గాయపడిన పాట

జీవనదిలా నిత్యం తరంగించే
పాటను నిర్బంధించారెవరో
ప్రవాహాన్ని అడ్డుకుంటూ
సృష్టి నియామాన్ని తప్పారెవరో…

భాషంటూ పుట్టకముందే
పాట పుట్టింది కదా
మాటతో మమేకమవుతూ
గీతమై గీ పెట్టింది కదా..

పాట పనితో జతకడ్తూ
ఉత్పత్తికి జీవం పోసింది.
కొంగు నడుముకు చుట్టిన స్త్రీ
వంగి కలుపులు తీసే శ్రామికమయ్యింది…

లాలి లాలిగా లాలలు పోస్తూ
తూగుటుయ్యాల్లో ఉంగా ఉంగా అంటూ
రాగయుక్తమై అలరిస్తూ పాట
రా రమ్మని పిలుస్తుంది పాట…

జానపదుల పల్లె పాటయ్యింది.
రంగస్థలంపై రంజిల్లే పద్యమయ్యింది
వేదికలపై ధూంధాములు చేస్తూ
ఉరేగింపుల్లో నిరసన నినాదమయ్యింది..

పాట! రాత్రి కనుపాపల్లో నెలవంక
అమాస చీకటిలో నక్షత్రాల నడక
ఉభయ సంధ్యలు కలిసిన చిత్రం
భూమ్యాకాశాలను కలిపిన దృశ్యం…

నిలబెడుతూ పడగొడుతూ.
మునుముందుకు నడిపిస్తుంది.
సమూహాలను సమాయత్తం చేస్తుంది.
ఉద్యమాల నిప్పు రాజేస్తుంది…

జనం ఆశలకు ఊపిరిలూదుతూ
జగమంతా క్రాంతులు చిమ్ముతూ
యుగాదులకు నాయకత్వం వహిస్తుంది.
కాల చరిత్ర రచన చేస్తుంది…

పాటను రక్తసిక్తం చేసారెవరో
బంధించి బాధించే కుట్ర చేస్తున్నారెవరో
పాటంటే నిరంతర భావ విస్పోటనం
అంతరించని ఆశయ జ్వలనం!

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

3 thoughts on “గాయపడిన పాట

  1. అందంగా మొదలైన పాట చివరకు వచ్చేసరికి చురకత్తిలా మారింది. బాగుంది కవిత.

  2. కవిత బాగుంది. అభినందనలు

Leave a Reply