గోలకొండ కవులు

వినుకొండ కవుల గురించి వ్రాస్తున్నప్పుడు గోలకొండ కవుల సంచిక గుర్తుకు వచ్చింది. 1934 డిసెంబర్ లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన 354 మంది తెలంగాణ ప్రాంత కవుల కవిత్వ సంచిక అది. 354 మంది కవులలో దళితకవులు ఎవరైనా ఉండకపోతారా అన్న ఆలోచన ఫలితమైన కుతూహలంతో పరిశీలిస్తే ముగ్గురు కవులు కనిపించారు. భిన్న మత, సామాజిక వర్గాలకు చెందిన 354 మందిలో ముగ్గురు అంటే ఒకటి శాతం కూడా లేనట్లే. గోలకొండకవుల సంచిక వచ్చిన మరుసటి నెలలోనే ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వచ్చిన ‘వైతాళికులు’ కవితా సంకలనంలో ఒక్క దళిత కవి కూడా లేని పరిస్థితిలో ముగ్గురైనా గోలకొండ కవుల సంచికలో ఉన్నారంటే కొంతమేలే. ‘ఈ సంచిక ప్రకటనానుభవాన్ని బట్టి యీ రాష్ట్రములో నింతకు రెండింతల సంఖ్యగల కవులున్నారని చెప్పగలము’ అన్న ప్రతాపరెడ్డిగారి మాటలను ( ప్రస్తావన, గోలకొండ సంచిక, తెలంగాణ జాగృతి ప్రచురణ,మార్చి, 2009, పు. xv111) పరిగణలోకి తీసుకొంటే ఈ సంచికకు ఎక్కని కవులలో మరింత మంది దళిత కవులు తెలంగాణాలో ఉండటానికి వీలుంది. ఒకరైనా, ఇద్దరైనా వారిని వెతికి తెలుసుకొని సాహిత్యచరిత్రను సమగ్రం చేయటమే సురవరం పద్ధతి. అదే మనకు స్ఫూర్తి.

గోలకొండకవుల సంచికలోని ముగ్గురు కవులు రెవరెండు యం.వై. జీవరత్నం, కె. యస్. జాషువా, సి. ఇ. అండ్రుస్. జీవరత్నం వ్రాసిన ఖండిక ఏసుక్రీస్తు.జాషువా రచన హైద్రాబాదు ప్లేగు, అండ్రుస్ కవిత్వం తెలంగానా శీర్షికతో ప్రచురితం. తెలంగాణ విద్యారంగంలో పని ప్రారంభించిన వెస్లియన్ , స్టాన్లీ వంటి క్రైస్తవ మత సంస్థలు తెలంగాణలోకి ప్రవేశించిన 1880 వ దశకంలోనే హైదరాబాద్ కేంద్రంగా 1906 నుండి 1933 మధ్యకాలంలో ఆదిహిందూ ఉద్యమం నిర్మించిన భాగ్యరెడ్డి వర్మ జన్మించటం కాకతాళీయమే కావచ్చు కానీ అదొక చారిత్రక ఘట్టం. తెలంగాణ దళిత సమాజంలో క్రైస్తవ మతవ్యాప్తి, దళిత ఆత్మగౌరవ చైతన్య వికాసం సమాంతరంగా సాగిన కాలంలో పుట్టిపెరిగిన కవులు వీళ్ళు.

క్రైస్తవ జీవరత్నం నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా తిరుమలగిరి గ్రామంలో 1898 లో జన్మించాడు. కోడిమేలలో మెథడిస్ట్ మిషన్ లో క్రైస్తవ మతబోధకుడుగా ఉంటూ సాహిత్య వ్యవసాయం చేసాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇతని సాహిత్య గురువు. ఆ రకంగా ఆంధ్రా తో సంబంధం ఉన్న కవి. ‘యోనా చరిత్ర’ అనే రచన ప్రచురితమైనట్లు గోలకొండ కవుల సంచిక కవి పరిచయములలో పేర్కొనబడింది. ఆ పుస్తకం లభిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన రచనగా మనకు లభిస్తున్నది గోలకొండకవుల సంచికలోని ‘ఏసుక్రీస్తు’ మాత్రమే.

ఇందులో అయిదు పద్యాలు ఉన్నాయి. ‘శ్రీమన్నామా సుగుణస్తోమా యేసూ’ అన్నసంబోధనపూర్వకమైన స్తుతి మొదటి పద్యం. రెండవ పద్యంలో యేసును త్రయాత్మకుడగు దేవుడు అంటాడు. భూమి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గాలి, రాత్రింబవళ్లు విరామం లేకుండా నడవటానికి కారకుడైన దేవుడు అని స్తుతిస్తాడు. మూడవపద్యం యేసుకు మంగళాశాసనం. మహిత ధర్మభూషణుడు, మనుజ పాపనాశుడు, మనుజ శుద్ధికారకుడు, భక్త పోషకుడు అయిన దేవదేవుడికి పలికిన మంగళశాసనం ఇది. తరువాతిపద్యంలో తనను కరుణించమని యేసును వేడుకొనటం జరిగింది.” ఏసే మార్గముసత్యము/యేసే జీవంబు మనకు నెచ్చోటనైనన్” అంటూ పునరుత్థతను సంభావించాడు. ఆయన క్రెస్తవ ప్రబోధజీవనమే సాహిత్య వస్తువుగా పరివర్తన చెందటం గమనించవచ్చు.

‘హైద్రాబాదు ప్లేగు’ వస్తువుగా పద్యాలు వ్రాసిన జాషువా కూడా నల్లగొండ జిల్లా సూర్యాపేటలోనే పుట్టాడు.అంతకుమించి వివరాలు లేవు. ప్లేగు వ్యాధికి మరొక పేరు కలరా . హైదరాబాద్ లో, చుట్టుపక్కల ప్రాంతాల లో అనేకులు ఈవ్యాధి బారిన పడి మరణించిన చరిత్ర ఉంది.1904 -1948 మధ్యకాలంలో ఇదొక పెద్ద గత్తరగా విడతలువిడతలుగా వచ్చింది. ఈ గత్తరను ఎదుర్కొనటానికి నిజాం ప్రభుత్వం నగరమంతా క్వారంటైన్ కాంపులు అనేకం నిర్వహించేది. ప్రజలలో ఈవ్యాధి కారకాలగురించి అవగాహన కలిగించి పాటించవలసిన శుభ్రత గురించి హెచ్చరించటానికి ఊరూరూ తిరిగే సినిమా కారును ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల గ్రామఫోన్ రికార్డుల ద్వారా ప్రచారం జరిగేది.( సెరిష్ నానిశెట్టి ది హిందూ, 27 మార్చ్ 2020) వ్యాధి వ్యాప్తిని అరికట్టటానికి, నియంత్రించటానికి ప్రభుత్వం ప్లేగు వ్యాధికి గురయినవాళ్లను కాంపులకు తరలించేది. ప్లేగు ఉన్నరాష్ట్రేతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకులను మరెవరితో సంపర్కం లేకుండా ఈ కాంపులలో ఏకాంతంలో ఉంచేది. నగరంలో ప్రజల కదలికలను నియంత్రించటం, ప్లేగువ్యాధితో మరణించిన వాళ్ళ దేహాలను వాళ్ళ వ్యక్తిగత మత సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా సమీప శ్మశాన వాటికలలో పూడ్చిపెట్టటం వంటి పద్ధతులు ఉండేవి.( ఆదిత్య చందూర్ , డెక్కన్ క్రానికల్, ఏప్రిల్ 12, 2020, గూగుల్ సర్చ్) పెద్దసంఖ్యలో యాత్రికులు సమకూడే తీర్ధాలు, క్షేత్రాలు ఈవ్యాధి పుట్టుకకు విస్తరణకు కారణమని గుర్తించారు( ట్రాన్సక్షన్స్ అఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజిన్, జనవరి, 1954, గూగుల్ సర్చ్) ఇవన్నీచాలావరకు ఈ నాటి కోవిడ్ ఉపద్రవాన్నిగుర్తుచేస్తాయి.1934 లో ఒక కవి సమకాలీనమైన ఈ ఉపద్రవం వస్తువుగా చేసి కవిత్వం వ్రాయటం విశేషమే.

రెండు ఉత్పలమాలిక, మూడు చంపకమాల వృత్తాలలో జాషువా ప్లేగు వృత్తాంతాన్ని వర్ణించాడు. ప్లేగును కవి ఆవుల దొడ్డిలో దుమికిన పులితోనూ, గొఱ్ఱెల మంద లోకి జొరబడిన తోడేలు తోనూ పోల్చాడు. అది “హైద్రాబాదులో వడిఁజొచ్చి యిట్టునటు లోపుచుఁ జోపుచుఁ గాపురస్థులం / దావుల (బాపే” నంటూ దాని వ్యాప్తి ప్రజలను ఉన్నచోట ఉండనీయక క్వారంటైన్ కేంద్రాలకు తరలంచిన స్థితిని సూచించాడు. తరువాతి పద్యంలో రాత్రిపూట హాయిగా ఉన్న లేళ్ల సమూహం సింహ గర్జన విని ఎనిమిది దిక్కులకు పరిగెత్తినట్లుగా “ …….. గ్రూరతరంబగు ప్లేగు గర్జనన్ / బలు ది శ లేగి క్యాంపులను బన్నరే యీ పురవాసులెల్లరున్.” అని దానిని వాచ్యం చేసాడు. ఎవరో ఒకరాజు తన తండ్రికి ద్రోహంచేసాడని పరశురాముడు క్షాత్ర పురుషులను సంహరించిన పురాణ ఉదంతాన్ని ప్రస్తావించి ప్లేగు తండ్రికి ఏ మానవుడు ఏమి ద్రోహంచేసాడో కానీ ప్రతివాళ్లనూ మింగుతూనే ఉన్నది కదా అని వాపోయాడు. ప్లేగుకు విసువన్నదే లేదు, ముసలితనం అన్నదే కనబడటం లేదు అని నిస్పృహకు లోనయ్యాడు.

“మారణమొక్కచో మృతుల మాడ్చుట పూడ్చుట వేరుచోటఁ గ
న్నీరులు నించుటొక్క స్థలి నెత్తులు మోదుట వేరువీధిలో
మీరిన శోకనాదములు మింటిని ముట్టుట లె ల్లచోట్ల నీ
తీరున యుద్ధభూమి స్థితి( దెల్పదె యీ పురరాజమారయన్“ ప్లేగు భీభత్సామంతా ఈ ఒక్క పద్యంలో దృశ్యమానం చేసాడు కవి. ఊరిబయట క్యాంపులకు రోగులను తరలిస్తారు కనుక మరణాలు అక్కడ. చనిపోయినవాళ్లను కాల్చటమో, పూడ్చటమో మరొకచోట నిర్దేశిత వాటికలలో జరుగుతుంది. మృతుల తాలూకూ జనానికి అక్కడకు ప్రవేశం ఉండదు కనుక కన్నీరు నించటమో, నెత్తి మోదుకొని శోకించటమో మరొక వీధి నుండి వినబడుతుంటుంది . అంత్యకాలంలో దగ్గర వుండి కడసారి సేవకు, చూపుకు అవకాశం ఇయ్యని ఆ వ్యాధి ముందు మనిషి చేసే నిస్సహాయ ఆక్రోశాన్ని ఈ తీరుగా రూపు కట్టించాడు కవి. ఇట్లా ఒక సమకాలీన సామాజిక సంక్షోభాన్నిసాహిత్య వస్తువుగా చేసి చరిత్రగా నమోదుచేశాడు కవి. కోవిడ్ మృత్యుహేల ముందు నిస్సహాయుడైన నేటి మానవుల దురవస్థ, సామాజిక విషాదం కారణంగా హైదరాబాద్ ప్లేగు మనకు అనుభవ విషయంగా అనిపించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఈయన వలె మరెవరైనా హైదరాబాద్ చరిత్రలో ఈ గత్తరను వస్తువుగా చేసి సాహిత్య రచన చేశారేమో పరిశీలించాలి. లత నవలల్లో తరచు హైదరాబాద్ ప్లేగు ప్రస్తావన ఇతివృత్తంలో భాగంగా వస్తుంటుంది. ఇలాంటి సాహిత్య ప్రతిస్పందనలను సమీకరించి విశ్లేషంచటం ద్వారా హైదరాబాద్ జన జీవిత చరిత్రను పునర్నిర్మించే వీలు ఉంది.

ఆండ్రుస్ వ్రాసిన తెలంగానా స్వస్థాన దేశభాషాభిమానాన్నిప్రకటించే ఖండిక. కవి పాతికేళ్ళవాడు. 1934 నాటికి పాతికేళ్లవాడంటే 1909 లో పుట్టి వుంటాడు.వరంగల్ జిల్లా హనుమకొండలో జన్మించాడు. కుసుమాలయము, పుష్పాంజలి కావ్యాలు వ్రాసాడు. గోలకొండ కవుల సంచిక ప్రకటించే నాటికి అవి అముద్రితాలు. తరువాత ప్రచురించబడినాయో లేదో తెలియదు. తెలంగానా మూడు గీత పద్యాల ఖండిక. మొదటి పద్యంలో దేశభాషలలో తెలుగు ఆధిక్యతను ప్రస్తావించాడు. కవుల మనస్సులలో తెలుగు కావ్యాలు ‘నివురుగప్పిన అనలమై’ జ్వలిస్తున్నవని అంటాడు. రెండవ పద్యంలో ఓరుగల్లు కోట అగడ్తలు, వేయిస్తంభాల గుడి లోపలి శిధిల శాసనాలు, శిల్ప వైభవం ప్రస్తావించబడ్డాయి. మూడవ పద్యం సోమనాథ విద్యానాథ కవుల ప్రశంస.

దళిత జీవిత స్వానుభవ విషయాలు కవిత్వంగా చేయకపోయినా సాధారణ మానవ సమూహంలో భాగంగా ఆధ్యాత్మిక ఆత్మీయ సంవేదనలను కవిత్వం గా చేశారు ఈ ముగ్గురు కవులు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply