చరిత్ర పుటల్లో ఆఫ్ఘనిస్తాన్…

ఆఫ్ఘనిస్తాన్ చరిత్రని, రాజకీయ, సామాజిక పరిణామాలను పరిశీలించినప్పుడు ఆ దేశం తన ఉనికి కోసం నిరంతర రక్తతర్పణ కావిస్తూనే వుందని అర్థమవుతుంది. తెగల మధ్య అధికారం కోసం జరిగిన పోరాటాల నుంచీ గెలిచిన వాళ్ల సామ్రాజ్య స్థాపన, అక్కడి నుంచీ వివిధ చారిత్రక మలుపులతో ప్రస్తుత రాజకీయ పరిణామాలకు దారితీశాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పంతొమ్మిదో శతాబ్దం తొలి దశాబ్దాలలో అంటే 1823లో దురానీ రాజవంశ సామ్రాజ్య స్థాపకుడు అహ్మద్ షా దురానీ వారసులని గద్దెదించి బరక్జాయి వంశ సామ్రాజ్యాన్ని స్థాపించిన దోస్త్ మహమ్మద్ ఖాన్ అధికారంలోకి రావడం నుంచీ ఈ చరిత్రను మొదలుపెడదాం. (ఈ రెండు వంశాలూ కూడా ఒకే తెగకు సంబంధించినవే!) ఈ బరక్జాయి రాజవంశానికి చెందిన వారసులే 1978 వరకూ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో వివిధ రూపాల్లో తమ పరిపాలన కొనసాగించారు. అంటే దాదాపు శతాబ్దంన్నర కాలంపాటు వీరిదే ఆధిపత్యం. (దురానీ వంశస్తులు సడోజాయ్ వారసులు. వీరికి బరక్జాయి వంశస్తులు వజీర్లుగా వుండేవారు. సడోజాయ్ వారసుల నుంచీ అధికారాన్ని పొందినప్పుడు వారి మీద గౌరవంతోనే ‘షా’ అనే బిరుదుని కాకుండా ‘అమిర్’ అనే బిరుదుని ఉపయోగించారు. వీరిలో ఒక్క నాదిర్ షా మాత్రమే ‘షా’ బిరుదును ఉపయోగించారు.)

గ్రేట్ గేమ్: 1830ల ప్రాంతంలో మధ్య ఆసియాలో బ్రిటన్, జార్ రష్యా వలసరాజ్యాల విస్తరణ, వాటి ప్రభావ ప్రాంతాలు క్రమక్రమంగా ఒకదానికొకటి సమీపంగా వస్తుండటంతో ఈ రెండు మహాసామ్రాజ్యాల ఘర్షణలో ఆఫ్ఘనిస్తాన్‌ అనివార్యంగా పాల్గొనాల్సి వచ్చింది. దీనినే గ్రేట్ గేమ్ గా పిలుస్తారు. జారిస్ట్ రష్యా విస్తరణ నుంచీ తమ వలస ప్రాంతాలను (దేశ విభజనకు ముందున్న బ్రిటిష్ ఇండియాను) రక్షించుకోవటం కోసం బ్రిటన్ సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ ని విలీనం చేయడానికి ప్రయత్నించి తమ రెండు సామ్రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధక్రీడలోకి తీసుకువచ్చింది. ఈ రెండు వలస రాజ్యాధిపత్యాల మధ్య జరిగిన ఆ ‘గ్రేట్ గేమ్’ లో ఆఫ్ఘనిస్తాన్ నలిగిపోయింది. ఈ క్రమంలో హెరాత్ అనే ప్రాంతంలో వున్న తమ అద్భుతమైన చారిత్రక కట్టడాలని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ కట్టడాల్లో రాత్రిపూట ఉంచే దీపాల వల్ల రష్యన్లకు తమ ఆచూకీ తెలుస్తుందని బ్రిటిష్ వాళ్లు వాటిని కూల్చేశారు. ఇక్కడ హెరాత్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. రెండోసారి దోస్త్ మొహమ్మద్ పాలన సమయంలో(1845-1863) రష్యన్లు ఇరాన్ ‘షా’ పాలకులకు 1856లో హెరాత్ ను ఆక్రమించుకోవడానికి మద్దతు ఇచ్చారు. హెరాత్ లో ఇరాన్ ఆక్రమణను ఓడించడానికి బ్రిటీష్ వాళ్లు దోస్త్ మొహమ్మద్‌కు మద్దతు ఇచ్చి హెరాత్ ను విడిపించారు. హెరాత్ ఆఫ్ఘనిస్తాన్‌లో భాగంగా ఉంటుందని, ఇరాన్ దానిని తిరిగి ఆక్రమించడానికి ప్రయత్నించదని ఈ సమయంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్/బ్రిటిష్ మధ్య ఒక ఒప్పందం (హెరాత్ 1857 ఒప్పందం) కుదిరింది. ఈ సమయంలోనే, మినార్‌లు ధ్వంసం అయ్యాయి. ఇది రష్యన్లకు భారీ దెబ్బ. దీనికి ప్రతిఫలంగా దోస్త్ మొహమ్మద్ భారత ఉపఖండంలో 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు. (నిజానికి గిల్జాయిస్ తో సహా అనేక ఆఫ్ఘన్ తెగలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలకు మద్దతు ఇవ్వాలనుకున్నారు.) దోస్త్ మొహమ్మద్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ కోసం పిలుపునిస్తే పరిస్థితులు భిన్నంగా వుండేవి. తమకున్న పరిమిత వనరులతో పోరాడటమనేది బ్రిటిష్ వారికి కష్టమయ్యేది. అయితే బ్రిటిష్ వారు తిరిగి వచ్చి రెండవ, మూడవ బ్రిటిష్-ఆఫ్ఘన్ యుద్ధాలలో తన వారసులతోనే యుద్ధం చేస్తారని దోస్త్ మొహమ్మద్ ఊహించలేదు. 1838-42, 1878-80, 1919-21 సంవత్సరాలలో బ్రిటిష్-ఆఫ్ఘన్ ల మధ్య యుద్ధాలు జరిగాయి.

20వ శతాబ్దం ప్రారంభం నాటికి అప్పటి రాజైన అమిర్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ 1901లో చనిపోయాడు. ఇతని పరిపాలనా కాలం 1880-1901. ఇతని సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్, రష్యా ల మధ్య సరిహద్దుని నిర్ణయించారు.

(ఇది ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి రాజు, అహ్మద్ షా దురానీ నిర్ణయించినట్టుగానే ఉత్తరాన ‘అము’ నది(ఆక్సస్ నది)దగ్గర వుంటుంది. ఇక్కడే అహ్మద్ షా దురానీ ‘బుఖారా షా’ను ఓడించాడు.)

రెండవ బ్రిటిష్ -ఆఫ్ఘన్ ల మధ్య జరిగిన రెండో యుద్ధ ఫలితం దురంద్ లైన్. 1893 లో ఇక్కడ బ్రిటిష్ ఇండియా (తరువాత పాకిస్తాన్), ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజన జరిగింది. అమిర్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ దేశంలోని తెగల మధ్య వున్న అంతర్గత పోరు నుంచీ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గట్టి కృషిచేశాడు. ఈ క్రమంలో అత్యంత కఠినాత్ముడు, నియంత అని కూడా పేరుపడ్డాడు.

అమిర్ హబీబుల్లా ఖాన్ (1901-1919): తండ్రి తదనంతరం అమిర్ హబీబుల్లా ఖాన్ సింహాసనాన్ని అధిష్టించి పద్దెనిమిది సంవత్సరాల పాటు పరిపాలించాడు. సరిహద్దు దేశాలతో వస్తున్న యుద్ధాలు, నియంత్రణల నుంచీ ఆఫ్ఘనిస్తాన్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని హబిబుల్లాఖాన్ ఆశించాడు. రష్యన్లు స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి పొందడంలో బ్రిటిష్ సహాయాన్ని కోరుకున్నాడు. కానీ, బ్రిటిష్ రక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ను ఉపయోగించడంలో బ్రిటిష్ వారి ఎత్తుగడ వేరే వుంది. 1904లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మధ్య సరిహద్దును సరిహద్దు కమిషన్ నిర్ణయించింది. 1907లో ఆంగ్లో- రష్యన్ సమావేశం సెయింట్ పీటర్స్‌బర్గ్ లో జరిగింది. ఈ సమావేశం ఆఫ్ఘనిస్తాన్‌ను బ్రిటిష్ రష్యన్ ప్రభావం ఉన్న ప్రాంతాలుగా విభజించటం ద్వారా రాజు హబిబుల్లాఖాన్ అధికారాన్ని బ్రిటిష్ వారు బలహీనపరిచారు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌ గిరిజన తెగలలో అశాంతిని రేపింది. 1919లో హబిబుల్లా హత్యకు గురైయ్యాడు. ప్రత్యక్షంగా బ్రిటిష్ పరిపాలనలో లేనప్పటికీ బ్రిటిష్ ప్రభావ ప్రాంతంగా ఆఫ్ఘనిస్తాన్ ఆ కాలంలో ఉండింది.

రెండవ ఆఫ్ఘన్ యుద్ధం లో బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్‌కు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. కానీ అన్ని దౌత్య వ్యవహారాలు /విదేశీ సంబంధాలు బ్రిటిష్ వారి ఆధీనంలోనే వుండేవి. అయితే అదే సమయంలో అమిర్ హబీబుల్లా ఖాన్ జర్మనీకి దగ్గరవ్వడం ప్రారంభించాడు. కానీ, బ్రిటన్‌తో వున్న ఒప్పందం కారణంగా మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) సమయంలో అతను తటస్థంగా ఉండిపోయాడు. తన పరిపాలనా కాలంలోనే ఆధునిక వైద్యాన్ని, ఇతర సాంకేతికతల్ని దేశంలోకి తీసుకురావటానికి ఆయన ప్రయత్నించాడు.

ఆఫ్ఘనిస్తాన్ ని పూర్వ సాంప్రదాయ ఆలోచనల నుంచీ ఆధునికత వైపు పడిన అడుగులు మాత్రం హబిబుల్లా ఖాన్ కొడుకు అమానుల్లా ఖాన్ హయాంలోవే. హబిబుల్లా తర్వాత తమ రాజుగా అతని కొడుకు అమానుల్లా ఖాన్‌ను అక్కడి తెగలందరూ ఏకగ్రీవంగా గుర్తించారు. గిరిజనుల మద్దతు తీసుకోవటానికి అమానుల్లాఖాన్ బ్రిటిష్ వారిపై యుద్ధంచేశాడు.

1919లో రావల్పిండి ఒప్పందంగా పేరుపడిన బ్రిటన్- ఆఫ్ఘన్ ఒప్పందంతో మూడవ బ్రిటన్– ఆఫ్ఘన్ యుద్ధం ముగిసింది. యునైటెడ్ కింగ్‌డమ్, ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య రావల్పిండిలో 1919 ఆగస్టు 8న సంతకాలు జరిగాయి. ఆగస్ట్ 19నాడు ఆఫ్ఘన్ కి స్వతంత్ర దినంగా ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ 1919 నాటి ఆంగ్లో- ఆఫ్ఘన్ ఒప్పందం ఆర్టికల్ 5 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ ఇండియాతో గతంలో అంగీకరించిన అన్ని సరిహద్దు ఏర్పాట్లను అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా దురంద్ లైన్‌ను రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడానికి అంగీకరించింది. ఇది తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత రూపానికి దారితీసింది.

అమానుల్లాఖాన్ (1919-29): ఇతని కాలం లోనే ఈ దేశం ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచీ కింగ్డమ్ అఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా మారింది. తెగల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే వున్నప్పటికీ, శాంతియుత జీవితమే వుండేది. అమానుల్లాఖాన్ విదేశాల్లో పాశ్చాత్య విద్య చదువుకోవటం వల్ల తాను పాలన చేపట్టిన తర్వాత విద్య, వేషధారణ వంటి అంశాల్లో కొన్ని ప్రజాస్వామిక సంస్కరణలను ముందుకు తీసుకువచ్చాడు. కాబూల్ యూనివర్సిటీ రావటానికి సన్నాహాలు జరిగాయి. మగవాళ్ల సంప్రదాయక వేషధారణ పఠాన్ డ్రెస్ అయితే, పాంట్స్- ట్రౌ్జర్స్ పరిచయం చేశారు. ఆడవాళ్ళకు బురఖా తీసేయొచ్చని చెప్పారు. దీనికి తోడు అమానుల్లాఖాన్ గిరిజన తెగల పెద్దల స్వతంత్ర ప్రతిపత్తిని (లోయ జిర్గా) కుదించివేసి, ఆధునిక ప్రణాళికలను అమలు పరచటానికి ప్రయత్నం చేశాడు. వీటివల్ల బయట దేశాల్లో ఇతనికి ప్రజాస్వామ్యవాది అని పేరు ఉన్నప్పటికీ, ఈ సంస్కరణలను గ్రామీణ స్థానిక ఆదివాసీ తెగలు ఆహ్వానించలేదు. వారికి వాటితో అంగీకారం వుండేది కాదు.

అమానుల్లాఖాన్ యూరప్ పర్యటనకు వెళ్ళినపుడు అతనికి వ్యతిరేకంగా జలాలాబాద్ నుంచీ మొదలయిన తిరుగుబాటు రాజధానికి చేరుకుంది. సైన్యం రాజుకు అండగా నిలబడలేదు. 1929 జనవరిలో అమానుల్లాఖాన్ తన రాజ్యాధికారానికి రాజీనామా చేసి, అప్పటి బ్రిటిష్ ఇండియాకి ప్రవాసం వెళ్లాడు. అప్పుడు అతని అన్న ఇనాయతుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజుగా కొద్దికాలం వున్నాడు. ఈ సంస్కరణల వ్యతిరేక తిరుగుబాటుకు తాజిక్ హబీబుల్లా కలఖాని (బచాయి సఖావో), అతని అనుచరులు నాయకత్వం వహించారు. అయితే ఆఫ్ఘన్ తెగలు తాజిక్ గ్రూపుల పాలనను జీర్ణించుకోలేకపోయారు, ముఖ్యంగా గిల్‌జాయ్ తెగలు బచాయ్ సఖావోపై తిరుగుబాటు చేసి అతడిని తొలగించారు. నవంబర్ 1929 లో సింహాసనం నుండి తొలగించడమే కాకుండా అతన్ని ఉరి తీశారు.

అమానుల్లాఖాన్ మళ్లీ రావడానికి ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నాలు సఫలం కాలేదు. అతను శాశ్వతంగా ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి వెళ్ళిపోయాడు. ఇతని తర్వాత ఒక సంవత్సరంపాటు దేశంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వివిధ తెగల మధ్య ఎడతెగకుండా చర్చలు జరిగిన తర్వాత ఎవరు రాజు కావాలనే దానిపై ఒక ఏకాభిప్రాయం వచ్చింది.

ఇతని వారసుడిగా హబిబుల్లాఖాన్ మేనల్లుడు మొహమ్మద్ నాదిర్ షా సింహాసనాన్ని అధిష్టించడానికి ‘లోయ జిర్గా’ అంగీకారాన్ని తెలిపింది.

మొహమ్మద్ నాదిర్ షా (1929- 33) అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని అంతకుముందు అమానుల్లా ఖాన్ ముందుకు తీసుకువచ్చిన సంస్కరణలను రద్దుచేయటం. రాజ్యాంగపరంగా గిరిజన తెగల ఆదేశాలకు ప్రాధాన్యతనిస్తూ మతపరమైన వర్గాలను శాంతింపజేసినప్పటికీ, నాదిర్ షా భౌగోళికంగా కొన్ని ఆధునికమైన చర్యలను తీసుకున్నాడు. హిందూకుష్ రహదారి నిర్మాణాన్ని, సమాచార వ్యవస్థలను మెరుగుపరచటమే కాకుండా 1931లో కాబూల్ విశ్వవిద్యాలయ (ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి విశ్వవిద్యాలయం) ప్రారంభానికి దోహదపడ్డాడు. అమానుల్లాఖాన్ ఏర్పాటుచేసిన విదేశీ వాణిజ్య దౌత్య సంబంధాలను కొనసాగించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్తల నాయకత్వంలో ఒక బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ముందుకి తీసుకువచ్చాడు. 1933లో ఒక పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్నప్పుడు జరిగిన కాల్పుల్లో ఇతను చనిపోయాడు. ఇతను చనిపోయేనాటికి 40,000 మందితో సైనిక వ్యవస్థ ఏర్పడింది. తర్వాత ఇతని కొడుకు మొహమ్మద్ జహీర్ షా రాజుగా వచ్చాడు.

మొహమ్మద్ జహీర్ షా (1933- 1973) ఏ వొడిదిడుకులు లేకుండా స్థిర ప్రభుత్వంగా దాదాపు ముప్ఫై తొమ్మిది సంవత్సరాలపాటు ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలించాడు. నిజానికి ‘గోల్డెన్ ఎరా ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ అంటే ఇతని పాలనా కాలం 1933- 1973గా చెప్పుకుంటారు. వ్యవసాయం, వనరులను బాగా అభివృద్ధి చేశారు. ఈ కాలంలోనే పటిష్టమైన నీటి కాలువల నిర్మాణం జరిగింది. ప్రజల జీవనోపాధులను అభివృద్ధి చేసే పని బాగా జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ దేశ ఆధునికీకరణను గుర్తించిన జహీర్ షా ఈ ప్రక్రియలో సహాయపడటానికి అనేకమంది విదేశీ సలహాదారులను కూడా నియమించుకున్నాడు. స్నేహపూరితమైన దౌత్య సంబంధాలను కొనసాగించాడు. ప్రచ్చన్న యుద్ధ శత్రువులైన అమెరికా, రష్యా- ఈ ఇరువురి నుంచీ ఆఫ్ఘనిస్తాన్ కు అవసరమైన ఆర్థికసాయాన్ని తీసుకుంటూనే తాము ఏ దేశానికీ సేవకులం కాదు అని ప్రకటించగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్ ను పరిపాలించిన అంతకుముందు రాజుల కంటే జహీర్ షా స్వభావం మానవీయంగా ఉండేదని అక్కడి ప్రజలు అనుకునేవారు. అన్నితెగల వార్ లార్డ్స్ అంగీకరించిన నాయకుడు ఇతను. తన పరిపాలనా కాలంలో రాజకీయ కారణాలతో ఏ వ్యక్తికీ మరణదండన విధించడానికి వొప్పుకోలేదు. సార్వజనీన పౌరహక్కులు, మహిళల హక్కులు, సార్వత్రిక వోటు హక్కు వంటి అంశాలను 1964లో రూపొందించిన కొత్త రాజ్యాంగంలో పొందుపరచటం ద్వారా ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ను మలచటంలో జహీర్ షా పాత్ర ఎంతో ముఖ్యమైనది. జహీర్ షా ని పదవి నుంచి దించిన తర్వాత జరిగిన అనేక పరిణామాల రాజకీయ చిత్రపటమే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్.

మహమ్మద్ జహీర్ షా

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్ వర్గాలు తదుపరి మార్పులు ప్రకటించేవరకూ ఈ 1964 రాజ్యాంగాన్నే స్వీకరిస్తామని ప్రకటించాయి. ఒకవేళ ఏవైనా నిబంధనలు షరియత్ కు వ్యతిరేకంగా ఉంటే, అప్పుడు షరియత్ నిర్దేశించిన అంశాలే ప్రధానంగా ఉంటాయని కూడా ప్రకటించాయి.

(ఇంకా వుంది)

రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా  ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై  వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు.  వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.

Leave a Reply