గుండె కింది తొవ్వ

నారాయణస్వామి రచన “నడిసొచ్చిన తొవ్వ” ఒక ప్రత్యేకమైన రచన. తన గురించి రాసుకున్నప్పటికీ స్వీయ చరిత్ర అని అనలేం. ఆత్మ కథ అని పేరూ పెట్టలేం. అది అతడు నడిచొచ్చిన దారి కథ. అతనిని నడిపించిన సమయ, సందర్భాల కథ. ఆ సమయంలో, ఆ సందర్భంలో అతన్ని అక్కడ నిలిపిన సమాజం కథ. అతను కథకుడే. కానీ, ఆ కథలో ముఖ్య పాత్రధారి కాదు. అందరితో పాటు తనూ! అంతే. తన ఆత్మకథని రాయటానికి ఇప్పటికీ యాభయిల్లోనే వున్న స్వామి ఇంకా వృద్ధుడవ్వలేదు మరి!.

“కవిసంగమం”లో వారం వారం తాను నిర్వహించిన శీర్షిక కింద రాసిన వ్యాసాలలో 1975 నుండి 1995 వరకు జరిగిన 20 సంవత్సరాల తన జీవన ప్రయాణాన్ని వివరించాడు రచయిత. ప్రచురణకర్తలు ముందుగానే చెప్పినట్లు 315 పేజీల ఈ పుస్తకం కేవలం మొదటి భాగం మాత్రమే. తనని కవిని చేసిన సామాజిక పరిస్థితులు, అందులో భాగమైన తన మానవ సంబంధాల గురించి ఒక ఆబ్జెక్టీవ్ అవుట్ లుక్ తో చెప్పాలనుకొని వుంటాడు. తన కవితలకి భూమికగా వున్న సంఘటనలు ఏ పరిణామాల వల్ల పుట్టాయో వాటిని పంచుకోవటంగానూ, వివరించటంగానూ రచన సాగుతుంది. ఆయా పరిణామాల్ని అర్ధం చేసుకోవటంలో, విశ్లేషించటంలో నారాయణ స్వామిలోని ఇంటలెక్చువల్ స్పష్టంగా కనిపిస్తాడు. ఏ కల్లోల సందర్భమూ అతనిలోని మార్క్సిస్టుని తప్పించుకోలేదు. అంతేకాదు. తనకి ఎదురై కల్లోల పరిచిన ప్రతి సామాజిక సందర్భం లేదా వ్యక్తిగత జీవితంలోని సంఘటనలన్నింటిలోనూ తనని తాను సంబాళించుకోటానికి, నిలదొక్కుకోటానికి కవిత్వాన్ని ఆశ్రయించటం ఈ పుస్తకం నిండా కనబడుతుంది. అప్పట్లో తాను విశ్వసించిన అభిప్రాయాల్ని ఇప్పుడు పునస్సమీక్షించుకోటానికీ అతను వెనకాడలేదు. అనేక సందర్భాల్లో అప్పటికలా అనిపించింది అని నిర్మొహమాటంగా చెబుతాడు.

“నడిసొచ్చిన తొవ్వ” కవిసంగమం ఫేస్బుక్ గ్రూపులో సీరియల్ గా ప్రతి ఆదివారం వచ్చినప్పుడే దాదాపుగా అన్నీ చదువుతుండే వాడిని. అలా చదువుతున్నప్పుడు అది కేవలం అతను నడిచొచ్చిన దారి మాత్రమే కాదని అతని సమకాలీనులైన నాబోటి విప్లవోద్యమ అభిమానులందరి నడిచిన దారి అదేనని అర్ధమైంది. ఆ శీర్షికలో నా మిత్రుడైన స్వామి పేర్కొన్న సంఘటనలు కొన్నింటికి నేను కూడా సాక్షినే. ఆ వ్యాసాలనన్నింటినీ పుస్తక రూపంలో మరోసారి చదువుతున్నప్పుడు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాను. అందుకే సమీక్ష అంటే కొంత జంకాల్సి వచ్చింది. ఒక నవలని, కథా సంపుటిని సమీక్ష చేసినట్లుండదు సమాంతర చరిత్రలో ఒక వ్యక్తి తను బతికిన, బతుకుతున్న సమాజాన్ని, అందులో సందర్భోచితంగా తన జీవితాన్ని చెప్పే ఆత్మకథ కాని ఆత్మకథ అయిన పుస్తకాన్ని సమీక్షించటం! 1987లో నేను విప్లవోద్యమ సానుభూతి పరుడిగా పురోగామివాదులకి దగ్గరయినప్పుడు అప్పటికే ఒక ప్రసిద్ధ కవిగా, ఒక మంచి వక్తగా, విరసం ముఖ్యుడిగా బాగా ఎస్టాబ్లిష్ అయి, నాకు తెలిసిన నా మిత్రుడు స్వామిని కాక పుస్తకం ద్వారా తనని తాను వ్యక్తపరుచుకున్న రచయితగా అర్ధం చేసుకోటానికి, పరిచయం చేయటానికి ప్రయత్నిస్తాను.

మెదక్ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన స్వామి ఒక చైల్డ్ ప్రాడిజి (బాల మేధావి). పదో ఏటనే ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలు వల్లె వేసిన వాడు. అసాధారణ ధారణ అతని స్వంతం. అతని భాషా పటిమకి, సాహిత్య పరిజ్ఞానానికి అతని బాల్యంలోనే బీజాలు పడ్డాయంటాడు. ప్రాచీన సాహిత్య అధ్యయనం అవగాహన శక్తిని పెంచుతుందంటాడు. “మనం మన ప్రాచీనుల కవిత్వాన్ని, సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం లేదు అనడం ఒక అపోహ మాత్రమే! చదవడం వల్ల మనం ఇంకా మంచిగ రాయడం నేర్చుకోవచ్చు. తెలవని విషయాలెన్నో తెలుసుకోవచ్చు. భాషలో కొత్తగా మెలుకువలు ఊహించడం, ఉపమానాలూ, రూపకాలూ – ఇంకా కవిత్వంలో అనేక విషయాల్లో కొత్త సంగతులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా యెట్లా రాయాలో, యెట్లా రాయకూడదో కూడా తెలుసుకోవచ్చు.” అంటాడు. ఇది అతని వాస్తవిక దృక్పథాన్ని తెలియచేస్తుంది. బాల్యం లోని టీచర్లనందరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకొని, ఎవరేం సాహిత్యాన్ని పరిచయం చేసారో, తనకి ఏ రకమైన అవగాహన కలిగించారో వివరంగా చెప్పటం అబ్బురపరుస్తుంది. అది అతను తనతో అనుబంధం ఏర్పడిన వ్యక్తులకి ఇచ్చే ప్రాముఖ్యతని తెలియచేస్తుంది. తన జీవితంలోని ప్రతి సంఘటనని లేదా పరిణామాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో అర్ధం చేసుకొని దాన్ని తార్కికంగా వివరించే లక్షణం స్వామిలో స్వతహాగా వుంది. తనతో పెనవేసుకున్న, తనకి తారసపడ్డ ప్రతి మనిషి నేపధ్యాన్ని అతను అవగాహన చేసుకున్న తీరుకి అతనెంతో అభినందనీయుడు. అది ఈ పుస్తకం నిండా కనబడుతుంది. అతని భావోద్వేగాలన్నీ అతని అవగాహన నుండే పుట్టుకొచ్చాయని స్పష్టమవుతుంది. తన బలాలు, బలహీనతలన్నింటి పట్లా ఒక అంచనా కలిగి వున్నవాడు స్వామి.

స్వామి కవిత్వానికి ప్రోద్భల పరిచిన అంశాలు విప్లవోద్యమం – అందులోని ఒడిదుడుకులు, రాజ్యహింస – అది కలగచేసిన బీభత్సం, కుటుంబ సంబంధాలు – అవిచ్చే స్థైర్యం, విద్యార్ధి ఉద్యమాలు – అందులో దొరికిన స్నేహాలు, తనెక్కడ నివాసముంటే అక్కడి సామాజిక పరిస్థితుల‌ అవగాహన – ఆ వాతావరణంలో అంతర్లీనంగా వుండే హింస, తానేదుర్కొన్న కుల వివక్ష …. ఇవన్నీ అతని కవిత్వానికి వస్తువులే. ఏదో ఒక సందర్భమో, సంఘటనో ప్రభావితం చేయకుండా స్వామి కవిత్వం రాస్నట్లు కనబడడు. అంతగా ప్రతిస్పందించే సామాజిక దృక్పథం అతనిది.

ఈ పుస్తకంలో కవిత్వంతో పాటు అంతే ప్రాధాన్యం కలిగిన విషయం అతని మానవసంబంధాలు. తన కుటుంబ సభ్యుల్ని, గురువుల్ని, స్నేహితుల్ని, విప్లవకారుల్ని, తన మెస్ వర్కర్లనీ, విద్యార్ధుల్ని అతను ప్రేమించిన తీరు, వారికి ప్రాముఖ్యమిచ్చిన తీరు, వారి గుణగణాల్ని ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం. స్వామి పరిధిలోకి వచ్చిన వారెవరైనా అతనితో చిరకాల బంధాన్ని కలిగి వుండటం అతనిలోని ప్రేమాస్పద ప్రవర్తనకి సాక్ష్యంగా నిలుస్తుంది. ఎక్కడో అమెరికాలో సెటిల్ అయినా ఇప్పటికీ ఈ తెలుగు సమాజంతో అతనికున్న బాంధవ్యం సజీవమైనదే. ఈ పుస్తకంలో కనబడే అనేకమంది స్నేహితులు ఇప్పటికీ అతనితో అదే బంధాన్ని కలిగివుంటారు. తన జీవితాన్ని ప్ర‌భావితం చేసిన ప్రతి వ్యక్తిని స్వామి వివరించిన విధానం చాలా ఇంప్రెసివ్ గా, ఆర్ద్రంగా అనిపిస్తుంది.

స్వామికి ఒక కవిత రాయటానికి ఒక భావోద్వేగ సందర్భం అవసరం పడటమే కాదు తన కవితని వెంటనే శివారెడ్డి సారుకో, ఇతర మిత్రులకో, విరసం కామ్రేడ్స్‌కో వినిపించి, వారితో ఆ క్షణాల్ని పంచుకోవటం కూడా అంతే భావోద్వేగ పూరితం. అతని స్నేహాలన్నీ కూడా కవిత్వ ఆధారితం కావటం కాకతాళీయం కాదు. అది అతని జీవన విధానం కావొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అతను కవిత్వాన్ని అంతగా ఆశ్రయించాడు. అంతగా శ్వాశించాడు. ఒక ఊరేగింపు, ఒక మహాసభ, ఒక లాఠీచార్జ్, ఒక ఎన్ కౌంటర్, ఒక అరెస్ట్, నూతన్, సహదేవ్, ఎం.ఎస్.ఆర్. వంటి సాహిత్యాభిలాషులైన విప్లవకారులతో సాంగత్యం – కొంత కాలానికే వారి అమరత్వం, వారి జ్ఞాపకాలు, వారి ఎడబాటు కలిగించిన దుఃఖం, పొరుగింటి శారదక్క, బంధువైన పెద్దమ్మ, ఇంటి ఓనర్ పెళ్ళాం వంటి వారి జీవితాల్లోని నిత్యకృత్యమైన హింస, బీడీ కార్మికులు, కుటుంబసభ్యులైన అమ్మ, నాన్న, నాయనమ్మల ఎడబాటు, వారి మరణం…ఇవన్నీ అతని కవితా వస్తువులే. ప్రతి కవితలోనూ భావోద్వేగం, దృక్పథం పెనవేసుకొని వుంటాయి. ఆయా సందర్భాలు అతన్ని అలా కవిత్వంలోకి తోసేస్తాయి.

మంచి బుద్ధిజీవి, చదువులో ప్రజ్ఞావంతుడైనా స్వామికి కళలు, సంగీతం, సినిమాల పట్ల అభిరుచి కూడా అపారం. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో చూసిన అంతర్జాతీయ, జాతీయ సినిమాలు తనని ప్రభావితం చేసిన తీరుని వివరించిన విధానం ఎంతో గొప్పగా వుంటుంది. సైగల్ పాట అంటే ప్రాణం పెట్టే స్వామి భావుక స్వభావానికి, భౌతికవాదానికి మధ్య అభేదాన్ని నిరూపిస్తాడు. నల్లజాతి గాయకురాలు ట్రేసీ చాప్మన్ కి గ్రామీ అవార్డు వచ్చినప్పుడు రాసుకున్న కవిత, ఆ కవితనిప్పుడు విచికిత్స చేసుకున్న తీరు మెచ్చుకోతగ్గది. అప్పటిలో రాసుకున్న కొన్ని కవితల్ని ఇప్పుడైతే అలా రాసుండేవాడినని చెప్పటం అతనిలోని నిజాయితీ. అలాగే విప్లవ పార్టి చీలికకి గురైనప్పుడు రాసుకున్న కవిత్వంలోని అవగాహన లోపాన్ని ఇప్పుడు పునస్సమీక్షించుకుంటాడు.

స్వామి రచనా శైలి ఆర్తి ప్రధానంగా సాగుతుంది. ముఖ్యంగా తన బాపు, నాయనమ్మలతో తన అనుబంధాన్ని వివరిస్తున్నప్పుడు చాలా ఆర్ద్రంగా అనిపిస్తుంది. స్వచ్ఛ‌మైన ప్రేమలో ముంచి తీసిన అక్షరాలతో వారి గురించి రాసిన భాగాలవి. తనని మూడు నెలల పసిగుడ్డుగా వొదిలేసి వెళ్ళిన అమ్మని గురించి, ఆమెని తాను అర్ధం చేసుకున్న తీరుని చదివినప్పుడు నేను చాలాసేపు పుస్తకం చదవటం ఆపేసాను. ఎంతో గొప్ప మానవీయతతో మనల్ని కట్టిపడేసే అధ్యాయాలవి.

స్వామీ! ఇది మనలాంటి వాళ్ళందరం నడిసొచ్చిన తొవ్వనే. ఆ తొవ్వని మరోసారి కళ్ళముందు పరిచినందుకు ధన్యవాదాలు. ఆత్మీయ కౌగిలింత కూడా!

(“నడిసొచ్చిన తొవ్వ. రచన – నారాయణస్వామి వెంకటయోగి. కవిసంగమం బుక్స్ ప్రచురణ. 316 పేజీలు. వెల రూ.250. ప్రతులకు: నవతెలంగాణ ప్రచురణలు.)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

6 thoughts on “గుండె కింది తొవ్వ

  1. రచన గురించీ, రచయితా గురించీ చాల బాగా చెప్పారు.

  2. అద్భుతమైన సమీక్ష నడిచొచ్చిన తొవ్వ ఇది ప్రతి జీవితానికి వర్తిస్తుంది ఒక మనిషి జీవితంలోని మనిషి తత్వాన్ని వివరించినట్లుగా ఉంది ..నారాయణస్వామి గారంటే గౌరవం పెరిగింది మీ సమీక్ష..చదివాక..అభినందనలు

  3. నారాయణస్వామి గారి నడిచొచ్చిన తొవ్వ సమీక్ష ..ఒకమనిషిలోని అసలైన మనిషిని చూపించినట్లుంది అభినందనలు

  4. మీ,సమీక్ష, బాగుంది, సర్!నాకే, ఇంకా ఆ బుక్ చదివే మహదాకాశం రాలేదు. ఎంతగానో ప్రయత్నం చేస్తున్న,..కొలిమివేదిక, మాగుండెలో కలకాలం, నిలవాలని, ఆశిస్తూ, మీకుఅభినందనలు!💐💐

  5. పుస్తకం [నడిసొచ్చినతోవ ] చదవలేదుగానీ ,మీసమీక్ష చాలాబాగుంది.

  6. నడిసొచ్చిన తొవ్వ 💚💚💚

Leave a Reply