చలం అచంచలం : శశిరేఖ!

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-1)

మొత్తం ఎనిమిది నవలలు మాత్రమే రాసిన గుడిపాటి వెంకటా చలం మొదటి నవల “శశిరేఖ”. 1921లో – అంటే 102 సంవత్సరాల క్రితం రాసిన ఈ నవల భాష విషయంలో ఆయన మిగతా నవలల కంటే భిన్నంగా వుంటుంది. రచయిత నేరేషన్ సరళ గ్రాంధికంలో సాగినా పాత్రల మధ్య సంభాషణల్లో వ్యవహారిక భాషా ప్రయోగం కనబడుతుంది. ఈ భాషా ప్రక్రియ చలం నవలల్లో ఈ ఒక్క నవలలోనే కనబడుతుంది.

“శశిరేఖ” కేవలం చలం తొలి నవల అవడమే దాని ప్రత్యేకత కాదు. చలం రాసిన ప్రతి నవల దానికదే సాటి. ఆయన రాసిన ప్రతి నవల మరొకరెవరైనా కాదు సాక్షాత్ చలమే మరోసారి అలాంటి నవల అంత గొప్పగా రాయగలడా అనిపించే స్థాయిలో వుండే మాట నిజమే కానీ చలం రాసిన మరే ఇతర నవలలోనూ లేనంత స్థాయిలో లోతైన ప్రేమ భావన, గాఢమైన సౌందర్య దృష్టి ఇందులో కనబడుతుంది. ఈ నవలలోని కవితాత్మకమైన ప్రకృతి వర్ణన మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది. ప్రేమతో కూడిన భావోద్వేగాల్ని ప్రకృతి ఎలా ప్రేరేపిస్తుందో చలం వర్ణనల్లోనే చూడాలి.

కృత్రిమత్వానికి తావు లేకుండా, లోకానికి వెరవక ప్రేమ, స్నేహం, సాన్నిహిత్యం వంటి మానవీయ అనుభూతులతో తన పురుషుడనుకున్న వానితో సంబంధం కోసం పరితపించే పాత్రగా శశిరేఖని చలం తీర్చిదిద్దాడు. చలం రాతలోనే శశిరేఖ గురించి చెప్పాలంటే “ఇతరుల దుఃఖమును జూచి కన్నీళ్లు కార్చుట ప్రతివారికి చేతనగును కానీ ఇతరుల సౌఖ్యమును జూచి తమ దుఃఖమును మరచుట శశిరేఖ వంటి ఉన్నత హృదయులకు గాక ఎవరికినీ సహజము కాదు!” అలా తీర్చిదిద్దే క్రమంలో చలం శశిరేఖ ద్వారా డొల్ల, స్త్రీ వ్యతిరేకమైన ప్రేమ రాహిత్యపు సంఘనీతుల్ని నిలదీస్తూ క్షిపణుల్లాంటి ఎన్నో ప్రశ్నలు వదుల్తాడు. శశిరేఖని అందరూ చక్కదిద్దబోయే వారే కానీ ఎవరికీ ఆమె ప్రశ్నలకు సమాధానంగా అంతశ్శోధనలు చేసుకునే ధైర్యం వుండదు. పాత్రల మధ్య బలమైన ఘర్షణని వివరించే మనో విశ్లేషణ, తర్కంతో కూడిన సంభాషణలతో పరుగులు పెట్టించే కథనంతో చదివించే ఈ నవల ఒక అద్భుతం. చలం శశిరేఖ అనే సాహస పాత్ర ద్వారా సంఘం మీద తన యుద్ధాన్ని ప్రకటించాడు అని చెప్పొచ్చు. అసలు తన కథానాయకకి శశిరేఖ అనే పేరు పెట్టడంలోనే చలం గొప్ప ప్రతీకాత్మకతని ప్రదర్శించారు. శశి అంటే చందమామ. తాను క్షీణిస్తూ పున్నమి నాడు ధగధగా, చల్లగా, ఆహ్లాదంగా, సౌందర్య భరితంగా మొదలయ్యే చందమామ క్రమంగా క్షీణిస్తుంటుంది. శశిరేఖ కూడా తన యవ్వన దశని ఎంతో ఉత్సాహంగా, గొప్ప సానుకూల దృక్పథంతో, సౌందర్యవంతంగా మొదలు పెడుతుంది. కానీ క్రమేణా ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకుంటాయి.

శశిరేఖకి పెద్దగా ఊహ తెలియని సమయంలోనే తల్లిదండ్రులు బాల్య వివాహం చేస్తారు. ఇంకా ఈడేరలేదు కాబట్టి తల్లిదండ్రుల వద్దనే వుంటుంది. ఆమె అసాధారణ సౌందర్యవతి. కానీ అంతకు మించిన అంతస్సౌందర్యం కలిగిన మనిషి. ఆమె వివాహానికి ముందు, ఆ బాల్య చాపల్యంతోనే తన ఊరు గోపాలపురంకే చెందిన రామారావు అనే విద్యార్ధికి పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తుంది. ఆ తరువాత రామారావు డాక్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళతాడు. కాల క్రమంలో ఆమె రామారావును మర్చిపోతుంది. కృష్ణుడు అనే వైద్య విద్యార్ధితో ప్రేమలో పడుతుంది. అతను సెలవుల కోసం గ్రామానికి వస్తాడు. వారు రోజూ లాకుల వద్దనున్న తోటలో కలుసుకునే వారు. ఐతే తల్లిదండ్రులు ఆమెని భర్త వద్దకు పంపే ముందు “కార్యం”కి ముహుర్తం నిర్ణయిస్తారు. శశిరేఖ ప్రతిఘటిస్తుంది. ఆమెకి తన భర్త అంటే ఇష్టం లేదు. అతను గర్విష్ఠి, స్వార్ధపరుడు అని ఆమె అభిప్రాయం. “ఎప్పుడో ఎవడో మా ఇద్దరిని కూచోపెట్టి, అర్ధం లేని వాగుడు వాగినాడని, ఎల్లకాలం ఇష్టమున్నా లేకపోయినా పడి యాడవమన్నావూ? నేను కోరుకున్నానా, చేశానా! మీరెవ్వరు నన్నిలా కట్టి వెయ్యడానికి?” అని తల్లితో ఘర్షణ పడుతుంది. ఈ సంభాషణల ద్వారా బలమైన శశిరేఖ వ్యక్తిత్వం తెలుస్తుంది. భర్తతో చెప్పి చూస్తుంది తనకు ఆ వివాహమంటే ఇష్టం లేదని. అతను మొరటుగా స్పందిస్తాడు. ఆ రోజు రాత్రి శశిరేఖ, కృష్ణుడు ఇద్దరూ కృష్ణుడు మిత్రుడైన వాడపిల్లిలో వుండే డాక్టర్ సుందర్రావు వద్దకు రహస్యంగా వెళ్లిపోతారు. ఈ రకంగా శశిరేఖని ఒక సాహసవంతమైన యువతిగా చలం మనకి పరిచయం చేస్తాడు. నవల మొత్తం కూడా శశిరేఖ ఇదే బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది.

సుందర్రావు ఆశ్రయంలో వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా కాలం గడుపుతూ ప్రేమమయ జీవితాన్ని అనుభవిస్తారు. కొంత కాలానికి కృష్ణుడు తల్లిదండ్రులు తమ కొడుకుని దూరం చేసుకోలేక మళ్లీ వాళ్లిద్దరిని ఆదరించి గోవిందాపురంకి తీసుకొస్తారు. సుందర్రావు కూడా గోవిందాపురంలోనే డాక్టరుగా పని చేస్తుంటాడు. వాళ్లు తరుచుగా కలుస్తుంటారు. సుందర్రావు మాటల్లో గొప్ప జ్ఞానం వుంటుంది. అతను స్త్రీల స్వేచ్ఛను కాంక్షిస్తూ స్త్రీల మీద పురుషాధిపత్యాన్ని నిరసిస్తూ స్త్రీవాదిలా మాట్లాడుతుంటాడు. శశిరేఖ వృద్ధులైన అత్త మామల సేవలతో బిజీగా వుంటుంది. బద్ధకస్తుడైన కృష్ణుడు సోమరిపోతులా వుంటే సుందర్రావు ఆమె పనుల్లో సహకరిస్తూ వుంటాడు. ఈ క్రమంలో అతను ఆమెని విపరీతంగా పొగుడుతుంటాడు. సుందర్రావు గొప్ప సంగీత కళాకారుడు. వయొలిన్ వాయిస్తాడు. అతని వాద్య గానానికి ఆమె పరవశించిపోతుంది. అతను పాడుతున్నంత సేపూ నిగూఢమైన మనోభావాలన్నీ, ఆమె సర్వ శక్తులున్నూ మిళితమై వ్యక్తీకరిస్తున్నట్లు ఆమెకి తోస్తుంది. అలాంటి సంగీతానికి ప్రాణమిచ్చిన తనివి తీరదనిపిస్తుందామెకు. ఆ సందర్భంలో అతను చనువు తీసుకుంటే ఆమె ఎంతగానో వారిస్తుంది. కానీ ఆమెలో తీవ్రమైన సంఘర్షణ కలుగుతుంది. ఒకసారి కృష్ణుడు లేని సమయంలో ఆమెని సుందర్రావు ప్రేరేపించి శారీరికంగా వశం చేసుకుంటాడు. కృష్ణుడితో వున్న స్నేహపూర్వక స్వచ్ఛమైన ప్రేమానుబంధానికి, సుందర్రావుతో ఏర్పడిన మోహపూర్వక ప్రేమానుబంధానికి మధ్య ఆమె కొట్టుమిట్టాడుతుంది. ఆమె జీవితంలోకి సుందర్రావు ప్రవేశంతో కృష్ణుడితో వున్న నిష్కపటమైన, ప్రశాంతమైన, నిర్మలమైన ప్రేమ అనంతరం ఆమెలోని స్త్రీ ప్రౌఢగా మరో దశలోకి వెళ్తుంది. ఆమెని తాకితే ఎక్కడ కందిపోతుందోని దేవతగా పూజించిన కృష్ణుడి కంటే ఆమెలోని స్త్రీత్వాన్ని తన కళతో, జ్ఞానంతో సన్మానించిన సుందర్రావు వైపుకి ఆమె మనసు వెళ్లిపోతుంది. మహా ప్రళయం వంటి మోహంతో కమ్ముకొచ్చిన సుందర్రావు ఆమెలోని ప్రకృతి ప్రేమ, విహార కాంక్షని గుర్తించి ఎన్నో బాసలు చేస్తాడు. కృష్ణుడికి తన ముఖం చూపించలేక, సుందర్రావు పైనున్న మోహావేశపు ప్రేమని జయించలేక సతమతమై చివరికి సుందర్రావుతో తనని ఎక్కడికైనా తీసుకెళ్లి పొమ్మని చెబుతుంది. ఆమె కృష్ణుడికి ఒక ఉత్తరం రాసి సుందర్రావుతో కలిసి దూరంగా వెళ్లిపోతుంది. ఆమె సంఘ నీతిని లెక్క చేయదు. ఆమె విలువలన్నీ ప్రేమ మీదనే ఆధారపడి వుంటాయి. ప్రేమ బహుముఖమైనదని తెలియని దశలోనే ఆమె కృష్ణుడిని వరిస్తుంది. ఒకసారి తెలిశాక ఆమె జీవితంలోకి నూతన పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. ఆమె జీవితాన్ని ప్రేమ, కళ, సౌందర్యం నడిపిస్తుంటాయి.

సుందర్రావుది కృష్ణుడి వంటి మనస్తత్వం కాదు. అతనిలో ఎల్లప్పుడూ ఏదో అశాంతి మండుతుంటుంది. ఆ అగ్ని నుండి తప్పించుకోడానికి ఒక సుఖం తరువాత మరొక కొత్త సుఖం కోరుకుంటూ వుంటాడు. కొద్ది రోజుల్లోనే అతనికి శశిరేఖ పట్ల విముఖత ఏర్పడుతుంది. ఆమెని మాటలతో హింసిస్తుంటాడు. మొదటిలో అతన్ని కొంత తేలిగ్గా తీసుకుంటుంది. ఎలా వుంటే అతనికి ఇంతకుమునుపు ఇష్టమైందో అలా తయారైనా అతనికి కంటకింపుగానే వుంటుంది. కృష్ణుడు ఆమెకి రాసిన ఉత్తరాన్ని సుందర్రావు చింపి చదువుతాడే కానీ ఆమెకివ్వడు వెంటనే. ఆ ఉత్తరం చదివి శశిరేఖ కుమిలిపోతుంది. శశిరేఖ ప్రేమైక జీవి. అది లేకుండా ఆమె వుండలేదు. కళా హీనమైన బతుకు ఆమెకి రుచించదు. అతని తిట్లు, హింస, ప్రేమ రాహిత్యం భరించడం ఆమెకి దుస్సహమై పోయి అతన్ని విడిచి తన స్వగ్రామం గోవిందాపురం వెళ్లిపోవాలనుకుంటుంది. సుందర్రావు ఇంట్లో లేనప్పుడు బయలుదేరుతుంది. ఐతే పక్కింటి కాంభొట్లు అనేవాడు ఇంటి యజమాని లేనప్పుడు నువ్వెట్లా వెళ్లిపోతావ్ అంటూ అడ్డం పడతాడు. ఆమె తన పెట్టె బేడా అక్కడే వదిలేసి స్టేషన్ కి వెళ్లిపోగా అక్కడికి నౌకరు వచ్చి సుందర్రావు కి యాక్సిడెంట్ అయ్యిందని చెబుతాడు. ఆమె ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సుందర్రావు దగ్గరకు వెళ్లిపోతుంది. స్వేచ్ఛ కోసం పెనుగులాటలో ఆమె సుందర్రావుని విడిచిపెట్టి వెళ్లిపోవాలనుకుంటుంది కానీ అతను ఆపదలో వున్నప్పుడు తన బాధ్యతని విస్మరించదు.

సుందర్రావుకి వైద్యం చేయడానికొచ్చిన డాక్టర్ని ఆమె గుర్తు పడుతుంది. అతను ఆమె చిన్ననాటి హీరో రామారావు. రామారావు ఎంతో నిజాయితీపరుడు, చాలా సౌమ్యుడు, సంస్కారవంతుడు. అతను “బ్రాహ్మ మతం” సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనవాడు. (బ్రహ్మ సమాజం పేరుని మార్చి చలం “బ్రాహ్మ మతం” అని రాసి వుంటారు.) ఒకవైపు సుందర్రావు కోలుకుంటూ వుండగా మరో వైపు రామారావు, శశిరేఖల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. శశిరేఖ తన కథనంతా అతనికి చెబుతుంది. రామారావులో ఆమె పట్ల తన చిన్ననాటి ప్రేమ ఇంకా సజీవంగా వుంటుంది. వారిద్దరి సన్నిహిత్యంతో సుందర్రావు బెంబేలెత్తుతుంటాడు. ఆమెతో బేలగా మాట్లాడుతుంటాడు. దయగా ప్రవర్తిస్తుంటాడు. ఐతే మారిన అతని ప్రవర్తన ఆమెలో అతని పట్ల ఎలాంటి ప్రేమని కలిగించదు. ఆమె సుందర్రావు దగ్గరకి కేవలం మానవీయ కారణాలతో వచ్చిందే తప్ప అతన్ని విడిచి బతకలేని పిరికితనం వల్ల కాదు కదా!.

రామారావు వివాహ వ్యస్థని ఎంతో గౌరవిస్తాడు. అతని హృదయం ఈశ్వరుడికి జవాబుదారీగా వుంటుందనుకుంటాడు. అతని బుద్ధికి లోకం ఏమనుకుంటుందో అనే విషయం చాలా ముఖ్యం. వివాహం బైట ప్రేమ పాప పంకిలమనుకుంటాడు. సంఘ నీతి వివాహ వ్యవస్థ మీద ఆధారపడి వుంటుందని విశ్వసిస్తాడు. ఐతే శశిరేఖది ఇందుకు పూర్తి విరుద్ధమైనది. తన హృదయాన్ని ఈశ్వరుడు కట్టడి చేయడని ఆమె విశ్వాసం. లోకం కోసం భయపడి బత్కడం ఆమెకి చాలా కృతకంగా, విలువ తక్కువతనంగా కనబడుతుంది.

శశిరేఖ తన వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది, కృష్ణుడుకి ఖేదము కలిగాయని బాధ పడుతుందే తప్ప తాను మాత్రం ఎలాంటి అన్యాయానికి, అధర్మానికి పాల్పడినట్లు భావించదు. రామారావు ఆమె బతుకు అధర్మ పూరితంగా వుందని ఆమెని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఎలాంటి అసంతృప్తి వున్నా ఖచ్చితంగా కలిసి వుండాలనే వివాహ బంధంలోని ఏర్పాటు పట్ల తన తిరస్కారాన్ని శశిరేఖ వ్యక్తం చేస్తుంది. తన అనుభవం ప్రకారం ఆమె నేర్చుకున్నదేమిటంటే చలనం జీవనమైతే స్థిరత్వం మృతి. వివాహ వ్యవస్థలో ధర్మాల పేరిట ఏర్పరిచిన నైతిక విలువలు వ్యక్తిత్వాన్ని, ప్రేమని హరించి వేస్తాయని వాదిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వున్నా లేకున్నా ఎలాగోలా కలిసి బతకక తప్పదనడాన్ని ఆమె ఈసడిస్తుంది. తామిద్దరి మధ్య ప్రేమ వుంటే చాలు కలిసి బతకొచ్చని చెబుతుంది. చలం వారిద్దరి సంవాదాన్ని అద్భుతంగా రాస్తాడు. ఆమె ఎంత అతని అభిప్రాయాల్ని వ్యతిరేకించినా రామారావుకి ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమె వ్యక్తిత్వం అలాంటిది. రామారావు తనని వివాహం చేసుకోవాలని అభ్యర్ధిస్తాడు. చివరికి అతని ఆత్మీయతని, సంస్కారాన్ని, ప్రేమని గౌరవించిన శశిరేఖ అతని పట్ల ప్రేమతోనే వివాహం చేసుకోడానికి అంగీకరిస్తుంది. సుందర్రావుకి కూడా ఆ విషయం చెప్పేస్తుంది. అతను నిస్సహాయంగా వుండిపోతాడు.

తమ వివాహమయ్యేంత వరకు శశిరేఖ వుండటం కోసం రామారావు వేరే ఇల్లు తీస్తాడు. తనతో పాటే వుండనివ్వమని రామారావుని ఆమె అభ్యర్ధిస్తుంది. కానీ రామారావు అందుకు ఒప్పుకోడు. వివాహానికి ముందే తామిద్దరూ ఒకే ఇంటిలో నివసించడం సంఘ నీతికి, ధర్మానికి విరుద్ధమంటాడు. శశిరేఖ మళ్లీ రాజీ పడుతుంది. రామారావు బైటికెళ్లగా ఆమె తన సామాను సర్దుకుంటుండగా కాంభొట్లు మళ్లీ వస్తాడు. సుందర్రావు లేనప్పుడు వెళ్లడానికి వీల్లేదంటాడు. రామారావు వచ్చి అతన్ని తన్ని తరిమేస్తాడు. శశిరేఖని వేరే ఇంట్లో పెడతాడు. తమ వివాహమయ్యే వరకు శశిరేఖని కలవకూడదని రామారావు నిశ్చయించుకుంటాడు. ఇలా వుండగా ఒక రోజు సుందర్రావు మళ్లీ వచ్చి కాళ్లా వేళ్లా పడి, ఆమెని నమ్మించి, తనపై ఆమెకు గల మోహావేశ ప్రేమని ఉపయోగించి మళ్లీ లోబరుచుకోగలుగుతాడు.

ఆమెని సుందర్రావు చెన్నపట్నం తీసుకెళ్తాడు. కొన్నాళ్లలో అతనిలో మళ్లీ పాత సుందర్రావు మేల్కొంటాడు. ఆమె కథ సుందర్రావుతో మళ్లీ మొదటికొస్తుంది. ఆమెని మాటలతో, చేతలతో హింసిస్తుంటాడు. ప్రేమ లేకుండా కేవలం హింసని మాత్రమే వ్యక్తీకరించే అతబ్బు భరించలేక విరక్తి పుట్టి ఒక నాటి రాత్రి ఆమె కట్టుబట్టలతో బైటికొచ్చేస్తుంది. దిక్కు లేకుండా ఆకలితో ఆ మహా నగరపు మురికిలో, చీకటి బుద్ధుల మనుషుల వెకిలి చేష్టల్ని తప్పించుకుంటూ నడిచిపోతుంటుంది. ఆ స్థితిలో ఆమెని చూసిన నవజీవన దాసు అనే నడి వయస్కుడు ఆమెని ఆదరంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయమిస్తాడు. అతను బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఎంతో సంస్కారవంతుడు. ఆమెని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ముందు విశ్రాంతి తీసుకోమంటాడు. అతను బ్రహ్మచారి. అయినా రామారావులా ఒకే కప్పు కింద పరాయి స్త్రీతో వుండటం తప్పని భావించడు. ఆమె పట్ల పితృ వాత్సల్యంతో వుంటాడాయన.

శశిరేఖ నవజీవన దాసు ఆశ్రయంలో ఒకటిన్నర సంవత్సరం వున్నా ఆమె గత జీవితం గురించి ఆయన ఎలాంటి ప్రశ్న వేయడు. ఆమె తన జీవితం గురించి స్వయంగా చెప్పుకుంటుంది ఆయనతో. “ఉత్తమ జీవనమునకు నిన్ను తీసుకు వచ్చుటకు నీకిన్ని కష్టములను ఈశ్వరుడిచ్చాడు” అని అంటాడాయన. ఆయన శశిరేఖకు కుట్టు మిషన్ ఏర్పాటు చేసి అందులో తర్ఫీదు ఇప్పిస్తాడు. నవజీవన దాసు ఇంట్లో ఒక శూద్ర మనిషి వంట చేస్తుంటుంది. ఆవిడ వండిన భోజనం తినడానికి బ్రాహ్మణ స్తీ ఐన శశిరేఖ ఇబ్బంది పడుతుంది. కానీ నవజీవన దాసు సిద్ధాంతం, ఆదర్శంతో ప్రభావితమై తాను కూడా ఆమె వండిన భోజనాన్ని తినడం మొదలు పెడుతుంది. నిజానికి ఆమెకి నవజీవన దాసు కులమేంటో తెలియదు. ఆమె గతంలో సుందర్రావు ఇంటి నుండి బైటకి వచ్చి వీధుల్లో నిస్సహాయంగా తిరుగుతున్నప్పుడు దాహంతో అలమటిస్తుంది. ఆమె కులమేంటో తెలియని కారణంగా ఒక ఇంటి వారు ఆమెకి నీళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఆమెకు వీధి కుళాయిలో నీళ్లు తెచ్చిస్తుంది. శశిరేఖ ఆ నీళ్లని తిరస్కరిస్తుంది. అలాంటి శశిరేఖలో నవజీవన దాసు వల్ల మార్పు వస్తుంది. ఆమె మెల్లగా బ్రహ్మ సమాజంకి వెళ్లడం అలవాటు చేసుకుంటుంది. జీవితంలో కొత్త విషయాలు తెలుసుకోడానికి, ఆచరించడానికి వెరవని మనస్తత్వం ఆమెది. ఆ విషయాన్ని చలం చాలా చక్కగా ప్రెజెంట్ చేస్తాడు.

బ్రహ్మ సమాజం మనుషుల్ని చూసినప్పుడల్లా శశిరేఖకి రామారావు జ్ఞాపకం వస్తుంటాడు. ఎవరిలో అయినా భక్తి, ధీరత్వం చూసినా కూడా అతనే గుర్తుకొచ్చేవాడు. ఆమెలో ఒక అశాంతి మొదలవుతుంది. ఒక చిన్న ఇల్లు, అందులోని పుస్తకాలు, బ్రహ్మ సమాజం…ఇవి నవజీవన దాసుకి ఎంతో ఆనందాన్ని జీవన సంతృప్తిని కలిగిస్తుంటే అవే ఆమెకు అశాంతిని కలగచేస్తుంటాయి. ఈశ్వర విశ్వాసం ఏర్పాటు చేసుకోమని చెబుతాడు. అదొక్కటే ఆమెని రక్షిస్తుందని చెబుతాడు. తన కష్టాల పరిష్కారానికి ఈశ్వరుడికి సంబంధం లేదనేది ఆవిడ ఉద్దేశ్యం. ప్రయత్నపూర్వకంగా విశ్వాసం ఏర్పాటు చేసుకోవడం గురించి, అది కలిగించే ప్రశాంతత గురించి దాసు ఆమెని ఒప్పింప చేయాలని చూస్తాడు కానీ విశ్వాసాలు తెచ్చిపెట్టుకునే కృతక ధోరణి ఆమెని ఒప్పించ లేకపోతుంది. బుద్ధిపూర్వకంగా చేస్తే తప్ప ఏదీ పాపం కాదని అంటుంది ఆమె. జీవితానుభవాలలో పుణ్యానుభవాలు, పాపానుభవాలు వుండవు కదా మరి! జీవితంలో ఎదురయ్యే సంఘటనలు చూపించే ప్రభావానికి పాప పుణ్యాలేముంటయి అసలు? బ్రహ్మ సమాజంలో పాప విముక్తి కోసం జరిగే ప్రార్ధనలు ఆమెని ఒప్పించ లేకపోతాయి. జీవితానికి నియమాలు అవసరమని బోధిస్తాడు దాసు ఆమెకి. పెళ్లి దంపతులు సౌఖ్య పడటానికి, లోక వ్యాపారాలు సక్రమంగా జరగడానికి, దుర్బలమైన మనుషులు పాపాలు చేయకుండా వుండటానికేనని దాసు వాదిస్తాడు. మనసు మనసు కలిసి ఈశ్వర ధ్యానం చేసుకోవడమే ప్రేమని అంటాడాయన. ఆత్మవంచనే మహా పాపమని, ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోవడం మించిన పాపం మరేదీ లేదంటుంది శశిరేఖ. ప్రేమ కోసం కష్టాలు పడితే పడొచ్చు కానీ అదిచ్చే సుఖం, తృప్తి మరేదీ ఇవ్వదని ఆమె భావన. తన జీవితంలో కష్టాలు మాత్రమే లేవనీ సుఖాలు, సంతృప్తి, ఆనందం, సౌందర్యం, కళ వున్నాయని ఆమె నమ్మిక. ఈ సందర్భంలో ఆమెకీ నవజీవన దాసుకి మధ్య జరిగే సంభాషణని చలం గొప్పగా రాస్తాడు. చదివి తీరాల్సిందే. రెండు భిన్నమైన భావజాలాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంవాదం అది. చలం రెండు ధోరణులలోని అన్ని అంశాలను నిష్పాక్షికంగా రాశాడు.

నవజీవన దాసు శశిరేఖని ధర్మారావు అనే బ్రహ్మ సమాజ కార్యకర్తని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ ఆమె అందుకు తిరస్కరిస్తుంది. అతను యోగ్యుడు, భక్తిపరుడని దాసు అంటాడు. కానీ అతనో పిరికివాడని, అతనిని తాను ప్రేమించడం లేదని శశిరేఖ అంటుంది. ఒకసారి అతనితో మాట్లాడమని అంటాడు దాసు. ఆమె ఒప్పుకోదు. దాసుకి ఆమె వ్యక్తిగా చాలా మంచిదని, కానీ చెడ్డ తోవలలో ఆలోచిస్తున్నదని, తానెలాగైనా ఆమెని సరైన దారిలో పెట్టాలని అభిలషిస్తుంటాడు. ఆమె మాత్రం తానే పాపం చేయలేదని, ఈశ్వరుడైనా తనకు ఇష్టం లేని పని చేయమని బలవంతం చేయడని భావిస్తుంది. ఆమె నిరీశ్వరురాలేం కాదు కానీ ఈశ్వర విశ్వాసం వున్న ఇద్దరు పరస్పర గౌరవంతో, అంతే స్థాయి పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో సంవాదం చేయడం ఇక్కడి ప్రత్యేకత. వివాహం మీద నమ్మకం పోయిన శశిరేఖ తాను జీవితంలో ఒక్కరినే ప్రేమించడం అసాధ్యమని భావిస్తుంది. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఒక్కరినే ప్రేమించడం, ఒక్కరితోనే కలిసి బతకడం రెండు వేరు వేరు విషయాలు. ఒక్కొక్కరిలో ఒక్కో విషయం ప్రేమకి కారణం కావొచ్చు. ఐతే ఎవరికైనా తాను ప్రేమించిన అందరితోటీ కలిసి జీవించడం అసాధ్యం. కానీ తాను ప్రేమించిన వ్యక్తితోనే కలిసి జీవించడం సాధ్యం. కానీ సమాజం ఒక్కరినే ప్రేమించాలని, ఆ ఒక్కరు జీవిత భాగస్వామి కావాలనీ నిర్బంధిస్తుంది. ఇది ముఖ్యంగా స్త్రీ విషయంలో జరుగుతుంది. స్త్రీల కోసం పాతివ్రత్యమనే సిద్ధాంతం, విలువ, ఆదర్శం వున్నట్లు పురుషుల కోసం సాతివ్రత్యం లేదని మనం గుర్తించాలి. ఒక్కరినే ప్రేమించాలని నిర్బంధించే వివాహ వ్యవస్థ ఆ ప్రేమకి పూచీ పడదు కాబట్టే శశిరేఖకి ఆ వ్యవస్థ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. పైగా ఆ వ్యవస్థ పాటించాల్సిన విలువలు, పాప భయాలను అన్నింటినీ స్త్రీలకే నిర్దేశిస్తుంది.

మళ్లీ కథలోకి వస్తే శశిరేఖ తిరిగి గోవిందాపురం వెళ్లిపోవాలనుకుంటుంది. దాసు ఆమెని తనతో కలకత్తాలో జరగబోతున్న బ్రహ్మ సమాజ ఉత్సవాలకు రమ్మని, ఆ తరువాత వెళ్లవచ్చని సలహా ఇస్తాడు. ఆమె అతనితో కలిసి కలకత్తా వెళుతుంది. ధర్మారావు కూడా వారితో వస్తాడు. అక్కడ ఆమె రామారావుని కలుస్తుంది మళ్లీ. వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరుగుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇంకా అభిమానించుకుంటూనే వున్నారని ఇద్దరికీ అర్ధమౌతుంది. ఐతే ధర్మారావు చెప్పిన ఒక గందరగోళపు అబద్ధం వల్ల ఆమె ధర్మారావుని చేసుకోడానికి అంగీకరించినట్లు రామారావు అనుకొని శశిరేఖ తననింకో మారు మోసం చేస్తున్నట్లు భావిస్తాడు. రామారావే కాదు అందరూ అదే నమ్ముతారు. అందరూ నమ్మారు కాబట్టి ధర్మారావుని పెళ్లి చేసుకోమని దాసు ఆమెని అభ్యర్ధిస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది. అందరూ అపార్ధం చేసుకోవడమనేది తనకి సంబంధం లేని విషయంగా భావిస్తుంది. తనకి లోక భయం, సంఘ భయం లేదంటుంది. శశిరేఖ రామారావుతో అసలు విషయం చెబుతుంది. ఆ సందర్భంలో వారిద్దరినీ మాట్లాడనివ్వకుండా ధర్మారావు వుంటాడు. ఇదివరకు కాంభొట్లు అడ్డం పడ్డట్లే ఇప్పుడు ధర్మారావు! ఆమె తన అధికారం కింద వున్నట్లు, ఆ అధికారాన్ని అతనికి దాసు కలగజేసినట్లు వాదిస్తాడు. రామారావు అతన్ని బలవంతంగా పంపేస్తాడు. తనని ఒంటరిగా వదలొద్దని, తనతో పాటే వుంచుకోమని ప్రాధేపడుతుంది. ఐనా రామారావు అది లోక నీతికి, ధర్మానికి విరుద్ధమని ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు.

మరుసటి రోజు శశిరేఖ రామారావు గదికి వెళుతుంది. ఇద్దరికీ మళ్లీ వివాహం గురించి పూర్వపు సంవాదమే జరుగుతుంది. ఈ సారి శశిరేఖ వివాహానికి ఒప్పుకోదు. ఈ పాటికి ఆమె అభిప్రాయాలు ఎంతో రాటుదేలి వున్నాయి. రామారావు సంఘ బద్ధుడు. అంతేకాక ప్రేమ అనేది జీవిత భాగస్వామి ఒక్కరి మీదనే కలగాలని భావించే వాడు. శశిరేఖ ఇందుకు విరుద్ధం. వారి మధ్య ధర్మం, పవిత్రత, లోక నీతి, ప్రేమ వంటి విషయాల మీద తీవ్రమైన భావోద్వేగ స్థాయిలో ఘర్షణ జరుగుతుంది. రామారావు ఆమెని విడిచి వెళ్లడానికి సమాయిత్తమవుతాడు. శశిరేఖ నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురవుతుంది. ఆ సమయంలో తనకి ఎందుకో గుండెల్లో నొప్పి వస్తుందని, తనని విడిచి వెళ్లొద్దని అంటుంది. ఆమె వేడుకోలుని ఆవేశంలో వున్న రామారావు పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

మరునాడు రైల్లో వున్న రామారావులో పశ్చాత్తాపం కలుగుతుంది. శశిరేఖ తనని మోసం చేసిందనుకుంటాడే కానీ పెళ్లి కాక మునుపే తనతో వుండనిమ్మని ఎంత ప్రాధేయపడ్డా వినకుండా తానామెని దూరంగా వుంచానని, తన పవిత్రత నిరూపణ కోసం తానామెకి నరకం చూపించానని బాధ పడతాడు. ఎక్కిన రైలు దిగి మళ్లీ కలకత్తా తిరిగి వస్తాడు. ఆమె నవజీవన దాసు దగ్గర వుందనుకొని వెళతాడు. కానీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని వుంటుందని భయపడతాడు. తనది పాపానికి జడిసే స్వార్ధమని, దాన్ని మించిన పాపం ఈ లోకంలో లేదని, పవిత్రత అనే పుణ్యనామంతో తన స్వార్ధాన్ని కప్పి పుచ్చుకున్నానని బాధ పడతాడు. మనుషుల ఘోర పాతకాలను, మహా నీచ కృత్రిమాలను, దుష్ట ఆవేశాలను, అధమమైన బానిసత్వాన్ని కప్పి పుచ్చడం కోసం ఎన్ని శాస్త్రాలు పని చేస్తున్నాయో అని ఖేద పడతాడు. ఒకవేళ ఆమె తన గదిలోనే ఇంకా వున్నదా అని అనుమానమొచ్చి తన గదికే వెళ్లి ఆమెని చూస్తాడు. అక్కడ ఏం జరిగిందనేది నవలకి పతాక సన్నివేశం. అది మీరే స్వయంగా చదివితే బాగుంటుంది.

“శశిరేఖ” నవలని అనేక కోణాల్లో చూడొచ్చు. ఈ నవల రాసిన కథా కాలం, నవలలోని కథాంశం, పాత్రల వ్యక్తిత్వ చిత్రణ, రచనా శిల్పం, నవలలో ప్రతిఫలించిన ఆ కాలం నాటి సంఘం, సాంఘీకోద్యమాలు, నవలలో ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ విలువలు… ఇలా! శశిరేఖ నవలని చలం 102 సంవత్సరాల కాలం క్రితం రాశాడని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఆలోచనలు, అవగాహన, లోతు అనితర సాధ్యం. మనసు పెట్టి ఆలోచిస్తే చలం మనల్ని నిర్ఘాంతపరుస్తాడు. ఇంక ఆ కాలంలో ఆయన నిజంగా సమాజానికో సాంస్కృతిక దిగ్భ్రాంతి! ఆ కాలంలో స్త్రీ విద్య అతి తక్కువ. బాల్య వివాహాలు అతి సాధారణమైన కాలం. అవి కనీసం చట్ట వ్యతిరేకం కూడా కాదు. ఆంగ్లేయుల నాగరికతని, ఆధునికతని భారతీయులు అందుకుంటున్న కాలం. ఆ కాలం స్వాతంత్రోద్యమం బలపడుతున్న కాలం. బ్రహ్మ సమాజం వంటి సంస్కరణోద్యమాలకు పూనుకున్నా వాటికి ఎన్నో పరిమితులున్నాయి. కులం విషయంలో ఎంతో కొంత ముందడుగు వేసినా, స్త్రీ విద్యని ప్రోత్సహించినా, బాల్య వివాహాల రద్దుకై గొంతెత్తినా కుటుంబ పరిధిలో స్త్రీల విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ వారి పరిమితులనేకం. చలం ఈ నవలలో ఆ పరిమితుల్ని శక్తిమంతంగా ఎండగట్టాడు. ఏ ఆశా లేని కాలంలో స్త్రీలు తమ శక్తిని తామే గుర్తెరగాలని సాహసోపేతమైన పాత్రల్ని సృష్ఠించాడు. “చావుకి పెడితే తప్ప లంఖణానికి దిగని” వ్యవస్థలో చలం తన భావాలతో సాంప్రదాయ వాదులలో వణుకు పుట్టించాడు. ఆ సమయానికి చలం వంటి వాడు మరొకడు లేడు. ఆయనొఖ్ఖడే!

చాలా చిన్న పాత్రల నుండి శశిరేఖ వరకు చలం ఎంతో జాగ్రత్తగా సహజంగా పాత్ర చిత్రణ చేశాడు. ఉదాహరణకి ఏ సంఘ సంస్కరణోద్యమాలతో సంబంధం లేని పొరుగింటి కాంభొట్లు శశిరేఖ మీద తనకు ఎలా అధికారముందనుకుంటాడో, బ్రహ్మ సమాజ కార్యకర్త అయిన ధర్మారావు కూడా అచ్చు అలానే ఆమె మీద తనకి అధికారం వుందంటాడు. స్త్రీ మీద నైతికాధికారం, ధర్మాధికారం పురుషుడికి వుందని వాదిస్తూ ఆమె బైటకి వెళ్లడాన్ని అడ్డుకుంటాడు.

ఈ నవలలో నాలుగు పురుష పాత్రలు ముఖ్యమైనవి వుంటాయి. ఆ నలుగురు కృష్ణుడు, సుందర్రావు, రామారావు, నవజీవన దాసు. కృష్ణుడు సాధారణమైన, స్వచ్ఛమైన ప్రేమికుడు. అతనికి శశిరేఖని అలా చూస్తూ గడిపేస్తే చాలు. కానీ బద్ధకస్తుడు. జీవిక కోసం ఏమీ చేయడు. ఆపేసిన వైద్య విద్యని ఎంత పోరినా పూర్తి చేయడు. ఇంటి పనిలో శశిరేఖకి ఏమీ సహాయం చేయడు. సుందర్రావు అంతరంగం ఓ మహా కల్లోల హింసాత్మకం. దాని నుండి ఉపశమనాన్ని పొందడానికి అతను కళని, జ్ఞానాన్ని ఆశ్రయిస్తాడు. అయితే అతని కళ కానీ జ్ఞానం కానీ అతని ప్రవర్తనా సంస్కారాన్ని ప్రభావితం చేయవు. వ్యక్తిత్వపరంగా అతను రెండుగా చీలీన మనిషి. అతని హృదయంలో ప్రేమ కంటే కేవలం కామానికే ప్రధానం. అందుకోసం అతను అవకాశవాదిలా, శాడిస్టుగా ప్రవర్తిస్తుంటాడు. రామారావు మంచివాడు, సంస్కార హృదయుడే కానీ అతని బుద్ధి లోకామోదానికి బద్ధమై వుంటుంది. అతను పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఎంత ధైర్యవంతుడైనా శశిరేఖ పట్ల ఆకర్షణకి, లోక రీతికి మధ్య నలిగిపోతూ వుంటాడు. నవజీవన దాసు ఉదాత్తతకి, మానవీయతకి, ప్రశాంత జీవనానికి ప్రతిరూపం. ఆయన పాత్ర ద్వారా ఆ నాటి బ్రహ్మ సమాజ కార్యకలాపాల్ని చలం మనకి పరిచయం చేస్తాడు.

శశిరేఖని మామూలు లోకం ఆమోదించిన నైతిక ప్రమాణాలతో కొలవడం, సాధారణ లాభనష్టాల తూకపు రాళ్లతో తూయడం సరైంది కాదు. ఆమె ఒక అసాధారాణ ఆత్మ చైతన్యానికి ప్రతీక. జీవితానుభవాలను బట్టి పాప పుణ్యాలుండవని, స్త్రీని నిలబెట్టేది ఆమె ప్రేమమయ వ్యక్తిత్వమేనని, స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధం కంటే ప్రేమ సంబంధమే ముఖ్యమని, ప్రేమ అనేది ప్రకృతి, మానవ ప్రవృత్తి సంబంధిత విషయమని, అది ఈ విశ్వంలా అనంతమైనదని, లోకం ఏర్పరుచుకున్న నీతి, ధర్మం అన్నీ కృతకమైనవని, ఏ లోకనీతి లేదా ధర్మం పురుషుల్ని వేధించవని, అలాంటప్పుడు స్త్రీ మాత్రమే వాటికి బలి పశువులెందుకు కావాలనే ప్రశ్నల్ని శశిరేఖ వేస్తుంది. ఏ దశలో చూసినా అప్పటికి తన అవగాహన, జ్ఞానం మేరకు నిజాయితీగా, ధైర్యంగా వుండే మనిషామె. ఆమెది తెరిచిన హృదయం. కృష్ణుడితో స్వచ్ఛమైన స్నేహపూర్వక ప్రేమని, సుందర్రావుతో కళాత్మకమైన మోహపూరిత ప్రేమని, రామారావుతో ఆత్మీయతతో భరోసానివ్వగల ప్రేమని ఆమె అనుభవిస్తుంది. ఆమెకు తను చేసే పనుల పట్ల అపరాధ భావం లేదు. తప్పని భావించిన ఏ పనీ ఆమె చేయదు. ఆమె ఎంతైనా ఘర్షణ పడుతుందే కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు. తెలుగు సాహిత్యంలో అరుదైన అపురూప సృష్ఠి శశిరేఖ.

చదవండి శశిరేఖని. అసాధారణమైన కవితాత్మక శైలిలో తాత్వికంగా, నైతికంగా ఢీకొనే బలమైన పాత్రల్ని సృష్ఠిస్తూ చలం చేసిన అసాధారణ సాహితీ విన్యాసం శశిరేఖ. మీ హృదయం తడిసిపోవడం ఖాయం.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

4 thoughts on “చలం అచంచలం : శశిరేఖ!

  1. Though I haven’t read SHASHIREKHA by Chalam garu, Aranyakrishna gari review gave me an excellent insight of the Novel. Chalam garu was a genious and thanks to Aranya krishna garu for this beautifil writeup

  2. 💐
    మా సత్యం
    అరణ్య కృష్ణ గారు తనదైన శైలిలో తాత్విక పరమైన కోణంలో ఎవరి ప్రభావం లేకుండా చలం రాసిన శశిరేఖ పై విశ్లేషణ తీరు ప్రశంసనీయం.

  3. Excellent, ఇది చదువుతూ ఉంటే మళ్లీ ఓ సారి శశి రేఖ ను చద్వాలి అనిపిస్తుంది.

Leave a Reply