గిలెటిన్లొస్తున్నాయి జాగ్రత్త!

అడుగు అడుగు నిర్భంధానికి గురవుతున్న చోట
ప్రజలు బంధీలై మెదడు పునాదిని కోల్పోయి
ఉన్మాదమెక్కుతున్న చోట
సహజాతాలు పోయి అభిజాత్యాలు నిండి
సహజ న్యాయ సూత్రాలు
మ్యూజియంలో దాచిన తాళపత్రాలై –
అడవంతా హత్యాకాండ
నగరమంతా హింసాకాండ
గ్రామాల్లో విధ్వంసకాండ
బతకడమే బరువవుతున్న చోట
నిలబడడమే నిరసన అవుతున్న చోట
భగత్ సింగ్ లా కావాలని ఉత్తుత్తి
బాంబులేసి నిరసన తెలియచేసి
ప్రజాస్వామ్యమని నమ్ముకుంటే
గాంధీలా వచ్చి గాయబ్ చేస్తారనే చరిత్ర ఉంది
ఉరికంభమెక్కిస్తారనే మరక ఉంది
ఇపుడు అందరం అడవికెల్లి పోరాటం చేయలేకున్నాం
నీ ప్రహసన ప్రజాస్వామ్య మోసాన్ని నమ్మలేం
నా నేలపై నేను మనిషిని మనిషిలా ఉండడమే నేరమైతే
పాలన యంత్రాంగం మొత్తం మనిషి నాశనం కోసమే పని చేస్తే

ఇపుడు రాజ్యమా !
ఇక నువ్వో నేనో తేల్చుకునే సమయమొచ్చింది.
అధికార దండం నీ చేతిలో ఉంటే
ప్రజల పోరాట చరిత్ర నా వెనుకాల ఉంది

నీతో కొట్లాడి మిగిలినవాళ్ళం పోయి రావలిసింది జైలుకే
ఐతే
ఆ మరణాలు, జైల్లు చెరసాలలు విప్లవ పాఠాల కేంద్రాలవుతాయి
బాస్టిల్ కోటలు బద్ధలవుతాయి
గిలెటిన్లొస్తున్నాయి జాగ్రత్త

కవి, రచయిత. సామాజిక కార్యకర్త.

Leave a Reply