గుండెకీ గొంతుకీ నడుమ కొట్లాడుతున్న పాట

అప్పుడప్పుడూ నన్ను ప్రేమగా పలకరించడానికొచ్చేదొక పాట
కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు
నెత్తిని టోపి, భుజాన గుడ్డసంచితో పాత సైకిలుమీద
ఆ పాట
పంటకాలవలా వచ్చేది,
వచ్చి..నాఎదురుగా కూర్చుని
మెత్తగా నవ్వుతుంటే..
పల్లెతనం పదమై కుర్చీలో ఒదిగినట్టుండీది,
పాటతో మాట కలిపితే పల్లెను
పలకరించినట్టేవుండీది,
పాటతో కలిసి నడిస్తే
పైరగాలిలో పచార్లు చేసినట్టుండీది,
పాట పనిగట్టుకుని మా ఇంటికి రావడం ఒక పండగ ,
ఆ పాటకు చెవులొగ్గడం అరదైన పండగ,
పాట లో ప్రతి పదమూ స్వచ్ఛంగా
ఎండాకాలం ఏటొడ్డు ఇసకదిబ్బమీద తీసిన చలమలో కడిగి వెన్నెల్లో ఆరబెట్టితీసినట్టుండీది,
పాట పలికే ప్రతి మాటా
అప్పుడే చెట్టునుండి దించిన
లేత తాటిముంజెలా నవనవలాడీది,

పూలరేకుల్లాటి మృదువైన పదాలు
పాటపెదాలమీదినుంచి ఈటెలై
దూసుకురావ‌డం అద్భుతమే,
అసలా పాటే అద్భుతం,

‘అందె’వేసిన చేతి ‘లయ’ లహరుల్లో పాట
ఆషాఢమాసపు నాగావళి నడకయ్యేది,
గజ్జెకట్టిన పాదాల కదలికల్లో పాట
ఊళ్ళను ఊపేసే ఉప్పెనయ్యేది,

సెమరపిల్లులతో శంఖమూదించిన పాట,
సిలకలతో కత్తులు దులపరింప జేసిన పాట,
మిడతలతో బడితెలు పట్టించిన పాట,
మాయింటికొచ్చి మంచమ్మీద కూర్చొని
అమాకత్వం అచ్చుగుద్దినట్టు మాట్లాడుతుంటే
నేనేదో కలల లోకంలో కలియదిరిగినట్టుండీది,
నా మూడేళ్ళ మనవరాల్నెత్తుకుని ముద్దాడి
‘నాయురాలా…’అని పాట ఇకటాల వానై కురుస్తుంటే
మావూళ్ళో మా కళ్ళం లోని
నిత్తెమల్లిమొక్క జల్లుమని
పువ్వుల్ని రాలుస్తున్న కమనీయ దృశ్యం కళ్ళముందు కదలాడీది,

ఓడా నువ్వెల్లిపోకే అని దిగులు పడిన పాట
యంత్రం నడకను ఎరుకపరచిన పాట
కూడు గుడ్డలేని కూలినాలోళ్ళు
కొడవళ్ళకు కక్కులు కొట్టాలని
ఎలుగెత్తిన పాట

దేహాల్ని ఊపేసిన పాట
దేశాన్ని కుదిపేసిన పాట
బంతిపువ్వులా నాఎదురుగా
కూర్చుని ఊసులాడుతుంటే
ఏ మంత్రనగరి సరిహద్దుల్లోనో
సంచరిస్తున్నట్టుండీది,

కొండా కోనల్ని కదిలించి
గుండెల్ని మండించి
కదిపి కుదిపిన పాట ,
మునసబు కరణాల్ని
మట్టిగలిపిన పాట
బీదాబిక్కిదోసిట బువ్వయిన పాట

సరస్వతమ్మ సక్కగా ముఖం చూపించి గౌరవించింది..
లచ్చెమ్మ మాత్రం వీపు చూపించి
దరిద్రాన్నే బహుమానంగా ఇచ్చిందని నిష్కల్మషంగా నవ్వి నవ్వించిన పాట

‘ఏం పిలడో ఎల్దుమొస్తవా’ అని
పిలుపిచ్చి
ఎక్కడికెళిపోయిందో …
ఏ గగనాలకెగిసిపోయిందో …
ఏ తిరిగిరాని లోకాల్లోనో
పీడితవర్గానికి తిరుగుబాటు నేర్పడానికి ఎగిరెళ్ళిందో….

నా ఎదురుగా ఖాళీ కుర్చీ
పాట ఎప్పుడొస్తుందో ..అని
ఎదురుచూస్తున్నట్టే ఉంటుంది,

దానికెలాచెప్పను
నా గుండె కీ గొంతుకీ మధ్య
‘పాట’ కొట్లాడుతోందని..!

(మిత్రుడు వంగపండు జ్ఞాపకాలతో…)

పుట్టింది విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. ఎం.ఏ, బి.ఇడి చదివారు. కవి, కథా రచయిత, అధ్యాపకుడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరయ్యారు. ప్రస్తుతం పార్వతీపురంలో వుంటున్నారు. 'ఏటిపాట', 'ఒకరాత్రి రెండుస్వప్నాలు' (కథా సంపుటాలు), 'నది నిదానం చేసాక', 'ఎగిరిపోతున్న పిట్టల కోసం'(కవితా సంపుటాలు), 'నాగేటి చాలుకు నమస్కారం', 'నాగలి' (దీర్ఘ కవితలు),'పాడుదమా స్వేచ్ఛాగీతం', 'ప్రియ భారత జననీ'(గేయ సంపుటాలు), 'నాగావళి అలల సవ్వడి', 'ఉన్నమాట' (పద్య సంపుటాలు), 'మనసు పలికే' (గజల్ గీతాలు) ప్రచురించారు. మిత్రులతో కలిసి 'స్నేహ కళాసాహితి'(1992 ) సంస్థను నడుపుతున్నారు.

Leave a Reply