ఇది క్రూర పాలకులు రాజ్యమేలే కాలం: గ్రాంసీ

ప్రపంచ చరిత్రలో ఒక పరిణామంగా వచ్చిన ఫాసిజం, ఇప్పుడు సరికొత్త రూపంలో హేతువు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, సమానత్వం, లౌకిక, ఉదారవాద భావాల మీద దాడి మొదలుపెట్టింది. వర్తమాన ప్రపంచంలో అనేక దేశాలలో ఫాసిస్టు ధోరణులు వివిధ రూపాలలో కొనసాగుతున్నాయి. భారతదేశంలో హిందుత్వ ఫాసిజం ప్రజల జీవితాలను భయంతో, భక్తితో, భ్రమలతో పూర్తిగా నియంత్రించే పనిలో వుంది. దాని దుర్మార్గాలను వ్యతిరేకిస్తున్న ప్రగతిశీల ప్రజాస్వామిక గొంతులను నిర్బంధిస్తుంది, హింసిస్తుంది. ఈ ఫాసిస్టు నిర్బంధాల, హింసల సందర్భంలో చరిత్ర నుండి మనకు అనివార్యంగా గుర్తుకొచ్చేది ఇటాలియన్ ఫాసిస్టు ముస్సోలిని, జెర్మనీ నాజి హిట్లర్. వీళ్ళే కాదు తన చివరి శ్వాస వరకు ఫాసిజంతో పోరాడుతూ, రాజ్య నిర్బంధంలో సహితం విప్లవ రాజకీయాల మీద, సోషలిస్టు వ్యవస్థల మీద గొప్ప విశ్వాసాన్ని ప్రకటించిన విప్లవ మేధావి, ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆంటోనియో గ్రాంసీ.

గ్రాంసీ జనవరి 22, 1891లో దక్షిణ ఇటలీలోని సార్డీనీయా అనే ద్వీపంలో అలెస్ అనే చిన్న పట్టణంలో పుట్టాడు. తండ్రి ఫ్రాన్సెస్కో స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న క్లర్క్ గా పనిచేసేవాడు. అయితే 1897లో ఒక అక్రమ లావాదేవీల కేసులో నేరం మోపబడి ఫ్రాన్సెస్కో 1898 నుండి 1904 వరకు జైలు జీవితం గడిపాడు. అప్పుడు గ్రాంసీ తల్లి పెప్పిన మార్సీయాస్ తన ఏడుగురు బిడ్డలను పోషించడానికి ఎన్నో కష్టాలు పడింది. తన పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడానికి కుట్టుపని చేసింది, తమకున్న భూమిని అమ్మింది. తిండికి రోజులు గడుస్తే చాలు అనుకుంటున్న ఆ కాలంలోనే గ్రాంసీకి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అది పాట్స్ వ్యాధి (టీబీ కారణంగా వెన్నుముక వంగిపోయి గూనిగా మారే స్థితి) అని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆ వ్యాధికి చికిత్సగా గ్రాంసీని తరచుగా కొన్ని గంటలపాటు సీలింగ్ కు వేలాడదీసేవారు. అది అతనికి భరించలేనంత నొప్పిని కలిగించేది. దీనికి తోడు బడిలో తోటి పిల్లలు తన మీదికి రాళ్ళు విసురుతూ తన గూనిని ఎగతాళి చేయడం గ్రాంసీకి చాలా బాధ కలిగించేది. వీటికి తోడు ఇల్లు గడవడం కోసం తన తల్లికి తోడుగా ఉండాలని గ్రాంసీ తన ప్రాధమిక విద్య పూర్తి కాకముందే మున్సిపాలిటీ ఆఫీస్ లో రికార్డ్స్ మోసే నౌకరీకి కుదిరాడు. తన ఆరోగ్య పరిస్థితి రీత్యా తాను పెద్ద పెద్ద రికార్డ్స్ మోయలేకపోయినా తప్పక మోసి ఎన్నో రాత్రులు ఒళ్ళు నొప్పులతో ఏడుస్తూ గడిపాడు. 1904 లో తన తండ్రి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాతే మళ్ళీ బడికి పోవడం మొదలుపెట్టాడు. అయితే తన బాల్యంలో తల్లి పడిన బాధలను స్వయంగా చూశాడు కనుక గ్రాంసీకి ఆమె అంటే జీవితమంతా ఎనలేని ప్రేమ, గౌరవం వున్నాయి. అంతే కాదు, సమస్యలు అన్ని దిక్కులను మూసివేసినా ముందడుగు ఎట్లా వేయాలని గ్రాంసీ తన తల్లి జీవితానుభవంలో నుండి నేర్చుకున్నాడు.

గ్రాంసీ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబాటుకు, వ్యవస్థీకృత అణిచివేతకు గురైనా సార్డీనీయాలో పుట్టి పెరగడం మూలంగా అక్కడి పేదరికాన్ని, నిత్యజీవిత వెతలను తన అనుభవంలో నుండి, పరిశీలనలో నుండి అర్థం చేసుకున్నాడు. ఆ వెనుకబాటు ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం, ఇతర వృత్తిదారులు అనుభవించే కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. మొదటగా ఆ జీవిత అనుభవాలే అసమవ్యవస్థల గురించి, సామాజిక పరివర్తనల గురించి గ్రాంసీని ఆలోచింపచేసినవి. సమస్యలపై ప్రజలను చైతన్య పరిచే బాధ్యతతో తాను జర్నలిస్టుగా పనిచేశాడు. అయితే తనను తానుగా ఎప్పటికి “ప్రొఫెషనల్ జర్నలిస్టు”గా భావించుకోనని చెప్పుకున్నాడు. ఎందుకంటే “డబ్బుకు తమ కలాన్ని అమ్ముకొని నిరంతరం అబద్దాలు రాయడమే వృత్తిగా ఎంచుకున్నచోట నా భావాలను దాచుకోకుండా ప్రకటించుకునే స్వతంత్ర జర్నలిస్టుగానే ఉంటానని” ప్రకటించాడు. మరోమాటలో చెప్పాలంటే ప్రొఫెషనలిజం ముసుగులో దోపిడీ వ్యవస్థల కొమ్ముకాయలేనని జీవిత తొలినాళ్ళలోనే నిర్ణయించుకున్నాడు.

జర్నలిస్టుగా పనిచేస్తున్న క్రమంలోనే యూనివర్సిటీ చదువుల కోసం తనకు స్కాలర్‌షిప్ రావడంతో దాని ఆధారంగా ఉత్తర ఇటలీలోని టురిన్ అనే నగరానికి 1911లో మారాడు. అక్కడ తత్వశాస్త్రం, భాషాశాస్త్రం చదువుకున్నాడు. అప్పుడు తన వయస్సు ఇరవై సంవత్సరాలు. టురిన్ గ్రాంసీకి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎందుకంటే టురిన్ ఇటలీకి పారిశ్రామిక కేంద్రం లాంటిది. అక్కడ ఫియట్ వంటి ఎన్నో అటోమొబైల్ సంస్థలతో పాటుగా అనేక మెటలర్జికల్ పరిశ్రమలు ఉన్నాయి. ఆ కాలంలో రోమ్ పరిపాలనా కేంద్రంగా వుంటే మిలాన్ వ్యాపార కేంద్రంగా వుండేది. బాగా చదువుకున్న వాళ్ళు రోమ్, మిలాన్ పోవాలని కుతూహలపడుతుంటే, కార్మికులకు టురిన్ లో పనిచేయాలనేది ఒక కలగా వుండేది. అలాంటి టురిన్ గ్రాంసీకి కార్మికవర్గ జీవితాన్ని, సంఘటిత పోరాటాలను పరిచయం చేసింది. అలాగే ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉండే ప్రజలు (శ్రామికవర్గంతో సహా) వెనుకబడిన ప్రాంతాలను (దక్షిణ ఇటలీని), అక్కడి ప్రజల జీవన పద్ధతులను ఎలా ఎగతాళి చేస్తారో చూశాడు. ఈ తప్పుడు స్పృహ ఏ విధంగా పాలకవర్గాల ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో గ్రహించగలిగాడు. ఆ క్రమంలోనే తాను మార్క్స్ నుండి నేర్చుకున్న పెట్టుబడి అభివృద్ధి రహస్యం, కార్మికవర్గ స్పృహకు సంబంధించిన ఆలోచనలను ఆచరణలో చూడగలిగాడు.

టురిన్ లో గ్రాంసీ ఎంతోమంది యువ మిలిటెంట్లను, సోషలిస్టు నాయకులను కలిశాడు. 1912లోనే ఇటాలియన్ సోషలిస్టు పార్టీలో చేరి చాలా క్రియాశీలంగా పనిచేశాడు. అతికొద్ది కాలంలోనే (1914లో) “యంగ్ సోషలిస్ట్స్” విభాగం నిర్మాణంలో భాగమయ్యాడు. అంతేకాదు ఆ పార్టీలో ఉండే సంస్కరణవాద భావాలకు వ్యతిరేకంగా నిలబడినాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ గురించి జరిగిన చర్చల్లో కమ్యూనిస్టులకు “తటస్థత” ఉండకూడదని వాదించాడు. పార్టీలో మెజారిటీ సభ్యులు యుద్ధం విషయంలో తటస్థంగా వుందామనే అభిప్రాయంతో వున్నారు. అప్పటికే ఆ పార్టీలో ముస్సోలిని ప్రముఖ స్థానంలో ఉన్నాడు. సోషలిస్టు పార్టీ అధికార పత్రిక “అవంటి”కి (ఇటలీలో “ముందడుగు” అని అర్థం) ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. అంతకుముందే “వర్గ పోరాటం” అనే పత్రిక తానే స్వయంగా స్థాపించి అద్భుతంగా నడుపుతున్నాడు. తన రచనాశైలితో, మంత్రముగ్ధులను చేయగల వాగ్ధాటితో పార్టీలో ఎంతో ఆకర్షణ సంపాదించుకున్నాడు. అటువంటి సోషలిస్టు ముస్సోలిని యుద్ధంలో పాల్గొనాలని వాదించాడు. సామ్రాజ్యవాద యుద్ధం సృష్టించిన సంక్షోభ సందర్భాన్ని సోషలిస్టులు ఉపయోగించుకొని బూర్జువా ప్రభుత్వాలను కూలదోయాలనే లెనిన్ వాదనను కూడా పార్టీ సభ్యుల ముందుపెట్టాడు. ఆ వాదనను గ్రాంసీ సమర్థిస్తూ వ్యాసం కూడా రాశాడు. బతికుండడమంటే ఒక సంఘర్షణా, సంక్షోభ సందర్భంలో ఒక కచ్చితమైన వైఖరి తీసుకుని ఏదో ఒక వైపుకు నిలబడటం అని స్పష్టం చేసాడు. “నేను బతికే వున్నాను, నేను ఒక వైపుకు నిలబడుతాను” అని ప్రకటించాడు. విప్లవకర పరిస్థితులు ఉన్నప్పుడు విప్లవ రాజకీయాలు చేయకుండా పార్లమెంటులో బూర్జువాలతో కలిసి అధికారం పంచుకుంటే ప్రజలను మోసం చేసినట్లేనని ప్రకటించాడు. బూర్జువా రాజ్య వ్యవస్థలో అధికారం పంచుకునే కమ్యూనిస్టులు పార్లమెంటుకు లేని సాధికారతను అంటకడుతున్నారని అన్నాడు. అయితే ఇదే సందర్భంలో మెజారిటీ సభ్యులు “తటస్థ” విధానానికి కట్టుబడి వుండటంతో ముస్సోలిని సోషలిస్టు పార్టీ నుండి (నవంబర్ 14, 1914) బహిష్కరింపబడ్డాడు. అలాగే పత్రిక బాధ్యతలకు కూడా తాను రాజీనామ చేశాడు. అప్పుడే యునివర్సిటీ చదువు పూర్తిచేసుకున్న గ్రాంసీ (డిసెంబర్ 1915లో) ఆ పత్రిక ఎడిటర్ బాధ్యతలు స్వీకరించాడు.

1917లో విజయవంతమైన రష్యా విప్లవం ఇటలీలో కార్మికవర్గానికి, సోషలిస్టులకు ఎంతో ఆశాభావాన్ని నింపింది. గ్రాంసీ “పెట్టుబడికి వ్యతిరేకంగా విప్లవం” అనే వ్యాసం రాశాడు. రష్యన్ విప్లవం ద్వారా మార్క్సిజం ఒక జడ పదార్ధం కాదని, విప్లవకర పరిస్థితులున్న ఏ సమాజంలోనైనా విప్లవ స్పృహతో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తే విప్లవం సాధ్యమని, మార్క్స్ చెప్పిన చారిత్రక దశలన్నీ పరిపక్వంగా దాటి పోవాల్సిన అవసరంలేదని భావించాడు. గ్రాంసీ చేసిన ఈ ఆలోచనను కొందరు మేధావులు అతను మార్క్స్ ప్రతిపాదించిన చారిత్రక భౌతికవాద సూత్రాలను వ్యతిరేకించాడని అర్థం చేసుకున్నారు. కాని ఒక బ్లూ ప్రింట్ చేతిలో పెట్టుకుని విప్లవాలు చేయడం కాకుండా ఆయా స్థల, కాల, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ మార్గాన్ని నిర్దేశించుకోవడమే సరైన మార్క్సిస్టు అవగాహనని గ్రాంసీ భావించాడు.

అదే సంవత్సరం ఆగస్టు 29న టురిన్ లో కార్మిక వర్గ తిరుగుబాటు జరిగింది. ఐదు రోజులు ఆ తిరుగుబాటు కొనసాగింది. కాని రాజ్యం పాశవికంగా అణిచివేసింది. కొన్ని డజన్ల మంది చనిపోయారు. వందల్లో గాయపడ్డారు. వేలాది సోషలిస్టు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలోనే గ్రాంసీ ఆ పార్టీ ప్రొవిన్సియల్ కమిటీ (టురిన్ అరియా) కార్యదర్శిగా ఎన్నుకోబడినాడు. తాను కార్యదర్శిగా పని మొదలుపెట్టిన తర్వాత రష్యన్ “సోవియట్ల” స్ఫూర్తితో ఫాక్టరీ కౌన్సిల్స్ ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ ఫాక్టరీ కౌన్సిల్స్ ను కార్మికులే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిల్స్ కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా బూర్జువా రాజ్యాన్ని ఎదురించగల “శ్రామికవర్గ ప్రజాస్వామ్యాన్ని” నిర్మాణం చేయాలని భావించారు. వీటితో సమాంతరంగా “సాంస్కృతిక విప్లవాన్ని” సాధించడం కోసం అనేక సంస్థలను కూడా స్థాపించారు.

ముందు పునాది (ఆర్థిక సంబంధాలు) మారిన తర్వాతే ఉపరితల (సాంస్కృతిక, నైతిక) అంశాలు ఆలోచిద్దామనే కొన్ని మార్క్సిస్టు పోకడలకు గ్రాంసీ వ్యతిరేకి. పునాది, ఉపరితలం సమాంతరంగా మారగలవని నమ్మాడు. అయితే ఇది కేవలం శ్రామికవర్గం (తన సహజ మిత్రపక్షమైన రైతాంగంతో కలిసి) రాజ్యాధికారాన్ని సాధించే పోరాటాల ద్వారనే సాధ్యమవుతందని భావించాడు. భావజాలరంగంలో ఇంకా చేయాల్సిన కృషిని దృష్టిలో పెట్టుకుని 1919లో L’Ordine Nuovo (దీనర్థం “కొత్త ఆజ్ఞ” లేదా “కొత్త పద్ధతి”) అనే వారపత్రికను మరికొందరి సహచరులతో కలసి ఏర్పాటు చేశాడు. గ్రాంసీ ఆశించినట్లే ఈ పత్రిక భావజాలపరంగా సోషలిస్టు క్యాంప్ లోఅనేక చర్చలను లేవనెత్తింది.

1920 ఏప్రిల్ లో కార్మికులు తమ పని గంటల తగ్గింపుకై నెల రోజుల పాటు చేసిన మహత్తర సమ్మెలో దాదాపు రెండు లక్షల టురిన్ కార్మికులు పాల్గొన్నారు. కాని సోషలిస్టు పార్టీలోని ఒక ట్రేడ్ యూనియన్ గ్రూపు వెనుకడుగు వేయడంతో, రాజ్యం వేలాది మంది సైన్యాన్ని మోహరించడంతో ఆ సమ్మెను జాతీయ స్థాయి సమ్మెగా మలచలేకపోయారు. అంతేకాదు అప్పటివరకు ఫాక్టరీ కౌన్సిల్స్ సాధించిన విజయాలన్నింటిని పెట్టుబడిదారులు తుడిచేశారు. అయితే అంతటి నిరుత్సాహ సందర్భంలో సహితం గ్రాంసీ ఆశయంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాదు పార్టీనీ మరింత పటిష్టంగా నిర్మాణం చేయడానికి సోషలిస్టు పార్టీని పెటీ బూర్జువా పార్లమెంటరీ పంథా నుండి విప్లవ శ్రామికవర్గ పార్టీగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. కమ్యూనిస్టు విప్లవ పోరాటంతో ఏకీభవించని వాళ్ళందరినీ పార్టీ నుండి బహిష్కరించారు. కొందరు సభ్యులను బయటకు పంపారు కాని మొత్తంగా పార్టీ విధానమే సంస్కరణవాదానికి కట్టుబడి ఉంటే రాడికల్ గా మార్పులు చేయడం సాధ్యం కాదని గ్రాంసీ భావించాడు. అంతేకాదు కేవలం పునాది (ఆర్థిక) అంశాలలో విప్లవకర పరిస్థితులు వుంటే సరిపోవు, కార్మికులలో విప్లవ స్పృహ కూడా వుండాలి. భౌతిక పరిస్థితులకు భావాలు తోడయినప్పుడే విప్లవం సాధ్యమవుతుందని బలంగా నమ్మాడు. దానిని ఆచరణలో పెట్టడానికే పార్టీలో ప్రధానంగా మూడు అంశాల మీద గ్రాంసీ తన దృష్టిని కేంద్రీకరించాడు: శ్రామిక ప్రజాస్వామ్యం, నిరంతర విద్య, ప్రజలలో కమ్యూనిస్టు ప్రచారం.

జులై 19, 1920 మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటెర్నేషనల్ రెండవ కాంగ్రెస్స్ కు గ్రాంసీ హాజరై లెనిన్ తో పార్టీ నిర్మాణం, పంథాకు సంబంధించిన అంశాలపై చర్చించాడు. గ్రాంసీ ప్రతిపాధనలకు తన అంగీకారాన్ని తెలుపుతూ లెనిన్ సోషలిస్ట్ పార్టీకి ఒక ఉత్తరం కూడా రాశాడు. అయితే సోషలిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం ఇంకా మాస్కోలో ఉండగానే ఇటలీలో కార్మికులు వేతనాల పెంపు కోసం చేసిన డిమాండును యజమానులు అంగీకరించక పోవడంతో వాళ్ళు ఫాక్టరీలను ఆక్రమించుకుని ఉత్పత్తి మొదలుబెట్టారు. దాదాపు ఐదు లక్షల కార్మికులు ఒక నెల రోజులు ఆ ఆక్రమణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తమకు చేతనైన ఆయుధాలతో రాజ్య సైన్యం నుండి తమను తాము రక్షించుకున్నారు. కాని ప్రభుత్వ సానుకూల జోక్యంతో కార్మిక సంఘాలు కూడా కొంత రాజీపడి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఫాక్టరీలను తిరిగి యజమానుల వశం చేశారు. ఫాక్టరీ కౌన్సిల్స్ మళ్ళీ ఓడిపోయాయి. దీనికంతటికీ కేంద్రీకృత నిర్ణయాలు చేయలేని స్థితి, పోరాటాన్ని సమన్వయం చేయగలిగే నాయకత్వం సోషలిస్టు పార్టీలో లేకపోవడం ఒక పెద్ద కారణమని గ్రాంసీ విశ్లేషించాడు. సోషలిస్టు పార్టీలో విప్లవ మైనారిటీగా వుండి ఆ పార్టీ దిశ, దశ మార్చడం కష్టమని గ్రాంసీ అర్థం చేసుకున్నాడు. చివరికి జనవరి 1921లో లివోర్నోలో జరిగిన సోషలిస్టు పార్టీ సమావేశాల నుండి విప్లవ కమ్యూనిస్టులు బయటకు వచ్చి ఆ తర్వాతి రోజే ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీని ప్రకటించారు.

సోషలిస్టు పార్టీ నుండి బహిష్కరించబడిన ముస్సోలిని 1915లోనే సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని, గాయపడి తిరిగొచ్చాడు. దానితో అతనికి ఒక “యుద్ధ వీరుడు” (వార్ హీరో) అనే ఇమేజ్ వచ్చింది. ఈ కొత్త ఇమేజ్ తనకు రాడికల్ గా వున్న పేరుతో జత కలిసి ముస్సోలినీకి ఒక సరికొత్త రూపాన్ని ఇచ్చింది. ఆ కొత్త రూపంతోనే ఫ్రెంచ్ ప్రభుత్వం, ఇటాలియన్ పారిశ్రామికవేత్తల సహాయంతో “ఇటాలియన్ ప్రజలు” అనే పత్రికకు ఎడిటర్ అయ్యాడు. ఇక అప్పటి నుండి ప్రపంచ విప్లవాల స్థానంలో “విప్లవ జాతీయవాదం” పేరుతో ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. “మనందరి గుండెల నుండి ఒక్కటే మాట వినిపించాలి. అది ఇటలీ జిందాబాద్!” అని మొదటిగా ప్రచారం చేశాడు. అయితే జాతినంతటిని ఒక్క తాటి మీదికి తేవాలంతే ఒక శక్తివంతమైన నాయకుడు కావాలని చెప్పి, మరో మూడు నెలల తర్వాత “ఆ నాయకుడ్ని నేనే అని నిరూపించుకుంటా” అని కూడా ప్రకటించాడు. ఒకప్పుడు శ్రామికవర్గ నియంతృత్వం గురించి మాట్లాడిన ముస్సోలిని మొత్తం సమాజం మీద ఒక వ్యక్తి (తన) నియంతృత్వం కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పనిలో భాగంగా మార్చ్ 23, 1919న రెండు వందల మందితో కలిసి ఒక “పోరాడే మూక”ను (Italian Fasces of Combat అనే పేరుతో) ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ సభ్యులు మృత్యువుతో సహితం తలపడగలరని వాళ్ళకు నల్లషర్ట్ ధరించడం ఒక సింబల్ గా పెట్టుకున్నారు. ఈ నల్లషర్టు మూక అతికొద్ది కాలంలోనే అనేక పట్టణాలకు పాకిపోయింది. ఆ సంస్థే 1921 నాటికి “జాతీయ ఫాసిస్టు పార్టీ” గా రూపాంతరం చెందింది. 1922 వేసవి కాలం వచ్చేసరికి దాదాపు ఐదు లక్షల మంది ఫాసిస్టు పార్టీ సభ్యులు తయారయ్యారు.

సమాజంలో సమానత్వం లేని స్వేచ్ఛ కేవలం మార్కెట్ స్వేచ్ఛే అవుతుంది తప్ప మనిషి స్వేచ్ఛ కాదనే ప్రాధమిక మార్క్సిస్టు అవగాహనను కూడా మరిచి ముస్సోలిని “స్వేచ్ఛ అరాచకత్వానికి తల్లిలాంటిదని” ప్రచారం చేశాడు. దానితో తన మూకలు స్వేచ్ఛా, సమానత్వం గురించి మాట్లాడే సోషలిస్టుల మీద తమ దృష్టిని కేంద్రీకరించారు. వాళ్ళ మీద దాడులు చేశారు, హత్యలు చేశారు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రాసే అన్ని పత్రికలను ధ్వంసం చేశారు. పరిశ్రమలలో ట్రేడ్ యూనియన్ల నుండి కార్మికులు బయటకు వచ్చేలా వాళ్ళ మీద ఒత్తిడి, హింస ప్రయోగించారు. సోషలిస్టులను పార్టీలకు రాజీనామా చేయించారు. మెల్లగా సైన్యంలో కూడా తమ ప్రభావాన్ని పెంచుకోవడమే కాకుండా, స్వయంగా అందులోకి చేరిపోయారు కూడా. అలాంటి పరిస్థితుల్లో ముస్సోలోనికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే కోరి ఆపదలను కొనితెచ్చుకోవడమే. ప్రమాదస్థాయికి చేరిన ఫాసిజానికి ఇటాలియన్ పారిశ్రామిక వర్గం తన పూర్తి సహకారాన్ని అందించింది. అతి కొద్ది కాలంలోనే ఫాసిజాన్ని ఒక విధ్వంస శక్తిగానే కాకుండా ఒక కొత్త సంస్కృతిగా అభివృద్ది చేయడంతో అది ఒక బలమైన భావజాలంగా ప్రజల్లోకి (ముఖ్యంగా మధ్యతరగతిలోకి) పోగలిగింది. దానితో ఒక నూతన ఫాసిస్టు మానవుడిని నిర్మాణం చేయడమే తమ లక్ష్యమని ఫాసిజం ప్రకటించుకునే స్థాయికి చేరింది. అల్లకల్లోలంగా మారిన ఇటలీ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే తనను ప్రధానమంత్రిని చెయ్యాలని ముస్సోలిని ప్రకటించాడు. తన ప్రజాబలాన్ని చూపించుకోవడం కోసం అక్టోబర్ 27-29, 1922న ముప్పైవేల మంది ఫాసిస్టు మూకతో రోమ్ మీదికి మార్చ్ (March on Rome) గా వెళ్ళాడు. అక్టోబర్ 29న ముస్సోలిని అధికారాన్ని చేపట్టాడు. ఇక అప్పటినుండి నిర్బంధం, హింస చట్టబద్దమైపోయినవి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలు కూడా కూల్చబడినవి.

ఫాసిస్టుల పాలనలో బహిరంగంగా పనిచేయలేని పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, సోషలిస్టులు అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో కమ్యూనిస్టు ఇంటెర్నేషల్ కు తమ పార్టీ ప్రతినిధిగా ఎన్నుకోబడటంతో గ్రాంసీ మస్కో వెళ్ళాడు. అక్కడ మే 1922 నుండి నవంబర్ 1923 వరకు ఉన్నాడు. అక్కడే తన సహచరి జూలియ స్కుచ్ట్ తో పరిచయమయ్యి, పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మే 1924లో వియన్నా మీదుగా ఇటలీకి చేరుకున్నాడు. ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రాంసీ అతని సహచరులు ఫాసిజాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. సంక్షోభ సందర్భంలో బూర్జువావర్గం కార్మికవర్గ పోరాటాలను నీరు కార్చడానికి, అణిచివేయడానికి సాధారణంగా సృష్టించే కల్లోలంగా మాత్రమే చూశారు. అది వెల్లువలా వచ్చే విప్లవ ప్రవాహంలో కొట్టుకుపోతుందనే ధీమాతో వున్నారు. అది రోమ్ ఆక్రమణ దిశగా నడిచి అధికారం కైవసం చేసుకుని మొత్తంగా కమ్యూనిస్టు, సోషలిస్టు, ఉదారవాద రాజకీయాలను నిర్మూలించే పని మొదలుపెట్టే వరకు వాళ్ళకు ఫాసిజం పూర్తిగా అర్థం కాలేదు. ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆలోచనలు చేసినప్పటికీ దాని నిర్మాణం కోసం తగిన కృషి చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సందర్భంలో ఐక్యసంఘటన నిర్మాణం కంటే తమ పార్టీని పటిష్టం చేసుకోవడం ముఖ్యమని భావించారు. చివరికి (తమ పాత పార్టీ) సోషలిస్టులతో కలిసి పనిచేయమని మూడవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సలహా ఇచ్చినప్పటికీ విప్లవ కార్మిక పోరాటాలకు తిలోదకాలిచ్చిన (లిక్విడేషనిస్టు), సంస్కరణవాద పార్టీతో కలసి పనిచేయలేమని చెప్పారు. అందుకే 1926లో గ్రాంసీని అరెస్ట్ చేసే వరకు కూడా అందరూ (కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఉదారవాదులు) కలిసి ఒక ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటనగా పెద్దగా పనిచేయలేక పోయారు.

ముస్సోలిని అధికారంలోకి రాగానే పౌరహక్కులను కాలరాసే అనేక నల్లచట్టాలను తెచ్చాడు. ముఖ్యంగా నవంబర్ 05, 1926న పదిహేనేండ్ల ఒక అబ్బాయి ముస్సోలినీని చంపే ప్రయత్నం చేశాడనే నెపంతో ఫాసిస్టు వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టడానికి దుర్మార్గమైన చట్టాలు, సీక్రెట్ పోలీస్ వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఆ చట్టాల ప్రకారం ప్రజా గొంతుకులన్నీ దేశ భద్రతకు ముప్పే! అందులో భాగంగానే రాజ్యాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నాడని, వర్గకసిని రగిల్చే రాతలు రాస్తున్నాడని గ్రాంసీని నవంబర్ 08, 1926 న రోమ్ నగరంలో అరెస్ట్ చేశారు. ముందుగా కొన్ని వారాలు ఎలాంటి విచారణ లేకుండానే ఉస్టిక అనే ద్వీపంలో ఉన్న జైల్లో ఉంచారు. తర్వాత జనవరి 1927లో విచారణ కోసం మిలాన్ తీసుకొచ్చారు. కాని అరెస్ట్ చేసిన పద్దెనిమిది నెలల వరకు (మే 1928) విచారణ మొదలు కాలేదు. చివరికి విచారణ “పూర్తిచేసి” శిక్ష వేసిన రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రాంసీని చూపిస్తూ “ఇరవై సంవత్సరాలు మనము ఆ మెదడు పనిచేయకుండా చేయాలి” అని జడ్జిని డిమాండు చేశాడు. అది ముస్సోలిని కోరికగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పాడు. ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

గ్రాంసీని రోమ్ నుండి టోరీ జైలుకు తరలించారు. ఆ తరలింపులో కూడా గ్రాంసీ ఎంతో హింసను అనుభవించాడు. పశువులను సరఫరా చేసే ఒక వ్యాన్ లో పూర్తిగా పడుకోవడానికి, నిలబడడానికి వీలులేని విధంగా తాళ్ళతో కట్టి రెండు వారాల పాటు సాగిన ప్రయాణం ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణింప చేసింది. ఇక అంతంత మాత్రంగా వుండే గ్రాంసీ ఆరోగ్యాన్ని జైలు జీవితం మరింత దెబ్బతీసింది. సరిగ్గా ఉండని ఆహారం, అందుబాటులో లేని వైద్యం తో గ్రాంసీ కొద్ది నెలల్లోనే శారీరకంగా ఎంతో బలహీనపడిపోయాడు. ప్రతిరోజు కొన్ని స్పూన్ల ఆహారం మాత్రమే తీసుకునే స్థితికి చేరాడు. దానికి తోడు ఆరోగ్య సమస్యల మూలంగా గ్రాంసీ దంతాలన్నీ ఊడిపోవడంతో పరిస్థితి మరింత జటిలమయ్యింది. కడుపులో మెలికలు పెట్టే నొప్పితో నిద్రపోలేని స్థితి. అందులో రాత్రిపూట సెక్యురిటీ కోసం మూడుసార్లు నిద్రలేపడం, తన సెల్ సెక్యురిటీ గార్డ్ గది పక్కనే ఉండటంతో నిద్రపోవడం అసాధ్యంగా మారిపోయింది. జైలు నుండి నవంబర్ 3, 1930లో రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: “అక్టోబర్ నెలకు నా లెక్కలు పూర్తిచేసాను. కేవలం రెండు రాత్రులు మాత్రమే ఐదు గంటలు పడుకున్నాను. తొమ్మిది రాత్రులు అస్సలు పడుకోలేదు. మిగతా రాత్రులు ఐదు గంటల కన్నా తక్కువే నిద్రపోయాను. నామీద నాకే ఆశ్చర్యంగా వుంది నేను పూర్తిగా కుప్పకూలిపోకుండా ఇంకా ప్రతిఘటిస్తున్నందకు.” దీనితో పాటు నిరంతరం జన సమూహంలో బతికిన అతనికి జైలు ఒంటరితనం మానసికంగా క్షోభ పెట్టింది. అయినా కూడా తానెప్పుడూ స్వీయసానుభూతికి గురికాలేదు, తనను తాను త్యాగం చేస్తున్నానని కీర్తించుకోలేదు. తన అరెస్టు, నిర్బంధం తాను నమ్మిన విప్లవ రాజకీయాలలో భాగంగానే భావించాడు. అదే విషయాన్ని తన అక్కకు రాసిన ఉత్తరంలో వివరంగా ప్రస్తావించాడు. ఈ పరిస్థితుల్లో గ్రాంసీ రెండు సార్లు (మే 1931, మార్చ్ 1933) మృత్యువు అంచుల దాకా వెళ్ళివచ్చాడు. ఈ స్థితికి యూరొప్ లో ఉన్న అనేక వామపక్ష, ప్రజాస్వామ్య మేధావులు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. గ్రాంసీ ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో చివరికి జనవరి 1936న ఫోర్మియాలో ఉన్న క్లినిక్, తర్వాత రోమ్ లో మరో క్లినిక్ కు మార్చారు. అది కూడా పోలీస్ పర్యవేక్షణలోనే. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నిరసనల మూలంగా ఫాసిస్టు రాజ్యం ఆయన శిక్షను ఇరవై సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు తగ్గించింది. కాని ఆ పది సంవత్సరాల శిక్ష అయిపోయిన వారం రోజులకే గ్రాంసీ ఏప్రిల్ 27, 1937న మరణించాడు.

ఫాసిస్టులు గ్రాంసీ మెదడును ఇరవై ఏండ్లు పనిచేయకుండా నిలుపాలనుకున్నారు. కాని ఫాసిస్టుల కల నెరవేరలేదు. తాను బయట ఉన్నప్పుడు రాసినదానికి (రాశిలోనూ, వాసిలోనూ) ఎన్నో రెట్లు జైల్లో రాయగలిగాడు. బయట వున్నప్పుడు సమస్యలకు, సందర్భానికి అనుగుణంగా ఒక కరపత్రమో లేక వ్యాసమో రాశాడే తప్ప ఒక భావనను పూర్తిగా అభివృద్ధి చేస్తూ రాసే అవకాశం అతనికి దొరకలేదు. అందుకే తన జైలు ముందు జీవితపు రచనలను ఒక పుస్తకంగా తేవడం కూడా గ్రాంసీకి పెద్దగా ఇష్టం లేదు. వాటిని నిలువచేయాల్సినవిగా అతను చూడలేదు. జైల్లో చాలా సీరియస్ గా తన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో రాయాలనుకున్నాడు. అయితే జైలు అధికారులు అతనికి అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై ఆరు నెలల వరకు (జనవరి 1929 వరకు) రాసే అవకాశం ఇవ్వలేదు. కేవలం తన వదిన టాటియానా కు (గ్రాంసీ సహచరి అతని అరెస్ట్ తర్వాత రష్యాలోనే వుండిపోయింది. ఆమెకు డైరెక్ట్ గా రాయలేడు కాబట్టి) రెండు వారాలకు ఒక ఉత్తరం మాత్రమే రాసే అనుమతినిచ్చారు. అయితే తన భావాలు రాసుకునే అనుమతి వచ్చిన తర్వాత 2848 పేజీల నోట్స్ (32 నోట్ పుస్తకాలలో) రాసుకున్నాడు.

గ్రాంసీకి సాధారణంగా ప్రజలకు అవసరంలేని విషయాలు రాయడం, రాసే విషయం ఆసక్తి కలిగించకుండా రాయడం అస్సలు ఇష్టముండని పని. కాని జైల్లో తాను రాసే ప్రతి అక్షరాన్ని అధికారులు చాలా జాగ్రత్తగా చదువుతారు. అందులో తన కోసమే కొంత మార్క్సిజంతో పరిచయం వున్న అధికారులను ఆ జైల్లో నియమించారు. ఒక్క వాక్యమైనా వర్గాల గురించో, వర్గపోరాటాల గురించో వుంటే తన రచనలు ముందుకు సాగనివ్వరు. రాసిన వాటిని బయటకు పోనివ్వరు. అందుకే గ్రాంసీ తనదైన జైలు భాషను అభివృద్ధి చేసుకుని కొంత నైరూప్యంగా, గాఢమైన పదాలతో (తనకు ఇష్టముండని, ఆసక్తి కలిగించని పద్ధతిలో) రాయడం మొదలు పెట్టాడు. మార్క్సిజం అనేచోట “ఆచరణాత్మక తత్వశాస్త్రమని,” మార్క్స్, ఎంగెల్స్ అని చెప్పేచోట “ఆచరణాత్మక తత్వశాస్త్ర వ్యవస్థాపకులని” వాడాడు. అలాగే శ్రామిక, పీడిత వర్గాలకు బదులు సబాల్టర్న్ అనే పదం వాడాడు. మిలటరీ పరిభాషలో సబాల్టర్న్ అంటే కిందిస్థాయి ఉద్యోగి అని అర్థం. అన్ని అణగారిన, అణిచివేతకు గురవుతున్న వర్గాలను సబాల్టర్న్ గా తన రచనలలో రాసుకున్నాడు. ఎన్నో గొప్ప విషయాలతో రాసుకున్న గ్రాంసీ మొత్తం నోట్స్ బయటి ప్రపంచానికి తెలువడానికి ఆయన మరణం తర్వాత నలబై ఏండ్లు పట్టింది. అయితే గ్రాంసీ రాసిన విధానం (కొన్ని విషయాలు పొడిపొడిగా, మరికొన్ని సార్లు అంతకుముందు రాసిన వాటికి కొనసాయింపుగా లేదా వాటికి కొత్త విషయాలు జత చేస్తూ రాయడం) మూలంగా అతని జైలు రాతలను విశ్లేషించిన వాళ్ళు వారివారి దృక్పధాలకు అనుగుణంగానే చూడడంతో అనేక రకాల గ్రాంసీలు ఆవిష్కరింపబడ్డారు. అయితే, ఈ పరిస్థితి కేవలం గ్రాంసీకి మాత్రమే పరిమితమైనది కాదు!

గ్రాంసీ తన నోట్ బుక్స్ లో ఎన్నో ముఖ్యమైన కొత్త భావనలు నిర్మాణం చేసి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని, ఆచరణను ఇంకా అభివృద్ధి చేశాడు. విప్లవ చైతన్యం, పార్టీ కర్తవ్యం, ఆర్థికవాద పెడధోరణులు, ఇంకా అనేక అంశాలలో పూర్తి మార్క్సిస్టు-లెనినిస్టుగా కనిపిస్తాడు. అయితే రాజకీయాలకు ఆర్థిక అంశాలకు ఉండే సంబంధం, పౌరసమాజాన్ని అర్థం చేసుకునే పద్ధతి తనకున్న రాజకీయ ఆచరణ రీత్యా మార్క్సిజానికి కొత్త భావనలను జత చేయగలిగాడు. కాని మార్క్సిజం పరిపూర్ణంగా వుండాలి, ఖాళీలు లేని విధంగా వుండాలని అనుకునే మేధావులకు గ్రాంసీ ఆ ఖాళీలు పూడ్చే పనిచేశాడనో, మార్క్సిజాన్ని సరిచేశాడనో అనిపించవచ్చు. కాని గ్రాంసీ సరైన మార్క్సిస్టు స్ఫూర్తితో, గతితార్కిక పద్ధతిలో తన ఆలోచనలు చేశాడు. ఆర్థిక పునాదే తప్పనిసరిగా ఉపరితలంలో ఉండే భావాలను, సాంస్కృతిక, నైతిక అంశాలను నిర్ణయిస్తుంది అనే ఆర్థికవాద పిడివాదాన్ని వ్యతిరేకించాడు. పునాది, ఉపరితలం ఒకదాన్నొకటి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ “గతితార్కిక ఐక్యతా” సంబంధంలో వుంటాయని సూత్రీకరించాడు. ఆ రెండు కలిసి వుండే చారత్రక స్థితినే “హిస్టోరికల్ బ్లాక్” అని నిర్వచించాడు. సమాజం పరివర్తన చెందాలంటే, కార్మికవర్గ ఆధిపత్యం (proletariat hegemony) రావాలంటే కేవలం ఆర్థిక సంబంధాలలో (పునాదిలో) మాత్రమే మార్పు వస్తే సరిపోదు మొత్తంగా హిస్టోరికల్ బ్లాక్ లో మార్పు రావాలి. ఆ మార్పు ఒక తలంలో (ఆర్థిక పునాదిలో) ముందు, మరో తలంలో (ఉపరితలంలో) తర్వాత జరగాలనే నియమం కాకుండా అవి రెండూ సమాంతరంగా జరగాలని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రక్రియ స్థూలంగా సమాజ పరివర్తన కోసమే కాకుండా మనిషి ప్రవృత్తిని ప్రభావితం చేయడానికి కూడా తోడ్పడుతుందని గ్రాంసీ నమ్మాడు.

మనిషంటే సామాజిక సంబంధాల సమాహారమని మార్క్స్ నుండి నేర్చుకున్నాడు కాబట్టే “మనిషంటేనే ఒక హిస్టోరికల్ బ్లాక్” అని అంటాడు గ్రాంసీ. అంతేకాదు హిస్టోరికల్ బ్లాక్ అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు సమాజాన్ని సామ్యవాదం దిశగా నడపడానికి పనికొచ్చే ఒక వ్యూహం. సాంసృతిక విప్లవ నిర్మాణానికి, సామ్యవాదాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి సాధనమని గ్రాంసీ భావించాడు. అయితే రాజకీయాల మీద ఆర్థికరంగ ప్రభావం వుంటుందని చెబుతూనే రాజకీయాలను ఒక స్వయంప్రతిపత్తి కల్గిన వ్యవస్థగా గ్రాంసీ చూడడం కొంత గందరగోళాన్ని కలిగించే అంశం. ఈ విషయంలో గ్రాంసీ మీద మార్క్స్ ప్రభావం కంటే మాకియవెల్లి ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏది ఏమైనా నూతన హిస్టోరికల్ బ్లాక్ నిర్మాణం కోసం చేసే అన్ని రకాల ప్రయత్నాలు వర్గపోరాట ఆవరణలోనే జరగాల్సినవి అనేది గ్రాంసీ కచ్చితమైన భావన. అదే దృష్టితోనే ఫాసిజాన్ని కూడా అర్థం చేసుకున్నాడు.

గ్రాంసీ తన నోట్ బుక్స్ లో దాదాపు 250 పేజీలు ఫాసిజం గురించే రాశాడు. ఫాసిజాన్ని కేవలం ఒక ఆర్థిక సంక్షోభంలో బూర్జువావర్గం చేసే ప్రతిఘాతక చర్యగా గ్రాంసీ చూడలేదు. అంతేకాదు కేవలం ఒక్క వర్గ ప్రయోజనం అనే అంశాన్ని దృష్టిలో పెట్ట్టుకుని ఫాసిజాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఫాసిజం మిశ్రవర్గాల కలయికగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఫాసిజం సంస్కృతిని, ఆధిపత్య భావజాలాన్ని, అహేతుకతను, అతి జాతీయవాదాన్ని పెంచి పోషించి, మొత్తంగా సమాజాన్ని ఏ విధంగా నియంత్రిస్తుందో అర్థం చేసుకోవాలి. ముందు చెప్పినట్లుగా గ్రాంసీ మొదట్లో (తన అరెస్ట్ కు ముందు) ఫాసిజాన్ని ఒక రాజకీయ పార్టీగానే చూశాడు. ఆ సందర్భంలో తన దృష్టంతా ఆ ఫాసిస్టు పార్టీకి వున్న ప్రజా పునాది ఏంటి, దానిని ఏ విధంగా దెబ్బతీయొచ్చు అనే విషయాల మీదనే కేంద్రీకరించాడు. కమ్యూనిస్టులు బలం పుంజుకుంటే ఫాసిస్టులు బలహీనపడి విచ్ఛినమవుతారనుకున్నాడు. అంతేకాదు ఫాసిజం నిర్మాణంలో ఉన్న ఒక ప్రాజెక్ట్. అది పూర్తిగా నిలిచిపోవచ్చు లేదా పూర్తి కావడానికి ఆలస్యం కావచ్చు. అది కమ్యూనిస్టులు చేసే పని మీదనే ఆధారపడి వుంటుందని భావించాడు. అందుకే పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేసే పనిలో పడ్డాడు. అయితే అతి కొద్ది సమయంలోనే గ్రాంసీకి అర్థమయ్యిందేమంటే ఫాసిజం కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. అది ఒక సామూహికోద్యమం (mass movement) అని. ఎందుకంటే ఆ ఉద్యమంలో ఇటాలియన్ సమాజానికి ఉండే సాధారణ లక్షణాలు, ఆ ప్రజల సంస్కృతి ప్రతిబింబిస్తున్నాయి. ఇది ప్రజల సమ్మతితో జరిగే ఆధిపత్య పక్రియ అని గ్రాంసీకి అర్థమయ్యింది. అందుకే ఫాసిస్టులను రాజకీయంగా అధికారంలోంచి కూలదోయడం ఎంత ముఖ్యమో, సంస్కృతిని ఫాసిస్టు సాధనంగా ఉపయోగించుకునే పద్ధతిని ఓడించడం కూడా అంతే ప్రధానం అని భావించాడు.

ఫాసిజం ఒక చారిత్రక సందర్భంలో కొత్తగా తెర మీదికి వచ్చినప్పటికీ అది సమాజంలో నిద్రాణమై ఉంటూ లేదా సంస్కృతిలో భాగమై వుంటూ రాజకీయ సందర్భం కలిసొచ్చినప్పుడు బయటపడుతుంది. అలా బయటపడడానికి ఫాసిజం తనకు తానుగా ఒక ప్రగతిశీల లక్షణాన్ని ఆపాదించుకుంటుంది. దీని మూలంగా మధ్యతరగతి, కార్మికవర్గాలు కూడా ఆకర్షింపబడే అవకాశం వుంది. అదే సందర్భంలో తనలోని అహేతుకమైన ప్రతిఘాతక లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది. “గత వైభవాన్ని” కీర్తిస్తూ, దానికి ప్రతికూలంగా ఉండే వాళ్ళను ఒక “ఉమ్మడి” శత్రువుగా తయారుచేసి వారి బారి నుండి జాతిని కాపాడే “రక్షకుడి” పాత్రను పోషిస్తుంది. ఇవన్నీ ముఖ్యంగా మధ్యతరగతి కండ్లల్లో ఫాసిజానికి ఒక హీరో ఇమేజ్ ను తెచ్చిపెడుతాయి. ఆ ఇమేజ్ నిర్మాణం కోసం ఒక వ్యక్తి లేదా కూటమిని హీరోగా ముందుకు పెట్టుకుంటుంది.

ఫాసిజం ఈ ఊసరవెల్లి విన్యాసలన్నింటిని భూస్వామ్య, పెట్టుబడిదారుల సంపూర్ణ మద్దతుతోనే చేస్తుంది. ఎందుకంటే ఆ వర్గాల ప్రయోజనమే ఫాసిజం ప్రయోజనం కాబట్టి. అంతేకాదు ఆర్థిక రంగంలో ఆధునిక అభివృద్ధి (పెట్టుబడిదారి మర్కెట్) నమూనాలనే కొనసాగిస్తుంది, కాని ఉత్పత్తి సంబంధాలలో ఎలాంటి వ్యవస్థాగత మార్పులు జరగకుండా జాగ్రత్త పడుతుంది. కాబట్టి ఫాసిజం సారాంశంలో కచ్చితంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువలన చివరికి ఆ వర్గాలు ఫాసిజం గుప్పెట్లో నుండి బయటపడుతారని గ్రాంసీ సూత్రీకరించాడు. అయితే అది జరగాలంటే కార్మికవర్గంలో విప్లవ స్పృహ పెంపొందాలని, దాని కోసం కమ్యూనిస్టు పార్టీ ఎంతో కృషి చేయాల్సి వుంటుందని గ్రాంసీ భావించాడు. అంతకు మించి ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నీ ఐక్యసంఘటనగా పోరాడితేనే ఫాసిజం వెనుకడుగు వేస్తుందని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుత ఫాసిస్టు సందర్భంలో గ్రాంసీని గుర్తు చేసుకోవడమంటే ఐక్యపోరాటాల అవసరాన్ని గుర్తించడమే. అన్ని స్థాయిల్లో ఎవ్వరు చేయదగిన ప్రతిఘటన పోరాటాలు వాళ్ళు చేయాల్సిన సమయం. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగే మేధావులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు ముంచుకొస్తున్న ముప్పును ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సివుంది. గ్రాంసీ ఉద్దేశంలో “అర్థం చేసుకోవడమంటే ఆచరణకు సిద్ధపడటం.” ఫాసిజం తాత్కాలికంగా భయపెట్టొచ్చు, నిరాశ కలిగించొచ్చు. కాని అదే ఫాసిజం ఓడిపోయి ప్రజల కేరింతల మధ్య తలకిందులుగా వేలాడగట్టిన ముస్సోలిని శవాన్ని కూడా చరిత్ర నమోదు చేసింది. ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఫాసిజం తప్పక ఓడిపోతుందని!

(‘జాతీయ స్ఫూర్తి’ మాసపత్రిక నవంబర్ 2020 సంచికలో ప్రచురితం)

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

3 thoughts on “ఇది క్రూర పాలకులు రాజ్యమేలే కాలం: గ్రాంసీ

  1. అశోక్ జీ….భారతీయ సమాజానికి ప్రసంగికత కలిగిన వ్యాసె….అభినందనలు అన్న….

  2. pm
    అశోక్ జీ….భారతీయ సమాజానికి ప్రాసంగికత కలిగిన వ్యాసం అందించిన.. మీకు.అభినందనలు అన్న….

Leave a Reply