గేనగీత

నీకు నా స్పర్శంటే వెయ్యి గంగల స్నానం
నా నీడంటే నీకు కునుకులేని అమావాసెతనం
నా మాటంటే సీసం పోసుకున్న చెవిటితనం
నే నడిచిన భూమంతా నీకు మైలబడినతనమే!

నేనంటే నీకో మలిన అమానవుడ్ని
నా వళ్లంతా నీ అవమానపుచారలే
నేనో నిషిద్ధ చరిత్ర ఆనవాలుని
శాపాలకి మసివకుండా మిగిలిన శకలాలని !

వో వరుణ దేవుడా!
ఊరు మీదకి వురిమి చూసిన
పల్లె గుడిసెని వరదయి కూల్చేయి!
వానేమో మా తాత తాబేటికాయనీళ్లయి
ఎండిన గొంతు తడిపే గుక్కయి !

వో వాయు దేవుడా!
ఈ మురికి మనుషుల
మట్టి వాసనలని
దూరంగా తరిమెయ్!
మా గుడిసెలోకి దొరబడ్డ గాలి
ఎండుచేపల చట్టిలో గిలగిల !

వో అగ్ని దేవుడా!
మనో నీతిని అతిక్రమించిన
ఈ అనాగరిక అస్పృస్యుడిని
చావిడిగుంజకు కట్టి కాల్చేయి!
అగ్గేమో నీళ్లు నములుతూ
మా అమ్మమ్మ నోట్లో చుట్టముక్క నుసై!

నేనే నేలని నేనే గాలిని నేనే నీరుని
నేనే అగ్నిని నేనే ఆకాశాన్ని
నేను నువ్వేలిసిన వెన్నెలనై
నేను ప్రకృతి పరామర్శను
ఈ మట్టి చేతులు ముడ్డడితే గదా
పంచభూతాలకొక పరమార్ధం!

ప్రకృతి చేసిన ప్రతీకార ప్రకటన :
నీ పూజా ప్రతిఫలాల సంచిని కాను
యజ్ఞ పసువుల చప్పరింతను కాను
కోరుకున్న వరాలు పంచే దేవతని కాను
నీ కోపశాపాలని చల్లే కమండలాన్ని కాను
నీ స్వార్ధ వేడుకోల్ల బలిపశువును కానులే
నేను చెమట చుక్కల కంపు పులకింతనులే !

వెలివేతల వెకిలి
గీత చాటున నుంచుని
నువ్వెన్ని కర్మ గీతలు గీసినా
నాగేటి గీతలో గేనగీతనై !

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply