జీవితంలో చాల సులభంగా కనబడేవి నిజానికి చాల కష్టం. ‘చదవవలసిన’ లేదా ‘ప్రభావితం చేసిన పుస్తకం/పుస్తకాలు’ అని చెప్పడం అటువంటి సులభంగా కనబడే కష్టమైన పనుల్లో ఒకటి. ఎంత తక్కువ పుస్తకాలు చదివేవాళ్లయినా, విద్యార్జనలో భాగంగా చదివే పాఠ్యపుస్తకాలు కాక ఇతర పుస్తకాలు కొన్ని డజన్లయినా చదివి ఉంటారు. వాటిలో ఏదో ఒకటో, ఏవో కొన్నో వాళ్లను ప్రభావితం చేసి ఉంటాయి. ఆ పుస్తకాలలో ఒకటి రెండయినా అందరూ చదివితే బావుండునని అనిపించి ఉంటాయి. ఇక దొరికిన పుస్తకమల్లా చదివేవాళ్లకయితే ఇలాంటి జాబితాలో కొన్ని డజన్ల, వందల పుస్తకాలూ ఉండవచ్చు. చదవకపోయినా, ఎప్పటికయినా చదవవలసిన పుస్తకాల జాబితా కూడ ఎవరికయినా ఉండవచ్చు.
నా వరకు నాకు చదవవలసిన, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పడం చాల కష్టంగా ఉంటుంది. ఏదో ఒక పుస్తకం దగ్గర ఆలోచన ఆపేసి, దాని గురించి రాద్దామనుకుంటే మరో పుస్తకం అంతకన్న గట్టిగా పోటీ పడుతుంది. ఒక రంగంలోని పుస్తకం గురించి చెపుదామనుకుంటే మరొక రంగంలోని పుస్తకం అంతకన్న బలమైనదనిపిస్తుంది. అలాంటి పుస్తకాల గురించి చెప్పడం కన్న ముందు అసలు మనుషులు పుస్తకాలు ఎందుకు చదువుతారు, ఎందుకు చదవాలి, పుస్తకపఠనం మనిషికి ఏమిస్తుంది, పుస్తకాలు ఎలా చదవాలి, పుస్తకపఠనం జీవితంలో ఎందుకు పనికొస్తుంది లాంటి ప్రశ్నల గురించి చర్చించాలనిపిస్తోంది.
అసలు మనిషి జీవితంలోకి, అనుభవంలోకి పుస్తకం ఎలా వచ్చింది?
మనిషి ఎప్పుడూ ఒంటరి జీవి కాదు. ఆహారానికీ, ఆశ్రయానికీ, వినోదానికీ, విజ్ఞానానికీ మనిషి ఇతరుల మీద ఆధారపడవలసిందే. సంఘజీవితంలో మాత్రమే మనిషికి ఉత్పత్తి, పంపిణీ, మారకం, వినియోగం సాధ్యమవుతాయి. అంటే ఇతర మానవులతో సంబంధాలు లేకుండా మనిషికి మనుగడే లేదు. మరి ఆ మానవసంబంధాలు ఏర్పడాలన్నా, పెంపొందాలన్నా పరస్పరం సహకరించుకోవడం, సంభాషించుకోవడం అవసరం. ఆ అవసరాన్ని సైగల కన్నా ఎక్కువగా తీర్చగలిగినది భాష. భావ వినిమయానికి, ఆచరణలో సహకారానికి అవసరమైనది భాష. మానవ సమూహాలు స్థలంలోనూ, కాలంలోనూ వేరయి ఉన్నప్పుడు ఆ భాష, కేవలం తక్షణ ప్రయోజనకరంగా మాత్రమే కాక, దీర్ఘకాలికంగానూ, అన్నిస్థలాలలోనూ ఉపయోగకరమయినదిగా ఉండాలి. అంటే భాష మౌఖికంగా మాత్రమే కాక లిఖితంగా ఉండాలి. అలాంటి లిఖిత వ్యక్తీకరణల అభివృద్ధి ఫలితంగానే పుస్తకాలు రూపు దిద్దుకున్నాయి. అలా మనిషి ఆలోచనలు, ఆచరణలు అన్నీ పుస్తకరూపం ధరించాయి. వేల ఏళ్లుగా సమాజంలో అనేక దృక్పథాల, అనేక ప్రాంతాల, అనేక భాషల, అనేక సంస్కృతుల, అనేక అనుభవాల మనుషుల వ్యక్తీకరణలన్నీ పుస్తకాలలో ఉన్నాయి.
ప్రకృతి గురించీ, సమాజం గురించీ, మనిషి గురించీ మనిషికి ఏర్పడిన భావాలు, భయాలు, అనుమానాలు, ఆనందాలు, ఊహలు, ప్రయోగాలు, ప్రయోగ ఫలితాలు, వాదనలు, ప్రతివాదనలు అన్నీ పుస్తకాలలో నిక్షిప్తమయి ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల మనిషి మనుగడ ఆనవాళ్లన్నీ అరకొరగానైనా, ఆనాటి స్థలకాల పరిమితులతోనైనా అక్షరాలలో, పుస్తకాలలో మిగిలి ఉన్నాయి. అందుకే పుస్తకం చదవడమంటే సారాంశంలో మనిషిని చదవడమే. తమ గురించి తాము ఎక్కువగా తెలుసుకోవడానికే మనుషులు పుస్తకాలు చదువుతారు. పుస్తకాలు చదవడం ద్వారా తోటి మనుషుల గురించి, ఆ మనుషులను ఆవరించి ఉన్న ప్రకృతి గురించి అప్పటివరకూ తమకు తెలిసి ఉండని అవగాహనలను మనుషులు గ్రహించగలుగుతారు. లేదా తెలిసిన అవగాహనకు మార్పులూ చేర్పులూ చేసుకోగలుగుతారు.
అంటే ప్రతి పుస్తకమూ పఠిత చైతన్యాన్ని ఉన్నతీకరిస్తుంది. ఒక పుస్తకం చదవకముందరి మనిషికీ, చదివినతర్వాత మనిషికీ తప్పనిసరిగా తేడా ఉంటుంది. ఒక విషయాన్ని గ్రహించడంలో, ఆ విషయంలోని లోతులు తెలుసుకోవడంలో, తద్వారా, అసలు ఏవిషయాన్నయినా గ్రహించగల పరికరాలు సంపాదించడంలో మనుషులకు పుస్తకాలు ఎంతగానో సహాయపడతాయి. నిజానికి ఇటువంటి జ్ఞానం అక్షరంద్వారాకన్న, ఆచరణ ద్వారా ఇంకా బలంగా అందుతుంది. కాని, ఇవాళ్టి సమాజంలో ప్రతి ఒక్క మనిషికీ మౌలిక ఆచరణ ఉండే అవకాశం లేదు గనుక, ఇతరుల ఆచరణ గురించిన జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా పొందడానికి ప్రయత్నించక తప్పదు. ‘జ్ఞానం అంటే క్రమానుగతంగా అజ్ఞానాన్ని గుర్తించడమే’ అని విల్ డ్యురాంట్ అన్నాడు. మనిషి జ్ఞాన సముపార్జనా క్రమం ముందుకు సాగుతున్నకొద్దీ, ప్రతి కొత్త జ్ఞానమూ ఆ మనిషికి అప్పటిదాకా ఆ విషయంలో అజ్ఞానం ఉన్నదని తెలుపుతుందన్నమాట. అలాగే ప్రతి పుస్తకమూ పఠితకు అప్పటికి తెలియని విషయాన్ని తెలుపుతుంది. అంటే అప్పటిదాకా ఆ విషయం తెలియదని తెలుపుతుంది.
పుస్తక పఠనం అవగాహనను పెంచడం మాత్రమే కాదు, గొప్ప ఆనందాన్ని కూడ ఇస్తుంది. అందుకే పుస్తకాలు చదవడం అలవాటయినవాళ్లు ఒక వ్యసనం లాగ పుస్తకాలు చదువుతారు. అది కేవలం జ్ఞానదాహం మాత్రమే కాదు, అది ఇతోధిక ఆనందంకోసం అన్వేషణ కూడ. అది ఒక తీరని దాహం.
అయితే మన సమాజంలో పుస్తకపఠనం గురించి గుర్తించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది మన విద్యావిధానంలోనే పుస్తకపఠనానికి ఉండవలసినంత ప్రాముఖ్యత లేదు. పాఠ్య పుస్తకాలు కాక ఇతర పుస్తకాలు చదవాలని విద్యార్థులను ప్రోత్సహించడంలేదు. సగం జనాభా నిరక్షరాస్యులుగా ఉండి, అక్షరాస్యులయిన వారిని కూడ పుస్తకపఠనం వైపు ప్రోత్సహించకుండా ఉన్నప్పుడు సమాజంలో పుస్తకపఠన సంస్కృతి విస్తరించే అవకాశం తక్కువ.
రెండవది, మన సమాజంలో అతి తక్కువగా ఉన్న కొనుగోలుశక్తి వల్ల, చదవదలచినవారికి కూడ పుస్తకాలు కొనుక్కోవడం సాధ్యంకాని విలాసంలా ఉంటుంది. ప్రభుత్వ గ్రంథాలయాలు నానాటికీ శిథిలమవుతూ, నిధుల కొరతను ఎదుర్కొంటున్న దశలో చదవదలచిన వారికి గ్రంథాలయాల సహకారం కూడ లేదు.
మూడవది, చదవదలచినవారికి, చదవాలనే ఆసక్తి ఉన్నవారికి కూడ ఏమి చదవాలో, ఎట్లా చదవాలో చెప్పే, మార్గదర్శకత్వం వహించే సంప్రదాయం ఉండవలసినంతగా లేదు. సమాజపురోగమనం మీద ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాల జాబితా, అందరూ ఆమోదించే జాబితా లేదు. అసలు కొన్ని పుస్తకాలు మార్గదర్శకత్వం లేకుండా, వివరణ లేకుండా అర్థం కావడం కూడ కష్టం. అటువంటి మార్గదర్శకత్వం, వివరణలు కూడ అందుబాటులో ఉండడం లేదు. ఒకప్పుడు విస్తృతంగా ఉండిన స్టడీ సర్కిల్, సామూహిక అధ్యయనం, వివరణ వ్యాసాల సంప్రదాయం కూడ తగ్గిపోతోంది.
ఆ సమస్యలను అలా ఉంచినా చదవదలచిన వారికి, అవకాశాలు ఉన్నవారికి కూడ మరొక అవరోధం పుస్తకాల సంఖ్య. ఎంత కష్టపడినా, ఇవాళ్టి వేగవంతమైన జీవనశైలిలో రోజుకు ఒక పుస్తకం మాత్రమే చదవడం సాధ్యమవుతుంది. (యుద్ధాలు చేస్తూ, యుద్ధానికి నాయకత్వం వహిస్తూ, యుద్ధ శకటంలోనో, ఓడలోనో కూచుని నెపోలియన్ రోజుకు పది పుస్తకాలు కూడ చదివేసే వాడని జీవితచరిత్ర రాసిన ఎమిల్ లుడ్విగ్ రాశాడు. అది అసాధారణ పఠనశైలి కావచ్చు. బ్రిటిష్ లైబ్రరీలో మార్క్స్ చదివిన పుస్తకాలు, ఆయన రాసుకున్న నోట్స్ చూస్తే ఒక మనిషి అన్ని రంగాల పుస్తకాలు అంతపెద్ద సంఖ్యలో చదవడం, వాటన్నిటినీ జీర్ణం చెసుకుని మళ్లీ తన రచనలలో భాగం చేయడం సాధ్యమా అనిపిస్తుంది.) మనం ఈ భూమి మీదికి రాకముందే కొన్ని లక్షల చదవవలసిన మంచి పుస్తకాలు వెలువడి ఉంటాయి. ఒక మనిషి సగటున అరవై ఏళ్లు బతికితే, పదో ఏట చదువు మొదలుపెట్టి రోజుకో పుస్తకం చదివినా జీవితం మొత్తం మీద పద్దెనిమిదివేల పుస్తకాలకన్న ఎక్కువ చదవడం సాధ్యం కాదు. నిజానికి ఆ మనిషి జీవితకాలంలోనే కనీసం ఇంకొక వెయ్యి మంచి పుస్తకాలయినా వెలువడే ఉంటాయి.
కనుక ఎంత ప్రయత్నించినా ఒక మనిషి ప్రపంచంలోని మంచి పుస్తకాలన్నీ చదవడం కష్టసాధ్యం మాత్రమే కాదు, అసాధ్యం. అందులోనూ చాలమందికి పుస్తకపఠనం ప్రణాళికాబద్ధంగా సాగదు. చదవదలచుకున్న పుస్తకం అందుబాటులో ఉండదు. దొరికి పుస్తకం చదవకతప్పదు. ఎవరయినా పుస్తకాలు చదవడం ప్రారంభించిన తొలిరోజుల్లో దొరికిన పుస్తకమల్లా చదివే అలవాటు చేసుకుంటే మంచిది. అలా కొంతకాలం చదువుతూ పోగా, కొన్ని పుస్తకాలు పూర్తిగా చదవకుండానే ఏమి చెప్పదలచుకున్నాయో అర్థమయిపోతుంది. కొన్ని పుస్తకాలు మాత్రం అక్షరం అక్షరం చదివినా ఇంకా ఏదో ఉందని అనిపించేలా ఉంటాయి. కొన్ని పుస్తకాలు హృదయాన్ని స్పృశించి పులకలెత్తిస్తే, మరి కొన్ని ఒళ్లు గగుర్పొడిచేంత వ్యతిరేకత కలిగిస్తాయి. కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత దశాబ్దాలకు కూడ గుర్తు ఉంటే, మరికొన్ని చదివిన మరుక్షణం మరపుకు వస్తాయి. కొన్ని పుస్తకాలు ఒక వయసులో, ఒక మనఃస్థితిలో, ఒక వాతవరణంలో నచ్చినట్టు, ప్రభావితం చేసినట్టు అనిపిస్తాయి గాని, ఆ వయసు, మనఃస్థితి, వాతావరణం మారగానే వాటికేమీ విలువలేదనిపిస్తుంది. ఒకప్పుడు తలకిందులుచేసి, సమ్మోహపరచిన పుస్తకం మరొకప్పుడు పరమచెత్త అనిపిస్తుంది. ఒకప్పుడు అబ్బురపరచి ఇక దీన్ని మించిన పుస్తకం లేదనిపించే పుస్తకం మరొకప్పుడు చాల సాదాగా అనిపిస్తుంది. మొత్తం మీద ఒక పుస్తకం నచ్చడానికీ, ప్రభావితం చేయడానికీ, ఆ ప్రభావం దీర్ఘకాలికం కావడానికి, అది చదవవలసిన పుస్తకం అని నలుగురికీ చెప్పాలనిపించడానికీ ఆ పుస్తకంలోని విషయం మాత్రమేకాక, స్థల కాలాలు, నేపథ్యం, మనఃస్థితి, పఠిత చైతన్యస్థాయి వంటి ఎన్నో కోణాలుంటాయి. ఈ కోణాల్లో ఏ ఒక్కటి ఏమాత్రం మారినా ఆ పుస్తకం ప్రభావం యథాతథంగా ఉంటుందనడానికి వీలులేదు. అంతమాత్రమే కాదు, పాఠకులమీద పుస్తకాలు వేసే ప్రభావాలు ఎప్పుడూ ప్రత్యక్షంగా, నేరుగా, సరళరేఖలాగ ఉంటాయని చెప్పడం కూడ కుదరదు. అసలు అర్థం కాకుండానే ప్రభావం వేసినట్టనిపించే పుస్తకాలూ ఉండవచ్చు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు ఇస్తూ పొరలుపొరలుగా జీవితాన్ని ఉన్నతీకరిస్తూ ప్రభావితం చేసే పుస్తకాలూ ఉండవచ్చు.
ఈ నేపథ్యంలో, పుస్తకాల ప్రభావం గురించి, చదవవలసిన పుస్తకాల గురించి నా అనుభవం నుంచి గ్రహించిన విషయాలు కొన్ని పంచుకోదలిచాను. ఇదేదో నా గురించి చెప్పుకోవడానికి కాదు. పుస్తకాలకూ మనిషికీ ఉండే సంబంధం గురించి నా జీవితం ద్వారా నాకు తెలిసిన విషయాలు నలుగురికీ పనికి వస్తాయనే ఆశతో మాత్రమే.
పుస్తకం పట్ల, అచ్చు అక్షరం పట్ల నా వెర్రి వ్యామోహం నాకు తెలిసి ఆరో ఏట మొదలయింది. నిజానికి అంతకన్న ముందే పుస్తకాల మధ్యనే, చదివే వాతావరణం మధ్యనే నేను కళ్లు తెరిచాను. మా బాపు కుటుంబ ఆర్థికపరిస్థితి కారణంగా పెద్దగా చదువుకోకపోయినా, పద్నాలుగో ఏటినుంచే ఊళ్లవెంటబడి తిరుగుతూ ఉద్యోగాలు చేసినా స్వయంకృషితో పురాణాలన్నీ చదివాడు. కూతురూ కొడుకూ పుట్టిన ప్రతి సందర్భంలోనూ ఆయన చేసిన పని ఆ జ్ఞాపకంగా ఒక పుస్తకం – చాల ఎక్కువగా వాల్మీకి రామాయణం వావిలికొలను సుబ్బారావు అనువాద సంపుటాలు – కొనిపెట్టడం. అట్లా నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఇంట్లో పెద్ద సందుగనిండా భారత, భాగవత, రామాయణాలు, మరెన్నో గ్రంథాలు ఉన్నాయి. మా బాపు సాహిత్యాసక్తికి తోడయినది మా అమ్మ సాహిత్యాసక్తి. ఆమె స్వయంగా పెద్దగా చదువుకోకపోయినా చదివించుకుని వినేది. నిజానికి మా అమ్మవైపు కుటుంబమే ఆధునిక భావాలకు, సాహిత్యానికి పాదు. అట్లా నేను పుట్టేటప్పటికే, మా ఇంట్లోకి ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు ప్రవేశించి ఉన్నాయి.
నా ఆరో ఏట అప్పుడే ఒక వారపత్రికలో సీరియల్ గా ముగిసిపోయిన ఆరెకపూడి కౌసల్యాదేవి నవల ప్రేమనగర్ కలిపికుట్టిన పుస్తకం మాఇంట్లోకి వచ్చింది. ప్రేమ అంటే, ఎడబాటు అంటే ఏమిటో తెలుసుకోలేని ఆ వయసులో ఆ నవల చదువుతూ హీరోయిన్ కష్టాలకు భోరుభోరున ఏడవడం నాకు గుర్తున్న మొట్టమొదటి సాహిత్య ప్రభావం. సాహిత్య రుచి బహుశా నాకప్పుడే దొరికింది. ఇప్పటికీ చాల పుస్తకాలు చదువుతూ నేను ఏడుస్తాను. పుస్తకం చదివేటప్పుడు సాధారణంగా నాలోని విమర్శకుడిని పక్కనపెట్టి పుస్తకంలో లీనం కావడానికి ప్రయత్నిస్తాను. కనుకనే నేను చాల తీవ్రంగా విమర్శించిన పుస్తకాలలో కూడ నన్ను కదిలించిన, నన్ను ప్రభావితం చేసిన సన్నివేశాలు, భావాలు, ఉద్వేగాలు, చిత్రణలు ఉంటాయి.
పుస్తకాల ప్రభావం మారుతుందని చూపడానికి ఉదాహరణలు ఇక్కడ చెప్పాలి. లేతవయసులో చాల గాఢమైన ప్రభావం వేసిన రెండు పుస్తకాలను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చదివితే అందులో ఒకటి చాల మామూలుగా అనిపించింది. మరొకటి పూర్తిగా వ్యతిరేకమైన ఉద్వేగాల్ని కలిగించింది. మొదటిది ఒక గేయాల పుస్తకం. ఏడో ఏటనో, ఎనిమిదో ఏటనో ఆ పుస్తకం చదివి దాన్ని వదలలేకపోయాను. ఆ పుస్తకం అడిగి తెచ్చుకుని ఆ గేయాలన్నీ కంఠతా పట్టాను. దాన్ని కవిత్వం అంటారని, ఆ ప్రక్రియకు గొప్ప ప్రేరక, ఉత్తేజదాయక శక్తి ఉందని అప్పుడే తెలిసింది. కొన్నేళ్ల తర్వాత చదివితే ఆ పుస్తకం మళ్లీ అటువంటి ఉద్వేగాల్ని ప్రేరేపించలేకపోయింది.
ఇక మరొకటి, దాదాపు ఆ వయసులొనే చదివిన, ముందూ వెనుకా కొన్ని పేజీలు చినిగిపోయిన జై సోమనాథ్ నవల. భారతీయ విద్యాభవన్ నిర్మాత, సంఘ పరివార్ సిద్ధాంతకర్త కె ఎం మున్షీ రాసిన ఆ నవల మూడు నాలుగు వందల పేజీలు ఒక్క ఊపున చదివేశాను. బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలోని విలువలకూ, ఆ నవలలోని మతోన్మాదానికీ పొత్తు కుదిరినందువల్లనే ఆ నవల నన్ను ప్రభావితం చేసి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చదివితే ఆ నవల ఎంత విషాన్ని ఎంత కళాత్మకమైన పంచదారపూతతో పాఠకులకు అందించిందో అర్థమయింది.
నా పఠనాసక్తిని చూసి మా బాపు నన్ను ప్రాచీన సాహిత్యంలోకి మళ్లించాలనుకున్నాడు. ఏకంగా రామాయణం చదవమన్నాడు. నా పదో ఏట ప్రతిరోజూ పొద్దున్నే స్నానం చేసి ఉత్తరకాండ పద్యాలు మొదలుపెట్టేవాణ్ని. ఆ సమాసభరితమైన తెలుగు ఏమీ అర్థమయ్యేది కాదు గాని వృత్తాలనడక, పదజాలం, గంభీరమైన భాష స్పష్టాస్పష్టంగా నా మనసులోకి ప్రవేశించాయి.
ఏ పుస్తకం నుంచయినా నేర్చుకునేది ఎంతోకొంత ఉంటుందని, ఒక్కోసారి ప్రతికూల, పరోక్ష ప్రభావాల ద్వారా కూడ పుస్తకాలు మనిషి అవగాహనను పెంచుతాయని చెప్పడానికి ఇవి చెపుతున్నాను. ఒక పుస్తకం మొత్తానికి మొత్తంగా కూడ ప్రభావం వేయలేకపోవచ్చు. కాని దానిలో ఏదో ఒక వాదన, ఏదో ఒక సన్నివేశం, ఏదో ఒక నిర్ధారణ, ఏదో వ్యక్తీకరణ, ఏదో ఒక పదబంధం, ఏదో ఒక ఖండిక మాత్రమే కూడ చెరగని ముద్రను వేయవచ్చు.
తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు గడిచేసరికి విప్లవసాహిత్య పరిచయం, ముఖ్యంగా శివసాగర్ కవిత్వ ప్రభావం మొదలయ్యాయి. ఆ రోజుల్లో శివసాగర్ కవితా సంపుటి గెరిల్లా లోని గేయాలన్నీ నోటికి వచ్చేవి. అప్పటి నుంచి దాదాపు ఐదారు సంవత్సరాలు ప్రభావమంటే కవిత్వానిదే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తప్పి ఖాళీగా గడిపిన సంవత్సరకాలంలో చేతికి దొరికిన పుస్తకమల్లా చదువుతూ ఉన్నప్పుడు, లోతయిన ప్రభావం వేసినది రాహుల్ సాంకృత్యాయన్. చరిత్రనూ, కల్పననూ ఉద్వేగభరితమైన శైలిలో రాసిన రాహుల్జీ పుస్తకాలన్నీ సంపాదించి నమిలి పారేశాను. ఇక ఎక్కడ వ్యాసరచనలోనయినా, వక్తృత్వంలోనయినా, మామూలు మాటల్లోనయినా రాహుల్జీ ప్రస్తావన లేకుండా బండి నడిచేది కాదు. ఏ విషయాన్నయినా చారిత్రక దృష్టితో చూడాలని ఆ రచనలనుంచే తెలుసుకున్నాను. నా రాహుల్ సాంకృత్యాయన్ వ్యామోహం చూసి, వరవరరావు గారు ‘ఎంగెల్స్ ను చదువు’ అన్నారు.
అట్లా కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక చదివితే లోకం కొత్తగా కనబడ్డట్టయింది. ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిముట్లు దొరికినట్టయింది. కవిత్వంలోంచి, నవలలోంచి, సృజనాత్మక సాహిత్య ప్రక్రియల్లోంచి సామాజిక శాస్త్రాల అధ్యయనంలోకి ప్రయాణం అట్లా ప్రారంభమయింది. రాజకీయార్థిక శాస్త్రం, తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం – వాటికి అవసరమైనమేరకు భౌతిక శాస్త్రాలు – వీటిలో ఏఒక్కరంగం తీసుకునా ఇప్పటికీ నా ఆలోచనలను నడిపే ప్రభావం చూపిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మార్క్స్ ఎకనామిక్ అండ్ ఫిలసాఫికల్ మాన్యుస్క్రిప్ట్స్ ఆఫ్ 1844, మార్క్స్ ఎంగెల్స్ ల జర్మన్ ఐడియాలజీ, లెనిన్ మెటీరియలిజం అండ్ ఎంపిరియో క్రిటిసిజం, మావో ఆన్ ప్రాక్టీస్, ఆన్ కాంట్రడిక్షన్ ముఖ్యమైనవి.
ఒక సాహిత్య పుస్తకమో, జీవిత చరిత్రో ఒక జీవితానుభవాన్ని, ఉద్వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి గనుక అవి తప్పనిసరిగా ఉత్తేజకరంగా ఉంటాయి. కవిత్వం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర ఉత్తేజానికీ, ఒక మానసిక స్థితినుంచి బయటపడడానికీ పనికివస్తాయి. అలా చదవవలసిన పుస్తకాలు ఎన్నో ఉంటాయి. నావరకు నాకు ఒక అధఃపాతాళ మానసిక స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడిన పుస్తకంగా గూగీ నవల డెవిల్ ఆన్ ద క్రాస్ నిలబడుతుంది. అటువంటి మానసిక స్థితిలో ఎప్పుడయినా నన్ను ప్రభావితం చేసే, ఉత్తేజపరిచే సందర్భాలూ సన్నివేశాలూ నిండిన నవలలు ఆస్ట్రోవ్ స్కీ హౌ ద స్టీల్ వాజ్ టెంపర్డ్, రాబర్ట్ ట్రెస్సెల్ రాగ్డ్ ట్రౌజర్డ్ ఫిలాంత్రొపిస్ట్స్, జాక్ లండన్ ఐరన్ హీల్, గోర్కీ అమ్మ, మార్క్యూజ్ నవలలు కథలు, ఎడువార్డో గలియనో రాసిన డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లవ్ అండ్ వార్, పాబ్లో నెరూడా, ఫైజ్ అహ్మద్ ఫైజ్, శ్రీశ్రీ కవిత్వం, కుటుంబరావు, రావిశాస్త్రి రచనలు…ఎన్నెన్నో. అలా జీవితాన్ని చిత్రించే సృజనాత్మక రచనలు కాక, అసలు జీవిత చలన సూత్రాలను విప్పిచెప్పే, ఆ సూత్రాలను అర్థం చేసుకునే పరికరాలు అందించే సిద్ధాంత పుస్తకాలు జ్ఞానద్వారాలు తెరుస్తాయి. ప్రతి పఠనం నుంచీ ఉత్తేజం పొందగల అవకాశాన్ని ఇస్తాయి. తత్వశాస్త్రం, రాజకీయార్థిక శాస్త్రం, చరిత్ర, సామాజికశాస్త్రాల నుంచి అటువంటి పుస్తకాలెన్నో ఉంటాయి.
ఇన్ని పుస్తకాల ప్రభావాలలోంచి విడదీసి, అన్నిటికన్నా నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన పుస్తకం ఏదని అడిగితే చెప్పడం కష్టం గాని బహుశా అట్లా చెప్పగల ఏకైక పుస్తకం కన్యాశుల్కం. ముప్పై ఐదేళ్లకింద మొదటిసారి చదివిన కన్యాశుల్కం ఇప్పటికి కొన్ని డజన్ల సార్లయినా చదివి ఉంటాను. ఎన్నో సంభాషణలు కంఠోపాఠం. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో కన్యాశుల్కం గుర్తొస్తూనే ఉంటుంది. నా మీద ఆ పుస్తకం ప్రభావం వల్ల అది ప్రతి సందర్భానికీ గుర్తొస్తుందా? లేక, గురజాడ దార్శనికత వంద సంవత్సరాల ఇవతలికి వ్యాపించిందా? రెండూ నిజమే కావచ్చు.
ఒక నిర్దిష్ట స్థలకాలాల్లో రాసిన పుస్తకం ఆ స్థలకాలాలు గడిచిపోయిన తర్వాత కూడ ప్రాసంగికతను కోల్పోకపోవడం దాని ప్రభావానికి గుర్తు. ఎవరో తమ సొంత వేదనను, వాదనను ప్రకటించుకున్న పుస్తకం నా వేదనకు, నా వాదనకు అక్షరాలు తొడిగినట్టనిపించడం ఆ పుస్తకం ప్రభావానికి గుర్తు. ఒక పుస్తకంలోని పాత్రలు, సంబంధాలు, సన్నివేశాలు, ఉద్వేగాలు, వ్యాఖ్యానాలు, వాదనలు, విశ్లేషణలు పాఠకుల నిజజీవితంలో చుట్టూ కనబడుతుండడం ఆ పుస్తకపు ప్రభావానికి గుర్తు. అంటే ఒక పుస్తకపఠనం ద్వారా మనిషిలో నిరంతర సంభాషణ రగుల్కొంటుంది. తాము చదివిన పుస్తకం, తమ చుట్టూ జీవితం నిరంతరం సంఘర్షిస్తూ, సరిపోల్చుకుంటూ సాగుతున్నప్పుడు మనుషులు ఆ ఐక్యత – ఘర్షణలలోంచే అవగాహనలను పెంచుకుంటారు. నైసర్గిక, సహజజీవిగా ఉన్న మనిషి సామాజికజీవిగా, ఉదాత్త మానవజీవిగా ఎదగడానికి సహకరించేది పుస్తకపఠనం.
(ఈ వ్యాసానికి తొలిరూపం 2001 ఫిబ్రవరి 18న విజయవాడ పుస్తక మహోత్సవంలో చేయవలసి ఉండిన ప్రసంగ వ్యాసం. మిత్రుడు ఆజం అలీ హత్య వల్ల నేను ఆ సభకు హాజరు కాలేకపోగా, ఆ ప్రసంగభాగాలు నిర్వాహకులు చదివి వినిపించారు)
-(వీక్షణం, జనవరి 2010)