గాలిపటం

”నువ్వు కూడా ఎవడో ఒకడ్ని తగులుకుంటే పోద్ది గా, ఈ రచ్చా రావి డీ లేకుండా” అన్నది పోలీసమ్మ, టీ కప్పుని పెదవుల దగ్గరి కి తీసికెళుతూ. ”ఎవర్ని తగులుకోమంటావ్, మీ ఇంటాయన్ని తగులుకోమంటావా”అని కాంతి వేగంతో పోలీసమ్మకి బదులిచ్చింది వనజ. డైలాగ్ చెప్పిన పోలీసమ్మ తన టీ కప్పుని, చేతి నుండి నోటి దగ్గరకు చేర్చే లోపే, వనజ పేల్చిన బదులు డైలాగ్, స్టేషన్లో తూటాలా పేలింది. పోలీసమ్మతో పాటు స్టేషన్లో మిగిలిన ఉద్యోగులు కూడా కొన్ని క్షణికాల పాటు కాలం గడ్డ కట్టుకు పోయినట్టు, ఎక్కడి వారు అక్కడ స్తంభించి పోయారు. చివరికి మధ్యస్థం చేస్తున్నట్టు, ముసలి రైటరు వనజ తో ”నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడటమేనా అమ్మాయీ, పెద్ద మనుషులతో” అన్నాడు. వనజ అంతే వేగంగా ”ఒక పెద్ద మనిషి మాట్లాడాల్సిన పద్ధతేనా సార్ అది, మీరే చెప్పండి” అన్నది. వనజ ఆ మహిళా పోలీస్ స్టేషన్ కి చాలా కాలంగా వస్తూ వుంది. మొదటి సారి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మగవాడు ఇక నా వాడు కాదు అని రూఢి చేసుకున్న రోజు, ముక్కు నుండి, ఇతర శరీర భాగాల నుండి కారుతున్న రక్తం తో, అడుగు తీసి అడుగు వేయలేని కాలితో పాటు, తగలబెట్టడానికి మగడు తల మీద కుమ్మరించిన అయిదు లీటర్ల కిరోసిన్ నిండిన శరీరంతో దొడ్డి తలుపు గుండా దూసుకుని వీధిలోకి వచ్చి, కనిపించిన ఆటో ఎక్కి నేరుగా ఈ మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చింది, అప్పటి నుండి రెండు సంవత్సరాలుగా ఇలా చాలా సార్లే స్టేషన్ కి వస్తూ ఉంటుంది. నా కేస్ తీసుకోండి అంటూ ఉంటుంది. అదిగో ఆ రెండు సంవత్సరాల చనువుతోనే, పోలీసమ్మ వనజ ని అంత మాట అనడానికి సాహసించింది.

అసలు వనజ కి ఇవాళ స్టేషన్ కి రావడానికి అస్సలు తీరిక లేదు. సంక్రాంతి పండగ వచ్చేస్తూ వుంది దగ్గరలో, గాలి పటాల ఆర్దర్లు చాలా వచ్చి వున్నాయి. రకరకాల రూపాలలో గాలిపటాలు చేయడంలో వనజ కి మంచి పేరు. కొన్ని రోజులుగా ఆర్డర్లు తెచ్చుకుని చేస్తూ వుంది. తయారీ సామగ్రి కొంచెం కొనాల్సిన అవసరం పడటంతో ఇంటి తలుపుకి గడియ పెట్టి అలా తిరిగిందో లేదో వనజ భర్త, తన భార్య, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి మోటారు బైక్ ఎక్కుతూ కనిపించాడు. అంతే వనజ కి తల తిరిగేంత ఆగ్రహం వచ్చింది. గాలి పటాల సామగ్రి సంగతి మరిచిపోయింది. వనజ కాపురం చేసిన అదే ఇంటి నుండి వనజ ని వెళ్ల కొట్టిన ఆమె భర్త, విడాకులు తీసుకోకుండానే రెండో భార్యతో కాపురం చేస్తున్నాడు. తన భర్త రెండవ భార్యతో కాపురం చేస్తున్న అదే ఇంటి ప్రహరీ లోపల ఒక మూల, రెండు గదులతో చిన్న రేకుల ఇల్లు వేసుకున్నది వనజ. ఆ రెండు ఇళ్ళకి మధ్య ఒక తడక మాత్రమే అడ్డం, అటు వైపు ఏం జరుగుతుందో ఇటువైపు వున్న వనజ, కళ్ళు చెవులు అటు పడేసి వింటూనే ఉంటుంది.

తను తన బిడ్డ ఎక్కి తిరిగిన అదే బైక్ మీద వేరే స్త్రీ ఆమె పిల్లలు ఎక్కుతూ ఉండటం చూసి వనజకి కడుపు కాలి పోయింది. కొంచెం తడకకి అటు వైపు గా జరిగి ”100 గ్రాముల కోల్గెట్ పేస్ట్ కొనండి – రెండు బ్రష్షులు ఫ్రీగా పొందండి ” అని అరిచింది. ఆ మాట వినగానే తడక అవతల, బైకు ఎక్కడానికి సిద్ధ పడుతూ వున్న ఆస్త్రీ చేతిలోని హ్యాండ్ బాగ్ నేలకేసి కొట్టి, ”ఉహుహూహూ”అని ఏడుపు లంకించుకుంది. అదంతా చూసి వనజ భర్త, బైకు స్టాండు వేసి తడక దూకి వచ్చి వనజ ని వంగబెట్టి గుద్ది, వనజ చేసి పెట్టిన గాలి పటాలను చించి పోగులు పెట్టి చివర్న తన సిగరెట్ లైటర్ పెట్టి అన్నిటినీ తగల బెట్టాడు. అడ్డు వెళుతున్న వనజ ని జుట్టు పట్టుకుని అందిన చోటల్లా గుద్ది పెట్టాడు. ఇంత జరుగుతున్నా చుట్టు పక్కల వాళ్ళు చోద్యం చూద్దామని కూడా ఇటు రారు. ఈ గొడవలు చూసి, చూసి కొత్తగా చూడటానికి ఏమీ లేక వాళ్లు ఇటువైపు తొంగి చూడటం మానేశారు. వాళ్లలో వయసు మళ్లినవాళ్లు ”నోరు పారేసుకుని తన్నులు తినడం వలన వచ్చే లాభం ఏమిటి, నోరు మూసుకుని ఉండమని” వనజ కి చెప్పి చూసారు. అయినా వనజ ఊరుకోదు. భర్త తనని కాదని ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాడు. తన్నులు తినాల్సి వస్తుందని తెలిసినా, కడుపుమంట ఆమె ను నోరు పారేసుకునేలా చేస్తుంది. అదే ఈ రోజు వనజ ఇచ్చిన కోల్గెట్ కొంటే రెండు బ్రష్షుల ఫ్రీ స్లోగన్ కి మూలం.

స్టేషన్ కి వచ్చిన వనజ స్టేషన్ పంచలో, గవద మీద కారిన రక్తాన్ని తుడుచుకుంటూ కూర్చుంది. నొప్పికి ఆమెకి తెలీకుండానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆమెకి తెలిస్తే ఆమె కన్నీళ్లను ఆపేస్తుంది. ఏడవటం అంటే ఆమెకి చాలా అసహ్యం. కానీ ఏం చేయడం. బాధ అలవాటవుతుంది కానీ నొప్పి ఎంత కాలమయినా అలవాటు కాదు. ఇంట్లో కాలిపోయిన గాలిపటాలు జ్ఞాపకం వచ్చాయి. శ్రమంతా కాలి బూడిదయింది. ఆమె తన మనస్సులో నిదానంగా తన వంటింట్లోని ఒక్కొక్క డబ్బా ని వెదకడం మొదలు పెట్టింది. ఖాళీ డబ్బాలు కళ్ళ ముందు కదిలే సరికి ఆమె గుండెల్లో నుండి పెద్ద నిశ్వాసం ఒకటి బయటకు వచ్చింది. వనజ అలా నిట్టూరుస్తూ ఉండగానే స్టేషన్ ఎస్‌ఐ డ్యూటీ కి వచ్చింది. ఈ ఎస్‌ఐ ఛార్జి తీసుకున్న తర్వాత వనజ స్టేషన్ కి రావడం అదే ప్రధమం. ఎస్‌ఐ పేరు శ్రావణ కుమారి. ఆమె అభ్యుదయ భావాలున్న వ్యక్తే కాదు, రచయిత కూడా. అందుకే రక్తాలు కారుతున్న వనజను పిల్చి విషయమేమిటి అని అడగకుండా ”ఏంటి నీ కథ ?”అని అడిగింది. అడగడమే కాకుండా, ఆ కథ విని, చాలా స్పందించి, దాన్ని కథగా రాసి పత్రికకు పంపించి వేసింది. అదే ఈ కథ.

*

వనజ ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలకి మధ్యలో పుట్టింది నారాయణకి. నారాయణ వాచ్ మాన్ గా పని చేసేవాడు. వనజ తల్లి ఇంట్లోనే ఉండి పిల్లల్ని వంటా వార్పుని చూసుకునేది, పిల్లలందరిలో వనజ కాళ్ళకి మాత్రమే చక్రాలుండేవి. భుజాలకి రెక్కలుండేవి. ఆ పిల్ల బడి వదలగానే చాలు ఇంటికెళ్లి తట్ట తీసుకుని పేడ కోసం పశువుల ముడ్డి వెనుక పరిగెత్తేది. పడ్డ పేడను పడ్డట్టు చేర్చి, ఒకరోజు చాకలోళ్ల వంతెన దగ్గర వుండే పాడుబడ్డ భవంతి గోడకి పిడకలు తట్టేది. రేషను కోసం లైన్లో నిలబడ్డ వాళ్ళ దగ్గరకు వెళ్లి మనిషి మనిషినీ వాళ్ళు తమ రేషన్ బియ్యాన్ని అమ్ముతారేమో కనుక్కుని, అమ్ముతామంటే కొని నెత్తికెత్తుకుని తీసుకొచ్చేది. చాలా సార్లు వనజ వాళ్ళ ఇంట్లో, వనజ ఇంట్లో అడుగు పెట్టిన తరువాతే పొయ్యి వెలిగేది. వనజ ఇంట్లో అడుగు పెట్టిన తరువాతే ‘ఈ రోజు ఇంట్లో అందరూ అన్నం తింటారు’ అని వనజ తల్లి నిట్టూర్చేది. భూమిని, పసు పక్ష్యాదులను ఉద్దరించడానికి తను కురుస్తున్నానని వర్షం అనుకోనట్లుగానే, తన ఇంట్లో వాళ్ళను ఉద్దరించడానికి తాను ఈ శ్రమ దానాన్ని చేస్తున్నానని వనజ కూడా అనుకునేది కాదు. నిజానికి అంత ఆలోచించేంత సమయం వనజకి ఉండేది కాదు.

వనజ ఏ పరుగు పందెంలో పాల్గొన్నా మొదట బహుమతి ఆమెకే వచ్చేయడం వాళ్ళ బడిలో ఆనవాయితీ. అలా వస్తుంటే చూసి ఆమెకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు వాళ్ళ PET టీచరు. క్లాసులయ్యాక ఆమెతో పాటు మరికొందరిని కూడగట్టి మెళకువలు చెప్తూ, స్కూలు గ్రౌండు చుట్టూ రౌండ్లు కొట్టించే వాడు. అలా కొట్టే రౌండ్లలో అందరి కంటే వనజ మొదట ఉండేది. సార్ పెట్టిన టైం కంటే ముందే గమ్యం చేరాలని, గాలి లాగా పరుగులు తీసేది. అలా దౌడు తీసి, అలిసి గ్రౌండులో వెల్లికిలా పడుకుని ఆకాశంలో అప్పుడప్పుడే పొడుస్తున్న చుక్కల్ని చూస్తుంటే వనజ కి తాను ఆ చుక్కల పల్లకి ఎక్కి స్వర్గంలో తిరుగుతున్నట్లు ఉత్త పుణ్యానికే చాలా సంతోషం కలిగేది.

పరుగు పందెం తప్పించి మరొక విషయం పట్ల ఆసక్తి ఉండేది కాదు వనజ కి. పరిగెత్తి, పరిగెత్తి అలిసిపోయి బడి నుండి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేది. అలిసిపోయి వచ్చిన బిడ్డకి తినడానికి ఏమైనా పెట్టడానికి బదులు, ఆలస్యానికి కారణమేమని తిట్లు మొదలుపెట్టేది అమ్మ. ప్రతిరోజూ చెప్పిందే చెప్పాల్సి వచ్చినా వనజ విసుక్కునేది కాదు. అలిసిపోయిన కాళ్లతో అమ్మకు పనులు చేసి పెట్టేది, అక్కలకు చెప్పచ్చు కదా అని తమ్ముళ్లకు నేర్పొచ్చు కదా అని అస్సలు అనేది కాదు. అయినా సరే వనజ తల్లికి బడి నుండి వనజ ఆలస్యంగా రావడం చిరాకు తెప్పించింది. ఆమె అదే విషయాన్ని వనజ తండ్రితో చెప్పింది. వనజ తండ్రి ఆ విషయం విన్న తరువాత మెరుపు వేగంతో ఆలస్యానికి కారణమేమిటో కనిపెట్టేసాడు. మగవాళ్లతో నేస్తం మొదలు పెట్టిందని ఊహించేసాడు. వనజని దగ్గరికి పిలిచి రేపటి నుండి సమయానికి ఇంటికి తిరిగి రాకుంటే వీపు విమానం మోత మోగుతుంది చెప్పాడు. మరుసటి రోజు వనజ తండ్రి చెప్పినట్లు సమయానికి వచ్చేసింది. కానీ స్కూల్ లో టీచర్ ఎన్నో రోజులు అలా ప్రాక్టీస్ చెయ్యకుండా త్వరగా వెళ్లిపోవడానికి ఒప్పుకోలేదు. జిల్లా పోటీలకు ముందు అలా బాధ్యత లేకుండా, ప్రాక్టీస్ కి రాక పోవడం నేరమని ఆయన భావించాడు. దాంతో వనజ మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సరిగ్గా అప్పుడు మొదలు పెట్టాడు వనజ తండ్రి వనజ ని వీరబాదుడు బాదడం. వంగితే దెబ్బ, లేస్తే దెబ్బ, కూర్చుంటే దెబ్బ. భరించలేక స్కూల్ లో టీచర్ కి తను నేరుగా పోటీలలలోనే పాల్గొంటానని చెప్పేసింది వనజ. కానీ అప్పటికే వనజ తండ్రి చీటికీ మాటికీ వనజ ని కొట్టడానికి అలవాటు పడిపోయాడు.

తొమ్మిదవ తరగతి ఎండాకాలంలో పెద్దమ్మ కూతురి పెళ్ళికి పక్కన వుండే టౌన్ కి వెళ్ళింది వనజ. పనికి పంగుమాలని పిల్ల అని పదిరోజులు ముందే వనజ తండ్రిని ఒప్పించి వనజ ని మాత్రం ముందుగా తీసికెళ్లారు ఆమె పెద్దమ్మ వాళ్ళు. అక్కడ పరిచయమయ్యాడు వనజకి పెళ్లి కొడుకు స్నేహితుడు రాజ. తొలిచూపు నుండే అతని కళ్ళు ఆమెని వెంబడించడం మొదలు పెట్టాయి. ఆమె చుట్టు పక్కల వున్నప్పుడు గట్టి గట్టిగా మాట్లాడటం, నవ్వడం వంటి రకరకాల ఆకర్షణీయమైన కార్యక్రమాలు చేసేవాడు. ఆమె పట్ల ఆమె అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపించేవాడు. అతను వనజని ప్రేమిస్తున్న సంగతి అందరికి అర్థమయ్యాక వాళ్ళు వనజకి అర్థం చేయించాక అప్పుడు ఆమెకు అర్థమయింది. అర్థమయ్యాక కూడా వనజ దాన్ని గురించి పెద్ద ఆలోచించకుండానే పెళ్లి ముగిశాక ఇంటికి వెళ్ళడానికి తయారయ్యింది. అప్పుడు రాజా ఆమెతో ముఖా ముఖి తలపడ్డాడు. ఆమె కనుక తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని అన్నాడు. అది విని వనజ ఆశ్చర్య పడింది. తన కోసం ఎవరయినా చచ్చిపోవడం అనే ఆలోచన ఆ పిల్లకు భలే గమ్మత్తుగా తోచింది. అయినా ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన వనజ వెనుక రాజ వచ్చాడు. కాపు కాసి ఆ పిల్లని వంటరిగా పాడుబడ్డ భవంతి దగ్గర పట్టుకుని తన ఛాతీ మీద కొత్తగా వేయించుకున్న పచ్చ బొట్టు ని చూపించాడు. అది లవ్ సిమ్బల్ మధ్యలో వనజ, రాజా పేర్లు. వాటి గుండా అటూ ఇటూ వెళ్తున్న బాణం గుర్తు. అది చూసి మళ్ళీ ఆశ్చర్యపడింది వనజ. వనజకి శరీరం ఎదిగింది కానీ మనసు ఎదగలేదు అందుకే వనజ ఆశ్చర్యపడటం తప్పించి ఇంకొక భావం వ్యక్తీకరించలేకపోయింది. గోడకున్న పిడకలు తీసి తట్టలో వేసుకుని, తట్ట నెత్తికెత్తుకుని వెళ్లిపోవడానికి సిద్దమయింది. అప్పుడు తీసాడు రాజా తన ప్యాంటు జేబులో నుంచి ఒక సీసా. ఇది విషం సీసా అని చెప్పాడు. నువ్వు సాయంత్రం లోపల నాతో రాకుంటే ఇది తాగి, నా చావుకు కారణం నువ్వేనని రాసిపెట్టి చచ్చిపోతాను అని విసురుగా వెళ్ళిపోయాడు.

పిడకల తట్ట తీసుకుని ఇంటికి వెళ్లేసరికి ఒక నాలుగు నిమిషాల ఆలస్యం అయ్యింది వనజకి. తండ్రి యధాప్రకారం తిట్టడం మొదలు పెట్టాడు. వనజ అన్యమనస్కంగా ఉండటం చేత తండ్రికి సరిగా ప్రత్యుత్తరం ఇవ్వలేక పోయింది. దాంతో అతని కోపం నషాళానికి అంటి వనజకి బడిత పూజ జరిగింది. మామూలు రోజుల్లో దెబ్బలకి ఏడ్చి సరిపెట్టుకుని వనజ ఈ సారి అలా అనుకోలేదు రాజా ని పెండ్లి చేసుకుంటే నాయన దెబ్బల నుండి తప్పించుకోవచ్చు కదా అనుకుంది. అలా ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది. తొమ్మిదవ తరగతితో ఆగిపోయిన చదువు గురించి కాదు గానీ సాయంత్రాలు గ్రౌండు చుట్టూ పరిగెత్తి, పచ్చిక మీద పడుకుని సంధ్య వేళ ఆకాశంలో అప్పుడప్పుడే ఉదయిస్తున్న తెల్లటి చంద్రుడిని, నక్షత్రాలని చూస్తూ ఆనందపడ్డ క్షణాలని మాత్రం ఆమె జీవితంలో ఏ రోజూ మరచి పోలేదు. ఆ పరుగు ఆపకుండా ఉండి ఉంటే తన జీవితం ఎలా వుంది ఉండేది అని ఆమె తన మీద దెబ్బ పడ్డ ప్రతిసారీ ఆలోచిస్తూ ఉంటుంది.

పెళ్లయిన తర్వాత వనజ మొగుడు ఒక హోటల్ లో పనికి కుదిరాడు. వనజ కి పెళ్లయిన రెండో ఏడాదికి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టాక వనజ తల్లిదండ్రులు వనజని పుట్టింటికి రానిచ్చారు. సరిగా అదే సమయంలో వనజ మొగుడిని దూర ప్రాంతంలోని తమ బ్రాంచీకి బదిలీ చేశారు హోటల్ వాళ్ళు. వనజ బిడ్డని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కొన్నిరోజులకి బిడ్డ బాధ్యతని తల్లికి అప్పగించి తాను కూడా భర్త వున్న జిల్లా లోనే వున్న ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. నెలలో రెండు రోజులు వచ్చి బిడ్డని చూసి వెళ్ళేది. వనజ పనికి కుదిరిన వాళ్లకి ఒక బ్యూటీ పార్లర్ వుంది. దయగల ఆ యజమానురాలు ఇంటి పని అయ్యాక దగ్గరుండి బ్యూటీషియన్ పనులన్నీ నేర్పించడమే కాకుండా తమ సంస్థ నుండి ఇచ్చే సర్టిఫికెట్ కూడా ఫీజులు ఏమీ తీసుకోకుండా వనజకి ఇచ్చి పంపింది.

మూడేళ్ళ తరువాత ఇంటికొచ్చిన వనజ తాను సంపాదించిన డబ్బుతో చిన్న కొట్టు భాడుగకు తీసుకుని ‘వనజ బ్యూటీ పార్లర్ ‘ని తెరిచింది. వనజ దొడ్డ ఇంటి పిల్ల కాదు,పెద్ద చదవలేదు కానీ తొందరలోనే ఆమెకు వూళ్ళో మంచి పేరు వచ్చింది. బ్యూటీ పార్లర్ మంచిగా నడవడం మొదలు పెట్టింది. అయితే ఆమె దగ్గరకి వచ్చే వాళ్ళందరూ దిగువ మధ్యతరగతి వాళ్ళు గనుక ఎక్కువగా కనుబొమలు కత్తిరించు కోవడానికి వచ్చేవాళ్ళు. దీంతో వనజకి చేతినిండా పని ఉండేది కానీ, చేతి నిండా ఆదాయం మాత్రం ఉండేది కాదు. వచ్చింది కొట్టు బాడుగకు సరిపోయి, బొటాబొటి రాబడి మిగిలేది. అందుకని వనజ పెద్ద వాళ్ళ ఇళ్లకు వెళ్లి సర్వీస్ ఇవ్వడం మొదలు పెట్టింది. అది ఆమెకు గిట్టుబాటు కావడం మొదలు పెట్టింది. గిరాకీలు పెరిగాయి. నాలుగు రూపాయిలు వెనకేసుకోవడం మొదలు పెట్టింది. ఆ కాలంలోనే రాజా కి వనజ వున్న వూరికి పక్కన ఊర్లోనే వున్న హోటల్ కి బదిలీ అయింది. అతను వచ్చాక అతని ఆదేశం ప్రకారం వనజ పుట్టింటి నుండి బయటకు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టింది. వేరు కాపురమయితే పెట్టింది కానీ బిడ్డని చూసేదెవరు? మళ్ళీ ప్రతిరోజూ నాలుగేళ్ల బిడ్డను తీసుకెళ్లి తల్లి దగ్గర దించి బ్యూటీపార్లర్ కి వెళ్ళేది. ఒక్కోసారి పెళ్లి మేకప్ వంటి వాటికి పొద్దునే వెళ్ళవలసి వచ్చినప్పుడు వనజ మొగుడు బిడ్డని అత్తగారింట్లో దింపాల్సి వచ్చేది. పిల్లాడికి ఏ దగ్గో జలుబో చేస్తే కొంచెం అక్కర చూపాల్సి వచ్చేది. అదంతా అతనికి చిరాకు తెప్పించింది. అందుకని ఒకరోజు అతను వనజను సినిమాకి తీసికెళ్ళి, ఐస్క్రీమ్ తినిపించి, రాత్రి శృంగారం జరిపి ఆ తర్వాత ఆమెని భుజంపై పడుకోబెట్టుకుని సవరిస్తూ ”బ్యూటీషియన్ పని మానేయరా బంగారం! బిడ్డని బాగా పెంచు. వాడు మనలా కాకుండా బాగా చదువుకోవాలి! నేను సంపాదించిన దాంతో సర్దుకుందాం. మనకు మన బిడ్డ ముఖ్యం కదా” అంటూ ఆమె బుగ్గల పైన, నుదురుపైనా పెదవులతో వత్తుతూ మరీ చెప్పాడు.

భర్త బ్యూటీ పార్లర్ వదిలేయమనడం వనజ కి బాధ కలిగించింది. కానీ అతని ప్రేమకి ఆమె లోబడిపోయింది. భర్త చెప్పింది నిజమే తమ బిడ్డ కనీసం ఇంజినీరన్నా కావాలి. తమలా కాకూడదు. అలా కావాలంటే తాను ఇంట్లో వుంది వాడి బాగోగులు చూసుకోవాలి అన్న సారాంశం ఆమె మెదడులో బాగా ఇంకి ఆ మరుసటి రోజే బ్యూటీపార్లర్ వస్తువులన్నీ ఆమె మూటకట్టి ఇంటికి తెచ్చేసుకున్నది. ”వనజ బ్యూటీపార్లర్” బోర్డు ను అటక మీద పెట్టేసింది.

కొడుకు స్కూల్ కి పోవడం మొదలు పెట్టి హై స్కూల్ కి వచ్చే లోపు వనజ ప్రయివేటుగా ఇంటెర్మీడియేట్ పూర్తి చేసుకున్నది. కొడుకు అటు ఆరవ తరగతిలో చేరగానే వనజ ప్రభత్వం ‘ఆపరేషన్ థియేటర్ నర్స్ ట్రైనింగ్ ‘ ఇస్తుంటే ఆ ట్రైనింగ్ లో చేరింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఒక హాస్పిటల్ లో OT నర్స్ గా చేరేసింది. కొడుకు ఎదుగుతున్నాడు కనుక వేడి నీళ్లకు చన్నీళ్ళు అని ఆమె అనుకున్నది. అయితే ఆమె భర్త అలా అనుకోలేదు. ఆమె చేరిన ప్రయివేటు హాస్పిటల్ లో సీనియర్ సిబ్బంది జూనియర్ నర్సులను ఎక్కువ నైట్ డ్యూటీలకు వేసేవాళ్ళు. వనజ, రాత్రి బిడ్డతో భర్త ఉంటాడు, పగలంతా ఇంటి వంట బాగోగులు యధావిధిగా తాను చూసుకోవచ్చు అని నైట్ డ్యూటీ లు ఆనందంగానే ఒప్పుకునేది. కానీ ఈ నైట్ డ్యూటీలు ఆమె భర్తకు విసుగు తెప్పించాయి. మళ్లీ ఒక రోజు అతను ఆమె డ్యూటీ కి సెలవు పెట్టించి యదా ప్రకారం ఆమెని బుజ్జగించి పని మానేయమని చెప్పాడు. ఈ సారి కూడా వనజ అతనికి ఎదురు చెప్పలేదు. సరే అని మానేసింది. కానీ ఈ సారి మాత్రం ఆమెకి మనసులో ఒకలాటి దిగులు గూడు కట్టుకుంది. వనజకి కొడుకు తర్వాత పిల్లలు పుట్టలేదు. కొడుకు ఇప్పుడు ఏడవ తరగతికి రాబోతున్నాడు. తను పని చెయ్యడం వల్ల లాభమే కానీ నష్టం లేదు. మరి భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడో, ఎందుకని కొంచెం సర్దుబాటుకు కూడా అతను ఇష్ట పడటం లేదో ఆమెకి అర్థం కాలేదు. ఒక రోజు అదే అతన్ని అడిగింది. అతను అప్పుడు ఒక సిద్ధాంతం చెప్పాడు ”నర్సు వుద్యోగం చేసేవాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళనీ, నైట్ డ్యూటీ చేయడం దానికి పరాకాష్ట అనీ” ఆ సిద్ధాంతం విని వనజ ఆశ్చర్య పడింది. ఎదురు తిరిగి అతన్ని ప్రశ్నించాలని, నిందించాలనీ ఆమె అనుకోలేదు కానీ, అతనికి అలాటి అభిప్రాయం వున్నప్పుడు తాను నర్సు ట్రైనింగ్ లో చేరుతాను అన్నప్పుడే ఖండించి ఉండొచ్చు కదా అనుకున్నది. ఆ తర్వాత తాను నర్సు ట్రైనింగ్ చేసాను అన్న విషయాన్నే మరిచి పోయింది.

వనజ కొడుకు ఎనిమిదవ తరగతిలోకి వచ్చినప్పటి నుండి వనజ భర్త కి అతని స్వంత వూరిలో వుండే హోటల్ లోనే ప్రమోషన్లో మంచి వుద్యోగం దొరికింది. అందరూ అక్కడికి మకాం మార్చారు. ఆ హోటల్ కి వచ్చాక అతనికి ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగినందుకు వనజ సంతోష పడింది కానీ బుద్ధి వున్న పిల్ల కాబట్టి భర్తని అడిగింది ”పెరిగిన ఆదాయ రహస్యమేమిటీ?” అని. అతను పెద్దగా ఏమీ నాన్చలేదు, భయపడలేదు నవ్వుకుంటూనే చెప్పేడు. ”హోటల్ కి పెద్ద పెద్ద ‘సార్లు ‘వస్తారు కదా, వాళ్ళు ‘ఇక్కడ అమ్మాయిలేమయినా దొరుకుతారా?’ అని అడుగుతారు మేము వాళ్లకి అమ్మాయిల గురించి చెప్తాము. అవసరమయినప్పుడు వెళ్లి తీసుకొస్తాం. ఒకోసారి వాళ్ళని గమనించుకుని మేమె అడుగుతాము ”అమ్మాయిలేమయినా కావాలా అని.” నా అండర్ లో కొద్ధి మంది అమ్మాయిలు వున్నారు వాళ్ళని బుక్ చేస్తే ఆ అమ్మాయిలు నాకు కమీషన్ ఇస్తారు. ‘సార్లూ’ నాకు కొంచెం కమీషన్ ఇస్తారు, అదీ ఈ డబ్బు” అన్నాడు. భర్త చెప్పింది విని వనజకి పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటె ఇదంతా లోక సహజం కదా, విని వున్నదే కదా, ఇక్కడ భుజాలు తడుముకోడానికి పెద్దగా ఏముందనీ. అందుకని వనజ భుజాలు తడుముకోలేదు కానీ ఆమెకి భర్త పట్ల ఏదో జుగుప్స లాంటిది కలిగింది. ”నువ్వెలా అలాటి తప్పు పనులు చేస్తావు” అని అడిగింది. అందుకు రాజా ఒక పెద్ద నవ్వు నవ్వి ”తప్పు పని ఏదయినా ఉంటే అది ఆ ‘సార్లు’ చేస్తున్నారు. నేనేం తప్పు చేస్తున్నాను? భలేదానివే నువ్వు” అన్నాడు. వనజ ఆ సమాధానం తో సంతృప్తి పడలేదు కానీ అతను తెచ్చే డబ్బులకి అలవాటు పడింది. అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి టూర్లు. ఒక పది తులాల బంగారం, టీవీ ఆమె ఇంట్లోకి వచ్చి చేరాయి. ఆమెకి తాను పనిచేయడం లేదనే బాధ కూడా పోయింది.

జీవితం అలా సాగుతుండగా ఒక రోజు వనజకి భర్త మొబైల్ లో ‘చిన్ని- బుజ్జి- నాన్న’ అని పిలుచుకుంటూ సంభాషించుకున్న సరసపు మెసేజులు కనిపించాయి. అవేంటో ఆమెకి మొదట అర్థం కాలేదు. నేరుగా వెళ్లి అమాయకంగా భర్తని అడిగింది. అతను మొదట తడబడి ”నువ్వెందుకే నా మొబైల్ ముట్టుకున్నావు, ఈ ఇడిచి పెట్టిన లం-లు నాకు కూడా గాలం ఎయ్యాలని చూస్తుంటాయి. నేనేదో సరదాకి వాళ్ళతో చాటింగ్ చేసాను అంతే” అన్నాడు. అతని మాటలు ఆమెకేమీ అర్థం కాలేదు కానీ అతనంత స్పష్టంగా చెప్పాక ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ అప్పటి నుండి అతని మీద నిఘా పెట్టింది. కొద్ధి రోజుల్లోనే తన భర్త కూడా తార్పుడు పనులు చేసే ‘సారుల’ దారిలోనే వెళుతున్నడని కనిపెట్టేసింది. అప్పటి నుండి వాళ్ళిద్దరికీ రామరావణ యుద్ధం మొదలయిపోయింది. కాకపోతే ఈ యుద్ధంలో రాముడిలా మంచి బాలుడినని చెప్పుకునే వనజ భర్త, వనజను రావణుడిని చేసి ఇష్టమొచ్చినట్టు చావగొట్టడం మొదలు పెట్టాడు.

భర్త ఎంత చెప్పిన వినకపోగా, చివరికి ఇంట్లో డబ్బులివ్వడం కూడా మానేసాక వనజకు ఏం చేయాలో పాలుపోలేదు. రోజు రోజూ యుద్ధం చేయాలంటే ఆమెకు విసుగొచ్చింది. ఒక రోజు వనజ తన భర్త మొబైల్ తీసి దాచిపెట్టేసింది. ఫోన్ తీసుకెళ్లి పోలీసులకి చూపించి పోలీస్ కేస్ పెడతానని బెదిరించింది. ఆ రోజే భర్త ఆమెని తిరగ మరగా తన్ని కిరోసిన్ మీదపోసి తగలబెట్టడానికి అగ్గిపెట్టె వెదకడం మొదలు పెట్టాడు. అప్పటికి అతనికి సిగరెట్లు తాగే అలవాటు లేదు. వనజకి గ్యాస్ స్టవ్ ని లైటర్ తో వెలిగించే అలవాటు. ఆ కారణం చేత అతనికి అగ్గిపెట్టె దొరక లేదు. అతను నిప్పుకోసం గ్యాస్ వెలిగించడానికి ఆయత్తమవుతున్నపుడు వనజకి అర్థమయిపోయింది నిజంగానే అతను తనని తగలబెట్టపోతున్నాడని. అంతే దొడ్డి దారిగుండా దూసుకుని దొరికిన ఆటో పట్టుకుని మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది.

మహిళా పోలీస్ స్టేషన్ కి కారుతున్న కిరోసిన్ తో వెళుతున్న వనజకి మనసులో చాలా దుఃఖంగా వుంది. భర్త మీద కేస్ పెట్టాలంటే ఆమెకు ఏమాత్రం మనస్కరించడం లేదు. వీళ్ళు అతన్ని కొంచెం బెదిరించి దార్లో పెడితే చాలు. ముఖ్యంగా అది వుందే తన మగడితో సరసాలాడే ‘లం-‘ దాన్ని పిలిచి భయపెట్టి తన సంసారాన్ని చక్కపరిస్తే చాలు. ఏమయినా తన రాజా చాలా మంచివాడు. దాని మాయలో పడి ఇలా అయిపోయాడు. ఇవీ వనజ ఆలోచనలు. ఆమెకి మధ్యలోనే ఆటో దిగి ఇంటికి వెళ్లిపోదామని కూడా అనిపించింది ఆమె అటువంటి ఆలోచనల్లో ఉండగానే ఆటో ఆమె ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. వనజ ఎక్కలేక ఎక్కలేక మెట్లు ఎక్కి శరీరాన్ని ఈడ్చుకుంటూ లోపలి వెళ్ళింది. కిరోసిన్ మీదపడి, రక్తం ఓడుతున్న తను ఆ స్థితిలో పోలీసుల దగ్గరికి వెళ్లడమంటే మిన్ను విరిగి మీద పడటమేనని వనజ భావించింది. కానీ పోలీస్ స్టేషన్లో వనజను చూసి అలాటి ఆశ్చర్యం ఎవరూ పడలేదు. పైపెచ్చు వనజ ని ఏదో సినిమా సీన్లో రంగులు పూసుకున్న జూనియర్ ఆర్టిస్టు ని నిర్లక్ష్యంగా చూసినట్లు నిర్ల్యక్షం చేసారు. అది చూసి వనజ అవాక్కయింది. అప్పటి వరకు ఆమె మనసులో వున్న ద్వైదీభావం హఠాత్తుగా మరుగునపడి ఆ స్థానంలో కోపం, బాధ వచ్చి చేరాయి. మండే హృదయంతో కనిపించిన ప్రతి పోలీసుకు తన పరిస్థితి చెప్పింది అలా ఆమె ఆ స్టేషన్లో ఒకరి తరువాత ఒకరికి తన కధ చెబుతూ ఎస్‌ఐ దగ్గరికి కి చేరేలోపు నలుగురికి తన కథ చెప్పింది. ఉదాసీనంగా వింటున్న ఎస్‌ఐ కి తను చెప్తున్న విషయంలో నిజాయితీని చూపించడం కోసం రవికలో తాను దాచిపెట్టి ఉంచుకున్న భర్త మొబైల్ ని తీసి అతను ప్రియురాలితో జరిపిన సంభాషణలను చూపించింది. అవంతా చూసి ఎస్‌ఐ తో పాటు మిగతా సిబ్బంది ముసిముసిగా నవ్వుకుంటూ చెవులు కొరుక్కుంటూ ఉంటే వనజ కి అప్పుడు కూడా తన భర్త అలా నవ్వులు పాలవుతున్నాడనే అభిమానం పొంగుకొచ్చింది. మళ్ళీ అంతలోనే అంతా ఆ స్త్రీ వల్లనే అని క్రోధం కూడా కలిసి వచ్చింది.

వనజ ఆశించినట్లుగానే పోలీసులు ఆమెతో కలిసి ఇంటికి వచ్చి ఆమె భర్తను కొంచెం మందలించారు. ఇంకోసారి ఇలా జరగ కూడదు అన్నారు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అన్నారు. రాజా అన్నిటికి తల ఊపాడు. పోలీసులు వెళ్లిపోయారు. అది తనకు లభించిన విజయం అని వనజ అనుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మంచి కలలు కూడా కన్నది. కానీ పొద్దుటికి అవన్నీ కల్లలని ఆమెకి అర్థమయిపోయింది. తెగించిన వాడికి తెడ్డే లింగమని ఎవరో సామెత చెప్పినట్లు పోలీసులు వచ్చి వెళ్ళాక రాజా మరింత బరితెగించాడు. ఒకానొక స్థితిలో ఇంట్లో తిండి గింజలు కూడా నిండుకున్నాక ఈ సారి మళ్లీ స్టేషన్ కు వెళ్ళింది వనజ. మళ్లీ ఒక కానిస్టేబుల్ ఇంటికి వచ్చాడు. ఇలా కొన్ని సార్లు జరిగాక ఒకసారి వనజ తెగించి ఎస్‌ఐ తో ”సార్ ఇలాక్కాదు కానీ, మీరు కేస్ పెట్టెయ్యండి, వాడి కథ నేను తేలుస్తా” అన్నది తన మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తున్న భర్తకి బుద్ధి చెప్పాల్సిందే అన్నట్లు. కానీ ఆశ్చర్యంగా ఎస్‌ఐ సార్ కేస్ పెట్ట లేదు. వనజ కి ఆశ్చర్యం కలిగింది. తన్నులు తిన్న ప్రతి సారీ ”కేస్ పెట్టండి సార్ ” అని ప్రాధేయ పడ్డా ఎవరూ కేసు పెట్టలేదు. అలా ఆమె ఏడాదిన్నర స్టేషన్ చుట్టూ తిరిగాక రిటయిర్ అవ్వబోతున్న ఒక ముసలి పోలీసు వనజని పక్కకి పిలిచి రహస్యం గా ”ఏవమ్మా నీకేం బుద్ధి లేదా ఏంది? ఇన్ని రోజుల నుండి తిరగతా వుండావే, ఈళ్లేందుకు నా కేసు తీసుకోవడం లేదు అని ఆలోచించడం లేదా ఎప్పుడూ? నీ మొగుడు కౌన్సిలర్ ని పట్టుకుని రికమండేషన్ చేయించాడమ్మా. నువ్వెంత తిరిగినా వీళ్ళు నీ కేసు తీసుకోరు. పో పో, పొయ్యి ఎవరినయినా లాయర్ని పట్టుకుని కేసు పెట్టు పో” అన్నాడు.

వనజ ఎంత కాదన్నా అబల. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి ఆ సాకు చెప్పి పుట్టింటి వాళ్ళు కూడా దేనికీ అక్కరకు రాకుండా తప్పుకుంటూ వుంటారు. తనకి ఇంకెవరున్నారు. ఎవరూ లేరు. వనజ కి చాలా ఏడుపు వచ్చేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని చెవికి వుండే ఝంకీలు అమ్మేసి లాయర్ ని పట్టుకుని కేస్ పెట్టింది. ఆ కేస్ పట్టుకుని ఈ సారి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళింది నా మొగుడ్ని అరెస్టు చేయండి అని. లాయర్ ని చూసాక అరెస్టు చెయ్యడానికి పోలీసులు సిద్ధమయ్యారు కానీ వాళ్ళు వెళ్లడానికంటే ముందే కౌన్సిలర్ కి ఫోన్ చేసి ”మీ వాడికి పారిపొమ్మని చెప్పండి మేము అరెస్ట్ చెయ్యడానికి వస్తున్నాం” అని చెప్పారు. రాజా పధకం ప్రకారం పారిపోయాడు.

భర్త పారిపోయాక వనజకు మళ్ళీ భర్త మీద ప్రేమ పొంగుకుని వచ్చింది. పాపం ఎక్కడున్నాడో, ఏం కష్ట పడుతున్నాడో, తింటున్నాడో లేదో అని ఆమెకి మనసు పరి పరి విధాలా పోయేది. తన అదృష్టాన్ని ఇలా తిరగ రాసిన ఆ స్త్రీని కాసేపు తిట్టుకునేది. మళ్లీ మన బంగారం మంచిదయితే పరాయి వాళ్ళు ఏం చెయ్యగలరు, నా తల రాత ఇలా వుంది అనుకుని ఏడ్చుకునేది కొన్ని సార్లు. ఇలా ఏడ్చుకుంటూనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేది నా భర్తను ఎప్పుడు అరెస్టు చేస్తారు అని. ”వాళ్ళు చేతులు గాల్లోకి ఊపి అంతటా గాలిస్తూనే వున్నాం, ఎక్కడా దొరకడం లేదు” అనే వాళ్ళు. కొన్ని సార్లు వెనక నుండి ”ఇంకా బతికి ఉంటాడా, ఎప్పుడో ఏ రైలు కిందో తల పెట్టేసి ఉంటాడు” అనే వాళ్ళు. వాళ్ళు అలా అన్నప్పుడు వనజకి శరీరమంతా వణికి పోయేది. తామిద్దరూ ప్రేమగా వున్న రోజులు జ్ఞాపకం తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడ్చేది. అలా ఏడ్చి ఏడ్చి ఆమె ఒక రోజు ఇలా కాదు భర్తను తానే వెదకాలి అని నిర్ణయించుకుంది. ఈ సారి ఇంకో జత కమ్మల్ని, కొడుకు కి చేయించిన చిన్ని గొలుసుని అమ్మేసి మొగుడ్ని వెదకడం మొదలు పెట్టింది. మొగుడి బంధువుల ఇళ్లకు వెళ్ళింది, అతను అంతకు ముందు పని చేసిన హోటల్ కు వెళ్ళింది. అతని స్నేహితులకు ఫోన్లు చేసింది. అలా ఒక నాలుగు నెలలు అన్వేషణ సాగించాక, ఆమె మొగుడి స్నేహితుడి భార్య ఒక మధ్యాహ్నం ఫోన్ చేసి, తన పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటకి రాకూడదని చెప్పి, అసలు విషయాన్ని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం వనజ మొగుడు ఎక్కడికీ వెళ్ళలేదు తన ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకుని వనజ ఉంటున్న అదే వూళ్ళో జీవిస్తున్నాడు.

భర్త రెండో పెళ్లి గురించి విన్న ఆ క్షణం వనజకు భూ ప్రపంచం తలక్రిందులు అవుతున్నట్లుగా అనిపించింది. ఎంత ఆలోచించినా ఆమెకు తన భర్త తనకు అంత అన్యాయం చేయగలడు అంటే నమ్మడానికి మనస్కరించలేదు. అందుకే ఎలాగయినా ఆ నిజాన్ని తన కంటి తో తను చూడాలని, ఆ రెండో ఆవిడ ఇల్లు వున్న చోట కాపు కాయడం మొదలు పెట్టింది. తలపై ముసుగు వేసుకుని కుంటి భిక్షగత్తె లాగా ఆ ఇంటి ముందు నుండి అటూ ఇటూ నడిచేది. అలా కొన్ని రోజులు జరిగాక ఒకరోజు నవ్వుకుంటూ రెండో ఆవిడని బైకు ఎక్కించుకుని వెళుతున్న భర్త ఆమె కంట్లో పడ్డాడు. అది చూసిన ఆమె గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. ఆ బద్దలయిన అగ్ని పర్వతాలతో ఈ సారి అమాయకంగా ఆమె ఎప్పటిలాగే తనకు అన్యాయం చేసే పోలీస్ స్టేషన్ కు వెళ్ళలేదు. నేరుగా పెద్ద సారు వుండే స్టేషనుకు వెళ్ళింది. తన మగడు ఇదిగో ఫలానా దగ్గర వున్నాడు వచ్చి అరెస్టు చేయండి అని చెప్పింది. గోల చేసింది. పోలీసు జీపెక్కి వాళ్లకి రెండో ఆవిడ ఇంటికి దారి కూడా చూపించింది. మొగుడ్ని అరెస్ట్ చేయించింది.

వనజ ఆశించినట్లు అతన్ని అరెస్టు చేయగానే భూమి తల్లక్రిందులవలేదు. రెండ్రోజుల్లో అతను బయటకు వచ్చాడు. ఈ సారి దర్జాగా ఇంటికి వచ్చి వనజ మూటా ముల్లె విసిరి బయటేసి రెండో ఆవిడతో అదే ఇంట్లో కాపురం మొదలు పెట్టాడు. బయట పడ్డ సామాన్లు ఏరుకుని వనజ తడకలతో పక్కనే కట్టి వున్న పందిరి కింద కొడుకుతో కలిసి ఆరోజు తల దాచుకున్నది. ఆ తర్వాత భర్త ఛీ కొడుతున్నా, వళ్ళు చీరేలా కొడుతున్నా భరించి ఆ తడకల పందిరినే రెండు గదులుగా మార్చుకుని అక్కడే బిడ్డను పెట్టుకుని ఉంటూ వుంది.

విడాకులు తీసుకుని వచ్చిన ఇద్దరు బిడ్డల అనాకారి తల్లి కోసం భర్త తనని ఎలా వదిలేయ గలిగాడో వనజకి ఎన్ని నిద్ర రాని రాత్రులు ఆలోచించినా అర్థం కాదు. ఇంత జరిగినా మనసులో ఏ మూలో అతనిపై తనకి ప్రేమ ఎందుకు మిగిలే ఉందో కూడా ఆమెకి అర్థం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమెని బ్యూటీ పార్లర్ పని చేయొద్దనే వాళ్ళు కానీ, నర్సులు మంచి వాళ్లు కాదు కనుక నువ్వు ఆ పని చెయ్య వద్దనే కుత్సితపు మాటలు మాట్లాడేవాళ్లు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. అడిగే వాళ్ళు ఆపే వాళ్ళు లేకున్నా వనజకు తాను ఆ పనులు మొదలు పెట్టవచ్చు అన్న ధ్యాస కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు వనజకు ఒకటే ధ్యాస పక్క ఇంట్లో తన మగడు ఆ రెండో ఆవిడ ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు. ఏం తింటున్నారు. ఎప్పుడు పడుకుంటున్నారు. ఎప్పుడు లేస్తున్నారు. ఆమె బుర్ర మొత్తంవాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇంటి నుండి చేసే ఈ గాలి పటాల పని లాటి పనులు ఏమైనా ఉంటే అవి చేసి తిండి గింజలకు, లాయరు ఫీజుకు సంపాదిస్తుంది. అది తప్పించి ఆమెకి ఇంకో ధ్యాస లేదు. వనజ మొదట నుండీ తాడు చేతిలో పట్టుకుని ఎవరో ఎగరేస్తూ ఉంటే ఎగురుతూ వచ్చిన గాలి పటం. ఇప్పుడు ఆ గాలి పటానికి వున్న తాడుని ఆమె మొగుడు తెగ గొట్టి వదిలేసాడు. కానీ వనజ మాత్రం అక్కడున్న చెట్టుకే చిక్కుకుని పోయి ఎక్కడికీ వెళ్లకుండా అల్లల్లాడుతూ వుంది.

*

స్త్రీవాది, అభ్యుదయవాది ఎస్‌ఐ శ్రావణ కుమారి వనజ కధను పై విధంగా రాసి దానికి ‘గాలి పటం’ అన్న నామకరణం చేసి ఒక పత్రికకు పంపింది. కొన్నాళ్ళకు ఆమె పంపిన కథ పంపినట్టుగా కాకుండా ”లోకంలో ఆడవాళ్ళందరూ గాలి పటాల వంటి వాళ్ళే కాబట్టి ఈ కధలో కొత్తగా మీరు చెప్పింది మాకేమీ కనపడలేదు. మీ కధానాయిక వనజ సుత్తి కొడవలి తీసుకుని భర్తని హత్య చేసిందని కానీ, కనీసం ఉదయించే సూర్యుడి వైపు గా వెళ్లిపోయిందని కానీ మార్చి రాస్తే ప్రచురించడం గురించి ఆలోచిస్తాం ”అనే రిమార్కుతో తిరిగొచ్చింది.

ఆ రిమార్కు ను చూసిన శ్రావణ కుమారికి ఏం చేయాలో పాలుపోలేదు. వనజ ను పిలిచి ఉపదేశ ధోరణిలో మొగుడు అనే మాటను వదిలి పెట్టేయమని, స్వశక్తితో జీవితంలో పైకి ఎలా రావాలో అలా రావడానికి తను ఎలా, ఏ రూపంలో సహాయం చేయగలదో సుదీర్ఘంగా ఒక గంట సేపు చెప్పింది. వనజ తల ఆడిస్తూ శ్రావణ కుమారి బోధించిందంతా విని, ”ఇప్పుడు అవంతా సాధించి నేను ఎవరిని ఉద్దరించాలి ఎస్సై మేడం, నా బాధ అది కాదు, నా పచ్చని కాపురంలో నిప్పులు పోసిన ఆ ఆడ మనిషిని ఏమయినా చేయగలమా అది చెప్పండి. ఇట్లా పెళ్లయిన మగవాళ్ళని తగులుకుని కాపురాలను కుప్పకూల్చే దగుల్బాజీ ఆడవాళ్ళపై ఎటువంటి కేసులు పెట్టొచ్చో అది చెప్పండి ఎస్సై మేడం” అన్నది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగిన చందాన తాను చెప్పినదంతా విని మళ్ళీ మొదటికి వచ్చిన వనజను చూసి నిట్టూర్చిన శ్రావణ కుమారి ఈ సారి తన కథకి ”చిత్తు కాగితం” అని పేరు పెట్టి ఇంకేదయినా పత్రికకు పంపుదామా అని ఆలోచించడం మొదలు పెట్టింది.

కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు. రాజకీయ విశ్లేషకులు. పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె. నెల్లూరులో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం. ఏ (తెలుగు సాహిత్యం) చదివారు. అక్కడే 'అంటరాని వసంతం - విమర్శనాత్మక పరిశీలన' (ఎం.ఫిల్.); 'తెలుగు ముస్లిం రచయితలు - సమాజం - సంస్కృతి'పై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందారు. రచనలు : కొత్తగూడెం పోరగాడికో ప్రేమలేఖ (కథలు), టీ తోటల ఆదివాసీలు చెప్పిన కథలు, సరళ సుందర సునిశిత మమత ( మమతా బెనర్జీ కవిత్వం అనువాదం); సంపాదకత్వం : ప్రాతినిధ్య, వార్షిక (ఉత్తమ తెలుగు కథలు); సాక్షి దినపత్రికలో 'ఆలోచనం' రాజకీయ కాలమ్ రాశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కాలేజీలో పదేళ్లపాటు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం కలకత్తాలో ఉంటున్నారు.

Leave a Reply