గాయాల పుటపై రాయబడ్డ కవనం మొఘల్ ఏ ఆజం

ఇది యుధ్ధ క్షేత్రమే కావొచ్చు
ఇది ఖడ్గమే కావొచ్చు

కార్చిచ్చును కూడా చల్లబరిచే ప్రేమని
గుండెల్లో మోసేవాడు

సైనికుడైతే!?

యుధ్ధరంగం ఓ పూలతోట
ఖడ్గం కవనం రాసే కలం…!

దేహం పై పండే
ప్రతి గాయం ఓ పద పూల గుఛ్ఛం…

ఏ కానుకను ఇస్తావు నువ్వు సైనికుడా
తిరిగి వెళ్ళినప్పుడు నీ ప్రియురాలికి!?

నెత్తుటిలో ముంచి తీసిన కలం తో
రాసిన కొన్ని కవితలు
రణక్ష్రేత్రపు రణగొణధ్వనుల
మధ్య నువ్వు చూసిన
కొన్ని నిశ్శబ్ద ప్రత్యూషాలు
కొన్ని జ్ఞాపకాల గోధూళి అంటుకున్న సంజెవేళలు
యుధ్ధరంగం లో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని
మరణాన్ని
చూస్తూ విచ్చుకున్న
ఓ సమాధి చూపు
తన ప్రేమ లేపనం పూస్తే గాని
మానని కొన్ని గాయాలు

తరతరాల ప్రేమికులు
పాడుకునేలా నువ్వు రాసిన
ఓ అజరామర ప్రేమగీతం

యుధ్ధాన్ని వొదిలి నీ మనసు పాత్రలో మధుర ప్రేమతో నిలబడే నీ కంటే గొప్ప కానుక
ఆమెకు ఏముంటుందో చెప్పు
గుండెలయను ప్రియురాలి ఊపిరి మీద పైరులా పరిచే చిలిపి భ్రమరుడా!

(“యే ఖాతిల్ హీ నహీ దిల్దార్ భి హై
షాక్ ఏ గుల్ భి హై ఏ తల్వార్ భి హై” అని యుధ్ధరంగంలో సలీం పలికే ఈ ఒక్క వాక్యం ఈ కవిత రాయడానికి ఉసిగొల్పిందంటే ఇది ఎంత గొప్ప వాక్యమో కదా!?)

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply