గ్లోబల్‍ వార్మింగ్‍ – మానవాళికి వార్నింగ్‍

గత రెండు శతాబ్దాలుగా అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతున్నందున ఇవాళ ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉంది. దీనికి కారణాలు ఏమిటో… కారకులు ఎవరో మనకు తెలిసిందే. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాటంతో రోజురోజుకీ భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ ఉంది. ఇది ప్రస్తుత తరానికే కాదు భవిష్యత్తు తరాలకు కూడా ప్రాణసంకటంగా మారుతోంది. ప్రజల చర్యల వలన, జీవన విధానాల వలన ఈ భూమండలం యావత్తూ కర్బన ఉద్గారాలు వ్యాపించి మానవాళితో పాటు అన్ని జీవరాశులకు ప్రస్తుతం మృత్యు ఘంటికలు వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా అడవుల నరికివేత… మితిమీరిన వాహనాల వినియోగం.. విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ వంటివి పర్యావరణాన్ని కబళిస్తున్నాయి. ఫలితంగా రుతువులు క్రమం మారుతుంది. ధృవాల వద్ద మంచు కరుగుతోంది. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. మనిషికి అర్థం కాని వైరస్‍లు పుట్టుకొస్తున్నాయి. అకాల వర్షాలు, అతివృష్టి సంభవిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్‍ ప్రభుత్వ సభ్యమండలి (ఐపిసిసి) విడుదల చేసిన 6వ నివేదిక ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ‘వాతావరణ మార్పు- 2021, ది ఫిజికల్‍ సైన్స్’ పేరిట విడుదలైన నివేదిక ముందున్నది ముసుళ్ల పండుగ అని హెచ్చరించింది. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఐపిసిసి నివేదిక మనం చేస్తున్న తప్పులనూ, ఇకనైనా సరిదిద్దుకోవల్సిన మన కర్తవ్యాన్ని గుర్తు చేసి హెచ్చరించిన శాస్త్రీయ నివేదిక ఇది. ఒక్క మాటలో ‘మానవాళికి ఇది రుధిర సంకేతం’గా పేర్కొని ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే పెను ముప్పు తప్పదని హెచ్చరించింది. గ్లోబల్‍ వార్మింగ్‍ వలన వందేళ్లకోసారి సముద్ర మట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఇకమీదట దశాబ్దానికి ఒకమారు, ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ఏటా సంభవిస్తాయని ఐపిసిసి పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు (అతివృష్టి, పెరిగిన ఉష్ణోగ్రత, నూతన వైరస్‍లు) శాస్త్రవేత్తల హెచ్చరికల స్థాయి నుంచి ప్రజల అనుభవంలోకి వచ్చాయి. ఐపిసిసి నివేదిక వెలుబడ్డ సమయం సందర్భం చాల కీలకమైనది. వేల సంవత్సరాల సుదీర్ఘకాలంలో మున్నెన్నడూ చూడని వైపరీత్యాలు నేడు అత్యంత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పదేండ్లకు, యాభై ఏండ్లకు, వంద ఏండ్లకు ఒకసారి వచ్చే వైపరీత్యాలు తరచుగా మరింత తీవ్రంగా వచ్చిపడతాయని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో తెలిపారు. ఒక్కోసారి రెండు రకాల భీభత్సాలు కలిసికట్టుగా రావచ్చు. ఎన్నడూ చూడని కొత్త ప్రాంతాలు కూడా ప్రకృతి ప్రకోపానికి వేదిక కావచ్చు. ఇటీవల కొన్ని వారాల కిందటే అనేక ప్రాంతాలు ప్రకృతి ఆగ్రహాన్ని చవిచూడటం గమనార్హం. కొన్ని వారాల వ్యవధిలోనే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో యూరప్‍ దేశాలలో వరదలు వచ్చాయి. సైబీరియాను పొగ మేఘాలు ఆవరించాయి. అమెరికా, కెనడా, గ్రీస్‍, టర్కీ దేశాలలో కార్చిచ్చులు చెలరేగాయి.

పారిశ్రామిక విప్లవం తర్వాత 1850 కాలం నాటి కంటే భూతాపం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‍ పెరిగితే తీవ్ర వేడి గాలులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గడం వంటివి సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటిగ్రేడ్‍ మార్కు దాటితే ప్రభావం తీవ్రమై వ్యవసాయం పైనా, ఆరోగ్యం పైన పెను ప్రమాదం చూపుతుంది. జీవితాలు, జీవనోపాధులు నాశనమవుతాయి. ప్రస్తుత స్వభావాన్ని బట్టి యాభై ఏళ్లకోమారు నమోదయ్యే తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు ఇకమీదట పదేళ్లకే నమోదు కానున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, భూమి వేడెక్కడం ఇలాగే కొనసాగితే 2030 నాటికి 1.5 డిగ్రీల హద్దును దాటేస్తుందన్నది ఐపిసిసి మోగించిన ప్రమాద ఘంటిక. గట్టి చర్యలు తీసుకోకపోతే కట్టడి చేయలేని స్థాయికి భూతాపం చేరుతుందని అంచనా వేసింది. వెంటనే అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకున్నా, పరిస్థితి కుదుటపడటానికి ఇరువై నుంచి ముప్పై ఏండ్లు పట్టవచ్చునని ఈ నివేదికలో శాస్త్రవేత్తలు వివరించారు. వాతావరణానికి హానిచేయని విధంగా మన జీవన శైలిని, పని సంస్కృతిని మార్చుకోవాలి. రానున్న పదేళ్లలో కర్బన ఉద్గారాలకు తావులేని ఆర్థిక, సామాజిక వ్యవస్థలను నిర్మించుకోవాలి. ఇది జరగాలంటే శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పి పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ శ్రేణి శాస్త్రవేత్తలు 234 మంది ఎనిమిదేళ్ళ పరిశ్రమతో, పరిశోధనతో రూపొందించగా, 195 జాతీయ ప్రభుత్వాలు ఆమోదించిన నివేదిక ఇది. గతంతో పోలిస్తే, మరింత కచ్చితమైన పద్దతులతో అధ్యయనం చేసి మరీ 3 వేల పైచిలుకు పేజీల తొలి విడత నివేదికలో నిర్దిష్టమైన అంచనాలు వేశారు. మానవ చర్యల వల్లనే భూగోళం వేడెక్కుతున్నదనీ, వాతావరణ మార్పు జరుగుతున్నదని రూఢీగా నిరూపించడం ఈ నివేదిక ప్రత్యేకత. అందుకే, ఈ శాస్త్రీయ జోస్యాన్ని ఆషామాషీగా తీసుకోలేం. భారతీయ నమూనాలను కూడా భాగం చేసుకొని మరీ ఈ అధ్యయనం సాగించారన్నది గమనార్హం. మన దేశంలోనూ అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని ‘రెడ్‍ కోడ్‍’ చూపిందీ నివేదిక. భూతాపం పెరిగి హిమాలయ పర్వతాలలోని హిమనినదాలు కరగడంతో ఉత్తరాఖండ్‍ను వరదలు ముచ్చెత్తుతున్నాయి. సముద్ర ఘట్టాలు పెరిగి, ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం లాంటి 12 తీరప్రాంత పట్టణాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. దక్షిణ భారతావనిలో ఊహించని వర్షాలు ముంచేస్తాయంది. అందుకే, మానవాళిగా మనం చేపట్టాల్సిన చర్యలకు ఇప్పటికే కాలాతీతమైంది అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.

ప్రపంచంలో కెల్ల మన దేశమే భూతాపం ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటుందనడం మనకు బెంబేలెత్తించే అంశం. అన్ని సముద్రాల కంటే హిందూ మహాసముద్రమే ఎక్కువగా వేడెక్కుతోందని, విపత్తులు భీకరంగా ఉంటాయని ఐపిసిసి నివేదిక ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. ఆందోళనకర స్థాయిలో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వరదలు తప్పవని స్పష్టం చేసింది. రుతు పవనాలు అలస్యం కావడం, కుండపోత వర్షాలు, వర్షాభావం వెనవెంటనే వచ్చిపడటం వాతావరణ మార్పుల ప్రభావమే. ఈ వైపరీత్యాలు ప్రాణనష్టాలను, ఆస్తి నష్టాలను పెంచుతాయి. భారత్‍లో 75 శాతం జిల్లాలు విషమ వాతావరణ మార్పులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవిస్తుంది.

వాతావరణ వైపరీత్యాల పరంపర ఆందోళనకర పరిణామం. రాబోయే పదేళ్ళల్లో కరువు, వడగాలులు, కార్చిచ్చులు, తుఫాన్లు, మరింత వేగంగా, తీవ్రంగా విస్తృతంగా ఉంటాయని హెచ్చరించింది. నిజానికి ఇప్పటికే మన దేశం ఊహించని అతి భారీ విపత్తులను ఇటీవలి కాలంలో తరచు చవి చూస్తోంది. ఉన్నపళంగా కుంభవృష్టి కురుస్తోంది. నదులు ఉప్పొంగుతున్నాయి. అంతలోనే తట్టుకోలేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి రెండూ ఏకకాలంలో కలిసే విరుచుకుపడుతున్నాయి. గ్లోబల్‍ వార్మింగ్‍ వలన ఎక్కడో ధృవాల్లోనే కాదు మన చెంతనున్న హిమాలయాలూ కరుగుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు నెత్తీనోరు బాదుకుంటునే ఉన్నారు. ఇప్పుడు ఐపిసిసి నివేదిక సైతం అంతుబట్టని విపత్తులకు కారణమేందో శాస్త్రీయ అధ్యయనం ద్వారా మనకందరికి జగరూకత కల్పించింది.

ప్రతి జీవికి తన ఆవాస ప్రాంతంపై హక్కు ఉంటుందన్న సహజ న్యాయాన్ని విస్మరించిన సామ్రాజ్యవాద విధానాల ఫలితమిది. భూతాపాన్ని నివారించాలనీ, ప్రపంచవ్యాప్తింగా ఉష్ణోగ్రతలను ఎట్టి పరిస్థితుల్లోను పెరుగనివ్వొద్దని శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే ఉన్నారు. పారిశ్రామిక విప్లవం ఫలితంగా భూమి వేడెక్కుతోందని గుర్తించి మూడు దశాబ్దాల క్రితం ఐపిసిసి తొలి నివేదికను వెలువరించింది. ఈ 30 ఏళ్ళలో ఇది కీలకమైన 6వ నివేదిక. కానీ, వాతావరణ మార్పులను అరికట్టేలా మనం తగిన చర్యలు చేపట్టలేదన్నది చారిత్రక సత్యం. భూతాపాన్ని పెంచే వాయువుల విడుదలను రానున్న పదేళ్ళలో బాధ్యతగా తగ్గించకపోతే కష్టమే. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‍ మించి పెరగకుండా జాగ్రత్త పడాలన్నది 2015 నాటి ప్యారిస్‍ వాతావరణ ఒప్పంద లక్ష్యం. అందుకు కర్భన ఉద్గారాల్ని క్రమంగా తగ్గించాలి.

ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అన్ని దేశాలకూ అందుబాటులోకి తేవడంలో సంపన్న దేశాల మధ్య ఏకాభిప్రాయం. త్రికరణ శుద్ధి ప్రయత్నం ఇవాళ్టికీ కానరావడం లేదు. పర్యావరణ పరిరక్షణకు జరిగే అన్ని ఒడంబడికలు, ఒప్పందాలు కాగితాలకై పరిమితమయ్యాయి. దీని కారణంగా భూమిపై వాతావరణం విపరీతమైన మార్పులకు గురవుతూనే ఉంది. ప్యారిస్‍ లక్ష్యం విఫలమైతే మానవాళి నివారించలేని రీతిలో దుష్ప్రభావాలు పడతాయి. తరచూ వరదలు, భరించలేనంత వడగాడ్పులు, విధ్వంసకర దుర్భిక్ష్యాలు తప్పవన్నది శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక. ఇప్పటికే అంతరిస్తున్న బ్రిటన్‍లోని పఫిన్‍ లాంటి చిన్న పక్షులు మొదలు ప్రపంచంలో ఎన్నెన్ని జీవరాశులు అరుదైపోతాయో లెక్కలేదు. కొవిడ్‍-19 లాంటి ఎన్ని వైరస్‍లు పుట్టుకొస్తాయో ఊహించలేం. పేద శ్రామిక జనాలు రకరకాల వ్యాధుల పాలవ్వక తప్పదు.

భూతాపం మానవులు చేజేతులా చేస్తున్న చర్యల పర్యవసానమని ఎప్పుడో నిర్ధారణ అయింది. కాకపోతే, ఆ చర్యల కట్టడి బాధ్యత ఎవరిది ఎంత అనే దగ్గరే సమస్య. ఆర్థిక ఆధిపత్య దేశాల ఏకపక్ష స్వార్థపూరిత విధానాలే సమస్య జఠిలం కావడానికి హేతువు. ఆ దిశగా పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి సాగనంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని తడవలు ఒప్పందాలు చేసుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు. ఇదే ఐపిసిసి నివేదిక నొక్కివక్కాణించిన హేతుబద్ధ స్పష్టీకరణ. ఒకటిన్నర శతాబ్దాల కాలంలో భూతాపం 1.1 డిగ్రీలు పెరగగా, వచ్చే తొమ్మిదేళ్లలో 1.5 డిగ్రీలకు చేరడం అనివార్యం. వాతావరణ మార్పులపై జరిగిన ప్యారిస్‍ ఒప్పందంలో 1.5 డిగ్రీలు తగ్గించాలని లక్ష్య నిర్దేశం జరిగింది. మార్కెట్‍ శక్తులకు తలొగ్గిన ప్రభుత్వాలు, బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాలను, కార్బన్‍, ఇతర గ్రీన్‍హౌస్‍ ఉద్గారాలను తగ్గించలేదు. పేద, వర్ధమాన దేశాలకు సమకూరుస్తామన్న నిధులు సమకూర్చలేదు. అభివృద్ది చెందిన దేశాలు అవసరమైన నిధులను, టెక్నాలజీని బదిలీ చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు సామ్రాజ్యవాద దేశాలను కలిసికట్టుగా నిలదీయాలి.

దినదినం ధ్రువాల్లోని మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. తుఫానులు, వడగాల్పులు, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజల తీరులో మార్పు రాకపోవడంతో మానవాళి ప్రకృతి గీసిన లక్ష్మణరేఖను దాటే స్థితికి చేరుకుంటోంది. ఈ స్థితికి చేరుకుంటే.. మనిషిని ఎవరు కూడా కాపాడలేరు. ఏంటి ఇదంతా.. అంటారా..? వాతావరణ మార్పులపై అంతర్‍ ప్రభుత్వ ప్యానల్‍ (ఐపిసిసి) తాజాగా విడుదల చేసిన 6వ అసెస్‍మెంట్‍ నివేదికకు సంక్షిప్త రూపం ఇది. ఈ నివేదిక ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా… సముద్ర మట్టాల పెరుగుదలపై అధ్యయనం జరిపింది. ఈ క్రమంలో భారత్‍లోని 12 నగరాలు, టౌన్లు నీట మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ శతాబ్దం చివరి కల్లా… కండ్ల, ఒఖా, భావ్‍నగర్‍, ముంబై, మంగళూరు, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై వంటి మొత్తం 12 నగరాలు 2.7 అడుగుల లోతు నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.

భూమిని అత్యుష్ణం నుంచి కాపాడే కవచాలు హిమనినదాలు, నీటిలో పేరుకున్న తెల్లని మంచు సూర్యకిరణాలను అద్దంలా అంతరిక్షంలోకి పరావర్తనం చెందించడం ద్వారా భూఉష్ణోగ్రత పెరగకుండా ఆపుతుంది. హిమనినదాలు లేకుంటే సూర్యకిరణాలు నేరుగా భూ ఉపరితలాన్ని తాకుతాయి. వాటి వేడిని ఉపరితలం ఇముడ్చుకుని వాతావరణం వేడెక్కడానికి దోహదం చేస్తుంది. ఆర్కిటిక్‍, అంటార్కిటికాలతో పాటు హిమాలయాల్లోనూ మంచు వేగంగా కరిగిపోయి దక్షిణాసియా దేశాలకు నీటి కొరతను తెచ్చిపెట్టనుంది. గంగ, బ్రహ్మపుత్ర నదులకు హిమాలయాలే మూలం. వాతావరణం మార్పుల వల్ల రుతువుల్లోనూ మార్పులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. భారత్‍పై నడి వేసవిలోనూ వాయు గుండాలు విరుచుకుపడటం గమనించాల్సిన పరిణామం.

అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని కరోనా అనుభవం ప్రపంచానికి రుజువు చేసింది. వాతావరణ మార్పులపై నివేదిక అలాంటి అవసరమే ఉందని మనకు ‘రెడ్‍ కోడ్‍’ సాక్షిగా చెబుతోంది. ఆలస్యం చేసినా, వాయిదా వేసినా తిప్పలు తప్పవు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ముందడుగు వేసి, వర్ధమాన దేశాలకూ సాంకేతిక పరిజ్ఞానంలో చేయందించాలి. భారత్‍ కూడా భూతాపోన్నతి పెంచే వాయువులనూ, కార్బన్‍ డయాక్సైడ్‍ను వాతావరణం నుంచి తగ్గించాలి. ఇది పర్యావరణ శాఖల కర్తవ్యమే కాదు.. ప్రజలందరి జీవనశైలి మార్పుల బాధ్యత కూడా! ఎందుకంటే, కళ్ళెదుటి మార్పుల గురించి ఐపిసిసి నివేదిక మోగించిన ప్రమాద ఘంటికలు రింగ్‍మంటున్నాయి. ఐపిసిసి తాజా నివేదిక నేపథ్యంలోనైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి. ప్యారిస్‍ ఒడంబడికకు అనుగుణంగా విధానపరమైన చర్యలు తీసుకోవాలి. వచ్చే నవంబర్‍లో జరిగే (కాపు-26) వాతావరణ మహాసభలో నిర్దిష్ట నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయాలి. మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లుతున్న అంశంపై ఉపేక్ష తగదు.

రోజు రోజుకూ భూమండలంపై కర్భన ఉద్గారాలు పెరిగే కొద్దీ గాలిలో నాణ్యత తరిగిపోతున్నది. వాతావరణం తేమను కోల్పోతున్నది. ఇది పెరిగేకొద్దీ తీవ్రమైన కరువులు, భీకరమైన, తుఫాన్‍లు, భీభత్సమైన వరదలు, భయానకమైన వేడి గాలులు, కార్చిచ్చులూ అంతకంతకూ అధికమవుతాయి. అంతిమంగా ఇవి మానవాళి మనుగడకే సవాలుగా అవతరిస్తాయి. మరి ఇంతటి అరిష్టానికి మూలమైన ఈ భూతాపానికి కారణమేమిటి? ఈ నివేదిక చెపుతున్నట్టు ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేననడంలో సందేహమే లేదు. కానీ ఇందులో ప్రజల పాత్ర చాలా స్వల్పమైనది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రకృతి విధ్వంసం, లాభాపేక్షే తప్ప సామాజిక బాధ్యతలేని పారిశ్రామికీకరణే ప్రధానమైనది.

పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాదక శక్తి అనూహ్యంగా పెరిగింది. ఇదే క్రమంలో ఆయా పరిశ్రమల నుంచి కర్బన ఉద్గారాలు విచ్చలవిడిగా వెలువడటం ప్రారంభమైంది. మొదట్లో ఈ ప్రగతి చూసి గర్వపడ్డాం. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అనుకున్నాం. కానీ మన చర్యల కారణంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని, దానివలన ఏర్పడే దుష్ప్రభావాలను గుర్తించలేక పోయాం. గుర్తించినా సరిదిద్దుకోవడానికి సిద్ధం కాలేకపోయాం. ఈ నిర్లక్ష్యమే భూతాపం పెరుగుదలకు కారణమై ప్రపంచాన్ని ప్రస్తుతం పెను ప్రమాదంలో పడేసింది. ఏ విధంగా చూసినా భూతపం మానవ స్వయంకృతాపరాధమే. జీవన సౌకర్యాలు, విలాసాల కోసం మానవులు చేపడుతున్న కార్యకలాపాలతో భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనివలన భూ ఉపరితలం వేడెక్కి రోజురోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వలన అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు సహజం అయిపోయాయి.

బహుళజాతి కార్పొరేట్ల లాభాపేక్ష, సంపన్నుల విలాసవంతమైన జీవన విధానాల వల్లనే కాలుష్యం, భూతాపం పెరిగి నదులు, సముద్రాలు, కాలుష్య భరితంగా మారుతున్నాయి. కొన్ని రకాల జీవరాశులు శాశ్వతంగా అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. అడవులు నరికివేత, అసంబద్ధ అభివృద్ధి విధానాలతో వాయు, జల, వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా సరికొత్త రోగాలతో మానవ జాతి అతలాకుతలమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేల్కొన్నాయి. ఈ భూమిని సురక్షితం చేసి మన మనుగడను కాపాడుకోవడం ఎలా అనే విషయంపై అనేక చర్చలు, పరిశోధనలు చేపట్టడం మొదలుపెట్టాయి. అనేక సమావేశాలు ఏర్పాటు చేశాయి. ప్రకృతిని కాపాడే బాధ్యత అన్ని ప్రభుత్వాలది అంటూ తీర్మానాలు చేశాయి. కానీ ప్రపంచ దేశాలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు చిత్తశుద్ధితో ఏ దేశం కూడా అమలు చేయలేదనే చెప్పవచ్చు.

వాతావరణంలో ఉన్న గ్రీన్‍హౌస్‍ వాయువుల్లో 85 శాతాన్ని సముద్రాలు గ్రహిస్తాయి. ఫలితంగా అవి వేడెక్కుతున్నాయి. ఈ పరిణామం గత 15 ఏళ్లలో బాగా పెరిగింది. దీనివల్ల కొన్ని రకాల సముద్రజీవులు అంతరించిపోతున్నాయి. సముద్ర జీవవైవిధ్యంలో అసమతౌల్యం నెలకొంటోంది. హిమానీనదాలు కరిగిపోవడం, సముద్రాలు ముందుకు విస్తరించడమూ దీని ప్రభావమే. 1901 నుంచి 2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 20 సెంటిమీటర్ల మేర పెరిగింది. దీనికితోడు సీఓ2ను గ్రహించడం వల్ల సాగరాల్లో అమ్లీకరణ సైతం అధికమవుతోంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను కొంతవరకు మానవ ప్రయత్నంతో తగ్గించుకోవచ్చు గానీ, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు మాత్రం అంత త్వరగా తగ్గడం సాధ్యం కాదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు వాతావరణంలో వేడి అధికం కావడం వల్ల కొన్ని రకాల సూక్ష్మజీవులు, వైరస్‍లు తమ వ్యాప్తిని మరింతగా పెంచుకుంటున్నాయి. వేడి వాతావరణం వల్లే కలరా, డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‍గున్యా లాంటి వ్యాధుల సంఖ్య పెరిగిందని, ఇవి క్రమంగా ఎడారుల నుంచి చల్లటి ప్రాంతాలైన పర్వతాలకు వ్యాపిస్తున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. గబ్బిలాల నుంచి మనుషులకు నిపా లాంటి వైరస్‍లు వ్యాపించడానికీ కారణమిదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

రెండు శతాబ్ధాలుగా పరిశ్రమలు భూమిని వేడెక్కించే వాయువులు విడుదల చేయడం, బొగ్గు కలప చమురులను మితిమీరి మండించడమే ఇందుకు కారణమని ఐపిసిసి నివేదిక పేర్కొనడం ఇందుకు నిదర్శనం. భూగర్భం మొదలు అంతరిక్షం దాకా, సముద్రాలు మొదలు వాయు మండలం దాకా సమస్తమూ పెట్టుబడి లాభాలకు స్థావరాలయ్యాక ప్రజలూ, పర్యావరణం దిక్కులేనివిగా మిగిలిపోతుండటం కాదనలేని సత్యం. భూముల్ని తొలిచేస్తున్నారు. కొండల్ని పేల్చేస్తున్నారు. వనాలను కాల్చేస్తున్నారు. సముద్రాలను కబళిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నదేవరంటే బహుళజాతి సంస్థలని విధితమవుతున్నది. వీరికి తోడ్పడుతున్న దేవరంటే పాలకులని అర్థమవుతున్నది. ఈ పర్యావరణ విధ్వంసానికి అసలైన కారణాలనూ కారకులనూ అర్థం చేసుకుంటే మన ఉద్యమం ఎవరి మీద చేయాలో స్పష్టం అవుతుంది. ఆరోగ్య రీత్యా, ఆర్థిక రీత్యా బాగుండాలంటే కార్పొరేట్ల ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

2 thoughts on “గ్లోబల్‍ వార్మింగ్‍ – మానవాళికి వార్నింగ్‍

  1. వర్తమాన మొత్తం సమాజాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్యలు పర్యావరణం మరియు పేదరికం.పేదరికం అభివృద్ది చెందుతున్న పేద దేశాలకు పెద్ద సమస్య కాగా, పర్యావరణ సమస్య ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.ఏ నర్సిరెడ్డి గారు వ్రాసిన గ్లోబల్ వార్మింగ్ మానవాళికి వార్నింగ్ అనే ఈ వ్యాసం ద్వారా సమగ్రంగా చర్చించనున్నారు .వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  2. నర్సింహారెడ్డిగారి ‘గ్లోబల్ వా(ర్మి )ర్నింగ్ చాలా బాగుంది. క్యాపిటలిస్టులకు,
    కార్పొరేట్లకు తమతమ ఆస్తుల పెంపుదల మీదవుండే ఆసక్తి అశేష ప్రజా సంక్షేమం పట్ల ఉండదనే నగ్నసత్యాన్ని మరోసారి ఈ వ్యాసంలో చూస్తాం.
    ఏమైనా ప్రజాప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఇలాంటి భయంకర సమస్యలకు పరిష్కారం.
    ఆ దిశగానేమనం ఆలోచించాలి.

Leave a Reply