫైల్సన్నీ తీసుకొని ముందు గదిలోకి వచ్చాడు. వెనకాలే మిగతా ఇద్దరు అసిస్టెంట్లూ మరి కొన్ని పట్టుకొచ్చారు. ఎక్కడ కూర్చోవాలా అని చూస్తుంటే ఆమె డైనింగ్ టేబుల్ ఖాళీ చేసింది. అక్కడ అన్నీ పెట్టుకొని నలుగురూ చుట్టూ కూర్చున్నారు. ఒక్కొక్క కాగితం తీసి చూసి పక్కకు పెట్టటమో కింద పడెయ్యడమో చేస్తున్నారు. జూనియర్ కి అలా కూర్చుని చూడ్డంలో మళ్ళీ విసుగనిపించిందో ఏమో, లేచి బెడ్రూం లోకి వెళ్ళాడు. మంచం మీద తాను పెట్టిన పుస్తకాలు కనిపించాయి. అయ్యో ఇవి ఇక్కడే వదిలేశారేంటి! అనుకుంటూ “ఎవ్వరూ బెడ్ రూమ్ లోకి వెళ్ళకండి” అని వాళ్ళిద్దరి వైపు చూసి హెచ్చరికగా అన్నాడు. 

మళ్ళీ చీమలు అతని డిస్టర్బ్ చేశాయి. దానిని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పాడు. మళ్ళీ ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళి అన్నీ తనిఖీ చేశాడు. తలుపుల వెనుకా అద్దం దగ్గరా అన్నీ మళ్ళీ మళ్ళీ చూశాడు. చూస్తున్నంతసేపూ ఒక చేతిలో పుస్తకం అలాగే ఉంది. 

మళ్ళీ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఆమె ని పిలిచి “చీమలు కవాతు ఎందుకు చేస్తున్నాయి? చీమలు పాకాలి. అది వాటి ధర్మం. అంతే కానీ ఇలా కాని పనులు చేయకూడదు. ఆమెకు చెప్తున్నాడో అతను అనుకుంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు. 

ఈలోపు ఒక అసిస్టెంటు లోపలికి వచ్చి మరికొన్ని ఫైల్స్ తీసుకుపోవడానికి బీరువా తెరిచాడు. అతనికి ఏదో కనిపించింది …సార్” అని గట్టిగా పిలిచాడు. జూనియర్ ఉత్సాహంగా వెళ్ళాడు. ‘ ఎర్రెర్రని అట్టతో ఉన్న కొన్ని సి.డి.లు. ‘దొరికావ్’ అన్నట్టు ఆమె వైపు చూశాడు. 

ఒక అరడజను సీడీలు చేతిలో పెట్టుకొని మళ్ళీ ఆమెను పిలిచాడు. 

మొదటి సి.డి తీశాడు. “ఎవరీవిడ?” ఆమె జవాబు చెప్పే లోపే సాక్షిగా వచ్చినతను ఉత్సాహంగా కొండపల్లి కోటేశ్వరమ్మ సార్” అన్నాడు. 

“ఓ. అంటే కొండపల్లి సీతారామయ్య గారి భార్యనా? అయితే ఇందులో కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఉండి ఉంటుంది. కదా. చెప్పండి ఆమె మావోయిస్టు కదా.”

“కాదు. కమ్యూనిస్టు.”

“అంటే? నిజం చెప్పండి ఇందులో కొండపల్లి సీతారామయ్య గురించి తప్పక ఉండే ఉంటుంది.”

ఈసారి ఆమెకు బాగా కోపం వచ్చింది. “చూడండి. ఇది కోటేశ్వరమ్మ గారి జీవితం. ఆవిడ గురించి తీసిన సీడీ లో ఆవిడ జీవితం గురించి ఉంటుంది. పైగా ఆమె ఆయన నుండి విడిపోయారు. మీరు పదేపదే అలా అడిగి ఆమెను అవమానపరచకండి. ఒక పని చేయండి. మీరు ఆ సీడీ పట్టుకెళ్ళి చూడండి. తీరిగ్గా చూడండి.”  

ఇంకా  ప్రత్యేక తెలంగాణా గురించిన పాటల సీడీ…..ఆ పరంపర అలా చాలా సేపు కొనసాగింది. 

జప్తు చేయడం కోసం పెడుతున్న కుప్ప క్రమంగా పెరుగుతోంది. జూనియర్ వెళ్ళి దాని మీద చలిచీమల కవాతు పెట్టాడు. సీనియర్ ఒకసారి చూసి పక్కకు పిలిచి, ఇవన్నీ ప్రింట్ అయిపోయినవి కదా. చేతి రాత ఉన్నవి చూడు. తొందరగా. చాలా టైమ్ అయ్యింది. అంటూ మెల్లగా చెప్పాడు. 

మళ్ళీ బెడ్ రూమ్ లో కుప్పలుగా పడి ఉన్న వాటి దగ్గరకు వచ్చాడు జూనియర్. పాతగా రంగుమారిన పొడుగు కాగితాల నోటు పుస్తకం ఒకటి కనపడింది. 

అది తీసి చూశాడు. ఏవేవో తెలుగులో రాసి ఉన్నాయి. ఒక కాగితం జారి పడింది. తీశాడు. దాదాపు 20 పేర్లు వరుసగా రాసి ఉన్నాయి. అతను ఉత్సాహంగా ఆ లిస్టు తీసుకొన్నాడు. “ఇది ఎవరు రాశారు” అని ఆమెని అడిగాడు. 

చూసి, “నేనే” అంది ఆమె. 

“పారోదేవి ఎవరు?”

“నా కథలో పాత్ర. నేను రచయితను.” 

శకున్?

“ఆమె కూడా. ఇంకా అందులో ఉన్న అందరూ. వాళ్ళు జార్ఖండ్ లో నేను జైల్లో ఉన్నప్పుడున్న ఖైదీలు. వాళ్ళ గురించి నేను కథలు రాశాను.”

“ఓ అయితే మావోయిస్టులన్న మాట.”

“కాదు. నా మాట విని మీరు నా పుస్తకం తీసుకెళ్ళండి. అందులో చదివితే మీకే తెలుస్తుంది.”

“వద్దు. మీరు నిజం చెప్తే సరిపోతుంది. చెప్పండి. వీళ్ళందరూ నిజంగా ఎవరు?”

ఆమె జవాబు చెప్పదలుచుకోలేదు. అతను మొబైల్ బయటికి తీసి ఆ జాబితాను ఫోటో తీసుకున్నాడు. 

సీనియర్ కి చూపడానికి హాల్లోకి నడిచాడు. వెనకాలే ఆమె. 

హాల్లోని షెల్ఫ్ లో కూడా పుస్తకాలు ఉన్నాయి. అవి ఒక్కక్కటే తీస్తూ ఇదేంటి? అని సాక్షికి ఒక పుస్తకం చూపాడు. 

“బ్రాహ్మణ వాదం పై విమర్శ” 

అనువాదం చేయమంటే చదువుతావేంటీ? విసుక్కొన్నాడు. 

సాక్షి  పదాలు తట్టక తికమక పడుతుంటే, అతను అందుకొని “క్రిటికింగ్ బ్రహ్మణిజం. నేను అనువాదం చేశాను.” అన్నాడు. 

ఈసారి సీనియర్ అందుకొని “బ్రాహ్మణులంటే మీకేందుకంత అసహ్యం?” అన్నాడు. 

“బ్రాహ్మణులంటే కాదు, బ్రాహ్మణవాదం అంటే” సరి చేశాడు అతను. 

మరో ఫైల్ తెరచి చూశాడు. అందులో కరపత్రాలు ఉన్నాయి. ఒకటి తీసి హెడ్డింగ్ లో ఏముంది మీరు చెప్పండి అని అతన్ని అడిగాడు.

“దళితుల పై దాడులు చేసిన వారిని శిక్షించాలి.”

“ఇలాంటి కరపత్రాలు అసలు ఎందుకు ఉంచుకుంటారు మీరు”.

 “అది నడుస్తున్న చరిత్ర. కాబట్టి”

“ఎవరిచ్చారు?”

ఆమె కల్పించుకొని, “చూడండి కరపత్రాలు వేసినప్పుడు రోడ్ల మీద పంచుతాము. అప్పుడు మీరు ఎదురైనా మీకు కూడా ఇస్తాం.” అంది. 

జూనియర్ ముందుకు వచ్చి, “కానీ నాకు అలా ఎవరైనా ఇస్తే నేను అక్కడే పడేస్తాను. ఇంటి దాకా తేను. పైగా ఇది ఎంత పాతది. ఇంకా ఉంచుకున్నారు. సరేలెండి మాట్లాడదాం. మీతో మాట్లాడవలిసినవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఎలాగూ కలవాలి. మా ఆఫీసులో మాట్లాడుదాం.” అన్నాడు. 

ఈ లోపు మహిళా కానిస్టేబుల్ కూడా ఒక చిన్న నోట్ బుక్ తీసుకు వచ్చింది. “సార్ ఇందులో ఏవో అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎవరో ఇద్దరు మాట్లాడుకొంటున్నవి రాసి ఉన్నాయి. పోలీసుల ప్రస్తావన కూడా ఉంది. సరిగ్గా అర్థం కావడం లేదు.”

ఆ పుస్తకం చూడగానే ఆమె గుర్తుపట్టినట్టుగా చూసింది.  

జూనియర్ అది ఆమె ముఖం ముందుకు జరిపి, “చెప్పండి ఏమిటిది?” అన్నాడు. 

“నేను రెండో సారి జైలుకి వెళ్ళినపుడు కొన్ని రాసుకున్నా. జస్ట్ గుర్తు కోసం. అవి నేను రాయబోయే కథలు.” 

“పోలీసుల గురించి……??”

“చూడండి నేను చాలా ఘటనలు రాసిపెట్టుకుంటాను. నాకు ఎప్పుడో కథల్లో పనికివస్తాయి. ఉదాహరణకు…..ఇప్పుడు మీరు రావడం ఇలా అన్నీ అడగడం…ఇవి కూడా రాసిపెట్టుకుంటాను. ఏదో ఒక కథకు పనికి వస్తుందని…….” 

అతను మౌనంగా హాల్లోకి నడిచాడు. జప్తు లిస్టు రాయడం మొదలుపెట్టారు. 

మీ విషయం మొత్తం నాకు అర్థం అయ్యింది. చలిచీమలు పుస్తకం చేతిలోకి తీసుకొని  “చివరిసారి అడుగుతున్నాను. నిజం చెప్పండి….. ఈ పుస్తకంలో…….”

నిజంగా చెప్తున్నా “బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము 

చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! ….

 ఆమె అంటున్నది అర్థం కాక నోరెళ్ళబెట్టి చూశాడు. 

“ఏయ్! ఎక్కడా? అనువాదం చెయ్.”…జుట్టుపీక్కున్నాడతను. 

కథా రచయిత, అనువాదకురాలు, యాక్టివిస్ట్.

Leave a Reply