చలం అచంచలం: వ్యక్తిత్వ స్వేచ్ఛా ‘మైదానం’లో రాజేశ్వరి!

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-5)

‘మైదానం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1927లో రాశాడు. చలం సాహిత్యం మొత్తంలో అత్యంత ప్రశంసించబడిన, ఖండించబడిన, విమర్శించబడిన, వివాదాస్పదమైన, చర్చించబడిన నవల ‘మైదానం’. చలాన్ని నెగెటివ్ గా టార్గెట్ చేసేవారందరూ తమకి ‘మైదానం’ ఓ ఆయుధం అనుకుంటారు. 97 సంవత్సరాల క్రితం రాసిన నవల ఆ నాడే కాదు ఈ నాటికీ కేవలం ఓ సంచలనం కాదు, అదో సామాజిక కల్లోలం. ఓ సాహిత్య బడబాగ్ని. అప్పుడు చలం ఇచ్చిన షాక్ కి ఇప్పటికీ ఇంకా పెడబొబ్బలూ, తీవ్రాతి తీవ్ర శాపాలు పెడుతూ ఆడిపోసుకునే సాంప్రదాయక ఆక్రోశాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ నవల నుండే చలం సాహిత్యం మర్యాదస్తుల కొంపల్లోని స్త్రీలు దిండ్ల కింద పెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ‘మైదానం’ ఈ సమాజానికి అంత ప్రమాదకరంగా అనిపించింది? అప్పట్లో సాహిత్యం తప్ప మరో కాలక్షేపం లేని విశ్రాంతి వర్గాలకు చెందిన అక్షరాస్యుల్ని మాత్రమే కాదు విద్య అందరికీ బేషరుతుగా లభ్యమౌతున్న వర్తమానంలో కూడా సమాజంలోని అన్ని కులాలలో కొనసాగుతున్న స్త్రీల అణచివేతకి సంబంధించిన ప్రతి మతపర సంప్రదాయాన్ని, ఆచారాన్ని ఆ నాడే నిగ్గ దీసి అడిగినవాడు చలం. ఈ ఎఫర్ట్ ‘మైదానం’లో ఎక్కువగా కనిపిస్తుంది. చలం సాహిత్యంలోకెల్లా మైదానం నవల ఒక మందు పాతర వంటిది! హిందూ కుటుంబ వ్యవస్థలోని న్యూనతరమైన స్త్రీల జీవితాన్ని చలం తన నాయికల ద్వారా ఎత్తి చూపాడు. వందేళ్ల క్రితమే కుటుంబ వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి అక్కడ తిష్ఠ వేసున్న అసమానతల్ని, కృత్రిమత్వాన్ని, ప్రేమ రాహిత్యాన్ని ఎండగట్టాడు. అంతే కాదు ఎంతో పటిష్ఠమనుకున్న భారతీయ కుటుంబ వ్యవస్థ ఎలా బీటలు వారబోతున్నదో కూడా సూచించాడు. సంప్రదాయ హిందూ కుటుంబ నిర్మాణంలోని డొల్లతనాన్ని, ప్రేమ రాహిత్యాన్ని, కృత్రిమత్వాన్ని, యాంత్రికతని హిపోక్రసీని కడిగి పడేశాడు చలం. విరుచుకు పడ్డాడు చలం.

ఈ నవలకి ‘మైదానం’ అనే పేరుని పెట్టడంలోనే చలం తాత్వికంగా గొప్ప ప్రతీకాత్మకతని ప్రదర్శించాడు. ‘మైదానం’ అంటే విశాలమైన బహిరంగ ప్రదేశం. అన్ని దిక్కులూ కనిపిస్తాయి. పైన ఆకాశం, చుట్టూ ఏదుంటే ఆ ప్రకృతి మొత్తం అవిచ్ఛిన్నంగా కనిపిస్తుంది. ఇరుకు గదులలో ఉక్కపోత అనుభవాల నుండి పైన ఆకాశం, కింద భూమిని కలిగి వుండి ఆరుబైలు చల్లగాలి హాయిగా తగిలే ‘మైదానం’ స్వేచ్ఛకి ప్రతీక. ఇరుకు గదుల ఇల్లు కట్టడికి, ‘మైదానం’ అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. చలం రాసిన అన్ని నవలల్లోకి ప్రేమ తాలూకు భావావేశం, ప్రేమికుల భావోద్వేగాల్ని ప్రభావితం చేసే ప్రకృతి గురించి కవితాత్మకమైన వర్ణనని ఈ నవలలోనే ఎక్కువగా చూడొచ్చు. 80 పేజీల ఈ చిన్న నవలలో ప్రతి అక్షరం, పదం, వాక్యం చలం రక్తాన్ని తోడుకొని బైట పడ్డట్లుగా అనిపిస్తుంది.

కథ:

సుఖవంతమైన, విలాసవంతమైన నాలుగ్గోడల కుటుంబం నుండి విశాలమైన ఆరుబయలు మైదానం వరకు జరిగిన తన జీవిత ప్రయాణాన్ని, ప్రేమ తాలూకు భావోద్వేగ అనుభవాల్ని రాజేశ్వరి ఓ స్నేహితురాలికి చెప్పిన కథనమే ఈ నవల. ఇది రాజేశ్వరి ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్)లో చెప్పిన కథనం. “లేచిపోయినా’నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంగా వుంటుంది” అనే షాకింగ్ వాక్యంతో మొదలయ్యే నవల ఆరంభంలోనే ఒక గంభీర వాతావరణం సృష్టిస్తుంది.

రాజేశ్వరి ఒక పేరున్న ప్లీడర్ భార్య. ఆమె భర్తకి ఇందులో చలం ఏ పేరూ ఇవ్వలేదు. రాజేశ్వరి చేసిన కొన్ని ప్రస్తావనలలో తప్ప అసలు ఆయన నవలలో కనబడడు. “లేచి పోవడానికి నీ భర్త లోపమేమన్నా వుందా?” అని అడిగిన ఏ స్నేహితురాలికి తన జీవితం గురించి, ప్రేమానుభవాల గురించి రాజేశ్వరి చెప్పుకుంటుందో ఆ స్నేహితురాలి పేరు కూడా చలం చెప్పడు. ఆమె కూడా నవలలో ఎక్కడా రాదు. ఇది చలం రచనా శైలీ చమత్కృతి అనుకోవచ్చు. తన భర్త కోసం వచ్చిన ఓ క్లయంట్ అమీర్ తన మోహావేశ తీవ్రతతో ఆమెని ఆకట్టుకుంటాడు. అతని చొరవ, ధైర్యం, పురుషావేశం ఆమెని అబ్బుర పరుస్తుంది. అప్పటివరకు తనలో తనకే తెలియకుండా అణగారి వున్న ఇంద్రియ సంచలనం ఆమెకి అనుభవమవుతుంది. ఆమె ఒక స్త్రీగా అమీర్ స్పర్శలో పులకించి పోతుంది. అమీర్ ఆమెని తనతో వచ్చేయమంటాడు. ఆమె అంగీకరించి అతనితో వెళ్లిపోతుంది. అతనితో వెళ్లిపోవడాన్ని ఆమె ఒక అద్భుతమైన జీవితావకాశంగానే భావిస్తుంది.

అమీర్ ఆమెని నైజాం తీసుకెళ్లిపోతాడు. వాళ్లు కాపురం పెట్టిన స్థలం ఒక మైదానం. చుట్టూ కొండలు, చింత చెట్లు, పైన అవిచ్ఛిన్న ఆకాశంతో ఆ ప్రాంతం ఆమెకి అద్భుతంగా అనిపిస్తుంది. ఊరికి, వారి గుడిసెకి మధ్య ఒక పెద్ద చింత తోట వుంది. వారి గుడిసె చుట్టూ ఏమీ వుండవు. ఒక అరమైలు దూరంలో పెద్ద కొండ, దాని మీద శిధిలమైన కోట వుంది. ఆ గుడిసె పక్కన చిన్న యేరు వుంటుంది. దాన్ని చూస్తే ఎవరితో మాట్లాడక ఇంట్లో పని మీద యెప్పుడూ తిరిగే తన అమ్మ జ్ఞాపకం వస్తుందంటుంది రాజేశ్వరి. ఆ ప్రాంతం గురించి చెబుతూ “ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్లే వుంటుంది. వాన కురిసినా శుభ్రమైన కొండల్నీ, నేలనీ ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని చినుకులు పడితే కడుపుతో వున్న స్త్రీ వలె నా యేరు నిండిపోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకొని తెల్లవయేవి.” అంటుంది. ఆ విశాల ఏకాంత వాతావరణంలో ప్రేమతో కూడిన శృంగారాన్ని వారు స్వేచ్ఛగా అనుభవిస్తారు. తన భర్తతో గడిపిన జీవితానికి పూర్తి భిన్నంగా ఎక్కువ తక్కువలు లేకుండా ఆమె అమీర్తో వుంటుంది. తన గత కాలపు మడి, తడి, పట్టు చీరలు, విలాసం, బంగారు ఆభరణాల వైభోగం అనేది లేకుండా అతి తక్కువ దుస్తులతో ప్రకృతికి దగ్గరగానే కాదు అసలు ప్రకృతిలో భాగమై ఆమె తన జీవితాన్ని, ప్రాయాన్ని పండగ చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి వెన్నెల రాత్రి యేటి నీటిలో స్నానాలు చేయడం, వడ్డున పరిగెత్తి ఆడుకోవడం, కలిసి ఒకే మూకుడులో భోంచేయడం… ఇలా జీవితం వస్తువుల పరంగా అతి సరళంగానూ, అనుభవం తాలూకు ఆనందంతో సంపద్వంతంగానూ గడుస్తుంటుంది వారికి.

ఒకరోజు ఆమె ఊరి నుండి రాజేశ్వరి మామయ్య ఎలాగో ఆమె చిరునామా పట్టుకొని వస్తాడు. ఆమెని వచ్చేయమంటాడు. వారిద్దరిదీ పశు కామమని నిందిస్తాడు. ఆమె తన సుఖం తాను చూసుకున్నదని, భర్తని, కుటుంబాన్ని, తల్లినీ పట్టించుకోలేదనీ దెప్పుతాడు. అయితే ఆమె తానీ కొత్త ప్రదేశంలో అమీర్ సాంగత్యంలో ఎంత సంతోషంగా బతుకుతున్నదో చెబుతుంది. ఆమె తన “గత కాలపు నరకం నుంచి, అల్పత్వం నుంచి, క్షుద్రత్వం నుంచి ఒక్క మంత్రంతో, ఒక్క బలమైన వూపుతో ఈ సుందర లోకంలోకి లాక్కొచ్చిన” అమీర్ పట్ల కృతజ్ఞురాలై వుంటుంది. రాజేశ్వరిలోని ‘కన్విక్షన్ ‘ ఆమె మామయ్యకి బోధపడదు. ఇదిలా వుండగా అమీర్ దగ్గరగా వున్న ఊరిలోని ఓ దూదేకుల యువతిపై మోజు పడతాడు. రాజేశ్వరి ముందు అతలాకుతలమైనప్పటికీ తనని స్వర్గానికి పరిచయం చేసిన, సంతోషంగా జీవించటమంటే ఏమిటో నేర్పిన అమీర్ కోసం ఆమె దగ్గరకు వెళ్లి ఆమెని ఒప్పించి తీసుకొస్తుంది. ఈ సందర్భంగా ఆమె “నా దిగులంతా పోయింది. అమీర్ కి ఇదివరకు ఇచ్చిన ఆనందం – అది నాకూ ఆనందమే కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చీతని ఆనందంలో నేను ఆనంద పడబోతున్నాను” అనుకుంటుంది. కానీ ఆ బంధం ఆమె ఊహించినట్లుగానే ఎక్కువకాలం నిలవదు. అమీర్ ద్వారా మీరా అనే టీనేజర్ ఆమె జీవితంలోకి వస్తాడు. దూదేకుల యువతికి, అమీర్ కి మధ్య మీరానే రాయబారం చేసేవాడు. మీరా అంటే రాజేశ్వరి ఎంతో అభిమానం పెంచుకుంటుంది. స్వంత తమ్ముడిగా భావిస్తుంది. అతను ‘దీదీ’ అని పిలుస్తుంటాడు ఆమెని.

రాజేశ్వరి గర్భం దాలుస్తుంది. సంతోషిస్తాడనుకున్న అమీర్ ఆమె గర్భం చూసి చిరాకు పడతాడు. గర్భం తీసేయించుకోమంటాడు. రాజేశ్వరి అందుకు అంగీకరించదు. ఒక దక్షిణాది చీర తీసుకొచ్చి ఆమెకిచ్చి పొట్ట తనకి కనబడకుండా కట్టుకోమంటాడు. ఆమె గర్భం విషయమై వాళ్లిద్దరూ పోట్లాడుకున్నప్పుడు అమీర్ ఆమెని కాలెత్తి తంతాడు. ఐనా అతని మీద ఆమెకి ప్రేమ చావదు. అతనికి చెప్పలేక సతమతమవుతుందే తప్ప అతన్ని ద్వేషించలేదు. తనని కాలెత్తి తన్నిన అమీర్ కాలుని ముద్దాడాలనిపిస్తుందని అంటుంది. ఆమె అంతగా తన సమస్త అస్తిత్వాన్ని అతనికి ధారాదత్తం చేసేసింది. చివరికి అతని దాష్టీకాన్ని కూడా ఆరాధించే స్థితికి వచ్చింది. కానీ తన కడుపులోని పిండం తీసే విషయంలో మాత్రం అతనితో విభేదించింది. ఎంత చెప్పినా రాజేశ్వరి వినకపోవడంతో అమీర్ ఆమెని మీరా సంరక్షణలో వదిలి ఆర్నెల్ల తరువాత వస్తానని వెళ్లిపోతాడు.

అమీర్ లేనప్పుడు ఆమెని మీరా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తన పట్ల అతను తీసుకునే సంరక్షణ రాజేశ్వరిని కదిలిస్తుంది. అమీర్ కోసం రాజేశ్వరి తన పంతం వీడి ఒక మంత్రసాని ద్వారా మొరటు పద్ధతుల్లో అబార్షన్ చేయించుకుంటుంది. (అప్పటి రోజుల్లో అంతే కదా!) ఆ సమయంలో మీరా ఆమెని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ అబార్షన్ ఆమెని శారీరికంగా, మానసికంగా ఎంతో కృంగతీస్తుంది. తన కడుపులోని బిడ్డని నిర్మూలిస్తున్నప్పుడు ఎంతో క్షోభ అనుభవిస్తుంది. మొరటు పద్ధతుల ద్వారా అబార్షన్ అనే ప్రక్రియతో ఆమె శారీరికంగా నరకం అనుభవించాల్సి వస్తుంది. అమీర్ లేడని తెలుసుకున్న ఊరిలో ఒకడు అబార్షన్ చేయించుకొని నెత్తుటి ముద్దలా వున్న ఆమె మీదకి ఒక రాత్రి వేళ దాడి చేస్తాడు. మీరా ప్రాణాలకి తెగించి అడ్డం పడతాడు. అతన్ని లాక్కొని వెళ్లిపోతాడు ఆగంతకుడు. రాజేశ్వరి కదల్లేని స్థితిలో వుంటుంది. మీరా కోసం ఎంతో గాభరా పడుతుంది. దుఃఖిస్తుంది. ఆ ఆగంతకుడు మీరాని ఒక చెట్టుకి కట్టేసి వెళ్లిపోతాడు. ఎలాగో ఆ తాళ్లని కొరికి మీరా బైటపడి, ఆమె దగ్గరకు వచ్చేంత వరకు రాజేశ్వరి మీరాని కలవరిస్తూనే వుంటుంది. గర్భస్రావంతో బైట పడ్డ పిండాన్ని మీరా గుడ్డలో చూట్టి తీసుకెళ్లి దూరంగా పడేసి వస్తాడు. అమీర్ లేనప్పుడు మీరా తన పట్ల చూపించిన అభిమానం, ప్రేమ, ఆత్మీయత, సంరక్షణ, ఆమెని ప్రమాదం నుండి బైట పడేయడంలో చూపినా తెగువ, సాహసం రాజేశ్వరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తనని కష్టాలకి ఒప్పచెప్పేసి వెళ్లిపోయిన అమీర్ పట్ల ఆమెకి ప్రేమ, మోహం సజీవంగానే వున్నా ఒక అనివార్యమైన పోలికని మీరాకి, అమీర్ కి మధ్య ఆమె వెతుక్కుంటుంది. సరిగ్గా ఇక్కడే ఆమె తన జీవన్మరణ పోరాట సందర్భంలో తన వెన్నంటే వున్న మీరా పట్ల అప్పటికే వున్న వాత్సల్య భావోద్వేగం అమీర్ పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమించేంతగా, దేన్నీ లెక్క చేయనంతగా మీరా సంతోషం కోసం ఏమైనా చేయాలనే ఒక తిరుగులేని కృతజ్ఞతాపూర్వక అనుబంధం ఆమె పెంచుకుంటుంది. ఆ అసాధారణ భావోద్వేగ బంధానికి అవసరమైన బలమైన పరిస్థితుల్ని చలం సృష్టిస్తాడు.

రాజేశ్వరికి గర్భస్రావం అయిన విషయం తెలుసుకున్న అమీర్ మళ్లీ తిరిగి వస్తాడు. కానీ వాతావరణం ఆహ్లాదంగా వుండదు. మీరాతో చనువుని అమీర్ సహించలేక పోతాడు. మీరా సంకోచించకుండా ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అమీర్ అసూయని రాజేశ్వరి పట్టించుకోదు. ఒక రాత్రి లోయలో జారి పడ్డ మీరాని అమీర్ రక్షిస్తాడు. తన పట్ల మీరా ఇష్టాన్ని, కాంక్షని గౌరవించిన రాజేశ్వరి అతనితో శారీరికంగా కూడా కలుస్తుంది. అది చూసిన అమీర్ మీరాని కత్తితో పొడిచి చంపబోతాడు. రాజేశ్వరి అడ్డం పడుతుంది. కొద్దిసేపు గందరగోళం. తెప్పరిల్లి చూసే సరికి అమీర్ కత్తిపోటుతో నేల కూలి వుంటాడు. అడ్డం పడుతున్న రాజేశ్వరిని ఏమీ చేయలేక అమీర్ తనని తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. కొద్దిసేపటికి అతను చనిపోతాడు. రాజేశ్వరి అతన్ని పొడిచిందని మీరా అనుకుంటాడు. రాజేశ్వరిని రక్షించడం కోసం తానే అమీర్ని హత్య చేశానని పోలీసులతో చెబుతాడు. మీరాని ఆ కేసు నుండి బైట పడేయటం కోసం రాజేశ్వరి తానే అమీర్ని చంపానని ప్రకటించడంతో నవల ముగుస్తుంది.

*

ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ఠమైన రెండు స్త్రీ పాత్రల్ని చెప్పమంటే నేను ‘కన్యాశుల్కం’లోని మధురవాణి, ‘మైదానం’లోని రాజేశ్వరిని చెబుతాను. రాజేశ్వరి చలం మానస పుత్రిక. పురుషుల హోదాల్ని పెంచే కృత్రిమ హంగులతో, అన్ని రకాల ఆస్తులతో పాటు స్త్రీ కూడా ఒక ఆస్తి అనే తరహాలో సాగే యాంత్రిక జీవితాలకి ప్రత్యామ్నాయంగా ఎంతటి సంతోష పూరిత భావోద్వేగ జీవితం గడపొచ్చో రాజేశ్వరి ద్వారా చలం ప్రతిపాదించాడేమో అనిపిస్తుంది. ఆయన నవల మొత్తం ఒక కసితో, ఉధృత భావుక ఉరవడితో, కొండచెరియలు విరిగిపడుతున్న చప్పుడుతో, హోరుగాలి జడివానలో పాఠకులు తడిసిపోయేలా ఈ నవల రాశాడు. ఐనా రాజేశ్వరిని ఒక పర్పస్ తో ఎంతో జాగ్రత్తగా రూపొందించాడు. ఆమె ద్వారా పశు కామానికి, స్త్రీ పురుషుల మధ్య సహజాతపరమైన మహత్తర మోహపూరిత ప్రేమకి మధ్య గల తేడాని గొప్పగా ఎస్టాబ్లిష్ చేశాడు. ప్రేమ ఎంతటి త్యాగ బలాన్ని, ధైర్యాన్ని, తెగువని సామాన్య వ్యక్తులకు కలిగిస్తుందో రాజేశ్వరి, మీరాల ద్వారా అర్ధమవుతుంది. కేవలం పురుషులు మాత్రమే తమకు నచ్చినప్పుడు ఆస్వాదిస్తూ స్త్రీల విషయానికి వస్తే మానవ సహజ వాంఛల్ని అల్పమైన భౌతిక విషయాలుగా మెట్ట వేదాంతంతోనో, పతివ్రతా ధర్మాల పేరుతోనో అణగదొక్కే వైఖరిని మొదటి నుండి చివరిదాకా ఎత్తి చూపాడు చలం. స్త్రీ ప్రేమ ఎంత గొప్పగా, మేజికల్గా వుండగలదో, ప్రకృతితో ఎంతగా పోటీపడుతూ జీవితాన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవచ్చో, నిజమైన జీవితానందం ఎంత నిరలంకార ప్రేమైక సౌందర్యంతో భాసిల్లవచ్చో రాజేశ్వరి ద్వారా చెప్పాడు.

రాజేశ్వరి భర్తని వదిలి, సంఘ కట్టుబాట్లని మట్టిలో కలిపేసి, నైతిక విలువల్ని భ్రష్టు పట్టించి అమీర్ తో వెళ్లిపోవడం ద్వారా ఏం సాధించింది, ఇంతా చేసి చివరికి నేరస్తురాలిగా మిగిలిపోయింది కదా అని ప్రశ్నిస్తారు చలం వ్యతిరేకులు. ఆమె సుఖపడిన దాఖలాలు లేవు, అన్నీ కష్టాలే కదా అని వాదిస్తారు వాళ్లు. రాజేశ్వరి ఏం సాధించింది అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఏదో సాధిద్దామని ఆమె అమీర్తో వెళ్లలేదు. ఆమె ప్రేమ రాహిత్యపు కృత్రిమ జీవితానికి ఆవల వైపు ఓ అద్భుత స్వర్గం వున్నదని నమ్మి వెళ్లింది. ఆమె అనుకున్న స్వర్గమంటే హంస తూలికా తల్పాలతో, వజ్ర వైఢూర్య ఆభరణాలతో పరిచారికలతో కూడిన స్థలం కాదు. “ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నం వలె, ఆ యెడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు.” అని తన తృప్తికరమైన జీవితం గురించి స్నేహితురాలితో అంటుంది. సుఖం అంటే ఏమిటనేది అసలు ప్రశ్న. అమీర్, రాజేశ్వరిలిద్దరూ అతి తక్కువ వస్తువులతో బతికారు. వారి ఆహారం, దుస్తులు చాలా తక్కువ. చేయాల్సిన పనులు కూడా తక్కువే. ఒక్క రోజు కాఫీ గంట ఆలశ్యమయితే గిలగిలలాడే రాజేశ్వరి మైదానం గుడిసెలో కాఫీ అనే విషయాన్నే మర్చిపోతుంది. రాళ్ల పొయ్యిలో చితుకులు వేసి ఇంత యెసరు పడేసి, ఏ గోంగూరో, ఉల్లిపాయో మిరపకాయ, ఉప్పు కారం వేసి నూరడంతో వారి వంట పూర్తయ్యేది. వున్న ఒకే ఒక్క మూకుడులో ఇద్దరూ కలిసి తినేవారు. ఆ అవిచ్ఛిన్న మైదానంలో అవిశ్రాంతంగా ఆనంద డోలికల్లో, స్వేచ్ఛా ప్రణయం చేసుకోడాన్ని మించిన సుఖమేమున్నది నిజానికి? వారిద్దరి మధ్య సంభోగం కామం కాదు. అది శృంగారం. కామం కేవలం శరీరానికి సంబంధించిన అవసరం తీర్చుకోవడం. శృంగారంలో ప్రేమ, మానసికోల్లాసం, సాంగత్య పరిమళాల్ని ఆస్వాదించడం, ఒకరి పట్ల మరొకరికి మోహం, భావావేశం, భాగస్వామి ఆనందం కోసం ఏదో చేయాలన్న తాపత్రయం….అన్నీ వుంటాయి. ఇందుకు విరుద్ధంగా నాలుగ్గోడల సంసారంలో జరిగేది కామోద్దీపితమైన వీర్య విసర్జన తప్ప మరేమీ కాదు. ఆ మైదానంలో అమీర్ ఎలా వుండేవాడని చెబుతూ “రాత్రులు అతను నన్ను కోరేప్పటి స్పర్శకీ, తక్కిన రోజలా నాతో ఆడుకునేప్పటి స్పర్శకీ స్పష్టమైన భేదం వుంది. సమయాలను బట్టి అమీర్ నా స్నేహితుడిగా, అన్నగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా, భర్తగా, ప్రియుడిగా, అధికారిగా మారేవాడు” అంటుంది రాజేశ్వరి.

తనకి అమీర్కి మధ్య వున్నది కేవలం కామం మాత్రమేనని అన్నప్పుడు రాజేశ్వరి ఒప్పుకోదు. అమీర్ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఆమె. అమీర్ మరో స్త్రీని ఇష్టపడుతున్నాడనుకున్నప్పుడు తనలో తాను ఎంతో ఘర్షణ పడి “మన బాధతో ఇంకొకరి ఆనందాన్ని కల్పించాలనే జ్ఞానం కన్నా గొప్ప ఆనందం లోకంలో లేదు అనిపించింది” అంటుంది. అతని కోసం ఆమె చేసిన అన్నింటికంటే పెద్ద త్యాగం గర్భస్రావం చేయించుకోవడం. అతని కోసం తన వారందరిని వదిలి వచ్చేసింది. ఇవేవీ కేవలం కామం తీర్చుకోవడం కోసం మాత్రమే చేసే త్యాగాలు కావు. కామమే అయితే అమీర్తో బైటకి రాక మునుపు కూడా ఆమె నిరభ్యంతరంగా తన ఇంట్లోనే అతనితో తీర్చుకునే అవకాశం పుష్కలంగా వుందంటుంది. “ప్రతి నిమిషమూ ఒకరికొకరికి కామవికారం కలగజేస్తో వుంటే, ఇరవై నాలుగు గంటలూ కలిసి జీవించగలమా? ప్రతి సంజ్ఞా, చూపు, కామ వికారంతో స్ఫురించటం, గాలి లేని ఇళ్లల్లోనూ, ఈగలు ముసిరే భోజనాల సావిళ్లలోనూ, పవిత్ర ప్రేమమయ సంసారాల్లోనూ! అంతేగానీ స్వచ్ఛమైన నీళ్లల్లోనూ ఎడార్లలోనూనా?” అంటుందామె. రాజేశ్వరి ఎక్కడా తనని తాను తక్కువగా చేసుకోదు. అలా మాట్లాడదు. ఆమె ఏం చేసినా తన వ్యక్తిత్వానికి విలువ ఇచ్చుకునే మాట్లాడుతుంది. అమీర్ దగ్గర అది పోగొటుకున్నట్లు కనిపించినా దాన్ని ఆమె పిరికితనంతోనో, బానిస బుద్ధితోనో వదులుకున్నట్లు కాకుండా అతని కోసం చేసిన త్యాగంగానే భావిస్తుంది.

రాజేశ్వరి హిందూ ఇస్లాం మతాలకు చెందిన పురుషాధిపత్య కుటుంబ వ్యవస్థల్ని ఎదుర్కొంటుంది. “తలంటి పోసుకొని, తల్లో మరువం, జాజిపువ్వులు పెట్టుకొని కొత్త సిల్కు చీరె కట్టుకొని దగ్గరకు వెడితే, కాయితాల్లో తల పెట్టుకొని ‘మొన్న నీ చేతికి పది రూపాయిల నోటిచ్చాను కదా, అది కావాలి. ఓ సారి తెచ్చి యియ్యి'” అన్నాడట రాజేశ్వరి మొగుడు. తన ఇంట్లో పచ్చడిలో ఇసిక పడ్డదనీ, అన్నం చిమిడిందనీ, పులుసు ఉడకలేదనీ తిట్లు-లేచి పోవడాలూ-విస్తరి మొహాన కొట్టడాలూ అనుభవించింది రాజేశ్వరి. ఇంక అమీర్ కూడా ఆమెని మానసికంగా, శారీరికంగా కష్టపెట్టినవాడే. ఐతే ఆమెకి అమీర్ పట్ల వున్న మోహం, అతని ధైర్యం, తెగింపు, ఒక పురుషుడిగా అతను ఆమె పట్ల ప్రదర్శించిన ఇష్టం ఆమెని త్యాగాలకు పురికొల్పేలా చేశాయి. అతను మరో స్త్రీని ఇష్టపడటం, కావాలనుకుంటే వివాహం చేసుకోగలగటం అనేది బహుశా అతని మతం అతనికి అధికారికంగానే ఇచ్చిన లైసెన్స్ వంటిదేనని భావించొచ్చు. దాని పట్ల అతనికి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ వుండదు. ఆ విషయంలో రాజేశ్వరి చూపించిన ఔదార్యాన్ని అతను గుర్తించడు కూడా. తన ఆనందం కోసం రాజేశ్వరి వుందనుకుంటాడు. రాజేశ్వరి గర్భం దాల్చినప్పుడు తీయించేసుకోమని నిర్బంధిస్తాడు. కొడతాడు. తన మాట వినకపోవడంతో ఆమెని వదిలేసిపోతాడు. తనని కష్ట కాలంలో ఆదుకున్న మీరాతో రాజేశ్వరి సన్నిహితం ఐనందుకు రగిలిపోతాడు. మీరాని చంపబోయి, అంత పనీ చేయలేక ఆత్మహత్య చేసుకుంటాడు. “తురక బిడ్డని. నిన్ను మరొకరితో పంచుకోగలనా?” అని మరణించే ముందు రాజేశ్వరితో అంటాడు. అతను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా అతను ఆమెకి ఓ హీరో, ఓ ‘మాచో’ పర్సనాలిటీ ఐన కారణంగా అతని పట్ల ఆమెకి వ్యతిరేక భావం కలగదు. ఆకర్షణ పోదు. కానీ అతని అసూయని, మూర్ఖత్వాన్ని లెక్క చేయకుండా ఆమె మీరాతో సన్నిహితంగానే వుంటుంది. రాజేశ్వరి ప్రేమ నిర్భయత్వం నుండి వచ్చినది.

మీరా వంటి వ్యక్తిని చలం మాత్రమే సాహిత్యంలోకి తీసుకు రాగలడనిపిస్తుంది. ఇంకా టీనేజిలోనే వున్న మీరా చూడటానికి ఎంత లేతగా వుంటాడో, ఎంత సున్నితంగా ప్రవర్తిస్తాడో అంత దృఢమైన మనసున్నవాడు. తన శక్తికి మించి ప్రాణాలకు తెగించి అతను రాజేశ్వరిని కాపాడి ఆమె ప్రేమకి పాత్రుడు కాగలుగుతాడు. అతని నిజాయితీ, సున్నితత్వం, దేనికీ వెరవనితనం, వెనకడుగేయని తత్వం అతనికి రాజేశ్వరి తనని తాను అర్పించుకునేలా చేస్తుంది. అతని సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే స్థితికి రాజేశ్వరి వస్తుంది. చివరికి రాజేశ్వరిని రక్షించడానికి అమీర్ని తానే హత్య చేశానని నింద వేసుకొని పోలీసులకు లొంగిపోతాడు కూడా. అతనో అసాధారణ ప్రేమికుడు. అతని వ్యక్తిత్వ విశిష్టతని రాజేశ్వరి గుర్తించింది కాబట్టే అమీర్ని లెక్క చేయదు. అతని లేలేత, అమాయకపు రూపాన్ని, పరిపక్వ ప్రవర్తనని, నిస్వార్ధతని, రాజేశ్వరి పట్ల మానవీయమైన అప్రోచ్ ని చలం అనేక చోట్ల ఎంతో గొప్పగా వర్ణిస్తాడు. అతని గురించి తన స్నేహితురాలికి చెబుతూ రాజేశ్వరి “వందల కొలది యేళ్లనించీ నీచమైన తలుపులు లేనటువంటి వాళ్లూ, సౌందర్యాన్నే ఆరాధించి దేహాన్నీ, ఆత్మనీ మెరుగు పెట్టి తేజస్సుతో నింపిన వాళ్లూ మీరాని కన్నట్లున్నారు. అట్లా సుందరమైన పటంలాగ, విగ్రహం వలె, ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడు గాని, సామాన్య మానవుల వలె పనికీ, వ్యవహారానికీ ఉపయోగపడవలసిన వాడుగా కనబడడు.” అంటుంది.

చలం ప్రేమ సిద్ధాంతం అమూర్తమైంది కాదు. అది మానవీయమైనది. మొత్తం మానవ సమాజం నాగరికమయ్యే ప్రాసెస్లో ఎప్పుడో వదిలేసి వచ్చి, ప్రస్తుతం లుప్తమై, భవిష్యత్తులో సాధించాల్సిన విలువగా ప్రేమని చలం భావిస్తున్నట్లనిపిస్తుంది. ప్రేమని, సౌందర్యాన్ని, సెక్సుని దైవంతో నిమిత్తం లేని ఆధ్యాత్మిక స్థాయిలో ఆలోచిస్తాడేమో చలం అనిపిస్తుంది. (మార్క్సిస్టు భౌతికవాద సిద్ధాంతం ప్రాచుర్యంలోకి రాని ఆ కాలంలో చలం, జిడ్డు కృష్ణమూర్తి వంటి రెబెల్స్ భావవాద పరిధిలోనే వ్యవస్థలోని అన్యాయపు మూలాల్ని ప్రశ్నించి, తాము స్వయంగా ఎదురుతిరిగి, తమ రచనల ద్వారా ఒక సాంస్కృతిక తిరుగుబాటుని ప్రేరేపించారేమో అనిపిస్తుంది.) ఈ నవల మొత్తంలోని భావోద్వేగంలో, వర్ణనల్లో ఈ ఆలోచనా స్రవంతి పుష్కలంగా కనిపిస్తుంది. చలం స్త్రీ పురుషుల కలయికని మనసుల, హృదయాల సంగమానికి ఒక ఉన్నత మార్గంగా భావించాడు. ఆ సంయోగం రాత్రిపూట నిద్రపోయే ముందు శరీరాల్ని దులపరించటంగా కాక మోహపు ప్రేమ వల్లనైనా లేదా ఒక మానవీయ స్పందనలు, అనుభూతుల వల్లనైనా స్త్రీ పురుషులు శారీరిక సంయోగంకి పూనుకుంటే అది ఎంత అద్భుతంగా వుంటుందో ఈ నవలలో రాజేశ్వరి అమీర్, మీరాలతో ఏర్పరుచుకున్న శారీరిక అనుబంధం ద్వారా చెప్పాడు. అలాగని చలం రాజేశ్వరి, అమీర్, మీరా పాత్రల్ని ఆదర్శవంతమైన పాత్రలుగా తీర్చిదిద్దాడని కాదు. వారిలోనూ లోపాలుంటాయి మనుషులుగా. కానీ చలం తన సాహిత్యం ద్వారా ఈ సమాజం యొక్క ద్వంద్వ విలువల మీద, భేషజాల మీద, అసహజ అలంకారిత కృత్రిమతల మీద, మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థలో నరనరాన పేరుకుపోయిన హిపోక్రసీ మీద యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధానికి అవసరమైన విధంగా తాను సృష్ఠించిన పాత్రల్ని సైనికులుగా తీర్చిదిద్దాడు. రాజేశ్వరినైనా, అమీర్నైనా, మీరానైనా సంప్రదాయవాదులు నైతిక కళ్లద్దాలతోనే చూసి జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. వివాహం లోపల ‘అనైతిక ‘ వ్యవహారాలు జరగవన్నట్లు, అందులో హింస లేనట్లు మాట్లాడతారు. అయితే ఇలా తీర్పులిచ్చేవారు… రాజేశ్వరిది వొట్టి పశుకామమని నిందించిన ఆమె మామయ్య రాజేశ్వరి పెళ్లి కాకముందు ఆమెని వేధించిన వాడే… అతను నీతులు పలకడం గురించి మాట్లాడరు. నిరంతరం డబ్బు సంపాదనలో పడి, కేసులు, క్లయంట్లు అంటూ భార్య ప్రేమని గుర్తించలేకుండా ఒక రాత్రి వేళ ఉద్రేకంతో తనని వాటేసుకున్న ఆమెని “పాడు కల వచ్చిందా? భయం వేసిందా? ఆంజనేయ దండకం చదువుకో” అని అటు తిరిగి పడుకునే రాజేశ్వరి మొగుడి యాంత్రిక ధోరణిని తప్పు పట్టరు. శృంగారాన్ని అల్పమైన భౌతిక విషయంగా కొట్టిపడేసే వారే కామంతో పిడచకట్టుకుపోయిన కళ్లతో స్త్రీల కోసం అర్రులు చాస్తుంటారనేది నిజం. “వేశ్యల ఎంగిలి రుచులు చవిచూసి కూడా కులం నిలుపుకునే నేర్పరితనం మీ శ్రోతీయులకు మాత్రమే చాతనవును” అని రాజేశ్వరి అన్న మాట నిజం. ఇలాంటివారే నైతిక తీర్పులిస్తారు మళ్లీ.

నిజానికి భారతీయులందరికీ స్త్రీ శారీరిక శీల పునాదుల మీద ఏర్పడిన కుటుంబ వ్యవస్థ ఒక సాంస్కృతిక వ్యసనం. అది ఎంతవరకు ఉంచాలో అంతవరకూ కాక దానికి అతిగా అలవాటుపడి, దాని బైట జీవితానికి భయపడి, దాన్ని వ్యక్తి ఉనికి సమస్తమూ ఆక్రమించేయడానికి అవకాశమిచ్చి, యాంత్రికతని, ఉక్కపోతతనాన్ని, హింసని, ప్రేమ రాహిత్యాన్ని మామూలు విషయాలుగా, కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన పదార్ధాలుగా ఈ నైతిక న్యాయమూర్తులు మాట్లాడుతుంటారు. నిజానికి మానవ సంబంధాలకు సంబంధించి, ప్రత్యేకించి స్త్రీ పురుష సంబంధాలలో ప్రత్యామ్నాయ విలువల కోసం ధైర్యంగా వ్యవహరించే రాజేశ్వరి వంటి నిజ జీవిత వ్యక్తులు, అలాంటి నిజ జీవిత వ్యక్తులకి సాహిత్యంలో ప్రాణ ప్రతిష్ఠ చేసే చలం వంటి రచయితలే ఈ సమాజానికి ఎప్పటికీ అవసరం. అందుకే వందేళ్లు అవుతున్నా చలం సాహిత్యానికి అంత రిలవెన్స్ వుంది నేటి పరిస్థితులకి.

ఇంక చలం రచనా శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక అసాధారణ కవితాత్మక నడక నవల మొత్తం పరుచుకొని వుంటుంది. సహజ మానవ భావోద్వేగాలకి భాషని ప్రదానం చేశాడు చలం ఈ రచనలో. ఎన్నెన్ని వర్ణనలు అసలు నిజంగా మన గుండెల్లో దూరి అక్కడ పరిమళాలు ఊదుతాయో!! వెన్నెలని, సెలయేటి నీటి చప్పుడుని, ఇసుకతిన్నెల వడ్డున రాజేశ్వరి, అమీర్ల స్వేచ్ఛా ప్రణయపు మాధుర్యాన్ని పటం కట్టి మన కళ్లముందుంచుతాడు చలం. కోట్ చేస్తూ పోతే సగం నవలని కోట్ చేయాల్సి వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎంత శక్తివంతమైనదో, అది ఎంతగా ప్రకృతి ప్రభావితమైనదో, మోహం ఎంత మహత్తరమైనదో అది ఎంత ఉత్తేజకరమైనదో చలం చెప్పినంత గొప్పగా చలానికు ముందు, ఆ తరువాత ఎవరూ చెప్పలేదని అనిపిస్తుంది.

చదవండి ఇరుకు గదుల ఇళ్ల నుండి వ్యక్తిత్వ స్వేచ్ఛా ‘మైదానం’ వరకు రాజేశ్వరి చేసిన ప్రయాణాన్ని. రాజేశ్వరే కనుక బతికుంటే ఇప్పుడామెకి సుమారుగా ఓ నూట పాతికేళ్ల వయసుండునేమో! కానీ ఇప్పటి కాలపు ఒక స్నేహితురాలు తన కథని చెప్పినట్లుగా వుంటుంది నవల మొత్తం. అంత తాజాదనం వుంది నవలలో.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

6 thoughts on “చలం అచంచలం: వ్యక్తిత్వ స్వేచ్ఛా ‘మైదానం’లో రాజేశ్వరి!

 1. మైదానం అంటే బహిరంగ ప్రదేశం అన్న అర్థమేకాకుండా “”మై”” అంటే దేహము.. దేహ దానము అన్న అర్థం లో కూడా వ్రాసినట్టు ఓ పండితుడి ఉవాచ.1972 లో Dr.బాలాంత్రపు రజనీకాంత రావు గారు చలం గారిని ఇంటర్వ్యూ చేసి నాలుగు భాగాలుగా ఆకాశవాణి విజయవాడ ద్వారా ప్రసారం చేశారు.మైదానం నవలపై చలం గారి అభిప్రాయాల్ని వారి స్వగొంతుకలో వినడం ఓ అనుభూతి👍మైదానం పై చలం గారి స్వాభిప్రాయానికి మీ అన్వయింపుకు తేడా ఉన్నప్పటికీ… వ్యాసం ఆకట్టుకుంది… జయహోలు మీకు👍👍👌👌👌💐💐💐💐

  1. ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ!

 2. మందుపాతర మైదానంలో పెట్టినా పేలింది ఇరుకు గుండెల్లోనే… ప్రపంచ గమనాల్ని శాసించిన అరిస్టాటిల్ సోక్రటీస్ లాంటి వాళ్ళకే బానిసత్వం తప్పని తట్టలేదు! రసిక ప్రియ, రమణుల్ని దిండ్ల కింద దాచుకు చదివిన వాళ్లకు వాళ్ల పడక గదుల్లో లాండ్ మైన్ పెట్టి తమాషా చూసిన వాడు చలం! బూజు ఇళ్ళలో బోర విరుచుకు తిరిగే ఈ మర్యాదస్తుల నిర్వీర్యుల పుంసత్వం పై చావు దెబ్బ తీసి ఇంటి గేట్లు పెంచి, ప్రహరీలు పెంచి, అమీర్ లు తొంగి చూడకుండా ఎంత జాగ్రత్త పడ్డా యేం ఉపయోగం లేదని చెప్పింది రాజేశ్వరి!
  బానిసలా వుంటా నీ స్వచ్ఛ మైన ప్రేమ నివ్వడం నేర్చుకో అని అడుగుతూనే వుంది స్త్రీ…
  వల్ల కాదు అని తేల్చాడు పురుషుడు!
  అయితే నా హృదయం మైదానం ఏం చేస్తావో చేసుకో అని సవాల్ విసిరింది…ఇంకా విసురుతూ మగాడి అహం మీద దెబ్బ కొడుతూనే వుంది…
  అదిగో ఈ మైదానం నేర్పిన కొత్త పాఠం ! ఒక స్త్రీ ఫెస్టో!
  యుగ ధర్మాలు మార్చడం అంటే మామూలు కాదు!
  ఒక కమ్యునిస్ట్ మానిఫెస్టో అంత దమ్ము కావాలి!
  అదొక 50 పేజీలైనా ఇదొక 80 పేజీలైనా వుద్దేశం ఒకటే !
  కళ్ళు బైర్లు కమ్మే నిజాల వైపు కన్నెత్తి చూసేలా చేయడం…వాటి వెలుగులకు కళ్ళు అలవాటు పడటానికి ఇంకో యుగం పట్టినా!

  మీరు మాత్రమే రాసే గొప్ప వ్యాసం అరణ్య కృష్ణ గారూ!
  అద్భుత విశ్లేషణ!Go ahead!

  1. ధన్యవాదాలు విజయకుమార్ గారూ మీ ఉద్వెగపూరిత స్పందనకు! ఐతే ‘నిర్వీర్యుల పుంసత్వం’ అనే పదాలు అవసరం లేదు.

 3. ఇంటర్ చదివే రోజుల్లో ఒక రసిక మిత్రుడు శృంగారం ఎక్కువ ఉందని చెబితే మైదానం చదివిన గుర్తు .అయితే అప్పటికే వీర రసిక నేస్తాలు రహస్య ప్రదేశాలలో స్ట్రాంగ్ డోస్ లో శృంగారం ఉన్న పత్రికలను చూపించేశారు (యవ్వనంలో సహజమే కదండీ ! ) కాబట్టి మైదానం అంతగా కిక్కివ్వ లేదు . మీ లోతైన విశ్లేషణ చదివిన తరువాత అప్పటి నా హృస్వ దృష్టి బోధపడుతూంది . మైదానాన్ని మీరు కలిగించిన స్పూర్తితో మళ్ళీ సమగ్ర దృష్టితో చదివి ఆకళింపు చేసుకుంటాను. ధన్యోస్మి కృష్ఞ గారూ🙏

 4. చలం రచన చదివి నట్లే ఉంది మీ శైలి కూడా!
  అద్బుతమైన విశ్లేషణ. మైదానం మీద ఎన్నో విశ్లేషణ లు వచ్చాయి. ఇప్పుడు మీరు రాసినది మైదానం చదువుతున్నట్లే ఉంది.
  చలం ఈ రచనలు చేయడంలో మార్క్సిజాన్ని అవపోసన పట్టిన వాడిగా కనిపిస్తాడు. అయితే ఆయన మార్క్సిస్ట్ కాదు అంటే నమ్మకం కలగదు. సంప్రదాయ కళ్లద్దాలతో చూసే వారికి ఇందులో బూతు తప్ప ఇంకేమి కనిపించదు. మైదానం అన్న మాటని విశాలమైన అర్దంలోనే చూడాలి. మానవ నాగరికత క్రమంలో స్వంత ఆస్తి, కుటుంబ వ్యవస్థ, స్వంత బిడ్డలు దాన్ననిసరించి వచ్చే వారసత్వం, కుల వ్యవస్థ స్త్రీ ని బానిసను చేసింది. ఈ చరిత్రంతా తెలియకుండానే చలం స్త్రీల పట్ల సహానుభూతి ప్రకటించి ఆమె స్వేచ్చ కోసం కలం పట్టడమే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదంతా ఆయన నేర్చుకొని వచ్చినట్లే అనిపిస్తుంది.

Leave a Reply