మనిషి సమాజంలో జీవిస్తున్నప్పుడు అతనికి దానితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. కాని ఒక వ్యక్తికి సమాజంలో జరగరాని అన్యాయం జరిగి ఆ మనిషి మరణించినప్పుడు, సమాజం ఆ వ్యక్తికి న్యాయం చేయలేనని చేతులెత్తేసిన సందర్భాలలో, లేదా ఆ వ్యక్తికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేని సందర్భాలలో ఆ వ్యక్తి మరణాన్ని అదే సమాజం త్వరగా మర్చిపోతుంది. కాని ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం, ముఖ్యంగా ఆ వ్యక్తి తల్లి తన బిడ్డకు న్యాయం జరగాలని చివరి దాకా పోరాడుతుంది. సమాజాన్ని ఎదిరిస్తుంది, ఒంటరిగానయినా సరే శక్తి మేరా బిడ్డ కోసం, బిడ్డకు జరగవలసిన న్యాయం కోసం అహర్నిశలు కష్టపడతుంది. తల్లికి బిడ్డకు ఉండే అనుబంధం, సమాజానికి వ్యక్తికి మధ్య ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కాని, అన్ని సందర్భాలలో సమాజం నుంచి ఆ ప్రేమను ఆశపడడం వెర్రితనం అవుతుంది. ఒకరి వెత మరొకరి కథ అవుతుంది తప్ప, తల్లికి బిడ్డలపట్ల ఉండే బాధ్యత, ప్రేమలకు సమానంగా మరే వ్యక్తి ఇంకొకరి పట్ల బాధ్యత చూపలేడు. ఈ విషయం ఆధారంగా తీసిన సినిమా “థ్రీ బిల్బోర్డ్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి”. 2017లో వచ్చిన ఈ సినిమా ను ఫ్రాన్సిస్ మెక్దొర్మాండ్ నటన కోసం చూసి తీరవలసిందే. రెండు అకాడమీ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇంగ్లీషు భాషలో గత దశాబ్ధి కాలంలో వచ్చిన ఒక గొప్ప చిత్రం.
ఎబ్బింగ్ అనేది ఒక ఊరి పేరు. అయితే ఇది ఒక కాల్పనిక పేరు అన్నది ఈ కథలో గమనించాలి. ఈ ఊరులో మిల్డ్రెడ్ హాయెస్ అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె కూతురిని ఏడు నెలల క్రింద ఎవరో అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఈ కేసు ఏడు నెలల తరువాత కూడా తేలదు. మెల్లిగా ఊరివారంతా ఈ సంఘటన మర్చిపోతారు. హంతకుడిని పోలీసులు పట్టుకోలేక పోవడంతో కేసు మూతపడుతుంది. పోలీసు వారు మిగతా పనుల వైపు దృష్టి సారిస్తారు. కాని తల్లి మిల్డ్రెడ్ తన బిడ్డ మరణాన్ని అందరిలా మరచిపోలేకపోతుంది. ఆమె ఒక సాధారణ మధ్య తరగతి స్త్రీ. కూతురికి న్యాయం జరగానలే బలమైన కోరిక తప్ప దానికి ఏం చేయాలో తెలియదు ఆమెకు. ఆ ఊరి చివర పెద్ద బిల్బోర్డ్లు మూడు ఖాళీగా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ల కోసం వాటిని ఒక ఆఫీసు అద్దెకి ఇస్తుంది. కాని ఆ చిన్న ఊరిలో ఆ బోర్డుల అవసరం ఎవరికీ రాదు. మిల్డ్రెడ్ డబ్బు కట్టి ఈ మూడు బోర్డులను అద్దెకు తీసుకుంటుంది. వాటి మీద ఆమె “మరణిస్తున్నప్పుడు జరిగిన అత్యాచారం” “ఇప్పటికీ ఎవరూ ఎందుకు అరెస్టూ కాలేదు” “ఎందుకలా చీఫ్ విల్లొబై” అంటూ పెద్ద అక్షరాలతో పెయింట్ చేసిన కాగితాలను అంటిస్తుంది. ఈ బోర్డులను చూసిన అ ఊరి వారందరిలో ఆందోళన, కోపం పెరుగుతుంది. ఇందులో పోలీస్ చోఫ్ బిల్ విల్లొబై కూడా ఒకరు. తనకే సవాలు విసిరిన ఆ అక్షరాలను చూసిన అతనిలో అసహనం పెరుగుతుంది. విల్లోబై దగ్గర జేసన్ డిక్సన్ అనే మరో ఆఫీసర్ పని చేస్తూ ఉంటాడు. ఇతను విపరీతంగా తాగే అలవాటు ఉన్నవాడు. అలాగే కోపిష్టి కూడా. అతను మిల్డ్రెడ్ పై ద్వేషం పెంచుకుంటాడు. పోలీసు శాఖనే ఒక స్త్రీ ఇలా ప్రశ్నించడం ఊరి వారందరికి చర్చించే విషయం అవుతుంది. ఆమె మొండి తనానికి లెక్కలేని తనానికి అందరికీ కోపం వస్తుంది.
మిల్డ్రెడ్ పై ఆ బోర్డు తీసివేయమనే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాని తన కూతురిని చంపిన వారు పట్టుపడనంతవరకు తాను అవి తీయనని అన్నిటికి సిద్ధపడి ఉన్న మెల్డ్రెడ్ బదులిస్తుంది. ఆమెను అసహ్యించుకునే వారు ఎక్కువవుతారు. బిల్ ఆమె బాధను అర్ధం చెసుఉంటాడు. కాని అలా బిల్బోర్డ్ పెట్టడం వలన ఇన్నాళ్ళూ తాను సంపాదించిన మంచి పేరు పోతుందని బాధపడతాడు. తాను పాన్క్రియాటిక్ కాన్సెర్ తో పోరాడుతున్నానని ఎక్కువ రోజులు బ్రతకనని మిల్డ్రెడ్ కి అతను చెప్పుకుంటాడు. ఈ చివరి రోజుల్లో తనకీ శిక్ష అవసరమా అని ప్రశ్నిస్తాడు. తాను నిజాయితీగానే ఈ కేసును తీసుకున్నానని కాని హంతకులను పట్టూకోలేకపోయామని, కొన్ని సార్లు అలా జరుగుతుందని, తమని అర్ధం చేసుకొమ్మని వేడుకుంటాడు. డిక్సన్ కి బిల్ అంటే చాలా ఇష్టం. అతను ఆవేశపరుడు అందుకని ఈ బిల్ బోర్డులను అద్దెకిచ్చిన వ్యక్తిని అతను బెదిరిస్తాడు. అలాగే మిల్డ్రెడ్ స్నేహితురాలిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తాడు. అయినా మిల్డ్రెడ్ భయపడదు. ఆ బోర్డులు తీయదు.
మిల్డ్రెడ్ భర్తతో విడిపోతుంది. అతను ఆమెను విపరీతంగా కొట్టేవాడు. ఆమెతో విడిపోయాక మరో చిన్న పిల్లతో సహజీవనం చేస్తూ ఉంటాడు. తన కొత్త గర్ల్ ప్రెండ్ తో అతను మిల్డ్రెడ్ ఇంటికి వచ్చి ఆమె చర్యలను విమర్శిస్తాడు. ఆమెను అవమానిస్తాడు. కూతురిపై ప్రేమ చూపే ప్రయత్నంగా ఇది మిల్డ్రెడ్ చేస్తున్న పిచ్చి పని అని. ఆ కూతురు తల్లిగా ఆమెను అసహ్యించుకునేదని, ఆమెతో ఉండలేక తన దగ్గరకు వస్తానని తనతో చెప్పిందని మిల్డ్రెడ్ కి చెప్తాడు. తాను అది ఒప్పుకోనందువలనే ఆమె తల్లి దగ్గర ఊంది కాని తల్లిపై ప్రేమతో కాదని, ఈ విషయాన్ని తెలుసుకుని తెలివితో మసలుకొమ్మని మిల్డ్రెడ్ తో అవమానకరంగా మాట్లాడతాడు. మిల్డ్రెడ్ ఇది నమ్మదు. కాని ఆమె కొడుకు అది నిజమే అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోతుంది.
టీనేజ్ లో ఉన్నప్రతి కూతురు కూడా తల్లిని అర్ధం చేసుకోలేక, తల్లి పెట్టే అంక్షల కారణంగా ఆమె పట్ల ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఆ వయసులో ప్రతి టీనేజ్ కూతురు తల్లితో అలాగే ప్రవర్తిస్తుంది. మిల్డ్రెడ్ కూతురి తనను వదిలి వెళ్ళాలని ప్రయత్నించిందన్న విషయాన్ని విని బాధపడుతుంది. కాని కూతురి వయసుని దృష్టిలో పెట్టుకుని అది చిన్నతనపు చర్యగా ఆమెను క్షమిస్తుంది. తన కూతురు కోసం తానేం చేయాలో అదే చేస్తున్నానని, దాన్ని ఎవరు ఏ రకంగా అర్ధం చేసుకున్నా తాను ఎవరికీ సమాధానం చెప్పనని, ఈ పోరాటాన్ని ఆపనని భర్తకు చెబుతుంది.
పంటి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దక్కరకు వెళ్ళిన మిల్డ్రెడ్ ను ఆ డాక్టర్ అవమానిస్తాడు, బెదిరిస్తాడు. ఈ బిల్బోర్డ్ల కారణంగా ఊరంతా అవమానకరంగా మాట్లాడుకుంటున్నారని విమర్శిస్తాడు. కోపం పట్టలేక మిల్డ్రెడ్ ఆ డాక్టర్ ను గాయపరుస్తుంది. ఈ విషయం పై అతను కేసు పెట్టినప్పుడు ఆమెను ఇంటరాగేట్ చేయడానికి బిల్ ఆమెను తన ఆఫీసుకు రప్పించుకుంటాడు. కాని ఆమెను ప్రశ్నించే సమయంలో ఆమె పై రక్తం వాంతి చేసుకుంటాడు. అతని కాన్సర్ సంగతి తెలిసి మిల్డ్రెడ్ హాస్పీటల్ కి ఫోన్ చేస్తుంది. బిల్ హాస్పిటల్ లో చేరతాడు. కాని డాక్టర్ల సూచనలు పాటించకుండా డిస్చార్జ్ అవుతాడు. ఒక రోజు తన భార్యా పిల్లలతో సరదాగా గడుపుతాడు. అదే రాత్రి తన రివాల్వర్ తో కాల్చుకుని చనిపోతాడు. తాను రోజూ కొంచెం కొంచెంగా మరణించడం చూసే భాధను తన కుటుంబానికి తానివ్వలేనని భార్యకు ఉత్తరం రాసి మరణిస్తాడు బిల్. చనిపోతూ అతను మిల్డ్రెడ్ కు కూడా ఒక ఉత్తరం రాస్తాడు. ఆమె కారణంగా తాను చనిపోవట్లేదని, అ బిల్బోర్డ్స్ కు మరోనెల అద్దెకు కట్టవలసిన డబ్బు ఆమె వద్ద లేదని తెలిసి తాను ఆ డబ్బు అఫీస్లో కట్టానని ఆమె చేస్తున్న ఈ పోరాటంతో నయినా హంతకులు పట్టుబడాలని తాను కోరుకుంటున్నానని చెబుతాడు.
డిక్సన్ కు బిల్ మరణం గురించి తెలివినప్పుడు అతను ఆ బోర్డులను అద్దికిచ్చిన వ్యక్తిన్ని కొట్టి, అతన్ని పై అంతస్తు నుండి క్రిందకు పడేస్తాడు. ఇది బిల్ స్థానంలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ చూసి అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తాడు.
తరువాత ఆ బిల్ బోర్డ్ లను ఎవరో కాల్చేస్తారు. బిల్డ్రెడ్ కోపంతో పోలీస్ స్టేషన్ ను తగలబెట్టే ప్రయత్నం చెస్తుంది. కానీ అంత రాత్రి అక్కడ డిక్సన్ ఉన్నాడని ఆమె అనుకోదు. బిల్, డిక్సన్ కి రాసిన ఉత్తరం కోసం అక్కడకి దొంగతనంగా వచ్చిన డిక్సన్ ఆ ఉత్తరం చదువుతూ ఆఫీసులోనే ఉండిపోతాడు. ఈ ప్రమాదంలో అతను గాయపడతాడు.
మిల్డ్రెడ్ మళ్ళీ బోర్డులపై ఆ ప్రశ్నలను అంటిస్తుంది. ఒక వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేస్తారు కాని అతని డీ ఎన్. ఏ పరిక్షించిన తరువాత అతను హంతకుడు కాదని తేలుతుంది. అతనికి దీనితో కాకపోయినా మరో హత్యతో సంబంధం ఉందని నమ్మి డిక్సన్, మిల్డ్రెడ్ ఇద్దరూ అతన్ని వెతుక్కుంటూ బైలుదేరతారు.
సినిమా ఇక్కడితో ముగుస్తుంది. కాని ఒక హత్య వెనుక దానికి సంబంధించిన వ్యక్తుల జీవితాలను, వారి మానసిక సంక్షోభాన్ని, వారి ఆలోచనలను వారి సైకాలజీని ఈ సినిమా అద్భుతంగా చూపించగలిగింది. మిల్డ్రెడ్ కు ఆమె కూతురుతో ప్రాణం మనసులు ఒకటనిపించేలాంటి బంధం ఉండదు. వారిద్దరి మధ్య కూడా కొన్ని సంఘర్షణలు ఉంటాయి. ఆమెను ప్రేమించే వారు ఎవ్వరూ ఆమె కుటుంబంలో ఉండరు. అలాగే బిల్ నిజాయితీగా ఆ కేసుకి పని చేసినా హంతకున్ని పట్టుకోలేకపోతాడు. చనిపోబోయే ముందు తన పేరు ఇలా బోర్డులకు ఎక్కడం అతనికి బాధ కలిగిస్తుంది. కాని మిల్డ్రెడ్ ని అతను అర్ధం చేసుకుంటాడు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకూంటాడు. కాని డిక్సన్ దీన్ని అవమానంగా తీసుకుంటాడు. అతనిలో అంతకు ముందు ఉన్న కోపం కసిగా మారుతుంది. దాన్ని మిల్డ్రెడ్ పై చూపించే ప్రయత్నం చేస్తాడు. మిల్డ్రెడ్ కూతురు, కొడుకు ఇద్దరికి కూడా ఆమె పై పెద్ద ప్రేమ కాని గౌరవం కానీ ఉండవు. కూతురు తనను ప్రేమించలేదని తెలిసినా మిల్డ్రెడ్ తన పోరాటాన్ని ఆపదు. అది కూతురు తెలియని తనంగానే తీసుకుంటుంది. తాను ఎంత ఒద్దన్నా ఇల్లు వదిలి ఆ సమయంలో వెళ్ళవద్దని వారించినా మాట వినక మరణించిన కూతురు పట్ల ఒక తల్లిగానే ప్రవర్తిస్తుంది. ఆమె చెస్తున్న పోరాటాన్ని ఆమె భర్త కూడా ఆమె మొండితనాన్ని ప్రపంచానికి చూపించే చర్యగా మార్చుకుంటాడు. తాను మంచివాడినని భార్య ఎవరి మాట వినని మొండి ఘటం అని తన వైపు సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ తండ్రిని నమ్మి అతని వద్దకే కూతురు తల్లిని వదిలి వెళ్ళాలని చివర్లో ప్రయత్నిస్తుంది.
ఇక బిల్బోర్డులు అద్దె కిచ్చే వ్యక్తి ముందు డబ్బు కోసమే ఈ పని చేసినా, అందులో ఒక తల్లి చేస్తున్న న్యాయ పోరాటాన్ని చూసి ఆమెకు అండగా నిలబడతాడు. చివరకు ఆమె కోసం డిక్సన్ చేతిలో దెబ్బలు తింటాడు. అంతగా మిల్డ్రెడ్ ను అసహ్యించుకున్న డిక్సన్ చివర్లో ఆమెకు ఏకైక స్నేహితుడిగా మిగిలిపోతాడు.
ఒక సంఘటన తరువాత మనిషిలో పుట్టుకొచ్చే స్పందనలు చాలా వరకు ఇతరుల ఊహకు అందనివి, అర్ధం కానివి. మనిషి కంట్రోల్ తప్పే పరిస్థితులలో అతను తీసుకునే నిర్ణయాలు ఎన్నో సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు స్పందిస్తారో నిర్ధారణంగా చెప్పగలిగే వారు ఎవరూ లేరు. అందుకే మనిషి స్వభావాన్ని, మనసును మించిన ఆశ్చర్యకరమైనది సృష్టిలో మరొకటి లేదు, ఉండదు కూడా. ఈ సినిమా టెక్సాస్ లో జరిగిన కాతీ పేజ్ అనే ఒక యువతి హత్య ఆధారంగా అల్లుకున్న కథ. ఆమె భర్త కొన్ని బిల్ బోర్డ్ పై రాసినవి చదివిన తరువాత ఈ చిత్ర దర్శకుడు మార్టీన్ మెక్డొనా చలించిపోయారట. అలా ఈ కథ రాసుకున్నానని చెప్పుకొచ్చారు మార్టిన్.
ఈ సినిమాకు వాడిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు గాంభీర్యాన్ని తీసుకొస్తుంది. ఇక తల్లి పాత్రలో ప్రాన్సిస్ మెక్డొర్మాండ్ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించారు. కూతురి కోసం పోరాడుతున్న తల్లిగా ఆమె తన మొహంలో పలికించే ఆ లెక్కెలేనితనం, కోపం, ఆక్రోశం తెరపై చూడవలసిందే. చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా ఇది. ఆ సంవత్సరం ఉత్తమ పది చిత్రాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిల్చిన సినిమా ఇది. మనిషి స్వభావం ఏ లెక్కలకూ అందనిదని ఎవరు ఎప్పుడు ఎవరికి ఎందుకు దగ్గరవుతారు, ఎవరు ఎవరి కోసం ఎలా స్పందిస్తారో ఊహకందని విషయాలని చెప్పే ప్రయత్నం చేసిన మంచి సినిమా “థ్రీ బిల్బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ మిసోరి”