చలం నాయికలు నిర్వచించిన ప్రేమ

ఆమధ్య గౌరవనీయులైన ఒక పెద్దమనిషి నన్ను ఇలా అడిగేరు. చలం గారి స్త్రీ పాత్రలన్నీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వారి స్వేచ్ఛలూ, ప్రేమలూ విఫలమైనట్టే కదా? అని. ఆయన చలం గారి అన్వేషణ పట్ల గౌరవం ఉన్న వ్యక్తి. కేవలం జిజ్ఞాసతో అడిగారు.

కానీ చాలా మంది చలాన్ని ఏ కొంచెం కూడా చదవకుండా తొందరగా ఈ విమర్శే చేస్తారు. చివరికి ఏమయ్యేరు చలం నాయికలు?? అంటూ వ్యంగ్యంగా.

జవాబు చెప్పాలంటే వారెవరూ ఏమీ కాలేదు. మనం జీవిస్తున్న సమాజంలో ఎంతోమంది కన్న ఉన్నతంగా, ఆనందమంతా తమదే అన్నట్టు బతికేరు వాళ్లు. ఆ కాలంలో వారు అనుభవించిన ఆస్వాదించిన ప్రేమ గురించి వారేం చెప్పేరో వారి మాటల్లోనే విందాం.

మొదటగా శశిరేఖ నవలలో శశిరేఖ:

కృష్ణుడి తో చల్లని స్నేహం కలిసిన ప్రేమను అనుభవించాక కాల్చే అగ్ని లాంటి సుందర్రావు మోహానికి శలభంలా ఆకర్షితురాలయి కేవలం నిజాయితీ (చలం గారి భాషలో సూనృతం) వల్ల అందులోంచి బయటకు వస్తుంది శశిరేఖ. అప్పుడు నవజీవన దాసు అనే బ్రహ్మసమాజ మతస్తుడు ఆమెకు తమ ఆశ్రమంలో చోటిస్తాడు. వేదాంతం చెప్పబోతాడు. కానీ అది ఆమెకు అనుభూతి లేని శుష్క వేదాంతం లా తోస్తుంది.

నీది ప్రేమ కాదు. శరీరవాంఛ అన్న నవజీవన దాసుతో ప్రేమ గురించి ఇలా చెప్తుంది. “మిమ్మల్ని ఇంత ఆనందం లో ముంచే ఈశ్వరభక్తి ఈశ్వరభక్తి కాదు మీ మనోద్రేకం అంటే మీ కెలాఉంటుంది?! నేననుభవించింది ఏమిటో తెలియకుండా శరీరవాంఛ అంటే సరిపోతుందా? మీరు అట్లా అనడం న్యాయమేనా? వాంఛ ఒక్క నిముషంలో చల్లారే వేడి. ప్రేమ జీవితాన్నంతా వెలిగించే విద్యుచ్ఛక్తి. నా దేహం కాదు ప్రేమ కోరింది, నా ఆత్మ, నేను అనేది అంతా కోరింది. ఆ జీవనాన్ని నాలోని అత్యుత్తమమైన స్వభావమేదో అది కోరింది ప్రేమ జీవనాన్ని. నా ఆశలు, కోర్కెలు, నా ఆశయాలు ప్రాణమూ, నా శక్తులూ అన్నీ కలిసి లీనమైపోయినాయి ఆ ప్రేమలో. ఇంకో ఆశ లేదు కోర్కె లేదు అంతకాలమున్నూ”

అలాంటి ప్రేమ లేని వివాహబంధాన్ని ఆమె అంగీకరించలేదు. చిన్నప్పటి చెలికాడు రామారావు ఉన్నతోద్యోగి అయి తిరిగి వచ్చి ఆమె వివాహం చేసుకోమని కోరేడు. ప్రేమలో కాల్చే మోహం కన్న శాంతీ స్తిమితమూ కావాలని కోరుకునే శశిరేఖ అటువంటి ప్రేమ రామారావు దగ్గర లభించగా తిరిగి రామారావుని ప్రేమించింది. వివాహం ఒప్పుకోదు. రామారావుకు నీతి పట్టు. శశిరేఖ ఎంత ప్రియమైన వాడికీ కూడా నా స్వేచ్ఛను ఇవ్వలేనమటుంది. వివాహంలో తనను తననుగా ఉంచే స్వేచ్ఛలేకపోవడం ఆమె అనుభవించింది. ప్రేమకు స్వేచ్ఛకు మధ్య నలిగింది. ఆ మానసిక సంఘర్షణలో నలిగి ఆమె ప్రాణాలు వదిలింది. నిజానికి ఆమెతో వెంట ప్రేమ ప్రయాణానికి సిద్ధమైన ప్రేమికుడు ఉన్నాకూడా తిరస్కరించి ప్రాణాలు వదలడాన్ని ఏమందాం? నిబద్ధత అనడం తప్ప.

ఇక రెండవ నవల దైవమిచ్చిన భార్య:

ఇందులో పద్మావతి చిన్నప్పటి చెలికాడు రాధాకృష్ణ ను ప్రేమిస్తుంది. పరస్పరం ఉంటుంది ప్రేమ. ఈమె కూడా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కి ఇష్టపడదు. ప్రేమంటే ఏమిటో చెప్పి దాన్ని పెళ్లిలో బంధించవద్దని కారణాలు ఇలా చెప్తుంది.

“ప్రేమ అనేది ఆకాశంలో దానంతట అది వెలిగే జ్యోతి కాదు. కావ్యాల్లో నాటకాల్లో ఇంగ్లీషు నా వెల్స్ లో రాసే ప్రేమ వేరు. మనుషులం మనకి ఉండే ప్రేమ వేరు. పెళ్లి అయిందని కథ ముగిస్తారు. తరువాత వాళ్ల ప్రేమ ఏమయిందో రాస్తే ఎంత ఘోరమైన సంగతులు బయటపడతాయో!!

మనం దాన్ని భద్రంగా పెంచి, కాపాడి, పోషించాలి. లేకపోతే పువ్వులోని మృదు పరిమళం మల్లే ఎగిరిపోతుంది. అనురాగం ఉంటేసరి ఒకరినొకరు పూసుకు తిరిగే కొద్దీ ఎక్కువవుతుందంటారు. భ్రమ. యవ్వన కామజనితమైన భ్రమ. “

పెళ్లి చేసుకుని అతనికి వండి పెట్టి పిల్లల్ని కని తిట్లు తింటూ దాసిగా మారి ఆ ప్రేమను పోగొట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. నీ హృదయేశ్వరిని నీ గంధర్వకన్యని దాసీ దాన్ని చేసుకుంటావా అనడుగుతుంది. ఆమె స్వయం వ్యక్తిత్వం ఉన్న స్త్రీ. ఆలోచనా పరురాలు. ఆమె జీవితమంతా తమ ప్రేమను వెలుగులు నింపే దివ్వెలా ఉంచుకుంది. అందుకోసం రాధాకృష్ణ కు దూరంగా ఉండిపోయింది. చివరకు అతనిని రక్షంచడానికి తన ప్రాణాలు వదిలిపెట్టింది. కాకపోయినా ఆమె జీవితానికేమీ నష్టంలేదు. రాధాకృష్ణ నష్టపోతాడు చాలా. అంచేత కేవలం అతనిమీద ప్రేమ కోసమే ప్రాణాలు వదిలింది.

చలం గారి ఎనిమిది నవలల లో ఈ ఇద్దరే చివరకు మరణించినవారు. ఇద్దరూ తమ ప్రేమల కోసమే ఈ లోకం నుంచి వెళ్లారు.

పద్మావతి ఇలా అంటుంది. “వచ్చే లోకంలో ఈ ప్రేమ అంతా లావణ్యంగా మారుతుంది. ఈ జెలసీ, మనసు పొక్కడం, వ్రణం ఏమీ ఉండవు.”

మైదానంలో రాజేశ్వరి:

నవలారంభమే కథ చివరి భాగం. కథంతా నేపధ్యమే. అంతా జరిగిపోయాక అంటే తను భర్తనూ, పరువునూ వదిలేసి ఏ అమీర్ తో వెళ్లిపోయిందో ఆ అమీర్ తనని తాను పొడుచుకొని చనిపోయాక తన మీరాని జైల్లో పెట్టేదశలో కూడా రాజేశ్వరి అమీర్ తో గడిచిన వెనకటి జీవితం గురించి ఇలా అంటుంది.

“లేచిపోయినానని ఎవరన్నా నన్ను అంటే నాకెంతో కష్టంగా ఉంటుంది. ఇదివరకంతా ఈ మనుషుల్లోంచి నీతివర్తనుల్లోంచి వెళ్లిపోయి ఎడారిలో జీవించడం వల్ల నేను చేసిన పని లోని ఘోరత్వం నీచత్వం బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్య స్వప్నం వలే, ఆ ఎడారి పుణ్యభూమి వలే నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలే తోచింది “

ఇవీ ప్రేమ జీవనం గురించి ఆమె మాటలు, ఒక ఉత్పాతం జరిగిన తర్వాత కూడా.

” అమీర్ నా అమీర్ నన్నేం చేశాడు మనిషికి నాకు
దేవత్వాన్నీ అమృతత్వాన్నీ ప్రసాదించాడు.”

” నేనూ నా అమీర్ మాది నిశ్చల ప్రేమ సంబంధం. ఆ కొండలూ, నదీ, ఆకాశమూ, బయలూ స్వచ్ఛ మారుతమూ మేము మా లీల కోసం కల్పించుకున్న రంగస్థలం. అంతే ఇంక తక్కిన ప్రపంచమంతా మాయ. మేమే ఈ సృష్టీ దాని ఉద్దేశమూ. మమ్మల్నీ మా ప్రేమనూ సృజించడానికే ఈశ్వరుడు ఈ లోకాలన్నింటినీ ఏర్పరిచేడు”

రాజేశ్వరి అనుభవించగలిగిన, అనుభవించిన ప్రేమానుభవం ఆమె చేత ఈ మాటలు చెప్పింది. ఆ ఆనందంతో జీవితాంతం పాచిపని చేసుకునేనా ఆనందంగా బతకగల మనోధైర్యం ఆమెది. బహుశా ఆమె అలాగే శ్రమైక జీవిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నూరేళ్లు బతికి ఉంటుంది.

అరుణలో అరుణ ప్రేమ శరీరాన్ని దాటినది:

దాని గురించి ఇలా చెప్తుంది. “ప్రేమా! ప్రేమ విచిత్రం. నాకేనో! అందరికీనో! చూడు ఆ కిరణాలన్నీ ఒక్కటీ వృధాపోక నా కళ్ళలోకి రావాలనిపిస్తుంది. ప్రతి మానవుడూ ప్రతి అందమూ అన్నీ నా కోసమే నా ఆనందానికే నా లో పలికే అన్నీ ఈ ప్రపంచమంతా… అంతా కూడా నాది నా స్వంతం నా హక్కు అనిపిస్తుంది. కానీ ఈ దేహం అడ్డం నుంచుంటుంది. దేహమంటే కోరికల పుట్ట. చేతకాక స్వేచ్ఛ లేక అన్నీ అక్కడ అర్పిస్తాము.

ఇలా మాటాడే ఈ అరుణ ఎవరికేనా అర్ధమవుతుందా మిక్కిలి అందమైన ఆమె శరీరం తప్ప. అందుకే ఆమె ఊర్వశి లాగే మాయమైపోయింది. అదంతా మిస్టిక్, మిస్టీరియస్

ఇక జీవితాదర్శం లాలస:

లాలస కూడా ఏది మోహం ఏది ప్రేమ అని వెతుక్కుంటూ వెళ్లింది. మోహాలు ఆమెకు అర్ధమయ్యేయి. మోహాలూ కొంతకాలానికి పోతాయనీ అర్ధమైంది. అయినా ప్రయాణించింది. దేశికాచారి కలిశాడు. అతనితో కలిసి జీవించడం మొదలయింది. ఆ కాలం గురించి ఆమె ఇలా అంటుంది.

“నాకూ ఆయనకీ మధ్య ఎన్నడూ ప్రేమ లేదు. విడవలేని తనం, ఆశా, ఉద్రేకం ఇవేమీ లేవు. కానీ మా మధ్య గొప్ప ఐక్యం, శాంతి. ఎందుకంటే ఆయన ఏ పట్టూ ప్రెజుడిస్సూ లేకుండా జీవితాన్ని మధించి సుఖపడే రహస్యాన్ని కనిపెట్టారు. మిగతా వారితో ఉన్నట్టు హక్కులకోసం తగాదాలూ, మర్యాదలు, డబ్బు, మిత్రులు ఆ గొడవలేవీ లేవు. ఆయనతో తగాదా లేదు. చాలా సంతోషంగా నా అభిప్రాయాలూ, హక్కులూ, కోర్కెలూ అన్నీ ఆయన చేతికి అప్పజెప్పాను. ఆయనలో ప్రేమకు అతీతమైన శాంతి. ఎందుకంటే ఆయనకు కోర్కెలూ భయాలూ లేవు. బాధను తప్పించుకోవడంలో నేర్పరి. కానీ బాధను చూస్తే భయం లేదు. ఆయన హృదయంలో శాంతి ఆకాశంలో మల్లే. ఆయనను వదిలి రాను.

ఇదీ చివరగా చలం నాయిక కనుగొన్న ప్రేమ.

ఇక మిగిలిన మూడు నవలల్లో నాయికలు అమీనా, రమణ, సుందరమ్మలు వివిధ విషయాలలో జీవితాన్ని ఎదిరిస్తారే గానీ మరణించరు.

పురూరవలోని ఊర్వశి:

ఇక మరీ గొప్పగా ప్రేమ గురించి చెప్పిన పురూరవలోని ఊర్వశి మాటలు కూడా విందాం.

సర్వం సహా సామ్రాట్ అయిన పురూరవుణ్ని ఊర్వశి ఇలా అనడుగుతుంది .

“స్త్రీ ముందు మోకరించడం నేర్చుకోని నువ్వు ఏం తెలుసుకున్నావు? ఏం జీవించావు?”

“నమ్మకం ప్రియురాలి మీద కాక నీ ప్రేమ మీద ఉండాలి. నీ ఆత్మ వైశాల్యాన్ని బట్టే నీకు లభించే ప్రియురాలు ఉంటుంది.”

జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్మయత్వం ఎలా ఉండాలంటే దాని ముందు ప్రపంచంలోని మరేదీ ఎక్కువ కాకూడదు అంటుంది.

“ప్రేమ వల్ల నీకేం వచ్చింది” అనడిగితే “సుఖం వచ్చింది” అంటాడు పురూరవుడు.
“ఇంతేనా నరకం వచ్చిందా, విజ్ఞానం కలిగిందా, లేదా? ప్రేమ అంటే నీకేం తెలుసు నీ దృష్టి ఇంకా విశాలం కాకుండా ఉంటుందా ప్రేమిస్తే” అనడుగుతుంది.

మళ్లీ ఊర్వశి కూడా అదే అంటుంది. “ప్రియురాలిని కాదు నువు విశ్వసించవలసినది. నీ ప్రేమను. ప్రియురాలిని విశ్వసించి భంగపడి ప్రేమను తిడతారు మనుషులు. ప్రియురాలి కన్న కాదు, ప్రేమ కన్న ముఖ్యమైనది ఉండడానికి లేదు ఏ ధర్మానికి.”

“జీవితమంటే ప్రతీ అడుగూ కదలిక. కదలిక అంటే త్యాగం. తోవ పొడుగునా వొదలడం. అందులో ప్రేమ జీవితమంటే చాలా వేగవంతమైన కదలిక. క్షణక్షణానికీ పరిత్యాగం.”

ఇవన్నీ చలం గారి ఊర్వశి మాటలు.

కామం జంతుస్థాయి. అందాలూ గుణాలూ కారణంగా ఏర్పడే మోహాలు కొంత ఉన్నతం. మోహమే ఎరగకండా బతికే కేటానుకోట్ల మందికోసం విలపించిన చలం దాన్ని చెప్పడానికి ఎంతో సాహిత్యం రాశాడు. ఆపైన మనుషులు ఉన్నతులై అందుకో వలసిన ప్రేమ గురించి లాలస చేత ఊర్వశి చేత చెప్పించాడు.

మనో వికాసానికి, అంతరంగ స్వేచ్ఛకి అడ్డంగా ఉన్న ప్రతీ దాన్నీ ప్రశ్నించాడు. ఎందుకూ అంటే ప్రేమ కోసం. ప్రేమించే శక్తి పొందగలగడం కోసం, ప్రేమను స్వీకరించగల హృదయం సంపాదించగలగడం కోసం.

ఆయనే చెప్పినట్టు “లోహపు బిళ్లల వెంట పరిగెత్తే సమాజానికి ఎప్పటికి అర్ధంకాను!!!”

జ‌న‌నం: తూర్పుగోదావరి జిల్లా- మన్యప్రాంతం రాజవొమ్మంగి మండలం గదవరం గ్రామం. కథకురాలు, సత్యాన్వేషి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. కాకినాడలో పెండా సత్యనారాయణ మూర్తి సంస్కృత కళాశాలలో, పి.వి.ఆర్. ట్రస్ట్ డిగ్రీ కళాశాలలో తెలుగు రీడ‌ర్‌గా పనిచేసి రిటైర‌య్యారు. కథా సంకలనాలు : 'వెన్నెల ముగ్గు' (1980) కథతో కథారచయిత్రిగా సాహిత్య జీవితం ప్రారంభించి 'ఉత్సవ సౌరభం' (1996), 'కొండఫలం' (2009), 'కిటికీ బయటి వెన్నెల' (2014). సాహిత్యవ్యాసాలు: ‘సాహిత్యానుభవం' (2005), ‘ఆకులో ఆకునై' (2003). చలం సాహిత్యంపై చేసిన డాక్టరల్ పరిశోధన 'సత్యాన్వేషి చలం' (2007) పేరిట వెలువరించారు.

One thought on “చలం నాయికలు నిర్వచించిన ప్రేమ

Leave a Reply