గాలివాటం, గందరగోళం, నిర్బంధకాలం

ఒక సమాజాన్ని, ఒక కాలాన్ని అంచనా వేయడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక ఉత్పత్తి, సామాజిక సంబంధాలు … ఇవన్నీ ఒక సమాజపు లక్షణాలను నిర్దిష్ట స్థలకాలంలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి. అయితే వీటితో పాటు మరో ముఖ్యమైన ప్రమాణం కూడా ఉంది. అది ఒక సమాజం ఏ అంశాల గురించి మాట్లాడుతోంది? ఎవరిని చర్చా వస్తువులుగా మారుస్తోంది? ఎందుకంటే చర్చా వస్తువు ఎంపిక కూడా ఒక రాజకీయ చర్యే. ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి చర్చిస్తున్నామో, ఏ ప్రశ్నలను ద్వితీయ స్థాయి ప్రశ్నలుగా పక్కనపెడుతున్నామో, ఏ సమస్యల పట్ల మౌనంగా ఉంటున్నామో అవన్నీ ఆ సమాజపు చారిత్రక స్థితినీ, రాజకీయ చైతన్యాన్నీ ప్రతిబింబిస్తాయి.

తెలుగు సమాజంలో గత కొన్ని నెలలుగా దాదాపు నిరంతరాయంగా చర్చా వస్తువుగా మారుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక రోజు ఆయన వ్యాఖ్య, మరో రోజు ఆయన మతోన్మాద ప్రదర్శన, ఇంకో రోజు ఆయన రాజకీయ నిర్ణయం, మరొక రోజు ఆయన అభిమానుల అతి ప్రవర్తన. ఏదో ఒక రూపంలో ఆయన ప్రజా చర్చల్లో కేంద్రంగా ఉంటూనే ఉన్నాడు.

వీరోచిత పోరాటాలు, సామాజిక ఉద్యమాలు, హక్కుల కోసం సంఘర్షణలు, అసమానతలు, అణిచివేతలపై జరిగే సిద్ధాంత చర్చలు తెలుగు సమాజానికి కొత్తవి కావు. దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన రాజకీయ వాదోపవాదాలకు వేదికగా నిలిచిన చరిత్ర ఈ నేలకు ఉంది. అలాంటి నేలపై ఒక మిడిమిడి జ్ఞానంతో, బాధ్యతారాహిత్యంగా ఊగిపోయే సినీ నటుడు-రాజకీయ నాయకుడు ఇంత విస్తృత స్థాయిలో చర్చా వస్తువుగా మారడం నేటి మన సమాజ దుస్థితిని, రాజకీయ సంక్షోభాన్ని సూచిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధి. కాబట్టి ఆయన మాటల పట్ల, చేష్టల పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండటం సహజమే అని కొందరు భావించవచ్చు. అది కొంతవరకు నిజమే. కానీ సమస్య ఆసక్తిలో లేదు. ఆ ఆసక్తికి ఉన్న సామాజిక, రాజకీయ పునాది, దాని పర్యవసానమే అసలు సమస్య. పవన్ కళ్యాణ్ ఏ విలువలకు ప్రతినిధి? సమాజాన్ని ఏ దిశగా నడిపించాలని ప్రయత్నిస్తున్నాడు? ఆయన రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని విస్తరిస్తున్నాయా లేక కుదిస్తున్నాయా? అనేవే ముఖ్యం.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన తనను ఒక ప్రత్యామ్నాయంగా, వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తిగా, యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. కానీ ఆ ప్రత్యామ్నాయం ఎటువంటి స్పష్టమైన సామాజిక లేదా రాజకీయ దృక్పథంతో నిర్మితమైనది కాదు. ఒక సందర్భంలో ఒక మాట, మరో సందర్భంలో మరో మాట, ఒక ఎన్నిక బరిలో ఒక వైఖరి, మరో ఎన్నికలో దానికి విరుద్ధమైన వైఖరి … ఇలా పరిస్థితులను బట్టి మారే గాలివాటంగా ఆయన రాజకీయ ప్రయాణం నడిచింది. సిద్ధాంతం స్థానంలో ఉద్వేగం, కార్యాచరణ స్థానంలో వ్యక్తిత్వం, రాజకీయ స్పష్టత స్థానంలో గందరగోళం నిలిచాయి.

అయితే గాలివాటం రాజకీయాల సమస్య కేవలం స్థిరత్వం లేకపోవడంలోనే కాదు. అది సమాజంలో ఒక గందరగోళాన్ని కూడా సృష్టిస్తుంది. ప్రజలకు ఏ విలువల కోసం నిలబడాలో కాకుండా, ఎవరిని అనుసరించాలో మాత్రమే నేర్పిస్తుంది. హేతువు స్థానంలో భావావేశాన్ని, రాజకీయ చర్చ స్థానంలో వ్యక్తిగత విధేయతను నిలబెడుతుంది. ఒక రోజు లౌకికత గురించి మాట్లాడి, మరొక రోజు సనాతన రాజకీయాల గురించి మాట్లాడటం. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ఊపు, తరువాత అదే అధికార నిర్మాణాల్లో సేదతీరడం. ఇవన్నీ ఆయనలోని రాజకీయ గందరగోళాన్ని సమాజం ముందుంచాయి. రాజకీయ గారడీయో, బూటకపు ఎన్నికలో, ప్రజా గందరగోళమో … ఎలాగైతేనేం మొత్తానికి అధికారంలో భాగమయ్యాడు.

అధికారంలోకి వచ్చాకే ఆయన అసలు రూపం కనబడటం మొదలయ్యింది. విమర్శను రాజకీయ జీవితంలో సహజమైన భాగంగా స్వీకరించాల్సిన చోట, దానిని శత్రుత్వంగా చూడడం ప్రారంభమైంది. భిన్నాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య హక్కుగా కాకుండా వ్యక్తిగత అవమానంగా చిత్రీకరించే ధోరణి బలపడింది. ప్రభుత్వాలను, నాయకులను, విధానాలను ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, ప్రజా మేధావులపై వేధింపులు, కేసులు, విచారణలు, నిర్బంధ చర్యలు మొదలయ్యాయి.

విమర్శకు ప్రతివిమర్శతో సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యం. విమర్శకు పోలీసులతో సమాధానం చెప్పడం నిర్బంధం. విభేదాన్ని వాదనతో ఎదుర్కోవడం ప్రజాస్వామిక సంస్కృతి. విభేదాన్ని కేసులతో ఎదుర్కోవడం అధికార దుర్వినియోగం. అహంకారం.

గాలివాటం రాజకీయాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించినప్పుడు, ఆ గందరగోళం చివరికి నిర్బంధ రాజకీయాలకు మార్గం వేస్తుంది. ఎందుకంటే సిద్ధాంతం లేని చోట వ్యక్తిపూజ వస్తుంది. వ్యక్తిపూజ ఉన్న చోట ప్రశ్నల పట్ల అసహనం పెరుగుతుంది. ప్రశ్నలను భరించలేని అధికారం చివరికి నిర్బంధాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడే గాలివాటం ముగుస్తుంది. గందరగోళం తన పని పూర్తిచేస్తుంది. సమాజం నిర్బంధకాలం అంచులపై నిలబడుతుంది.

అయితే ఇది కేవలం ఒక నాయకుడి ప్రవర్తనలో వచ్చిన మార్పుగా మాత్రమే చూడటం సరైనది కాదు. దీని వెనుక ఆయన చుట్టూ నిర్మితమైన ఒక సామాజిక-రాజకీయ మంద ఉంది. ఆ మంద నిర్మాణంలో సినిమా ఇమేజ్ ఒక పాత్ర పోషిస్తే, కుల, మతోన్మాద రాజకీయాలు మరో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఒక ఉపరితల అంశం కాదు. అది రాజకీయార్థిక నిర్మాణంలో అంతర్భాగం. రాష్ట్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, పార్టీల ఎదుగుదల, నాయకత్వ పోటీలు, అధికార సమీకరణాలు అన్నీ వివిధ ఆధిపత్య కులాల చుట్టూ తిరగడం చరిత్ర పొడవునా మనకు కనిపిస్తుంది. కమ్మ, రెడ్డి, కాపు వంటి ప్రధాన సామాజిక వర్గాలు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే కాకుండా, రాజకీయ శక్తి నిర్మాణాలుగా కూడా పనిచేశాయి.

అయితే కుల విధేయత ఎప్పుడూ తనను తాను ప్రత్యక్షంగా ప్రకటించుకోదు. “నేను ఈ కులానికి చెందినవాడిని కాబట్టి ఈ నాయకుడి వెంటే ఉన్నాను” అని చాలామంది చెప్పరు. దానికి బదులుగా “అభివృద్ధి”, “నిజాయితీ”, “నాయకత్వ లక్షణాలు”, “మంచితనం”, “దార్శనికత” వంటి గంభీరమైన తటస్థ పదాల వెనుక అది తనను తాను దాచుకుంటుంది. అందుకే కుల రాజకీయాలు కనిపించనంత మాత్రాన అవి లేవని కాదు. చాలాసార్లు వాటి ప్రభావం అత్యధికంగా ఉన్నప్పుడే అవి అత్యల్పంగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి అంతగా సాదారణీకరించబడి ఉంటాయి.

ఈ సందర్భంలో తరచూ వినిపించే ప్రశ్న: “ఈ రోజుల్లో కులమెక్కడుందండి?” ఇది నిజంగా కులాన్ని తిరస్కరించే ప్రశ్న కాదు. చాలాసార్లు అది కులాన్ని కనిపించకుండా చేసే ఒక రాజకీయ వ్యూహం. సామాజిక శాస్త్రవేత్తలు దీనిని “కుల నిరాకరణ”గా అభివర్ణిస్తారు. కులం వల్ల లాభపడేవారికి అది సహజ స్థితిగా అనిపిస్తుంది. కులం వల్ల నష్టపోయేవారికి మాత్రం అది ప్రతిరోజూ ఎదురయ్యే వాస్తవం. అందుకే కులం లేదని చెప్పే సౌకర్యం కులం వల్ల నష్టపోయినవారికి కాదు, లాభపడినవారికే ఉంటుంది.

అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ ఏర్పడిన మద్దతును కేవలం కుల రాజకీయాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోవడం కూడా సరిపోదు. దానికి సినిమా సంస్కృతి ఉత్పత్తి చేసిన హీరో ఆరాధన కూడా జత కలిసింది. ఈ ఆరాధన మన సమాజపు వెనుకబాటుతనంలోనే ఉంది. సాహిత్యంలో, సినిమాల్లో నిర్మించబడిన పాత్రలను వ్యక్తీకరణగా మార్చి ఆరాధించడం మన సమాజ చైతన్య స్థాయిని సూచిస్తుంది. తెరపై అన్యాయాన్ని ఎదిరించే హీరో, రాజకీయాల్లో కూడా అదే పాత్ర పోషిస్తాడనే ఒక భావోద్వేగ సమీకరణం పనిచేస్తుంది. సినిమా పాత్రల్లో హీరో అయిన వ్యక్తి నాయకుడైతే ఆ నాయకుడు ఒక ప్రజా ప్రతినిధిగా కాకుండా ఒక రక్షకుడిగా, రక్షకుడి నుంచి క్రమంగా ఆరాధ్య వ్యక్తిగా మారతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ తన అభిమానుల్లో కొందరికి “దేవుడు”గా మారాడు.

ఇక్కడి నుంచే “జనసేన” అనే పేరుకు కూడా ఒక ప్రత్యేక రాజకీయ అర్థం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం పౌరులను కోరుకుంటుంది; సైనికులను కాదు. పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. తన నాయకుడినే నిలదీసే హక్కు ఉంటుంది. కానీ సైనికుడి రాజకీయ సంస్కృతి ప్రశ్న కంటే విధేయతను, విమర్శ కంటే అనుసరణను, చర్చ కంటే ఆజ్ఞాపాలనను ప్రోత్సహిస్తుంది.

అందుకే ఒక రాజకీయ పార్టీ తనను “సేన”గా, తన కార్యకర్తలను “సైనికులు”గా నిర్వచించుకోవడం కేవలం ఒక పేరు ఎంపిక కాదు; ఒక రాజకీయ ఎత్తుగడ. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేసే పార్టీకి “సేన” అనే ప్రతీక అవసరమేమిటి? సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే వారికి సైనికులు ఎందుకు కావాలి? చైతన్యవంతమైన పౌరులు సరిపోరా?

సమస్య పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాత్రమే కాదు. ఆయన చుట్టూ నిర్మితమైన రాజకీయ సంస్కృతి గురించి. హేతువును పక్కనపెట్టి భావావేశాన్ని ముందుకు తేవడం, పౌరహక్కులను పక్కనపెట్టి విధేయతను ప్రోత్సహించడం, ప్రశ్నను నిర్బంధించి ఆరాధనను పెంచిపోషించడం … ఇలాంటి ధోరణులు ఏ సమాజానికైనా ప్రమాద సంకేతాలే.

అందువల్ల పవన్ కళ్యాణ్‌ను ఒక వ్యక్తిగా కాకుండా ఒక లక్షణంగా చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు సమాజంలోని హీరో ఆరాధన, కుల రాజకీయాలు, వ్యక్తిపూజ, హేతువిరోధ ధోరణులు, ప్రజాస్వామ్య విలువల క్షీణత—ఈ అన్నింటి కలయికగా ఆయనను అర్థం చేసుకున్నప్పుడే ప్రస్తుత రాజకీయ పరిస్థితి యొక్క అసలు స్వరూపం మనకు కనిపిస్తుంది.

వీటన్నిటికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణామంలో అత్యంత గమనించదగిన మార్పు ఆయన లౌకికవాద భావాల నుండి బహిరంగ సనాతన రాజకీయ ప్రకటనల వైపు చేసిన ప్రయాణం. హిందూత్వ రాజకీయాల ప్రధాన లక్షణం సమాజంలోని వాస్తవ సామాజిక-ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మత రాజకీయాల వైపు మళ్లించడం. నిరుద్యోగాన్ని మర్చిపోయి మతం గురించి మాట్లాడించడం, అసమానతలను పక్కనబెట్టి సంస్కృతి గురించి మాట్లాడించడం, హక్కుల ప్రశ్నలను బలహీనపరచి విశ్వాసాల జవాబులను ముందుకు తేవడం. ఈ రాజకీయ ప్రాజెక్టుకు కేవలం బీజేపీ నాయకులు మాత్రమే అవసరం లేదు; ప్రాంతీయ స్థాయిలో దాని భాషను, దాని ప్రతీకలను, దాని ప్రాధాన్యతలను ప్రాచుర్యంలోకి తెచ్చే సామాజిక ప్రభావం కలిగిన పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కూడా అవసరం అవుతారు.

ఈ కోణం నుంచి చూస్తే, పవన్ కళ్యాణ్ పాత్ర మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన హిందూత్వ రాజకీయాలకు కేవలం మిత్రుడిగా కాదు, వాటి సామాజిక విస్తరణకు ఒక ముఖ్య వాహకుడిగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన చేస్తున్న పని కేవలం ఒక రాజకీయ కూటమిలో భాగస్వామ్యం మాత్రమే కాదు; హిందూత్వ రాజకీయాల భాషను సాధారణీకరించడం. “సనాతన ధర్మం” పేరుతో రాజకీయ చర్చను పునర్నిర్వచించడం. లౌకికతను అనుమానాస్పదంగా చూపించడం. హేతువాదాన్ని వెటకారం చేయడం. ప్రశ్నించే స్వరాలను లక్ష్యంగా చేసుకోవడం. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు కనిపించవు.

అసలు ఒక రాజకీయ నాయకుడిని అంచనా వేయాలంటే అతను ఎవరిని సమర్థిస్తున్నాడో మాత్రమే కాదు, ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నాడో కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ దాడులను ప్రధానంగా హేతువాదుల మీద, లౌకికవాదుల మీద, ప్రజాస్వామిక విమర్శకుల మీద, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం మాట్లాడే గొంతుకల మీద కేంద్రీకరిస్తున్నాడు. మరోవైపు కుల ఆధిపత్యం, కార్పొరేట్ దోపిడీ, సామాజిక అసమానతలు, అధికార కేంద్రీకరణ వంటి నిర్మాణాత్మక ప్రశ్నలు ఆయన రాజకీయ చర్చలో ఎలాంటి స్థానాన్ని పొందడం లేదు. ఈ ఎంపికలు యాదృచ్ఛికాలు కావు. అవి ఆయన భావజాల స్థానాన్ని సూచిస్తున్నాయి.

అందువల్ల సమస్య పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాడా లేదా అన్నది కాదు. సమస్య ఏమిటంటే, ఆయన రాజకీయంగా ఏ శక్తులకు ఉపయోగపడుతున్నాడు? ఆయన రాజకీయ చర్యల చివరి ఫలితం ఎవరికి లాభం చేకూరుస్తోంది? ఆయన ప్రజల్లో బలపరుస్తున్న విలువలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే, ఒకప్పుడు మార్పు గురించి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు హిందూత్వ రాజకీయాల సామాజిక విస్తరణలో కీలక పాత్ర ఎలా పోషిస్తున్నాడో అర్థమవుతుంది.

ఇక తెలంగాణ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య: “తెలంగాణ మీ అయ్య జాగీరా.” దానికి తెలంగాణ సమాజం సమాధానంగా “అవును, మా అయ్య జాగీరే” అని చెప్పింది. కానీ ఆ మాట వాడడంలో ఉన్న భూస్వామ్య, పితృస్వామ్య భావనను అర్థం చేసుకోవాలి.

భాష కేవలం భావాలను వ్యక్తపరిచే సాధనం కాదు. మనం సమాజాన్ని ఎలా ఊహించుకుంటామో, అధికారాన్ని ఎలా అర్థం చేసుకుంటామో, సంబంధాలను ఎలా నిర్మించుకుంటామో కూడా భాష ద్వారానే వ్యక్తమవుతాయి. అందుకే భాషలోని ప్రతి పదం కేవలం ఒక పదం కాదు; అది ఒక చరిత్రను, ఒక సామాజిక సంబంధాన్ని, ఒక ప్రాపంచిక దృక్పథాన్ని మోసుకెళ్తుంది. “అయ్య జాగీరు” అనే పదబంధం అలాంటి పదాల్లో ఒకటి.

మొదట అది ఒక సాధారణ తిట్టు మాటలా, లేదా ఏదో వ్యక్తి హక్కును ప్రశ్నించే పదబంధంలా కనిపించవచ్చు. కానీ దాని లోపలి నిర్మాణాన్ని పరిశీలిస్తే, అందులో రెండు కీలక భావనలు దాగి ఉన్నాయి: “అయ్య” మరియు “జాగీరు”.

“అయ్య” అనేది ఇక్కడ కేవలం ఒక వ్యక్తిని (తండ్రిని) సూచించడం కాదు. అది ఒక పురుషాధిక్య, అధికారం కలిగిన స్థానాన్ని సూచిస్తుంది. కుటుంబంలో తండ్రి, గ్రామంలో పెద్దమనిషి, సమాజంలో యజమాని (భూస్వామి, పెట్టుబడిదారుడు), రాజకీయాల్లో నాయకుడు … ఇలా వివిధ రూపాల్లో కనిపించే పితృస్వామ్య అధికారానికి “అయ్య” ఒక సాంస్కృతిక ప్రతీక. అదే సమయంలో “జాగీరు” అనే పదం భూమి, ఆస్తి, యాజమాన్యం, ఆధీనత అనే భావనలను తెలియజేస్తుంది.

ఈ రెండూ కలిసినప్పుడు వచ్చే అర్థం ఏమిటి? ఒక పురుష యజమాని ఉంటాడు. అతనికి ఒక ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తిపై అతనికి సహజమైన హక్కు ఉంటుంది. ఆ హక్కును ప్రశ్నించే వారికి సమాధానంగా “ఇది మీ అయ్య జాగీరా?” అని అడుగుతారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పదబంధం యాజమాన్యాన్ని విమర్శించడానికి ఉపయోగించబడుతున్నప్పటికీ, అది విమర్శ చేసే భాష కూడా అదే యాజమాన్య-కేంద్రిత ఊహల నుంచి వస్తుంది. అంటే “జాగీరు” అన్న భావననే ప్రశ్నించకుండా, ఎవరి జాగీరు అన్నదే ప్రశ్నగా మారుతుంది.

ఇంకా లోతుగా చూస్తే, ఇందులో ఒక పితృస్వామ్య నిర్మాణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక ఊహలో “యజమాని” ఎప్పుడూ ఒక పురుషుడు. “అయ్య జాగీరు” అంటాం కానీ “అమ్మ జాగీరు” అనడం కనిపించదు. తెలంగాణ ఉద్యమకారులైనా “అవును, ఇది మా అమ్మ జాగీరు” అని చెప్పలేకపోయారు. ఇది యాదృచ్ఛికం కాదు. చరిత్రపరంగా ఆస్తి, అధికారం, వారసత్వం, నిర్ణయాధికారం అన్నీ పురుషుల చేతుల్లో కేంద్రీకృతమైన సమాజ నిర్మాణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. భాష ఆ చరిత్రను ఇప్పటికీ మోస్తూనే ఉంది. ఆ భాషను, భావనను పునరుత్పత్తి చేసే సామాజిక, రాజకీయార్థిక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

అసలైన ప్రజాస్వామ్యం ఈ ఊహలను తలకిందులు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకుడు “అయ్య” కాదు. రాష్ట్రం ఎవరి “జాగీరు” కాదు. ప్రభుత్వ పదవి వారసత్వ ఆస్తి కాదు. ప్రజా వనరులు ఎవరి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండవు. ప్రజలే సార్వభౌములు. నాయకులు తాత్కాలిక ప్రతినిధులు మాత్రమే.

అందువల్ల “అయ్య జాగీరు” అనేది భూస్వామ్య సంబంధాల అవశేషం. అది పితృస్వామ్య అధికారానికి ఒక భాషాత్మక గుర్తు. అది యజమాని-బానిస సంబంధాలను సాధారణీకరించే ఒక సాంస్కృతిక జ్ఞాపకం. భాషలో ఇలాంటి పదాలు బతికి ఉన్నంత కాలం, వాటి వెనుక ఉన్న అధికార సంబంధాలు కూడా పూర్తిగా అదృశ్యమవ్వవు. అందుకే భాషను విమర్శించడం అనేది కేవలం వ్యాకరణాన్ని సరిచేయడం కాదు. ఆ భాషలో ఉన్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని గుర్తించడం. వాటిని ద్వంసం చెయ్యడం.

కులానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం. పవన్ కళ్యాణ్‌కు తెలిసో తెలియకో “జన సైనికులను” ఉద్దేశిస్తూ ఒక మీటింగ్‌లో “కులం ఒక సోషల్ ఫాక్ట్” (సామాజిక వాస్తవం) అని చెప్పాడు. ఈ సోషల్ ఫాక్ట్ అని అనడంలో అసలు ఉద్దేశం ఏంటి? అది ఒక వాస్తవాన్ని ఒప్పుకోవడమా? లేక తెలియకుండానే ఒక సామాజిక అన్యాయాన్ని సహజీకరించడమా?

“సోషల్ ఫాక్ట్” అనే భావనను ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డుర్ఖైం ప్రతిపాదించాడు. అతని ప్రకారం సోషల్ ఫాక్ట్ అంటే వ్యక్తికి వెలుపల ఉన్న, వ్యక్తి మీద నిర్బంధ శక్తిని కలిగి ఉన్న, సమాజంలో సాధారణంగా అంగీకరించబడిన సామాజిక వాస్తవం. భాష, చట్టం, కుటుంబ వ్యవస్థ, మతాచారాలు, నైతిక నియమాలు … ఇవన్నీ సోషల్ ఫ్యాక్ట్స్‌కి ఉదాహరణలు. ఆయన ప్రకారం మనం పుట్టకముందే ఇవి ఉంటాయి; మనం పుట్టాక వీటి మధ్యలోనే జీవించాల్సి వస్తుంది; వాటిని పూర్తిగా నిరాకరిస్తే సమాజం నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. సమాజం తన సమతుల్యతను కోల్పోతుంది. కాబట్టి ఈ సామాజిక వాస్తవాలను అంగీకరించాలి.

ఈ నిర్వచనం ప్రకారం చూస్తే కులం కూడా ఒక సోషల్ ఫాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ తమ కులాన్ని ఎంచుకుని పుట్టరు. కులం వ్యక్తికి ముందే ఉంటుంది. వ్యక్తి పుట్టిన క్షణం నుంచే అది సామాజిక గుర్తింపులో భాగమవుతుంది. వివాహ సంబంధాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు, విద్యా అవకాశాల నుంచి సామాజిక గౌరవం వరకు అనేక అంశాలపై అది ప్రభావం చూపుతుంది. కుల నియమాలను అతిక్రమించిన వారికి సమాజం శిక్షలు విధించిన చరిత్ర కూడా ఉంది. ఈ అర్థంలో కులం ఒక శక్తివంతమైన సోషల్ ఫాక్ట్.

అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. కులం ఒక సోషల్ ఫాక్ట్ అని చెప్పడం కులాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుందా? సరిపోదని భారతీయ సామాజిక చరిత్ర చెబుతుంది. ఎందుకంటే డుర్ఖైం పద్ధతి ప్రధానంగా సమాజం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకుంటుంది. కానీ అది సమాజం న్యాయంగా పనిచేస్తుందా లేదా అన్న ప్రశ్నను కేంద్రం చెయ్యదు. అతని ఫంక్షనలిస్ట్ దృక్పథం సమాజాన్ని ఒక జీవి లాగా చూస్తుంది. శరీరంలో ప్రతి అవయవం ఏదో ఒక పని చేసినట్లే, సమాజంలోని ప్రతి సంస్థ కూడా ఏదో ఒక “కార్యం” నిర్వహిస్తుందని భావిస్తుంది. సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఒక వ్యవస్థ కొనసాగుతోంది కాబట్టి అది అవసరమైనదేనా? ఒక వ్యవస్థ వేల సంవత్సరాలుగా ఉంది కాబట్టి అది న్యాయమైనదేనా? ఒక సామాజిక నిర్మాణం సమాజంలో స్థిరపడిపోయింది కాబట్టి దానికి చట్టబద్ధత వచ్చేస్తుందా? ఫంక్షనలిజం ఈ ప్రశ్నల దగ్గర మౌనంగా ఉంటుంది.

డుర్ఖైం సిద్ధాంతం “కులం ఎందుకు ఉంది?” అని అడుగుతుంది. కానీ “కులం వల్ల ఎవరు పైకి ఎక్కారు, ఎవరు అణగారిపోయారు?” అని అడగదు. అది “కులవ్యవస్థ సమాజంలో ఏ పాత్ర పోషించింది?” అని అడుగుతుంది. కానీ “ఈ వ్యవస్థ వల్ల ఎవరి జీవితాలు నాశనమయ్యాయి?” అని అడగదు. అది స్థిరత్వాన్ని చూస్తుంది; కానీ ఆ స్థిరత్వం మాటున దాగివున్న అధికారం, దోపిడీ, ఆధిపత్యాన్ని చూడ నిరాకరిస్తుంది.

అందుకే అంబేద్కర్ దృష్టికోణం ఇక్కడ అత్యంత కీలకం. అంబేద్కర్‌కు కులం ఒక సాధారణ సామాజిక వాస్తవం కాదు. అది ఒక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్య వ్యవస్థ. ఆయన ప్రసిద్ధంగా చెప్పినట్లుగా కులం కేవలం “డివిజన్ ఆఫ్ లేబర్” కాదు; “డివిజన్ ఆఫ్ లేబరర్స్”. అంటే కేవలం శ్రమ విభజన మాత్రమే కాదు, అది శ్రామికుల విభజన కూడా. అంతేకాదు, ప్రతి కులం తన కింద ఉన్న మరో కులాన్ని అణచివేసే విధంగా నిర్మించబడిన “గ్రేడెడ్ ఇనీక్వాలిటీ”. అంటే పొరలు పొరలుగా అమర్చిన అసమానతల వ్యవస్థ.

ఇంకా సాధారణీకరించి చెప్పాలంటే:

డుర్ఖైం అడిగే ప్రశ్న: “కులం ఎలా పనిచేస్తుంది?”

అంబేద్కర్ అడిగే ప్రశ్న: “కులం ఎవరిని అణచివేస్తుంది?”

డుర్ఖైం దృష్టితో కులాన్ని ఒక సామాజిక వాస్తవంగా అర్థం చేసుకోవచ్చు. కాని అంబేద్కర్ దాన్ని ఒక సామాజిక నేర వ్యవస్థగా అర్థం చేసుకున్నాడు.

ఈ రెండింటి మధ్య ఉన్న తేడా అత్యంత రాజకీయమైనది. ఎందుకంటే “కులం ఒక సోషల్ ఫాక్ట్” అనే మాట ఆధిపత్య కులాలకు, వాళ్ల రాజకీయాలకు సేవ చేసే మాట. అది యథాతథ స్థితిని సమర్థించే మాట. “కులం ఒక సోషల్ ఫాక్టే కదా”, “ఇది ఎప్పటినుంచో ఉంది కదా”, “ప్రజల మనస్తత్వాలు ఒక్కరోజులో మారవు కదా” అంటూ కులవ్యవస్థను సహజమైనదిగా, తప్పించలేనిదిగా చూపించడం. ఇక్కడ సోషల్ ఫాక్ట్ అనే భావన విమర్శకు కాకుండా సాకుకు మారిపోతుంది. ఇదే కారణంగా కులాన్ని కేవలం ఒక సామాజిక వాస్తవంగా చూడటం సరిపోదు. ఎందుకంటే బానిసత్వం కూడా ఒకప్పుడు సోషల్ ఫాక్టే. సతీసహగమనం కూడా ఒకప్పుడు సోషల్ ఫాక్టే. కానీ అవి సమాజంలో ఉన్నాయన్న కారణంతో వాటికి నైతికత రాదు.

అందుకే “కులం ఒక సోషల్ ఫాక్ట్” అనే మాట విన్నప్పుడు, వెంటనే అడగాల్సిన ప్రశ్న: దాన్ని చెప్పేవాడు కులం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకుంటున్నాడా, లేక అది అలాగే కొనసాగడానికి ఒక తాత్విక కవచం తయారు చేస్తున్నాడా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే చివరికి సామాజిక శాస్త్రానికి, సామాజిక న్యాయ రాజకీయాలకు మధ్య ఉన్న తేడా. పవన్ కళ్యాణ్‌కు సామాజిక శాస్త్రవేత్త హోదా ఇవ్వలేం. కానీ ఆయన భాష మాత్రం కులాన్ని, కుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేయడమే!

చివరగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుసన్నల్లో కొనసాగుతున్న నిర్బంధం గురించి. ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలు పరీక్ష అధికారాన్ని ప్రశ్నించినప్పుడు ఆ వ్యవస్థ ఎలా స్పందిస్తుందనేదే. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, విమర్శించడం, వారి నిర్ణయాలను సవాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు మాత్రమే కాదు, ఒక పౌర బాధ్యత కూడా.

రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యం అధికారాన్ని ప్రశ్నించే హక్కును కూడా కలిగి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారి పట్ల విమర్శ సహజం. ఆ విమర్శ కఠినంగా ఉండొచ్చు, కటువుగా ఉండొచ్చు, అసౌకర్యంగా ఉండొచ్చు. కానీ అసౌకర్యం కలిగిస్తోందన్న కారణంతో దాన్ని నేరంగా పరిగణించలేం. ఒక ప్రజా నాయకుడి ప్రతిష్ఠ, ఒక ప్రభుత్వ ఇమేజ్, ఒక పార్టీ గౌరవం … ఇవేవీ రాజ్యాంగ హక్కుల కంటే పెద్దవి కావు.

ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, చట్టాన్ని న్యాయం కోసం కాకుండా రాజకీయంగా వినియోగించే ధోరణి. చట్టం ఒక ప్రజాస్వామ్య సమాజంలో పౌరులను రక్షించడానికి ఉండాలి; అధికారాన్ని రక్షించడానికి కాదు. కానీ ఒకసారి చట్ట అమలు సంస్థలు అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తే, పౌర హక్కులు క్రమంగా బలహీనపడతాయి. అప్పుడు కేసు శిక్ష కోసం కాకుండా భయపెట్టడం కోసం ఉపయోగించబడుతుంది. అరెస్టు న్యాయం కోసం కాకుండా సందేశం పంపడం కోసం ఉపయోగించబడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యం ఒక వ్యక్తిని జైలుకు పంపడం మాత్రమే కాదు. ఒక ఉదాహరణను సృష్టించడం. “ప్రశ్నిస్తే ఇదే జరుగుతుంది” అనే సందేశాన్ని సమాజానికి పంపడం. ఆ సందేశం ప్రభావం ప్రత్యక్ష బాధితుడి మీద మాత్రమే ఉండదు. వందలాది మంది ఇతరుల మీద కూడా ఉంటుంది. వారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు. విమర్శించే ముందు భయపడతారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ముందు పరిణామాలను లెక్కేస్తారు. ఇదే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

పవన్ కళ్యాణ్‌ను విమర్శించాడు అనే సాకుతో “ప్రశ్న” రావణ్‌పై కొన్ని డజన్ల కొద్దీ కేసులు వేశారు. ఆ కేసుల్లో జైలుకు పంపడం వీలు కావడం లేదని ఏకంగా “రాజద్రోహం” కేసు పెట్టి ఖైదీని చేశారు. ఇది రాజ్యాంగవిరుద్ధం.

ఇప్పుడు ఇది కేవలం రావణ్ సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్య. తెలుగు సమాజంలో విమర్శించే స్థలం ఎంత మిగులుతోంది? భిన్నాభిప్రాయానికి ఎంత రక్షణ ఉంది? అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎంతవరకు సురక్షితంగా ఉంది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశాలు కావాలి.

ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. విమర్శించే హక్కు, వ్యతిరేకించే హక్కు, వెటకారం చేసే హక్కు, అసమ్మతి వ్యక్తం చేసే హక్కు … ఇవన్నీ కలిసే ప్రజాస్వామ్యం. అధికారాన్ని ప్రశ్నించినందుకు ఎవరైనా భయపడాల్సి వస్తే, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతి నిర్బంధం వెనుక ఒక వ్యక్తి మాత్రమే బాధపడడు. ఒక సమాజం తన స్వేచ్ఛలో కొంత భాగాన్ని కోల్పోతుంది. కాబట్టి ప్రశ్నను సజీవంగా నిలబెట్టుకుందాం. మన స్వేచ్ఛను మనమే కాపాడుకుందాం.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply